చుట్టుముట్టిన బలగాలు
=సరిహద్దులో యుద్ధవాతావరణం
=దారకొండలో ఎదురుకాల్పులంటూ వదంతులు
=అప్రమత్తమైన పోలీసులు
=గ్రేహౌండ్స్ కూంబింగ్ ముమ్మరం
సీలేరు, న్యూస్‌లైన్ : ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మళ్లీ యుద్ధవాతావరణం నెలకొంది. మావోయిస్టుల పీఏజీఏ వారోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయనుకుంటున్న తరుణంలో బుధవారం అర్ధరాత్రి విశాఖ నుంచి ఒకేసారి ఐదు బస్సుల్లో వచ్చిన గ్రే హౌండ్స్ బలగాలు అడవుల్లోకి దూసుకెళ్లాయి. సీలేరు మీదుగా ఒడిశా, తూర్పుగోదావరి జిల్లా గుర్తేడు, ఖమ్మంజిల్లా సరిహద్దు ప్రాంతాలకు బలగాలు వెళ్లడంతో ఏదో జరుగుతోందంటూ ఇక్కడివారు చర్చించుకున్నారు.
దారకొండ, గుమ్మిరేవులు, పాతకోట, గుర్తేడు ప్రాంతాల్లో నాలుగురోజులుగా మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అధికారుల వద్ద పక్కా సమాచారం ఉంది. దీనిలో భాగంగానే ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నారనే ప్రచారం సాగింది. ఇటీవల సప్పర్లకు చెందిన గెమ్మిలి చిన్నారావును హతమార్చిన యాక్షన్‌టీము సీలేరు సంతలో కొందరి వివరాలు సేకరించినట్టు తెలిసింది. ఇలా మావోయిస్టుల కదలికలు ఎక్కువ కావడం, కూంబింగ్‌కు వెళ్లిన కొద్దిగంటల్లోనే దారకొండ సమీపంలో ఎదురుకాల్పులు జరిగాయని వదంతులు వ్యాపించాయి.
ఇదే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా,అలాంటిదేమీ లేదన్నారు. అయితే సరిహద్దులోని సీలేరు, చిత్రకొండ, డొంకరాయి, జి.కె.వీధి, ముంచంగిపుట్టు పోలీస్‌స్టేషన్లలోని వారిని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం గూడేల్లో పోలీసుల తనిఖీలు ముమ్మరమయ్యాయి.