Akkiraju haragopal alias Ramakrishna
-
ఆర్కే అంత్యక్రియలు.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
సాక్షి, అమరావతి: మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే అంత్యక్రియలు ముగిశాయి. మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దులో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపింది. పామేడు-కొండపల్లి సరిహద్దులో నిర్వహించిన ఈ అంత్యక్రియలకు మావోయిస్టులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులర్పించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తిచేసినట్టు తెలిసింది. -
మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి?
రాయ్‌పూర్: మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్.కె అనారోగ్యంతో మృతి చెందినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అక్కి రాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే అనారోగ్య కారణాలతో బీజాపూర్ అడవుల్లో మృతిచెందినట్టుగా ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెప్తున్నారు. గత మూడేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆర్కే తుదిశ్వాస విడవడంతో మావోయిస్టు పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది. నాలుగు దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన ఆర్కే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగిన శాంతి చర్చల్లో కీలక పాత్ర వహించారు. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఆర్కే తలపై రూ.కోటి రివార్డు కూడా ఉంది. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆయన కీలక సూత్రధారిగా ఉన్నారు. ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా తుమృకోట. ఎన్నోసార్లు ఇలాంటి వార్తలే.. ఆర్కే చాలాసార్లు పెద్ద పెద్ద ఎన్కౌంటర్ల నుంచి చివరి నిమిషంలో తప్పించుకున్నారు. భారీ ఎన్కౌంటర్ జరిగిన ప్రతీసారి ఆర్కే చనిపోయారా? లేదా బతికే ఉన్నారా? అనే చర్చ కూడా నడుస్తూ ఉండేది. కానీ, మళ్లీ ఆయన కదలికలు మొదలయ్యేవి. అయితే, ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో తాజాగా వెలువడుతున్న వార్తలు ఆ పార్టీ సానుభూతిపరులను నైరాశ్యంలో ముంచాయి. అయితే, ఆర్కే మరణ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలాఉండగా.. కీలక నేతల వరుస మరణాలు మావోయిస్ట్ పార్టీ ని అయోమయంలో పడేశాయి. కరోనాతో పాటు అనారోగ్య సమస్యల తో ఒక్కొక్కరు గా నేతలు చనిపోతూ ఉండటం ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది. (చదవండి: అమీర్‌పేట్‌లో ఉద్రిక్తత.. ప్రోటోకాల్ రగడ) (చదవండి: సాంబారు రుచిగా లేదని తల్లి, సోదరిని చంపిన కిరాతకుడు) -
ఆపరేషన్ ఆర్కే పేరుతో గాలింపు చర్యలు
సాక్షి, మల్కన్‌గిరి: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పరిసరాల్లో ఉన్నట్లు సమాచారం అందడంతో ఒడిశా పోలీస్ యంత్రాంగం కూంబింగ్ ముమ్మరం చేసింది. ఆర్కేతోపాటు మరో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు ఉదయ్, చలపతి కూడా ఇదే ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆపరేషన్ ఆర్కే పేరుతో గాలింపు మొదలుపెట్టారు. ఎస్‌వోజీ, డీబీఎఫ్‌లతో పాటు ఆంధ్ర గ్రేహౌండ్స్, తూర్పు గోదావరి జిల్లా పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉనికి కోసం మావోయిస్టుల యత్నాలు గతంలో చిత్రకొండ కటాఫ్ ఏరియా మావోయిస్టులకు అడ్డాగా ఉండేది. కానీ ఇప్పుడు కటాఫ్ ఏరియాలో రహదారుల నిర్మాణం జరగడం, అలాగే ఎక్కడికక్కడ బీఎస్ఎఫ్ క్యాంపులు ఏర్పాటై జవాన్లు నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తుండటంతో మావోయిస్టుల అలజడి తగ్గుముఖం పట్టింది. ఈ ప్రాంతంపై తిరిగి పట్టు సాధించేందుకు మావోయిస్టులు ఇక్కడ జరుగుతున్న రోడ్ల నిర్మాణాలను అడ్డుకోవడం, కాంట్రాక్టర్ల వాహనాలు కాల్చివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఈ ఏరియాలోనే ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈ నెల 15వ తేదీన చిత్రకొండ కటాఫ్ ఏరియాలో కూంబింగ్ చేపట్టగా ఎదురు కాల్పులు జరిగాయి. ఆ సమయంలో అగ్రనేతలు తప్పించుకున్నారు. అనంతరం మావోయిస్టు శిబిరం నుంచి పోలీసులు మావోల సామగ్రితో పాటు ఒక పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పెన్‌డ్రైవ్‌లో ఉన్న వివరాలను మాత్రం బయటకు పొక్కనివ్వలేదు. -
ఆర్కే ఎక్కడ?
►క్షేమంగానే ఉన్నారా.. ఉంటే ఎక్కడ ఉన్నట్లు! ► కొడుకు, గన్మెన్లు ఎన్కౌంటర్లో మృత్యువాత ►ఆర్కేపోలీసుల అదుపులోనే ఉన్నారంటున్న వరవరరావు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశ చరిత్రలోనే అతిపెద్ద ఎన్కౌంటర్.. రోజురోజుకీ పెరుగుతున్న మావోల మృతుల సంఖ్య.. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే ఆచూకీపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నారా?.. తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లారా?.. అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏవోబీలో వరుసగా ఐదురోజుల్లో మూడు ఎన్కౌంటర్లు జరిగినట్లు పోలీసులు చెప్పడం, ఇంకా కూంబింగ్ కొనసాగుతోందని ప్రకటిస్తుండటంతో ఖాకీ వ్యూహం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. వందలు దాటి ఇప్పుడు వేలాదిమంది పోలీసులు ఏవోబీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఆర్కే లక్ష్యంగానే పోలీసులు భారీగా కూంబింగ్ చేస్తున్నారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. సోమవారం జరిగిన ఎన్కౌంటర్ ఘటన నుంచి ఆర్కే తప్పించుకున్నారని గత నాలుగు రోజులుగా వినిపిస్తున్న వాదనలకు భిన్నంగా విరసం నేత వరవరరావు ప్రకటన చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారని, వెంటనే ఆయన్ని కోర్టులో హాజరుపరచాలని వరవరరావు గురువారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఘటన జరిగి ఐదురోజులైనా ఆర్కే క్షేమంగా ఉన్నట్టు ఎక్కడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడం ఆందోళన రేకిత్తిస్తోంది. హెలికాప్టర్లతో జల్లెడ... మరో పక్క పోలీసు అధికారులు మాత్రం ఆర్కే తమ అదుపులో లేరని చెబుతున్నారు. గాలింపు చర్యలు మాత్రం తీవ్రతరం చేశామని అంగీకరిస్తున్నారు. సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా హెలికాప్టర్లను వినియోగించని పోలీసులు.. గత రెండు రోజులుగా హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే చేస్తున్నారు. బలిమెల బ్యాక్ వాటర్ ప్రాంతంలో కూడా నిఘా పెంచారు. గాయాలపాలైన ఆర్కేకు ఆర్ఎంపీ లేదా ఇతర ప్రైవేటు వైద్యుల సేవలు అందకుండా చర్య లు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏజెన్సీలోని వైద్యులపై ఆంక్షలు విధిస్తున్నారు. ఏవోబీలో మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆర్కేను అంతమొందిస్తే పార్టీ పూర్తిగా నిర్వీర్యమవుతుందన్న అంచనాతోనే పోలీసులు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్కే అడవిలోనే సురక్షితంగా ఉన్నాడా, తీవ్రగాయాలతో ఇబ్బందులు పడుతున్నాడా, పౌరహక్కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నట్టు పోలీసుల చెరలో ఉన్నాడా అనేది అంతుబట్టకుండా ఉంది. ఆ మందులు అతనికేనా! గురువారం విశాఖ జిల్లా సిర్లిమెట్ట వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందగా, వారి నుంచి కొన్ని మందులు(ఇంజక్షన్లు, మాత్రలను) స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చూపించారు. ఆ మందులు అనారోగ్యంతో ఉన్న ఆర్కే కోసమేనా.. అన్న వాదనలు తెరపైకి వచ్చాయి. సోమవారం పోలీసుల కాల్పుల్లో ఆర్కేకి కూడా తీవ్రగాయాలు అయ్యాయని, దీంతో ఆయన్ను కొందరు దళ సభ్యులు సంఘటన ప్రాంతం నుంచి మోసుకువెళ్లి సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారం సిర్లిమెట్ట వద్ద మావోలు పోలీసులకు చిక్కి ఉంటారన్న ప్రచారం సాగుతోంది. ఈ కోణంలోనే పౌరహక్కుల సంఘాల నేతలు, విరసం నేత వరవరరావు తదితరులు ఆర్కే కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు అనుమానిస్తున్నారని అంటున్నారు.