మావోయిస్టుల మృతదేహాలను ట్రాలీలో తరలిస్తున్న దృశ్యం
మల్కన్‌గిరి/సీలేరు: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో సోమవారం ఉదయం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు సహా ఐదుగురు మృతి చెందారు. మావోయిస్టు అగ్రనేత రణదేవ్ ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)ల్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎస్పీ జగ్‌మోహన్ మీనా ఎస్‌ఓజీ, డీబీఎఫ్ జవాన్లతో కలిసి ఆదివారం అర్థరాత్రి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మావోయిస్టు అగ్రనేత రణదేవ్ పప్పులూరు పంచాయతీ అల్లూరికొట్ట గ్రామంలో ఆదివారం రాత్రి నుంచి ప్రజాకోర్టు నిర్వహిస్తున్నాడని తెలుసుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అప్రమత్తమైన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో బలగాలు కూడా కాల్పులు జరిపాయి. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.
అయితే, కాల్పులు కొనసాగుతుండగానే రణదేవ్ సహా పలువురు కీలక నేతలు తప్పించుకున్నారు. మృతులను కలిమెల దళ కమాండర్ ఉంగసోడి అలియాస్ కీర్తి, కలిమెల దళ సభ్యులు సీమ అలియాస్ రూప, మసీమడి అలియాస్ సునీతలుగా గుర్తించారు. మిగతా ఇద్దరినీ గ్రామస్తులుగా అనుమానిస్తున్నారు. మృతదేహాలను మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి తరలించారు. సంఘటన ప్రాంతంలో గ్రనేడ్‌తోపాటు రెండు ఎస్‌ఎల్ ఆర్, ఒక ఇన్సాస్, ఒక .303 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో కలిమెల దళం అంతరించినట్లేనని ఎస్పీ మీనా తెలిపారు. తప్పించుకున్న అగ్రనేతల కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు. అల్లూరికొట్ట గ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment