సాక్షి, హైదరాబాద్: మడవి హిడ్మా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు. బీజాపూర్ జిల్లాలో తన ఉనికిపై తానే సమాచారం ఇచ్చి, భద్రతా దళాలకు ఎరవేసి, 23మంది జవాన్లను మట్టుబెట్టే ఆపరేషన్‌కు నేతృత్వం వహించి నడిపించిన హిడ్మా నేపథ్యంపై చర్చ సాగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. హిడ్మాకు అత్యంత కఠిన మావోయిస్టుగా దళంలో పేరుంది. అతను అనుసరించే వ్యూహాలు ప్రత్యర్థులు అంచనా వేయలేకుండా ఉంటాయి. అత్యంత జఠిలంగా.. వ్యూహంలో చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటికి వెళ్లలేనంత పకడ్బందీగా ఉంటాయి. చేతికి చిక్కిన, ఎదురైన శత్రువుల పట్ల ఎంతో కఠినంగా వ్యవహరిస్తాడు. జాలి దయ లేకుండా మరణించేవరకు చంపాలన్నది అతని సిద్ధాంతం. అందుకోసం ఏ మార్గం అనుసరించినా తప్పులేదనే మనస్తత్వం. ఇలాంటి పాశవిక దాడులు గతంలో మావోయిస్టులు అనుసరించలేదు.
ఇవి ఇక్కడి యుద్ధ విద్యలు కావు
2010 నుంచి మావోల దాడుల్లో, వ్యూహాల్లో, ఆపరేషన్లు నిర్వహించే తీరులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి నుంచి వారు చేస్తున్న ప్రతి దాడిలోనూ ప్రాణనష్టం అధికంగా ఉంటోంది. ఇలాంటి పాశవిక యుద్ధ విద్యలు భారత్‌కు చెంది నవి కావు. ఇవి తూర్పు ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికాలాంటి దేశాల్లో కరుడుగట్టిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు అనుసరించే వ్యూహాలు. మరి అక్కడి వ్యూహాలు ఇక్కడి వారు ఎలా అమలు చేస్తున్నారు? అనే ప్రశ్నకు ఫిలిప్పీన్స్ అన్న సమాధానం వినిపిస్తోంది. మొత్తం దశాబ్దానికిపైగా జరిగిన భారీ ఆపరేషన్లకు హిడ్మానే వ్యూహరచన చేశాడని సమాచారం. తాజా దాడితో పాటు బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో చోటుచేసుకున్న విధ్వంసకర సంఘటనలన్నింటికీ ఇతనే నేతృత్వం వహించాడని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. పీఎల్‌జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్–1కు కమాండర్‌గా ఉన్న హిడ్మా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నాడు. ట్యాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ (టీసీఓసీ) కూడా హిడ్మా నేతృత్వంలోనే పనిచేస్తుంది.
భద్రతా దళాల కోసం మరిన్ని ఉచ్చులు..?
ఎరవేసి దాడులు చేయడంలో పేరుగాంచిన హిడ్మా మరిన్ని వ్యూహాలు సిద్ధం చేసి ఉంటాడని నిఘా వర్గాలు ఇప్పటికే భద్రతా దళాలను హెచ్చరించా యి. ప్రతీకార దాడికి దిగే కంటే ఆచితూచి స్పందించడమే మేలని సూచించినట్లు సమాచారం. హిడ్మా కోసం గాలిస్తూ ఆవేశంగా మావోలకు పట్టున్న ప్రాంతాల్లోకి చొరబడితే, ఇదే అవకాశం కోసం చూస్తున్న హిడ్మా మరిన్ని ఉచ్చులతో మరో భారీ దాడికి దిగే అవకాశం లేకపోలేదని పలువురు సీనియర్ ఐపీఎస్‌లు సైతం అభిప్రాయపడుతున్నారు.
చదివింది ఐదో తరగతే..
మడవి హిడ్మా (మడవి ఇడమా) అలియాస్ సం తోష్ అలియాస్ ఇడ్మాల్ అలియాస్ పొడియం బీమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల శివారు నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరం లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల పువ్వర్తి గ్రామంలో పుట్టి పెరిగాడు. ఇతను పదిహేనేళ్ల క్రితం స్థానిక పరిస్థితుల ప్రభావంతో మావోయిస్టు పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. బస్తరియా మురియా తెగకు చెందిన హిడ్మా.. చదివింది ఐదో తరగతే అయినా, హిందీ–ఇంగ్లి్లష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. దళంలో అతను చాలామందికి గెరిల్లా యుద్ధవిద్యల్లో శిక్షణ ఇస్తాడు. దండకారణ్యంలో అతన్ని మామూలు స్థాయి దళసభ్యుడు కలవడం దాదాపు అసాధ్యం. భార్యతో కలసి ఉండే అతని చుట్టూ అత్యాధునిక ఆయుధాలతో కూడిన దాదాపు 20 మందికిపైగా దళ సభ్యులు రక్షణ వలయంగా ఉంటారు. అందులో మెజారిటీ సభ్యులు అతని బంధువులు, బాల్యమిత్రులే కావడం గమనార్హం.
అనూహ్యం .. అమానవీయం
హిడ్మా దశాబ్దానికి ముందే ఫిలి ప్పీన్స్‌లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. అప్పటి మావోయిస్టు చీఫ్ గణ పతి ఆదేశాల మేరకు హిడ్మా బిహార్ మీదుగా నేపాల్ వెళ్లి, అక్కడ నుంచి దొంగ పాస్‌పోర్టు ద్వారా ఫిలిప్పీన్స్ చేరుకుని ఉంటాడని భావిస్తున్నారు. అక్కడే అతను భారీ ప్రాణనష్టమే లక్ష్యం గా భీకరదాడులు చేయడం, వీలైనంత ఎక్కువమందిని చంపడం, ప్రత్యర్థులకు ఎరవేసి చంపడంలో ఆరితేరాడని సమాచారం. హిడ్మా వ్యూహా లన్నీ మూడంచెల్లో ఉంటాయి. తొలుత బాంబులతో దాడి, తర్వాత బుల్లెట్ల వర్షం, ఆ తర్వాత గా యాలతో అల్లాడుతున్న క్షతగాత్రుల గొంతులు కోయడం, శరీరాన్ని కత్తులతో తూట్లుగా పొడవడం తదితర కర్కశ చర్చలన్నీ సైనిక పాలిత, నియంతల పాలనలో సాగుతున్న దేశా ల్లో ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులు అనుసరించే యుద్ధతంత్రాలని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లో, అంతర్యుద్ధాలు సాగుతున్న దేశాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయని చెబుతున్నారు. 2010లో దంతెవాడలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన దాడిలో ఓ సైనికుడి శవంపై 78 కత్తిపోట్లు ఉండటం దీనికి నిదర్శనం. ఆపై నెలరోజుల వ్యవ ధిలో ఆర్టీసీ బస్సును పేల్చి సాధారణ ప్రజలతోపాటు 30 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను చంపడ మూ హిడ్మా ఆలోచనే అన్న అనుమానాలున్నాయి.
పక్కా వ్యూహం .. పకడ్బందీ ప్రణాళిక
బీజాపూర్‌లో జొన్నగూడెం సమీప అటవీ ప్రాం తంలో జరిగిన భారీ దాడికి డిసెంబర్, జనవరిలోనే వ్యూహరచన జరిగి ఉంటుందని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడి కోసం బస్తర్ ప్రాంత నక్సలైట్లలో తాను గెరిల్లా శిక్షణ ఇచ్చిన దాదాపు 300 మందికిపైగా షార్ప్ షూటర్లను హిడ్మా పిలిపించినట్లు సమాచారం. వారికి ప్లాన్ వివరించడంతో పాటు తిరిగి సురక్షితంగా తప్పించుకోవడంపై మాక్ డ్రిల్ నిర్వహించేందుకు 2 నెలలకు పైగానే సమయం పట్టి ఉంటుందంటున్నారు. అంతా సరే అనుకున్నాక.. భద్రతా దళాలకు ఉప్పందించడం, వారు ఇతని కోసం పగలూరాత్రి వెదకడం, వారు తాము అనుకున్న ప్రాంతానికి రాగానే, జవాన్లు తేరుకునేందుకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా సులువుగా దాడి చేసి పారిపోవడం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. తమ వద్ద ఉన్న తక్కువ సామగ్రితోనే వీలైనంత ఎక్కువమంది శత్రువులను మట్టుబెట్టడం హిడ్మా లక్ష్యం. బుల్లెట్లను వీలైనంత తక్కువగా వాడటం, జవాన్లను కత్తులతో పొడిచి, మిగిలిన వారిని భయభ్రాంతులకు గురిచేయడం అతని వ్యూహంలో భాగమని అంటున్నారు. జొన్నగూడెం ఆపరేషన్‌లో పీఎల్‌జీఏకు చెందిన సుమారు 200 నుంచి 250 మంది పాల్గొన్నట్లుగా స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment