ఐదుగురు మావోయిస్టులు మృతి
ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ – నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో శనివారం మధ్యాహ్నం జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. కాంకేర్ – నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లోని నార్త్ అబూజ్‌మడ్‌లో గల పేకమెటాకపూర్ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో రెండు జిల్లాలకు చెందిన డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ విభాగాల పోలీసులు శుక్రవారం ఉదయం నుంచే కూంబింగ్ చేపట్టారు.
ఈ క్రమంలో శనివారం బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరుపుతూ పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు సైతం ఎదురుకాల్పులు జరపగా ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మరి కొందరు తప్పించుకున్నారు. కాగా, ఈ ఘటనలో చిర్మాన్ యాదవ్, కైలేశ్వర్ గావ్డే అనే జవాన్లు తీవ్రంగా గాయపడడంతో నారాయణపూర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా ప్రాంతంలో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యం, నిత్యావసర వస్తువులు, మందులను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment