
తెలంగాణ కమిటీలో ఛత్తీస్‌గఢ్ వారే ఎక్కువ..
100 మందిలో మనవారు 25 మందిలోపే...
తెలంగాణ కమిటీలో పూర్తిగా తగ్గిన రిక్రూట్‌మెంట్
అదును కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ పోలీసులు
భారీ మొత్తంలో దెబ్బతీసే వ్యూహాలతో ముందుకు..
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీని కూడా తుడిచిపెట్టేందుకు కేంద్ర సాయుధ బలగాలతోపాటు గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులు బహుముఖ వ్యూహాలతో ముందుకుసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీలో మావోయిస్టుల సంఖ్య ప్రస్తుతం 100 లోపే ఉంటుందని తెలిసింది. ఇందులోనూ ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన వారే ఎక్కువమంది ఉన్నారు. వీరంతా స్థానికులు కావడంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ సైతం ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి పరిమితమైంది.
దీంతో భద్రత బలగాలు వారి కోసం మాటువేసి ఉన్నాయి. తెలంగాణ సరిహద్దు వైపు ఏ చిన్న కదలిక ఉన్నా...భారీదెబ్బ తీసేందుకు సిద్ధమయ్యాయి. అయితే తెలంగాణకమిటీలో ఎక్కువమంది ఛత్తీస్‌గఢ్ స్థానికులు కావడంతో అక్కడి అటవీ ప్రాంతాలపై పూర్తి పట్టు ఉండడంతో చాలా సందర్భాల్లో తెలంగాణ కమిటీ చిక్కినట్టే చిక్కి మిస్సవుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
» తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని పూజారీ కాంకేర్ అడవుల్లో ఈ ఏడాది జనవరి 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందినట్టు తొలుత ప్రచారం జరిగింది. కానీ దామోదర్ సురక్షితంగా ఉన్నారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.
» ఈనెల 9న ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో భారీ ఎన్‌కౌంటర్ సైతం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ లక్ష్యంగానే జరిగినట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మృతి చెందగా ఇందులో తెలంగాణ కమిటీకి చెందినవారు ఉన్నట్టు ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు.
60 మందికిపైగా వారే...
మావోయిస్టు కీలక నేతల్లో తెలంగాణవారు ఉన్నా, రాష్ట్ర కమిటీలో మాత్రం ఛత్తీస్‌గఢ్ వారే అధికంగా ఉన్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర కమిటీలో మొత్తం 90 నుంచి 100 మంది ఉండగా..ఇందులో 60 మందికిపైగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారే అని తెలిసింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కేవలం 25 మంది లోపే ఉంటారని సమాచారం.
ఇందులోనూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినవారు అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, బస్తర్ ప్రాంతాల వారే ఎక్కువమంది పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీలోనూ భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు (బీకే–ఏఎస్‌ఆర్)డివిజన్ కమిటీ బలంగా ఉంది. రాష్ట్ర కమిటీలోని దాదాపు సగం మంది వరకు సభ్యులు ఇందులోనే ఉన్నట్టు తెలిసింది.
అయితే, గతానికి భిన్నంగా మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ బక్కచిక్కి పోవడానికి ప్రధాన కారణం..కొంతకాలంగా మావోయిస్టు రిక్రూట్‌మెంట్ దాదాపుగా లేకపోవడమే. తెలంగాణ నుంచి మావోయిస్టుల్లోకి చేరేందుకు యువత పెద్దగా ఆసక్తి చూపకపోవడమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
సరిహద్దుల్లో రెఢీ
మావోయిస్టుల ఏరివేతలో దేశంలో అత్యుత్తమ దళంగా పేరుపొందిన గ్రేహౌండ్స్ సిబ్బంది, తెలంగాణ పోలీస్ ప్రత్యేక బలగాల వేట మాత్రం కొనసాగుతూనే ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ మావోయిస్టుల ఏరివేతలో గ్రేహౌండ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతోపాటు తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టుల అంతానికి ప్రత్యేక ఆదేశాలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment