ఒడిస్సా ఎన్‌కౌంటర్ బూటకం
- ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో జరిగిన ఘటనపై వైకో
ఆత్మకూరురూరల్: ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుఝామున పోలీసులు, మావోయిస్టుల మ«ధ్య జరిగినట్లు చెబుతున్న ఎదురు కాల్పులు పూర్తిగా సత్యదూరమని. అది బూటకపు ఎన్‌కౌంటరని సామాజిక న్యాయం పార్టి రాష్ట్ర అధ్యక్షులు వైకో (వై.కోటేశ్వరరావు)స్పష్టం చేశారు. ఓ కేసు విషయంగా ఆత్మకూరు కోర్టుకు వచ్చిన ఆయన ఈ భారీ ఎన్‌కౌంటర్ ఘటనపై స్పందించారు. పోలీసు బాస్ చెప్పిన ప్రకారం చూసినా ఓ సమావేశం జరుపుకొంటున్న మావోయిస్టులపైకి దాడికి వెళ్లగా జరిగిన ఘటనలానే ఉంది తప్ప వారు చెబుతున్నట్లు ఆత్మరక్షణకు కాల్పులు జరపడం వల్ల 24మందిని చనిపోయినట్లు లేదన్నారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని సుప్రింకోర్టు గతంలో కొన్ని మార్గదర్శకాలు జారి చేసిందన్నారు. ఎన్‌కౌంటర్లపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని, సీబీఐ లాంటి స్వత్రంత సంస్థతో దర్యాప్తు చేపట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అటవీ సంపదను బహుళజాతి సంస్థలకు అప్పణంగా కట్టబెడుతు ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఆదివాసుల ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ,సామాజిక హక్కులను కాలరాస్తున్నాయన్నారు. దీంతో ఆదివాసులు అనివార్యంగా మావోయిస్టు పార్టీకి చేరువవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ముందుగా ఆదివాసుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.