ఏవోబీలో మళ్లీ  పేలిన తుపాకులు | Ongoing Red Alert In The Agency | Sakshi
Sakshi News home page

రెడ్‌ అలర్ట్‌

Published Mon, Jul 27 2020 6:58 AM | Last Updated on Mon, Jul 27 2020 9:35 AM

Ongoing Red Alert In The Agency  - Sakshi

వారోత్సవాల్లో పాల్గొన్న మావోయిస్టులు( ఫైల్‌ )  

పెదబయలు/పాడేరు: మన్యం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఒక వైపు మావో యిస్టులు అమరవీరుల వారోత్సవాల నిర్వహణకు పిలుపు నివ్వగా.. మరోవైపు అడ్డుకునేందుకు సాయుధ దళాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో మన్యంలో అప్రకటిత రెడ్‌ అలెర్ట్‌ కొనసాగుతోంది. ఆంధ్రఒడిశా సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఏవోబీలో శనివారం సాయంత్రం మళ్లీ తుపాకుల మోత మోగింది. దీంతో ఏవోబీలో వాతారణం ఒక్క సారిగా వేడిడెక్కింది. మారుమూల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తొమ్మిది రోజుల వ్యవధిలో మూడు సార్లు ఎదురు కాల్పులు జరగడంతో  గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  మావోయిస్టుల కదలికలను కనిపెడుతూ, వారిని వెంటాడుతూ  పోలీసులు పైచేయి సాధిస్తున్నారు. ఈ నెల 16న  మల్కన్‌గిరి జిల్లా జోడం పంచాయతీ ముక్కుడుపల్లి అటవీ ప్రాంతంలో ఒడిశా పోలీసు బలగాలు–మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఆ సమయంలో మావోయిస్టులు తప్పించుకున్నారు. ఒడిశా కటాఫ్‌ ఏరియా నుంచి ఆంధ్ర ప్రాంతంలోకి మావోయిస్టులు ప్రవేశించారని సమాచారం తెలియడంతో  ఆంధ్ర  పోలీసు బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఈ నెల 19న పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ లండూలు, మెట్టగుడ  గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో  మరోమారు ఎదురుకాల్పులు జరిగాయి. ఆ సమయంలో  మావోయిస్టు అగ్రనేతలు గాయాలతో బయటపడినట్టు, వారి నుంచి కిట్‌ బ్యాగులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంలో  రక్తపు మరకలు, లభ్యమైన సామగ్రి ఆధారంగా మావోయిస్టు  అగ్రనేతలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో పోలీస్‌ బలగాలు కూబింగ్‌ను  ఉధృతం చేశాయి. తాజాగా ఒడిశా రాళ్లగెడ్డ  పంచాయతీ గజ్జెడిపుట్టు,దిగుడుపల్లి అటవీ ప్రాంతంలో  శనివారం సాయంత్రం ఎదురుకాల్పులు జరిగాయి.  దయా అనే  మావోయిస్టు మృతి చెందాడు. ఏవోబీలో వరుస ఎదురు కాల్పులతో యుద్ధవాతావరణం నెలకొంది. మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్టు సమాచారం.

వారోత్సవాలు భగ్నమే లక్ష్యంగా .. 
మావోయిస్టు  అమరవీరుల వారోత్సవాలను ఏటా జూలై  28 నుంచి ఆగస్టు 3 వరకు   నిర్వహిస్తారు. ఒడిశా కటాఫ్‌  ఏరియాలో ఏడు పోలీసుల అవుట్‌ పోస్టులు ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఆంధ్ర ప్రాంతంలోఉన్న ముంచంగిపుట్టు మండలం భూషిపుట్టు, బుంగాపుట్టు పంచాయతీలు, పెదబయలు మండలం ఇంజరి,గిన్నెలకోట ,జామిగుడ పంచాయతీల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయన్న సమాచారంతో ఆంధ్ర గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. మావోయిస్టుల అమర వీరుల వారోత్సవాలు భగ్నం చేయాలని పోలీసులు,ఎలాగైన వారోత్సవాలు జరపాలని  మావోయిస్టుల పట్టుదలతో ఉన్నారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement