గెలుపొందిన స్వతంత్ర తెలుగు అభ్యర్థిని టికై గెమెల్
సాక్షి, అమరావతి: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల మధ్య కోరాపుట్ జిల్లాలోని కొటియా పల్లెల ప్రజలు తాము ఏపీలోనే ఉంటామని బ్యాలెట్ ద్వారా ఒడిశా ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఒడిశా ప్రభుత్వం నిర్వహించిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా కొటియా క్లస్టర్ పరిధిలో పొట్టంగి జోన్–1 స్థానానికి ఫిబ్రవరి 18న పోలింగ్ జరిపించింది. అదే నెల 26న ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజున ఫలితం ప్రకటించారు. మహిళలకు కేటాయించిన ఈ స్థానం నుంచి ఒడిశా పాలకపక్ష పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ), ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కలిసి మమతా జానీ అనే మహిళను ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి.
కొటియా గ్రామాల్లో గతేడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును తారుమారు చేసేందుకు ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నట్లు ప్రకటించిన అక్కడి మూడు రాజకీయ పార్టీలు జానీ గెలుపు కోసం పెద్దఎత్తున ప్రచారం చేశాయి. అయినా ఫలితం దక్కలేదు. తెలుగు మాట్లాడే స్వతంత్ర అభ్యర్థిని టికై గెమెల్ 3,710 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గెమెల్‌కు 10,354 ఓట్లు రాగా, మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థి జానీకి 6,644 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉమ్మడి అభ్యర్థి ఓటమి పాలవడంతో ఒడిశా రాజకీయ పార్టీలకు షాక్ తగిలింది. తెలుగు అభ్యర్థిని గెలిపించటం ద్వారా తాము ఏపీలోనే ఉంటామని అక్కడి ప్రజలు ఒడిశా ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment