
బరంపురం: సొంత బావనే బావమరుదులు మారణాయుధాలతో పొడిచి చంపిన ఘటన ఆంధ్రా–ఒడిశా బోర్డరులోని గిరిసిలా చెక్‌పోస్ట్ సమీపంలో గురువారం కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. గోళాంతరా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గిరిసిలా గ్రామానికి చెందిన డి.ధర్మా, అతడి అన్న డి.జేజారావులపై ధర్మా బావమరుదులైన జి. తిరుపతి, జి.నాగేశ్వరరావులు ఏదో విషయమై రాత్రి గొడవపడ్డారు. దీంతో ఒకానొక దశలో కోపోద్రేకులైన ఇరువర్గాలు ఒకరిపై మరొకరు భౌతికదాడికి పాల్పడ్డారు.
ఈ క్రమంలో బావమరుదులు తమ బావని కత్తులతో పొడిచి చంపగా, ధర్మా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇదే ఘటనలో జేజారావుకి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న గోళాంతరా పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం వైద్యసేవల నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఎంకేసీజీ మెడికల్ ఆస్పత్రికి క్షతగాత్రుడిని తరలించారు. అయితే ఈ హత్యకి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని ఏఎస్‌పీ బబులి నాయక్ తెలిపారు.