బాధిత రామచందర్ కుటుంబంతో కలిసి మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న గిరిజనులు
ముంచంగిపుట్టు: ఏజెన్సీలో గిరిజనుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. మావోయిస్టులు, పోలీసుల మధ్య వారు నలిగిపోతున్నారు. పోలీసు ఇన్ఫార్మర్ అన్న అనుమానం వస్తే చాలు మావోయిస్టులు కక్ష కడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్టే హతం చేస్తున్నారు. వారి వేధింపులు భరించలేక ప్రాణభయంతో గిరిజనులు సొంత ఊరిని వదిలి వేరే చోట తలదాచుకుంటున్నారు.
ఇలా రంగబయలు, లక్ష్మీపురం, భూసిపుట్టు పంచాయతీలకు చెందిన 13 గ్రామాల నుంచి 41 కుటుంబాలు ముంచంగిపుట్టు మండల కేంద్రానికి వచ్చి బిక్కుబిక్కుమని బతుకీడుస్తున్నాయి. తాజాగా రంగబయలు పంచాయతీ గోబరపడా గ్రామంలో గత నెల 30వ తేదీన జరిగిన ఘటన మన్యవాసుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఏకంగా 10మంది సాయుధ మావోయిస్టులు, 30మంది మిలీíÙయా సభ్యులు ఇంటిని చుట్టుముట్టడంతో వంతాల రామచందర్ ఇంటి వెనక నుంచి అడవిలోకి పారిపోయాడు. దీంతో మావోయిస్టులు తనను నిర్దాక్షిణ్యంగా కొట్టారని, తన ఇంటిని, వస్తువులను ధ్వంసం చేశారని రామచందర్ భార్య సొంబరి తెలిపింది.
పోలీసు ఇన్ఫార్మర్‌గా వ్యవహరిస్తున్న రామచందర్‌ను హతమారుస్తామని, తక్షణమే ఊరు నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఆమె ముగ్గురు పిల్లలతో రాత్రి పూట అడవిలో నడుచుకొని తనకు తెలిసిన వారి దగ్గర మూడు రోజులు తలదాచుకుంది. భర్త ఆచూకీ తెలియక ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్‌లో శనివారం సాయంత్రం ఆమె ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు సమీప గ్రామాల్లో వెతికి రామచందర్‌ను గుర్తించి సొంబరికి అప్పజెప్పారు.
నిరసన వెల్లువ
మావోయిస్టుల చర్యకు నిరసనగా బాధిత కుటుంబంతోపాటు గిరిజనులు భారీ సంఖ్యంలో ఆదివారం ముంచంగిపుట్టులో నిరసనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని స్థానిక వెటర్నరీ హాస్పిటల్ నుంచి పోలీసు స్టేషన్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. “మావోయిస్టులారా.. ఇంకా ఎంతమందిని మా గ్రామాల నుంచి తరిమేస్తారు.. గిరిజన ఆడపిల్లలపై దాడులు చేస్తూ మా బాగు కోసం అంటే ఎలా నమ్మేది.. మా అడవి నుంచి వెళ్తారా, తరిమి కొట్టాలా.. అంటూ నినాదాలు చేశారు.
మా గ్రామాలపై మీ పెత్తనం ఏమిటి... మీ స్వార్ధంతో మా బతుకులు పాడు చేయొద్దు.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు పలువురు మాట్లాడుతూ సొంత గ్రామాల్లో సుఖంగా బతుకుతున్న తమపై లేనిపోని నిందలు వేసి గ్రామాల నుంచి తరిమేశారని, తమ కళ్ల ముందే భర్తలను దారుణంగా చంపేశారని ఆవేదన చెందారు.
తమ ఇళ్లు, భూములు వదులుకొని కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతకాలం తమను వేధిస్తారని ప్రశ్నించారు. తమ పిల్లల భవిష్యత్‌ను అంధకారంలో పెట్టవద్దని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబాలు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. చేతిలో సామాన్ల మూటలతో దీనంగా ఉన్న రామచందర్ కుటుంబం పరిస్థితి చూపరులకు ఆవేదన కలిగించింది.
Comments
Please login to add a commentAdd a comment