ఎన్కౌంటర్ను ధ్రువీకరించిన ఏపీ డీజీపీ
విజయవాడ: ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్ను ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు ధ్రువీకరించారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఎన్కౌంటర్లో 24మంది మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి 4 ఏకే-47లు, భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు. సంఘటనా ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
అవసరం అయితే అదనపు బలగాలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీపీ సాంబశివరావు తెలిపారు. మృతుల్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు. ఇక మావోయిస్టు కాల్పుల్లో గాయపడ్డ పోలీసులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో విశాఖ తరలించారు.