సాక్షి, విశాఖపట్నం : మావోయిస్ట్ కంచుకోటగా వెలుగొందిన ప్రాంతాల్లో ఆ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పోలీసులు వరుస కూబింగ్‌లతో పాటు ఎన్‌కౌంటర్లు సైతం కోలుకోలేని దెబ్బకొడుతున్నాయి. అయినప్పటికీ పట్టు కోసం పారాడుతున్న మావోయిస్టులకు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గ్రామాలు అండగా ఉంటున్నాయి. అయితే ఏళ్ల తరబడి అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటున్న ఆదివాసీలు సైతం మావోయిస్టులపై తిరుగబడుతున్నారు. తమ వెనుకబాటుకు కారణం మీరే అంటూ మావోలపై తిరుగుబాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రా-ఒరిస్సా (ఏవోబీ) సరిహద్దుల్లో గిరిజన ప్రజలు భారీ ర్యాలీని నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి కావాలని నినాదంతో 6 గ్రామాల గిరిజనులు భారీ ర్యాలీ చేపట్టారు. మావోయిస్టుల కంచుకోటలో వ్యతిరేక నినాదాలు చేశారు. రోడ్లు, ఆసుపత్రులు, సెల్ టవర్ నిర్మించాలి అంటూ గిరిజనులు నినాదాలు చేశారు. (ఆసిఫాబాద్‌లో మావోల కదలికలు)
మరోవైపు తెలంగాణలోనూ మావోయిస్టుల జాడ కోసం పోలీసులు కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాంగం వారి కదలికలపై నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. దళ సభ్యుల సంచారం అనుమానం ఉన్న ప్రతి ప్రాంతాన్నీ జల్లెడ పడుతున్నారు. గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడను పోలీసు బలగాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయితే వారికి దళ సభ్యులు కంటపడకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అనుమానిత ప్రాంతాలను తనిఖీలు చేశారు. శుక్రవారం సైతం సమీప అటవీ ప్రాంతాలతోపాటు పత్తి చేలు, ఆసిఫాబాద్ ప్రధాన రోడ్డుపై పోలీసుల గస్తీ కొనసాగింది. దీంతో సమీప గ్రామాల ప్రజల్లో తెలియని ఆందోళన మొదలైంది. పోలీసుల బందోబస్తుతో ఆయా ప్రాంతాల్లో హైఅలర్ట్ నెలకొంది. పోలీసులు అన్ని వైపులా నిఘా మరింత పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment