Maoist encounter
-
అంత పెద్ద ఎన్కౌంటర్ జరిగినా.. మౌనం వీడని మావోయిస్టులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తుల్తులీ–గవాడీ ఎదురుకాల్పులపై మావోయిస్టుల నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకొని ఆరు రోజులు గడుస్తున్నా మావోయిస్టు పార్టీ మౌనం వీడలేదు. దీంతో ఆ పార్టీకి తాజా ఎన్కౌంటర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టుగా భావిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన తీరుపై పోలీసు వర్గాలు చెప్పే వివరణను విశ్లేషిస్తూ.. కొన్నిసార్లు విమర్శలు చేస్తూ, మరికొన్నిసార్లు అన్ని అబద్ధాలే అంటూ మావోయిస్టులు లేఖలు విడుదల చేస్తుంటారు. తాజా ఎన్కౌంటర్ ఎలా జరిగింది, దానికి కారణాలు ఏంటనే అంశాలపై మావోలకే ఇంకా స్పష్టత రాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నక్సలైట్ల అంచనాలకు అందని రీతిలో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా మెరుపుదాడి చేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద లీడర్లు ఉంటారని ప్రచారం జరిగినా.. ఈ నెల 4న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. ఇందులో రాష్ట్ర కమిటీ సభ్యురాలు నీతి అలియాస్ ఊరి్మళ సహా 22 మంది పేర్లు, మావోయిస్టు పారీ్టలో వారి హోదాలు, వారిపై ప్రభుత్వం ప్రకటించిన రివార్డు వంటి వివరాలను పోలీసులు వెల్లడించారు. మరో తొమ్మిది మంది ఎవరనేది గుర్తించలేకపోయారు. పైగా ఎన్కౌంటర్ జరిగిన రోజు మృతుల్లో నంబాళ్ల కేశవరావు, తక్కెళ్లపల్లి వాసుదేవరావు వంటి టాప్‌మోస్ట్ లీడర్లు ఉన్నారనే పుకార్లు షికారు చేశాయి. రోడ్డు పనులు అడ్డుకోండి.. ఎన్కౌంటర్ చోటుచేసుకున్న తుల్తులీ–గవాడీ గ్రామాల నుంచి 30 కి.మీ. దూరంలో ఓర్చా పోలీస్‌స్టేషన్ ఉంది. అక్కడి నుంచి తుల్తులీ– గవాడీలకు చేరుకోవాలంటే దట్టమైన అడవిలో కొండలు, గుట్టలు ఎక్కుతూ.. దిగుతూ, ఎనిమిది వాగులను దాటాలి. ఓర్చా వరకు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ చేపడుతున్న పారామిలిటరీ బలగాలు క్యాంపులను ఏర్పాటు చేశాయి. తదుపరి లక్ష్యంగా తుల్తులీ ఉంది. దీంతో తొలిసారిగా ఆ గ్రామానికి రోడ్డు వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. చదవండి: సేఫ్ జోన్ ఎక్కడ?.. తెలంగాణవైపు మళ్లీ వచ్చేందుకు మావోయిస్టుల ప్రయత్నాలుఅయితే రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకోవాలంటూ ఊర్మిళ నేతృత్వంలో గవాడీ గ్రామంలో ఈనెల 2న పీఎల్జీఏ కంపెనీ 6కు చెందిన మావోయిస్టులు సమావేశం నిర్వహించినట్టు అక్కడి గ్రామస్తులు తెలిపారు. ‘రోడ్డు నిర్మాణం జరిగితే మన భూమి, మన నీరు, మన అడవిని దోచేస్తార’ని ఆ సమావేశంలో ఊర్మిళ మాట్లాడిందని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే జరిగిన ఎదురుకాల్పుల్లో ఆమె చనిపోయారు. దళంలో 30 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఊర్మిళకు ఉంది. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. చింతగుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని బొత్తలంక, ఎరపల్లి అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికులపై నక్సల్స్ కాల్పులు జరిపారు. సైనికులపై నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. నక్సల్స్ కాల్పులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. నక్సల్స్ కోర్ ఏరియాలోకి భద్రతా బలగాలు ప్రవేశించాయి. గురువారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.అయితే.. ఈ ఎన్ కౌంటర్లో పలువురు నక్సలైట్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. డీఆర్జీ, సీఆర్పీ ఎఫ్, కోబ్రా దళాలకు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్, సీఆర్పీ ఎఫ్ డీఐజీ ఆనంద్, కుంట డీఐజీ సూరజ్‌పాల్ వర్మలు ఎప్పటి కప్పుడు ఎన్ కౌంటర్ సమాచారం తెలుసుకుంటూ సలహాలు, సూచనలు అందిస్తున్నారు.చదవండి: కోల్‌కతా బాధితురాలి విగ్రహావిష్కరణ.. సోషల్ మీడియాలో చర్చ -
నెత్తురోడిన బస్తర్.. ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టుల మృతి
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న భీకర ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. భద్రతా దళాలకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటివరకు ముగ్గురిని గుర్తించగా.. వారిలో ఇద్దరు తెలంగాణ వాసులు ఉన్నారు. మరికొందరు తెలంగాణ వాసులు కూడా మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఎస్ఎఫ్, డీఆర్జీ బలగాలు.. మావోయిస్టులకు మధ్య మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందిందని బస్తర్ ఐజీ పి.సుందర్రాజ్, ఎస్పీ కళ్యాణ్ ఎలిసెల్లి మంగళవారం రాత్రి వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ, ఆర్కేబీ డివిజన్ కమి టీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్, అలియాస్ శంకర్రావు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురం గ్రామానికి చెందిన ఈయ నపై రూ.25 లక్షల రివార్డు ఉంది. మరోవైపు దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. గత పదిహేనేళ్లలో బస్తర్ అడ వుల్లో ఇదే అతి పెద్ద ఎన్‌కౌంటర్‌గా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టుల సమావేశంపై సమాచారంతో.. బస్తర్ అటవీ ప్రాంతంలో మొత్తం ఏడు జిల్లాలు ఉండగా కాంకేరు జిల్లా ఛోట్ బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండ, కరోనార్ మధ్య హపటోలా, (ఛోట్ బెటియా పోలీస్ స్టేషన్‌కు తూర్పున 15 కి.మీ దూరంలో) మాడ్ సమీప అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మాడ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమయాన ఇరువర్గాల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఎన్కౌంటర్ రాత్రి వరకు కొనసాగగా..ఎదురుకాల్పుల తర్వాత మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. అలాగే ఘటనా స్థలంలో ఏడు ఏకే–47 రైఫిల్స్, మూడు లైట్ మిషన్ గన్స్, రెండు ఇన్సాస్ రైఫిళ్లతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర ఆయుధాలు, సామగ్రి స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఆయుధాల ఆధారంగా మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు భావిస్తున్నారు. మృతుల్లో మజ్జిదేవ్ భార్య లలిత! ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిని గుర్తించే పనిలో ఉన్న పోలీసులు అజ్ఞాతంలో ఉన్న అనుమానిత మావోయిస్టుల కుటుంబాలకు సమాచారం పంపి ఆరా తీస్తున్నారు. 1995 నుంచి మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న చిన్నన్న 2000 సంవత్సరంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. పారీ్టలో వెళ్లేకంటే ముందే వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఈ ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్, ఆయన భార్య అదిలాబాద్ జిల్లా బజార్హత్నూరుకు చెందిన ఆశశ్వర్ సుమన అలియాస్ రజిత మరణించినట్లు తెలుస్తోంది. సిరిపల్లె సుధాకర్ దండకారణ్యంలోనే డీవీసీలో పని చేస్తుండగా.. ఆయన భార్య రజిత అదే ప్రాంతంలో డీసీఎస్ స్థాయిలో ఉందని సమాచారం. అదే విధంగా దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ భార్య లలిత కూడా మృతి చెందినట్లు తెలిసింది. లలిత మహారాష్ట్రకు చెందిన వారని గుర్తించారు. అలాగే దండకారణ్యం ఐదవ కంపెనీకి చెందిన కమాండర్ రాజు సలామ్ కూడా మృతుల్లో ఉన్నట్లు తెలిసింది. ఈయనది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంగా చెబుతున్నారు. మజ్జిదేవ్ కూడా ఉన్నారా? ఈ ఎన్కౌంటర్ మృతుల్లో దండకారణ్యం అగ్రనేత మజ్జిదేవ్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఆయన భార్య లలిత మృతి చెందడంతో.. మజ్జిదేవ్ కూడా మృతుల్లో ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమాల్లో కీలకంగా పనిచేస్తున్న మజ్జిదేవ్ పేరు ఇటీవలే వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇక మరణించిన వారిలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కూడా ఉండే అవకాశం ఉందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని తెలిపాయి. ఎన్కౌంటర్లో గాయపడిన బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు డీఆర్జీ పోలీసులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించాయి. నెలరోజుల్లో 79 మంది లోక్‌సభ ఎన్నికల ముంగిట బస్తర్ అడవుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు పట్టుదలగా అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. గడిచిన 30 రోజుల్లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో మావోయిస్టు పారీ్టకి చెందిన 79 మంది మరణించారు. ఇందులో మిలీíÙయా సభ్యులు మొదలు కంపెనీ కమాండర్ల వరకు వివిధ స్థాయి నేతలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈనెల 19న లోక్‌సభ ఎన్నికల తొలి విడత, 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. తెలంగాణ పోలీసుల అలర్ట్ సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడంతో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల జిల్లాల ఎస్పీలను పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. తెలంగాణలో ఇటీవలి కాలంలో మావోయిస్టుల కదలికలు లేనప్పటికీ, ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చనే అనుమానంతో తనిఖీలు పెంచినట్టు తెలిసింది. -
తెలంగాణ బోర్డర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
సాక్షి, ములుగు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్ సందర్భంగా ఒక ఏకే-47 గన్, పేలుడు పదార్థాలను పోలీసులు, భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వివరాల ప్రకారం. ములుగు జిల్లా వెంకటాపురంలోని కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. అనంతరం, ఘటనా స్థలంలో ఏకే-47 సహా మరో మూడు తుపాకులను, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
తెలంగాణలో మావోయిస్టుల భారీ ఎన్కౌంటర్
-
ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో మావోయిస్టుల భారీ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, వరంగల్/వెంకటాపురం: తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు అయిన ములుగు–బీజాపూర్ జిల్లాల అటవీ ప్రాంతం లో మంగళవారం ఉదయం తుపాకుల మోత మోగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గ్రేహౌండ్స్‌కు చెందిన ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. మృతి చెందిన మావోయిస్టుల్లో ఓ మహిళ ఉంది. 40–50 మంది ఉన్నారని తెలుసుకొని.. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 40–50 మంది సంచరిస్తున్నారని ఈ నెల 16న సమాచారం అందింది. టార్గెట్‌గా మారిన కొందరు సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల హత్యలకు ప్లాన్ వేసినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రిగుట్టల వద్ద సాయుధ మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గఢ్ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మంగళవారం ఉదయం 6 గంటలకు కర్రిగుట్టల వద్ద పోలీస్ బలగాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో వాళ్లు వెంటనే పోలీసులపై కాల్పులకు దిగారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. వీళ్లలో ఒక మహిళా మావోయిస్టు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఎదురు కాల్పుల్లో ఓ జవాను తీవ్రంగా గాయపడగా అతడిని హెలికాప్టర్లో హనుమకొండ ఆర్ట్స్ కళాశాల ఆవరణకు తరలించి ప్రథమ చికిత్స చేసి తర్వాత హైదరాబాద్ తరలించారు. ఘటనా ప్రాంతం నుంచి ఓ ఎస్ఎల్ఆర్, ఓ ఇన్సాస్ రైఫిల్‌తో పాటు ఒక సింగిల్ బోర్, 10 రాకెట్ లాంచర్ల కిట్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. తప్పించుకున్న వాళ్ల కోసం కూంబింగ్: ములుగు ఎస్పీ మృతి చెందిన మహిళా మావోయిస్టును వాజేడు–వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి మడకం సింగే అలియాస్ శాంతక్క అలియాస్ అనితగా పోలీసులు గుర్తించారు. ఈమె ఇటీవల వెంకటాపురం మండలం మాజీ సర్పంచ్ రమేశ్‌ను అపహరించి హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితురాలిగా ప్రకటించారు. మరొకరు ఇల్లెందు–నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి కొమ్ముల నరేశ్ అలియాస్ బుచ్చన్నగా గుర్తించారు. మూడో వ్యక్తిని మాత్రం ఇంకా గుర్తించలేదు. ఈయన ములుగు–ఏటూరునాగారం డీవీసీఎం సుధాకర్ అని సమాచారం. పక్కా సమాచారంతోనే మావోయిస్టుల కోసం రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కూంబింగ్ జరుగుతోందని ములుగు ఎస్పీ ప్రకటించారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఇంకా కూంబింగ్ సాగుతోందన్నారు. కాగా ఎన్కౌంటర్లో మృతిచెందారని భావిస్తున్న సుధాకర్ ద్వారా ఆదివాసీలతో భారీ స్థాయిలో నియామకాలకు మావోయిస్టు పార్టీ వ్యూహరచన చేసినట్టు తెలిసింది. తాజా ఎన్‌కౌంటర్‌తో కొత్త నియామకాలకు పోలీసులు అడ్డుకట్టవేసినట్టేనని భావిస్తున్నారు. సుక్మాలో మరో ఎన్కౌంటర్.. మహిళా మావోయిస్టు మృతి దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా లోని మార్జుమ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది. మార్జుమ్ అటవీ ప్రాంతంలో కట్టేకళ్యాణ్ ఏరియా కమిటీ తెహ్క్వారా ప్రాంతానికి చెందిన మన్హగు, మున్నీ, ప్రదీప్, సోమదుతో పాటు 20–25 మంది సాయుధ మావోయిస్టులు ఉన్నారని పోలీసు బలగాలకు సమాచారం అందింది. దీంతో దంతెవాడ, బస్తర్, సుక్మా జిల్లాల డీఆర్జీ బృందాలు మంగళవారం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడగానే ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల తర్వాత ఘటనా స్థలంలో పరిశీలించిన భద్రతా బలగాలు మహిళా మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను మార్జుమ్ ఏరియా కమిటీ సభ్యురాలు మున్నీగా గుర్తించినట్టు బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్ రాజ్ వెల్లడించారు. -
భారీ ఎన్కౌంటర్: మహిళా మావోయిస్టులు, చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మృతి
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుర్నవల్లి, పెసరపాడు అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులకు పోలీసులకు రాత్రి నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో నలుగురు మావోయిస్టులు, చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మావోయిస్టుల మృతదేహాల తరలింపుపై డైలామా కొనసాగుతోంది. భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించాలా..లేక వరంగల్ ఎంజీఎంకు తరలించాలా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. చదవండి: హైదరాబాద్‌లో అమానుషం: అన్నను కొట్టి చంపిన తమ్ముడు -
గడ్చిరోలి ఎన్కౌంటర్..! ఆ పది మంది ఎవరు?
సాక్షి ప్రతినిధి, వరంగల్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యార్‌పట్టి అడవుల్లో శనివారం మధ్యాహ్నం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో మృతిచెందిన వారిలో 16 మందిని గుర్తించగా, మిగతా పది మంది ఎవరనేది చర్చనీయాంశమైంది. ఆ పది మందిలో తెలంగాణకు చెందిన వారున్నారా? అనే దానిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఎన్కౌంటర్లో 26 మంది ప్రాణాలు మృతిచెందగా, 16 మందిని ఆదివారం గుర్తించిన విషయం తెలిసిందే. కాగా, దండకారణ్యంతో పాటు వివిధ ప్రాంతాల్లో తెలంగాణకు చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, బండి ప్రకాశ్, మైలారపు అడెల్లు, కంకణాల రాజిరెడ్డి, మాచర్ల ఏసోబు, కొంకటి వెంకట్ పనిచేస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన పడకల్‌స్వామి ప్రస్తుతం గడ్చిరోలి అడవుల్లో ఫ్లటూన్ కమాండర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో గుర్తించని 10 మంది మావోయిస్టులు ఎవరనే చర్చ సాగుతోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో డిసెంబర్ 2 నుంచి వారం పాటు నిర్వహించే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వారోత్సవాలపై మావోయిస్టు ఫ్లటూన్లు సమావేశమయ్యాయన్న పక్కా సమచారంతోనే పోలీసు బలగాలు శనివారం ఉదయం 6.30 గంటలకు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ చోటుచేసుకుందని అంటున్నారు. -
మావోయిస్టు విస్తరణకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మావోయిస్టు పార్టీ విస్తరణను గడ్చిరోలి భారీ ఎన్కౌంటర్ పెద్ద దెబ్బతీసింది. దక్షిణాదిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కుదేలైన పార్టీని ఆదుకునేందుకు కేంద్ర కమిటీ నియమించిన విస్తరణ కమిటీ హెడ్, కేంద్ర కమిటీ సభ్యుడు దిలీప్ తేల్తుంబ్డే అలియాస్ మిలింద్ ఈ ఎన్కౌంటర్ మరణించి నట్లు గడ్చిరోలి పోలీసులు స్పష్టంచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ ఏడాది సెప్టెంబర్ 26న ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమావేశం జరిగింది. ఆ తర్వాత ఇదే అతి పెద్ద తొలి ఎన్కౌంటర్. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ భారీ స్థాయిలో నియామకంపై దృష్టి పెట్టాయి. అయితే ఆర్కే అనారోగ్యం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా ఫలితం రాలేదు. అంతేకాదు తెలంగాణలో నియామకానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కమిటీ ప్రత్యక్ష కార్యకలాపాలు పెద్దగా లేకపోవడం ప్రతికూల ఫలితాలే ఇచ్చాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ విస్తరణ హెడ్‌గా ఉన్న మిలింద్ నేరుగా రంగంలోకి దిగారు. నాగ్‌పూర్‌తో పాటు కొన్ని ప్రాంతాలు తిరిగి నియామక ప్రక్రియపై అనుసరించాల్సి వ్యూహాలను రచించినట్లు తెలిసింది. అయితే డయాబెటిక్ సమస్యతో పాటు స్పాండలైటిస్ సమస్య, నడుస్తూనే సృహ తప్పిపడిపోయే వ్యాధితో మిలింద్ బాధపడుతున్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. రిక్రూట్మెంట్తో పాటు కమిటీలను బలోపేతం చేసే దిశగా గడ్చిరోలి కమిటీతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కోర్చి పరిధిలోని మర్దిన్‌తోలా అటవుల్లో 48మందితో మిలింద్ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. కోవర్టుల ద్వారా ఇది తెలుసుకున్న పోలీసులు, సీఆర్పీఎఫ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిసింది. ఈ భేటీలో మిలింద్ కీలక సూచనలు చేసే సమయంలోనే తుపాకుల మోత ప్రారంభమైనట్లు సమాచారం. నలుగురు తెలుగువారు.. గడ్చిరోలి కమిటీ భేటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు నేతలు నలుగురు, ఒడిశాకు చెందిన ముగ్గురు ఉన్నట్లు రాష్ట్ర నిఘా వర్గాల సమాచారం. మృతదేహాలను గుర్తిస్తే గానీ, ఆ నలుగురు ఎవరన్నది చెప్పలేమని వారు పేర్కొంటున్నారు. కాగా, కేంద్ర కమిటీలోని 21 మందిలో అనారోగ్య కారణాలతో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరో ముగ్గురు గడిచిన ఏడాదిలో లొంగిపోయారు. దీనితో పార్టీలో యాక్టివ్‌గా ఉన్న వారి సంఖ్య సగానికిపైగా తగ్గింది. వరుస ఎదురుదెబ్బలు... దేశంలో మావోయిస్టు పార్టీకి ప్రస్తుతం అత్యంత గడ్డు రోజులు నడుస్తున్నాయి. కరోనా మొదటివేవ్, లాక్డౌన్ కాలంలో అనూహ్యంగా తెలంగాణలో ప్రాబల్యం చాటుకునే యత్నం చేసిన మావోలు.. రెండోవేవ్‌లో తమను తాము వైరస్ బారినుంచి, భద్రతా బలగాల నుంచి కాపాడుకులేకపోతున్నారు. పెరిగిన టెక్నాలజీ, దండకారణ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వరుసగా మావోయిస్టు అగ్రనేతలను కోల్పోవడంతో పార్టీకి ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు దీపక్, డీవీసీ కార్యదర్శి సుఖ్లాల్ ఉన్నట్లు తెలిసింది. వీరిలో దీపక్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు జార్ఖండ్‌లో జరిగిన ఓ ప్రమాదంలో కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందాడు. ఈ రెండు ఘటనలు మావోయిస్టు పార్టీకి ఊహించని విధంగా నష్టం కలిగించాయి. -
బీజాపూర్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా గల్గాం అడవిలో మంళవారం ఉదయం నుంచి పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఉసూర్-గల్గాం గ్రామాల మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక జవాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన జవాన్ అఖిలేష్‌ను బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ కమలోచన్ కశ్యప్ తెలిపారు. -
చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఆ యుద్ధ విద్యలు ఇక్కడివి కావు
సాక్షి, హైదరాబాద్: మడవి హిడ్మా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు. బీజాపూర్ జిల్లాలో తన ఉనికిపై తానే సమాచారం ఇచ్చి, భద్రతా దళాలకు ఎరవేసి, 23మంది జవాన్లను మట్టుబెట్టే ఆపరేషన్‌కు నేతృత్వం వహించి నడిపించిన హిడ్మా నేపథ్యంపై చర్చ సాగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. హిడ్మాకు అత్యంత కఠిన మావోయిస్టుగా దళంలో పేరుంది. అతను అనుసరించే వ్యూహాలు ప్రత్యర్థులు అంచనా వేయలేకుండా ఉంటాయి. అత్యంత జఠిలంగా.. వ్యూహంలో చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటికి వెళ్లలేనంత పకడ్బందీగా ఉంటాయి. చేతికి చిక్కిన, ఎదురైన శత్రువుల పట్ల ఎంతో కఠినంగా వ్యవహరిస్తాడు. జాలి దయ లేకుండా మరణించేవరకు చంపాలన్నది అతని సిద్ధాంతం. అందుకోసం ఏ మార్గం అనుసరించినా తప్పులేదనే మనస్తత్వం. ఇలాంటి పాశవిక దాడులు గతంలో మావోయిస్టులు అనుసరించలేదు. ఇవి ఇక్కడి యుద్ధ విద్యలు కావు 2010 నుంచి మావోల దాడుల్లో, వ్యూహాల్లో, ఆపరేషన్లు నిర్వహించే తీరులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి నుంచి వారు చేస్తున్న ప్రతి దాడిలోనూ ప్రాణనష్టం అధికంగా ఉంటోంది. ఇలాంటి పాశవిక యుద్ధ విద్యలు భారత్‌కు చెంది నవి కావు. ఇవి తూర్పు ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికాలాంటి దేశాల్లో కరుడుగట్టిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు అనుసరించే వ్యూహాలు. మరి అక్కడి వ్యూహాలు ఇక్కడి వారు ఎలా అమలు చేస్తున్నారు? అనే ప్రశ్నకు ఫిలిప్పీన్స్ అన్న సమాధానం వినిపిస్తోంది. మొత్తం దశాబ్దానికిపైగా జరిగిన భారీ ఆపరేషన్లకు హిడ్మానే వ్యూహరచన చేశాడని సమాచారం. తాజా దాడితో పాటు బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో చోటుచేసుకున్న విధ్వంసకర సంఘటనలన్నింటికీ ఇతనే నేతృత్వం వహించాడని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్–1కు కమాండర్‌గా ఉన్న హిడ్మా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నాడు. ట్యాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ (టీసీఓసీ) కూడా హిడ్మా నేతృత్వంలోనే పనిచేస్తుంది. భద్రతా దళాల కోసం మరిన్ని ఉచ్చులు..? ఎరవేసి దాడులు చేయడంలో పేరుగాంచిన హిడ్మా మరిన్ని వ్యూహాలు సిద్ధం చేసి ఉంటాడని నిఘా వర్గాలు ఇప్పటికే భద్రతా దళాలను హెచ్చరించా యి. ప్రతీకార దాడికి దిగే కంటే ఆచితూచి స్పందించడమే మేలని సూచించినట్లు సమాచారం. హిడ్మా కోసం గాలిస్తూ ఆవేశంగా మావోలకు పట్టున్న ప్రాంతాల్లోకి చొరబడితే, ఇదే అవకాశం కోసం చూస్తున్న హిడ్మా మరిన్ని ఉచ్చులతో మరో భారీ దాడికి దిగే అవకాశం లేకపోలేదని పలువురు సీనియర్ ఐపీఎస్‌లు సైతం అభిప్రాయపడుతున్నారు. చదివింది ఐదో తరగతే.. మడవి హిడ్మా (మడవి ఇడమా) అలియాస్ సం తోష్ అలియాస్ ఇడ్మాల్ అలియాస్ పొడియం బీమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల శివారు నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరం లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల పువ్వర్తి గ్రామంలో పుట్టి పెరిగాడు. ఇతను పదిహేనేళ్ల క్రితం స్థానిక పరిస్థితుల ప్రభావంతో మావోయిస్టు పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. బస్తరియా మురియా తెగకు చెందిన హిడ్మా.. చదివింది ఐదో తరగతే అయినా, హిందీ–ఇంగ్లి్లష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. దళంలో అతను చాలామందికి గెరిల్లా యుద్ధవిద్యల్లో శిక్షణ ఇస్తాడు. దండకారణ్యంలో అతన్ని మామూలు స్థాయి దళసభ్యుడు కలవడం దాదాపు అసాధ్యం. భార్యతో కలసి ఉండే అతని చుట్టూ అత్యాధునిక ఆయుధాలతో కూడిన దాదాపు 20 మందికిపైగా దళ సభ్యులు రక్షణ వలయంగా ఉంటారు. అందులో మెజారిటీ సభ్యులు అతని బంధువులు, బాల్యమిత్రులే కావడం గమనార్హం. అనూహ్యం .. అమానవీయం హిడ్మా దశాబ్దానికి ముందే ఫిలి ప్పీన్స్లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. అప్పటి మావోయిస్టు చీఫ్ గణ పతి ఆదేశాల మేరకు హిడ్మా బిహార్ మీదుగా నేపాల్ వెళ్లి, అక్కడ నుంచి దొంగ పాస్‌పోర్టు ద్వారా ఫిలిప్పీన్స్ చేరుకుని ఉంటాడని భావిస్తున్నారు. అక్కడే అతను భారీ ప్రాణనష్టమే లక్ష్యం గా భీకరదాడులు చేయడం, వీలైనంత ఎక్కువమందిని చంపడం, ప్రత్యర్థులకు ఎరవేసి చంపడంలో ఆరితేరాడని సమాచారం. హిడ్మా వ్యూహా లన్నీ మూడంచెల్లో ఉంటాయి. తొలుత బాంబులతో దాడి, తర్వాత బుల్లెట్ల వర్షం, ఆ తర్వాత గా యాలతో అల్లాడుతున్న క్షతగాత్రుల గొంతులు కోయడం, శరీరాన్ని కత్తులతో తూట్లుగా పొడవడం తదితర కర్కశ చర్చలన్నీ సైనిక పాలిత, నియంతల పాలనలో సాగుతున్న దేశా ల్లో ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులు అనుసరించే యుద్ధతంత్రాలని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లో, అంతర్యుద్ధాలు సాగుతున్న దేశాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయని చెబుతున్నారు. 2010లో దంతెవాడలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన దాడిలో ఓ సైనికుడి శవంపై 78 కత్తిపోట్లు ఉండటం దీనికి నిదర్శనం. ఆపై నెలరోజుల వ్యవ ధిలో ఆర్టీసీ బస్సును పేల్చి సాధారణ ప్రజలతోపాటు 30 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపడ మూ హిడ్మా ఆలోచనే అన్న అనుమానాలున్నాయి. పక్కా వ్యూహం .. పకడ్బందీ ప్రణాళిక బీజాపూర్‌లో జొన్నగూడెం సమీప అటవీ ప్రాం తంలో జరిగిన భారీ దాడికి డిసెంబర్, జనవరిలోనే వ్యూహరచన జరిగి ఉంటుందని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడి కోసం బస్తర్ ప్రాంత నక్సలైట్లలో తాను గెరిల్లా శిక్షణ ఇచ్చిన దాదాపు 300 మందికిపైగా షార్ప్ షూటర్లను హిడ్మా పిలిపించినట్లు సమాచారం. వారికి ప్లాన్ వివరించడంతో పాటు తిరిగి సురక్షితంగా తప్పించుకోవడంపై మాక్ డ్రిల్ నిర్వహించేందుకు 2 నెలలకు పైగానే సమయం పట్టి ఉంటుందంటున్నారు. అంతా సరే అనుకున్నాక.. భద్రతా దళాలకు ఉప్పందించడం, వారు ఇతని కోసం పగలూరాత్రి వెదకడం, వారు తాము అనుకున్న ప్రాంతానికి రాగానే, జవాన్లు తేరుకునేందుకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా సులువుగా దాడి చేసి పారిపోవడం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. తమ వద్ద ఉన్న తక్కువ సామగ్రితోనే వీలైనంత ఎక్కువమంది శత్రువులను మట్టుబెట్టడం హిడ్మా లక్ష్యం. బుల్లెట్లను వీలైనంత తక్కువగా వాడటం, జవాన్లను కత్తులతో పొడిచి, మిగిలిన వారిని భయభ్రాంతులకు గురిచేయడం అతని వ్యూహంలో భాగమని అంటున్నారు. జొన్నగూడెం ఆపరేషన్‌లో పీఎల్జీఏకు చెందిన సుమారు 200 నుంచి 250 మంది పాల్గొన్నట్లుగా స్పష్టమవుతోంది. -
ఎవరీ మడవి హిడ్మా?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా.. భారీ సంఖ్యలో పోలీసు బలగాలు వెళ్లింది ఆయనను పట్టుకునేందుకే.. కానీ పక్కాగా ప్లాన్ చేసి ఇంతమంది పోలీసులను రప్పించి, దాడి చేసిందీ ఆయనే.. ఇంతకుముందు జరిగిన భారీ ఎన్కౌంటర్లు, దాడుల ఘటనల్లో కీలకమూ ఆయనే.. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన తాజా ఘటనతో ఎక్కడ చూసినా హిడ్మా పేరే వినిపిస్తోంది. మరి ఇంతకీ ఎవరీ హిడ్మా? ఎక్కడివాడు, ఏం చేశాడనేది చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పువ్వర్తికి చెందిన ఆదివాసీ మడావి హిడ్మా. ఆయన తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉంటున్నారు. 5 వరకే చదువుకున్న హిడ్మా.. 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆయన వయసు 40 ఏళ్లు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ)–1వ బెటాలియన్‌కు కమాండర్‌గా.. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా పనిచేస్తున్నాడు. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేస్తుంది. హిడ్మా భార్య కూడా మావోయిస్టు పారీ్టలోనే పనిచేస్తోంది. పీఎల్జీఏ సభ్యులకు శిక్షణ ఇచ్చేది హిడ్మానే. ఒక్కో బెటాలియన్ 200 మంది మావోయిస్టులుంటారు. కొత్తగా ఏ బెటాలియన్ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్ ఉంటుంది. పీఎల్‌జీఏతోపాటు మిలీíÙయా సభ్యులకు కూడా ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన 25కుపైగా ఘటనలకు హిడ్మానే సూత్రధారి అని చెబుతారు. రామన్న తర్వాత హిడ్మా.. ఛత్తీస్‌గఢ్‌లో గెరిల్లా దాడుల బాధ్యతలను ఇంతకుముందు మవోయిస్టు నేత రామన్న చూసేవారు. ఆ తర్వాత హిడ్మా ఆ బాధ్యతలు చేపట్టాడు. కూంబింగ్ ఆపరేషన్లు చేసే పోలీస్ బలగాలపై, సీఆర్పీఎఫ్ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. మావోయిస్టు పార్టీలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) విభాగం హిడ్మా కనుసన్నల్లోనే పనిచేస్తుంది. దండకారణ్యంపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. హిడ్మా తలపై రూ.40లక్షల రివార్డు కూడా ఉంది. గతంలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి హత్య కేసులో హిడ్మాపై ఎన్ఐఏ చార్జీషీట్ కూడా వేసింది. హిడ్మా నేతృత్వంలో జరిగిన కొన్ని ఘటనలు ఇవీ.. 2010 ఏప్రిల్ 6న సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైన్ ప్రొటెక్షన్ వాహనాన్ని మందుపాతరలతో పేల్చివేసి, కాల్పులు జరిపిన ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందులో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు. 2017 మార్చి 12న సుక్మా జిల్లా బెజ్జి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తచెరువు దగ్గర రోడ్డు నిర్మా ణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందుపాతరతో దాడి జరిగింది. ఆ ఘటనలో 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లుమృతి చెందారు. 2017 ఏప్రిల్ 24న ఇదే జిల్లా చింతగుఫా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుర్కాపాల్ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో.. 24 మంది జవాన్లు చనిపోయారు. 2018 మార్చి 13న సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు. 2020 ఫిబ్రవరిలో ఇదే జిల్లా పిడిమెట అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చి, కాల్పులు జరపడంతో 12 మంది డీఆర్జీ జవాన్లు మృతి చెందారు. తాజాగా శనివారం జొన్నగూడెం దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు. -
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్
కాళేశ్వరం: హోలీనాడు మూడురాష్ట్రాల సరిహద్దుల్లో గోలీమార్ కొనసాగింది. మైదాన ప్రాంతం రంగులమయం కాగా, అటవీప్రాంతం మావోయిస్టుల రక్తంతో ఎరుపెక్కింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సందీప్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం... టీసీవోసీ వారోత్సవాల్లో భాగంగా ఖేద్రమెండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారని ఎస్పీ అంకిత్ గోయల్‌కు సమాచారం అందింది. దీంతో అదనపు పోలీస్ సూపరింటెండెంట్ మనీష్ కల్వానియా నేతృత్వంలో గడ్చిరోలీ జిల్లాకు చెందిన సీ–60 విభాగం పోలీసు బలగాలు రెండు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. సోమవారం ఉదయం ఖుర్కేడా పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని మలెవాడ పోలీస్ క్యాంపు సమీపంలో గల ఖేద్రమెండ అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. వెంటనే మావోయిస్టులు కాల్పులు జరపడంతో బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. మృతులు వీరే... ఎదురుకాల్పుల్లో చనిపోయిన మావోయిస్టులు మహారాష్ట్రకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పవన్ అలియాస్ భాస్కర్ రుషి రోజీ హిచ్చామీ (రూ.25 లక్షల రివార్డు), తిప్పాఘర్ ఏరియా కమిటీ సభ్యుడు సుఖ్‌దేవ్‌రాజ్ అలియాస్ బుద్దాసింగ్ నేతం(రూ.10 లక్షలు), ఏవోపీ సభ్యురాలు అస్మిత అలియాస్ యోగితా సుక్లు పాడా(రూ.4 లక్షలు), బస్తర్ ఏరియా కమిటీ సభ్యుడు అమర్ ముంగ్యా కుంజం(రూ.2 లక్షలు), ధాంరాంచ ఎస్పీఎస్ సభ్యురాలు సుజాత అలియాస్ కమల అలియాస్ పునీత చిక్రుగౌడ(రూ.2 లక్షలు) ఉన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఇతర సామగ్రి ఘటనాస్థలం నుంచి ఒక ఏకే 47, ఒక 303 రైఫిల్, ఒక 12(ట్వల్) బోర్ తుపాకీతోపాటు మరో ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు పెద్దఎత్తున విప్లవ సాహిత్యం, మందులు, మందుగుండు సామగ్రి, తూటాలు లభించాయి. తప్పించుకున్నవారి కోసం అదనపు బలగాలు ఈ ఘటనలో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు అదనపు బలగాలను తరలించి కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. దీంతో మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్– తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంత గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం కూడా ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న హెటకల్సా ప్రాంతంలోనూ గంటన్నరపాటు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పాల్గొన్న సుమారు 70 మంది మావోయిస్టులు బలగాలపైకి కాల్పులు జరుపుకుంటూ దండకారణ్యంలోకి పారిపోయారు. -
గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్
-
భారీ ఎన్కౌంటర్: ఐదుగురు మావోయిస్టులు మృతి
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఖురుకేడ తాలుక కొబ్రామెండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ తెలిపారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని చెప్పారు. పోలీసులు అదనపు బలగాలతో కూంబీంగ్ ఆపరేషన్ చేపట్టారని, తప్పించుకున్న వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. నక్సల్స్‌ను మొత్తం ఏరివేసేవరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. చదవండి: హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు: ఎనిమిది మంది దుర్మరణం -
ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో ఎన్కౌంటర్
భువనేశ్వర్: ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మద్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గుర్తు తెలియని మావోయిస్టు మృతి చెందగా, మావోయిస్టులకు చెందిన 15 కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.దీనిపై ఒడిశా డీఐజీ రాజేష్ పండిట్ స్పందించారు. 'ఏవోబీలో మల్కన్‌గిరి జిల్లా ఖైర్‌పుట్ బ్లాక్ మత్లీ పోలీసుస్టేషన్ పరిధిలోని మడక్‌పొదర్ సమీప నున్ఖారీ అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచారంపై పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది. ఈ ఆధారంతో ఒడిశాకు చెందిన డీవీఎఫ్, ఎస్‌వోజీ బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసుల కదలికలు గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంబించారు. ఇరువర్గాలు మధ్య సుమారు 45 నిముషాలు పాటు కాల్పులు జరిగాయి. కొద్దిసేపటి తర్వాత మావోయిస్టులు వైపు నుంచి కాల్పులు నిలిచిపోవడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని గాలించగా ఒక గుర్తుతెలియని మావోయిస్టు మృతదేహం లభించింది. దీంతోపాటు ఒక పిస్టల్, దేశీయ తుపాకీ, 15 కిట్ బ్యాగులు, వాకీటాకీ, వంటపాత్రలను స్వాధీనం చేసుకున్నారని' తెలిపారు.ఈ సందర్బంగా ఒడిశా డీఐజీ రాజేష్ పండిట్ మాట్లాడుతూ మావోయిస్టులు హింసను వీడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారిని ఆదుకోవడానికి సిధ్దంగా ఉన్నామని, తప్పించుకున్న మావోయిస్టులు కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నామని డీఐజీ తెలిపారు. -
ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో దద్దరిల్లిన తుపాకీలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో శనివారం మరోసారి తుపాకీలు దద్దరిల్లాయి. సరిహద్దుల్లో కట్ ఆఫ్ ఏరియాలోని తోటగుర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య దాదాపు 45 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు సభ్యుడు ఒకరు మృతి చెందారు. ఘటనపై మల్కనగిరి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కాల్పుల్లో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మిల్ట్రీ ప్లాటు ఇంచార్జ్ కిషోర్ మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టు ఏసీఎమ్ నుంచి ఎస్ఎల్ఆర్ తుపాకీ స్వాధీనం చేసుకున్నాం. మరో దళ సభ్యుడు పోలీసుల ముందు లొంగిపోయారు' అని జిల్లా ఎస్పీ తెలిపారు. కాగా, సరిహద్దుల్లోని కట్ ఆఫ్ ఏరియాలోని తోటగుర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు అనంతరం కూడా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. -
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యం
సాక్షి, ములుగు: మావోయిస్టుల ఏరివేతే ప్రధాన లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పని చేస్తోందని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ పాటిల్ తెలిపారు. జిల్లాలోని మంగపేట మండలంలోని నర్సింహసాగర్ సమీపాన ముసలమ్మగుట్టలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగిన విషయం విదితమే. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన ఏఎస్పీలు సాయిచైతన్య, శరత్చంద్ర పవార్‌తో కలిసి మాట్లాడారు. మావోయిస్టుల కారణంగా అమాయక గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఏజెన్సీలో జరుగుతున్న పరిమాణాలను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోందని, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పోలీసులు ఉమ్మడిగా సమన్వయంతో పనిచేస్తూ మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర సరిహద్దుల్లోని ఇతర రాష్ట్రాల పోలీసులతో మావోయిస్టుల ఏరివేతపై సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లోన్ని అడవుల్లో పెద్దఎత్తున కూంబింగ్ సాగుతోందని, మావోలు ఎలాంటి దుశ్చర్చలకు పాల్పకుండా చూస్తున్నామని ఎస్పీ వివరించారు. మృతులు వీరే... ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిలో రవ్వ రామల్ అలియాస్ సుధీర్(30) స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలోని జెల్ల గ్రామం కాగా, ఈయన మణుగూరు ఏరియా సభ్యుడే కాక ఎల్ఓఎస్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక మరో మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చెన్నాపూర్‌కి చెందిన లక్మా(26) కాగా, ఆయన ఇదే దళంలో సభ్యుడిగా ఉన్నాడు. రవ్వ రామల్పై గతంలో ఆరు కేసులు ఉండగా, ప్రభుత్వం తరపున రూ.4లక్షల రివార్డ్ ఉంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఎస్ఎల్ఆర్, రెండు ఎస్బీబీఎల్, విప్లవ సాహిత్యం, కిట్ బ్యాగులు, రెండు ఏకే 47 మ్యాగజిన్లు 16, 7.62 ఎంఎం రౌండ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం.. ముసలమ్మగుట్ట నుంచి మృతదేహాలను ఆదివారం అర్థరాత్రి ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని బీరెల్లి మీదుగా ఏటూరునాగారం సామాజిక అస్పత్రికి ట్రాక్టర్‌పై తరలించారు. అక్కడి నుంచి సోమవారం తెల్లవారుజామున ములు గు ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాలను తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. 2007లో మావోయిస్టుల్లోకి వెళ్లిన రామల్ వెంకటాపురం(కే): మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసలమ్మ గుట్ట ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మణుగూరు ఏరియా కమిటీ సభ్యుడు, ఎల్ఓఎస్ కమాండర్ రవ్వ రామల్ అలియాస్ సుధీర్ 2007 నుండి అజ్ఞాతంలో ఉంటున్నాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకు మా జిల్లా కట్టెకళ్యాణ్ పోలీస్‌స్టేషన్ పరిధి దబ్బా గ్రామానికి చెందిన రామల్ వెంకటాపురం(కే) మండలం పాత్రాపురం పంచాయతీ జెల్లా గ్రామంలో నివాసముంటున్నట్లు సమాచారం. మావోయిస్టుల భావజాలం, పాటలకు ఆకర్షితుడైన ఆయన దళంలో చేరాడు. అప్పటి నుంచి వివిధ కేడర్లలో పనిచేశారు. ప్రధాన నిందితుడిగా వివిధ పోలీస్స్టేషన్లలో ఆరు కేసులు నమోదు కాగా, ప్రభుత్వం రూ.4లక్షల రివార్డు కూడా ప్రకటించింది. 2015లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కోడిజుట్టు గుట్ట వద్ద కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులపై ఎదురు కాల్పులు జరిపిన కేసులో ప్రధాన నిందితుడిగా వెంకటాపురం పోలీస్ స్టేషన్లో నమోదైంది. 2015లో వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారి పనుల్లో ఉన్న వాహనాలు తగలబెట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా పేరూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు ఉంది. ఇక 2017లో వెంకటాపురం మండలం రాచపల్లి సమీప పాలెం వాగు ప్రాజెక్టు వెళ్లే రహదారిలోని కొప్పగుట్ట వద్ద రోడ్డుపై మందుపాతర అమర్చిన కేసు, 2018 ఎదిరలో బీఎస్ఎన్ఎల్ టవర్ పేల్చిన కేసుల్లో ప్రధాన నిందితుడిగా వెంకటాపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అలాగే, ఏటూరునాగారం సర్కిల్ పరిధిలో ఆయనపై మరో రెండు కేసులు ఉన్నాయి. -
రీ పోస్టుమార్టం ఫలించని ప్రయత్నం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: హైకోర్టు ఆదేశాల మేరకు మావోయిస్టుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే మృతదేహాలను తిరిగి తీసుకొచ్చేందుకు ఏ మేరకు ప్రయత్నాలు చేశారనే వివరాలను పోలీసులు పూర్తిస్థాయిలో వెల్లడించడంలేదు. కావాలనే తాత్సారం చేశారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ నెల 23న చర్ల మండలం చెన్నాపురం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ సాయంత్రం సమయంలో జరిగిందని, ఇదేరోజు ఉదయం పాల్వంచ మండలంలోని ఉల్వనూరు గ్రామ సమీపంలోని పాములదన్ను అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. అంత్యక్రియలు పూర్తి పోలీసులు మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతిచెందినవారిలో చర్ల మండలంలోని కిష్టారంపాడు గ్రామానికి చెందిన లోకల్ గెరిల్లా స్క్వాడ్ సోడి జోగయ్య, చెన్నాపురానికి చెందిన దళ సభ్యురాలు మడకం మల్లి, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం గన్నాపురం గ్రామపంచాయతీ పరిధిలోని భువనగిరి గ్రామానికి చెందిన లోకల్ గెరిల్లా స్క్వాడ్ సభ్యురాలు మడకం మంగి ఉన్నారు. జోగయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, మల్లికి వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. మృతదేహాలు గ్రామాలకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. హైకోర్టులో పిటిషన్‌తో.. చెన్నాపురం ఎన్‌కౌంటర్‌పై రఘునాథ్ అనే వ్యక్తి ఈ నెల 24న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని, మృతదేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం చేయించాలని, సదరు ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అసలు ఎన్కౌంటర్ పైనే పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయా, లేక పట్టుకుని కాల్చి చంపారా అంటూ హక్కుల సంఘాల అనుమానిస్తున్నాయి. రాష్ట్రంలో వరుసగా ఈ నెలలో నాలుగు చోట్ల ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఈ నెల 3న గుండాల మండలం దేవళ్లగూడెంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు, 7న చర్ల మండలం పూసుగుప్ప వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మా వోలు, 19న ఆసిఫాబాద్ జిల్లా కదంబా అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోలు మృతిచెందారు. భద్రతా కారణాలతో.. మృతదేహాలను వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఫ్రీజర్‌లో ఉంచాలని, ఫోరెన్సిక్ నిపుణులతో వీడియో తీస్తూ రీపోస్టుమార్టం చేసి, సదరు నివేదికను సీల్డ్ కవర్లో తమకు అందజేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు అప్పగించిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను తిరిగి కొత్తగూడెం ఆస్పత్రికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే చర్ల మండలం చెన్నాపురం, కిష్టారంపాడు గ్రామాలు దట్టమైన అటవీప్రాంతంలో ఉండటంతో భద్రత కారణాల నేపథ్యంలో అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉందని, పైగా పలుచోట్ల ఇప్పటికే మందుపాతరలు పెట్టి మావోలు రోడ్డును పేల్చివేశారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పలుచోట్ల మందుపాతరలు వెలికితీశారు. మరికొన్నిచోట్ల మావోలు పేల్చారు. దీంతో పోలీసులు మృతదేహాలను తిరిగి తెప్పించేందుకు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలను ఆయా గ్రామాల వద్దకు పంపించారు. గ్రామస్తులు, మిలీషియా సభ్యులు మాత్రం ఎవరినీ అనుమతించలేదని తెలుస్తోంది. కాగా.. ఈ నెల 28న∙బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మావోలు ప్రకటన విడుదల చేశారు. ఆదివాసీ గూడెంలపై నిఘా పాల్వంచ: ఎదురుకాల్పుల ఘటనతో పాల్వంచ ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చి ఏర్పాటు చేసుకున్న ఆదివాసీ గిరిజనుల గూడెంలపై ప్రత్యేక నిఘా పెట్టారు. పాల్వంచ మండలంలోని ఉల్వనూరు సమీపంలో పాములదన్నుగుట్ట అటవీప్రాంతంలో బుధవారం మావోయిస్టు దళం సంచరిస్తున్నట్లు సమాచారం అందుకుని కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం విదితమే. ఈ ఘటనలో ఒక తుపాకి, కిట్ బ్యాగ్‌లు, విప్లవ సాహిత్యం, వంట పాత్రలు వదిలి అడవిలో తప్పించుకున్న మావోయిస్టుల కోసం రెండు రోజులుగా ప్రత్యేక పోలీసులు, సివిల్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివాసీలతో మాట్లాడుతున్న డీఎస్పీ ప్రసాద్‌రావు శుక్రవారం కొత్తూరు, మల్లారం, రాళ్లచెలక, పెద్దకలస, నర్సిహాసాగర్ సమీపంలోని ఆదివాసీ గిరిజన గూడెంలను డీఎస్పీ ప్రసాద్‌రావు, ఎస్ఐ కె.సుమన్ సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ స్థానిక ఆదివాసీ గిరిజనులతో మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారికి ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వొద్దని కోరారు. అపరచిత వ్యక్తులు బయట నుంచి ఎవరు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొత్తగా ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి ఎవరెవరు వచ్చి పోయారని డీసీఎ్ప గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. బూటకపు ఎన్కౌంటర్లను ఖండించాలి కొత్తగూడెం: ఈనెల 3, 7, 19, 23 తేదీల్లో జరిగిన ఘటనలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు చేసిన బూటకపు ఎన్కౌంటర్లేనని ప్రజలు, ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలని, హత్యలకు పాల్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, నాయకులను, పోలీసులను శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో శుక్రవారం ఒక ప్రకటన విడుదలైంది. హైకోర్టు వెంటనే బూటకపు ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని, ఎన్కౌంటర్లకు నిరసనగా సెప్టెంబర్ 28వ తేదీన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ను పాటించాలని పేర్కొన్నారు. చెన్నాపురం, కదంబ, పూసుగుప్ప, దేవార్లగూడెంలో జరిగివన్నీ బూటకపు ఎన్కౌంటర్లేనని, 8 మందిని పట్టుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు చట్ట ప్రకారం వారిని జైల్లో పెట్టకుండా బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారని వివరించారు. మావోయిస్టు పార్టీ ఎజెండానే, మా ఎజెండా అంటూ నమ్మబలికిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలకు సేవలు చేస్తూ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు పక్కన పెట్టి సహజ వనరులను దోచుకుంటూ తెలంగాణలో 90 శాతంగా ఉన్న పీడిత ప్రజలు, దళితులు, ఆదివాసులు, వెనుకబడిన కులాలవారు, మహిళలు, విద్యార్ధులు, ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేశారని ఆరోపించారు. -
రీపోస్టుమార్టం నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను వారి బంధువుల నుంచి వెంటనే స్వాధీనం చేసుకొని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో భద్రపరచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఫోరెన్సిక్ వైద్య బృందంతో మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని, ఈ మొత్తం ప్రక్రియను ఫొటోలు, వీడియోలు తీయాలని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. చర్ల ఎన్కౌంటర్లో చనిపోయిన ముగ్గురి మృతదేహాలకు రీపోస్టుమార్టం చేసేలా ఆదేశించాలంటూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం అత్యవసరంగా విచారణకు స్వీకరించింది. ఎన్కౌంటర్ పేరుతో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిని పోలీసులు హత్య చేశారని, మృతదేహాలకు రీపోస్టుమార్టం చేయించేలా ఆదేశించడంతోపాటు ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపించారు. తూతూమంత్రంగా పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారని, ఆధారాలను మాయం చేసేందుకే పోలీసులు ఇలా చేశారని కోర్టుకు నివేదించారు. కాగా, ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని, వారిని సోది జోగయ్య, మడకం మంగ్లి, మడకం మల్లిగా గుర్తించామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ నివేదించారు. పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాలను అప్పగించామని చెబుతూ.. ఈ మేరకు శవాలను బంధువులకు అప్పగించినట్లుగా ఉన్న పత్రాలను ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ ప్రక్రియను వీడియో తీశామని వివరించారు. అయితే ఆధారాలను మాయం చేసేందుకే పోలీసులు పోస్టుమార్టం చేసి మృతదేహాలకు వెంటనే అంత్యక్రియలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని రఘునాథ్ ఆరోపించారు. మృతదేహాలను వెంటనే వారి బంధువుల నుంచి స్వాధీనం చేసుకొని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచేలా చర్యలు తీసుకుంటామని ఏజీ నివేదించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది. -
ముగ్గురు మావోల ఎన్కౌంటర్
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ మేరకు ఎస్పీ సునీల్‌దత్ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నాపురం అటవీ ప్రాంతంలో గల గుట్టల వద్ద రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మావోయిస్టులు.. పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా.. సంఘటనా ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు, మిలీషియన్ కమాండర్ సోడి జోగయ్య మృతదేహం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాల వద్ద ఒక 8 ఎంఎం రైఫిల్, పేలుడుకు ఉపయోగించే సామగ్రి, ఒక కిట్ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకోగా.. వారి కోసం కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇరవై రోజుల వ్యవధిలో జరిగిన మూడు ఎన్కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడంతో రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరుస ఎన్కౌంటర్లలో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 8కి చేరింది. కిన్నెరసాని అడవుల్లో ఎదురుకాల్పులు పాల్వంచ రూరల్: పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే.. మావోయిస్టులు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని అభయారణ్యం పరిధిలోని ఉల్వనూరు శివారు పాములదున్న గుట్ట అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుపడిన పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరుపుతూ రెండు వర్గాలుగా విడిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే పోలీసులకు తారసపడింది ఏ దళానికి చెందిన సభ్యులు అనేది తెలియరాలేదు. సంఘటనా స్థలంలో ఒక తుపాకీ, కిట్ బ్యాగులు, సోలార్ ప్లేట్, వంట సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కేఆర్కే ప్రసాదరావు తెలిపారు. ఎస్పీ సునీల్‌దత్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. డ్రోన్ ద్వారా మావోల కదలికలపై నిఘా మహాముత్తారం: మావోయిస్టుల కదలికలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు గ్రామాలు, అడవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టిన కోటగా ఈ ప్రాంతం ఉండేది. తర్వాత కాలంలో పోలీసులు నియంత్రించినా, ఇటీవల సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ ప్రాంతంలోకి మావోలు వచ్చారని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇటీవల ఓ ప్రభుత్వ ఉద్యోగిని కాల్చి చంపిన నేపథ్యంలో.. మావోల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మహాముత్తారం మండలంలోని సరిహద్దు ప్రాంతాలైన కనుకునూర్, రెడ్డిపల్లి, సింగంపల్లి, సింగారంతోపాటు పలిమెల మండలం ముకునూర్, నీలంపల్లి, ఇచ్చంపల్లి అటవీ ప్రాంతాల్లోని నీటి స్థ్ధావరాలను కనుగొనేందుకు డ్రోన్ కెమెరాతో పర్యవేక్షిస్తున్నారు. -
దద్దరిల్లిన కదంబా.. దళంలోకి యువత
సాక్షి, మంచిర్యాల : మావోల ఏరివేతే లక్ష్యంగా ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం సాగుతుండగా పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో మావోలు ఉన్నారు. ఈనెల 19న కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దళ సభ్యులు మృతి చెందగా, ఇందులో ఒకరు చత్తీస్‌గడ్‌కు చెందిన చుక్కాలు కాగా, మరొకరు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన జుగ్నాక్ బాదీరావు ఉన్నాడు. బాదీరావు నాలుగు నెలల క్రితమే కుమురంభీం–మంచిర్యాల డివిజన్ కమిటీలో చేరాడు. గత ఆర్నెళ్ల క్రితం కరోనా ప్రభావం, లాక్డౌన్ కాలంలో చతీస్గడ్లోని దండకారణ్యం నుంచి మహారాష్ట్ర మీదుగా ఆసిఫాబాద్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో తిర్యాణి, సిర్పూర్(యూ), జన్నారం, ఊట్నూరు, నేరడిగొండ, సిరికొండ, పెంబి అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పట్టు పెంచుకునే పనిలో పడ్డారు. అంతేకాక ఏరియాల వారీగా బాధ్యతలు అప్పగిస్తూ కొత్త నియామకాలపై దృష్టి పెట్టారు. కొత్త సభ్యులు పలు గ్రామాల్లో ప్రజలను కలిసి తమ కార్యకలాపాలు విస్తరించే సందర్భాల్లోనే ఆచూకీ తెలిసి ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్కౌంటర్ బూటకమంటూ కేబీఎం కమిటీ కార్యదర్శి అడెల్లు పేరుతో ఆదివారం ఓ లేఖ విడుదల అయింది. (తప్పించుకున్న భాస్కర్?) కేబీఎం కమిటీకి నేతృత్వం వహిస్తూ గత 25ఏళ్లుగా అజ్ఞాతంలో దండకారణ్యంలో ఉద్యమంలో ఆరితేరిన మైలరపు అడెల్లు అలియాస్ భాస్కర్‌ది బోథ్ మండలం పొచ్చెర కావడంతో ఇక్కడి యువతను ఉద్యమంలోకి ఆకర్షించే పనిలో ఉన్నారు. మాజీల సాయం పొందినట్లు పోలీసులు గుర్తించారు. వారం రోజుల పాటు బోథ్ మండలంలోని ఆదివాసీ గ్రామాలు, నేరడిగొండ, పెంబి ప్రాంతాల్లో పలువుర్ని కలిసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే కొందరు మాజీలు పోలీసులకు సహకరిస్తుండడంతో దళ సభ్యుల కదలికలు గుర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే పలుమార్లు తిర్యాణి, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో తృటిలో తప్పించుకున్నారు. మావోలు వదిలివేసిన సామగ్రిలో కీలక సమాచారం తెలుసుకోవడంతో గత రెండు నెలలుగా మరింత అప్రమత్తమయ్యారు. ఉమ్మడి జిల్లాలో 15 మంది వరకు కొత్తగా దళంలో చేరినట్లు అనుమానాలు ఉన్నాయి. వీరిపై ఇప్పటికే పోలీసుల పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. పట్టు కోసం గట్టి ప్రయత్నాలు గతంలో నక్సల్స్‌కు గట్టి పట్టున్న తిర్యాణి, మంగి, సిర్పూర్ యూ, ఊట్నూరు, పెంబి, నేరడిగొండ, సిరికొండ తదితర ఆదివాసీ ప్రాంతాల్లో రహస్యంగా సంచరిస్తు పలువుర్ని దళంలోకి చేర్చుకున్నారు. అంతేకాక సానుభూతి పరులతో పట్టుపెంచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దళంలో చేరేందుకు స్థానిక యువతకు డబ్బుల ఆశ చూపిస్తున్నట్లు సమాచారం. తాజా ఎన్కౌంటర్లో మృతి చెందిన బాదీరావు స్వస్థలం అద్దాల తిమ్మాపూర్ నేరడిగొండ మండలంలోనే అత్యంత మారుమూల ప్రాంతం. ఇలాంటి ఆదివాసీ గూడల నుంచి కొత్త నియామకాలను, ఉమ్మడి జిల్లాలో దళాన్ని ఆదిలోనే నిలువరించేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి నెలన్నర వ్యవధిలోనే రెండు సార్లు పర్యటించారు. ఈ నెల 2న ఆసిఫాబాద్‌కు వచ్చి ఐదు రోజుల పాటు మకాం వేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఐదుగురు దళ సభ్యుల లక్ష్యంగానే కాకుండా కొత్తగా యువత రిక్రూట్‌ను అరికట్టాలనే తీరుగా ఆయన పర్యటన సాగింది. డీజీపీ పర్యటన జరిగిన రెండు వారాల్లోనే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం. ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపాటు కదంబా ఎన్‌కౌంటర్‌తో ఉమ్మడి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత పదేళ్లుగా ఎటువంటి అలజడి లేకుండా సాగిన ఈ ప్రాంతంలో కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో జరిగిన ఎదరు కాల్పులతో ఉమ్మడి జిల్లాలో హైఅలర్ట్ నెలకొంది. పెద్ద ఎత్తున బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. 19 ఏళ్లకే దళంలోకి.. కదంబా ఎన్కౌంటర్లో మృతి చెందిన జుగ్నాక్ బాధీరావు 19 ఏళ్లకే దళంలో చేరాడు. పత్తి విత్తనాలు పెట్టే సీజన్లో ఇల్లు వదిలిపోయి ఇప్పటికీ కనిపించలేదని తల్లి చిన్నుబాయి పేర్కొంది. తల్లిదండ్రులు చిన్నుబాయి, భూమన్న. తండ్రి బాల్యంలోనే చనిపోయాడు. బాదీరావు లారీ క్లీనర్, చికెన్ సెంటర్ నిర్వాహాణ తదితర పని చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దళంలో చేరిన మూడు నెలలకే ఎన్కౌంటర్లో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దద్దరిల్లిన కదంబా కాగజ్‌నగర్: కదంబా అడవి మరోమారు తుపాకుల మోతతో దద్దరిళ్లింది. దాదాపు పదేళ్ల అనంతరం శనివారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. కాగజ్‌నగర్ మండలం కదంబా గ్రామానికి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో కొండపై జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఉమ్మడి జిల్లా ఉలిక్కిపడింది. ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆదివారం సంఘటన స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్, కుమురం భీం జిల్లా ఇన్చార్జి ఎస్పీ సత్యనారాయణతో పాటు ఉమ్మడి జిల్లా ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏఎస్పీ సుధీంద్ర, పోలీస్ అధికారులు పరిశీలించారు. అనంతరం ఎన్కౌంటర్ జరిగిన తీరును ఇన్చార్జి ఎస్పీ వెల్లడించారు. గంట పాటు కాల్పులు.. గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ, స్థానిక పోలీస్ సిబ్బందితో కదంబా అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా శనివారం రాత్రి 10 గంటల సమయంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. లొంగిపోవాలని హెచ్చరిస్తున్నా కాల్పులు జరపడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసుల వైపు నుంచి సైతం ఎదురుకాల్పులు జరిపారు. అయితే ఇరువర్గాల మధ్య దాదాపు గంటకు పైనే కాల్పులు జరిగినట్లు ఇన్చార్జి ఎస్పీ వెల్లడించారు. తెల్లవారుజామున వెతకగా ఆడెల్లు అలియాస్ భాస్కర్ దళంలోని ఇద్దరు సభ్యులు జుగ్నాకా బాదిరావు(19), చుక్కాలు(22) మృతదేహాలు లభించాయి. చనిపోయిన వారిలో బాదిరావుది ఆదిలాబాద్ జిల్లా నేరెడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్, చుక్కాలుది ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లాగా నిర్ధారించారు. అయితే కుమురం భీం, మంచిర్యాల జిల్లాల డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న అడేల్లు అలియాస్ భాస్కర్‌తో పాటు మరికొందరు తప్పించుకున్నారు. భాస్కర్‌తో పాటు దళసభ్యులను పట్టుకునేందుకు కూంబింగ్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. పదేళ్ల తర్వాత ఎన్కౌంటర్.. పులుల ఆవాసంగా పేరొందిన కాగజ్‌నగర్ పరిధి కదంబా అడవి ఇప్పటి పలు ఎన్కౌంటర్లకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో 1998లో మొదటిసారి కదంబా ప్రభు త్వ స్కూల్ పరిసరాల్లో పీపుల్స్‌వార్, పోలీసులకు మధ్య కాల్పులు జరగగా ఇద్దరు నక్సల్స్ చనిపోయారు. మరుసటి ఏడాదే 1999లో రెండోసారి ఎన్కౌంటర్ జరగగా ముగ్గురు నక్సల్స్ చనిపోయారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో ఈనెల 19న జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోలు మృతి చెందారు. 2003లో బెజ్జూర్ మండలం ఆగర్‌గూడలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మవోయిస్టులు మృతిచెందారు. అదే ఏడాది కొండపల్లిలో ఎన్కౌంటర్ జరిగింది. 2010లోనూ మవోయిస్టు కీలకనేతను పోలీసులు మట్టుపెట్టారు. మవోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ ఎన్కౌంటర్లో మృతిచెందాడు. సిర్పూర్(టి)లో పోస్టుమార్టం సిర్పూర్(టి): ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలకు సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య అంబులెన్సులో మృతదేహాలను ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో మృతదేహాలను తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డీఎస్పీలు అచ్చేశ్వర్‌రావ్, స్వామి, కౌటాల సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రవికుమార్, సందీప్, ఆంజనేయులు, వినోద్ ఆస్పత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం అనంతరం బాదిరావ్ కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. చుక్కాలు మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. బాదిరావ్ మృతదేహం వద్ద తల్లి చిన్నుబాయి కన్నీరుమున్నీరుగా విలపించింది. -
ఆసిఫాబాద్‌లో ఎన్కౌంటర్
సాక్షి, మంచిర్యాల : పచ్చటి అడవి కాల్పులతో దద్ద రిల్లింది. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కుమురంభీం– ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కదంబా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయి స్టులకు మధ్య ఎదురు కాల్పులు జరి గాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయి నట్లు తెలుస్తోంది. దట్టమైన అడవిలో, పులులకు ఆవాసంగా ఉన్న ఈ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకోవడం గమనార్హం. రాత్రివేళ కావడం, భారీ వర్షం కురుస్తుం డటంతో మృతదేహాల గుర్తింపు ఆలస్యమవు తోంది. మృతుల్లో వర్గీస్ ఉన్నట్లు ప్రాథమి కంగా నిర్ధారణ అవుతోంది. చనిపోయిన మరొ కరు మహిళా మావోయిస్టు అని సమా చారం. మరో ఇద్దరు కూడా మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో ఏకే 47 స్వాధీన పర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో మావో యిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా గాలింపు చర్యలు కొనసాగు తున్నాయి. 25 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న భాస్కర్ తలపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. కుమురం భీం జిల్లా ఇన్చార్జి ఎస్పీ, రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారా యణ, ఏఎస్పీ సుధీంద్ర సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మొత్తం ఎనిమిది గ్రేహౌండ్స్ బృందాలు, ఆరు స్పెషల్ పార్టీలు పాల్గొన్నాయి. ఇంకా కుంబింగ్ కొనసాగుతుండంతో మరో ఇద్దరు మావోయిస్టులు పోలీసుల దగ్గరగా వెళ్లినట్లు తెలుస్తోంది. ఐదుగురు దళ సభ్యులను చట్టుముట్టి మూడు అంచెల్లో దిగ్బంధం చేసినట్లు సమాచారం. మృతి చెందిన వర్గీస్ ఇటీవలి నియామకాల్లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఏరియా కమిటీ సారథిగా నియమితులయ్యారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఈయనపై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉంది. పక్కా సమాచారంతో దాడి మావోల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పక్క సమాచారంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ సమీప అటవీ ప్రాంతాల్లో బలగాలు కూంబింగ్‌ను విస్తృతం చేశాయి. శుక్రవారం ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడలో సంచరించినట్లు సమాచారం రావడంతో గాలింపు మరింత ముమ్మరం చేశారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, కేబీఎం (కుమురం భీం మంచిర్యాల) డివిజన్ కార్యదర్శి మైలరపు అడెల్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని ఐదుగురు దళ సభ్యులు ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం నుంచి మహారాష్ట్ర నుంచి ప్రాణహిత మీదుగా కొన్నాళ్ల కిందట ఆసిఫాబాద్‌లో ప్రవేశించారు. వారి కదలికలు గుర్తించిన పోలీసులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. గత నెలలో తిర్యాణి మండలం టొక్కిగూడ అడవుల్లో కాల్పులు జరగగా మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు. అప్పటి నుంచి మరింత ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ నెల 2న ఆసిఫాబాద్ చేరుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి ఐదురోజుల పాటు ఇక్కడే మకాం వేశారు. మావోయిస్టుల ఆపరేషన్‌పై స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు. తిరిగివెళ్లిపోతున్నారా? మావోయిస్టుల ఉనికిని ఎప్పటికప్పుడు పోలీసులు పసిగడుతుండటంతో తిరిగి దండకారణ్యంలోకి వెళ్లే క్రమంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం మహారాష్ట్రకు వెళ్లే దారిలో ఉండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇన్నాళ్లు కొమురంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన తిర్యాణి, జన్నారం, ఊట్నూరు, నేరడిగొండ ప్రాంతాల్లో పలుమార్లు దళ సభ్యుల కదలికలను పోలీసులు గుర్తించారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ అటవీ ప్రాంతంలో దళ సభ్యులు సంచరిస్తున్నట్లు గుర్తించగా... తాజాగా ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయే క్రమంలోనే ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
మావోయిస్టుల బంద్ ప్రశాంతం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవళ్లగూడెంలో ఈనెల 3న జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఆదివారం పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టుల కదలికల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో అలజడి వాతావరణం నెలకొంది. బంద్ సందర్భంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు, ఆయా జిల్లాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని నెలలుగా తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న మావోయిస్టులు ఏజెన్సీ జిల్లాలకు ఛత్తీస్‌గఢ్ నుంచి యాక్షన్ టీమ్‌లను పంపించినట్టు తెలుస్తోంది. అలాగే జూలైలో కొత్తగా తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు మరో 12 కమిటీలను మావోయిస్టులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏజెన్సీ జిల్లాల్లో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. గత రెండు నెలల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కరకగూడెం మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోనూ ఎదురు కాల్పులు జరిగాయి. దేవళ్లగూడెం ఎన్కౌంటర్లో తమ యాక్షన్ కమిటీ సభ్యుడు, ముఖ్యనేత హరిభూషణ్ గన్‌మన్ దూది దేవాల్ అలియాస్ శంకర్ మృతితో మావోయిస్టులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. దేవళ్లగూడెం ఎన్కౌంటర్ బూటకం అంటూ మావోయిస్టు పార్టీ ఇల్లెందు–నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి శాంత, భద్రాద్రి కొత్తగూడెం–తూర్పుగోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ తదితరుల పేర్లతో బంద్‌పై ప్రకటనలు విడుదల చేశారు. దీంతో గోదావరి పరీవాహక జిల్లాల్లో పోలీసు యంత్రాంగం అడుగడుగునా తనిఖీలు చేసింది. చివరకు బంద్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా ఈ జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా మోటాపోల్, పునాసార్ అనే రెండు గ్రామాలకు చెందిన ఆదివాసీలను అపహరించిన మావోయిస్టులు తమ అధీనంలో ఉన్న 16 మందిని వదిలిపెట్టారు. మొత్తం 26 మందిని అపహరించగా, అందులో శనివారం ఆరుగురిని విడిచిపెట్టి నలుగురిని హతమార్చిన విషయం విదితమే. -
సరిహద్దుల్లో ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర బోర్డర్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఓవైపు మావోయిస్టుల సంచారం, మరోవైపు పోలీసు, గ్రేహౌండ్స్ బలగాల తనిఖీలు, కూంబింగ్.. అటవీ పల్లెల్లో అలజడి రేపుతోంది. గోదావరి పరిరీవాహక ప్రాంతాతల అడవుల్లో మావోయిస్టులు తలదాచుకుని ఉంటారని భావిస్తూ ప్రత్యేక దళాలతో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచా రంతో గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతాలపై మూడు నెలలుగా దృష్టి సారించిన పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాలను ఇప్పటికే రెండు పర్యాయాలు సందర్శించిన పోలీసు బాస్, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి మరోమారు బుధవారం నుంచి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. ఈ సంద ర్భంగా మూడు రాష్ట్రాల సరిహద్దు, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న పలువురు పోలీసు అధికారుల బదిలీలు కూడా జరిగాయి. మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేయడంలో అనుభవం, ఆసక్తి ఉన్న వారికి పోస్టింగ్ ఇచ్చారు. దేవార్లగూడెం ఎన్‌కౌంటర్‌తో రెడ్అలర్ట్ ఓ వైపు పోలీసుబాస్ పర్యటన, మరోవైపు దేవార్లగూడెం ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవార్లగూడెం – దుబ్బగూడెం గ్రామాల మధ్య గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు యాక్షన్ టీం నాయకుడు దూది దేవాల్ అలియాస్ శంకర్ మృతి చెందా డు. దీనిపై స్పందించిన మావోయిస్టులు ఈనెల 6న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, పెద్దపల్లి, తూర్పు గోదావరి జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా నల్లకుంట ఏరియా అర్లపల్లికి చెందిన శంకర్ అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లగా పట్టుకున్న పోలీసులు చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని ఆ ప్రకటనలో ఆరోపించారు. ఈ మేరకు బంద్‌కు పిలుపునివ్వగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే, గుండాల ఎన్‌కౌంటర్‌తో అప్రమత్తమైన పోలీసులు నక్సల్స్ కోసం వేట మొదలుపెట్టారు. మణుగూరు నుంచి ములుగు జిల్లా మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, భూపాలపల్లి జిల్లా పలిమెల, మహదేవపూర్, మహముత్తారం అడవుల్లోకి మావోయిస్టులు వచ్చినట్లు నిఘా వర్గాల సమాచారంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతీకారంగా మావోయిస్టులు ఏదైనా ఘటనకు పాల్పడుతారేమోననే అనుమానంతో పోలీసులు తనిఖీలు విస్తృతం చేయడంతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే, నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోని టీఆర్ఎస్, బీజేపీ నేతలను పట్టణ ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ పల్లెలు ఉలిక్కి పడుతున్నాయి. బడే చొక్కారావు, వెంకటేశ్ లక్ష్యంగా కూంబింగ్ మావోయిస్టు నేతలు బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ లక్ష్యంగా పోలీసుల కూంబింగ్ సాగుతోంది. “ఆపరేషన్ ప్రహార్’ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన మావోయిస్టు దళాలు వీరి నాయకత్వంలోనే గోదావరి పరివాహక ప్రాంతంలో సంచరిస్తున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న రాష్ట్ర యాక్షన్ టీం కార్యదర్శి దామోదర్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి(జేఎండబ్ల్యూపీ) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్‌ను టార్గెట్ చేసుకొని పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ ఇద్దరు నేతలు భూపాలపల్లి, ములుగు అడవుల్లో మకాం వేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయని సమాచారం. అయితే కేకేడబ్ల్యూ కార్యదర్శిగా పని చేసిన దామోదర్‌కు పూర్వ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ అడవులపై పట్టు ఉండడంతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నట్లు భావిస్తున్నారు. -
మన్యంలో ఉత్కంఠ: మావోయిస్టు ఎన్కౌంటర్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కొన్ని నెలలుగా నిత్యం పోలీసుల సెర్చ్ ఆపరేషన్లు, మావోయిస్టు యాక్షన్ టీమ్‌ల సంచారంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా గుండాల మండలం దేవళ్లగూడెం వద్ద ఎన్కౌంటర్ చోటుచేసుకోవడంతో మన్యం ఉలిక్కిపడింది. యాక్షన్ టీమ్‌లు సంచరిస్తున్నాయనే సమాచారంతో పోలీసులు గత మూడు రోజులుగా గుండాల, ఆళ్లపల్లి అటవీ ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 4:15 గంటల సమయంలో గుండాల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. వారు ఆపకుండా వెళ్లడంతో పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తులు కాల్పులు జరపగా పోలీసులు సైతం ఎదురుకాల్పులకు దిగారు. తర్వాత ఆ ప్రాంతంలో తనిఖీ చేయగా ఒక మృతదేహం కనిపించింది. మరో వ్యక్తి పారిపోయాడు. మృతుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యాక్షన్ కమిటీ సభ్యుడు శంకర్ అని తెలుస్తోంది. దీంతో పోలీసులు అటవీ ప్రాంతాల్లో మరింతగా గాలిస్తున్నారు. తెలంగాణలో తిరిగి పట్టు సాధించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తూ గోదావరి పరీవాహక జిల్లాల్లో కొన్ని యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దించారు. ఈ క్రమంలో మావోయిస్టులకు – బలగాలకు మధ్య వరుస ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. గత జూలై 15న కరకగూడెం మండలంలోని అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగా యి. ఆ తెల్లవారి మణుగూరు మండలం మల్లెతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అయితే జూలై 13న ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని మంగి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడేళ్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నాడు. ఇక గత ఏడాది ఆగస్టు 21న మణుగూరు మండలం బుడుగుల అటవీ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో గుండాల మండలం దామరతోగు గ్రామానికి చెందిన జాడి వీరస్వామి అలియాస్ రఘు అనే మావోయిస్టు మృతి చెందాడు. మావోలు ఛత్తీస్‌గఢ్ నుంచి భద్రాద్రి ఏజెన్సీ మీదుగా ములుగు, మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల ఏజెన్సీ ప్రాంతాల్లోకి వస్తున్నారు. దీంతో ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు నేరుగా రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి గత రెండు నెలలుగా గోదావరి పరీవాహక జిల్లాల్లో వరుసగా హెలీక్యాప్టర్ ద్వారా పర్యటిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలో వరుసగా రెండు రోజులు మకాం వేశారు. రాష్ట్రంలో పట్టు సాధించేందుకే.. తెలంగాణలో గత ప్రాభవాన్ని తిరిగి సాధించేందుకు మావోయిస్టు పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. గత పదేళ్లుగా రాష్ట్రంలో ఆ పార్టీ కార్యకలాపాలు నామమాత్రంగానే ఉన్నాయి. అయితే గత ఏడాది నుంచి కార్యకలాపాలు పెంచేందుకు వ్యూహం రూపొందిస్తున్నారు. యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఆధ్వర్యంలో యాక్షన్ టీమ్‌లు భద్రాద్రి జిల్లాలోకి ప్రవేశించి తరువాత ఇతర జిల్లాల్లోకి వెళ్లాయి. దీంతో పోలీసులు ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో భారీ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. కాగా, గత జూన్‌లో జరిగిన మావోయిస్టు కేంద్ర కమిటీ సమావేశాల అనంతరం ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం నుంచి కీలక నేతలంతా తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు వెళ్లి క్యాడర్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో 21 మంది ఉండగా 11 మంది తెలంగాణ వారే ఉండడంతో రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయి యాక్షన్ కమిటీతో పాటు మరికొన్ని యాక్షన్ టీములు గోదావరి పరీవాహక జిల్లాల్లో తిరుగుతుండడంతో నేరుగా డీజీపీ దృష్టి సారించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బంది, సాయుధ బలగాలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. గుర్తించిన వారు పోలీసులను సంప్రదించాలి : ఎస్పీ కొత్తగూడెంఅర్బన్: గుండాల మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టును గుర్తించిన వారు జిల్లా పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సునీల్‌దత్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. 26 సంవత్సరాల వయసు ఉండి, గులాబీ రంగు టీషర్ట్, నీలం రంగు లోయర్, గోధుమ రంగు ఛాయ కలిగిన మావోయిస్టు మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఉంచామని తెలిపారు. బంధువులు, ఇతర వ్యక్తులు ఎవరైనా గుర్తించినట్టయితే జిల్లా పోలీసులను సంప్రదించాలని సూచించారు. లేదంటే జిల్లా పోలీసు కంట్రోల్ రూం 08744–242097, ఎస్పీ కార్యాలయం 08744–243444 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. -
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో కాల్పుల మోత
-
తృటిలో తప్పిన భారీ ఎన్కౌంటర్
సాక్షి, విజయనగరం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో(ఏవోబీ) మరోసారి తుపాకుల మోతమోగింది. ముంచంగిపుట్టు, పెదబయలు అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే తప్పించుకోగా, ఏవోబీ కార్యదర్శి చలపతి, ఆయన భార్య అరుణ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పులు అనంతరం పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా.. సంఘటనా స్థలంలో రక్తపు మరకలను బట్టి ఈ నిర్ధారణకు వచ్చారు. మరోవైపు భారీ వర్షాలతో పోలీసుల కూంబింగ్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా నెలాఖరున అమరవీరుల వారోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు మావోయిస్టులు సన్నద్ధం అయ్యారు. ఇందుకోసం కార్యక్రమాల రూపకల్పనకు వారంతా కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారంతో పోలీసులు కూంబింగ్ జరిపారు. అయితే గాయపడిన మావోయిస్టులు లొంగిపోతే చికిత్స చేయిస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
ఏవోబీలో మళ్లీ తుపాకుల మోత
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో (ఏవోబీ) మరోసారి తుపాకుల మోత మోగింది. ఒరిస్సాలోని ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు చోటుచుసుకున్నాయి. సిబ్బంది రాకను ముందే పసిగట్టిన మావోయిస్టులు చాకచాక్యంగా తప్పించుకోగలిగారు. వారి కోసం అటవీ ప్రాంతంలో కూబింగ్ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన కిట్‌బ్యాగ్స్, తుపాకీలు, బాంబుల తయారీకి ఉపయోగించి సామాగ్రీ లభ్యమయ్యాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపు గాలింపు చేపడుతున్నారు. కాగా ప్రశాంతంగా ఉన్న ఏవోబీ సరిహద్దుల్లో గతకొంత కాలం నుంచి మావోయిస్టుల అలజడి వినిపిస్తోంది. దీంతో ఎజెన్సీ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
17 మందిని నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తే.....
సాక్షి, న్యూఢిల్లీ : ‘అది అటవి ప్రాంతం. దాదాపు 20 మంది కరడుగట్టిన తిరుగుబాటుదారులు అక్కడ సమావేశమయ్యారు. వారిని చుట్టుముట్టిన సాయుధులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. హాహాకారాలు మిన్నంటాయి. ఆరుగురు పిన్నలు సహా 17 మంది తిరుగుబాటుదారుల ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఈ సంఘటనలో కొంత మంది సాయుధులు గాయపడ్డారు. తిరుగుబాటుదారుల వద్ద ఒక్క తుపాకీగానీ, బాంబుగానీ దొరకలేదు. వాటన్నింటిని మిగతా ముగ్గురు తిరుగుబాటుదారులు పట్టుకొని పారిపోయి ఉంటారు’ ఇది దాదాపు ఏడున్నర ఏళ్ల క్రితం అంటే, 2012, జూన్ 28వ తేదీ రాత్రి చత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా, సర్కేగూడ గ్రామం శివారులో జరిగింది. వారు తిరుగుబాటుదారులు ఎంత మాత్రం కాదని, వారంతా సర్కేగూడ గ్రామానికి చెందిన సాధారణ ప్రజలని తేలింది. కాల్పులు జరిపిందీ మరెవరో కాదు, సీఆర్పీఎఫ్, చత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు. ఆ సంయుక్త సాయుధ దళం నక్సలైట్ల కోసం గాలిస్తూ ఆ రాత్రి అటు గుండా వెళుతుండగా, ఓ చోటు చెట్ట వద్ద మనుషుల అలికిడి వినిపించింది. వారంతా నక్సలైట్లు కాబోలు అని పోలీసులు భావించారు. అర్దచంద్రాకారంలో వారిని చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారు. అక్కడికక్కడే హాహాకారాలు చేస్తూ ఆరుగురు పిల్లలు సహా 17 మంది గ్రామస్థులు రక్తం మడుగులో ప్రాణాలు వదిలారు. పోలీసులు అర్దచంద్రాకారంలో చుట్టుముట్టి కాల్పులు జరపడంతో వారి తుపాకీ గుండ్లే వారికి తగిలి కొంత మంది గాయపడ్డారు. ప్రతిరోజు గ్రామస్థులు ఆ చిట్టి గ్రామం శివారులో వెన్నెల వాకిల్లో గుమిగూడి పిచ్చాపాటి మాట్లాడుకోవడం పరిపాటి. ఈ అలవాటే అనుకోకుండా వారి ప్రాణాలను తీసింది. ఈ విషయాలను మధ్యప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ వీకే అగర్వాల్ చైర్మన్‌గా ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ తన నివేదికలో వెల్లడించారు. ఆయన ఇటీవల ఈ మేరకు ఓ నివేదికను చత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సమర్పించగా, అందులోని విషయాలను ఓ ఆంగ్ల పత్రిక బయట పెట్టింది. ఈ విషయాలన్నీ నిజమేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు బుధవారం నాడు ధ్రువీకరించారు. ఇంకా ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ పరిశీలనకు రాలేదని, కేబినెట్ సమావేశంలో నివేదిక మీద నిర్ణయం తీసుకోవచ్చని ఆ అధికారి తెలిపారు. అది బూటకపు ఎన్కౌంటర్ అని అప్పట్లో అన్ని వర్గాలు ఆందోళన చేయగా, అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి రామన్ సింగ్, విచారణకు 2012, జూలై 11వ తేదీన ఏకసభ్య కమిషన్‌ను నియమించారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. సంచలనం సష్టించిన ‘దిశ అత్యాచారం–హత్య’ కేసులో ప్రజాసంఘాలతోపాటు పార్టీలకు అతీతంగా నాయకులంతా ముక్త కంఠంతో నేరస్థులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. 17 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న నేరస్థులకు ఏ శిక్ష విధించాలంటారో వారు స్పందిస్తేగానీ తెలియదు. నేటి వరకు ఎవరి నుంచి ఏ స్పందనా పెద్దగా రాలేదు. చనిపోయిన వారంతా ఆదివాసులు. వారి ప్రాణాలకు విలువలేదంటూ వదిలేస్తారా!? -
ఎన్కౌంటర్: ఐదుగురు మావోయిస్టుల హతం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి తుపాకీల మోత మోగింది. భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ జిల్లా అంబుజ్‌మడ్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో గాలింపు చేపట్టిన బలగాలకు వారు ఎదురుపడ్డారు. దీంతో తుపాకుల మోతమోగించారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని బేస్‌క్యాంపుకి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా తాజా ఎన్‌కౌంటర్‌తో అటవీ ప్రాంతంలో అలజడి మొదలైంది. మరికొంత మంది మావోయిస్టులు దాగిఉన్నారని సమాచారం అందడంతో కూబింగ్‌ను కొనసాగిస్తున్నారు. -
ఎన్‌కౌంటర్‌తో అలజడి
సాక్షి, కొత్తగూడెం: మణుగూరు మండలం బుడుగుల సమీప అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం 6 – 7 గంటల మధ్య పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ దళసభ్యుడు, గుండాల మండలం దామరతోగు గ్రామానికి చెందిన జాడి వీరస్వామి అలియాస్ రఘు మృతిచెందాడు. మృతదేహం వద్ద రెండు తపంచాలు, 17 బుల్లెట్లు, రెండు కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పినపాక నియోజకవర్గంలో 20 రోజుల వ్యవధిలోనే రెండు ఎన్కౌంటర్లు జరగడంతో ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. కార్యకలాపాల విస్తరణకు మావోల యత్నం పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కార్యకలాపాలు విస్తరించేందుకు మావోలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు నుంచి భద్రాద్రి ఏజెన్సీలో చొరబడి గోదావరి పరీవాహక ప్రాంతాల ద్వారా ఇతర జిల్లాల్లోకి వచ్చి రిక్రూట్మెంట్లు చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ముఖ్యంగా వలస గొత్తికోయ గ్రామాలపై దృష్టి పెట్టారు. మూడు నెలలుగా మావోయిస్టు పార్టీ అగ్రనేత హరిభూషణ్ ఆధ్వర్యంలో వచ్చిన యాక్షన్ టీమ్‌లు పినపాక, ఇల్లెందు డివిజన్లలో తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 రోజుల తేడాతో వరుసగా రెండు ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. గత నెల 31న మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు కూంబింగ్ చేస్తున్న సమయంలో గుండాల మండలం రోళ్లగడ్డ వద్ద సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రీజినల్ కార్యదర్శి, అజాత దళాల కమాండర్ లింగన్న దళం తారసపడింది. ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో లింగన్న మృతిచెందాడు. మిగిలిన సభ్యులు తప్పించుకున్నారు. తాజాగా బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ మణుగూరు ఏరియా దళ కమాండర్ జాడి వీరస్వామి హతమయ్యాడు. అయితే ఈ రెండు ఎన్కౌంటర్ల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోళ్లగడ్డ ఎన్కౌంటర్ జరిగినప్పుడు లింగన్న మృతిచెందిన విషయాన్ని కొన్ని గంటలపాటు ధ్రువీకరించకుండా వ్యవహరించడంతో గుండాల మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు తిరుగుబాటు చేశారు.పోలీసులపై రాళ్లు రువ్వి దాడి చేశారు. ఇక ప్రస్తుతం మణుగూరు మండలం బుడుగుల సమీపంలో జరిగిన ఎన్కౌంటర్ విషయంలోనూ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లేందుకు మీడియాకు అనుమతి ఇవ్వకపోగా, మృతిచెందిన వీరస్వామి ఫొటో తీసే అవకాశం కూడా కల్పించలేదు. మృతదేహాన్ని మణుగూరు ఆస్పత్రికి తరలిస్తున్నామని కాసేపు, కొత్తగూడెం ఆస్పత్రికని మరికొంత సేపు చెప్పి.. చివరకు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో మీడియా నిరసన వ్యక్తం చేసింది. పోలీసుల జల్లెడ.. మూడు నెలల క్రితం హరిభూషణ్ ఆధ్వర్యంలో గోదావరికి రెండువైపులా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోకి రెండు యాక్షన్ టీమ్‌లు వచ్చినట్లు సమాచారం. ఇవి భద్రాద్రి జిల్లాలోని చర్ల, ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలాల మీదుగా గోదావరి దాటి పినపాక, మణుగూరు, కరకగూడెం, గుండాల, ములుగు జిల్లా లోని మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. యాక్షన్ టీమ్‌లు చర్ల మండలం నుంచి గోదావరి దాటి పినపాక మండలంలోని భూపతిరావుపేట, పిట్టతోగు, దోమెడ, కరకగూడెం మండలం ఆర్.కొత్తగూడెం, గుండాల మీదుగా మహబూబాబాద్ జిల్లా గంగారం, కొత్తగూడ, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు అభయారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. తెలంగాణలో కార్యకలాపాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్న మావోయిస్టులు ముందుగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న భద్రాద్రి, ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాల్లో పోడు భూముల వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు గిరిజన ప్రాంతాల్లో పట్టు పెంచుకుని కొత్తగా రిక్రూట్మెంట్లు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు చర్ల మండలం బెస్తకొత్తూరుకు చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును హతమార్చారు. ఇప్పటివరకు సరిహద్దుకు అవతల ఛత్తీస్‌గఢ్ పరిధిలో మావోలకు, పోలీసులకు మధ్య పోరు నడుస్తోంది. ప్రస్తుతం సరిహద్దు ఏజెన్సీతోపాటు ఇల్లెందు, మణుగూరు ఏజెన్సీలో సైతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు రిక్రూట్మెంట్లు, ఇటు ఎన్కౌంటర్లతో ఏజెన్సీలో అలజడి చోటుచేసుకుంది. ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు: భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్ మణుగూరు: ఎదురు కాల్పుల్లో మణుగూరు ఏరియా కమిటీ ఇన్చార్జ్ దళ కమాండర్ జాడి వీరస్వామి అలియాస్ రఘు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మణుగూరు డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల అనంతరం జిల్లాలో రెండు, మూడు మావోయిస్టు టీంలు తమ కార్యకలాపాలను విస్తృతం చేశాయన్నారు. గతంలో లాగా మావోయిస్టులు యూనిఫాం ధరించకుండా సాధారణ దుస్తుల్లో ప్రజల్లో సంచరిస్తూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్నారు. వీరస్వామి మణుగూరు ఏరియా దళ కమాండర్‌గా, నర్సంపేట, ఇల్లెందు ఏరియా కమాండర్‌గా భద్రు, సుధీర్ ఇన్చార్జ్గా, ఏటూర్‌నాగారం, కాటారం, మహదేవ్పూర్ డివిజన్ కమిటీ దళ కమాండర్‌గా పూన సుధాకర్‌లు వ్యవహరిస్తున్నారన్నారు. నాలుగు రోజుల క్రితం వీరస్వామి, రవి మిగతా సభ్యులు పాల్వంచ వలస ఆదివాసీ గ్రామంలో సంచరిస్తూ, రెండు రోజుల క్రితం మణుగూరులోని వలస ఆదివాసీ గిరిజన గ్రామమైన బుడుగులకు చేరుకున్నట్లు తెలిసిందన్నారు. దీనిలో భాగంగానే స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారం తెల్లవారు జామున బుడుగుల ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుం డగా వీరస్వామి, అతడి టీం పోలీసులపై కాల్పులు జరిపారన్నారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతిచెందాని తెలిపారు. ఏజెన్సీ అప్రమత్తం చర్ల: ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఒక దళ సభ్యుడు మృతి చెందగా పలువురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్న క్రమంలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాన్ని అప్రమత్తం చేశారు. మణుగూరు ప్రాంతానికి సమీపంలో ఉన్న గోదావరి దాటి ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతానికి పారిపోతారనే అనుమానంతో గోదావరి తీర ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేశారు. భద్రాచలం ఆస్పత్రిలో పోస్టుమార్టం.. ఎన్కౌంటర్లో హతమైన వీరస్వామి మృతదేహానికి భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. తల్లిదండ్రుల మృతితో అనాథ ఆశ్రమానికి.. గుండాల: జాడి వీరస్వామి అలియాస్ రవి గుండాల మండలం దామరతోగా గ్రామానికి చెందిన వ్యక్తి. హైదారాబాద్‌లో ఉంటున్న వీరస్వామి గతంలో న్యూడెమోక్రసిలో పనిచేశాడు. ఇతను తల్లిదండ్రులు, సోదరుడు మృతి చెందాడు. బంధువుల సాయంతో హైదరాబాద్ లోని ఓ అనాథ ఆశ్రమంలో చేరాడు. అప్పుడప్పుడు దామరతోగు గ్రామానికి వచ్చిపోయేవాడని బంధువులు తెలిపారు. తన పెద్దనాన్న జాడి నర్సయ్య భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో మృతి చెందగా అతన్ని చూసేందుకు వచ్చాడని తెలిపారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందే వరకు అతను మావోయిస్టులతో ఉంటున్నట్లు తమకు సమాచారం లేదని తెలిపారు. నాలుగేళ్ల కిత్రం న్యూడెమోక్రసీ రామన్న దళంలో చేరి రెండేళ్ల పాటు పని చేశాడు. 2017లో దళం నుంచి రెండు తుపాకులతో పారిపోయి పోలీసుల ముందు లొంగిపోయాడు. అనంతరం 2017 నుంచి మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. అప్పుడప్పుడు బయటకు వస్తూ.. పోతూ భద్రూ దళంలోకి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. -
ఏడుగురు మావోయిస్టులు మృతి
-
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా సిబ్బంది కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా సీతాగోటా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం స్థానిక రిజర్వ్ గార్డ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలంలో భారీగా పేలుడు సామాగ్రి, ఆయుధాలను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఏకే-47, 303 రైఫిల్స్, 12 బోర్‌గన్స్ సింగిల్ షాట్ రైఫిల్స్ వంటి ఆయుధాలు వారి వద్ద లభ్యమయ్యాయి. అయితే ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు డీజీపీ డీఎం అవాస్తీ తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర సరిహద్దులో కూడా కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం. కాగా మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీతాగోట్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తోన్న దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో మెరుపువేగంతో వారిపై కాల్పులు జరిపి.. ఏడుగురిని హతమార్చరు. -
ఎన్డీ నేత లింగన్న హతం
సాక్షి, ఖమ్మం(గుండాల) : అప్పుడే తెల్ల వారింది.. రైతన్నలు చేను చెలకల్లోకి పయనమవుతున్నారు.. ఒక్కసారిగా అటవీ ప్రాంతం నుంచి తుపాకుల మోత.. దీంతో భయాందోళనకు గురై ఉరుకులు పరుగులు పెట్టారు.. తేరుకునే సరికి పోలీసులకు, ఎన్డీ దళాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయనే విషయం దావానలంలా వ్యాపించింది. ఈ కాల్పుల్లో న్యూడెమోక్రసీ అజ్ఞాత దళాల నేత, రీజినల్ కార్యదర్శి పూనెం లింగయ్య(50) అలియాస్ లింగన్న మృతి చెందాడు. మరో నేత గోపన్నతో సహా ముగ్గురు సభ్యులు తప్పించుకున్నారు. ఇంకో ఇద్దరు పోలీసుల అదుపులో నుంచి తప్పించుకున్నారు. క్రమంగా చుట్టుపక్కల జనం సంఘటన స్థలానికి చేరుకున్నారు. లింగన్న మృతదేహాన్ని మార్గం తప్పించి తరలిస్తుండగా జనం వెంటపడ్డారు. పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు సుమారు 40 రౌండ్ల వరకు గాలిలోకి కాల్పులు జరిపారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సంఘటన మండలంలోని దేవళ్లగూడెం రోళ్లగడ్డ మధ్య బుధవారం చోటుచేసుకుంది. పది రోజులుగా కూంబింగ్.. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత వారం పది రోజులుగా మండల సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. అప్పటికే పోలీసుల టార్గెట్‌గా ఉన్న లింగన్న, ఆయన ఆరుగురు దళ సభ్యు లు రోళ్లగడ్డ సమీపంలోని పందిగుట్టపై ఉన్నట్లు సమాచారం. దీంతో పక్కా ప్రణాళికతో గ్రేహౌండ్స్ బలగాలు సుమారు మంగళవారం రాత్రికే ఆ అటవీ ప్రాంతంలో మోహరించారు. బుధవారం తెల్లవారు జామున పోలీసులు లింగన్న, దళ సభ్యుల స్థావరాల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయి. లింగన్న మృతి.. తప్పించుకున్న దళ సభ్యులు పోలీసులకు, దళానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో లింగన్న మృతి చెందగా దళంలో ఉన్న బయ్యారం దళకమాండర్ గోపన్నతో పాటు మరో ఐదుగురు తప్పించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు దళ సభ్యులు దేవళ్లగూడెం–రోళ్లగడ్డ మధ్య తుపాకులతో పారిపోతుండగా అదుపులోకి తీసుకుని సంఘటన స్థలానికి తీసుకెళ్లినట్లు స్థానికుల సమాచారం. అయితే అప్పటికే లింగన్న మృతి చెందాడు. పందిగుట్ట వద్ద పడిగాపులు ఎదురుకాల్పులు జరిగిన సంఘటనా స్థలానికి ఏం జరిగిందోనని తెలుసుకునేందుకు చుట్టపక్క గ్రామాల ప్రజలు, పార్టీ నాయకులు సుమారు 300 మంది పైగా పందిగుట్ట ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుట్టపైకి పోలీసులు ఎవరినీ వెళ్లనివ్వలేదు. మీడియాను సైతం అడ్డుకున్నారు. అప్పటికే పోలీసులపై నినాదాలు చేశారు. చాలా సేపటి తర్వాత మీడియా, జనం కలసి గుట్టపైకి వెళ్లారు. స్థావరాల వద్ద అన్నం, కూరగాయలు, వాటర్ క్యాన్లు, తదితర సామగ్రి మాత్రమే ఉన్నాయి. గుట్టపై పోలీసులుగానీ, మృతదేహాలు గానీ లేవు. మరో దారిలో పోలీసులు మృతదేహా న్ని మోసుకెళ్తుండడాన్ని గమనించి జనం వెంటపడ్డారు. మృతదేహం అడ్డగింత...ఉద్రిక్తత సాధారణంగా ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలోనే మృతదేహాన్ని ఉంచి మీడియాకు చూపించి గ్రామస్తుల సహకారంతో మృతదేహాలను తీసుకెళ్తుంటారు. అలా జరగకుండా మరో మార్గంలో తరలిస్తుండగా వెంట పడుతూ ఉద్రేకానికి గురైన ప్రజలు పోలీసులపై రాళ్లు రువ్వారు. మృతదేహాన్ని వదిలి పోలీసులు కొద్ది దూరం వెళ్లారు. అప్పటికే ఇద్దరు పోలీసుల తలలు పగిలాయి. దీంతో ప్రతిఘటించిన పోలీసులు గాలిలో 18 విడతలుగా సుమారు 40 రౌండ్లకు పైగా కాల్పులు జరుపుతూనే జనాన్ని చెదరగొట్టారు. ఈ సంఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మీడియాపై సైతం పోలీసులు విరుచుకుపడ్డారు. మూడు దఫాలుగా కాల్పులు పందిగుట్ట ప్రాంతంలో కాల్పులు మూడు దఫాలు గా పది నిమిషాలకోసారి జరిగాయి. స్థావరంపై ఒకసారి, సభ్యులు పారిపోతుండగా, ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకునప్పుడు మరోసారి కాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కనికరించలేదు గుండాల: నా భర్తను ఒక్కసారి చూద్దామని దగ్గరకు వెళితే.. పోలీసులు కనీసం కనికరం చూపించలేదంటూ లింగన్న భార్య కన్నీరు మున్నీరయింది. సంఘటనా ప్రాం తం నుంచి గుండాల వరకు మృతదేహాన్ని తీసుకొస్తుండగా క్షణంపాటు కూడా చూపించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంట తడి పెట్టించింది. ప్రతి ఒక్కరికీ లింగన్న సుపరిచితుడు కావడంతో బంధువులతో, పాటు చుట్టపక్కల గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. మృతదేహాన్ని ట్రాక్టర్ ద్వారా గుండాలకు తీసుకవచ్చి సుమోలో కొత్తగూడెం తరలించారు. ఇల్లెందు ఇన్చార్జి డీఎస్పీ ఎస్ఎం అలీ గుండాలకు చేరుకుని పరిస్థితిన సమీక్షించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో లింగన్న మృతదేహం సింగరేణి(కొత్తగూడెం): సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ అజ్ఞాత దళనేత లింగన్న మృతదేహాన్ని పోలీసులు కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి బుధవారం సాయంత్రం తీసుకువచ్చారు. డాక్టర్ల సమ్మె కారణంగా బుధవారం పోస్టుమార్టం నిర్వహించే అవకాశం లేకపోవడంతో మృతదేహాన్ని భద్రపరిచారు. గురువారం లింగన్న మృతదేహానికి ఇక్కడే పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశాలున్నాయి. కాగా ఆస్పత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్చురీ వద్ద గ్రేహౌండ్స్, సివిల్ పోలీసులను మోహరించారు. ఆందోళనకారులు ఆస్పత్రికి చేరుకుంటారనే సమాచారంతో వన్‌టౌన్ సీఐ కుమారస్వామి పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గాలింపు చేపడుతుండగా కాల్పులు జరిపారు కొత్తగూడెం: కూంబింగ్ చేపడుతున్న సమయంలో ఎదురైన నక్సల్స్ కాల్పులు జరపడంతో.. ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఈ కాల్పుల ఘటనలో ఒక నక్సలైట్ మృతిచెందగా, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా వారు పారిపోయినట్లు జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘటన స్థలంలో ఒక నక్సలైట్ మృతదేహాన్ని గుర్తించడంతోపాటు ఎస్ఎల్ఆర్ రైఫిల్, విప్లవ సాహిత్యం, కొంత సామగ్రిని స్వాధీనపరచుకున్నట్లు వివరించారు. పారిపోతున్న సాయుధులైన రామకృష్ణ, మహేష్ అనే నక్సలైట్లను అదుపులోకి తీసుకోగా.. నక్సల్స్ సానుభూతిపరులు వారిని అడ్డగించి, రాళ్లు రువ్వి, అపహరించుకుని పోయారని పేర్కొన్నారు. మృతిచెందిన నక్సలైట్‌ను పూనెం లింగయ్య అలియాస్ లింగన్నగా గుర్తించామని, ఇతను న్యూడెమోక్రసీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడని, ఇతనిపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. కాల్పుల ఘటనలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడేనికి చెందిన స్టేట్ కమిటీ మెంబర్ ధనసరి సమ్మయ్య అలియాస్ గోపన్న, జిల్లా కమిటీ సభ్యుడు ఆరేం నారాయణ అలియాస్ నరేష్, అజ్ఞాత దళ సభ్యుడు నాగన్న ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. పోలీసులపై దాడి చేసిన నక్సల్స్ సానుభూతిపరులపై, పోలీసు కస్టడీలో ఉన్న ఇద్దరు నక్సల్స్‌ను అపహరించినందుకు గుండాల ఠాణాలో కేసులు నమోదు చేసినట్లు వివరించారు. -
భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోల మృతి
బస్తర్ : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. జగదల్పూర్లోని తిరియా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహించగా.. మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పులు ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని వెల్లడించారు. మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా మరోవైపు మహారాష్ట్రలో ఆరుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాము ఇక దళంతో కలిసి పనిచేయమని గడ్చిరోలి పోలీసుల ఎదుట ఆరుగురు సీనియర్ నక్సల్స్ లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్‌పై రూ. 32లక్షల రివార్డు ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
దంతేవాడలో ఎదురుకాల్పులు.. ఇద్దరి మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా గుమియపాల్ వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో గుమియపాల్ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అదే సమయంలో మావోయిస్టులు వారికి తరసా పడటంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులను సిబ్బంది మట్టుబెట్టారు. ఒకరిని అరెస్ట్ చేసి.. వారి వద్ద ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తాజా ఘటనతో దంతేవాడ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ను మరింత కట్టుదిట్టం చేశారు. -
మావోయిస్టుల చేతిలో పాక్ ఆయుధాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని ముర్నార్ అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ఇద్దరు మావోయిస్టులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు.. వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఆయుధాల్లో నాటో, పాకిస్తాన్ ఆర్మీ ఉపయోగించే ఆధునాతనమైన హెక్లెర్, కోచ్ జీ3 రైఫిల్లు ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇవి వీరికి ఎలా చేరాయి..? మావోస్టులు, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధం ఎంటీ..? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై డీఎమ్ అవస్తి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఆర్మీ ఉపయోగించే జీ 3 రైఫిల్‌ను మేము స్వాధీనం చేసుకున్నాం. ఇలా మరో దేశం ఉపయోగించే ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి. గతంలో కూడా మావోయిస్టుల వద్ద పాక్‌కు చెందిన ఆయుధాలు లభ్యమయ్యాయి. కాని అవి ఎక్కడి నుంచి వచ్చాయో మాత్రం తెలీలేదు’’ అని పేర్కొన్నారు. కాగా 2018 సంవత్సరంలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మావోల నుంచి జర్మన్లో తయారైన రైఫిల్, అమెరికాలో తయారైన సబ్- మెషిన్ గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు విదేశాల్లో తయారైన టెలిస్కోప్‌లను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. -
చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మావోయిస్టుల ఎన్కౌంటర్
చత్తీస్‌గఢ్: పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన కాంకర్ జిల్లా తడోకి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ పి. సుందర్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా రిజర్వ్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాసేపటి తర్వాత అవతలి వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. అనంతరం మొదట కాల్పులు ప్రారంభమైన చోటుకి వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వాటితో పాటు రెండు ఎస్ఎల్ఆర్ తుపాకులు, ఒక .303 రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని డీఐజీ వివరించారు. -
ఏవోబీలో మావోయిస్టు అగ్రనేతలు?
సాక్షి, రాయగడ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అరుణ, నవీన్ మకాం వేసినట్లు సమాచారంతో వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కొరాపుట్ జిల్లా పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిటుబ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల కిట్‌లో కీలక సమాచారం లభించడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సరిహద్దు జిల్లాల్లో జవాన్ల కూంబింగ్ ఉద్ధృతంగా సాగుతుండటంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కాగా సీలేరులో ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ మన్యంలో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం రాయగడ, కలహండి జిల్లాల సరిహద్దులో త్రిలోచనపూర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు టార్గెట్‌గా మావోయిస్టులు మందుపాతర పేల్చగా...జవాన్లు తృటిలో తప్పించుకున్నారు. దీంతో కల్యాణ సింగుపురం ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ నాల్గవ బెటాలియన్, ముకుందపుర్ సీఆర్పీఎఫ్ బెటాలియన్ హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని భారీగా కూంబింగ్ చేపట్టారు. కాగా ఈ నెల 10వ తేదీన మల్కన్‌గిరి, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు పేల్చిన ల్యాండ్‌మైన్ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వారిని చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్లో విశాఖకు తరలించారు. -
మావోయిస్టు కామేశ్వరి ఎన్కౌంటర్
పశ్చిమగోదావరి ,జంగారెడ్డిగూడెం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మావోయిస్టు, భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప, అలియాస్ చంద్రి, అలియాస్ సింద్రి, అలియాస్ రింకీ పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందింది. బుధవారం ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లా పడువా పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టులు, పోలీసు బలగాలు, స్పెషల్ ఆపరేషన్ గ్రూపు(ఎస్ఓజీ) మధ్య పెద్దెత్తున ఎదురు కాల్పులు జరిగాయి. కోరాపుట్ జిల్లా ఎస్పీ కేవీ సింగ్ తెలిపిన వివరాలు ప్రకారం కోరాపుట్ జిల్లా నందాపూర్ బ్లాక్ పరిధిలో గల హతీబరి పంచాయతీ సమీపంలో కిటువాకమీ అడవుల్లో 15 మందికి పైగా మావోయిస్టులు సమావేశమైనట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు, ఎస్‌వోజీ బలగాలతో దాడులు నిర్వహించామన్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు, ఎస్‌వోజీ, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయని, ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఆయన ధృవీకరించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు. చనిపోయిన మహిళా మావోయిస్టుల్లో భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప అలియాస్ రింకీ ఉన్నట్లు ఎస్పీ తెలియజేశారు. కామేశ్వరిది శ్రీకాకుళం కాగా, ఈమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈమె తల్లితండ్రులు శ్రీకాకుళంలో ఉండగా కామేశ్వరిని భీమవరంలో ఒక వ్యక్తికి చ్చి వివాహం చేశారు. కొంతకాలం కామేశ్వరి భర్తతో కాపురం చేయగా, వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. తరువాత తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ డిపోలో కామేశ్వరి కండక్టర్‌గా పనిచేసింది. ఈ సమయంలోనే మావోయిస్టులపై ఆకర్షితురాలై 2008–09లో కామేశ్వరి మావోయిస్టుల్లో చేరింది. అప్పటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ యాక్షన్ టీమ్ సభ్యురాలిగా మారింది. కిడారి, సోమ హత్యోదంతం అనంతరం వీటి వెనుక భీమవరానికి చెందిన కామేశ్వరి అనే మావోయిస్టు పాత్ర ఉందని పోలీసులు పేర్కొన్నప్పుడు జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉంటూ వస్తోంది. ఈ సమయంలో మావోయిస్టుల వైపు ఎక్కువగా గిరిజనులు ఆకర్షితులై చేరుతుంటారు. అయితే మైదాన ప్రాంతం నుంచి మావోయిస్టుల్లో చేరడం అరుదు. జిల్లా నుంచి భీమవరంలో కొంత కాలం నివాసం ఉన్న కామేశ్వరి మావోయిస్టుల్లో చేరడం, క్రియాశీలకంగా మారి మావోయిస్టుల్లో ప్రధాన వ్యక్తిగా రూపాంతరం చెందింది. ఈ నేపధ్యంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆమె హతమైంది. జిల్లా నుంచి ఇలా మావోయిస్టుల్లో చేరి ఎన్‌కౌంట్‌లో హతమైన ఘటనలు గతంలోనూ జరిగాయి. -
రెడ్ అలెర్ట్!
విశాఖపట్నం , అరకులోయ: ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పాడువా సమీపం కిటుబడి అటవీ ప్రాంతంలో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల శిబిరంపై ఒడిశా పోలీసులు దాడులు చేసి అయిదుగురు మావోయిస్టులను మట్టుబెట్టారు. ఈ పరిస్థితిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఏవోబీకి సమీపంలో ఉన్న అరుకులోయ ఏజెన్సీలో పోలీసులు కూంబింగ్ ప్రక్రియను ముమ్మరం చేశారు. గత నెల రోజుల నుంచి ఒడిశాలోని పాడువా ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో ఆ రాష్ట్ర పోలీసు పార్టీలు కూంబింగ్ చర్యలను విస్తృతం చేసింది. పాడువా ప్రాంతానికి సరిహద్దులో ఉన్న విశాఖ జిల్లా అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట సరిహద్దు వరకు పోలీసు పార్టీలు గాలింపు చర్యలను విస్తృతం చేశాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు పోలీసులకు తారసపడడంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం అయిదుగురు మావోలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. వీరంతా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు మావోయిస్టు పార్టీకి చెందిన కీలకనేతలుగా ఒడిశా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్కౌంటర్ సంఘటన నుంచిమరింత మంది మావోయిస్టులు తప్పించుకోవడంతో ఒడిశా పోలీసు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఏవోబీలో పోలీసు అధికారులు రెడ్ అలెర్ట్‌ను ప్రకటించారు. ఒడిశాకు సరిహద్దులో ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు పోలీసు స్టేషన్లతో పాటు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న డుంబ్రిగుడ, అరకులోయ, హుకుంపేట పోలీసు స్టేషన్ల పరిధిలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఎన్కౌంటర్ ఘటనపై విశాఖ రూరల్ జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ కూడా వివరాలు సేకరించారు. ఒడిశా పోలీసు అధికారులతో ఫోన్లో సమీక్షించినట్టు సమాచారం. విశాఖ ఏజెన్సీలోని పోలీసు స్టేషన్లను ఎస్పీ అప్రమత్తం చేశారు. ఒడిశాలోని పాడువా ప్రాంతంలో ఒడిశా పోలీసు పార్టీలు కూంబింగ్ కొనసాగిస్తుండడంతో ఎన్కౌంటర్లో తప్పించుకున్న మరింత మంది మావోయిస్టులు విశాఖ జిల్లా అటవీ ప్రాంతాలలోకి చొరబడి తలదాచుకుంటారనే అనుమానంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఒడిశా ప్రాంతంలో పోలీసు బలగాలు అధికంగా మొహరించడంతో ఏవోబీలో యుద్ధ వాతావరణం నెలకొంది. -
ముగ్గురు మావోయిస్టులు హతం
రాంచీ : జార్ఖండ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. గుమ్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి రెండు ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు నిన్న పోలీసులు నిర్వహించిన కూంబింగ్‌లో భారీగా పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. మహవగరీ జరిపిన తనిఖీల్లో 17 టిఫిన్ బాంబులు, 200లకు పైగా డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. -
బీజాపూర్‌లో భారీ ఎన్కౌంటర్
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లా భైరాన్ గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 10మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. కాగా మావోయిస్టుల మృతిని బీజాపూర్ ఎస్పీ మోహిత్ గార్గ్ అధికారికంగా ధ్రువీకరించారు. కాగా భైరాంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు భద్రతాదళాలకు సమాచారం అందటంతో ఇంద్రావతి నది సమీపంలోని అబూజ్మడ్ ప్రాంతంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపి 10 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. -
ఎనిమిది మంది మావోయిస్టుల హతం
రాయ్‌పూర్ : మావోయిస్టులకు కేంద్రమైన ఛత్తీస్‌గఢ్‌లో వారికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులతో తూటల మోతకు అటవి ప్రాంతం దద్దరిల్లింది. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందగా.. ఇద్దరు డీఆర్జీ జవాన్లు కూడా మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కాగా ఆదివారం బీజాపూర్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్కౌంటర్లో మృతి చెందిన వారంతా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) సంస్థకు చెందిన వారని సుక్మా ఎస్పీ అభిషేక్ మీనా వెల్లడించారు. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని.. మృత దేహాలను గుర్తించే పనిలో ఉన్నామని ఆయన తెలిపారు. కాల్పుల్లో గాయపడిన జవాన్లకు చికిత్స అందిస్తున్నామని మీనా పేర్కొన్నారు. -
ఒడిశాలో భారీ ఎన్కౌంటర్
మల్కన్‌గిరి/సీలేరు: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో సోమవారం ఉదయం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు సహా ఐదుగురు మృతి చెందారు. మావోయిస్టు అగ్రనేత రణదేవ్ ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)ల్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎస్పీ జగ్మోహన్ మీనా ఎస్ఓజీ, డీబీఎఫ్ జవాన్లతో కలిసి ఆదివారం అర్థరాత్రి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మావోయిస్టు అగ్రనేత రణదేవ్ పప్పులూరు పంచాయతీ అల్లూరికొట్ట గ్రామంలో ఆదివారం రాత్రి నుంచి ప్రజాకోర్టు నిర్వహిస్తున్నాడని తెలుసుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అప్రమత్తమైన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో బలగాలు కూడా కాల్పులు జరిపాయి. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, కాల్పులు కొనసాగుతుండగానే రణదేవ్ సహా పలువురు కీలక నేతలు తప్పించుకున్నారు. మృతులను కలిమెల దళ కమాండర్ ఉంగసోడి అలియాస్ కీర్తి, కలిమెల దళ సభ్యులు సీమ అలియాస్ రూప, మసీమడి అలియాస్ సునీతలుగా గుర్తించారు. మిగతా ఇద్దరినీ గ్రామస్తులుగా అనుమానిస్తున్నారు. మృతదేహాలను మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి తరలించారు. సంఘటన ప్రాంతంలో గ్రనేడ్‌తోపాటు రెండు ఎస్ఎల్ ఆర్, ఒక ఇన్సాస్, ఒక .303 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో కలిమెల దళం అంతరించినట్లేనని ఎస్పీ మీనా తెలిపారు. తప్పించుకున్న అగ్రనేతల కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు. అల్లూరికొట్ట గ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో ఉంది. -
మీనాది హత్యే!
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ కటాఫ్ ఏరియా ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో మీనా మృతి చెందలేదని, ఇరు రాష్ట్రాల పోలీసులు కాల్చి చంపారని అమరవీరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు భవానీ, నిరసన నేతలు బషీద్ ఆరోపించారు. మీనాను పోలీసులు ఈ నెల 11వ తేదీన అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసినా లొంగకపోవడంతో 12వ తేదీన కాల్చి చంపారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ప్రాంతంలో అక్రమంగా బాక్సైట్ తవ్వకాలు చేపడుతున్నారన్న నేపథ్యంలోనే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమను మావోయిస్టులు చంపారని అన్నారు. ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఒడిశా పోలీసులు సంయుక్తంగా కొరాపుట్, మల్కన్‌గిరి అడవుల్లో కూంబింగ్ నిర్వహించి, మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా చేసుకుని మీనాని చంపారని తెలిపారు. 303 సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వరంగల్ జిల్లాలోని పొచ్చన్నపేటలో మీనాకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. విప్లవ జోహార్లు తెలుపుతూ అంతిమ సంస్కారాలు జరిపారు. ఈ అంతిమయాత్రలో వరంగల్ పౌరహక్కుల కార్యకర్త రంజిత్, తెలంగాణ రాష్ట్ర ఎస్ఎల్సీ అధ్యక్షుడు లక్ష్మణ్, మీనా కుటుంబ సభ్యులు సత్యం, భాస్కర్, గాజర్ల రవి, అశోక్, అనిత తదితరులు పాల్గొన్నారు. నలుగురు మావోయిస్టులను కోర్టుకు తరలింపు అలాగే మల్కన్‌గిరి పోలీసుల అదుపులో ఉన్న సుమారు నలుగురు మావోయిస్టులను ఆదివారం కోర్టుకు తరలించినట్టు ఎస్పీ జోగ్గా మోహన్ తెలిపారు. వీరిలో జయంతి అలియాస్ అంజన, గ్లోరి, రాధిక, సుమ అలియాస్ గీత, రాజేష్ కోరా ఉన్నట్టు పేర్కొన్నారు. చదవండి : కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు ఎన్కౌంటర్! -
ఎన్కౌంటర్: కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు హతం
-
కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు ఎన్కౌంటర్!
సాక్షి, విశాఖ ఏజెన్సీ : ఆంధ్ర, ఒడిషా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య శుక్రవారం హోరా హోరీ కాల్పులు జరిగాయి. విశాఖ ఏజెన్సీ బెజ్జంగిలోని పనసపుట్టి సమీపంలో పోలీసుల ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందారు. మృతురాలు గాజర్ల రవి భార్య జిలానీ బేగం అలియాస్ మీనాగా తెలుస్తోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలో మీనా పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఎన్కౌంటర్లో మీనా మృతి చెందగా, జయంతి, గీత, రాధిక, రాజశేఖర్ అనే మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన మీనా గత 20 ఏళ్లుగా మావోయిస్టుగా ఉంటున్నారు. మీనా మృతి చెందినట్టు వార్తలు రావడంతో ఖానాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కిడారి హత్య.. స్థానికుల ప్రమేయం!
-
కిడారి హత్య.. స్థానికుల ప్రమేయం!
సాక్షి, విశాఖపట్నం : డుంబ్రిగూడా పరిసర ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ పోలీసులు భారీగా మోహరించారు. ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు, సోమల హత్య వెనుక స్థానికులు ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యలో మావోయిస్టులకు సహకరించారన్న అనుమానంతో టీడీపీ మాజీ ఎంపీటీసీ సుబ్బారావు, అతని భార్యను విచారిస్తున్నారు. వీరితో పాటు అంత్రిగూడకు చెందిన కమల, శోభన్ అనే ఇద్దరు గిరిజనులు ఆదివారం అదుపులోని తీసుకుని అప్పటినుంచి విచారిస్తున్నారు. కిడారి హత్యకు వీరు సహకరించారని పోలీసులు నిర్ధారించుకున్న తరువాత రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. డుంబ్రిగూడకు చెందిన నలుగురు విలేకర్లను కూడా పోలీసులు విచారించి విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో లివిటిపుట్టలో మావోయిస్టులు లేఖ ఇచ్చారన్న విషయంపై పోలీసులు ఆరా తీసున్నారు. కాగా ఒక వైపు సిట్ విచారణ జరుగుతున్నా.. మరోవైపు పోలీసు అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏక్షణం ఏ అధికారిపై వేటు పడుతోందనని ఏజెన్సీలో పనిచేస్తున్న పోలీసులు ఆందోళన చెందుతున్నారు. -
అరకులో ఉద్రిక్తత.. ఎస్ఐపై వేటు..!
సాక్షి, విశాఖపట్నం, అరకు : అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా కాల్చివేత నేపథ్యంలో అధికారులు స్థానిక డుంబ్రిగుడ ఎస్ఐపై వేటు వేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్ఐ అమ్మనరావుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా నిన్న జరిగిన కాల్పుల్లో కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమాలు మృతిచెందిన విషయం తెలిసిందే. మావోయిస్టుల చర్యకు నిరసనగా ప్రజాసంఘాలు నేడు ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో అరకులో వాహనాల రాకపోకలు నలిచిపోగా.. దుకాణాలు మూతపడ్డాయి. టీడీపీ నేతల హత్యతో అరకులో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేసి.. భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యకర్తలను, అభిమానులను నిలువరించేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను దింపుతున్నట్లు అధికారులు వెల్లంచారు. పోస్టుమార్టం పూర్తి... కిడారి సర్వేశ్వరరావు, సోమాల మృతదేహలకు పోస్టుమార్టం పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించన్నారు. ఈ నేపథ్యంలో భారీగా అదనపు బలగాలను మోహరించారు. అంత్యక్రియల్లో మంత్రులు, ప్రజానిధులు, ఆయన అభిమానులు పాల్గొననున్నారు. మంత్రుల కోసం ప్రత్యేక హెలికాఫ్టర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అంత్యక్రియల నేపథ్యంలో అరకులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి : అట్టుడికిన మన్యం తూర్పుకొండల్లో.. మావోగన్స్ ఘాతుకం మంటలు రేపిన మారణకాండ భయోత్పాతం.. భీతావహం -
భారీ ఎన్కౌంటర్.. 14 మంది మృతి
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గడ్‌లోని గొల్లపల్లి కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 14మంది మవోయిస్టులు మరణించారు. పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కాగా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో 42 మంది మవోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి తీరని నష్టం జరుగుతోంది. -
ఉపాధ్యాయ వృత్తి వదిలి ఉద్యమంలోకి..
సాక్షి, భూపాలపల్లి : తనకు వచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలి మావోయిస్టు పార్టీలో చేరి 15 ఏళ్లుగా విప్లవోద్యమంలో కొనసాగుతున్న సుంకరి రాజ్‌కుమార్ అలియాస్ అరుణ్‌కుమార్(36) ప్రస్థానం ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి–నిమ్మలవాగు అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్లో రాజ్‌కుమార్ మృతిచెందడంతో తన స్వగ్రామం భూపాలపల్లి మండలం దూదేకులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దూదేకులపల్లి చెందిన సుంకరి రామక్క, సమ్మయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అందరిలో చిన్నవాడైన రాజ్‌కుమార్ డిగ్రీ, బీఈడీ పూర్తి చేశాడు. కొన్నాళ్లు గ్రామంలోనే విద్యావలంటీర్‌గా పనిచేశాడు. గ్రామస్తుల సహకారం తీసుకుని పాఠశాలలో వసతులు కల్పించాడు. ఈ క్రమంలోనే అతడికి నాగార్జున సాగర్‌లో ఉద్యోగం వచ్చినప్పటికీ వెళ్లకుండా విప్లవోద్యమానికి ఆకర్షితుడై 2003లో అప్పటి సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్‌లో చేరాడు. 2004లో ప్రభుత్వంతో జరిగిన మావోయిస్టులు చర్చల అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సంవత్సరంపాటు గ్రామంలోనే ఉండి మళ్లీ ఉద్యమబాట పట్టాడు. జిల్లాలోని మహదేవ్పూర్ ఏరియాలో కొన్నాళ్లు పనిచేసిన అనంతరం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం చర్ల శబరి ఏరియా కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్నాడు. రాజ్‌కుమార్ దళంలో పని చేసేవారికి వైద్య సేవలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఎదురుకాల్పుల్లో మృత్యువాత.. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిం ది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు కూంబిం గ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కుర్నపల్లి–నిమ్మలగూడెం మధ్యలోని అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మావోయిస్టులు–పోలీసులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీ చర్ల శబరి ఏరియా కమిటీ సభ్యుడు అరుణ్ అలియాస్ రాజ్‌కుమా ర్ మృతిచెందాడు. మరికొందరు మావోయిస్టులకు గాయాలయ్యాయని, వారు తప్పించుకున్నారని సమాచారం. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహంతోపాటు ఒక 303 రైఫిల్, కిట్ బ్యాగులు, గొడుగులు, చేతి సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని ట్రాక్టర్లో కుర్నపల్లి అటవీ ప్రాంతం నుంచి సత్యనారాయణపురంలోని సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్ క్యాంప్ నకు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో భద్రాచలం ఏరియా వైద్యశాలకు చేర్చారు. -
కోవర్టు ద్వారా పెళ్లి భోజనంలో విషం పెట్టి..
కరీంనగర్ జిల్లా : మహరాష్ట్రలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ పచ్చిభూటకమని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఎటపల్లి తాలూకాలోని సింలి గ్రామంలో కోవర్టు ద్వారా పెళ్లి భోజనంలో విషం పెట్టి 33 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని ఆరోపించారు. ఇది పూర్తిగా బీజేపీ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అని విమర్శించారు. దీనిని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. -
శాటిలైట్ల సాయంతో ఇంద్రావతి ఎన్కౌంటర్!
పెద్దపల్లి: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో తాడ్గాం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందిన సంఘటనకు సంబంధించి భద్రతా దళాలు ఆధునిక టెక్నాలజీని వినియోగించినట్టు భావిస్తున్నారు. నక్సలైట్ల ఏరివేతకు హెలికాప్టర్లు, డ్రోన్ కెమెరాలను వాడుకుంటున్న కేంద్ర బలగాలు, పోలీసులు తాజాగా శాటిలైట్ల ద్వారా ఫోటోలను సేకరించి దాడులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ల (ఉపగ్రహాల) సాయం తో నక్సలైట్ల కదలికలను కనిపెడుతున్న పోలీసులు నక్సల్ దళాల వెంటపడి మట్టుపెడుతున్నారు. ఇదే తరహాలో ఆదివారం ఇంద్రావతి నది ఒడ్డున తాడ్గాం వద్ద నక్సలైట్ల కదలికలను కనిపెట్టి ఎన్కౌంటర్లో మట్టుబెట్టారు. ఈ సంఘటనతో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల పూజారి కాంకేర్‌లో 10 మంది సహచరులను కోల్పోయిన నక్సల్స్.. ప్రతీకారం కోసం ఎదురుచూస్తుండగానే పోలీసులు మరోసారి 16 మందిని ఎన్కౌంటర్లో హతమార్చారు. పోలీసులు కాలినడకన గాలింపు చర్యలకు వెళ్తున్న ప్రతీసారి మందుపాతరలతో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్నారు. దీంతోనే ఇటీవలి కాలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ర్లలో పోలీసులదే పైచేయిగా మారింది. -
ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ ఎన్కౌంటర్ కేసీఆర్ ఫాసిస్టు పాలనకు పరాకాష్ట అని, 12 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం హేయమైన చర్య అని వరవరరావు మండిపడ్డారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లో చనిపోయిన వారికి ఫోరెన్సిక్ వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించాలని, మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు. -
ఫోరెన్సిక్ డాక్టర్‌తో పోస్టుమార్టం చేయించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించి భద్రాచలానికి తీసుకొచ్చిన మృతదేహాలకు ఫోరెన్సిక్ డాక్టర్‌తో పోస్టుమార్టం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ పోస్టుమార్టం మొత్తాన్ని వీడియో తీయాలని, అనంతరం ఆ మృతదేహాలను మృతుల కుటుంబీకులకు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తొండపాల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయడంతోపాటు మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రి నుంచి వరంగల్ ఎంజీఎం లేదా ఉస్మానియా ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పౌర హక్కుల కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. లంచ్‌మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలు చేసిన వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. మీ సమయంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ, ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం ఛత్తీస్‌గఢ్ పరిధిలోకి వస్తుందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే న్యాయ పరిధి ఈ హైకోర్టుకు లేదని వివరించారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన ఓ మావోయిస్టు, ఓ పోలీసు మృతదేహాలను భద్రాచలం తీసుకొచ్చారని రఘునాథ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మృతుల్లో ఇప్పటి వరకు ఇద్దరిని గుర్తించడం జరిగిందని, ఆ రెండు మృతదేహాలను ఛత్తీస్‌గఢ్ పోలీసుల విన్నపం మేరకు భద్రతా కారణాలరీత్యా పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని రామచంద్రరావు వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, భద్రాచలం ఈ హైకోర్టు న్యాయపరిధిలోకి వస్తుంది కాబట్టి, ఆ రెండు మృతదేహాల విషయంలో జోక్యం చేసుకునే పరిధి తమకు ఉందని స్పష్టం చేసింది. మృతుల్లో ఎంత మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారని ధర్మాసనం ప్రశ్నించగా, హరిభూషణ్ తెలంగాణ వ్యక్తేనని రఘునాథ్ చెప్పారు. భద్రాచలం ఆసుపత్రిలో ఫోరెన్సిక్ డాక్టర్లు లేరని, అందుకే ఎంజీఎంకి తరలించాలని కోరుతున్నామన్నారు. భద్రాచలం ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలున్నాయని, అందుకే ఆ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడకు తీసుకురావడం జరిగిందని అదనపు ఏజీ చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, భద్రాచలం తీసుకొచ్చిన మృతదేహాలకు ఫోరెన్సిక్ డాక్టర్‌తో పోస్టుమార్టం చేయించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను వీడియో తీశాక, మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించాలని ఆదేశించింది. ఈ ఎన్కౌంటర్లో మరణించిన వారిలో ఎవరి మృతదేహాన్నైనా తెలంగాణ ప్రాంత పరిధిలోకి తీసుకొస్తే, ఆ మృతదేహాల విషయంలోనూ ఇదే ప్రక్రియను అనుసరించాలని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
నేడు 5 రాష్ట్రాల్లో మావోల బంద్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని కటాఫ్ ఏరియాలో ఇటీవల 30 మంది మావోయిస్టులపై పోలీసుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం 5 రాష్ట్రాల్లో బంద్ జరగనుంది. బంద్‌ను విజయవంతం చేసేందుకు మావోలు ఇప్పటికే మన్యంలో బ్యానర్లు, కరపత్రాలతో ప్రచారం చేస్తుండగా, విఫలం చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దయ, గణేష్ వంటి స్టేట్ కమిటీ సభ్యులతో పాటు డివిజన్ కమిటీ, ఏరియా కమిటీ సభ్యులను, అమాయక గిరిజనులను ప్రభుత్వ ప్రోద్బలంలో పోలీసులు పట్టుకుని కాల్చి చంపేసి ఎదురుకాల్పుల్లో చనిపోయారంటున్నారని ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. సురక్షిత ప్రాంతాలకు ప్రజా ప్రతినిధులు బంద్ నేపథ్యంలో ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశాలున్నాయనే సంకేతాలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ ప్రభావం ఉండే ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులను, మావోల హిట్ లిస్టులో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సెల్ టవర్లకు భద్రత కల్పించారు. మన్యంలో అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. -
ఎరు పెక్కిన ఏవోబీ
-
ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ :ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్కౌంటర్లో 24మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. ఈ ఘటనను సవాల్ చేస్తూ పౌరహక్కుల నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు మధ్యాహ్నం పిటిషన్ విచారణకు రానుంది. కాగా ఏవోబీ ఎన్‌కౌంటర్‌ను విరసం నేత వరవరరావు తీవ్రంగా ఖండించారు. ఏవోబీలో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఎన్కౌంటర్లో చనిపోయినవారి మృతదేహాలను భద్రపరచాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం విశాఖలో మాట్లాడుతూ గుర్తించిన మృతదేహాలకు...వారి బంధువులు వచ్చేవరకూ పోస్ట్‌మార్టం నిలుపుదల చేయాలన్నారు. జాతీయ మానవ హక్కుల సంస్థ నిబంధనల మేరకే పోస్ట్‌మార్టం నిర్వహించాలని చంద్రశేఖర్ కోరారు. కాగా మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్లో ఒడిశాకు తరలిస్తున్నారు. -
ఒడిస్సా ఎన్కౌంటర్ బూటకం
- ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో జరిగిన ఘటనపై వైకో ఆత్మకూరురూరల్: ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుఝామున పోలీసులు, మావోయిస్టుల మ«ధ్య జరిగినట్లు చెబుతున్న ఎదురు కాల్పులు పూర్తిగా సత్యదూరమని. అది బూటకపు ఎన్కౌంటరని సామాజిక న్యాయం పార్టి రాష్ట్ర అధ్యక్షులు వైకో (వై.కోటేశ్వరరావు)స్పష్టం చేశారు. ఓ కేసు విషయంగా ఆత్మకూరు కోర్టుకు వచ్చిన ఆయన ఈ భారీ ఎన్కౌంటర్ ఘటనపై స్పందించారు. పోలీసు బాస్ చెప్పిన ప్రకారం చూసినా ఓ సమావేశం జరుపుకొంటున్న మావోయిస్టులపైకి దాడికి వెళ్లగా జరిగిన ఘటనలానే ఉంది తప్ప వారు చెబుతున్నట్లు ఆత్మరక్షణకు కాల్పులు జరపడం వల్ల 24మందిని చనిపోయినట్లు లేదన్నారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని సుప్రింకోర్టు గతంలో కొన్ని మార్గదర్శకాలు జారి చేసిందన్నారు. ఎన్కౌంటర్లపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని, సీబీఐ లాంటి స్వత్రంత సంస్థతో దర్యాప్తు చేపట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అటవీ సంపదను బహుళజాతి సంస్థలకు అప్పణంగా కట్టబెడుతు ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఆదివాసుల ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ,సామాజిక హక్కులను కాలరాస్తున్నాయన్నారు. దీంతో ఆదివాసులు అనివార్యంగా మావోయిస్టు పార్టీకి చేరువవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ముందుగా ఆదివాసుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. -
పక్కా స్కెచ్‌తో దాడి, ఆర్కే ఎస్కేప్..
మల్కాన్‌గిరి: మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఏఓబీలో మావోలపై కాపుకాసిన పోలీసులు అదును చూసి పంజా విసిరారు. మల్కాన్‌గిరి అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన హోరా హోరీ కాల్పుల్లో 24మంది మావోయిస్టులు మృతి చెందారు. ఏవోబీలో మావోయిస్టుల ప్లీనరీ జరుగుతున్నట్లు ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన గ్రే హౌండ్స్ ప్లీనరీపై పక్కా స్కెచ్‌తో దాడి చేసింది. మృతుల్లో ప్రముఖ మావోయిస్టులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. గ్రేహౌండ్స్ బలగాలు అటవీప్రాంతంలోని తొమ్మిది కిలో మీటర్ల లోపలికి చొచ్చుకెళ్లి మరీ ఈ దాడి చేసినట్లు సమాచారం. మావోయిస్టుల నుంచి మూడు ఏకే-47గన్స్, ఏడు ఎస్ఎల్ఆర్లు, ఏడు ల్యాండ్మైన్లు, 303 రైఫిల్స్, 15 భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జంత్రి అటవీప్రాంతం ఘటనలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టుల ద్వారా పక్కా సమాచారం తెలుసుకున్న ఆంధ్ర-ఒడిశా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టేందుకు రంగంలోకి దిగారు. బలిమెల రిజర్వాయర్‌లోని ఏవోబీ కటాఫ్ ఏరియా జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే ప్లీనరీ జరుగుతున్న సమావేశంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. మావోయిస్టులు ఆయుధాలతో తేరుకునేలోపే పోలీసుల ఎన్కౌంటర్లో 24 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లకు గాయపడ్డారు. ఇక చనిపోయిన మావోయిస్టులను గుర్తించేందుకు మాజీ మావోయిస్టులను పోలీసులు రంగంలోకి దించారు. వారిని ఘటనా స్థలానికి తీసుకువెళ్లి మృతుల వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. విశాఖ ఏరియా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న గాజర్ల రవి అలియాస్ గణేష్, చలపతి, దయ, రాజన్న, బెంగాల్ సుధీర్, అశోక్,మల్లేష్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కాల్పుల సమయంలో మరో అగ్రనేత ఆర్కే తప్పించుకోగా, ఆయన మనవడు మున్నా ఎన్కౌంటర్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత కొంత కాలంగా స్తబ్తుగా మావోయిస్టులు పట్టు కోల్పోయిన ఏవోబీలో మళ్లీ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి చిత్రకొండ పనసపుట్టు వద్ద మావోయిస్టులు సమావేశమయ్యారు. మరోవైపు విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ ఎన్కౌంటర్ లో 24మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాలను ఒడిశాకు తరలిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. మృతుల్లో 18మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని, అగ్రనేతలు ఉన్నారో...లేదో ఇంకా తెలియదన్నారు. ఇక గాయపడ్డ పోలీసులను చికిత్స నిమిత్తం విశాఖకు తరలించినట్లు చెప్పారు. -
ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించిన ఏపీ డీజీపీ
విజయవాడ: ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు ధ్రువీకరించారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఎన్కౌంటర్లో 24మంది మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి 4 ఏకే-47లు, భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు. సంఘటనా ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అవసరం అయితే అదనపు బలగాలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీపీ సాంబశివరావు తెలిపారు. మృతుల్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు. ఇక మావోయిస్టు కాల్పుల్లో గాయపడ్డ పోలీసులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో విశాఖ తరలించారు. -
నిర్ణయం మీరే తీసుకోండి
శ్రుతి, విద్యాసాగర్ పోస్టుమార్టం రిపోర్టులు ఎన్హెచ్ఆర్సీకి ఇమ్మనడంపై ప్రభుత్వానికి తేల్చిచెప్పిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: గత ఏడాది సెప్టెంబర్‌లో వరంగల్ జిల్లా, గోవిందరావుపేట మండల పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన శ్రుతి అలియాస్ మైత్రి, విద్యాసాగర్‌రెడ్డి అలియాస్ సూర్యంలకు నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు ఇవ్వాలా? వద్దా? అనేదానిపై తాము ఏ అభిప్రాయం వ్యక్తం చేయబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో మీరే తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి చెప్పింది. శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిల ఎన్‌కౌంటర్‌పై ఎయిమ్స్ నివేదిక రాకపోవడంతో విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రుతి, విద్యాసాగర్రెడ్డిలది బూటకపు ఎన్కౌంటరని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సివిల్ లిబర్టీస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. మృతుల పోస్టుమార్టం నివేదికలను, వీడియో ఫుటేజీని పరిశీలించి వాటిపై అభిప్రాయం తెలుపుతూ నివేదిక ఇవ్వాలని ఎయిమ్స్ డెరైక్టర్‌ను ధర్మాసనం ఆదేశించిందని, ఆ నివేదిక రానందున కొంత గడువు కావాలన్నారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిల పోస్టుమార్టం నివేదికలను ఎన్హెచ్ఆర్సీ కోరిందని, ఇవ్వమంటారా అని రామచంద్రరావు ధర్మాసనాన్ని అడిగారు. దీనిపై నిర్ణయాన్ని మీరే స్వయంగా తీసుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. -
తెలంగాణలో అన్ని పోలీస్స్టేషన్లలో అప్రమత్తత
-
నెత్తురోడిన నల్లమల
సాక్షి, ఒంగోలు/మార్కాపురం: నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ కొలువదీరిన రోజే జిల్లాలో ఎన్కౌంటర్ జరగడం కలకలానికి దారితీసింది. కొన్నేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న జిల్లా వాసులు మావోయిస్ట్‌ల ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డారు. యర్రగొండపాలెం నియోజకవర్గం పాలుట్లకు 7 కిలోమీటర్ల దూరాన ఉన్న మురారి కురవ తండా అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం సరిగ్గా 6.30 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసువర్గాల సమాచారం. ఈ ఘటనలో మావోయిస్ట్ దళసభ్యుడు జానాబాబూరావుతో పాటు అతని భార్య నాగమణి అలియాస్ భారతి, విమల మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పోలీసులకు లొంగిపోయి రిమాండ్‌కు తరలించే క్రమంలో పరారైన విక్రమ్ కూడా వీరితోనే ఉన్నట్లు సమాచారం. విక్రమ్ బుల్లెట్ గాయాలతో పరారైనట్లు తెలుస్తోంది. మృతదేహాల వద్ద ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా నది మార్గాన పుట్టిలలో ప్రయాణిస్తూ తండా వాసుల ఆశ్రయం తీసుకుంటూ జానాబాబురావు దళం కొంత కాలంగా జిల్లాలోనే సంచరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 2001 నుంచి 2008 వరకు జిల్లాలో నిరాటంకంగా మావోయిస్టు ఎన్కౌంటర్లు జరిగాయి. ఆది నుంచి మావోయిస్టులకు జిల్లాలోని పుల్లలచెరువు మండలం షెల్టర్ జోన్‌గా ఉంది. బెంగళూరులో మావోయిస్టు ఇంజినీర్ టెక్‌మధును అరెస్ట్ చేసినప్పుడు మొత్తం 1262 రాకెట్ లాంచర్లు తయారు చేసినట్లు వెల్లడైంది. అయితే మొట్టమొదటిసారిగా మావోయిస్టులు రాకెట్ లాంచర్లు గుంటూరు జిల్లా దుర్గి పోలీస్‌స్టేషన్‌పై ప్రయోగించగా విఫలమైంది. ఆ తర్వాత దోర్నాల చెక్‌పోస్ట్ వద్ద కూడా ప్రయోగించారు. తయారు చేసిన రాకెట్ లాంచర్లలో 90 శాతం డంప్‌లు పుల్లలచెరువు మండలం శతబోడు, పాతచెరువుతండా అడవుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో మావోయిస్టుల చరిత్ర = 1988లో దగ్గు రాయలింగం హత్యకు నిరసనగా బస్సు దహనంతో జిల్లాలో పీపుల్స్‌వార్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. = 1989 ఏప్రిల్ 6న కారంచేడులో ప్రస్తుత బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి మామ దగ్గుబాటి చెంచురామయ్యను హత్య చేశారు. = 1991లో పెద్దదోర్నాల ఎంపీపీ కార్యాలయాన్ని పేల్చి వేశారు. = 1992 ఆగస్టు 14న పెద్దదోర్నాల మండలం గటవానిపల్లెలో గజవల్లి బాలకోటయ్యను కాల్చి చంపారు. ప్రజాప్రతినిధులపై కాల్పులు = 1995 డిసెంబర్ 1న అప్పటి ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి కాల్చివేత = 1997 ఆగస్టు 24న పెద్దదోర్నాల మండలం వై చెర్లోపల్లె సర్పంచ్ కుమారుడు బట్టు సంజీవరెడ్డి హత్య = 1998 ఫిబ్రవరి 25న వలేటివారిపాలెం ఎంపీపీ హత్య = 2002 సెప్టెంబర్ 18న పెద్దదోర్నాల ఎంపీపీ గంటా కేశవ బ్రహ్మానందరెడ్డి హత్య = 2003 జూన్ 11న పెద్దదోర్నాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రావిక్రింది సుబ్బరంగయ్య హత్య = 2004 ఫిబ్రవరి 11న పెద్దదోర్నాల పీఏసీఎస్ అధ్యక్షుడు అల్లు వెంకటేశ్వరరెడ్డిపై కాల్పులు = 2004 ఏప్రిల్ 4న సురభేశ్వర కోన దేవస్థానం అధ్యక్షుడు ఎస్.విజయమోహన్‌రావు హత్య = 2005 ఏప్రిల్ 25న అప్పటి పెద్దదోర్నాల ఎంపీపీ అమిరెడ్డి రామిరెడ్డి వాహనంపై కాల్పులు = 2005 ఏప్రిల్ 27న అప్పటి ఎస్పీ మహేష్ చంద్రలడ్హాపై హత్యాయత్నం = 2006 అక్టోబర్ 30న గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య సోదరుడి దారుణ హత్య = 2006 ఏప్రిల్ 8న అప్పటి కంభం శాసనసభ్యుడు ఉడుముల శ్రీనివాసరెడ్డిపై దాడికి యత్నం ముఖ్య సంఘటనలు.. = 1993లో వైపాలెం గెస్ట్‌హౌస్ పేల్చివేత = 2001 ఫిబ్రవరిలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ నుంచి వాకీటాకీ అపహరణ = 2001 మార్చి 21న శ్రీశైలం-సున్నిపెంట పోలీస్స్టేషన్ల పేల్చివేత = 2001జూన్ 3న పుల్లలచెరువు ఏఎస్సై ప్రశాంతరావు హత్య = 2001 జూన్ 17న యర్రగొండపాలెం పోలీస్‌స్టేషన్ పేల్చివేత బాహ్య ప్రపంచంలోకి.. = 1980 జనవరి 22న పీపుల్స్‌వార్ ఏర్పాటు = 1992 మే 21న అప్పటి ప్రభుత్వం పీపుల్స్ వార్‌పై నిషేధం = 1995 జూలై 15న అప్పటి టీడీపీ ప్రభుత్వం మావోయిస్టులపై మూడు నెలల పాటు నిషేధం ఎత్తివేత = 1996 జూలై 24న ప్రజాభద్రత చట్టం కింద పీపుల్స్‌వార్‌పై మళ్లీ నిషేధం = 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆ ఏడాది జూలై 21న నిషేధం ఎత్తివేత = 2004 అక్టోబర్ 11న తొలిసారిగా పీపుల్స్‌వార్ అగ్రనేతలు జనజీవన స్రవంతిలోకి రాక (దోర్నాల మండలం చిన్నారుట్ల నుంచి) = 2004 అక్టోబర్ 21న మళ్లీ అడవిలోకి.. = 2004 అక్టోబర్‌లో సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భావం = 2006 ఆగస్టు 17న మావోయిస్టు పార్టీపై నిషేధం విధింపు టార్గెట్ జానాబాబూరావు పోలీసులు మూడేళ్ల నుంచి జానాబాబూరావును టార్గెట్ చేశారు. ఆయన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటి ఎన్కౌంటర్లో మృతి చెందిన జానాబాబూరావుపై రూ.5 లక్షలు, విమలక్కపై రూ.4 లక్షలు, భారతిపై రూ.3 లక్షల రివార్డును గతంలోనే ప్రభుత్వం ప్రకటించినట్లు సమాచారం. త్రిపురాంతకానికి సుపరిచితుడే త్రిపురాంతకం : ఎన్కౌంటర్లో మృతి చెందిన జానాబాబూరావు త్రిపురాంతకానికి సుపరిచితుడు. ఎండూరివారిపాలెం పంచాయతీ పరిధిలోని సంగంతండాకు చెందిన కె.పెద్ద విజయను వివాహం చేసుకుని ఈ ప్రాంతంలో నివాసం ఉన్నాడు. 1990లో మావోయిస్టు సానుభూతిపరునిగా ఎర్రగొండదళానికి టచ్‌లో ఉండేవాడు. ఆ తర్వాత దళ సభ్యునిగా చేరి ఉద్యమంలోకి వెళ్లిపోయాడు. జానాబాబూరావు భార్య విజయకు ముగ్గురు కుమారులు. వీరంతా ప్రస్తుతం ఇక్కడే నివాసం ఉంటున్నారు. విజయ మిషన్ కుడుతూ జీవనం సాగిస్తుండగా ముగ్గురు కుమారులు కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. వీరికి జానాబాబూరావుతో 20 ఏళ్లుగా సంబంధాలు తెగిపోయాయి. పోలీసుల కథనం ప్రకారం.. రెండో భార్య పి.కవిత అలియాస్ విమలది మెదక్ జిల్లా తొరుగుట్ల మండలం ఒడెంచెరువు. మూడో భార్య నాగమణి అలియాస్ భారతిది మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం మందావానిపల్లె. ఆమె ఆ గ్రామానికి గతంలో సర్పంచ్‌గా పని చేశారు.