ఏటూరు నాగారం అడవుల నుంచి అబూజ్‌మడ్ వరకు...
దండకారణ్యంలో కీలకంగా తెలంగాణ మావోయిస్టులు
ఉమ్మడి వరంగల్ నుంచి 23 మంది.. దండకారణ్యంలోనే అత్యధికం..
వరుస ఎన్‌కౌంటర్లు.. పెరుగుతున్న మృతులు
ఆందోళనలో మావోయిస్టుల కుటుంబాలు...
ఛత్తీస్‌గఢ్ దక్షిణ బస్తర్ కాంకేర్, మారేడుబాక అడవుల్లో ఆరు రోజుల కిందట జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు ప్రకటించగా.. మృతుల్లో కీలక నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్టు సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గంగానది పేరిట వెలువడిన ప్రకటనతో గందరగోళం ఏర్పడింది. ఈ విషయమై దామోదర్ కుటుంబసభ్యులకు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారమూ లేకపోగా, మూడు రోజుల ఆందోళన తర్వాత దామోదర్ క్షేమంగానే ఉన్నాడన్న వార్త కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు ఊరట కలిగించింది.
ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు నౌపాడ, గరియాబాద్ ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఛత్తీస్‌గఢ్ ఇన్‌చార్జ్ రాంచంద్రారెడ్డి అలియాస్ చలపతితోపాటు 20 మంది వరకు మృతి చెందినట్టు పోలీసులు మంగళవారం ప్రకటించారు. వరంగల్, కాజీపేట ప్రాంతాలకు చెందిన మోడెం బాలకృష్ణ, ఎం.సాంబయ్యలు కూడా మృతుల్లో ఉన్నట్టు మీడియా ద్వారా ప్రచారం జరిగింది. ఆ ఇద్దరి కుటుంబసభ్యులు, బంధువులు ఫోన్‌ల ద్వారా పలువురిని ఉదయం నుంచి సాయంత్రం వరకు సంప్రదించి చివరకు లేరని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రా, ఒడిశా సరిహద్దు.. అబూజ్‌మడ్ దండకారణ్యం.. ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా తెలంగాణ పల్లెల్లో కలకలం రేపుతున్నాయి. సీపీఐ (మావోయిస్టు) పార్టీ దండకారణ్య కమిటీల్లో ఇప్పటికీ ఈ ప్రాంతానికి చెందిన వారే కీలకంగా వ్యవహరిస్తుండగా, ప్రతీ ఎదురుకాల్పుల సంఘటనలో ఒక్కరిద్దరు ఉంటున్నారు. దీంతో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఎదురుకాల్పుల సంఘటనలు మావోయిస్టుల కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదే సమయంలో పోలీసులు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కుటుంబాలను కలిసి జనజీవన స్రవంతిలో కలిసేలా చూడాలని కౌన్సెలింగ్ చేస్తుండగా, మావోయిస్టులు మాత్రం పోరుబాటలోనే సాగుతున్నారు.
మోస్ట్ వాంటెడ్‌ల్లో వరంగల్ వారే 23 మంది
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ తదితర 11 రాష్ట్రాల్లో పని చేస్తున్న మావోయిస్టు పార్టీ అగ్రనేతల వివరాలపై కేంద్ర హోంశాఖ గతేడాది మార్చిలో ఆరా తీసింది. తెలంగాణలోని పాత 10 జిల్లాల నుంచి 64 మంది ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలలో పనిచేస్తున్నట్టు తేలిందని వెల్లడించింది. ఇందులో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 23 మంది అజ్ఞాతంలో ఉన్నట్టు ప్రకటించింది.
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల నేతల వివరాలను జిల్లాలు, పోలీస్‌స్టేషన్ల వారీగా ఇటీవల ఎన్‌ఐఏ కూడా ఆరా తీసింది. హనుమకొండ, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల నుంచి అజ్ఞాతంలో ఉన్న నేతల వివరాలను మోస్ట్‌వాంటెడ్ జాబితాలో చేర్చారు. ఇందులో కేంద్ర కమిటీతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, దండకారణ్యం కమిటీల్లో కీలకంగా ఉన్న మోడం బాలకృష్ణ అలియాస్ మహేశ్, బాబన్న, గాజర్ల రవి అలియాస్ గణేష్, బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, గాదె రాజు, సుంకరి రాజ్, గీరెడ్డి పవనానందరెడ్డి అలియాస్ అర్జున్, ఉల్లెంగుల యాకయ్య అలియాస్ అంజన్న, పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ముప్పిడి సాంబయ్య అలియాస్ బాబన్న, అంకేశ్వరపు సారయ్య అలియాస్ ఎల్లన్నలతోపాటు మొత్తం 23 మంది పేర్లను వెల్లడించారు.
కేంద్ర కమిటీల్లో కీలకంగా తెలంగాణ నేతలు
సీపీఐ (మావోయిస్టు) పారీ్టలో కేంద్ర కమిటీ సభ్యులతోపాటు వివిధ బాధ్యతల్లో తెలంగాణకు చెందిన పలువురు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) విలీనం సమయంలో 32 మందితో ఉన్న కేంద్ర కమిటీ ఆ తర్వాత అనేక కారణాల వల్ల 24 మందికి చేరినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. సెంట్రల్ రీజినల్ బ్యూరోగా ఉన్న కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మరణం తర్వాత కమిటీ పునరుద్ధరణ జరిగినట్టు చెబుతున్నారు.
కాగా, ఈ 24 మందిలో తొమ్మిది మంది జార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందినవారు కాగా, 15 మందిలో 12 మంది తెలంగాణ వారే. కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబళ్ల కేశవరావు నియామకం తర్వాత, అప్పటివరకు కేంద్రకమిటీ కార్యదర్శిగా ఉన్న ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి.. ప్రస్తుతం సీసీ మెంబర్‌గా, అంతర్జాతీయ విప్లవపార్టీల సమాఖ్యకు ఇన్‌చార్జ్‌గా ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment