సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవళ్లగూడెంలో ఈనెల 3న జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఆదివారం పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టుల కదలికల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో అలజడి వాతావరణం నెలకొంది. బంద్ సందర్భంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు, ఆయా జిల్లాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని నెలలుగా తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న మావోయిస్టులు ఏజెన్సీ జిల్లాలకు ఛత్తీస్‌గఢ్ నుంచి యాక్షన్ టీమ్‌లను పంపించినట్టు తెలుస్తోంది. అలాగే జూలైలో కొత్తగా తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు మరో 12 కమిటీలను మావోయిస్టులు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో ఏజెన్సీ జిల్లాల్లో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. గత రెండు నెలల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కరకగూడెం మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోనూ ఎదురు కాల్పులు జరిగాయి. దేవళ్లగూడెం ఎన్‌కౌంటర్‌లో తమ యాక్షన్ కమిటీ సభ్యుడు, ముఖ్యనేత హరిభూషణ్ గన్‌మన్ దూది దేవాల్ అలియాస్ శంకర్ మృతితో మావోయిస్టులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.
దేవళ్లగూడెం ఎన్‌కౌంటర్ బూటకం అంటూ మావోయిస్టు పార్టీ ఇల్లెందు–నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి శాంత, భద్రాద్రి కొత్తగూడెం–తూర్పుగోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ తదితరుల పేర్లతో బంద్‌పై ప్రకటనలు విడుదల చేశారు. దీంతో గోదావరి పరీవాహక జిల్లాల్లో పోలీసు యంత్రాంగం అడుగడుగునా తనిఖీలు చేసింది. చివరకు బంద్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా ఈ జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా మోటాపోల్, పునాసార్ అనే రెండు గ్రామాలకు చెందిన ఆదివాసీలను అపహరించిన మావోయిస్టులు తమ అధీనంలో ఉన్న 16 మందిని వదిలిపెట్టారు. మొత్తం 26 మందిని అపహరించగా, అందులో శనివారం ఆరుగురిని విడిచిపెట్టి నలుగురిని హతమార్చిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment