తుపాకుల నీడలో ఏవోబీ ఎన్నికలు
ఎక్కడ కాలేస్తే ఏ మందుపాతర పేలుతుందో తెలీదు. ఎటు వెళ్తుంటే ఏ తుపాకి గుండు పేలుతుందో తెలీదు. ఎప్పుడొచ్చి ఎవరు కిడ్నాప్ చేసి తీసుకెళ్తారో చెప్పలేరు. అయినా.. తప్పనిసరిగా పోటీ చేయాలి, ఎన్నికల్లో నిలబడాలి. ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ)లో రాజకీయ నాయకుల పరిస్థితి ఇది. మన రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిషాలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఈసారి మన రాష్ట్రంతో పాటు ఒడిషాలో కూడా అసెంబ్లీ, లోక్సభ రెండింటికీ ఎన్నికలు జరుగుతున్నాయి.
మావోయిస్టుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండటంతో ఈ ప్రాంతంలో ఎన్నికలు కత్తిమీద సాములాగే ఉంటాయి. ఎప్పుడు ఎన్నికలు జరుగుతున్నా, వాటిని బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునివ్వడం, అయినా కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వడం కోసం నాయకులు ఎలాగోలా నానా కష్టాలు పడి నామినేషన్లు దాఖలు చేయడం ఇక్కడ మామూలే. గ్రామపంచాయతీ సర్పంచి దగ్గర్నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరికీ ఇక్కడ మావోయిస్టుల నుంచి ముప్పు ఉండటం సర్వసాధారణం. గతంలో మంత్రి బాలరాజును ఒకసారి మావోయిస్టులు కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది.
అభ్యర్థులు ప్రచారానికి వెళ్తారనుకునే దారుల్లో ముందుగానే మందుపాతరలు అమర్చడం, ఎన్నికల ఏర్పాట్లు చూసేందుకు వచ్చే పోలీసులను హతమార్చేందుకు మందుపాతరలు పేల్చి, కాల్పులు జరపడం లాంటి చర్యలకు మావోయిస్టులు పాల్పడటం ఇటీవలి కాలంలో కూడా చూశాం. ఛత్తీస్గఢ్లో ఇంతకుముందు ఎన్నికలు జరిగినప్పుడు ప్రచారం కోసం వచ్చిన పలువురు కాంగ్రెస్ నాయకులు మావోయిస్టుల ఘాతుకానికి బలైపోయిన విషయం తెలిసిందే. ఇటీవల కూడా అక్కడ ఎన్నికల ఏర్పాట్లు చూసేందుకు వెళ్తున్న పోలీసులపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లోనూ ఈసారి నాయకులు, పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారు. మావోయిస్టు అగ్రనాయకత్వం కూడా ఎక్కువగా ఏవోబీ మీదే దృష్టి సారించిందని, అందువల్ల అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని, ఎప్పుడు ఎక్కడికి ప్రచారానికి వెళ్లేదీ ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలని నాయకులకు పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.