సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తుల్‌తులీ–గవాడీ ఎదురుకాల్పులపై మావోయిస్టుల నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకొని ఆరు రోజులు గడుస్తున్నా మావోయిస్టు పార్టీ మౌనం వీడలేదు. దీంతో ఆ పార్టీకి తాజా ఎన్‌కౌంటర్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టుగా భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై పోలీసు వర్గాలు చెప్పే వివరణను విశ్లేషిస్తూ.. కొన్నిసార్లు విమర్శలు చేస్తూ, మరికొన్నిసార్లు అన్ని అబద్ధాలే అంటూ మావోయిస్టులు లేఖలు విడుదల చేస్తుంటారు. తాజా ఎన్‌కౌంటర్ ఎలా జరిగింది, దానికి కారణాలు ఏంటనే అంశాలపై మావోలకే ఇంకా స్పష్టత రాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నక్సలైట్ల అంచనాలకు అందని రీతిలో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా మెరుపుదాడి చేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పెద్ద లీడర్లు ఉంటారని ప్రచారం జరిగినా..
ఈ నెల 4న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. ఇందులో రాష్ట్ర కమిటీ సభ్యురాలు నీతి అలియాస్ ఊరి్మళ సహా 22 మంది పేర్లు, మావోయిస్టు పారీ్టలో వారి హోదాలు, వారిపై ప్రభుత్వం ప్రకటించిన రివార్డు వంటి వివరాలను పోలీసులు వెల్లడించారు. మరో తొమ్మిది మంది ఎవరనేది గుర్తించలేకపోయారు. పైగా ఎన్‌కౌంటర్ జరిగిన రోజు మృతుల్లో నంబాళ్ల కేశవరావు, తక్కెళ్లపల్లి వాసుదేవరావు వంటి టాప్‌మోస్ట్ లీడర్లు ఉన్నారనే పుకార్లు షికారు చేశాయి.
రోడ్డు పనులు అడ్డుకోండి..
ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్న తుల్‌తులీ–గవాడీ గ్రామాల నుంచి 30 కి.మీ. దూరంలో ఓర్చా పోలీస్‌స్టేషన్ ఉంది. అక్కడి నుంచి తుల్‌తులీ– గవాడీలకు చేరుకోవాలంటే దట్టమైన అడవిలో కొండలు, గుట్టలు ఎక్కుతూ.. దిగుతూ, ఎనిమిది వాగులను దాటాలి. ఓర్చా వరకు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ చేపడుతున్న పారామిలిటరీ బలగాలు క్యాంపులను ఏర్పాటు చేశాయి. తదుపరి లక్ష్యంగా తుల్‌తులీ ఉంది. దీంతో తొలిసారిగా ఆ గ్రామానికి రోడ్డు వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.
చదవండి: సేఫ్ జోన్ ఎక్కడ?.. తెలంగాణవైపు మళ్లీ వచ్చేందుకు మావోయిస్టుల ప్రయత్నాలు
అయితే రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకోవాలంటూ ఊర్మిళ నేతృత్వంలో గవాడీ గ్రామంలో ఈనెల 2న పీఎల్‌జీఏ కంపెనీ 6కు చెందిన మావోయిస్టులు సమావేశం నిర్వహించినట్టు అక్కడి గ్రామస్తులు తెలిపారు. ‘రోడ్డు నిర్మాణం జరిగితే మన భూమి, మన నీరు, మన అడవిని దోచేస్తార’ని ఆ సమావేశంలో ఊర్మిళ మాట్లాడిందని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే జరిగిన ఎదురుకాల్పుల్లో ఆమె చనిపోయారు. దళంలో 30 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఊర్మిళకు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment