- ఖమ్మం జిల్లా చర్ల సమీపంలో భారీ ఎన్‌కౌంటర్
- చంద్రన్న వర్గం దళ సభ్యుల సంచారం!
- అడవిని జల్లెడ పడుతున్న పోలీసులు
- ప్రాధాన్యత సంతరించుకున్న ఓఎస్‌డీ పర్యటన
- పోలీసుల అదుపులో చంద్రన్న వర్గం దళ సభ్యులు
జంగారెడ్డిగూడెం :రాష్ట్ర సరిహద్దులోని ఖమ్మం జిల్లా చర్ల మండలంలో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరగటం, జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) చంద్రన్న వర్గం దళాలు సంచరిస్తున్నాయన్న సమాచారంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఏజెన్సీ మండలాల్లోని పోలీస్ స్టేషన్‌లను అప్రమత్తం చేశారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా చర్ల సమీపంలో చత్తీస్‌గఢ్ సరిహద్దు భాగంలో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతిచెందగా, వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.
మృతుల్లో మావోయిస్ట్ ఖమ్మం జిల్లా కార్యదర్శి, దళ కమాండర్ లచ్చన్న , తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి హరిభూషణ్ భార్య సమ్మక్క అలియాస్ సోనీ ఉన్నారు. ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న మిగిలిన మావోయిస్టు దళ సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలోకి ప్రవేశించి తలదాచుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ ఏజెన్సీని మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పోలవరం ఏజెన్సీ మండలాల పోలీసులు ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు.
గతంలో పశ్చిమ ఏజెన్సీలో.. ప్రధానంగా పోలవరం , బుట్టాయగూడెం మండలాల్లో పలు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. జనశక్తి క్రాంతి వర్గం, దళిత బహుజన శ్రామిక విముక్తి దళాలు ఎన్‌కౌంటర్లలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రస్తుతానికి పశ్చిమ ఏజెన్సీలో న్యూడెమోక్రసీ ఆత్మరక్షణ దళాలు సంచరిస్తున్నాయి. గతంలో న్యూడెమోక్రసీ దళ కమాండర్ ధర్మన్న కూడా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. తాజాగా న్యూడెమోక్రసీలో చీలిక రావడంతో చంద్రన్న వర్గం ఏర్పడింది. చంద్రన్న వర్గం కూడా దళాలను ఏర్పాటు చేసుకుని ఏజెన్సీలో సంచరిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల అచ్చెన్నపాలెంలో గ్రామస్తులతో చంద్రన్నవర్గ దళ సభ్యులు సమావేశం నిర్వహించినట్టు తెలిసింది.
ఇదిలావుంటే మావోయిస్టులు జిల్లాలోని అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లోకి వస్తున్నప్పటికీ.. కేవలం షెల్టర జోన్‌గా మాత్రమే వాడుకుంటున్నారే తప్ప ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడలేదు. తాజాగా చర్ల సమీపంలో ఎన్‌కౌంటర్ నేపథ్యంలో, చంద్రన్న దళాల సంచారంతో పశ్చిమ ఏజెన్సీలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం అర్ధరాత్రి బుట్టాయగూడెం మండలం ఉప్పరిల్ల గ్రామానికి పెద్దఎత్తున వెళ్లిన పోలీసులు గ్రామాన్ని తనిఖీ చేసినట్టు సమాచారం.
ఓఎస్‌డీ పర్యటన
ఒక పక్క ఎన్‌కౌంటర్, మరో పక్క చంద్రన్న దళాల సంచారం నేపథ్యంలో ఏజెన్సీ మండలాలకు ప్రత్యేక అధికారిగా నియమితులైన ఓఎస్‌డీ పకీరప్ప పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పకీరప్ప మంగళవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం వచ్చారు. సమాచారం చెప్పేందుకు ఆయన అంగీకరించలేదు. ఏజెన్సీ పోలీస్‌స్టేషన్లను కూడా ఆయన పరిశీలించినట్లు తెలిసింది.
పోలీసుల అదుపులో చంద్రన్న వర్గం దళ సభ్యులు
సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) చంద్రన్న వర్గం దళ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. దళ కమాండర్ ధర్మన్న అనారోగ్యం పాలవడంతో గతనెల 26న జంగారెడ్డిగూడెం వచ్చి వైద్యం చేయించుకున్నట్టు సమాచారం. ఆయన వెంట చంద్రన్న వర్గం లీగల్ ఆర్గనైజేషన్ అయిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకుడు రామన్న, ఆ వర్గం పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సోమరాజు సహాయంగా వచ్చినట్టు తెలిసింది. ధర్మన్నకు వైద్యం చేయించి తిరిగి వెళుతుండగా ఆ ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఏలూరు తరలించి విచారిస్తున్నట్టు భోగట్టా.
వెంటనే కోర్టులో హాజరుపర్చాలి
పోలీసులు అదుపులోకి తీసుకున్న సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ చంద్రన్నవర్గం ప్రతినిధులను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని ఆ వర్గం రాష్ట్ర కమిటీ నాయకుడు ఎస్.రాజారావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ వైద్యంచేయించుకుని వెళుతున్న దళ కమాండర్ ధర్మన్నను, అరుణోదయ నాయకుడు రామన్నను, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సోమరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అప్పటినుంచి వారి జాడ తెలియలేదని, పోలీసులు వెంటనే వారిని కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. ఆ ముగ్గురినీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసే అవకాశం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అందువల్ల తక్షణం కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు.
అడవిలో అన్వేషణ
Published Wed, Mar 2 2016 12:42 AM | Last Updated on Sat, Jul 28 2018 5:45 PM
Advertisement
Advertisement