మావోయిస్టుల టార్గెట్లో బాలరాజు, మరో 18 మంది
నిన్న కాక మొన్న ఛత్తీస్గఢ్లో ఏకంగా 16 మంది భద్రతాదళాలను హతమార్చిన మావోయిస్టులు.. ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో కూడా రెచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఏవోబీ ప్రాంతంలో ఎప్పటినుంచో బలంగా ఉన్న మావోయిస్టులు.. ఈసారి ఏకంగా తొమ్మిది యాక్షన్ టీమ్స్ ఏర్పాటుచేసుకున్నాయి. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ముందుగానే గుర్తించారు. మావోయస్టుల టార్గెట్లో మాజీ మంత్రి బాలరాజు కుటుంబ సభ్యులు సహా మొత్తం 18 మంది ఉన్నారని విశాఖ ఏఎస్పీ ఫకీరప్ప తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందువల్ల విశాఖ ఏజెన్సీ మొత్తాన్ని తాము అప్రమత్తం చేశామని ఆయన చెప్పారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో మావోయిస్టులు ఈ ప్రాంతంలో కొంతవరకు అలజడి సృష్టించినందున.. ఈసారి పోలీసులు ముందునుంచే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.