సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని తుల్‌తులీ–గవాడీ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ మొత్తంగా 35 మంది సభ్యులను నష్టపోయింది. ఈ ఎదురుకాల్పులపై ముందుగా ప్రకటన చేసిన పోలీసులు 31 మంది చనిపోయినట్టుగా పేర్కొన్నారు. ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్న 31 మృతదేహాల్లో 22 మందినే గుర్తుపట్టగా, మిగిలిన వారు ఎవరనే అంశంపై సందిగ్ధత కొనసాగింది. అయితే ఎన్‌కౌంటర్ జరిగిన తొమ్మిది రోజుల తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తూర్పు బస్తర్ డివిజన్ కమిటీ స్పందించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 35 మంది చనిపోయినట్టు ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ఆ పార్టీ పేర్కొంది. ఘటన జరిగిన తీరుపైనా పోలీసులు వెల్లడించిన వివరాలకు మించి అనేక అంశాలను మావోయిస్టులు ప్రకటించారు.
మూడో తేదీనే చేరుకున్న బలగాలు
మావోయిస్టులు బస చేసిన దంతెవాడ – నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దు అబూజ్‌మడ్ అడవుల్లోకి పోలీసులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, డీఆర్‌జీ బలగాలు ఈనెల 3వ తేదీ రాత్రికే చేరుకున్నాయి. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు రోలింగ్ కాల్‌కు పిలుపునిచ్చి టీ, టిఫిన్లు చేసేందుకు తాము సిద్ధమవుతున్న సమయాన ఆ ప్రాంతంపై డ్రోన్లు ఎగురుతూ కనిపించాయని మావోయిస్టులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమై సమీప గ్రామంలో విచారిస్తే భద్రతా దళాలు చుట్టుముట్టునట్టు రూఢీ అయ్యిందని.. ఈ క్రమాన ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే 4న ఉదయం 10 గంటలకు కాల్పులు మొదలయ్యాయని తెలిపారు. ఆ తర్వాత 11:30 గంటలకు ఊపందుకున్న కాల్పులు రాత్రి 9 గంటల వరకు పలుమార్లు కొనసాగాయని మావోలు ప్రకటించారు.
పట్టు సాధించిన బలగాలు
బస్తర్ ప్రాంతంలో దండకారణ్యం, అబూజ్‌మడ్ ప్రాంతాల్లో మావోయిస్టులకు గట్టిపట్టు ఉండేది. దండకారణ్య ప్రాంతంలో జనతన సర్కార్‌ను బీజ దశ నుంచి ఆ పార్టీ అభివృద్ధి చేసుకుంటూ రాగా, అబూజ్‌మడ్ ప్రాంతం షెల్టర్ జోన్‌గా ఉపయోగపడేది. కానీ గడిచిన రెండేళ్లుగా దండకారణ్యం ప్రాంతంపై భదత్రా దళాలు, పోలీసులు కలిసికట్టుగా మావోల ప్రభావాన్ని తగ్గించగలిగారు. అంతేకాక మావోయిస్టుల అంచనాలను తలకిందులు చేస్తూ దాదాపు 2 వేల మంది భద్రతా దళాలు, ఆధునిక సాంకేతిక సంపత్తితో అడవులను గాలిస్తూ మావోల అడ్డాకు చేరుకోవడమే పెద్ద విజయం అనుకునే అభిప్రాయం నుంచి మాడ్ అడవుల్లోనే ఏకంగా 35 మంది మావోయిస్టులు నేలకొరిగేలా చేయగలగడం ప్రభుత్వ పరంగా భారీ విజయంగానే ఉంది. కాల్పులు జరిగిన తీరుపై మావోయిస్టులు వెల్లడించిన అంశాలు ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నాయి.
చదవండి: ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టుల సంతాపం
31 కాదు 35 మంది మృతి..
తుల్‌తులీ–గవాడీ ఎదురు కాల్పుల్లో నేరుగా 14 మంది చనిపోగా తమ పార్టీకి చెందిన 17 మంది దళ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారని మావోయిస్టులు లేఖలో వెల్లడించారు. దీంతో వీరిని అక్కడే పట్టుకున్న ప్రభుత్వ బలగాలు మరుసటి రోజైన అక్టోబర్ 5 ఉదయం 8 గంటలకు కాల్చిచంపారని ఆరోపించారు. దీంతో అధికారికంగా 31 మంది చనిపోయినట్టు నిర్ధారణ కాగా.. మరో నలుగురు గాయపడి చికిత్స పొందుతూ మావోల చెంతే చనిపోయినట్టు తెలుస్తోంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 35గా మావోయిస్టులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment