
( ఫైల్ ఫోటో )
రాయ్‌పూర్: మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్.కె అనారోగ్యంతో మృతి చెందినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అక్కి రాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే అనారోగ్య కారణాలతో బీజాపూర్ అడవుల్లో మృతిచెందినట్టుగా ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెప్తున్నారు. గత మూడేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆర్కే తుదిశ్వాస విడవడంతో మావోయిస్టు పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది.
నాలుగు దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన ఆర్కే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగిన శాంతి చర్చల్లో కీలక పాత్ర వహించారు. ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఆర్కే తలపై రూ.కోటి రివార్డు కూడా ఉంది. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆయన కీలక సూత్రధారిగా ఉన్నారు. ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా తుమృకోట.
ఎన్నోసార్లు ఇలాంటి వార్తలే..
ఆర్కే చాలాసార్లు పెద్ద పెద్ద ఎన్‌కౌంటర్ల నుంచి చివరి నిమిషంలో తప్పించుకున్నారు. భారీ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతీసారి ఆర్కే చనిపోయారా? లేదా బతికే ఉన్నారా? అనే చర్చ కూడా నడుస్తూ ఉండేది. కానీ, మళ్లీ ఆయన కదలికలు మొదలయ్యేవి. అయితే, ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో తాజాగా వెలువడుతున్న వార్తలు ఆ పార్టీ సానుభూతిపరులను నైరాశ్యంలో ముంచాయి. అయితే, ఆర్కే మరణ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలాఉండగా.. కీలక నేతల వరుస మరణాలు మావోయిస్ట్ పార్టీ ని అయోమయంలో పడేశాయి. కరోనాతో పాటు అనారోగ్య సమస్యల తో ఒక్కొక్కరు గా నేతలు చనిపోతూ ఉండటం ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది.
(చదవండి: అమీర్‌పేట్‌లో ఉద్రిక్తత.. ప్రోటోకాల్ రగడ)
(చదవండి: సాంబారు రుచిగా లేదని తల్లి, సోదరిని చంపిన కిరాతకుడు)
Comments
Please login to add a commentAdd a comment