మక్కువ: ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో (ఏఓబీ) మళ్లీ కలకలం మొదలైంది. ప్రత్యేక బలగాల బూట్ల శబ్ధంతో ఏజెన్సీ అదురుతోంది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏఓబీ సరిహద్దు ప్రాంతంలో రెండు రోజులుగా యుద్ధ వాతవరణం నెలకొంది. ఈ నెల 28 నుంచి వచ్చేనెల 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు ఏఓబీకి సరిహద్దు గ్రామాలైన ఎర్రసామతవలస, దుగ్గేరు, మూలవలస, బాగుజోల, చిలకమెండంగి, మెండంగి, గుంటబద్ర, తదితర గ్రామాల్లో బుధవారం ముమ్మర కూంబింగ్ చేపట్టారు. దీంతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో పోలీసుల బూట్ల చప్పళ్లు వినిపించాయి.
వారంరోజుల పాటు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల కిందట ఒడిశా రాష్ట్రం మల్కనగిరి, విశాఖ ఏజెన్సీ పెదబయలు మండల అటవీ ప్రాంతాలలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దీంతో మావోయిస్టులు పోలీసుల నుంచి తప్పించుకొని ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోకి ప్రవేశించి ఉంటారన్న అనుమానంతో పోలీసులు విస్తృత కూంబింగ్ చేపడుతున్నారు.
అలాగే మంగళవారం నుంచి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు మంగళవారం రాత్రి ప్రభుత్వ కార్యాలయాల వద్ద నాకాబందీ నిర్వహించారు. సంస్మరణ వారోత్సవాలు నిర్వహించిన సందర్భంగా గతంలో మక్కువ మండలంలో పలుమార్లు తమ ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు బ్యానర్లు, వాల్‌పోస్టర్లు అతికించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 28 నుంచి వచ్చేనెల 3 వరకు నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మక్కువ మండలం ఏఓబీ సరిహద్దులో ఉన్నందున మావోయిస్టులు ఎదో ఒక రూపంలో వారి ఉనికిని చాటుకునే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
గతంలో జరిగిన సంఘటనల్లో కొన్ని..
2011 మే 15న మక్కువ మండలం ఎర్రసామంతవలస, దుగ్గేరు గ్రామాలలో ఏఓబీ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని.. గ్రీన్‌హంట్‌ను తిప్పికొట్టాలని అప్పట్లో బ్యానర్లు కట్టి కలకలం రేపారు. అదే ఏడాది జూలై 28న ఎర్రసామంతవలసలో మరో బ్యానర్ కట్టి వారి ఉనికిని మరోమారు చాటుకునే ప్రయత్నం చేశారు. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అప్పట్లో మావోయిస్టులు (సీపీఐ)పేరిట బ్యానర్‌ను కట్టి మన్యంలో కలకలం సృష్టించారు. 2011 ఏప్రిల్ 24న చెక్కవలస రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2012 ఫిబ్రవరి 17న దుగ్గేరులోని రామమందిరం వద్ద శ్రీకాకుళం–కొరాపుట్ డివిజనల్ కమిటీ పేరుతో గోడపత్రికను అతికించారు. అలాగే ఎర్రసామంతవలసలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను కాల్చి వేశారు. అలాగే పనసబద్ర గ్రామంలో కరువుదాడి జరిగిన సంఘటనలున్నాయి. ఏవోబీకి మక్కువ మండలం అతిసమీపంలో ఉన్నందున మావోయిస్టులు ఉనికి చాటుకునేందుకు ప్రయత్నం చేయడం.. పోలీసులు పట్టు సాధించేందుకు ప్రయత్నించడం పరిపాటిగా మారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment