పామేడు– కొండపల్లి మధ్య ఆర్కే అంత్యక్రియలు  | Maoist Party Leader RK Funeral In Chhattisgarh | Sakshi
Sakshi News home page

పామేడు– కొండపల్లి మధ్య ఆర్కే అంత్యక్రియలు 

Published Sun, Oct 17 2021 1:44 AM | Last Updated on Sun, Oct 17 2021 1:45 AM

Maoist Party Leader RK Funeral In Chhattisgarh - Sakshi

చర్ల/టంగుటూరు: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ (ఆర్కే) మృతిని మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆర్కే మృతిపై గురువారమే కథనాలు వచ్చినా పార్టీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం శుక్రవారం వెలువడింది. ఆయన గురువారం ఉదయం కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందగా శుక్రవారం మధ్యాహ్నం పార్టీ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించినట్లు ఆ ప్రకటన తెలిపింది.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా పామేడు – కొండపల్లి మధ్య అటవీ ప్రాంతంలో నిర్వహించిన అంత్యక్రియల ఫొటోలు, వీడియోలను శనివారం మావోయిస్టు పార్టీ మీడియాకు విడుదల చేసింది. ఆర్కే అంత్యక్రియల్లో బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పాలగూడ, గుండ్రాయి, కంచాల, మీనగట్ట, దామారం, జబ్బగట్ట తదితర గ్రామాల నుంచి సుమారు 2 వేల మందికిపైగా ఆదివాసీలతో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఆర్కే మృతి సమాచారాన్ని పార్టీ శ్రేణులు కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలకు తెలియజేయడంతో పాటు మిలీ షియా, గ్రామకమిటీ సభ్యుల ద్వారా వివిధ గ్రామాలకు చేరవేసి అంత్యక్రియలకు రావాలని సూచించడంతో ఆదివాసీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరలి వచ్చిన ఆదివాసీలతో పాటు మావోయిస్టులు ఆర్కేకు నివాళులర్పించి భారీ ర్యాలీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఉద్యమంలో నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన ఆర్కే మృతదేహాన్ని చూసి ఆదివాసీలు కన్నీటిపర్యంతమైనట్లు సమాచారం.

ఆర్కేకు ఘన నివాళి 
ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య శిరీష, కుటుంబ సభ్యులు, అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు శనివారం ఆర్కేకు నివాళులర్పించారు. ‘ఆర్కే మృతితో ఉద్యమం ఆగిపోదు. ఆయనలాంటి గెరిల్లా యుద్ధ వీరులు ఇంకా పుట్టుకొస్తారు’అని ఈ సందర్భంగా శిరీష అన్నారు. ఆయన ప్రజల కోసమే అమరుడయ్యారని విరసం నేత కల్యాణరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆర్కే మరణ వార్తను ధ్రువీకరించుకుని భార్య శిరీష, కుటుంబ సభ్యులు విలపించారు. ఇదిలా ఉండగా ఆర్కే పోలీసులకు లొంగిపోయుంటే ఆయనకు మంచి వైద్యం అందేదని, బతికేవాడని ఒడిశాలోని బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ పిళ్లై అభిప్రాయపడ్డారు.  

మంచి వైద్యం అందించినా..
పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కేకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య వచ్చిందని, డయాలసిస్‌ చేయిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్‌ కావడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన మృతి చెందారని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేర్కొన్నారు. ఆర్కేకు పార్టీ తరఫున మంచి వైద్యం అందించినా దక్కించుకోలేకపోయామని తెలిపారు. ఆర్కే మృతి చెందిన నేపథ్యంలో శుక్రవారం అభయ్‌ ఓ లేఖ విడుదల చేశారు.

పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అనారోగ్యంతో 14 అక్టోబర్‌ 2021న ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారని లేఖలో వెల్లడించారు. ఆయనకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలుకాగా, వెంటనే డయాలసిస్‌ ప్రారంభించినా కిడ్నీలు ఫెయిల్‌ కావడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడయ్యారని పేర్కొన్నారు. ఆయనకు విప్లవ శ్రేణుల మధ్యే శ్రద్ధాంజలి ఘటించి అంత్యక్రియలు పూర్తిచేశామని తెలిపారు.

కామ్రేడ్‌ రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటని, ధైర్యసాహసాలతో పార్టీకి, విప్లవోద్యమానికి నాయకత్వం అందించారని కొనియాడారు. పార్టీకి అన్ని రంగాల్లో సేవలందించారని వివరించారు. ఆర్కే సాధారణ జీవితం, ప్రజల పట్ల ప్రేమ, సహచరులపై ఆప్యాయత, విప్లవం పై స్పష్టత, దూరదృష్టి నుంచి యావత్‌ పార్టీ కేడర్‌ ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఆయన ఆశయసాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement