భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ | Huge encounter in Bhadradri district | Sakshi
Sakshi News home page

భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌

Published Fri, Sep 6 2024 4:32 AM | Last Updated on Fri, Sep 6 2024 4:32 AM

Huge encounter in Bhadradri district

ఆరుగురు మావోయిస్టులు హతం

కరకగూడెం అడవుల్లో ఎదురు కాల్పులు 

మృతుల్లో డివిజినల్‌ కమిటీ సభ్యుడు లచ్చన్న

గాయపడిన ఇద్దరు గ్రేహౌండ్స్‌ కానిస్టేబుళ్లు

సాక్షిప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం, ములుగు జిల్లా తాడ్వాయిల సరిహద్దు అడవుల్లో మావో యిస్టులు సంచరిస్తున్నట్టు గ్రేహౌండ్స్‌ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో వారు బుధవారం సాయంత్రం నుంచి ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. 

ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మావోయిస్టులు ఉన్న కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలో ని నీలాద్రిగుట్టను గుర్తించారు. వెంటనే అదనపు బలగాలను అడవుల్లోకి రప్పించారు. మొత్తంగా 150 మంది వర కు పోలీసులు బృందాలుగా ఏర్పడి ఏరియా డామినేషన్‌ మొదలెట్టారు. 

ఈ క్రమంలో ఉదయం 6:45 గంటలకు ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. అడవుల్లోంచి వస్తున్న భారీ శబ్దాలు, కాల్పుల మోతలు విని సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. 

మృతులంతా బీకే–ఏఎస్‌ఆర్‌కే డివిజన్‌ వారే 
ఈ కాల్పుల్లో భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామ రాజు (బీకే–ఏఎస్‌ఆర్‌) డివిజన్‌ కమిటీకి చెందిన ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్‌ వెల్లడించారు. మృతుల్లో నలుగురు పురుషు లు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలం నుంచి రెండు ఏకే 47, ఒక్కో ఎస్‌ఎల్‌ఆర్, 303 రైఫిల్, పిస్టల్‌తోపా టు తూటాలు, కిట్‌బ్యాగులు లభించినట్టు ఎస్పీ తెలిపా రు. ఈ కాల్పుల నుంచి మావోయిస్టు మాసయ్య తప్పించుకున్నట్టు తమకు సమాచారముందని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
 
ఎల్‌జీఎస్‌గా పనిచేస్తూ.. 
కరకగూడెం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఆరుగురు మావోయిస్టులు మణుగూరు–పాల్వంచ ఏరియాలో లోకల్‌ గెరిల్లా స్క్వాడ్‌గా (ఎల్‌జీఎస్‌) పనిచేస్తున్నారు. వీరిలో బీకే–ఏఎస్‌ఆర్‌ డివిజన్‌ కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్న లచ్చన్న అలియాస్‌ కుంజా వీరన్న (42) స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గొల్లపల్లి మండలం రాయిగూడెం గ్రామం. 2000 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరిన లచ్చన్న అంచెలంచెలుగా ఎదిగాడు. 

ఈ కాల్పుల్లో చనిపోయిన పూనెం లక్కే (29) అలియాస్‌ తులసి (సీజీ, బీజాపూర్‌ జిల్లా, గంగ్లూర్‌ గ్రామం‡) లచ్చన్న భార్యగా ప్రచారం జరుగుతోంది. ఈమె 2005లో మావోయిస్టు పార్టీలో చేరింది. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఇద్దరు ఉన్నారు. వీరిలో అల్లూరి సీతారామరాజు జిల్లా యటపాక మండలం సంగంపాడుకు చెందిన కొవ్వాసి రాము(25) 2015లో పార్టీలో చేరాడు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామానికి చెందిన పొడియం కోసయ్య (21) అలియాస్‌ శుక్రు 2019లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. మిగిలిన ఇద్దరు కోసి, దుర్గేశ్‌ ఇటీవలే మావోయిస్టు పార్టీ సభ్యులుగా చేరారు. 

వారిద్దరూ సేఫ్‌ 
కరకగూడెం ఎన్‌కౌంటర్‌లో కానిస్టేబుళ్లు వంశీ, సందీప్‌లలో ఒకరికి పొట్టలో తూటా దూసుకుపోగా, మరొకరి కాలుకు గాయాలయ్యాయి. దీంతో వీరిద్దరిని భద్రాచలం ఆస్ప త్రికి తరలించారు. ఆపై ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అవసరమైన శస్త్ర చికిత్సలు చేశారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. 

సాయంత్రానికి బయటకొచ్చిన మృతదేహాలు 
ఉదయం 6:45 గంటలకు ఎన్‌కౌంటర్‌ జరగ్గా, ఎనిమిది గంటలకు బయటి ప్రపంచానికి తెలిసింది. 10:30 గంటలకు మృతుల ఫొటోలు, పేర్లు వెలుగులోకి వచ్చాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తహసీల్దార్, ఎస్పీ రోహిత్‌రాజ్‌ ఘటనాస్థలికి వెళ్లారు. అయితే సాయంత్రం 6 గంటలకు మృతదేహాలను అడవి నుంచి బయటకు తీసుకొచ్చారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు వచ్చే వరకు మృతదేహాలను మణుగూరు/భద్రాచలం ఆస్పత్రులకు తరలించనున్నారు. 

ఇది విప్లవద్రోహుల పనే: ఆజాద్‌ 
విప్లవ ద్రోహుల కారణంగానే ఎన్‌కౌంటర్‌ జరిగిందని మా వోయిస్టు పార్టీ బీకే –ఏఎస్‌ఆర్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్య త వహించాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌కు నిరసన గా ఈనెల 9న జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే నెత్తుటి బాకీ తీర్చుకుంటామని ప్రకటించారు.

జనజీవన స్రవంతిలో కలవండి: డీజీపీ జితేందర్‌
సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ జితేందర్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో డీజీపీ జితేందర్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమాలకు తావులేదని డీజీపీ స్పష్టం చేశారు. అనాలోచిత హింసను మావోయిస్టులు కొనసాగించడంలో అర్థం లేదని పేర్కొన్నారు. జనజీవన స్రవంతిలోకి వస్తే మావోయిస్టులకు ప్రభుత్వపరంగా పునరావాసం కలి్పస్తామని, ఇందుకు తక్షణ, దీర్ఘకాలిక సహాయక చర్యలు పొందవచ్చని డీజీపీ హామీ ఇచ్చారు 

మావోలపై ‘టోర్నడో’ ఎఫెక్ట్‌
» రెండునెలల క్రితమే భద్రాద్రి జిల్లాలోకి లచ్చన్న దళం 
» తాడ్వాయిలో సుడిగాలులకు కూలిన చెట్లు 
»  ఆశ్రయం కోసం కరకగూడెం వనాల్లోకి వచ్చిన మావోయిస్టులు 
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కరకగూడెం ఎన్‌కౌంటర్‌ వెనుక తాడ్వాయి టోర్నడో (సుడిగాలులు) కీలకంగా మారాయి. తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టులు ములుగు–భద్రాద్రి జిల్లాల సరిహద్దులోని దట్టమైన అడవులను కేంద్రంగా చేసుకొని రెండు నెలలుగా తిరుగుతున్నారు. అయితే భారీ సుడిగాలుల ధాటికి తాడ్వాయి మండలంలో ఒకేచోట రెండు వందల హెక్టార్లలో వేలాదిగా చెట్లు నేలకూలాయి. దీంతో మావోయిస్టుల కదలికలకు బ్రేక్‌ పడింది. అనివార్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవులకే దళాలు పరిమితం కావాల్సి వచ్చి0ది. చివరకు మావోల ఉనికి పోలీసులకు తెలియడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.  

తెలంగాణలో పార్టీ విస్తరణకు వచ్చి... 
తెలంగాణలో మళ్లీ పార్టీని విస్తరించాలనే లక్ష్యంతో జూన్‌లో చిన్నచిన్న జట్లుగా మావోయిస్టులు గోదావరి దాటినట్టు సమాచారం. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామెరతోగు అడవుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన భద్రు, లచ్చన్నతో పాటు దాదాపు పదిహేను మంది సభ్యులు సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గత జూలై 25న ములుగు –భద్రాద్రి జిల్లా సరిహద్దులో పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు. 

ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన అశోక్‌ (34) అలియాస్‌ విజేందర్‌ చనిపోయాడు. మిగిలిన దళ సభ్యులు తప్పించుకుని పారిపోయినట్టు పోలీసులు ప్రకటించారు.  

పెరిగిన నిర్బంధం.. 
దామెరతోగు ఎన్‌కౌంటర్‌ తర్వాత తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో నిఘా విస్తృతం చేశారు. లచ్చన్న దళానికి చెందిన సభ్యుల వివరాలు, ఫొటోలతో పాటు వారి తలలపై ఉన్న రివార్డులను సైతం వివరిస్తూ పోలీసులు వాల్‌పోస్టర్లు అంటించి నిర్బంధాన్ని తీవ్రం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయుధాలతో గోదావరి నది దాటడం మావోయిస్టులకు కష్టంగా మారినట్టు తెలుస్తోంది. 

నలభై రోజులుగా.. 
ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా..అడవులు, కొండల్లో రోజుకో చోటుకు మకాం మారుస్తూ పోలీసులకు చిక్కకుండా మావోయిస్టులు సంచారం సాగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు, అతి భారీ సుడిగాలులు సృష్టించిన బీభత్సంతో తాడ్వాయి మండలాన్ని వదిలేసి పూర్తిగా భద్రాద్రి జిల్లాకే పరిమితం కావాల్సి వచ్చి0ది. దీంతో కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్‌ చేస్తూ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురిని మట్టుబెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement