
పెద్దపల్లి: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో తాడ్గాం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మృతి చెందిన సంఘటనకు సంబంధించి భద్రతా దళాలు ఆధునిక టెక్నాలజీని వినియోగించినట్టు భావిస్తున్నారు. నక్సలైట్ల ఏరివేతకు హెలికాప్టర్‌లు, డ్రోన్ కెమెరాలను వాడుకుంటున్న కేంద్ర బలగాలు, పోలీసులు తాజాగా శాటిలైట్ల ద్వారా ఫోటోలను సేకరించి దాడులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ల (ఉపగ్రహాల) సాయం తో నక్సలైట్ల కదలికలను కనిపెడుతున్న పోలీసులు నక్సల్ దళాల వెంటపడి మట్టుపెడుతున్నారు.
ఇదే తరహాలో ఆదివారం ఇంద్రావతి నది ఒడ్డున తాడ్గాం వద్ద నక్సలైట్ల కదలికలను కనిపెట్టి ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. ఈ సంఘటనతో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల పూజారి కాంకేర్‌లో 10 మంది సహచరులను కోల్పోయిన నక్సల్స్.. ప్రతీకారం కోసం ఎదురుచూస్తుండగానే పోలీసులు మరోసారి 16 మందిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. పోలీసులు కాలినడకన గాలింపు చర్యలకు వెళ్తున్న ప్రతీసారి మందుపాతరలతో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్నారు. దీంతోనే ఇటీవలి కాలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ర్లలో పోలీసులదే పైచేయిగా మారింది.