Greyhounds
-
భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్
సాక్షిప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం, ములుగు జిల్లా తాడ్వాయిల సరిహద్దు అడవుల్లో మావో యిస్టులు సంచరిస్తున్నట్టు గ్రేహౌండ్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో వారు బుధవారం సాయంత్రం నుంచి ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మావోయిస్టులు ఉన్న కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలో ని నీలాద్రిగుట్టను గుర్తించారు. వెంటనే అదనపు బలగాలను అడవుల్లోకి రప్పించారు. మొత్తంగా 150 మంది వర కు పోలీసులు బృందాలుగా ఏర్పడి ఏరియా డామినేషన్ మొదలెట్టారు. ఈ క్రమంలో ఉదయం 6:45 గంటలకు ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. అడవుల్లోంచి వస్తున్న భారీ శబ్దాలు, కాల్పుల మోతలు విని సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. మృతులంతా బీకే–ఏఎస్ఆర్కే డివిజన్ వారే ఈ కాల్పుల్లో భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామ రాజు (బీకే–ఏఎస్ఆర్) డివిజన్ కమిటీకి చెందిన ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ వెల్లడించారు. మృతుల్లో నలుగురు పురుషు లు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలం నుంచి రెండు ఏకే 47, ఒక్కో ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, పిస్టల్తోపా టు తూటాలు, కిట్‌బ్యాగులు లభించినట్టు ఎస్పీ తెలిపా రు. ఈ కాల్పుల నుంచి మావోయిస్టు మాసయ్య తప్పించుకున్నట్టు తమకు సమాచారముందని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఎల్జీఎస్గా పనిచేస్తూ.. కరకగూడెం ఎన్కౌంటర్లో చనిపోయిన ఆరుగురు మావోయిస్టులు మణుగూరు–పాల్వంచ ఏరియాలో లోకల్ గెరిల్లా స్క్వాడ్‌గా (ఎల్జీఎస్) పనిచేస్తున్నారు. వీరిలో బీకే–ఏఎస్ఆర్ డివిజన్ కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్న లచ్చన్న అలియాస్ కుంజా వీరన్న (42) స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గొల్లపల్లి మండలం రాయిగూడెం గ్రామం. 2000 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరిన లచ్చన్న అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ కాల్పుల్లో చనిపోయిన పూనెం లక్కే (29) అలియాస్ తులసి (సీజీ, బీజాపూర్ జిల్లా, గంగ్లూర్ గ్రామం‡) లచ్చన్న భార్యగా ప్రచారం జరుగుతోంది. ఈమె 2005లో మావోయిస్టు పార్టీలో చేరింది. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఇద్దరు ఉన్నారు. వీరిలో అల్లూరి సీతారామరాజు జిల్లా యటపాక మండలం సంగంపాడుకు చెందిన కొవ్వాసి రాము(25) 2015లో పార్టీలో చేరాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామానికి చెందిన పొడియం కోసయ్య (21) అలియాస్ శుక్రు 2019లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. మిగిలిన ఇద్దరు కోసి, దుర్గేశ్ ఇటీవలే మావోయిస్టు పార్టీ సభ్యులుగా చేరారు. వారిద్దరూ సేఫ్ కరకగూడెం ఎన్కౌంటర్లో కానిస్టేబుళ్లు వంశీ, సందీప్‌లలో ఒకరికి పొట్టలో తూటా దూసుకుపోగా, మరొకరి కాలుకు గాయాలయ్యాయి. దీంతో వీరిద్దరిని భద్రాచలం ఆస్ప త్రికి తరలించారు. ఆపై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అవసరమైన శస్త్ర చికిత్సలు చేశారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. సాయంత్రానికి బయటకొచ్చిన మృతదేహాలు ఉదయం 6:45 గంటలకు ఎన్కౌంటర్ జరగ్గా, ఎనిమిది గంటలకు బయటి ప్రపంచానికి తెలిసింది. 10:30 గంటలకు మృతుల ఫొటోలు, పేర్లు వెలుగులోకి వచ్చాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తహసీల్దార్, ఎస్పీ రోహిత్‌రాజ్ ఘటనాస్థలికి వెళ్లారు. అయితే సాయంత్రం 6 గంటలకు మృతదేహాలను అడవి నుంచి బయటకు తీసుకొచ్చారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు వచ్చే వరకు మృతదేహాలను మణుగూరు/భద్రాచలం ఆస్పత్రులకు తరలించనున్నారు. ఇది విప్లవద్రోహుల పనే: ఆజాద్ విప్లవ ద్రోహుల కారణంగానే ఎన్కౌంటర్ జరిగిందని మా వోయిస్టు పార్టీ బీకే –ఏఎస్ఆర్ కమిటీ కార్యదర్శి ఆజాద్ ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్య త వహించాలని డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌కు నిరసన గా ఈనెల 9న జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే నెత్తుటి బాకీ తీర్చుకుంటామని ప్రకటించారు.జనజీవన స్రవంతిలో కలవండి: డీజీపీ జితేందర్సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ జితేందర్ విజ్ఞప్తి చేశారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో డీజీపీ జితేందర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమాలకు తావులేదని డీజీపీ స్పష్టం చేశారు. అనాలోచిత హింసను మావోయిస్టులు కొనసాగించడంలో అర్థం లేదని పేర్కొన్నారు. జనజీవన స్రవంతిలోకి వస్తే మావోయిస్టులకు ప్రభుత్వపరంగా పునరావాసం కలి్పస్తామని, ఇందుకు తక్షణ, దీర్ఘకాలిక సహాయక చర్యలు పొందవచ్చని డీజీపీ హామీ ఇచ్చారు మావోలపై ‘టోర్నడో’ ఎఫెక్ట్» రెండునెలల క్రితమే భద్రాద్రి జిల్లాలోకి లచ్చన్న దళం » తాడ్వాయిలో సుడిగాలులకు కూలిన చెట్లు » ఆశ్రయం కోసం కరకగూడెం వనాల్లోకి వచ్చిన మావోయిస్టులు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కరకగూడెం ఎన్కౌంటర్ వెనుక తాడ్వాయి టోర్నడో (సుడిగాలులు) కీలకంగా మారాయి. తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టులు ములుగు–భద్రాద్రి జిల్లాల సరిహద్దులోని దట్టమైన అడవులను కేంద్రంగా చేసుకొని రెండు నెలలుగా తిరుగుతున్నారు. అయితే భారీ సుడిగాలుల ధాటికి తాడ్వాయి మండలంలో ఒకేచోట రెండు వందల హెక్టార్లలో వేలాదిగా చెట్లు నేలకూలాయి. దీంతో మావోయిస్టుల కదలికలకు బ్రేక్ పడింది. అనివార్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవులకే దళాలు పరిమితం కావాల్సి వచ్చి0ది. చివరకు మావోల ఉనికి పోలీసులకు తెలియడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో పార్టీ విస్తరణకు వచ్చి... తెలంగాణలో మళ్లీ పార్టీని విస్తరించాలనే లక్ష్యంతో జూన్‌లో చిన్నచిన్న జట్లుగా మావోయిస్టులు గోదావరి దాటినట్టు సమాచారం. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామెరతోగు అడవుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన భద్రు, లచ్చన్నతో పాటు దాదాపు పదిహేను మంది సభ్యులు సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గత జూలై 25న ములుగు –భద్రాద్రి జిల్లా సరిహద్దులో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన అశోక్ (34) అలియాస్ విజేందర్ చనిపోయాడు. మిగిలిన దళ సభ్యులు తప్పించుకుని పారిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. పెరిగిన నిర్బంధం.. దామెరతోగు ఎన్కౌంటర్ తర్వాత తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో నిఘా విస్తృతం చేశారు. లచ్చన్న దళానికి చెందిన సభ్యుల వివరాలు, ఫొటోలతో పాటు వారి తలలపై ఉన్న రివార్డులను సైతం వివరిస్తూ పోలీసులు వాల్‌పోస్టర్లు అంటించి నిర్బంధాన్ని తీవ్రం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయుధాలతో గోదావరి నది దాటడం మావోయిస్టులకు కష్టంగా మారినట్టు తెలుస్తోంది. నలభై రోజులుగా.. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా..అడవులు, కొండల్లో రోజుకో చోటుకు మకాం మారుస్తూ పోలీసులకు చిక్కకుండా మావోయిస్టులు సంచారం సాగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు, అతి భారీ సుడిగాలులు సృష్టించిన బీభత్సంతో తాడ్వాయి మండలాన్ని వదిలేసి పూర్తిగా భద్రాద్రి జిల్లాకే పరిమితం కావాల్సి వచ్చి0ది. దీంతో కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ చేస్తూ ఎన్కౌంటర్లో ఆరుగురిని మట్టుబెట్టారు. -
ప్రేయసితో పెళ్లికి భార్య అంగీకరించలేదని...
మధురవాడ (భీమిలి): పచ్చని సంసారంలో ప్రేమ చిచ్చు పెట్టింది. భార్య, కుమార్తె ఉన్నప్పటికీ మరో యువతితో ప్రేమలో పడడంతో పచ్చని సంసారం ముక్కలైపోయింది. ప్రేమించిన యువతితో రెండో పెళ్లికి భార్య అంగీకరించకపోవడంతో విశాఖ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మద్దింశెట్టి సురేష్(34) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంపచోడవరం ప్రాంతానికి చెందిన సురేష్ 2009లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం విశాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకి చెందిన సునీతతో 2016లో వివాహం జరిగింది. వీరికి 4 నెలల పాప ఉంది. మధురవాడ శివశక్తినగర్ రోడ్డులోని బ్లూ సిటీ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో రెండేళ్లుగా నివసిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట భార్య పుట్టింటికి వెళ్లింది. భార్యకు ఫొటో పంపించి... ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నెలలో ఓ యువతిని ప్రేమిస్తున్నట్టు భార్య సునీతకు సురేష్ చెప్పాడు. ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని ఆమె అంగీకారం కోరగా ఆమె నిరాకరించి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో సురేష్ ప్రేమిస్తున్న మహిళ సునీతకు బుధవారం ఫోన్ చేసి సురేష్‌ను తాను ప్రేమించడం లేదని చెప్పింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో భార్యకు సురేష్ ఫోన్ చేసి, తాను ప్రేమించిన మహిళ తనను తిరస్కరించిందని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫొటో పంపించాడు. ఆ తర్వాత ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అప్రమత్తమైన సునీత ఎదుటి ప్లాట్‌లో నివసిస్తున్న వారికి విషయం చెప్పింది. వారు ఇంటిలోకి వెళ్లి చూడగా అప్పటికే ఉరేసుకున్న సురేష్‌ను కిందకు దించి స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే వారు చేర్చుకోకపోవడంతో అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించడంతో పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రాజోలు నుంచి తల్లిదండ్రులతో కలిసి గురువారం విశాఖ చేరుకున్న సునీత ఫిర్యాదు మేరకు పీఎం పాలెం క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన భర్త మృతిపై అనుమానాలు లేవని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. -
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ : కలకలం రేపుతున్న ‘జంగ్ బుక్’
సాక్షి, హైదరాబాద్: గ్రేహౌండ్స్‌పై దాడికి హిడ్మా ప్రణాళికలు రచించాడా? మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు తెలంగాణలో దాడులకు ఆదేశాలిచ్చారా? ఇటీవల ఛత్తీస్‌గఢ్ పోలీసులకు దొరికిన ‘జంగ్ బుక్’లోని అంశాలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ జిల్లా బీజాపూర్‌లో ఈనెల 3వ తేదీన జరిగిన ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కమాండర్ హిడ్మా తన ఉనికిని ఉద్దేశపూర్వకంగా నిఘా వర్గాలకు అందజేసి, తమకు ప్రాబల్యం ఉన్న ప్రాంతంలోకి తెలివిగా రప్పించాక ఆకస్మికంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ కోబ్రా, ఎస్టీఎఫ్, స్థానిక పోలీసులు కలిసి 22 మంది మరణించారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు కూడా మరణించారు. ఈ సందర్భంగా మావోయిస్టుల నుంచి ఒక ‘జంగ్ బుక్’ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. సాధారణంగా మావోయిస్టులు తాము చేయబోయే, చేసిన దాడుల గురించి, జయాపజయాలను విశ్లేషిస్తూ ఎప్పటికప్పుడు రాసుకునే పుస్తకాన్నే ‘జంగ్ బుక్’గా వ్యవహరిస్తారు. ఈ పుస్తకంలోని పలు సంచలనాత్మక విషయాలను చదివిన అక్కడి పోలీసులు.. ఇప్పుడు ఆయా అంశాలపై ఆరా తీసే పనిలో పడ్డారు. మావోల ఏరివేతలో గ్రేహౌండ్స్ ఫస్ట్ 2010 నుంచి సీఆర్పీఎఫ్పై వరుసగా దాడులు చేస్తూ వస్తోన్న హిడ్మా గెరిల్లా ఆపరేషన్లలో ఆరితేరాడు. సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులపై పదుల సంఖ్యలో దాడులు చేసిన హిడ్మా జాబితాలో గ్రేహౌండ్స్‌పై దాడికి సంబంధించిన వ్యూహం కూడా ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. రాష్ట్రానికి చెందిన గ్రేహౌండ్స్ బలగాలు దేశంలోనే మావోల ఏరివేతలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇప్పటికీ పలు రాష్ట్రాల పోలీసులు మావోల ఏరివేతకు అనుసరించాల్సిన వ్యూహాలకు గ్రేహౌండ్స్ అధికారులను ఆశ్రయించడం, వారి వద్ద శిక్షణ పొందడం చేస్తుంటారు. వాస్తవానికి హిడ్మా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందాడు. కానీ ఇతని ఫొటోలు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఉండటం గమనార్హం. గ్రేహౌండ్స్‌కు సమాచారం గ్రేహౌండ్స్‌పై దాడి చేయాలన్న హిడ్మా ప్రణాళికలు చూసిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఈ విషయాన్ని వెంటనే గ్రేహౌండ్స్‌కు తెలియజేశారు. వాస్తవానికి గ్రేహౌండ్స్‌పై దాడి ప్రణాళికలు మావోయిస్టుల వద్ద ఉండటం కొత్తేమీ కాదు. కానీ ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు నేత అయిన హిడ్మా వద్ద ఈ ప్రణాళికలు ఉండటం అంటే.. తెలంగాణలోనూ దాడులకు అతనికి మావో అగ్రనేతలు ఆదేశాలిచ్చారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారని సమాచారం. చదవండి: 'ప్లీజ్ అంకుల్.. మా నాన్నను విడిచిపెట్టండి' -
గ్రేహౌండ్స్ స్థలం బదలాయింపుపై కౌంటర్ వేయండి
సాక్షి, అమరావతి: విశాఖపట్నం కాపులుప్పాడలో ప్రభుత్వం తలపెట్టిన అతిథి గృహం నిర్మాణం కోసం 30 ఎకరాల భూమిని బదలాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. భూమి బదలాయింపును సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన గద్దె తిరుపతిరావు గతేడాది పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని, ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు అనుమతించిందన్నారు. గ్రేహౌండ్స్ యూనిట్ ఏర్పాటునకు కేంద్రం ఎంత మేర నిధులు కేటాయించిందో తెలియచేస్తూ కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం నిరి్మస్తోందని, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. -
విశాఖలో గ్రే హౌండ్స్..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో శాంతి భద్రతలకు మరింత భరోసా కల్పించేలా... భద్రతను కట్టుదిట్టం చేసేలా... నిరంతరం ప్రణాళికలు, వ్యూహాలతో సంఘ విద్రోహ శక్తుల ఆటకట్టించేలా...మెరికల్లాంటి యువ కమాండోలకు శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక సంస్థకు విశాఖ వేదిక కాబోతున్నది. కార్యనిర్వాహక రాజధానిగా మారనున్న తరుణంలో విశాఖ గ్రేహౌండ్స్ శిక్షణ సంస్థకు కేంద్రం కానుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాద్ గండిపేటలో ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ శిక్షణ సంస్థ తరహాలో రాష్ట్రంలో విశాఖలో ఏర్పాటు కానుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ విశాఖకు వచ్చి ఈ సంస్థ కోసం జగన్నాథపురం గ్రామ సమీపంలో కేటాయించిన స్థలాన్ని సందర్శించారు. గ్రేహౌండ్స్ శిక్షణకు ఆ స్థలం అనుకూలంగా ఉందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించారు. ఇప్పటికే విశాఖలో ఆపరేషన్ బేస్డ్ గ్రేహౌండ్స్ కార్యాలయం ఉంది. పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ గ్రేహౌండ్స్‌కి ఈ స్థలం అన్ని విధాలా సరిపోతుందని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రెవెన్యూ కార్యదర్శి ఉషారాణి, కలెక్టర్ వినయ్‌చంద్‌లు కూడా ఈ స్థలం పరిశీలించారు. గ్రేహౌండ్స్ శిక్షణ సంస్థ ఏర్పాటుకు ఆనందపురం మండలంలో జగన్నా«థపురం గ్రామ పరిధిలో 385 ఎకరాలు కేటాయించారు. ఇందులో 265 ఎకరాల భూమి సాగు లేకుండా ఖాళీగా ఉంది. మిగతా 120 ఎకరాలు డి–పట్టా భూములున్నాయి. ఈ భూమిని సాగుచేసుకుంటూ జీవనం పొందుతున్న రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం పరిహారంగా ఇప్పటికే రూ.10.55 కోట్లను కేటాయించింది. గ్రేహౌండ్స్ శిక్షణ సంస్థ ఎందుకంటే...? దేశ అంతర్గత భద్రత, వ్యూహాత్మక ప్రణాళికలపై పట్టు సాధించడానికి శిక్షణ ఇచ్చే సంస్థే గ్రేహౌండ్స్ శిక్షణ సంస్థ. మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన పటిష్టమైన భద్రతా సంస్థల్లో ఇది ఒకటి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో నుంచి గ్రేహౌండ్స్ యువ పోలీసులకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. సుమారు 2500 నుంచి 3000 మంది ఏడాదికి ఇక్కడ శిక్షణ పొందుతారు. ఇందులో ఏడాదికి నాలుగు బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో బ్యాచ్‌కి 500 నుంచి 600 మందికి సిబ్బంది శిక్షణ ఇస్తారు. రూ.220 కోట్లు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని విభజించిన తర్వాత ..విభజన చట్టంలో పోలీసుశాఖకు పొందుపరిచిన అంశాల్లో భాగంగా గ్రేహౌండ్స్‌కి అప్పట్లో రూ.220 కోట్లు ఇస్తున్నట్టు జీవో కూడా విడుదల చేశారు. హైదరాబాద్‌లోనే రెండు రాష్ట్రాలకు సంబంధించి గ్రేహౌండ్స్ గండిపేట, షాద్‌నగర్‌లో ఉండేది. విభజనానంతరం 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం దీనికి స్థలం కేటాయించకపోవడంతో పెండింగ్‌లో ఉండిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే ఆనందపురంలో సర్వే నంబర్ 1/1లో భూమి కేటాయించింది. గ్రేహౌండ్స్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించి, మొదటి విడతగా రూ.220 కోట్లు విడుదల చేసింది. 70 శాతం కేంద్ర ప్రభుత్వం, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తారు. ఆపరేషన్ శిక్షణకు అనుకూలం ఇటీవల రెండు వారాల క్రితం డీజీపీ గౌతమ్ సవాంగ్ వచ్చి సంస్థకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. గ్రేహౌండ్స్ శిక్షణలో ప్రధానమైన ఆపరేషన్ తరహా శిక్షణకు అనుకూలమైన ప్రాంతం కూడా ఆ గ్రామ సమీపంలో ఉందని చెప్పారు. ఈ శిక్షణ సంస్థ రెండేళ్లలో ఏర్పాటు కానుందని మీడియాకు చెప్పారు. -
అప్పుడు గ్రేహౌండ్స్.. ఇప్పుడు మావోలు
► 2008లో లాంచీలో వెళ్తున్న గ్రేహౌండ్స్ సిబ్బందిపై మావోయిస్టుల దాడి ► ఆ దాడిలో 38 మంది మృతి.. నీటి కారణంగానే భారీ ప్రాణనష్టం సాక్షి, హైదరాబాద్: దాదాపు ఎనిమిదేళ్ల కిందట బలిమెల రిజర్వాయర్‌లో గ్రేహౌండ్స్ భారీగా నష్టపోవడానికి కారణమైన ‘నీరు’ ఇప్పుడు ఏఓబీలో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతీసింది. ఆ ప్రాంత భౌగోళికాంశాలపై పూర్తి పట్టున్న ఉదయ్, దయ లాంటి వాళ్లూ చనిపోవడానికి కారణమైంది. 2008 జూన్ 29న విశాఖపట్నం జిల్లా బలిమెల రిజర్వాయర్‌లో లాంచీలో వెళ్తున్న గ్రేహౌండ్స్ బలగాలపై కొండ పైనుంచి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఆ సమయంలో లాంచీలో ఉన్న 64 మంది గ్రేహౌండ్స్ సిబ్బందిలో లాంచీ డ్రైవర్‌తోసహా 38 మంది చనిపోయారు. దాడి జరిగిన సమయంలో లాంచీలో ఉన్న వారు బయటపడాలనే ఉద్దేశంతో నీళ్లలోకి దూకేశారు. దీంతో ఎదురుదాడికి వారికి ఆస్కారం లేకుండా పోయింది. మావోయిస్టులు రిజర్వాయర్ చుట్టూ ఉన్న ఎత్తై కొండలపై మాటు వేయడంతో దాడి చేయడం వారికి తేలికైంది. దీంతో గ్రేహౌండ్స్ చరిత్రలో మర్చిపోలేని, పోలీసులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అదే తరహాలోనే..: తాజా ఎన్కౌంటర్ సైతం దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే, బలిమెలకు సమీపంలోనే జరిగింది. క్యాడర్‌కు కమాండో శిక్షణ ఇస్తున్న మావోయిస్టులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఏఓబీ మావోయిస్టులకు కంచుకోట. చాలా కాలంగా పార్టీ అగ్రనేతలు అక్కడే సురక్షితంగా ఉంటున్నారు. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు ఎప్పుడు ప్లీనరీలు, ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించాలన్నా ఏఓబీనే ఎంచుకుంటారు. భద్రత కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేసుకుంటారు. మందుపాతరల ఏర్పాటు సహా మూడంచెల ఉంటుంది. ఈ శిక్షణ శిబిరంపై సమాచారం అందుకున్న గ్రేహౌండ్, ఎస్ఓటీ బలగా లు వారం రోజులుగా ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సోమవారం గుట్టల నుంచి కిందికి వెళ్తున్న సమయంలో మావోయిస్టులు కనిపించారు. బలగాల కదలికల్ని గుర్తించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. క్రమంలో సెంట్రీ విధు ల్లో ఉన్న మావోయిస్టులు పారిపోయేందుకు యత్నించారు. అయితే వీరున్న ప్రాంతానికి రెండు వైపులా వాగు ఉండటంతో హడావుడిలో అందులోకి దూకేశారు. దీంతో మావోయిస్టులు పూర్తిస్థాయిలో ఎదురుదాడి చేయలేకపోయారు. బలగాలు ఎత్తులో ఉండటంతో ఎన్కౌంటర్ తేలికైంది. దీంతో మావోయిస్టుల ఉద్యమ చరిత్రలోనే భారీగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ఇప్పటికి చాలాసార్లు పోలీసు దాడుల నుంచి తప్పించుకున్నారు. ఈ ఎన్కౌంటర్ నుంచి కూడా ఆయన సురక్షితంగా తప్పించుకున్నట్లు సమాచారం. -
కూంబింగ్ చేస్తుండగా తేనెటీగల దాడి
మున్సింగిముత్తు (విశాఖపట్నం) : కూంబింగ్‌కు వెళ్లిన సాయుధ బలగాలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా మున్సింగిముత్తు మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో 13 మంది జవానులు గాయపడ్డారు. వీరిని పాడేరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఏపీలో మెరైన్ పోలీసు అకాడమీ!
విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో మెరైన్ పోలీసు అకాడమీ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారం లభించిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు తెలిపారు. విశాఖలో గ్రేహౌండ్స్ కార్యాలయం ఏర్పాటుకు అన్ని అనుకూలతలు ఉన్నాయని, ఇందుకోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఆయన అన్నారు. విశాఖలో పర్యటిస్తున్న డీజీపీ మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. కోస్టల్ ఏరియాలో గుంటూరు, విశాఖ సహా తిరుపతిలోనూ అప్పా లాంటి అకాడమీ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశామని ఆయన వెల్లడించారు. ఆంధ్ర-ఒడిశా బోర్డర్లో మావోయిస్టులు జనజీవన స్రవంతికి దూరం అయ్యారని డీజీపీ అన్నారు. మావోయిస్టలుపై గిరిజనుల తిరుగుబాటే ఇందుకు నిదర్శనమన్నారు. 27 పోలీస్ స్టేషన్లకు 2వేలమంది కానిస్టేబుల్ నియామకాలకు ప్రతిపాదనలు పంపినట్లు డీజీపీ పేర్కొన్నారు. -
గ్రేహౌండ్స్ విభాగాలూ రెండు
విభజనకు కేంద్ర హోంశాఖ అధికారుల ఆమోదం హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో దేశంలోనే పేరెన్నికగన్న, ప్రతిష్టాత్మకమైన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషనల్ విభాగం గ్రేహౌండ్స్ ను సైతం రెండుగా విభజించాలని పోలీసు విభాగం నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) ప్రతినిధులతో శుక్రవారం సచివాల యంలోని రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి టీపీ దాస్ నేతృత్వంలో జరిగన సమావేశంలో ఉన్నతాధికారులు ఈ అంశాన్ని స్పష్టం చేశారు. మెజార్టీ అధికారులు చెప్పిన అంశాలతో ఏకీభవించిన కేంద్ర ప్రతినిధులు గ్రేహౌండ్స్ విభజనకు ఆమోదముద్ర వేస్తూ ఎంహెచ్ఏకు ఈ మేరకు నివేదిక ఇస్తామని రాష్ట్ర ఉన్నతాధికారులకు హామీ ఇచ్చారు. డీజీపీ బి.ప్రసాదరావుతో పాటు అనేక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలతో పాటు శిక్షణా సంస్థలనూ గరిష్టంగా మూడేళ్ల పాటు కేంద్ర ఆధీనంలో ఉమ్మడిగా ఉంచాలని తొలుత భావించారు. ఆ తర్వాత ఇవి తెలంగాణకే ఉండిపోగా.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ అంశాలన్నిటినీ కేంద్ర ప్రతినిధి అనిల్ గోస్వామి వద్ద రాష్ట్ర ఐపీఎస్ అధికారులు ముక్తకంఠంతో వ్యతిరేకించడంతో అవి రాష్ట్ర పరిధిలోకి వచ్చాయి. -
గ్రేహౌండ్స్‌నూ విడగొట్టాల్సిందే
ఉమ్మడిగా ఏడాది శిక్షణ .. సీమాంధ్ర సెంటర్ విశాఖలో ఏర్పాటు ? గవర్నర్ సలహాదారు రాయ్‌కు వివరించిన అధికారులు సిబ్బందిని 58.37 : 41.63 నిష్పత్తిలో విభజన హైదరాబాద్: మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో దేశంలో పేరెన్నికగన్న గ్రేహౌండ్స్ విభాగాన్ని ఆంధ్ర, తెలంగాణల కోసం రెండుగా విభజించాలని పోలీసుశాఖ నిర్ణయించింది. గవర్నర్ సలహాదారు ఏఎన్ రాయ్ శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. డీజీపీ ప్రసాదరావుతో పాటు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు అనురాగ్ శర్మ, సీవీ ఆనంద్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌తో పాటు శిక్షణా సంస్థలను మూడేళ్లు కేంద్రం అధీనంలో ఉంచాలని తొలుత భావించారు. ఆ తరువాత ఇవి తెలంగాణకే ఉండిపోగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రతినిధి అనిల్ గోస్వామిని కలసినపుడు ఈ ప్రతిపాదనను ఐపీఎస్ అధికారులు వ్యతిరేకించడంతో ఈ రెండు విభాగాలు రాష్ట్ర పరిధిలోకి వచ్చాయి. ఈ విభాగాలను ఉమ్మడిగా ఉంచితే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన అధికారులు ఇతర విభాగాల లాగే గ్రేహౌండ్స్‌ను విడగొట్టాల్సిందేనని రాయ్‌కు వివరించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పు గోదావరి, విశాఖపట్నం,శ్రీకాకుళంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉండడంతో తెలంగాణ గ్రేహౌండ్స్ కార్యాలయం హైదరాబాద్‌లో కొనసాగించినా... సీమాంధ్రకు విశాఖపట్నంలో సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మంగళవారం దీనిపై నిర్ణయం తీసుకుంటారు. 1.శిక్షణ సంస్థను ఏడాదిపాటు ఉమ్మడిగా కొనసాగించాలని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయాల ఆధారంగా కేటాయింపులు జరపాలని రాయ్‌ను కోరారు. 2.రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా గ్రేహౌండ్స్ విభాగం ఉంటేనే కేంద్రం నుంచి అదనపు నిధులు పొందడానికి వీలవుతుందని ఉన్నతాధికారుల వాదన. 3.ఈ విభాగంలో ఉన్న 2,600 మంది సిబ్బందిని 58.37 : 41.63 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంచాలని స్పష్టం చేశారు. 4.అవసరాన్ని బట్టి అనుభవజ్ఞులైన అధికారులను, సిబ్బందిని డెప్యుటేషన్‌పై మరో రాష్ట్రానికి తీసుకోవచ్చని సూచించారు. -
మావోల కదలికలపై గ్రేహౌండ్స్ డేగ కన్ను
ఎన్నికల వేళ ‘ప్రభావిత’ ప్రాంతాల్లో బలగాల మోహరింపు సాక్షి, హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలిదశ పోలింగ్ సందర్భంగా ఆదివారం విశాఖ, ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై గ్రేహౌండ్స్ దళాలు దృష్టి సారించాయి. ముఖ్యంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దులతోపాటు ఖమ్మం, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎత్తున మోహరించిన గ్రేహౌండ్స్ దళాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ఉధృతం చేశాయి. ఎన్నిల బహిష్కరణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తమ ఉనికిని చాటుకోవడానికి మావోలు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని గత రెండు రోజులుగా ఒడిశా, ఛత్తిస్‌గఢ్ సరిహద్దుల్లో గ్రేహౌండ్స్ బలగాలు నక్సల్స్ కోసం వేట కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు ఆంధ్రా,ఒడిశా స్పెషల్ జోన్‌కమిటీ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ మెరుపు దళాలు రాత్రి వేళ సైతం శక్తివంతమైన బైనాక్యూలర్స్‌తో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా నక్సల్స్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న కొందరిని విశాఖ ఏజెన్సీ, ఖమ్మం సరిహద్దుల్లో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో ఎన్నికలు ముగిసేంతవరకు సరిహద్దుల్లో గ్రేహౌండ్స్‌తో పాటు సీఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ కొనసాగుతుందని సీనియర్ ఐపిఎస్‌అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
చుట్టుముట్టిన బలగాలు
=సరిహద్దులో యుద్ధవాతావరణం =దారకొండలో ఎదురుకాల్పులంటూ వదంతులు =అప్రమత్తమైన పోలీసులు =గ్రేహౌండ్స్ కూంబింగ్ ముమ్మరం సీలేరు, న్యూస్‌లైన్ : ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మళ్లీ యుద్ధవాతావరణం నెలకొంది. మావోయిస్టుల పీఏజీఏ వారోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయనుకుంటున్న తరుణంలో బుధవారం అర్ధరాత్రి విశాఖ నుంచి ఒకేసారి ఐదు బస్సుల్లో వచ్చిన గ్రే హౌండ్స్ బలగాలు అడవుల్లోకి దూసుకెళ్లాయి. సీలేరు మీదుగా ఒడిశా, తూర్పుగోదావరి జిల్లా గుర్తేడు, ఖమ్మంజిల్లా సరిహద్దు ప్రాంతాలకు బలగాలు వెళ్లడంతో ఏదో జరుగుతోందంటూ ఇక్కడివారు చర్చించుకున్నారు. దారకొండ, గుమ్మిరేవులు, పాతకోట, గుర్తేడు ప్రాంతాల్లో నాలుగురోజులుగా మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అధికారుల వద్ద పక్కా సమాచారం ఉంది. దీనిలో భాగంగానే ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నారనే ప్రచారం సాగింది. ఇటీవల సప్పర్లకు చెందిన గెమ్మిలి చిన్నారావును హతమార్చిన యాక్షన్‌టీము సీలేరు సంతలో కొందరి వివరాలు సేకరించినట్టు తెలిసింది. ఇలా మావోయిస్టుల కదలికలు ఎక్కువ కావడం, కూంబింగ్‌కు వెళ్లిన కొద్దిగంటల్లోనే దారకొండ సమీపంలో ఎదురుకాల్పులు జరిగాయని వదంతులు వ్యాపించాయి. ఇదే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా,అలాంటిదేమీ లేదన్నారు. అయితే సరిహద్దులోని సీలేరు, చిత్రకొండ, డొంకరాయి, జి.కె.వీధి, ముంచంగిపుట్టు పోలీస్స్టేషన్లలోని వారిని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం గూడేల్లో పోలీసుల తనిఖీలు ముమ్మరమయ్యాయి.