► 2008లో లాంచీలో వెళ్తున్న గ్రేహౌండ్స్ సిబ్బందిపై మావోయిస్టుల దాడి
► ఆ దాడిలో 38 మంది మృతి.. నీటి కారణంగానే భారీ ప్రాణనష్టం
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఎనిమిదేళ్ల కిందట బలిమెల రిజర్వాయర్‌లో గ్రేహౌండ్స్ భారీగా నష్టపోవడానికి కారణమైన ‘నీరు’ ఇప్పుడు ఏఓబీలో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతీసింది. ఆ ప్రాంత భౌగోళికాంశాలపై పూర్తి పట్టున్న ఉదయ్, దయ లాంటి వాళ్లూ చనిపోవడానికి కారణమైంది. 2008 జూన్ 29న విశాఖపట్నం జిల్లా బలిమెల రిజర్వాయర్‌లో లాంచీలో వెళ్తున్న గ్రేహౌండ్స్ బలగాలపై కొండ పైనుంచి మావోయిస్టులు విరుచుకుపడ్డారు.
ఆ సమయంలో లాంచీలో ఉన్న 64 మంది గ్రేహౌండ్స్ సిబ్బందిలో లాంచీ డ్రైవర్‌తోసహా 38 మంది చనిపోయారు. దాడి జరిగిన సమయంలో లాంచీలో ఉన్న వారు బయటపడాలనే ఉద్దేశంతో నీళ్లలోకి దూకేశారు. దీంతో ఎదురుదాడికి వారికి ఆస్కారం లేకుండా పోయింది. మావోయిస్టులు రిజర్వాయర్ చుట్టూ ఉన్న ఎత్తై కొండలపై మాటు వేయడంతో దాడి చేయడం వారికి తేలికైంది. దీంతో గ్రేహౌండ్స్ చరిత్రలో మర్చిపోలేని, పోలీసులకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
అదే తరహాలోనే..: తాజా ఎన్‌కౌంటర్ సైతం దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే, బలిమెలకు సమీపంలోనే జరిగింది. క్యాడర్‌కు కమాండో శిక్షణ ఇస్తున్న మావోయిస్టులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఏఓబీ మావోయిస్టులకు కంచుకోట. చాలా కాలంగా పార్టీ అగ్రనేతలు అక్కడే సురక్షితంగా ఉంటున్నారు. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు ఎప్పుడు ప్లీనరీలు, ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించాలన్నా ఏఓబీనే ఎంచుకుంటారు. భద్రత కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేసుకుంటారు. మందుపాతరల ఏర్పాటు సహా మూడంచెల ఉంటుంది. ఈ శిక్షణ శిబిరంపై సమాచారం అందుకున్న గ్రేహౌండ్, ఎస్‌ఓటీ బలగా లు వారం రోజులుగా ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
సోమవారం గుట్టల నుంచి కిందికి వెళ్తున్న సమయంలో మావోయిస్టులు కనిపించారు. బలగాల కదలికల్ని గుర్తించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. క్రమంలో సెంట్రీ విధు ల్లో ఉన్న మావోయిస్టులు పారిపోయేందుకు యత్నించారు. అయితే వీరున్న ప్రాంతానికి రెండు వైపులా వాగు ఉండటంతో హడావుడిలో అందులోకి దూకేశారు. దీంతో మావోయిస్టులు పూర్తిస్థాయిలో ఎదురుదాడి చేయలేకపోయారు. బలగాలు ఎత్తులో ఉండటంతో ఎన్‌కౌంటర్ తేలికైంది. దీంతో మావోయిస్టుల ఉద్యమ చరిత్రలోనే భారీగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ఇప్పటికి చాలాసార్లు పోలీసు దాడుల నుంచి తప్పించుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ నుంచి కూడా ఆయన సురక్షితంగా తప్పించుకున్నట్లు సమాచారం.
అప్పుడు గ్రేహౌండ్స్.. ఇప్పుడు మావోలు
Published Tue, Oct 25 2016 3:15 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement