Akkiraju haragopal
-
ఆర్కేకు మహిళలంటే భయం!
టంగుటూరు: నాలుగు దశాబ్దాల పాటు ఉద్యమమే ఊపిరిగా బతికిన విప్లవ నాయకుడు, సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, అక్కిరాజు హరగోపాల్ (65) అలియాస్ రామకృష్ణ, అలియాస్ ఆర్కే. 2004లో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పార్టీ ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించాడు. ప్రజల డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టి సమర్థవంతంగా చర్చించాడు. చర్చల ప్రక్రియలో పార్టీ రాజకీయ ధృక్పథాన్ని రాష్ట్ర, దేశ ప్రజల్లోకి వ్యాప్తి చేశాడు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని, ఎన్నో ఎన్కౌంటర్ల నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకుని తుది వరకు తను నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడ్డాడు. ‘ప్రజల కోసమే జీవిస్తాం.. ప్రజల కోసమే చస్తాం’ అన్న మాటను నిలుపుకుంటూ విప్లవోద్యమానికి నిస్వార్థంగా సేవలు అందిస్తూ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆర్కే వైవాహిక జీవితం ఎలా సాగింది? ఏ విధంగా పెళ్లి జరిగింది? ఆర్కేకు మహిళలంటే భయమా? పిల్లల విషయంలో ఈ దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయా? కుమారుడిని కూడా ఉద్యమంలోకి ఎందుకు ఆహ్వానించాడు? తదితర ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ ఆర్కే భార్య శిరీష ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఉద్యమ పరంగా ఆర్కే గొప్పలీడర్. అలాంటి లీడర్ భావజాలానికి మీరు ఎలా దగ్గరయ్యారు? శిరీష : పెళ్లికి ముందే 1977 నుంచి 1987 వరకు ఉద్యమంలో పని చేశాను. 1987లో ఆయన (ఆర్కే)తో పరిచయం ఏర్పడింది. ఈ జిల్లాల్లో దళితులపై ఎక్కువగా దాడులు జరిగేవి. దాంతో ఉద్యమాలు, పెద్ద ఎత్తున మీటింగ్‌లు జరిగేవి. ఆ మీటింగ్‌లకు నేను వెలుతుండేదాన్ని. ఈ మీటింగ్‌లకు ఆయన కూడా వచ్చేవారు. జననాట్య మండలి ప్రోగ్రాములు జరుగుతుండేవి. నాకు మహిళా సంఘాల్లో పని చేయాలని ఆసక్తి ఉండేది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఇప్పుడైతే చాలా మంది మాట్లాడుతున్నారు. అప్పట్లో తక్కువ. ఆయన దళితుల మధ్య ఉంటూ, వారి సమస్యలపై పోరాడుతూ.. వారితో తినడం నాకు నచ్చింది. మీరు ఏమి చదువుకున్నారు. శిరీష : ఇంటర్ వరకు చదువుకున్నా. కారంచేడు ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? శిరీష: అగ్రనాయకులు ఇక్కడికి వచ్చి దళితుల కోసం పోరాడుతుంటే మనం వారికి మద్దతు ఇవ్వకపోతే ఎలా? మనం కూడా పోరాటం చేయాలని అనిపించింది. ప్రశ్నించే వారు ఉండాలి. అడిగితే కానీ ప్రభుత్వాలు ఇవ్వవు. అది భూమి కావచ్చు.. మరేదైనా కావచ్చు. ప్రశ్నించే విధానం అలవర్చు కోవాలి. ఆర్కేను పెళ్లి చేసుకోవాలని ఎందుకనిపించింది? శిరీష : తొలుత తోటి ఉద్యమదారుల వద్ద ఆర్కే గురించి విన్నాను. ఆ తర్వాత ఆయన పోరాట పంథా నాకు బాగా నచ్చింది. నేను కొంచెం మౌనంగా ఉండే రకం. ఆ విషయం ఆయనకు నచ్చింది. కొందరు ఉద్యమకారులు ఆర్కే గురించి మా పెద్దవాళ్లకు చెప్పారు. ఇద్దరం ఇష్టపడ్డాకే పెళ్లి చేసుకున్నాం. వాస్తవానికి ఆయనకు మహిళలు అంటే కొంచెం బెరుకు. దూరంగా ఉంటారు. ఇద్దరం అలాంటి వాళ్లమే కాబట్టి త్వరగా కలిసిపోయాం. పెళ్లప్పుడు నా వయసు 19 ఏళ్లు మాత్రమే. ఆర్కేను పెళ్లి చేసుకుని తప్పు చేశాను అనిపించిందా? శిరీష : అలా ఎప్పుడూ అనిపించలేదు. అందరిలాగా తిరగాలని అనిపించేది. బయటకు వెళ్లాలని అనిపించేది. అయితే మా పరిస్థితి దృష్ట్యా ఎక్స్పోజ్ కాకూడదు. బయట తిరగకూడదు. వస్తు వ్యామోహం ఉండకూడదు. మొదట్లో నాకు మాత్రం అన్నీ కావాలని కోరిక ఉండేది. బట్టలు, వస్తువులన్నా వ్యామోహం ఉండేది. అయితే అవన్నీ సరికాదని ఆయన చెప్పే వారు. ఆయన చెప్పేవన్నీ విన్నాక సబబే అనిపించింది. ఆయన చెప్పిన ప్రకారం నడుచుకునేదాన్ని. ఎప్పుడైనా తగవులు.. గొడవలు పడే వారా? శిరీష: పిల్లలు పుడితే ఉద్యమానికి ఇబ్బంది అవుతుందనే వారు. ‘ఒక్కోసారి పిల్లలను వదిలేసి వెళ్లాల్సి వస్తుంది.. వారి ప్రేమకు దూరం అవుతాం.. మన ప్రేమకు వారు దూరమవుతారు.. తల్లిదండ్రులకు దూరమై ఇంటి వద్ద ఉన్న పిల్లల వల్ల ఇబ్బంది అవుతుంది. ఆలోచించు’ అన్నారు. ఎంత కష్టమొచ్చిన సరే ఒకరినైనా కనాలని గొడవ పెట్టుకున్నా. ఆ విషయంలో నన్ను కన్విన్స్ చేయలేకపోయారు. 1992లో బాబు (మున్నా) పుట్టాడు. బాబు పుట్టాక పెంపకం ఎలా? శిరీష : అప్పుడు ఆయన నాతోపాటు సంవత్సరం ఉన్నారు. నేను బాబును తీసుకుని అమ్మవాళ్ల వద్దకు వచ్చి ఐదేళ్ల వరకు ఉన్నాను. ఆ సమయంలో నేను మాత్రమే ఆయన్ను అప్పుడప్పుడు కలిసేదాన్ని. ఆరు సంవత్సరాల తర్వాత బాబును ఆయన చూశాడు. బిడ్డ వల్ల ఇబ్బందులొచ్చాయా? శిరీష : అలాంటి పరిస్థితి రాలేదు. కాకపోతే తల్లిదండ్రులిద్దరి మధ్య బాబు పెరగడం లేదన్న బాధ నాకుండేది. అమ్మ వాళ్ల వద్ద కానీ, అక్క వాళ్ల వద్ద కానీ బిడ్డను పెట్టమని చెప్పారు. లేదా పిల్లలు లేని వారికి ఇచ్చేద్దాం అన్నారు. మున్నాను ఎంత వరకు చదివించారు? శిరీష : ఇంటర్ వరకు మున్నా ఉద్యమం పట్ల ఎలా ఆకర్షితుడయ్యాడు? శిరీష: అబ్బాయిని రౌడీలా, గూండాలా పెంచకూడదనుకున్నాను. అనుకున్నట్లే మంచి విలువలతో పెంచాను. చిన్నప్పుడు నాన్న ఎక్కడ? అని అడిగినప్పుడు దూరంగా జాబ్ చేస్తున్నాడని చెప్పేదాన్ని. ఎందుకు అంత దూరం ఉంటాడు అనేవాడు. ఎప్పుడొస్తారని అడిగేవాడు. వస్తారులే అని చెప్పేదాన్ని. ఆర్కే గురించి ఎలా తెలుసుకున్నాడు? శిరీష: పెద్దగయ్యే కొద్దీ వాస్తవాలు తెలుసుకున్నాడు. నాన్నను చూడాల్సిందేనని పట్టు పట్టాడు. అడవిబాట పడితే తప్ప అది సాధ్యం కాదని తెలుసుకుని వెళ్లి కలుసుకున్నాడు. వాళ్ల నాన్న వద్దకు వెళ్లి రావడానికి పోలీసులతో ఇబ్బంది ఉండేది. ఇక్కట్లు వస్తాయని చెప్పాను. చదువు కొనసాగించడమో, లేక ఇక్కడే ఏదైనా జాబ్ చేసుకోవాలనో చెప్పాను. అడవిలోకి వెళ్లాక ఆయన భావజాలాలకు కనెక్ట్ అయ్యి అక్కడే ఉండిపోయాడు. తండ్రిన మించిన కుమారుడుగా పేరు తెచ్చుకున్నాడు. కానీ నాకైతే మరో అబ్బాయి ఉంటే బాగుండేదని అనిపించేది. ఇప్పుడిక వారిద్దరి జ్ఞాపకాలే నాకు మిగిలాయి. -
ఎర్రజెండా ఎగిరిపోయింది
అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే ఉన్న పళాన వెళ్లిపోయారు. ఆకుపచ్చ అడవిలో ఆయన ఎటు వెళ్లారన్నది అక్కడి చెట్లకు మాత్రమే తెలుసు. దశాబ్దాల పాటు ఆయనకు కోరస్‌గా పాడిన పక్షులకూ తెలుసు. ఆయన ప్రతీ కదలికనూ కనిపెడుతూ వచ్చిన మేఘాలకు తెలుసు. ఆయన అడుగుల వరుసను గమనిస్తోన్న భూమికి తెలుసు. ఆర్కే చనిపోతే.. ఆకాశం బద్దలు కాలేదు. భూమి రెండుగా చీలిపోలేదు. ఉద్యోగాలు చేసుకునేవాళ్లు, వ్యాపారాల్లో మునిగిపోయిన వాళ్లు, రకరకాల వ్యాపకాల్లో జీవితాలు గడిపేసే వాళ్లూ కదిలిపోలేదు. కావాలనుకుంటే.. ఆర్కే కూడా చాలా మందిలా తనకున్న మేధకు ఏదో ఓ మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబంతో హాయిగా గడపగలడు. చక్కగా ఏసీ గదుల్లో విలాసవంతంగా జీవితాన్ని నడపగలడు. లేడని కాదు. కానీ పిచ్చో వెర్రో.. అతనికి ఆ ఆలోచన కూడా వచ్చినట్లు లేదు. నమ్మిన సిద్ధాంతం పీడిత వర్గాల సంక్షేమం కోసం జీవితకాలపు పోరాటం చేయాలని ఎప్పుడో 20 ఏళ్ల వయసులో అనిపించిందంతే. ఇక అప్పట్నుంచీ ఇంకో ఆలోచనే పెట్టుకోలేదు. ఆదివాసీల కోసం, నిమ్న కులాల కోసం తానే ఓ ఆయుధం అయిపోవాలనుకున్నాడు. అయిపోయాడు. ఏ వ్యాపకంలో అయినా.. ఉద్యోగంలో అయినా... వృత్తిలో అయినా ఓ పాతికేళ్లు గడపడం అంటేనే చాలా గొప్ప. నాలుగు దశాబ్దాల పాటు ఓ సిద్ధాంతానికి కట్టుబడి జీవితాన్ని ఖర్చుచేసేయడం అంటే ఇంకెంత గొప్ప? ఆర్కే అనుకున్న ఆలోచనలతో కానీ ..ఆయన నమ్మిన సిద్ధాంతంతో కానీ మనం ఎవ్వరూ ఏకీభవించకపోవచ్చు. చాలా మందికి ఏమన్నా పేచీలు ఉండచ్చు. కానీ ఆర్కేలా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి చివరి శ్వాస వరకు ముందుకు సాగడం ఈజీ కాదు. కానే కాదు. అట్టడుగు వర్గాలను దోచుకుంటున్నారని అతను అనుకున్నాడు. ఆ వర్గాల తరఫున పోరాటాలు చేయాలని నమ్మాడు. ఆ పోరాటం ముళ్లబాట అని తెలుసు. ఏ క్షణంలోనైనా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని తెలుసు. అలా తెలిసినా ఆ పోరాటాన్ని కడదాకా తీసుకెళ్లడం తన బాధ్యత అనుకున్నాడు కాబట్టే కడ ఊపిరి వరకు అలానే ఉన్నాడు. అలా ఉండడంలో నిజాయితీగానే ఉన్నాడని కొందరు అనుకుంటే.. అదో గుడ్డినమ్మకం అని వెక్కిరించే వాళ్లూ ఉన్నారు. కాకపోతే జీవించినంతకాలం తాను నమ్మిన సిద్ధాంతానికి నిజాయితీగా కట్టుబడి ఉన్నాడన్న విషయంలో ఆయన్ను సైద్ధాంతికంగా వ్యతిరేకించేవారికి కానీ.. ఆయన ఉద్యమాన్ని నిర్ద్వంద్వంగా ఖండించే పోలీసులకు కానీ మరో ఆలోచన ఉండే అవకాశాలే లేవు. అదీ ఆర్కే నిజాయితీకి గీటురాయి. ఎక్కువమంది జీవితాలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడ్డం, ఎక్కువ మంది కడుపుల్లో ఆకలికేకలు అగ్నిగుండాలు రాజేయడం.. జనాభాలో కొద్దిపాటి శాతం చేతుల్లోనే మెజారిటీ సంపద పోగుబడి ఉండడం కరెక్ట్ కాదనుకున్నాడు. ఆ పరిస్థితిని మార్చాలంటే సాయుధ పోరు ఒక్కటే మార్గం అనుకున్నాడు. ఆర్కే ఎంచుకున్న మార్గం ప్రజాస్వామిక వ్యవస్థలో సరియైనది కాదని ఎక్కువ మంది భావించవచ్చు. నెత్తుటి సిద్ధాంతాన్ని ఒప్పుకోలేమని వాదించవచ్చు. కానీ సమాజంలో మెజారిటీ ప్రజలు పేదరికంలో ఉన్నారు. ఆ పేదలు సుఖంగా ఉండాలన్న ఆర్కే ఆలోచనను ఎవరూ తప్పు బట్టలేరు. ఆర్కే నడిచిన దారి అడుగడుగునా ముళ్లబాటే. అసలు ఆ దారిపట్టడమే తప్పటడుగు వేయడం అనే వాళ్లు ఉండచ్చు. అయితే గుడ్డి నమ్మకమో..పిచ్చి ఆశో.. వెర్రి ఆకాంక్షో పేర్లు ఏవైతేనేం తన జాతి జనుల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడన్నది ఆకుపచ్చ అడవంత నిజం. నలభై ఏళ్ల ఉద్యమకాలంలో చాలా ఎన్కౌంటర్ల నుండి తృటిలో తప్పించుకున్నాడు ఆర్కే. ఆర్కే సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాళ్లు కూడా .. ఆ సిద్ధాంతం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టగలగడాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. వ్యవస్థ దృష్టిలో..మనం రచించుకున్న రాజ్యాంగం పరిధిలో ఆర్కే అనుసరించిన దారి ఆమోదయోగ్యమైనది కాకపోవచ్చు. తప్పులు అందరూ చేస్తారు.. త్యాగాలు మాత్రం కొందరే చేస్తారు అన్నాడు మహారచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి. పదిమంది కోసం జీవితాన్ని కానుకగా ఇచ్చేయడం చాలా తక్కువమంది మాత్రమే చేయగలిగిన త్యాగం. అందుకే కావచ్చు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఆర్కే పనిచేసిన గామాలపాడు ప్రజలు ఇపుడు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ‘‘నాకోసం ఎదురు చూడు‘ ఉరి తీయబడ్డ పాట నుండి చెరపడ్డ జలపాతం నుండి‘ గాయపడ్డ కాలిబాట నుండి ప్రాణవాయువు నుండి‘ వాయులీనం నుండి తిరిగి వస్తాను‘ తిరిగి లేస్తాను నా కోసం ఎదురు చూడు‘ నా కోసం వేచి చూడు–’’ అన్న శివసాగర్ కవిత ఇప్పుడు ఎక్కువమందికి గుర్తుకొస్తూ ఉండొచ్చు. – సి.ఎన్.ఎస్. యాజులు, మొబైల్ : 95055 55384 -
పామేడు– కొండపల్లి మధ్య ఆర్కే అంత్యక్రియలు
చర్ల/టంగుటూరు: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) మృతిని మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆర్కే మృతిపై గురువారమే కథనాలు వచ్చినా పార్టీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం శుక్రవారం వెలువడింది. ఆయన గురువారం ఉదయం కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందగా శుక్రవారం మధ్యాహ్నం పార్టీ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించినట్లు ఆ ప్రకటన తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు – కొండపల్లి మధ్య అటవీ ప్రాంతంలో నిర్వహించిన అంత్యక్రియల ఫొటోలు, వీడియోలను శనివారం మావోయిస్టు పార్టీ మీడియాకు విడుదల చేసింది. ఆర్కే అంత్యక్రియల్లో బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పాలగూడ, గుండ్రాయి, కంచాల, మీనగట్ట, దామారం, జబ్బగట్ట తదితర గ్రామాల నుంచి సుమారు 2 వేల మందికిపైగా ఆదివాసీలతో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆర్కే మృతి సమాచారాన్ని పార్టీ శ్రేణులు కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలకు తెలియజేయడంతో పాటు మిలీ షియా, గ్రామకమిటీ సభ్యుల ద్వారా వివిధ గ్రామాలకు చేరవేసి అంత్యక్రియలకు రావాలని సూచించడంతో ఆదివాసీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరలి వచ్చిన ఆదివాసీలతో పాటు మావోయిస్టులు ఆర్కేకు నివాళులర్పించి భారీ ర్యాలీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఉద్యమంలో నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన ఆర్కే మృతదేహాన్ని చూసి ఆదివాసీలు కన్నీటిపర్యంతమైనట్లు సమాచారం. ఆర్కేకు ఘన నివాళి ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య శిరీష, కుటుంబ సభ్యులు, అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు శనివారం ఆర్కేకు నివాళులర్పించారు. ‘ఆర్కే మృతితో ఉద్యమం ఆగిపోదు. ఆయనలాంటి గెరిల్లా యుద్ధ వీరులు ఇంకా పుట్టుకొస్తారు’అని ఈ సందర్భంగా శిరీష అన్నారు. ఆయన ప్రజల కోసమే అమరుడయ్యారని విరసం నేత కల్యాణరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆర్కే మరణ వార్తను ధ్రువీకరించుకుని భార్య శిరీష, కుటుంబ సభ్యులు విలపించారు. ఇదిలా ఉండగా ఆర్కే పోలీసులకు లొంగిపోయుంటే ఆయనకు మంచి వైద్యం అందేదని, బతికేవాడని ఒడిశాలోని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పిళ్లై అభిప్రాయపడ్డారు. మంచి వైద్యం అందించినా.. పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కేకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య వచ్చిందని, డయాలసిస్ చేయిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ కావడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన మృతి చెందారని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేర్కొన్నారు. ఆర్కేకు పార్టీ తరఫున మంచి వైద్యం అందించినా దక్కించుకోలేకపోయామని తెలిపారు. ఆర్కే మృతి చెందిన నేపథ్యంలో శుక్రవారం అభయ్ ఓ లేఖ విడుదల చేశారు. పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అనారోగ్యంతో 14 అక్టోబర్ 2021న ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారని లేఖలో వెల్లడించారు. ఆయనకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలుకాగా, వెంటనే డయాలసిస్ ప్రారంభించినా కిడ్నీలు ఫెయిల్ కావడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడయ్యారని పేర్కొన్నారు. ఆయనకు విప్లవ శ్రేణుల మధ్యే శ్రద్ధాంజలి ఘటించి అంత్యక్రియలు పూర్తిచేశామని తెలిపారు. కామ్రేడ్ రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటని, ధైర్యసాహసాలతో పార్టీకి, విప్లవోద్యమానికి నాయకత్వం అందించారని కొనియాడారు. పార్టీకి అన్ని రంగాల్లో సేవలందించారని వివరించారు. ఆర్కే సాధారణ జీవితం, ప్రజల పట్ల ప్రేమ, సహచరులపై ఆప్యాయత, విప్లవం పై స్పష్టత, దూరదృష్టి నుంచి యావత్ పార్టీ కేడర్ ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఆయన ఆశయసాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. -
షేడ్స్ ఆఫ్ రెడ్!
మనం జనజీవన స్రవంతిగా పిలుచుకునే లోకంలో ఆర్కే అనే పేరు అంత సుపరిచితమైనదేమీ కాదు. అధికార పదవుల్లో చక్రం తిప్పిన వ్యక్తి కాదు. వ్యాపారాలు చేసి వేలకోట్ల టర్నోవర్ సాధించడం వంటి ఘనతలేమీ లేవు. చేసిన సేవలకు మెచ్చి ప్రభుత్వం వారిచ్చే ‘పద్మశ్రీ’ బిరుదు రాలేదు. ప్రైవేట్‌వాళ్లు బహూకరించే ‘సేవారత్న’ కూడా లేదు. జీవన సాఫల్య పుర స్కారం లేనేలేదు. అయినప్పటికీ ఆయన మరణవార్తకు తెలుగు మీడియా తగిన ప్రాధాన్యమిచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన ఒక స్కూల్ టీచర్ పెద్దకొడుకు అక్కిరాజు హరగోపాల్ ఉరఫ్ ఆర్కే. వరంగల్ ఆర్ఈసీ (ప్రస్తుతం ఎన్ఐటీ)లో ఇంజనీరింగ్ చదివాడు. అప్పట్లో తెలి వైన విద్యార్థులకే ఇంజనీరింగ్‌లో సీటు దొరికేది. ఆర్ఈసీలో ఆ సీటు సంపాదించడమంటే మరింత నాణ్యమైన సరుకని అర్థం. ‘జనజీవనస్రవంతి’లోనే అతను కొనసాగి ఉన్నట్లయితే ‘నాణ్య మైన’ జీవితాన్నే గడిపి ఉండేవాడు. జీవన సాఫల్య పురస్కారా ల్లాంటివి కూడా లభించి ఉండేవేమో! ఆ రోజుల్లో ఉన్నత విద్యాసంస్థల్లోని విద్యార్థులపై కమ్యూనిస్టు తీవ్రవాద భావజాల ప్రభావం బలంగా ఉండేది. చేగువేరా వేగుచుక్కలా కనిపించేవాడు. జార్జిరెడ్డి ఆదర్శం ఉత్తే జితం చేసేది. వందలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఆ బాట వెంట పయనమయ్యారు. ఉద్యోగాలు, విలాసవంత మైన జీవితావకాశాలను తృణప్రాయంగా వదిలేశారు. వారిలో ఆర్కే ఒకరు. సమష్టిగా ప్రజలందరికీ చెందవలసిన భూమి, ప్రకృతి, సహజ వనరులపై కొందరి పెత్తనమేమిటనే ప్రశ్నలోంచే కమ్యూ నిస్టు సిద్ధాంతం పుట్టింది. ఆ కొంతమంది వ్యక్తుల ‘దోపిడీ’ కారణంగానే అత్యధిక ప్రజానీకం పేదరికంలో మగ్గవలసి వస్తున్నదని అది నిర్ధారించింది. అటువంటి ‘దోపిడీ వ్యవస్థ’ను కూలదోసి, సమసమాజాన్ని ఏర్పాటుచేసే మార్గాలను ఉపదేశిం చింది. అనుసరించవలసిన ఆ మార్గాలపై ఏర్పడిన భిన్నాభిప్రా యాల ఫలితంగా పార్లమెంటరీ కమ్యూనిస్టులూ, విప్లవ కమ్యూనిస్టులుగా చీలిపోయారు. ఈ రెండు భాగాల్లోనూ మరో రెండు డజన్లకు పైగా చీలికలున్నాయి. విప్లవ కమ్యూనిస్టుల్లో ప్రధాన పాయగా ఉన్న మావోయిస్టు పార్టీలో ఆర్కే పొలిట్ బ్యూరో సభ్యుడు. తెలంగాణ నుంచి బెంగాల్ వరకు 8 రాష్ట్రాల్లో మూడు దశాబ్దాల పాటు మావోయిస్టులకు, ప్రభుత్వాలకు మధ్య నడుమ యుద్ధం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో జీవితాలు కల్లోలిత మయ్యాయి. వేలాదిమంది ప్రజలు, పోలీసులు, విప్లవకారులు ఈ కల్లోలానికి బలయ్యారు. మావోయిస్టులు – ప్రభుత్వాల మధ్య శాంతి చర్చలు జరిగితే ఈ హింసాకాండను కొంతమేరకు కట్టడి చేయొచ్చని కొందరు తటస్థ మేధావులు భావించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు. ఆ చర్చల సమ యంలోనే ఆర్కే మీడియా దృష్టిని ఆకర్షించారు. చర్చల్లో మావోయిస్టు బృందానికి నాయకత్వం వహించారు. ఫలితంగా మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లోకి అందరికంటే ఎక్కువ మీడియా సంపర్కం ఆర్కేకు ఏర్పడింది. ఆయన ఫొటోలు, జీవిత విశే షాలు మీడియా వద్ద సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన వివరాలను మీడియా ప్రజలకు తెలియజేయగలిగింది. ఆర్కే మరణవార్త మావోయిస్టు పార్టీ స్థితిగతులపై చర్చను రేకెత్తిస్తుంది. ఆ చర్చ కమ్యూనిస్టు మూలసిద్ధాంతాలను కూడా తడుముతుంది. ప్రస్తుత ప్రపంచంలో, మన దేశంలో ఉన్న పరిస్థితులకు ఆ సిద్ధాంతాలు ఏ మేరకు నప్పుతాయనే అంశం కూడా చర్చల్లోకి రాకుండా ఉండదు. ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకొని వందేళ్లయింది. వందేళ్లలో సమాజంలో అసమానతలు తగ్గాయా? తగ్గలేదు పెరిగాయని స్వతంత్ర అంతర్జాతీయ సంస్థలు సాక్ష్యాధారాలతో లెక్కలు కట్టి మరీ చెబుతున్నాయి. ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ తాజా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 90 శాతం మంది ఉమ్మడి సంపద ఎంత ఉంటుందో ఒక్క శాతం కుబేరుల సంపద అంతకంటే ఎక్కువగా ఉందట. మన దేశంలో 119 మంది బిలియనీర్ల సంపద 130 కోట్ల మంది తలరాతలు రాసే భారతదేశ వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువట. కనీస వేతనంపై పనిచేసే ఒక కార్మికుడు మన దేశంలోని ఒక కార్పొరేట్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ సంపాదించినంత డబ్బు సంపాదించాలంటే 941 ఏళ్ళ పాటు పనిచేయాలట. కోవిడ్ తర్వాత ఈ అసమానతలు మరింత పెరిగాయి. ఆక్స్‌ఫామ్ అంచనా ప్రకారం ఈ ఆర్థిక సంక్షోభంలో కోల్పోయిన సంపదను కుబేరులు ఇప్పటికే భర్తీ చేసుకున్నారు. మెజారిటీ పేదవర్గాల ప్రజలు కోలుకోవడానికి మాత్రం ఇంకో పదేళ్లయినా పడు తుందట. అసమానతలు మరింత పెరిగే విధానాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో అమలవుతున్నాయి. ప్రభుత్వరంగ పరిశ్రమ లను ఒక్కొక్కటిగా ప్రైవేటు రంగానికి కారుచౌకగా కట్ట బెడు తున్నారు. బ్యాంకుల్లో ఉన్న ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచు కున్న ప్రబుద్ధులను విమానాలు ఎక్కించి విదేశాలకు పంపిస్తు న్నారు. లేదా రాజ్యసభ సభ్యత్వమిచ్చి సత్కరిస్తున్నారు. రైతు లకు అండగా ఉన్న భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారు. కార్మికులతో 12 గంటలపాటు పని చేయించుకు నేందుకు అనువుగా లేబర్ చట్టాలను మార్చారు. ఉద్యోగ భద్రత ఊసు మాత్రం అందులో లేదు. రైతులు ససే మిరా అంటున్నా వినకుండా వ్యవసాయ చట్టాలను మోసు కొచ్చారు. ఈ చట్టాల అంతిమ ధ్యేయం మెజారిటీ రైతులను వ్యవసాయరంగం నుంచి వెళ్లగొట్టడమేనని నిపుణులు అభిప్రా యపడుతున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను జీపుతో తొక్కించి నాలుగు నిండు ప్రాణాలు తీశాడు ఓ కేంద్ర మంత్రి కుమారుడు. ఇప్పటికీ సదరు కేంద్ర మంత్రి పదవిలోనే కొన సాగుతున్నాడు. వారం రోజులపాటు మీనమేషాలు లెక్కించి గానీ అతడి కుమారుడిని అదుపులోకి తీసుకోలేదు. అదే, మైనా రిటీ మతస్థుడైన సూపర్‌స్టార్ కొడుకు విషయంలో ఆగమేఘాల మీద చట్టం తన పని తాను చేసుకొనిపోయింది. జాతీయస్థాయి ప్రత్యామ్నాయంగా రూపొందడానికి వామ పక్ష రాజకీయాలకు అనువైన కాలమిది. కానీ దేశంలో మావోయి స్టులతో సహా కమ్యూనిస్టు పార్టీలన్నీ అవసానదశకు చేరుకుం టున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. వ్యూహాల్లోనూ, ఎత్తుగడ ల్లోనూ ఆ పార్టీలు దశాబ్దాలుగా విఫలమవుతూనే వస్తున్నాయి. అదే పరంపర ఇప్పుడూ కొనసాగుతున్నది. కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ లాంటి యువ నాయకులను పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్‌కు ఎర్రరంగు పులమాలని రాహుల్ గాంధీ ఉత్సాహ పడుతున్నారు. కానీ మధ్యేవాదమే కాంగ్రెస్ బలమనే చరిత్ర పాఠాన్ని ఆయన అర్థం చేసుకోలేదు. ఫలితంగా మత శక్తుల ప్రాబల్యం పెరిగినప్పుడు కాషాయరంగు పూసుకోవడం, వాటికి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పుడు ఎర్రరంగు కోసం వెతకడం వంటి ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. జాతీయస్థాయి ప్రత్యామ్నా యంగా నిలబడగలిగే అవకాశాలను ఆయనే స్వయంగా దెబ్బతీసుకుంటున్నారు. ఇప్పుడు జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఎవరంటే ప్రాంతీయ పార్టీలే. ఇదొక విచిత్ర పరిస్థితి కానీ యథార్థం. ఇప్పుడు కేంద్ర విధానాలపై గొంతు విప్పుతున్నది ప్రాంతీయ పార్టీలే. తాజా విద్యుత్ సంక్షోభంలోనూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించిన తర్వా తనే జాతీయ ప్రతిపక్ష నేతలు మేల్కొన్నారు. ఇప్పుడు అధి కారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో చాలావరకు ఉదారవాద ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తున్నాయి. నిఖార్సయిన లౌకిక విధానాలను అవలంబిస్తున్నాయి. దళితులు, గిరిజ నులు, వెనుకబడిన వర్గాలను సాధికార శక్తులుగా మలిచేందుకు తరతమ తేడాలతో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో అందరి కంటే ముందున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పైసా ఖర్చు లేకుండా ఉన్నతస్థాయి వరకూ నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చి ఒక విప్లవానికి ఆ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉన్నతస్థాయి ప్రైవేట్ స్కూళ్లలో ఉండే వసతులను అందుబాటులోకి తెస్తున్నది. ఈ కార్య క్రమంలో ఇప్పటికే ఒక దశ పూర్తయింది. ప్రతి క్లాస్‌కూ ఒక టీచర్, ప్రాథమికోన్నత స్థాయి నుంచి ప్రతి సబ్జెక్టుకూ ఒక టీచర్ ఉండేవిధంగా ఏర్పాటు చేసింది. మాతృభాషను ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇంగ్లిషును ప్రాథమిక స్థాయి నుంచే బోధనాభాషగా ప్రవేశపెట్టింది. ఫలితంగా రాబోయే తరం పేద విద్యార్థులు నిండైన ఆత్మవిశ్వాసంతో సంపన్నుల పిల్లలతో సమాన స్థాయిలో పోటీపడి నెగ్గగలుగు తారు. విజేతలు కాగలుగుతారు. సాధికార శక్తులుగా తమను తాము నిర్మించుకోగలుగుతారు. అప్పుడు వనరుల అసమాన పంపిణీ వ్యవస్థను వారు సవాల్ చేయగలరు. ఒక ప్రత్యా మ్నాయ సంస్కృతిని నిర్మించగలరు. ప్రభుత్వ వైద్య రంగంలో సోషలిస్టు క్యూబాను తలపించే విధమైన విస్తరణనూ, ఆధునికీకరణనూ ప్రభుత్వం ప్రారం భించింది. ప్రతి కుటుంబాన్నీ, ప్రతి రోగినీ నెలలో ఒకసారైనా వైద్యుడే స్వయంగా వారివద్దకే వెళ్లి పలకరించే ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ముఖ్యమంత్రి స్వయంగా రూపొందించారు. ఇది జనవరి 26 నుంచి అమలులోకి రావాలని ఆయన ఆశిస్తున్నారు. అట్లాగే వ్యవసాయ రంగం కూడా. ఒక విప్లవాన్ని ప్రసవించ బోతున్నది. ఊరూరా నెలకొంటున్న ఆర్బీకే సెంటర్లే ఈ ప్రస వానికి మంత్రసానులు. చిన్న రైతును స్వయంపోషకం గావించ గలిగే మహత్తర సామర్థ్యంతో ఆర్బీకే సెంటర్లు పనిచేయ నున్నాయి. నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి వ్యవసాయ ఆహార విభాగం ఉన్నతాధికారులు, ఏపీ అధికారులను పిలిపించుకొని మరీ ఆర్బీకేల ప్రజంటేషన్ తిలకించారు. హర్షధ్వానాలు చేశారు. సగం జనాభాగా ఉన్న మహిళా శక్తిని ఎంపవర్ చేయడాన్ని ఒక అతి ప్రాధాన్యాంశంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్దేశిం చుకున్నది. చంద్రబాబు వాగ్దాన భంగం వల్ల మరణావస్థకు చేరిన ‘మహిళా పొదుపు సంఘా’లను ఈ ప్రభుత్వం పునరు జ్జీవింపజేసింది. నడివయసు మహిళలకు అండగా నిలబడి, వారు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు చేయూతనందిస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి నామినేషన్ పదవుల్లోనూ, పనుల్లోనూ రిజర్వేషన్ కల్పిం చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాలను సాధికారిక శక్తులుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల కమ్యూనిస్టుల వైఖరి ఏ విధంగా ఉండాలి? పేద వర్గాల పట్ల అనుకూలంగా కదా ఉండవలసింది! ఆంధ్రప్రదేశ్‌లోని కమ్యూనిస్టు పార్టీల్లో ముఖ్యంగా ఒక పార్టీ వైఖరి ఆశ్చర్యం గొలుపుతున్నది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన రాజధాని భూసమీకరణలో దాగివున్న కుంభకోణాన్ని అంగీకరించడానికి ఈ పార్టీ నిరాకరిస్తున్నది. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న ఒడంబడికలో ఇమిడి ఉన్న దుర్మార్గమైన అంతర్జాతీయ స్కామ్‌ను అంగీక రించడానికి తటపటాయిస్తున్నది. పైపెచ్చు తెలుగుదేశం పార్టీతో కలిసి రాజధాని ఉద్యమాన్ని మొదలుపెట్టింది. రైతులూ, డ్వాక్రా మహిళల పట్ల చంద్రబాబు వాగ్దాన భంగాన్ని విస్మరిస్తున్నది. మహిళలూ, బలహీన వర్గాల పట్ల బాబు వ్యతిరేక వైఖరి పలుమార్లు బహిరంగంగా వ్యక్తమైనప్పటికీ ఆ పార్టీ తప్పు పట్టలేదు. ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం వరస మారింది. ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రజానుకూల కార్యక్రమాలను చూడటానికి నిరాకరిస్తూ కళ్ళు మూసుకుంది. అలా వాల్చిన కనురెప్పల మాటున వారికొక గొప్ప సత్యం సాక్షాత్కరించింది. డ్రగ్స్ మాఫియాతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి సంబంధం ఉందట. బట్టకాల్చి మీద వేసినట్టు తెలుగుదేశం పార్టీ చేసిన అడ్డగోలు ఆరోపణ ఇది. దాన్నే మన కామ్రేడ్ నారాయణ ‘కోరస్’గా అందుకున్నారు. కమ్యూనిస్టులు కూడా నిరాధా రమైన ఎంగిలి ఆరోపణలు చేయవచ్చునా? ఒక్క వర్షానికే కొట్టుకొనిపోయే రోడ్లువేసి కాంట్రాక్టర్ల జేబులు నింపడాన్ని అభివృద్ధిగా గుర్తించి, సకలజన సాధికారతా యజ్ఞాన్ని గుర్తించక పోవడం ఒక జన్యు లోపంగా పరిగణించవలసి ఉంటుంది. 30 లక్షల మంది పేద మహిళలకు ఇళ్లు కట్టించే బృహ త్తరమైన మానవీయ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ప్రారం భించింది. దాన్ని అడ్డుకోవడం కోసం చంద్రబాబు కోర్టుకెక్కించి ఆపించాడు. ఇది తప్పని కామ్రేడ్ నారాయణకు తోచకపోవడం చిత్రం. తాకట్టు గురించి ఆయన మాట్లాడిన తీరు ఆయన పట్ల చాలా అనుమానాలకు తెరతీసింది. ఆస్తుల తాకట్టు సంగతేమో గానీ సిద్ధాంతాలను తాకట్టుపెట్టడం అత్యంత హేయమైన విష యమని గ్రహిస్తే మంచిది. వైఖరి మార్చుకొని వెంటనే ప్రజల పక్షాన నిలబడకపోతే ఒక మహత్తర చరిత్ర కలిగిన పార్టీని భ్రష్టు పట్టించిన వాళ్లవుతారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఆర్కే అంత్యక్రియలు.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
సాక్షి, అమరావతి: మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే అంత్యక్రియలు ముగిశాయి. మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దులో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపింది. పామేడు-కొండపల్లి సరిహద్దులో నిర్వహించిన ఈ అంత్యక్రియలకు మావోయిస్టులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులర్పించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తిచేసినట్టు తెలిసింది. -
మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి?
రాయ్‌పూర్: మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్.కె అనారోగ్యంతో మృతి చెందినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అక్కి రాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే అనారోగ్య కారణాలతో బీజాపూర్ అడవుల్లో మృతిచెందినట్టుగా ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెప్తున్నారు. గత మూడేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆర్కే తుదిశ్వాస విడవడంతో మావోయిస్టు పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది. నాలుగు దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన ఆర్కే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగిన శాంతి చర్చల్లో కీలక పాత్ర వహించారు. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఆర్కే తలపై రూ.కోటి రివార్డు కూడా ఉంది. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆయన కీలక సూత్రధారిగా ఉన్నారు. ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా తుమృకోట. ఎన్నోసార్లు ఇలాంటి వార్తలే.. ఆర్కే చాలాసార్లు పెద్ద పెద్ద ఎన్కౌంటర్ల నుంచి చివరి నిమిషంలో తప్పించుకున్నారు. భారీ ఎన్కౌంటర్ జరిగిన ప్రతీసారి ఆర్కే చనిపోయారా? లేదా బతికే ఉన్నారా? అనే చర్చ కూడా నడుస్తూ ఉండేది. కానీ, మళ్లీ ఆయన కదలికలు మొదలయ్యేవి. అయితే, ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో తాజాగా వెలువడుతున్న వార్తలు ఆ పార్టీ సానుభూతిపరులను నైరాశ్యంలో ముంచాయి. అయితే, ఆర్కే మరణ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలాఉండగా.. కీలక నేతల వరుస మరణాలు మావోయిస్ట్ పార్టీ ని అయోమయంలో పడేశాయి. కరోనాతో పాటు అనారోగ్య సమస్యల తో ఒక్కొక్కరు గా నేతలు చనిపోతూ ఉండటం ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది. (చదవండి: అమీర్‌పేట్‌లో ఉద్రిక్తత.. ప్రోటోకాల్ రగడ) (చదవండి: సాంబారు రుచిగా లేదని తల్లి, సోదరిని చంపిన కిరాతకుడు) -
మావోయిస్టు నేత ఆర్కే అసమర్థుడు
సాక్షి, హైదరాబాద్: లొంగిపోయిన మావోయిస్టుపార్టీ కీలకనేత కోటి పురుషోత్తం ఆ పార్టీ అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గణపతిలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్కే అసమర్థుడని, ఆయనకు స్వార్థం ఎక్కువని, ఎదుటివారిని ఎదగనీయడని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిలో పాత్రధారులం కావాలనే ఆకాంక్షతోనే జనజీవన స్రవంతిలోకి వచ్చామన్నారు. ఇటీవల ఏపీలోని విశాఖ ఏజెన్సీలో జరిగిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలు ఘోర తప్పిదాలని అన్నారు. వీటిపై పార్టీలో విభేదాలు ఉన్నాయని, అందుకే ఇప్పటివరకు ఈ హత్యలపై మావోయిస్టులు ప్రకటన చేయలేకపోయారన్నారు. పాతికేళ్లు ఆర్కే, గణపతిలతో సన్నిహితంగా మెలిగానంటున్న పురుషోత్తం మీడియా సమావేశంలో పలు విషయాలు చెప్పారు... ‘స్వయంగా ఎదిగిన ఏకలవ్యుడి వేలు కోరే ద్రోణాచార్యులు, నమ్మించి చంపే బాహుబలిలోని కట్టప్ప లాంటి వాళ్లకు పార్టీలో కొదవ లేదు. కొన్నేళ్లుగా నేను, నా భార్య వినోదిని ఈ రెంటికీ గురయ్యాం. సుదీర్ఘకాలం ఆర్కే, గణపతిలతో కలసి ఉన్నా పార్టీ మమ్మల్ని నిర్లక్ష్యం చేసింది. వేరే రాష్ట్రంలో ఉంచి అక్కడ నుంచి రావద్దంటూ డబ్బు పంపకుండా వేధించింది. అక్కడ ఎలా ఉండా లో అర్థం కాక ఎన్నో లేఖలు రాశాం. ఏ జవాబు లేదు. పార్టీలో ఎవరి మేలు వారు చూసుకుంటున్నారు. అగ్రనాయకత్వం ఒడిదుడుకుల్లో ఉంది. పదేళ్లుగా ఆర్కే, గణపతి మారతారని ఎదురుచూశాం. అనేక సందర్భాల్లో వారిద్దరూ నా భార్య వినోదిని చేతివంట తిన్నారు. ఆమె పదేళ్లుగా అనారోగ్యంతో ఉందని తెలిసినా వారు పట్టించుకోలేదు. పార్టీలో మానవసంబంధాలు కనుమరుగయ్యాయి. అందుకే ఉద్యమం ప్రస్తుతం ఆదివాసీలకే పరిమితమైంది. కార్యక్రమాల్లో ఉన్న లోపాల కారణంగానే యువత, విద్యార్థులు పార్టీలోకి రావట్లేదు. వారు లేకుండా ఉద్యమం ఎక్కువకాలం నడవదు. అగ్రనేతలు 2007 లో ఏపీ(ఉమ్మడి) నుంచి సెట్‌బ్యాక్, రిట్రీట్ అంటూ ప్రకటించారు. వారి విజన్ దెబ్బతినడంతోనే అప్పటి నుంచి ముందుకు పోలేకపోతున్నారు. మాలాగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీ క్యాడర్ మమ్మల్ని కలిసినప్పుడు బాధపడ్డారు. పదేళ్లుగా సెంట్రల్ కమిటీకీ ఉత్తరాలు రాస్తున్నా స్పందనలేదు. 1969, 1972ల్లో జరిగిన తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నాను. నా జీవితంలో తెలంగాణ వస్తుందని అనుకోలేదు. 1946 నుంచి 2014 వరకు తెలంగాణ విధ్వంసమైంది. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వల్ల 2014 నుంచి అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి ప్రజల్లో కొనుగోలుశక్తి పెరిగింది. ఆసరా, రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అద్భుతం గా ఉన్నాయి. రాష్ట్రం కోసం మా వంతుగా సాయం చేయాలని ఆశిస్తున్నాం’అని పురుషోత్తం అన్నారు. బయటి రాష్ట్రంలో ఉండగా తాను ప్రింటింగ్ ప్రెస్ నడిపానని వినోదిని చెప్పారు. 2000లో తాను అనారోగ్యానికి గురైనా పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం తమను పట్టించుకుంటే అందులో కొనసాగేవారమే. కానీ, ఇప్పుడిక సాధ్యం కాదని స్పష్టం చేశారు. మరింత మంది ముందుకు రావాలి ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను ఎత్తి చూపిస్తోంది. అజ్ఞాతంలో ఉన్న మరికొంత మంది మావోయిస్టు పార్టీ నేతలు పురుషోత్తం, వినోదినిలను స్ఫూర్తిగా తీసుకుని బయటకు రావాలి. బయటికి వచ్చినవారికి పోలీసులు అన్ని విధాలుగా సహకరిస్తారు. వారిపై ఉన్న రివార్డు మొత్తాలు వారికే అందించడంతోపాటు చిన్న, చిన్న ఉద్యోగాలు సైతం ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. – అంజనీకుమార్, పోలీసు కమిషనర్ -
అప్పుడు గ్రేహౌండ్స్.. ఇప్పుడు మావోలు
► 2008లో లాంచీలో వెళ్తున్న గ్రేహౌండ్స్ సిబ్బందిపై మావోయిస్టుల దాడి ► ఆ దాడిలో 38 మంది మృతి.. నీటి కారణంగానే భారీ ప్రాణనష్టం సాక్షి, హైదరాబాద్: దాదాపు ఎనిమిదేళ్ల కిందట బలిమెల రిజర్వాయర్‌లో గ్రేహౌండ్స్ భారీగా నష్టపోవడానికి కారణమైన ‘నీరు’ ఇప్పుడు ఏఓబీలో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతీసింది. ఆ ప్రాంత భౌగోళికాంశాలపై పూర్తి పట్టున్న ఉదయ్, దయ లాంటి వాళ్లూ చనిపోవడానికి కారణమైంది. 2008 జూన్ 29న విశాఖపట్నం జిల్లా బలిమెల రిజర్వాయర్‌లో లాంచీలో వెళ్తున్న గ్రేహౌండ్స్ బలగాలపై కొండ పైనుంచి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఆ సమయంలో లాంచీలో ఉన్న 64 మంది గ్రేహౌండ్స్ సిబ్బందిలో లాంచీ డ్రైవర్‌తోసహా 38 మంది చనిపోయారు. దాడి జరిగిన సమయంలో లాంచీలో ఉన్న వారు బయటపడాలనే ఉద్దేశంతో నీళ్లలోకి దూకేశారు. దీంతో ఎదురుదాడికి వారికి ఆస్కారం లేకుండా పోయింది. మావోయిస్టులు రిజర్వాయర్ చుట్టూ ఉన్న ఎత్తై కొండలపై మాటు వేయడంతో దాడి చేయడం వారికి తేలికైంది. దీంతో గ్రేహౌండ్స్ చరిత్రలో మర్చిపోలేని, పోలీసులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అదే తరహాలోనే..: తాజా ఎన్కౌంటర్ సైతం దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే, బలిమెలకు సమీపంలోనే జరిగింది. క్యాడర్‌కు కమాండో శిక్షణ ఇస్తున్న మావోయిస్టులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఏఓబీ మావోయిస్టులకు కంచుకోట. చాలా కాలంగా పార్టీ అగ్రనేతలు అక్కడే సురక్షితంగా ఉంటున్నారు. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు ఎప్పుడు ప్లీనరీలు, ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించాలన్నా ఏఓబీనే ఎంచుకుంటారు. భద్రత కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేసుకుంటారు. మందుపాతరల ఏర్పాటు సహా మూడంచెల ఉంటుంది. ఈ శిక్షణ శిబిరంపై సమాచారం అందుకున్న గ్రేహౌండ్, ఎస్ఓటీ బలగా లు వారం రోజులుగా ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సోమవారం గుట్టల నుంచి కిందికి వెళ్తున్న సమయంలో మావోయిస్టులు కనిపించారు. బలగాల కదలికల్ని గుర్తించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. క్రమంలో సెంట్రీ విధు ల్లో ఉన్న మావోయిస్టులు పారిపోయేందుకు యత్నించారు. అయితే వీరున్న ప్రాంతానికి రెండు వైపులా వాగు ఉండటంతో హడావుడిలో అందులోకి దూకేశారు. దీంతో మావోయిస్టులు పూర్తిస్థాయిలో ఎదురుదాడి చేయలేకపోయారు. బలగాలు ఎత్తులో ఉండటంతో ఎన్కౌంటర్ తేలికైంది. దీంతో మావోయిస్టుల ఉద్యమ చరిత్రలోనే భారీగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ఇప్పటికి చాలాసార్లు పోలీసు దాడుల నుంచి తప్పించుకున్నారు. ఈ ఎన్కౌంటర్ నుంచి కూడా ఆయన సురక్షితంగా తప్పించుకున్నట్లు సమాచారం. -
మల్కన్‌గిరి అడవుల్లో ఆర్కే కదలికలు?
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్.. అలియాస్ ఆర్కే చాలా కాలం తర్వాత మళ్లీ ఏఓబీలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లాలోగల జంత్రి అనే ప్రాంతంలో జరిగిన ఓ సమావేశంలో ఆర్కే కనిపించినట్లు చెబుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కూడా అయిన ఆర్కే.. అంత సాధారణంగా బయటకు కనిపించరు. సరిగ్గా జంత్రి ప్రాంతంలోనే 2011లో అప్పటి మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మళ్లీ ఇప్పుడు అదే ప్రాంతంలో ఆర్కే కదలికలు కనిపించాయంటే ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది. మల్కన్‌గిరి - కోరాపుట్ - విశౄఖ సరిహద్దు డివిజన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు సలీం, బెంగాల్ నాయకులు సుధీర్, అనిల్, నవీన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారని, దీనికి దాదాపు వెయ్యి నుంచి 1500 మంది వరకు గ్రామస్థులు హాజరయ్యారని అంటున్నారు. 2010లో కోరాపుట్ ప్రాంతంలో తన భార్య అరెస్టయినప్పటి నుంచి ఆర్కేకు సంబంధించిన విషయాలు ఏవీ పెద్దగా బయటకు రావడం లేదు. ఆయన గత ఏడేళ్లుగా స్పాండిలైటిస్ తదితర ఇబ్బందులతో బాదపడుతున్నట్లు తెలిసింది. అందుకే భద్రత కోసం ఆయనను ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం ప్రాంతానికి పంపినట్లు కూడా చెబుతున్నారు. మల్కన్‌గిరి ప్రాంతం ఎప్పటినుంచో మావోయిస్టులకు కంచుకోట. దాని భౌగోళిక పరిస్థితుల కారణంగా అక్కడకు సులభంగా చేరుకోవడం, అక్కడి నుంచి అంతే సులభంగా తప్పించుకోవడం వాళ్లకు బాగా అలవాటని, అక్కడకు మావోయిస్టు అగ్రనేతలు వచ్చినట్లు తమకు కూడా సమాచారం ఉందని యాంటీ నక్సల్ విభాగం అధికారులు అంటున్నారు. -
మావోల దుర్గం బెజ్జంగి
చుట్టూ నీటితో ద్వీపాల సమూహం బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ప్రాంతం మావో అగ్రనేతలకు స్థావరం విశాఖపట్నం భౌగోళికంగా చిన్నచిన్న ద్వీపాల సమూహాన్ని తలపిస్తుంది బలిమెల బ్యాక్‌వాటర్‌తో ‘అన్యులకు’ అంతుచిక్కుండా ఉంటుంది చుట్టూ దట్టమై అడవులతో శత్రుదుర్బేధ్యంగా అనిపిస్తుంది వేలాదిమంది గిరిజనులు ఆవాసప్రాంతంగా నిలుస్తోంది అందుకే అది మావోయిస్టులకు రక్షాకవచంగా మారింది అదే బెజ్జంగి.! ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఈ అటవీప్రాంతం మావోయిస్టులకు పెట్టనికోటగా మారింది. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్(ఆర్కే), మల్కనగిరి జిల్లా కమిటీ కార్యదర్శి ఉదయ్‌లతోపాటు కీలక నేతలందరికీ ఈ ప్రాంతమే స్థావరంగా మారింది. కాని బెజ్జంగిపై పట్టు సాధించడం ఏపీ, ఒడిశా, కేంద్ర పోలీసు బలగాలకు సాధ్య పడటం లేదు. ఆ అట వీప్రాంతం మావోయిస్టులకు కొట్టిన పిండి. మరోవైపు వేలాదిమంది గిరిజనులను మావోయిస్టులు తమ రక్షాకవచంగా వాడుకుంటున్నారు. అందుకే ఆర్కే, ఉదయ్‌లతోపాటు కీలక నేతలు బెజ్జంగిలోనే ఉన్నారని భావిస్తున్నా పోలీసులు సాహసించి ఆపరేషన్ నిర్వహించలేకపోతున్నారు. గిరిజనులే రక్షాకవచం బేజింగ్ అటవీప్రాంతంలోని 188 గ్రామాల్లో దాదాపు 12వేలమంది గిరిజనులు ఉన్నారు. 1959-60లలో మాచ్‌ఖండ్ విద్యుత్తు కేంద్రం నిర్మించినప్పుడు ఆ ప్రాంతం నుంచి గిరిజనులను ఇతర ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాని తమ ప్రాంతాన్ని వదిలి వెళ్లేందుకు చాలామంది గిరిజనులు సమ్మతించ లేదు. అతికష్టం మీద దాదాపు 10వేలమంది గిరిజనులను ఒప్పించి ఇతర ప్రాంతాల్లో పునరావసం కల్పించారు. తరలిరావడానికి సమ్మతించని 8 వేల మందికిపైగా గిరిజనులు బెజ్జంగిలో ఉండిపోయారు. ఆ గిరిజన జనాభా ప్రస్తుతం దాదాపు 12వేలకు చేరుకుంది. ఆ గిరిజనులు మావోయిస్టులకు తప్ప, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఈ గిరిజనులు తమ గ్రామాల్లోకి రానివ్వరు. ప్రభుత్వ అధికారులు కూడా రావడానికి ఇష్టపడరు. 2011లో మల్కనగిరి కలెక్టర్‌గా ఉన్న వినీల్ కృష్ణ బెజ్జంగి అటవీప్రాంతంపై ప్రత్యేక దృష్టిసారించారు. బెజ్జంగిలోని గ్రామాల్లో రోడ్లు నిర్మించాలని, బాహ్య ప్రపంచంతో రాకపోకలకు అవకాశం కల్పించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. దాంతో మావోయిస్టులు వినీల్ కృష్ణను కిడ్నాప్ చేసి సంచలనం సృష్టించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి ఆయన్ని విడిపించుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి బెజ్జంగి అటవీప్రాంతంలో రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించాలన్న ప్రతిపాదన పూర్తిగా మరుగునపడిపోయింది. పోలీసు బలగాలు భారీ ఆపరేషన్లకు వ్యూహం పన్నిన ప్రతిసారి మావోయిస్టులు ఈ గిరిజనులను ముందు వరుసలో నిలిపి రక్షాకవచంగా ఉపయోగించుకుంటున్నారు. మరోవైపు బెజ్జంగిలోని గ్రామాల్లోకి చొచ్చుకుపోవాలంటే బలిమెల బ్యాక్వాటర్గుండాగాని, వాగుల గుండాగాని ప్రయాణించాలి. అలా నదిలో ప్రయాణిస్తే మావోయిస్టులకు సులువుగా లక్ష్యంగా మారతారు. 2008లో బలిమెల బ్యాక్‌వాటర్‌లో ప్రయాణిస్తున్న ఏపీ గ్రేహౌండ్స్‌పై మావోయిస్టులు ఒడ్డు నుంచి మెరుపుదాడి చేసి దారుణంగా దెబ్బతీశారు. ఈ దాడిలో 36మంది గ్రేహౌండ్స్ జవాన్లు మృతిచెందడం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ బెజ్జంగిపై ఆపరేషన్లకు పోలీసు బలగాలు వెనక్కుతగ్గాయి. నది ఒడ్డున రెండు ఔట్ పోస్టులు ఉన్నాయి. అక్కడి నుంచి కేవలం బెజ్జంగిపై నిఘా కార్యకలాపాలు మాత్రమే నిర్వహిస్తున్నాయి. అంతేగాని ఎలాంటి ఆపరేషన్లకు సాహసించడం లేదు. వాస్తవానికి బెజ్జంగి పరిధిలోని జోడంబ్లో ఓ పోలీస్ స్టేషన్ ఉంది. కాని ఆ పోలీస్ స్టేషన్ కేవలం నామమాత్రంంగా ఉంటుం ది. అక్కడి నుంచి ఎలాంటి ఆపరేషన్లుగాని ఇతరత్రా కార్యక్రమాలుగాని సాగవు. ఆర్కే స్థావరం అదేనా!? మావోయిస్టు అగ్రనేత ఆర్కే కొంతకాలంగా బెజ్జంగినే తన స్థావరంగా చేసుకున్నారని పోలీసు శాఖ భావిస్తోంది. అక్కడి నుంచే మావోయిస్టుల కార్యకలాపాల విస్తరణ, కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఆర్కే, ఉదయ్‌లతోపాటు కొందరు అగ్రనేతలు బెజ్జంగి పరిధిలోని గ్రామాల్లో పర్యటించి గిరిజనులతో సమావేశమయ్యారని కూడా సమాచారం. జనవరిలో భారీ ప్లీనరీ నిర్వహించాలని కూడా భావిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసు బలగాలు మరోసారి ఆపరేషన్ చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ‘ఏపీ, ఒడిశా పోలీసులు ఆపరేషన్ ఆల్ ఔట్’ చేపట్టాయి. కొన్ని రోజులుగా హెలికాఫ్టర్లతో దూరం నుంచే ఏరియల్ సర్వే నిర్వహించి మరీ ఆపరేషన్ చేపట్టినా బెజ్జంగిలో ప్రవేశించేందుకు సాహసించలేకపోయాయి. పనాసపట్టు ప్రాంతంలోని కొండపై ఉన్న మావోయిస్టులపై చెరోవైపు నుంచి ఏపీ, ఒడిశా పోలీసులు సోమవారం అంతా పలుసార్లు కాల్పులు జరిపినా ఏమాత్రం ప్రయోజనం లేకుండాపోయింది. మావోయిస్టులు ఎదురుకాల్పులకు దిగి సులువుగా అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసు బలగాలు మాత్రం వాగులను దాటి బెజ్జంగి గ్రామాల్లోకి చొచ్చుకుపోయేందుకు సాహసించలేదు. ఇక ఫలితం లేదని భావించిన ఏపీ బలగాలు మంగళవారం ఉదయం కాల్పులు విరమించి వెనక్కు వచ్చేశాయి. ఒడిశా పోలీసులు కూడా మంగళవారం మధ్యాహ్నం తరువాత ఆపరేషన్‌ను విరమించాయి. బలిమెల బ్యాక్‌వాటర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు గిరిజనులను మావోయిస్టులు అని భావించి ఒడిశా పోలీసులు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. దాంతో గిరిజనుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవడం కూడా ఆపరేషన్‌ను నిలిపివేయడానికి మరో ప్రధాన కారణం. ఏది ఏమైనప్పటికీ బెజ్జంగి అటవీప్రాంతం మాత్రం మావోయిస్టులకు పెట్టనికోటగా మారి పోలీసు బలగాలకు సవాలుగా విసురుతోంది. ప్రకృతి సహజ దుర్గం ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా పరిధిలోని దట్టమైన అటవీప్రాంతం బెజ్జంగి. జిల్లాలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలుగాని, రాకపోకలుగాని లేవు. పూర్తిగా కటాఫ్ ఏరియాగా ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు, వేగంగా ప్రవహించే లోతైన వాగులు, ఎత్తై కొండలతో అన్యులకు అంతుచిక్కుండా ఉంటుంది. బలిమెల రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఓ వైపు ఉంటుంది. మరోవైపు వాగులు, వంకలతో నిండిన నీరు చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపు 200కి.మీ. పరిధిలో 188 చిన్న గ్రామాలు ఉన్నాయి. అవన్నీ అందుపల్లి, జోడంబ్, పనసపుట్టు, రాళ్లగెడ్డ, బోనపుడ అనే ఐదు పంచాయతీల పరిధిలోకి వస్తాయి. నలువైపులా నదులు, వాగులు ప్రవహిస్తూ ప్రతి గ్రామం ఓ ద్వీపాన్ని తలపిస్తుంది. ఈ గ్రామాలను బాహ్య ప్రపంచంతో రాకపోకలకు ఎలాంటి బ్రిడ్జిలుగాని రోడ్డు మార్గంగాని లేదు. పూర్తిగా నాటు పడవలపైనే వెళ్లాలి. పక్కా రోడ్లు లేని ఈ గ్రామాల్లో రాకపోకలకు కాలిబాటలే శరణ్యం.