Maoist Groups
-
మావోల బంకర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు నిర్మించిన బంకర్‌ను భద్రతాబలగాలు గుర్తించారు. బస్తర్ డివిజన్లో మావోయిస్టులు బంకర్లను నిర్మించి వినియోగిస్తున్న విషయం బయటపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బస్తర్‌లో ఇలాంటివి ఉండొచ్చని భద్రతా బలగాలకు సమాచారం ఉందిగానీ ఇన్నాళ్లలో ఎన్నడూ ఒక్కదానిని కూడా గుర్తించలేకపోయారు. బీజాపూర్–దంతెవాడ జిల్లాల మధ్య ఇంద్రావతి నదీతీరంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలను గుర్తించేందుకు జిల్లా రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా బీజాపూర్ జిల్లాలోని తోడోపాట్–ఉస్పారీ గ్రామ సమీప అడవిలో మంగళవారం ఈ బంకర్‌ను భద్రతా బలగాలు గుర్తించాయని దంతేవాడ అదనపు ఎస్పీ బర్మన్ చెప్పారు. ఈ సొరంగం 130 మీటర్ల పొడవు, 6 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పుతో ఉంది. బంకర్ కనపడకుండా ప్రవేశమార్గాన్ని మట్టితో కూడిన కర్రలను కప్పి వాటిపైన చెట్ల పొదలను పరిచారు. మావోలు డంపింగ్ ప్రాంతంగానూ దీనిన వినియోగించినట్లు భద్రతాబలగాలు గుర్తించాయి. జనవరి 9న మావోయిస్టుల తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకున్నారు. మైదాన ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేస్తే డ్రోన్ల సాయంతో జాడ కనిపెట్టే అవకాశం ఉండటంతో ఇటీవలే ఈ బంకర్ నిర్మించి సమావేశం జరిపి ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇంద్రావతి నదిఒడ్డున ఏర్పాటు చేసిన ఈ బంకర్లో 100 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా దాక్కునేందుకు వీలుగా ఉంది. ఇలాంటి బంకర్లు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరిన్ని ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు, వాటిని గుర్తించేందుకు అడవుల్లో సోదాలు గాలింపు ముమ్మరం చేశారు. అబూజ్మడ్ అడవుల్లో ఇలాంటివి ఎన్ని బంకర్లు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అనే అంశాలపై భద్రతాదళాలకు కొత్త సవాల్‌గా మారినట్టయ్యింది. వచ్చే వేసవిలో విస్తృతంగా కూంబింగ్ చేపట్టేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్న భద్రతాదళాలకు కనిపించని బంకర్లతో మరిన్ని చిక్కులు వచ్చి పడే అవకాశముంది. గాలి, వెలుతురు సోకేలా ఏర్పాట్లు బైరాంఘర్ పోలీస్‌స్టేషన్, భద్రతాదళాల బేస్ క్యాంప్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఈ బంకర్ ఉంది. బంకర్లోకి వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. గాలి, వెలుతురు సోకేలా ప్రతీ ఆరు మీటర్లకు ఒకటి చొప్పున ద్వారాలు ఏర్పాటు చేశారు. అయితే, ఇవి బయటకు కనిపించకుండా చెట్ల పొదలు అడ్డుపెట్టారు. మావో అగ్రనేతలు తలదాచుకునేందుకు ఉపయోగించుకోవడంతో పాటు మెరుపు దాడులకు వీలుగా దీనిని నిర్మించారని వార్తలొచ్చాయి. అయితే దీని నిర్మాణ వివరాలను భద్రతా బలగాలు ఇంకా అధికారికంగా బహిర్గతంచేయలేదు. -
ఛత్తీస్‌గఢ్‌లో 20 మంది మావోయిస్టులు లొంగుబాటు
సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత సుక్మా జిల్లాలో శనివారం ఐదుగురు మహిళలు సహా 20 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. వివిధ మావోయిస్టు అనుబంధ విభాగాలకు చెందిన వీరంతా అమానవీయ మైన, పసలేని మావోయిస్టుల సిద్ధాంతాలతో విసిగినట్లు తెలిపారని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు. లొంగుబాటపట్టిన వారిలో మిలిషియా డిప్యూటీ కమాండర్ ఉయిక లఖ్మా, దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్(డీఏకేఎంఎస్), క్రాంతికారీ మహళా ఆదివాసీ సంఘటన్(కేఏఎంఎస్), చేతన నాట్య మండలి(సీఎన్ఎం)లకు చెందిన సభ్యులున్నార న్నారు. జిల్లాలోని జాగర్‌గుండా పోలీస్‌స్టేషన్ పరిధిలో వీరు మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లొంగిపోయిన వారికి పునరావా స కార్యక్రమాలను వర్తింప జేస్తామన్నారు. -
ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట
సాక్షి, ముంబై: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసు నుంచి ఆయనకు విముక్తి లభించింది. ఈ మేరకు కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన బాంబే హైకోర్టు.. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని మహారాష్ట్ర జైళ్ల శాఖను శుక్రవారం ఆదేశించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 2017లో సాయిబాబాను దోషిగా తేల్చింది ట్రయల్ కోర్టు. ఆ కేసులో జీవిత ఖైదు విధించింది. అయితే ఆ కోర్టు తీర్పును బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఇప్పుడు కొట్టేసింది. ట్రయల్ కోర్టు తనను దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు రోహిత్ దియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరించారు. ఈ మేరకు వాదనలు విన్న అనంతరం ట్రయల్‌కోర్టు తీర్పును కొట్టేస్తూ.. తక్షణమే ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌కి పరిమితమైన సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు. ఇక కోర్టు తీర్పుపై సాయిబాబా భార్య వసంత కుమారి స్పందించారు. మేధావి అయిన తన భర్తను కావాలనే కేసులో ఇరికించారని, జైల్లో ఏడేళ్లు గడిపారని, ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కన్నడ భాషపై దాడి చేస్తే ప్రతిఘటిస్తాం -
ఆంధ్ర-ఒడిషా సరిహద్దుల్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర-ఒడిషా సరిహద్దుల్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. పెదబయలు కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎమ్మెల్యే సర్వేశ్వరరావును కాల్చి చంపిన కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం 60 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరో 30 మంది మిలీషియా సభ్యులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. -
అచ్చం రోజా సినిమా తరహాలోనే.. అడవి బాట పట్టిన సబ్ ఇంజనీర్ భార్య
చర్ల(ఛత్తీస్‌గఢ్): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు వారం క్రితం కిడ్నాప్ చేసిన సబ్ ఇంజనీర్‌ను బుధవారం విడుదల చేశారు. దీంతో వారంరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజాపూర్ జిల్లా మాంకేలీ సమీపంలోని ఘట్కేర్నీ లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం (పీఎంజీఎస్‌వై) కింద చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఈనెల 11న సబ్ ఇంజనీర్ అజయ్‌రోషన్, అటెండర్ లక్ష్మణ్‌తో కలసి వెళ్లారు. ఈ సందర్భంగా మావోయిస్టులు వీరిద్దరినీ కిడ్నాప్ చేయగా, మరుసటి రోజు లక్ష్మణ్‌ను విడిచిపెట్టారు. అప్పటి నుంచి అధికారులు సబ్ ఇంజనీర్ విడుదల కోసం ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. అడవి బాట పట్టిన అజయ్ భార్య సబ్ ఇంజనీర్ అజయ్‌ను విడుదల చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన భార్య అంకిత అడవి బాట పట్టారు. రెండేళ్ల కుమారుడిని వెంట పెట్టుకుని ఆమె మీడియా బృందంతో కలసి అడవిలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఐదు రోజులకు మావోయిస్టుల శిబిరానికి చేరుకున్న అంకిత, మీడియా బృందం సభ్యులు.. మావోయిస్టులతో చర్చలు జరిపారు. అనంతరం మావోయిస్టులు అదే ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించి సబ్ ఇంజనీర్ అజయ్‌ను విడిచిపెట్టారు. దీంతో బుధవారం సాయంత్రం అజయ్ బీజాపూర్‌కు చేరుకోగా అస్వస్థతతో ఉన్న ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, తన మొర విని భర్త ప్రాణాలకు హాని తలపెట్టకుండా విడిచిపెట్టడంపై అంకిత మావోయిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. రోజూ 40 కిలోమీటర్ల ప్రయాణం.. తన భర్తను మావోయిస్టుల చెర నుంచి విడిపించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో రెండేళ్ల కుమారుడితోపాటు అడవి బాట పట్టిన అజయ్ భార్య అంకిత ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అడవిలో అన్వేషణ సాగించారు. ఈనెల 13, 14, 15, 16వ తేదీల్లో అక్కడి మీడియా ప్రతినిధులు ఒకరిద్దరితో కలసి ద్విచక్ర వాహనాలపై రోజూ 30, 40 కిలోమీటర్ల మేర అడవిలో ప్రయాణించి ఆదివాసీ గూడేల్లో భర్తకోసం వెతికారు. చివరకు బుధవారం వీరు వెళ్లిన ఓ గ్రామం వద్ద మావోయిస్టుల కొరియర్ తారసపడి తన వెంట అంకిత సహా మీడియా బృందాన్ని తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా మావోయిస్టులు ఓ ఆదివాసీ గ్రామంలో ప్రజాకోర్టు నిర్వహించి ఇకనైనా రోడ్డు పనులను నిలిపివేయాలని హెచ్చరిస్తూ అజయ్‌ను విడుదల చేశారు. -
తెలంగాణలో పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్ఐఏ పలుచోట్ల సోదాలు నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసులో మహబూబ్‌నగర్ జిల్లాలో ముత్తు నాగరాజు, వి. సతీష్ , మేడ్చల్‌లోని కొమ్మరాజు కనకయ్య, భద్రాద్రి జిల్లాలో గుంజి విక్రమ్, త్రినాథరావు, జనగామలో సూర సారయ్య, వరంగల్‌లో వేలుపుస్వామి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితుల నుంచి 400 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 500 నాన్‌ఎలక్ట్రిక్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని మావోయిస్టు నేత హిడ్మాకు రవాణా చేస్తుండగా ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. పేలుడు పదార్థాల తయారీకి సంబంధించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. -
రంజిత్.. ఓ అజ్ఞాతవాసి!
సాక్షి, హైదరాబాద్/మద్దూరు(హుస్నాబాద్): దళంలో పుట్టిపెరిగిన రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ అనే మావోయిస్టు తాజాగా జనజీవనస్రవంతిలో కలిశాడు. మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరుగా ఉండి మృతి చెందిన రామన్న కుమారుడే రంజిత్. అతడు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి వద్ద బుధవారం హైదరాబాద్‌లో లొంగిపోయాడు. రంజిత్ మావోయిస్టు దంపతులు సావిత్రి– రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్నలకు 1998లో దండకారణ్యంలో జన్మించాడు. ‘‘సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం బెక్కల్ గ్రామానికి చెందిన రామన్న 1982లో పార్టీలో చేరి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అక్కడే సావిత్రిని వివాహం చేసుకున్నాడు. సావిత్రి ఛత్తీస్‌గఢ్‌లోని కిష్టారం డివిజనల్ కమిటీ మెంబర్‌గా ఉంది. రంజిత్ దండకారణ్యంలోని జనతన సర్కారు పాఠశాలలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత నిజామాబాద్‌లోని కాకతీయ స్కూల్లో శ్రీకాంత్ అని పేరు మార్చుకుని 10వ తరగతి వరకు చదివాడు. 2017లో తండ్రి ఆదేశాల మేరకు పార్టీలో చేరాడు. 2019లో రామన్న దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న సమయంలో అనారోగ్యంతో చనిపోయాడు. అనంతరం పార్టీలో రంజిత్‌కు అవమానాలు, వేధింపులు ఎక్కువకావడంతో తాళలేక పోలీసులకు లొంగిపోదామని తల్లి వద్ద ప్రతిపాదించగా ఆమె తిరస్కరించింది’’అని డీజీపీ వివరించారు. రంజిత్‌కు సాయం రంజిత్‌కు పునరావాసం కింద రూ.4 లక్షలు, తక్షణ ఆర్థిక అవసరాల కింద రూ.ఐదువేలను డీజీపీ అందజేశారు. కాగా, హరిభూషణ్ స్థానంలో తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా దామోదర్ బాధ్యతలు తీసుకున్నట్లుగా తమకు సమాచారం ఉందని డీజీపీ తెలిపారు. మాకు సంతోషంగా ఉంది... ‘మా తమ్ముడు రావుల రామన్న 12 ఏళ్లప్పుడు కుటుంబాన్ని వదిలి ఉద్యమంలోకి వెళ్లాడు. తర్వాత తిరిగి రాలేదు. 2019లో అనారోగ్యంతో బాధపడుతూ చనిసోయాడని పోలీసుల ద్వారా తెలిసింది. మా తమ్ముడికి కొడుకు రంజిత్ ఉన్నాడని పోలీసుల ద్వారానే తెలిసింది. అతడు ఉద్యమ బాటను విడిచి జనజీవితంలో కలవడం మాకు సంతోషంగా ఉంది. –రావుల చంద్రయ్య (రావుల శ్రీనివాస్ అన్న) -
అన్నలారా.. మేమెలా బతకాలి?
సాక్షి, పాడేరు: అన్నల్లారా.. అమాయక గిరిజనులను చంపకండి! నా భర్త కృష్ణారావును అన్యాయంగా హతమార్చారు. కనీసం ప్రజాకోర్టు కూడా నిర్వహించకుండానే అర్ధరాత్రి సమయంలో తీసుకువెళ్లి దారుణంగా చంపడం న్యాయమా.. అంటూ కృష్ణారావు భార్య గెమ్మెలి సిరుసో కన్నీటిపర్యంతమయ్యారు. జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామంలో పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో గెమ్మెలి కృష్ణారావు అనే గిరిజనుడిని మావోయిస్టులు ఆదివారం అర్ధరాత్రి హతమార్చారు. కృష్ణారావు మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం జి.మాడుగుల సీఐ జి.డి.బాబు, ఇతర పోలీసులు పాడేరు జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి సోమవారం తీసుకువచ్చారు. చదవండి: (మన్యంలో మావోయిస్టుల ఘాతుకం) కృష్ణారావు మృతదేహానికి శవపరీక్షలు జరుపుతున్న సమయంలోనే మృతుడి భార్య సిరుసోతో పాటు వదిన గెమ్మెలి పార్వతమ్మ, ఇతర కుటుంబ సభ్యులంతా మావోయిస్టుల హత్యాకాండను నిరసించారు. సిరుసో మాట్లాడుతూ తన భర్త కృష్ణారావు పోలీసుల ఇన్ఫార్మర్ కాదని.. గ్రామంలో వ్యవసాయ పనులు, కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, పోలీస్ ఇన్ఫార్మర్ ముద్ర వేసి చంపడం దారుణమన్నారు. తన భర్త మొదటి భార్య చనిపోయిందని, ఆమెకు పుట్టిన బిడ్డతోపాటు తనకు జన్మించిన ముగ్గురు పిల్లలు మొత్తం నలుగురిని మావోయిస్టులు అనాథలను చేశారని వాపోయారు. మృతుడి వదిన గెమ్మెలి పార్వతమ్మ మాట్లాడుతూ మావోయిస్టులు ఎప్పుడూ ఎలాంటి హెచ్చరికలు చేయలేదని, కృష్ణారావు పోలీసు ఇన్ఫార్మర్గా పనిచేయలేదని, ప్రజాకోర్టు కూడా నిర్వహించకుండానే తన మరిదిని అన్యాయంగా చంపారని ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టులు అమాయక గిరిజనులను చంపవద్దని, తమలాంటి కుటుంబాలను వీధిపాలు చేయవద్దని ఆమె ప్రాధేయపడ్డారు. వాకపల్లికి కృష్ణారావు మృతదేహం తరలింపు మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన గెమ్మెలి కృష్ణారావు మృతదేహానికి పాడేరు జిల్లా ఆస్పత్రిలో వైద్యులు శవపరీక్ష నిర్వహించారు. పాడేరు డీఎస్పీ డాక్టర్ వీబీ రాజ్‌కమల్, జి.మాడుగుల సీఐ జి.డి.బాబు, ఇతర పోలీసులంతా జిల్లా ఆస్పత్రి శవపరీక్షల విభాగానికి చేరుకున్నారు. శవపరీక్షలను దగ్గరుండి జరిపించారు. అనంతరం కృష్ణారావు మృతదేహాన్ని అంబులెన్సులో వాకపల్లికి తరలించారు. -
దంతెవాడలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ
చత్తీస్‌గఢ్: రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత జిల్లా అయిన దంతెవాడలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన 32 మంది లొంగిపోయినట్లు ఆదివారం పోలీసులు వెల్లడించారు. వారిలో 10 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీ డొల్ల సిద్ధాంతాలతో విసిగి.. పోలీసులు ప్రకటించిన పునరావాస కార్యక్రమానికి ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా వారి పేర్లు వెల్లడించేందుకు నిరాకరించారు. లొంగిపోయిన 32 మంది దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్, క్రాంతికారి మహిళా ఆదివాసీ సంఘటన్, చేత్న నాట్య మండలి, జనతనా సర్కార్ గ్రూప్స్ తదితర విభాగాలకు చెందిన వారని ఎస్పీ తెలిపారు. తాజాగా లొంగిపోయిన వారిలో పలువురికి గతంలో పోలీసులు, పోలింగ్ సిబ్బందిపై దాడికి పాల్పడిన నేపథ్యం ఉంది. నలుగురిపై తలో లక్ష రూపాయల చొప్పున రివార్డు కూడా ఉందని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద రూ.10వేలు చొప్పున అందించారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీని అందించనున్నారు. మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నవారు ప్రజా జీవనంలోకి రావాలని కోరుతూ స్థానిక పోలీసులు 'లాన్ వర్రటు' పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు నక్సల్ ప్రభావిత గ్రామాల్లో పెద్దఎత్తున పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 150 మంది వరకు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. -
సరిహద్దుల్లో భయం భయం
చర్ల: ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలోని ఆదివాసీ పల్లెల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోనూ పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. అయితే పోలీసులకు కొరియర్లుగా వ్యవహరిస్తున్నారని, తమ సమాచారం పోలీసులకు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పలు గ్రామాలకు చెందిన ఆదివాసీలను మావోయిస్టులు కిడ్నాప్ చేసి, ప్రజాకోర్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలువురిని హతమారుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బీజాపూర్ జిల్లాలోని పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో గల పలు గ్రామాలకు చెందిన ఆదివాసీలను వారం వ్యవధిలో 16 మందిని హతమార్చినట్లు సమాచారం. మావోయిస్టుల చేతిలో మృతి చెందిన వారిలో బట్టిగూడెం, కౌరగట్ట, కోడేపాల్, బీమారంపాడు, పూసుబాక గ్రామాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిసింది. కాగా ఇన్ఫార్మర్ల హత్యల విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తెలియనీయవద్దని, ఎవరైనా చెబితే వారిని కూడా శిక్షిస్తామని మావోయిస్టులు హెచ్చరించినట్లు సమాచారం. ఆయా గ్రామాల నుంచి పామేడుకు వచ్చి పోలీసులకు సమాచారం ఇస్తారనే అనుమానంతో పామేడు – ధర్మారం మధ్యలో ఉన్న వాగులపై నడిచే పడవలను సైతం మావోయిస్టులు నిలిపివేసినట్లు తెలిసింది. అలాగే ఆదివాసీల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆయా గ్రామాలకు చెందిన ఆదివాసీలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎంత మందిని హతమారుస్తారోనని భయపడుతున్నారు. 28న బంద్‌కు మావోయిస్టుల పిలుపు వివిధ ప్రాంతాల్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈనెల 28న రాష్ట్రవ్యాప్త బంద్ పాటించాలని జయశంకర్ భూపాలపల్లి – ములుగు – మహదేవపూర్ – వరంగల్ – పెద్దపల్లి డివిజన్ల సీపీఐ (మావోయిస్టు) కార్యదర్శి వెంకటేశ్ పేరిట శనివారం ఓ ప్రకటన విడుదలైంది. చెన్నాపురం, కదంబ పూసుగుప్ప, దేవార్లగూడెంలలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లను ఖండించాలని పేర్కొన్నారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లలో శంకర్, శ్రీను, ఐతు, చుక్కాలు, బాజీరావు, జోగయ్య, రాజే, లలితను ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లపై హక్కుల సంఘాలు నిజనిర్ధారణ కొనసాగించి బాధ్యులైన వాళ్లకు శిక్షలు పడేలా చూడాలని ఆయన కోరారు. -
రాష్ట్రం వైపు వందలాదిగా మావోయిస్టులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టుల కదలికలను కనిపెట్టేందుకు పోలీసులు వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సత్ఫలితాలనిస్తోంది. ఆదివారం పోలీసులు డ్రోన్ వీడియో కెమెరా ద్వారా మావోలకు సంబంధించి కచ్చితమైన వివరాలు కనుగొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీసుస్టేషన్ పరిధిలో పాలోడి అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు వాగు దాటుతున్నట్లు డ్రోన్ కెమెరా ద్వారా వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. వీరంతా తెలంగాణ వైపు వస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య నిరంతరం పోరు నడుస్తోంది. గత కొన్ని నెలలుగా తెలంగాణలోనూ మావోయిస్టులు తమ కార్యకలాపాలను పెంచుతున్నారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత రెండు నెలల్లో పలుసార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 3న భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు, 7వ తేదీన చర్ల మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో వాగు దాటుతూ తెలంగాణ వైపు వస్తున్నట్లు డ్రోన్ కెమెరాలు కనిపెట్టాయి. దీంతో రాష్ట్రంలోని ములుగు, భద్రాచలం, పినపాక, మంథని నియోజకవర్గాల్లో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు. -
మావోయిస్టుల బంద్ ప్రశాంతం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవళ్లగూడెంలో ఈనెల 3న జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఆదివారం పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టుల కదలికల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో అలజడి వాతావరణం నెలకొంది. బంద్ సందర్భంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు, ఆయా జిల్లాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని నెలలుగా తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న మావోయిస్టులు ఏజెన్సీ జిల్లాలకు ఛత్తీస్‌గఢ్ నుంచి యాక్షన్ టీమ్‌లను పంపించినట్టు తెలుస్తోంది. అలాగే జూలైలో కొత్తగా తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు మరో 12 కమిటీలను మావోయిస్టులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏజెన్సీ జిల్లాల్లో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. గత రెండు నెలల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కరకగూడెం మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోనూ ఎదురు కాల్పులు జరిగాయి. దేవళ్లగూడెం ఎన్కౌంటర్లో తమ యాక్షన్ కమిటీ సభ్యుడు, ముఖ్యనేత హరిభూషణ్ గన్‌మన్ దూది దేవాల్ అలియాస్ శంకర్ మృతితో మావోయిస్టులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. దేవళ్లగూడెం ఎన్కౌంటర్ బూటకం అంటూ మావోయిస్టు పార్టీ ఇల్లెందు–నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి శాంత, భద్రాద్రి కొత్తగూడెం–తూర్పుగోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ తదితరుల పేర్లతో బంద్‌పై ప్రకటనలు విడుదల చేశారు. దీంతో గోదావరి పరీవాహక జిల్లాల్లో పోలీసు యంత్రాంగం అడుగడుగునా తనిఖీలు చేసింది. చివరకు బంద్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా ఈ జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా మోటాపోల్, పునాసార్ అనే రెండు గ్రామాలకు చెందిన ఆదివాసీలను అపహరించిన మావోయిస్టులు తమ అధీనంలో ఉన్న 16 మందిని వదిలిపెట్టారు. మొత్తం 26 మందిని అపహరించగా, అందులో శనివారం ఆరుగురిని విడిచిపెట్టి నలుగురిని హతమార్చిన విషయం విదితమే. -
పక్కా వ్యూహంతో ముందుకు..
సాక్షి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల సంచారం ఉన్న నేపథ్యంలో ఆదిలోనే నిలువరించేందుకు పోలీసులు పక్కా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. డీజీపీ మహేందర్ రెడ్డి ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో రోజూ డీజీపీ పర్యటన కొనసాగింది. ఎస్పీ క్యాంపులోనే గురువారమంతా గడిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పలు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చిస్తూ.. వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు సూచనలు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో మావోయిస్టులు రాష్ట్ర, డివిజన్, ఏరియాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసువర్గాలు గుర్తించాయి. మారుమూల, గిరిజన ప్రాంతాల్లో సానుభూతిపరులతో బలం పెంచుకునే క్రమంలో వారిని ఆదిలోనే అదుపు చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు డీజీపీ క్షేత్రస్థాయి పర్యటన సాగుతోంది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో పర్యటిస్తూ.. స్థానికంగా ఉన్న పరిస్థితులు తెలుసుకుంటున్నారు. మావోల ప్రభావం లేకుండా చేసేందుకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వ్యవహరించాలో పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభావిత ప్రాంతాల్లో రోజుల తరబడి గడుపుతూ స్థానిక ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు కనిపిస్తోంది. స్థానిక పోలీసులు సరైన దిశలో వెళ్లేలా ప్రత్యేకంగా ఈ సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కేబీఎం కమిటీ దళ సభ్యులను అదుపులోకి తీసుకోవాలన్న కృతనిశ్చయంతోనే ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తోంది. ఇందుకోసం దళ సభ్యులకు ఏ వైపు నుంచీ సాయం అందకుండా పోలీసు ఇన్ఫార్మర్లను మరింతగా వాడుకోనున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండురోజుల పాటు రాష్ట్ర పోలీస్ బాస్ ఆసిఫాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో గడపడం ఇదే తొలిసారి. ఇక మావోయిస్టు అగ్రనేత గణపతి, ఇతర కేంద్ర కమిటీ సభ్యుల లొంగుబాటు వార్తలు పూర్తిగా అ వాస్తవమని కేంద్ర కమిటీ నుంచి గురువారం ఓ ప్రకటన విడుదల కావడం అనుమానాలకు తెరదించినట్లయ్యింది. కాగా, వరంగల్ జోన్ ఐజీ నాగిరెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, సిరికొండ పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. మావోల సంచారంపై ఆరా తీశారు. ఇలా రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారులు వరుసగా సందర్శించడం ఆసక్తిగా మారుతోంది. మావోయిస్టుల సంచారం నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. -
ఏవోబీలో మావోయిస్టు డంప్ స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు డంప్‌ను బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన నిర్థిష్టమైన సమాచారం మేరకు సరిహద్దు భద్రతా బలగాలు, జిల్లా వాలంటీర్ ఫోర్స్ బలగాలు నేతృత్వంలో ఏవోబీలోని కలిమెల పోలీసుస్టేషన్ పరిధిలోని సూధికొండ సమీపంలో కురూబ్ అటవీప్రాంతంలో గాలింపు చర్యలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మంగళవారం మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌లో ఆయుధాలు తయారీకు ఉపయోగించే లేత్‌మిషన్, గ్యాస్ వెల్డింగ్ చేసే సిలిండెర్లు, లేత్ మిషన్ విడిబాగాలుతో బాటు ఆయుధాలు , విప్లవసాహిత్యం, ఇనుప తుక్కు సామాగ్రీ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. మల్కన్‌గిరి జిల్లా కార్యాలయంలో విలేకర్లు ముందు స్వాధీనం చేసుకున్న సామాగ్రీను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మల్కన్‌గిరి జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ కురూబ్ అటవీప్రాంతంలో కలిమెల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల సమావేశం నిర్వహించారని, ఈ మేరకు వచ్చిన సమాచారంతో గాలింపులు నిర్వహించామని, ఆ ప్రదేశంలో మావోయిస్టులు ఆయుధాలు తయారుచేస్తున్నట్లుగా తమకు రూఢీ అయిందని ఆయన తెలిపారు. -
పోలీసుల అదుపులో జనశక్తి నక్సల్స్?
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు సీపీఐ(ఎంఎల్) జనశక్తి నక్సల్స్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జిల్లాలో నక్సలైట్ల ఉద్యమం కనుమరుగు కాగా కొత్తగా జిల్లాలో ఉద్యమాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి వద్ద ఓ కంట్రిమెడ్ తుపాకీతో పాటు రివాల్వార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తంగళ్లపల్లి మండలం జిల్లె్లల్ల కు చెందిన ఒకరిని, సిద్ధిపేట జిల్లా జక్కాపూర్‌కు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, జనశక్తి పేరుతో సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో నక్సలైట్ల ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారని సమాచారం. నక్సలైట్ల పేరుతో వ్యాపారులకు చిట్టీలు రాసి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ వేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వారి వద్ద ఆయుధాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిరిసిల్ల పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మాజీలతో లింక్.. జిల్లాలో 2006 తర్వాత నక్సలైట్ల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మాజీ న క్సలైట్లతో కలిసి పలువురు యువకులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఆయుధాలతో బెదిరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పలు వురు వ్యాపారులకు చిట్టీలు రాస్తున్న క్రమంలో ఆ నలుగురు పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. వారి వద్ద రెండు ఆయుధాలు లభించినట్లు సమాచారం. జిల్లాలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరుగకుండానే పోలీసులు అప్రమత్తంగా ఉండి అసాంఘిక శక్తులను కట్టడి చేయడం విశేషం. -
ఎనిమిదేళ్ల క్రితం అపహరించిన ఆయుధాలు లభ్యం
భద్రాద్రి కొత్తగూడెం, చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఎనిమిదేళ్ల క్రితం పోలీసుల వద్ద నుంచి అపహరించిన ఆయుధాల్లో కొన్ని ఇటీవల లభ్యమయ్యాయి. 2013, మే 25న సుకుమా–జగదల్‌సూర్ మార్గంలోని 30వ నంబర్ జాతీయ రహదారి (గతంలో 221 నంబర్ జాతీయ రహదారి)లో ఉన్న జెర్రూం ఘాట్ రోడ్లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పరివర్తన్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ కాన్వాయ్‌ను మావోయిస్టులు అడ్డుకున్నారు. శక్తిమంతమైన మందుపాతరను పేల్చి 27 మందిని హతమార్చారు. మహేంద్రఖర్మతోపాటు 8 మంది పోలీస్ సిబ్బంది, 12 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇద్దరు కార్యకర్తలు, నలుగురు గ్రామస్తులు ఉన్నారు. ఈ ఘటనలో మావోయిస్టులు పోలీసు బలగాలకు చెందిన తొమ్మిది ఏకే 47 తుపాకులు, 7 ఇన్శాస్ రైఫిళ్లు, 2 ఎస్ఎల్ఆర్ తుపాకులు, 4 నైన్ ఎంఎం పిస్టళ్లు అపహరించుకుపోయారు. ఈ ఆయుధాలను నాటి నుంచి మావోయిస్టులు వినియోగిస్తూనే ఉన్నారు. ఇటీవల రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని మన్పూర్కు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్దోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన స్థలంలో పోలీసులు నాలుగు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక ఏకే 47 కూడా ఉంది. ఆ ఆయుధాలన్నీ మహేంద్రఖర్మ హత్య జరిగిన రోజు మావోయిస్టులు అపహరించినవేనని రాజ్‌నంద్‌గావ్ జిల్లా ఎస్పీ జితేంద్ర శుక్లా తెలిపారు. -
ఇది మరో ‘రోజా’ కథ..!
రాయ్‌పూర్: మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి, మధుబాల జంటగా నటించిన రోజా చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ అభిమానుల మదిలో ఈ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తీవ్రవాదుల చేత కిడ్నాప్‌కు గురైన తన భర్తను కాపాడుకోవడం ఓ సాధారణ మహిళ చేసే ప్రయత్నమే ఈ చిత్ర కథా సారాంశం. అచ్చు ఇలాంటి సంఘటనే ఒకటి ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. మావోయిస్టుల చేతిలో కిడ్నాప్‌కు గురైన కానిస్టేబుల్ కోసం భర్త భార్య చేసిన ప్రయత్నం అందరిని అబ్బురపరుస్తుంది. వివరాలు.. సంతోష్ కట్టం(48) అనే వ్యక్తి బీజాపూర్‌లోని భోపాలపట్నంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4న కిరాణా సామాన్లు తీసుకురావడం కోసం బయటకు వెళ్లాడు. నాటి నుంచి కనిపించకుండా పోయాడు. అయితే సంతోష్ అప్పుడప్పడు చెప్పకుండా బయటకు వెళ్లేవాడు. రెండు మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చేవాడు. దాంతో సునీత మొదట్లో పెద్దగా ఆందోళన చెందలేదు. రోజులు గడుస్తున్నా భర్త ఇంటికి రాకపోవడంతో సునీతలో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో సంతోష్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారని తెలిసింది. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది . ఆ తర్వాత ఇరుగుపొరుగు వారి సాయంతో తన భర్తను వెతకడం ప్రారంభించింది. (పోలీసు క్యాంటీన్లో కీచక పర్వం) ఈ విషయం గురించి సునీత మాట్లాడుతూ.. ‘మా ఇల్లు మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా ఉండే సుక్మా జిల్లాకు పక్కనే ఉంది. దాంతో ఇక్కడ అప్పుడప్పుడు ఇలాటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందుకే నా భర్త కిడ్నాప్ విషయం తెలిశాక నేను పెద్దగా ఆందోళణ చెందలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాక నాకు ఇంట్లో ఉండాలనిపించలేదు. ఇరుగు పొరుగు వారి సాయంతో నా భర్తను వెతకడం ప్రారంభించాను’ అని తెలిపారు. ఈ క్రమంలో మే 6న సునీత, ఆమె కుమార్తె, స్థానిక రిపోర్టరు, ఇరుగుపొరుగు వారితో కలిసి అడవిలోకి వెళ్లింది. నాలుగు రోజుల తర్వాత మావోల చెరలో ఉన్న తన భర్తను కనుగొన్నది. అయితే సునీత తన భర్తను కనుగోవడం ఒక్క రోజు ఆలస్యమైన తీవ్ర పరిణామాలు చూడాల్సి వచ్చేది. ఎందుకంటే మే 11న మావోయిస్టులు ‘జన్ అదాలత్’ నిర్వహించి సంతోష్‌ను ఏం చేయాలనే విషయాన్ని డిసైడ్ చేసేవారు. కానీ సునీత సమాయానికి తన భర్తను కనుగొని.. మావోయిస్టులను వేడుకోవడంతో వారు సంతోష్‌ను విడుదల చేశారు. కానీ అతడు ఇక మీదట పోలీసుగా విధులు నిర్వహించకూడదని మావోలు హెచ్చరించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. ‘తన భర్త క్షేమం కోసం ఓ మహిళ కష్టాలు లెక్కచేయకుండా.. ఎంత దూరమైన వెళ్తుంది. నేను కూడా అదే చేశాను’ అని చెప్పుకొచ్చారు. చదవండి: సొంత గూటికి చేరేలోపే.. -
దండకారణ్యం నుంచి తెలంగాణ జిల్లాల్లోకి
మావోయిస్టులను ఎదుర్కొనే విషయంలో సరిహద్దు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు సమన్వయంతో ముందుకెళ్లడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం కొత్తగా మరో విధానాన్ని పోలీసులు అవలంబించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఇతర శాఖలతో కలిసి ఏజెన్సీ ప్రజలకు మరింత చేరువై.. నక్సలిజాన్ని అడ్డుకునేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రస్తుతం ఎండాకాలం. ఇది ఆకురాలే సమయం కావడంతో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీ పోరు కొనసాగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో దీన్ని ‘ప్రాణాలు తీసే సీజన్’గా సంబోధిస్తారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో బలగాలు, మావోయిస్టులకు మధ్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టులు ప్రత్యేకంగా యాక్షన్ టీమ్‌లను దండకారణ్యం నుంచి తెలంగాణ జిల్లాల్లోకి పంపించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని అభయారణ్యం గుండా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లోకి ప్రవేశించడంతో పాటు కొత్త రిక్రూట్మెంట్లు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చర్యలను నియంత్రించేందుకు తెలంగాణ పోలీసులు నిరంతరం డేగకళ్లతో పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి సైతం నిరంతరం సమీక్ష చేస్తున్నారు. గతంలోనూ పలుసార్లు జిల్లాలో పర్యటించిన డీజీపీ.. సరిహద్దు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు. తాజాగా సోమవారం కూడా ఆయన కొత్తగూడెం వచ్చారు. భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఏజెన్సీలో మావోల యాక్షన్ టీమ్‌లను అడ్డుకోవడంతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలో పాలుపంచుకుంటూ గిరిజనులకు చేరువయ్యేందుకు, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కీలక పాత్ర.. ప్రభుత్వం చేపడుతున్న పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అర్హులకు అందించే విషయంలో తమవంతు పాత్ర పోషించేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈనెల 13న ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఇల్లెందు మండలం బాలాజీనగర్, బొజ్జాయిగూడెం గ్రామాల్లో పర్యటించారు. ప్రల్లెప్రగతి, నర్సరీలు, డంపింగ్ యార్డుల వివరాలు తెలుసుకున్నారు. తాజాగా జిల్లా కేంద్రానికి వచ్చిన డీజీపీ సైతం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, ఇతర సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో తమవంతుగా కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. తద్వారా ఏజెన్సీ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారని సమాచారం. కాగా, జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి సైతం డీజీపీని కలిసి జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు గురించి వివరించడం గమనార్హం. ఇదిలా ఉండగా సరిహద్దుల్లో, గోదావరీ పరీవాహక ప్రాంత జిల్లాల్లో పోలీసులు భారీగా కూంబింగ్, సెర్చ్ అపరేషన్లు సైతం నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులకు రక్షణగా... జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం, మణుగూరు సమీపంలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల రక్షణ బాధ్యతలు సైతం పోలీసులే పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. పనుల పురోగతి గురించి తెలుసుకునేందుకు వివిధ స్థాయిల ఉన్నతాధికారులు సైతం క్షేత్రస్థాయికి వస్తున్నారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జిల్లాకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కాగా అధికార పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అత్యవసరమైతే తప్ప గ్రామాల్లో తిరగవద్దని, బయటికి వెళితే తమకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ నెలకొంది. -
జిల్లాలో మావోయిస్టుల అలజడి...
సాక్షి, పెద్దపల్లి : చాలా రోజుల తరువాత మళ్లీ మావోల అలజడి మొదలైంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి నాలుగు దళాలు మన రాష్ట్రంలోకి ప్రవేశించాయనే ప్రచారంతో పోలీసు శాఖ కూంబింగ్ చేపట్టింది. డ్రోన్ కెమెరాలతో గోదావరి తీరం, అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతోంది. మావోల కదలికల ప్రచారం నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజాప్రతినిధులను పోలీసులు అప్రమత్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. రామగుండం ఎన్టీపీసీలో బస చేశారు. రాష్ట్రంలోకి నాలుగు దళాలు? దశాబ్దాలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా మంథని, జగిత్యాల, ధర్మపురి, పెద్దపల్లి, సిరిసిల్ల నియోజకవర్గాలు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు. లొంగుబాటు, ఎన్కౌంటర్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన దరిమిలా కొన్ని సంవత్సరాలుగా మావోయిస్టుల జాడే లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాకు చెందిన మావో పెద్దలు కూడా ఇతర రాష్ట్రాలకే పరిమితమయ్యారు. ప్రస్తుతం మన సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోనే మావోయిస్టుల కార్యకలాపాలు సాగుతున్నాయి. తాజాగా ఈ రెండు రాష్ట్రాల నుంచి నాలుగు మావోయిస్టు దళాలు మన రాష్ట్రంలోకి ప్రవేశించాయనే ప్రచారంతో మళ్లీ అలజడి మొదలైంది. దీంతో పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన మంథని, చెన్నూరు నియోజకవర్గాల పరిధిలో పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. గోదావరి తీరంలోని మారుమూల ప్రాంతాల్లో రామగుండం సీపీ సత్యనారాయణ స్వయంగా పర్యటించారు. పడవ నడిపేవాళ్లను, గ్రామస్తులను మావోలకు సంబంధించిన సమాచారంపై ఆరా తీశారు. డ్రోన్ కెమెరాల సహాయంతో మావోల కదలికలను అంచనా వేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అలర్ట్! నాలుగు మావోయిస్టు దళాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయనే ప్రచారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజాప్రతినిధులను పోలీసు శాఖ అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రజాప్రతినిధులకు సంబంధిత పోలీసులు వ్యక్తిగతంగా సమాచారం అందించినట్లు సమాచారం. మావోల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పర్యటించొద్దని, తమ కదలికలు ఎప్పటికప్పుడు పోలీసులకు తెలియజేస్తూ ఉండాలని ప్రజాప్రతినిధులను అలర్ట్ చేసినట్లు వినికిడి. ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం పర్యటించారు. మావోల కదలికల ప్రచారంతో పోలీసుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకు, మావోల నియంత్రణకు భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో తిరిగారు. కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు పోలీసులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సోమవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీలో డీజీపీ బస చేశారు. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. కాగా, మావోయిస్టులు నిజంగానే వచ్చారా, వస్తే ఎంతమంది వచ్చారు, ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఒకవేళ మావో దళాలు ప్రవేశించడం నిజమే అయితే ఆదిలోనే అణచివేయడంపై పోలీసులు ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. -
మావోయిస్టుల చేతిలో డ్రోన్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల సంచారం కలకలం రేపుతోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఏడు యాక్షన్ టీంలు తెలంగాణలోకి ప్రవేశించాయన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెంచారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని చెన్నూరు నుంచి పాత ఖమ్మం జిల్లాలోని చర్ల వరకు గాలింపు ముమ్మరం చేశారు. ఈ ప్రాంతాలన్నీ నదీ పరివాహకాలే. దీంతో మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించాలంటే.. తప్పనిసరిగా గోదావరి నదిని దాటాలి. రెండు నుంచి మూడు కిలోమీటర్ల వెడల్పున్న నదిని దాటేముందు గట్టుకు అవతల పోలీసులు ఉన్నారో లేదో ధ్రువీకరించుకునేందుకు మావోయిస్టులు డ్రోన్లను వినియోగిస్తున్నారని సమాచారం. వేసవి సమీపించడం, అడవిలో ఆకులు రాలుతుండటంతో ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ దళాలు ‘ఆపరేషన్ ప్రహార్’పేరిట దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. వారి నుంచి తప్పించుకోవడంతోపాటు తెలంగాణలో కొత్త రిక్రూట్మెంట్ కోసం మావోయిస్టులు సరిహద్దు దాటి వస్తున్నారు. మార్చి ఆఖరివారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను సందర్శించే అవకాశాలున్నాయి. దీంతో పోలీసు డిపార్ట్మెంట్ ఈ ప్రాంతంలో అణువణువూ గాలిస్తున్నాయి. అంతా అలర్ట్..! కొత్తగూడెం పరిధిలోని నీలాద్రిపేట వద్ద మావోయిస్టులు పోలీసులు తారసపడ్డారు. పోలీసులను చూసిన ఏడుగురు మావోలు తప్పించుకుని పారిపోయారు. ఈ సందర్భంగా వంటసామగ్రి, విప్లవ సాహిత్యం, ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. భద్రాచలం జిల్లాలో ఎస్పీ సునీల్‌దత్ ఆధ్వర్యంలో పోలీసులు హెలికాప్టర్, డ్రోన్ల సాయంతో వెదుకుతున్నారు. గతేడాది జూలై 12న ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావు హత్య తరువాత మళ్లీ ఇప్పుడే మావోల కదలికలు మొదలవడం గమనార్హం. ఎలాగైనా తెలంగాణలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోన్న హరిభూషణ్–శారద దంపతులే శ్రీనివాసరావు హత్యలోనూ నిందితులు కావడం గమనార్హం. దూకుడుగా వెళ్లడం, యువతను ఆకర్షించడమే లక్ష్యంగా వీరు పావులు కదుపుతున్నారు. మొత్తానికి అటు ఆపరేషన్ ప్రహార్, ఇటు తెలంగాణ పోలీసుల కూంబింగ్‌తో రెండు వైపులా మావోయిస్టులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ముఖ్యంగా చెన్నూరు, ఏటూరునాగారం, కాటారం, ముత్తారం, చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో తనిఖీలు పెంచారు. ఆదివాసీలు, గూడెలలో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేయడంతో మరింత కలకలానికి దారి తీసింది. మరోవైపు పోలీసులు ఎప్పుడు ఎవరిని పట్టుకుపోతారో తెలియక.. ఆదివాసీలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటు ‘సూడో’ వసూళ్లు.. పోలీసులు గాలింపులు తీవ్రతరం చేయడం, మావోయిస్టుల పోస్టర్లు విడుదల చేశారు. ముఖ్యంగా ఏజెన్సీలోని స్థానిక వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇదే అదనుగా.. సందట్లో సడేమియా అన్నట్లుగా.. కొత్తగూడెం, భద్రా ద్రి ఏజెన్సీ ప్రాంతాల్లో నకిలీ నక్సలైట్ల గోల మొదలైంది. స్థానిక వ్యాపారులు, అధికార పార్టీ నాయకులను డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపు లేఖలు పంపుతున్నారు. పోస్టర్లు విడుదల దండకారణ్యంలో గుత్తికోయ తెగలకు చెందినవారే మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం సభ్యులుగా ఉన్నారు. వీరికి తెలుగుభాష కూడా రావడంతో ఇక్కడికి వచ్చి సులువుగా జనాల్లో కలసిపోవడం, రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ కార్యదర్శి అగ్రనేత హరిభూషణ్, ఆయన భార్య శారద కూడా ఉన్నట్లు సమాచారం. వీరిని సులువుగా గుర్తించేందుకు వీలుగా పోలీసులు వారి ఫొటోలతో ఉన్న పోస్టర్లు చెన్నూరు నుంచి చర్ల వరకు అంటించారు. వీరి సమాచారం చెప్పినవారికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నగదు బహుమతి కూడా ప్రకటించారు. వాస్తవానికి ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం బాగానే ఉంది. కానిస్టేబుల్ కిడ్నాప్, హత్య తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో తాజాగా విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ని అపహరించి హత్య చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా అరగట్ట సమీపంలోని అడవుల్లో ఓ కానిస్టేబుల్‌ను మావోయిస్టులు హతమార్చారు. సుకుమా జిల్లా ఎస్పీ శలాబ్ సిన్హా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ను సుకుమా జిల్లాలోని అరగట్ట వద్ద సొంత గ్రామంలోనే కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మావోలు చంపారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలకాధికారి పర్యటన ఇటు పోలీసులు మావోయిస్టుల వేట సాగిస్తూనే గ్రామాల్లో తనిఖీలు పెంచారు. ఇప్పటికే ఇద్దరు ఐపీఎస్ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ప్రత్యేక ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. ఇల్లందు మండలం పరిధిలోని బాలాజీ నగర్, బోజ్జయిగూడెం గ్రామ పంచాయతీలను శుక్రవారం ఐజీ స్టీఫెన్ రవీంద్ర సందర్శించారు. స్థానిక పోలీసులతో కలసి వచ్చిన ఆయన పల్లె ప్రగతి కార్యక్రమాలు, నర్సరీలు, డంపింగ్ యార్డ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓ వైపు మావోల కోసం కూంబింగ్ జరుగుతుండగానే.. పోలీసు ఉన్నతాధికారి గ్రామాల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
గ్రామస్తుల దాడిలో మావోయిస్టు మృతి
సాక్షి, మల్కన్‌గిరి: రాత్రివేళ గ్రామంలోకి రహస్యంగా చొరబడ్డ మావోయిస్టులపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని చిత్రకొండ బ్లాక్ పరిధిలోని జొడొంబొ పంచాయతీ జంతురామ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. శనివారం రాత్రి ముగ్గురు సాయుధ మావోయిస్టులు జంతురామ్ గ్రామంలోకి చొరబడ్డారు. ఆ గ్రామానికి చెందిన ఓ గిరిజనుడిని తమతోబాటు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీన్ని ప్రతిఘటించిన గ్రామస్తులు మావోయిస్టులను అడ్డుకున్నారు. దీంతో మావోయిస్టులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో గ్రామస్తులు మావోయిస్టులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఒక మావోయిస్టు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన మావోయిస్టును మల్కన్‌గిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇక మరో మావోయిస్టు సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. కాగా గతంలో చిత్రకొండ మావోయిస్టులకు అడ్డాగా ఉండేది. కానీ జవానులు అక్కడ నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తుండటంతో మావోల అలజడి తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో వారి ఉనికిని చాటుకోడానికే మావోలు గ్రామంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. చదవండి: చిత్రకొండ పరిసరాల్లో ఆర్కే? -
వరవరరావు హార్డ్‌డిస్క్ డేటా రికవరీ కోసం..
పుణే: ఎల్గార్ పరిషద్– మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన విరసం నేత వరవరరావు ఇంట్లో స్వాధీనంచేసుకున్న హార్డ్‌డిస్క్‌లోని డేటా రికవరీ కోసం అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సాయం తీసుకోవాలని పుణే పోలీసులు భావిస్తున్నారు. గతేడాది ఆగస్టులో వరవరరావు ఇంట్లో సోదాల్లో లభ్యమైన హార్డ్‌డిస్క్‌లో ఏముందో తెల్సుకునేందుకు నాలుగు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలకు పంపినా ఫలితం లేదు. తొలుత పుణేలోని ల్యాబొరేటరీకి పంపగా, నిపుణులు హార్డ్ డిస్క్‌లోని డేటాను రికవరీ చేయలేకపోయారని ఓ అధికారి చెప్పారు. తర్వాత ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినా అక్కడి నిపుణులు డేటా సంపాదించలేకపోయారు. గుజరాత్, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల నిపుణులు రికవరీ చేయలేకపోయారని పేర్కొన్నారు. ‘సాంకేతికతలో ఎఫ్‌బీఐ చాలా పురోగతి చెంది ఉంటుంది. అందుకే ఎఫ్‌బీఐకి హార్డ్ డిస్క్ పంపాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు అవసరమైన అనుమతులను కేంద్ర హోం శాఖ ఇచ్చింది’అని ఆ అధికారి చెప్పారు. -
కాటారంలో 'మావో' కరపత్రాల కలకలం
సాక్షి, కాటారం(వరంగల్) : కాటారం సబ్ డివిజన్లోని పలు మండలాల్లో కొన్ని రోజులుగా కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పలిమెల మండలంలోని సర్వాయిపేట, మహాముత్తారం మండలం కనుకునూర్‌లో పలువురు ప్రజాప్రజాప్రతినిధులు, నాయకులను హెచ్చరిస్తూ మావోయిస్టులు కరపత్రాలు వేయగా తాజాగా మంగళవారం కాటారం మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) పేరిట కరపత్రాలు వెలిశాయి. మండల కేంద్రానికి కూత వేటు దూరంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల గేటుతో పాటు కాటారంలోని పలు ఇళ్ల గోడలపై మావోల పేరిట రాసిన కరపత్రాలు దర్శనమిచ్చాయి. కాటారం మండల కేంద్రానికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు బొమ్మ మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ కరపత్రాలు వెలిసాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చైర్మన్ పదవిని అడ్డుపెట్టుకుని మేడారం, తాడ్వాయి మండలంలో 150 ఎకరాల భూమి కబ్జాకు పాల్పడటంతో పాటు ముకునూరు, నీలంపల్లిలో 430 ఎకరాల భూమి అక్రమంగా స్వాధీనపర్చుకున్నారని కరపత్రాల్లో పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఆ భూములను ప్రజలకు తిరిగి ఇవ్వాలని, లేదంటే ఆయనతో పాటు కుటుంబసభ్యులను కాల్చి చంపుతామని కరపత్రాల ద్వారా హెచ్చరించారు. కాగా, కరపత్రాల్లో భారతకమ్యూనిస్టూ పార్టీ (మావోయిస్టు) అనేది మాత్రమే ఎరుపు రంగు పెన్నుతో రాసి మిగితా లేఖ మొత్తం బ్లూ పెన్నుతో రాయడంతో ఇవి నకిలీ కరపత్రాలనే సందేహాలు వెలువడుతున్నాయి. మల్లారెడ్డితో వైరం ఉన్నవారు ఎవరో భయభ్రాంతులకు గురి చేయడానికి నకిలీ కరపత్రాలు సృష్టించి ఉంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. కరపత్రాల్లో పేర్కొన్నట్లు మల్లారెడ్డికి భూములు లేనట్లు సమాచారం. కాగా, సమాచారం తెలుసుకున్న సీఐ హతీరాం, ఎస్సై2 జహీర్‌ఖాన్ సంఘటనా స్థలానికి చేరుకుని కరపత్రాలను స్వాధీనపర్చుకున్నారు. ఈ విషయమై సీఐ హతీరాంను వివరణ కోరగా అవి నకిలీ కరపత్రాలని కొట్టిపారేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే ఈ చర్యలకు పాల్పడిన వారిని పట్టుకుంటామని తెలిపారు. -
మావోయిస్టులకు హైదరాబాద్ సీపీ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ : అమాయక యువకులను రెచ్చగొట్టి హింసా మార్గంలోకి తప్పుదారి పట్టించవద్దని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మావోయిస్టు సంస్థలను హెచ్చరించారు. టీవీవీ వంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు మావోయిస్టు గ్రూపులతో అనుబంధాలు కలిగిన సుదీర్ఘ చరిత్ర ఉందని, వారి వద్ద ఇటీవల నిషేధ సామాగ్రి దొరకడమే ఇందుకు నిదర్శనమన్నారు. అలాంటి సంస్థలతో సంబంధాలు కలిగిన నకిలీ మేధావులు కూడా కోర్టు కేసులు ఎదుర్కోక తప్పదని సీపీ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఫ్రంటల్ సంస్థలపై అనేక జిల్లాలో చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తామని అంజనీ కుమార్ తెలిపారు. -
దంతెవాడలో హోరాహోరీ కాల్పులు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా కట్టెకళ్యాన్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆదివారం నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమచారం అందడంతో ప్రత్యేక బలగాలతో అటవీ ప్రాంతాన్ని మోహరించారు. ఈ సమయంలో మావోయిస్టులు ఎదురుపడడంతో వారిద్దరి మధ్య హోరాహోరీ ఎదురుకాల్పుల చోటుచేసుకున్నాయి. ఈ విషాయాన్ని కట్టెకళ్యాన్ ఎస్పీ సూరజ్ సిన్హా ధృవీకరించారు. కాగా వారోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున మావోయిస్టులు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నల్లమలపై నిరంతర నిఘా!
సాక్షి, గుంటూరు: నల్లమలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనుండడంతో పల్నాడు ప్రాంతాన్ని అణువణువూ పరిశీలిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే జిల్లా వాసి కావడం, గతంలో బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, దుర్గి, కారంపూడి, గురజాల మండలాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చే వారి వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు జరుగనున్న నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంపై పోలీసులు నిఘా పెట్టారు. మావోయిస్టుల ప్రభావం లేనప్పటికీ గుంటూరు జిల్లా అటవీ ప్రాంతాన్ని షెల్టర్ జోన్‌గా వాడుకునే అవకాశం ఉందనే కారణంగా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న విజయనగరం, విశాఖ ఏజెన్సీ, ఏవోబీ ప్రాంతాల్లో పోలీసు నిఘా పెరిగిన సమయంలో గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు నల్లమల అటవీ ప్రాంతాన్ని గతంలో మావోలు షెల్టర్ జోన్‌గా వాడుకున్నారు. ప్రస్తుతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ విధించిన కారణంగా మళ్లీ జిల్లాను సేఫ్ జోన్‌గా వాడుకునే అవకాశం ఉన్నందున నిఘాను మరింతగా పెంచారు. మాజీ మావోయిస్టుల కదలికలపై ఆరా తీసే పనిలో పడ్డారు. పల్నాడు గ్రామాలపై నిఘా గతంలో మావోల ప్రభావం అధికంగా ఉన్న పల్నాడు గ్రామాలపై పోలీసులు డేగ కన్ను వేశారు. బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, దుర్గి, కారంపూడి, మాచవరం, గురజాల, పిడుగురాళ్ల రూరల్, రెంటచింతల మండలాల పరిధిలోని గ్రామాలకు రాకపోకలు కొనసాగిస్తున్న వారి కదలికలను గమనిస్తున్నారు. గుత్తికొండ బిలంతో పాటుగా నల్లమల అటవీ ప్రాంతంలోని కొన్ని గ్రామాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. గతంలో గుత్తికొండ బిలంలోని మజుందార్ స్మారక స్థూపం వద్ద మావోయిస్టులు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరిపిన కారణంగా ఆయా ప్రాంతాల్ని ఇప్పటికే పోలీసులు తరచూ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలసిన మాజీలలో కొందరు అనుమానితుల్ని నిఘా వర్గాలు విచారిస్తూ వివరాలను సేకరిస్తున్నాయి. అంతే కాకుండా ప్రజా సంఘాల ముసుగులో ఎవరైనా సానూభూతిపరులు ఉన్నారా అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. అగ్రనేత ఆర్కే జిల్లా వాసి కావడంతో.. అగ్రనేతగా ఉన్న అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తమృకోటకు చెందిన వ్యక్తి కావడంతో పోలీస్ యంత్రాంగం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆయా ప్రజాసంఘాల సీనియర్లతో ఆర్కేకు సత్సంబంధాలు ఉన్నాయనే కోణంలో ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పల్నాడులోని రాజకీయ నేతలకు ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ అప్రమత్తం చేస్తున్నారు. -
ఏజెన్సీలో మావోల అలజడి
సాక్షి, భూపాలపల్లి : పట్టుకోసం మావోయిస్టులు పలు చర్యలతో ప్రయత్నిస్తుండగా.. భద్రతాబలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతుండడంతో ఏజెన్సీలో మళ్లీ అలజడి పెరుగుతోంది. తాజాగా జరిగిన చర్ల సంఘటనతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టు ముఖ్యనేతలు సంచరించారనే వార్తలు వచ్చిన నేపథ్యంలోనే.. చర్లలోని టీఆర్ఎస్ ఎంపీటీసీ కిడ్నాప్ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 28 నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ఉన్నాయి. దీంతో భద్రతా దళాలు సైతం అప్రమత్తమయ్యాయి. ఉమ్మడి భూపాలపల్లి జిల్లాపై పట్టు పెంచుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. రెండు జిల్లాల పరిధి పలు మండలాల్లో కరపత్రాలు లభించడం, గత నెల తాడ్వాయి మండలంలో వాచ్మెన్పై దాడి ఘటన ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. తాజాగా వాజేడు– వెంకటాపురం కమిటీని ఏర్పాటు చేయడం కూడా విస్తరణలోనే భాగమే అని తెలుస్తోంది. ఇటీవల కాలంలో జిల్లాలో అక్కడక్కడా మావోల ఉనికి కనిపిస్తుండడంతో భద్రతా బలగాలు పటిష్టమైన చర్యలు చేపట్టాయి. ఇటీవల సరిహద్దు మండలం చర్లలో టీఆర్ఎస్ నాయకుడి అపహరణ, హత్యనేపథ్యంలో కూంబింగ్‌ను మరింత విస్తృతం చేశారు. సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు ఎప్పటికప్పుడు అటవీ గ్రామాలతో పాటు, అడవులను జల్లెడ పడుతున్నారు. మరోవైపు మావోయిస్టు వారోత్సవాలు దగ్గర పడుతుండటంతో సరిహద్దు మండలాల్లో నిఘా మరింత పెంచారు. ఛత్తీస్‌గఢ్, భద్రాచలం, ములుగు జిల్లాల సరిహద్దులో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను అనుకుని ఉన్న ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఏటూరునాగారం ముల్లకట్ట వంతెన సమీపంలో, వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగరం, కన్నాయిగూడెం, పలిమెల, మహాముత్తారం మండలాల్లో వాహన తనిఖీలు విస్తృతగా చేపడుతున్నారు. ఇంటలిజెన్స్ వర్గాలు సైతం గ్రామాల్లో తిరుగుతూ.. ఎవరు వస్తున్నారు.. ఎక్కడి వారు.. ఎవరిని కలుస్తున్నారనే విషయాలపై సమాచారం సేకరిస్తున్నారు. -
సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారీ ఎన్‌కౌంటర్‌కు ప్లాన్
సాక్షి, భూపాలపల్లి: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు యాక్షన్ టీమ్స్ సంచారంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారంరోజుల క్రితమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన టీఆర్ఎస్ నేత శ్రీనివాసరావును అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఏజెన్సీలో అధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. దీనితో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదివాసీలు బయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇన్ఫార్మర్ వ్యవస్థని మరో మారు మావోయిస్టులు టార్గెట్ చేసారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, పస్రా, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం ఏజెన్సీలో ముమ్మర తనిఖీలు చేస్తూ మాజీ మావోయిస్టులపై పోలీసులు కన్నేశారు. వారి కదలికలపై వారం నుంచి దృష్టి పెట్టారు. మావోయిస్టు టార్గెట్ లిస్ట్‌ల ఉన్న స్థానిక ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులు మైదాన ప్రాంతానికి వెళ్లాలని పోలీసు అధికారులు సూచించారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ఏజెన్సీలో పర్యటించవద్దని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అక్కడి పోలీస్ స్టేషన్లకు అదనపు భద్రత కల్పించిన పోలీసులు.. ఆ ప్రాంతంపై పూర్తిగా పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవేళ వారికి మావోయిస్టులు తరస పడితే.. భారీ ఎన్కౌంటర్ జరిపేందుకు ప్రణాళిలు కూడా రచిస్తున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. -
మావోయిస్టుల పంజా : ఎస్పీ నాయకుడి హత్య
చత్తీస్‌గఢ్ : మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. సమాజ్ వాదీ పార్టీ నేత సంతోష్ పూనెంను కాల్చి చంపారు. బీజాపూర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు బుధవారం అందించిన సమాచారం ప్రకారం కాంట్రాక్టర్ , మరిముల్లాకు చెందిన సంతోష్ పూనెంను మంగళవారం సాయంత్రం కిడ్నాప్ చేశారు. అనంతరం ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని యాంటి నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ సుధేరాజ్ తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు 15 కి.మీ దూరంలో దట్టమైన అడవిలో ఈ ఘటన జరిగిట్టుగా భావిస్తున్నట్టు తెలిపారు. పోలీసు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించామని, వారి నివేదిక ఆధారంగా పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. కాగా సంతోస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ పార్టీ తరపున బీజాపూర్‌నుంచి పోటీచేశారు.ప్రస్తుతం బస్తర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. -
టీడీపీ నేతలకు మావోల హెచ్చరిక!
అల్లిపురం (విశాఖ దక్షిణం): టీడీపీ మంత్రులు, నాయకులను హెచ్చరిస్తూ సీపీఐ మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం గురువారం రాత్రి ఒక లేఖ విడుదల చేశారు. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, గిడ్డి ఈశ్వరిలతో పాటు మండల నాయకులు కొర్ర బలరాం, మామిడి బాలయ్య, ముక్కల మహేష్, వండలం బాలయ్య, నళినిలను ఉద్దేశిస్తూ రాసిన ఆ లేఖలో మన్యంలో నడుస్తోన్న పోలీసు నిర్భందాన్ని ఎత్తివేయకపోతే టీడీపీ నాయకులపై ప్రజలు, సీపీఐ మావోయిస్టు పార్టీ తీసుకునే చర్యలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. విశాఖ మన్యంలో 2017 మే నుండి ‘సమాధాన్’ దాడిలో భాగంగా రాజ్యనిర్బంధం అమలవుతోందని, గ్రామాలపై నిత్యం పోలీసులు దాడులు, అక్రమ అరెస్ట్‌లు, వేధింపులతో మన్యంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. గత సంవత్సరం ఆర్వీ నగర్, చాపగట్ట, సిరిబాల ఎస్టేట్ చుట్టుపక్కల 30 గ్రామాల ప్రజలు ఏపీఎఫ్డీసీ వద్ద కూలీలుగా పని చేయబోమని, కాఫీ తోటలపై హక్కు తమదేనని గొత్తెత్తినందుకు వారిపై మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రవేసి, చిత్రహింసలకు గురిచేస్తున్నారని కైలాసం పేర్కొన్నారు. మే 1వ తేదీ నాడు వంచుల పంచాయితీ పనసలొద్ది, కొత్తవాదురుపల్లి గ్రామాలపై పోలీసులు దాడులు చేసి ఆరుగురు రైతులను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని, వారి విడుదల కోసం ఆ గ్రామాల ప్రజలు రెండు రోజులు పాటు పోలీసుల చుట్టు తిరిగినా వాళ్లని పట్టించుకున్న వాళ్లే లేరన్నారు. -
జనజీవన స్రవంతిలో కలవండి
పెదవాల్తేరు (విశాఖతూర్పు): విశాఖ ఏజెన్సీలో గల మావోయిస్టులంతా స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ పిలుపునిచ్చారు. పెదవాల్తేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెదబయలు సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ దళ సభ్యులు ఇద్దరు, హార్ట్కోర్మిలీషియా సభ్యులు నలుగురు తమకు లొంగిపోయినట్లు వెల్లడించారు. వీరు ఏఏ కేసులతో సంబంధం ఉందో వివరించారు. ఒడిశాలోని చిత్రకొండ జిల్లాకు చెందిన గొల్లూరి బిరుసు (24), పెదబయలు మండలానికి చెందిన గొల్లూరి రామయ్య (25), జి.మాడుగుల మండలానికి చెందిన కొర్రాసత్తిబాబు (37), పెదబయలు మండలానికి చెందిన గొల్లూరి సత్యనారాయణ (18), కొర్రా గణపతి (40), కొర్రా పాత్రో (19) లొంగిపోయినవారిలో ఉన్నారన్నారు. బిరుసుకు 2016లో ముంచంగిపుట్టు మండలంలో శివయ్య అనే వ్యక్తిని హత్య చేసిన సంఘటనలో పాల్గొన్నట్టు వివరించారు. అదే ఏడాదిలో ముంచంగిపుట్టులో, 2018లో ఒడిశాలో, తరువాత జీకేవీధి మండలంలో జరిగిన ఎదురుకాల్పుల సంఘటనల్లో కూడా ఇతని పాత్ర ఉందన్నారు. అలాగే 2018లో ఒడిశాలో రోడ్డు యంత్రాల దగ్ధం ఘటనలో కూడా పాల్గొన్నాడన్నారు. మరో సభ్యుడు రామయ్య 2015లో ముంచంగిపుట్టుప్రాంతానికి చెందిన రామయ్యను హత్య చేసిన ఘటనలో పాల్గొన్నట్టు ఎస్పీ చెప్పారు. 2017లో జి.మాడుగులలో సూర్య, కిశోర్‌ల హత్య చేసిన సంఘటనలో, 2019లో దోసిలబంద వద్ద మందుపాతర అమర్చిన సంఘటనలో పాత్ర ఉందన్నారు. జుమఢాంగి గ్రామంలో మూడు ఇళ్లపై జరిగిన కరువు దాడుల్లో కూడా పాల్గొన్నాడన్నారు. సత్తిబాబుకు 2015లో జి.మాడుగులలో జరిగిన సత్యారావు హత్యకేసుతో సంబంధం ఉందన్నారు. మరో సభ్యుడు గణపతికి పెదబయలులో కిల్లో మోహన్, 2015లో ముంచంగిపుట్టులో రామయ్య హత్య కేసులతో సంబంధం ఉందన్నారు. పాత్రోకు 2015లో జి.మాడుగులలో వంతల సత్యారావు హత్య కేసుతో, 2015లో ముంచంగిపుట్టు రామయ్య హత్య కేసులతో సంబంధం ఉందని పేర్కొన్నారు. లొంగిపోయిన సభ్యులపై మందుపాతర్ల ఏర్పాటు, కరువు దాడులు చేసిన సంఘటనలకు సంబంధించి వారిపై కేసులు ఉన్నాయన్నారు. ‘మానసికహింస భరించలేకే లొంగుబాటు’ లొంగిపోయిన దళ సభ్యుల విషయమై ఎస్పీ ప్రస్తావిస్తూ.. దళం సీనియర్ సభ్యులు వీరిని ప్రతి విషయానికి అనుమానించడం, దళంలో వీరి మాటలకు విలువ లేకపోవడం, మానసిక హింస భరించలేక లొంగిపోయినట్టు చెప్పారని పేర్కొన్నారు. వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పిస్తామన్నారు. మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) బొడ్డేపల్లి కృష్ణారావు, సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సుదీప్ వాక్చరే పాల్గొన్నారు. -
మావోయిస్టులపై పోస్టర్ ‘యుద్ధం’..!
ప్రభుత్వాలకు, పోలీసులకు వ్యతిరేకంగా మావోయిస్టులు పోస్టర్ ‘యుద్ధం’ సాగించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు, సరికొత్తగా.. మావోయిస్టులపై ‘పోస్టర్’ యుద్ధం మొదలైంది...! మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్ల, తేగడ, కలివేరు, సత్యనారాయణపురం, ఆర్.కొత్తగూడెం, కుదునూరు, దేవరాపల్లి, రాళ్లగూడెం తదితర ప్రాంతాల్లో ఆదివాసీ, గిరిజన సంఘాల పేరిట సోమవారం అర్ధరాత్రి ఈ వాల్ పోస్టర్లు పడ్డాయి. చర్ల: ప్రభుత్వాలకు, పోలీసులకు వ్యతిరేకంగా మావోయిస్టులు పోస్టర్ ‘యుద్ధం’ సాగించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు, సరికొత్తగా... మావోయిస్టులపై ‘పోస్టర్’ యుద్ధం మొదలైంది...! మావోయిస్టులకు వ్యతిరేకంగా చర్ల మండలంలోని చర్ల, తేగడ, కలివేరు, సత్యనారాయణపురం, ఆర్ కొత్తగూడెం, కుదునూరు, దేవరాపల్లి, రాళ్లగూడెం తదితర ప్రాంతాలలో ఆదివాసీ, గిరిజన సంఘాల పేరిట సోమవారం అర్ధరాత్రి ఈ వాల్ పోస్టర్లు పడ్డాయి. వాటిలో ఇలా ఉంది. ‘మేధావులు, ప్రజాసంఘాలు, పత్రికావివిమిత్రులు ఆలోచించండి. ఈ రోజు ఆపరేషన్ సమాధాన్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు జరుపుతున్న దమనకాండ దేనికి ఉపయోగపడుతుంది..? ప్రభుత్వ, ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తే ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా..? మావోయిస్టులు కేవలం తమ ఉనికిని చాటుకునేందుకు మాత్రమే విధ్వంసాలు సృష్టిస్తున్నారు. విజ్ఞులైన మీరందరూ దీనిని ప్రశ్నించాలి. రోజువారీ పనులు చేసుకోనియకుండా ఆదివాసీలను గత వారం రోజులుగా మావోయిస్టులు హింసిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి బియ్యం, ఇతర వస్తువులను బలవంతంగా వసూలు చేసి, సభలు.. సమావేశాల పేరిట వారిని ఇబ్బందిపెడుతున్నారు. ఆదివాసీ గ్రామాలలో పాఠశాలలు బంద్ చేసి, ఆదివాసీ ప్రజలంతా సమావేశాలకు రావాలని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని వారాంతపు సంతలపై వారం రోజులుగా నిఘా పెట్టారు. వ్యాపారుల నుంచి వస్తువులన్నీ మావోయిస్టులు తీసుకుంటున్నారు. ఆదివాసీ ప్రజలకు ఎటువంటి నిత్యావసర వస్తువులు అందకుండా చేస్తున్నారు. మావోయిస్టుల అనుమతి లేనిదే సంతలు నిర్వహించడానికి వీల్లేదట. పైకి మాత్రం, ఆదివాసీలను పోలీసులు హింసిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి మావోయిస్టులే ఆదివాసీలను హింసిస్తున్నారు. ఆ తప్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మోపుతున్నారు. సోడి సోగయ్య అనే నరహంతకుడి ఆరాచకాలు ఇంకా ఎన్నాళ్లు ...? ఇతడు ఇంతకు ముందు కుర్నపల్లి గ్రామస్తులపై దాడులు చేశాడు. ఇర్పా వెంకటేశ్వర్లును చంపాడు. ఎందుకు చంపిందీ మావోయిస్టులు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. పొట్ట కూటి కోసం ఆర్అండ్బీ గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తున్న నాగుల నాగేశ్వరావు, నిట్టా రాజ్‌కుమార్, పందెం నాగేశ్వరావు, గగ్గూరి వెంకటేశ్వరావును చెన్నాపురం సమీపంలో మందుపాతర పేల్చి గాయపరిచారు. అదృష్టవశాత్తు వారికి ప్రాణాపాయం తప్పింది. ఒకవేళ చనిపోతే... వారి భార్యాపిల్లల పరిస్థితి ఏమవుతుందో మావోయిస్టు పార్టీ ఆలోచించాలి. దీనికి తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ క్షమాపణ చెప్పాలి. సోడి జోగయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలో రాళ్లాపురంలో మంత్రాలు చేస్తున్నదనే నెపంతో కుడుం ఉంగి అనే మహిళను మావోయిస్టులు కొట్టి చంపారు. దీనికి కూడా ఆ పార్టీ ఇంతవరకు సమాధానం చెప్పలేదు. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ కేడర్ అంతా ఇక్కడ (తెలంగాణ)లో ఆదరణ కోల్పోయింది. అందుకే వారు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో తల దాచుకుని, అమాయక ఆదివాసీల ద్వారా ఇతరులపై దాడులు చేయిన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ వదిలి వెళ్లిన తరువాత ఇక్కడి ఆదివాసీ ప్రజలు మంచి జీవనం సాగిస్తున్నారు. మీరు (మావోయిస్టులు) ఛత్తీస్‌గఢ్ వెళ్లిన తరువాత అక్కడి ఆదివాసీలకు కష్టాలు మొదలయ్యాయి. మీరు అక్కడ ఉన్నంత కాలం వారి కష్టాలు తీరవు, అభివృద్ధి జరగదు. కాబట్టి, ఆదివాసీ ప్రజలంతా మావోయిస్టులపై తిరగబడి, తరిమికొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం’. -
ఎన్నికల వేళ మావోల కుట్ర భగ్నం
చర్ల: ఎన్నికల్లో విధ్వంసం సృష్టించాలన్న మావోయిస్టుల కుట్రను తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో మావోయిస్టు యాక్షన్ టీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను టార్గెట్ చేసి ల్యాండ్మైన్లను భారీగా మావోలు అమర్చారు. విశ్వసనీయ సమాచారంతో యాక్షన్ టీంను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏజెన్సీ గజగజ!
సాక్షి, విశాఖపట్నం/అరకులోయ/సీలేరు: విశాఖ ఏజెన్సీ గజగజ వణుకుతోంది. కొ న్నాళ్లుగా ఆరేడు డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదుతో వణికించే చలి వల్ల కాదు.. మావోయిస్టులు, పో లీసుల వల్ల ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయంతో మన్యసీమ వణుకుతోంది. పీఎల్జీఏ వారోత్సవాల ఆరంభానికి ముందే మావోయిస్టులు మన్యంలో తన ఉనికిని చాట డం మొదలు పెట్టారు. భారీ సాయుధ పోలీసు బలగాలు కూంబింగ్‌తో పాటు అడవులను జల్లె డ పడుతున్నా మావోయిస్టులు వెనక్కి తగ్గడం లేదు. ఆదివారం నుంచి వారం రోజుల పాటు పీఎల్జీఏ వారోత్సవాలు జరుగుతున్నాయి. అంతకుముందే అంటే శనివారం సాయంత్రమే పెదబయలు మండలం కోండ్రుం–ఇంజరిల మద్య అటవీ ప్రాంతంలో కూంబింగ్ పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు భారీ మందుపాతర్లను పేల్చారు. ఈ ఘటన నుంచి పోలీసులు త్రుటిలో తప్పించుకున్నారు. మూడు రోజుల క్రి తం కూడా జి.మాడుగుల మండలం నుర్మతి వద్ద మావోయిస్టులు మందుపాతర్లు పేల్చి పోలీ సులకు సవాలు విసిరారు. పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు సెల్టవర్ల పేల్చివేయనున్నారని సమాచారం అందినట్టు జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ వెల్లడించారు. పీఎల్జీఏ వారోత్సవాలను మావోయిస్టులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.ఈ వారం రోజుల్లో ఏదైనా భారీ ఘటనకు పాల్పడాలని పథక రచన చేస్తారు. మావోయిస్టులు సాదాసీదా భావించే పార్టీ విలీన వారోత్సవాల వేళ (సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు) అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టులో సెప్టెంబర్ 23న పట్టపగలే కాల్చి చంపారు. అలాంటిది అంతకంటే కీలకంగా భావించే పీఎల్జీఏ వారోత్సవాల సమయంలో ఎలాంటి అఘాయిత్యాలకు దిగుతారోనని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అంతేకా దు.. అక్టోబర్ 12న మావోయిస్టు ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు మీనాను పోలీసులు పనసపుట్టు–బెజ్జంగిల మధ్య ఎన్కౌంటర్ చేశారు. దీంతో ఏవోబీ మరింత ఉద్రిక్తంగా మారింది. ఇలా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హతమార్చి మావోయిస్టులు, ప్రతిగా మీనాను ఎన్కౌంటర్ చేసి పోలీసులు ఒకరికొకరు సవాల్ విసురుకున్నట్టయింది. ఇప్పటికే మన్యంలో భారీగా పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. ఏవోబీలో యాంటీ నక్సల్ స్క్వాడ్ పెట్రోలింగ్‌ను కూడా పెంచారు. దీంతో ఏజెన్సీ అంతటా వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనంటూ గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. అప్రమత్తంగా ఉండండి.. పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మంత్రుల ఇళ్ల వద్ద అదనపు భద్రతను పెంచారు. ముమ్మరంగా వాహన తనిఖీలు కొయ్యూరు, చింతపల్లి, జీకే.వీధి, జి.మాడుగుల,పెదబయలు,ముంచంగిపుట్టు మండలాలలతో పాటు,ఒడిశా సరిహద్దులో ఉన్న హుకుంపేట,డుంబ్రిగుడ,అరకులోయ ప్రాంతాలలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.అవుట్ పోస్టులలో అదనపు పోలీసు పార్టీలను అందుబాటులో ఉంచారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో పాటు,మండల కేంద్రాలలో సంచరించే అన్ని వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఒడిశాలోని కొరాపుట్,మల్కన్‌గిరి జిల్లాల పోలీసుశాఖ కూడా అప్రమత్తమైంది. ఒడిశా నుంచి అరకులోయ ప్రాంతం వైపు వచ్చే వాహనాలను,అరకుసంత సమీపంలోని జైపూర్ జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీలేరు పరిసరాల్లో రోడ్డు నిర్మాణ పనుల్లో వినియోగిస్తున్న వాహనాలను పోలీస్‌స్టేషన్ వద్దకు చేర్చారు. సెల్టవర్ల వద్ద నిఘా అల్లిపురం(విశాఖ దక్షిణం): సెల్ టవర్ల పేల్చివేతకు మావోయిస్టులు సన్నాహాలు చేస్తున్నారని తెలియడంతో వాటి వద్ద నిఘాను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా గిరిజన యువత తమ గ్రామాల్లో ఉన్న సెల్ టవర్ల ధ్వంసం కాకుండా కాపాడుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నట్టు అనుమానం వచ్చిన వెంటనే తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు గానీ, అధికారులకు గానీ తెలియజేయాలని ఆయన కోరారు. పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా ఏజెన్సీ ప్రాంతంలో సెల్ టవర్లను ధ్వంసం చేయడానికి మావోయిస్టులు పూనుకుంటున్నారని పేర్కొన్నారు. టవర్లను పేల్చివేస్తే సమాచార వ్యవస్థ స్తంభిస్తుందని, అత్యవసర సమాచారం తెలియక నష్టపోవలసి వస్తుందని తెలిపారు. సెల్‌టవర్లు పేల్చివేయడం అనాలోచిత చర్యకు నిదర్శనమన్నారు. -
సమాచారం ఇస్తే రూ.5లక్షల బహుమతి
సాక్షి, ఆసిఫాబాద్: మావోయిస్టుల సమాచారం తెలిపిన వారికి రూ.5లక్షల బహుమతి ఇస్తామని ఎస్పీ మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో పోలీసుల తనిఖీల్లో ఇద్దరు యాక్షన్ టీం సభ్యులు పట్టుబడ్డ నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు ఎస్పీ గోద్రుతో కలిసి నిర్వహించిన సమావేశంలో నిషేధిత మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం సభ్యుల పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మావోయిస్టు పార్టీకి చెందిన యాక్షన్ టీం సభ్యులు విధ్వంసానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. యాక్షన్ టీంల సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణలో జరిగేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రజాపోరాటం ముసుగులో శాంతి యుతవాతావరణం విచ్ఛిన్నం చేసేలా మావోయిస్టులు ప్రజాఆస్తులను విధ్వంసం చేసి సాధించేది శూన్యమన్నారు. జిల్లాలో నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తులు యాక్షన్ టీమ్ సభ్యులుగా ఏర్పడి రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా చేసుకొని పనిచేయుటకు అవకాశం ఉన్నందున ముందస్తుగా జిల్లా ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకున్న గ్రామాల్లో వారి కదలికలను పసిగట్ట వారి చర్యలను నిర్వీర్యం చేసేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మావోయిస్టులను గుర్తించేందుకు వీలుగా వారి ఫొటోలతో కూడిన పోస్టర్‌ను ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విడుదల చేసినట్లు ఎస్పీ తెలిపారు. పోస్టర్లలో ఉన్న మావోయిస్టుల సమాచారం తెలిపిన వారికి పారితోషికం ఇవ్వడంతోపాటు, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా ప్రొజెక్టర్ ద్వారా మావోయిస్టుల చిత్రాలను చూపించారు. సమావేశంలో రిజర్వ్ ఇన్పెక్టర్ శేఖర్‌బాబు, ఐటీకోర్ సభ్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ నేతల హత్యకు మావోయిస్టుల పక్కా ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రజాప్రతిధులను మావోయిస్టులు టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోములను ఎలాగైతే హత్య చేశారో అదే తరహాలో.. తెలంగాణలోని ఎమ్మెల్యేలను అంతం చేస్తామని మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మావోయిస్టు యాక్షన్ టీమ్స్.. తెలంగాణకు చెందిన ఓ ఆపద్ధర్మ మంత్రి, స్పీకర్‌ను టార్గెట్ చేసినట్టు సమాచారం. అదేవిధంగా తాడ్వాయి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టుల కుట్రను పసిగట్టిన తెలంగాణ పోలీసులు అలర్ట్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మావోయిస్టుల ముప్పు గురించి పోలీసులు సమాచారం ఇవ్వడంతో మంత్రి అజ్మీరా చందూలాల్ తాడ్వాయ్ మండలంలోని కటాపూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ముగించి వెనుదిరిగారు. ఈ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రంగంలోకి దిగిన 30 మంది మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వారి జాడ చెబితే.. ఐదులక్షలు బహుమతి
సాక్షి, ఇల్లెందు: ‘‘మావోయిస్టు యాక్షన్ టీం తిరుగుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అని, ఇల్లెందు డీఎస్పీ జి.ప్రకాశరావు హెచ్చరించారు. ఆయన బుధవారం ఇల్లెందు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ‘‘ఆరుగురు సభ్యులున్న మావోయిస్టు యాక్షన్ టీం తిరుగుతోంది. వారు బైక్‌ల మీద వస్తున్నారు. వారిని గుర్తించేందుకు ఫోటోలు విడుదల చేస్తున్నాం. ఆ ఆరుగురిలో.. కుర్సం మంగూ అలియాస్ పాపన్న (భద్రు): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా చరమాంగి గ్రామస్తుడు. లింగయ్య (లింగు) అలియాస్ రాకేష్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కుంట తాలూకా, మడకంగూడ గ్రామస్తుడు. మడివి కాయ అలియాస్ రమేష్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం మండలంలోని పిట్టతోగు గ్రామస్తుడు. కొవ్వాసి గంగ అలియాస్ మహేష్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా నెమలిగూడ గ్రామస్తుడు. మంగతు: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవాడు. పండు అలియాస్ మంగులు: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోట్రం బైరంగఢ్ గ్రామస్తుడు. జాడ చెబితే.. లక్షల రూపాయలు..! ఈ పోస్టర్‌లోని వీరిని గుర్తుపట్టి సమాచారమిస్తే ఐదులక్షల రూపాయల బహుమతి ఇస్తాం. సమచారం ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతాం. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చినా, ఎవరి మీదనైనా అనుమానం ఉన్నా వెంటనే సమీపం పోలీస్ స్టేషన్‌కు సమాచాం ఇవండి’’. సమావేశంలో ఇల్లెందు సీఐ డి.వేణుచందర్ పాల్గొన్నారు. -
బెజ్జింగివాడ అడవుల్లో ఎన్కౌంటర్
-
బెజ్జింగివాడ అడవుల్లో ఎదురు కాల్పులు
-
మావోయిస్టులకు ఎదురుదెబ్బ
మల్కాన్‌గిరి: ఒడిశాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. మల్కాన్‌గిరి జిల్లా బెజ్జింగివాడ అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులతో జరిగిన ఎదురు కాల్పులతో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. అళ్లూరుకోట, సన్యాసిగూడ గ్రామాల మధ్య ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతులు కలిమెల ఏరియా కమిటీ సభ్యులుగా గుర్తించారు. కీలక నేత రణ్ దేవ్ తప్పించుకున్నట్టు తెలుస్తోంది. మృతుల్లో మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను గుర్తించినట్టు సమాచారం. గాయపడిన మావోయిస్టులు ఎవరైనా ఉన్నారేమోనన్న ఉద్దేశంతో చుట్టపక్కల ప్రాంతాల్లో రక్షణ బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. -
గణపతి, వరవరరావుల మధ్య ఈమెయిల్స్!
పుణె: మావోయిస్టులతో సంబంధం ఉందనే ఆరోపణలపై జూన్‌లో అరెస్టైన ఐదుగురు హక్కుల కార్యకర్తల బెయిల్ పిటిషన్లను మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వ్యతిరేకించింది. విరసం నేత వరవరరావు, పరారీలో ఉన్న సీపీఐ (మావోయిస్టు) నేత గణపతిల మధ్య జరిగిన ఈ–మెయిల్ సంభాషణలను మహారాష్ట్ర తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. హక్కుల కార్యకర్తలు సురేంద్ర గాడ్లింగ్, సోమసేన్, వెర్నన్ గోన్సాల్వేజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్‌లు జూన్‌లో అరెస్టయ్యారు. ఆ తర్వాతనే ఈ ఈ–మెయిల్ సంభాషణలు జరిగాయని ప్రభుత్వ తరపు న్యాయవాది ఉజ్వలా పవార్ కోర్టుకు తెలిపారు. ఈ–మెయిల్స్‌ను గణపతి వరవరరావుకు పంపారనీ, హక్కుల కార్యకర్తలు అరెస్టైన అంశంపై సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ ఆందోళన చెందినట్లు ఈ–మెయిల్ ద్వారా తెలుస్తోందని పవార్ పేర్కొన్నారు. -
‘మావోయిస్టులు హింస విడనాడాలి’
విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యల తర్వాత ప్రజాప్రతినిధులకు రక్షణ మరింత పెంచామని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. విశాఖపట్నంలో ఠాకూర్ విలేకరులతో మాట్లాడుతూ..మావోయిస్టులు హింసను విడనాడి..ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. గంజాయి సాగు, రవాణా చట్టవ్యతిరేకమని తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. ఏవోబీలో ఎన్కౌంటర్ జరిగిందని మావోయిస్టులు అంగీకరించారని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. -
ఉరకలెత్తి.. తెరమరుగై..!
సాక్షి, యాదాద్రి : సుమారు మూడు దశాబ్దాల క్రితం నల్లగొండ జిల్లా పోరుబిడ్డలకు పుట్టినిల్లుగా ఉండేది. అప్పట్లో పురుడుపోసుకున్న ఆలేరు, రాచకొండ, కనగల్, కృష్ణపట్టె, గిరాయపల్లి దళాలు 1990 నుంచి 2005 వరకు ఉద్యమాన్ని ఉర్రూతలూగించాయి. అయితే పోలీసుల ఎన్కౌంటర్లు, వర్గశుత్రు నిర్మూలన పేరుతో ఆలేరు నుంచి దేవరకొండ వరకు దాదాపు 200 మందికి పైనే ఉద్యమకారులు నేలకొరిగారు. తాజాగా ఏఓబీ ( ఆంధ్ర- ఒడిశా సరహద్దు)లో జరిగిన ఎన్కౌంటర్లో హతమైన శ్యామల కిష్టయ్యతో మావోల ఉద్యమం మరో అగ్రనేతను కోల్పోయింది. ఇంకా ఎవరెవరున్నారంటే.. మావోయిస్టు ఉద్యమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పన్నాల యాదయ్య, షేక్ జాన్‌బీ(గుర్రంపోడు)బోడ అంజయ్య(పీఏపల్లి)భాస్కర్(చిట్యాల)పాక హన్మంతు కొనసాగుతున్నారు. ఉద్యమంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్క్కొన్న మావోయిస్టులు ఒక్కొక్కరుగా నెలకొరుగుతున్నారు. అయితే కేంద్ర కమిటీ, వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న మరికొంత మంది మావోయిస్టులు ఇంకా ఉద్యమంలో కొనసాగుతున్నారు. అసువులుబాసిన వారిలో కొందరు.. దాసిరెడ్డిగూడేనికి చెందిన శ్యామల కిష్టయ్య మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడిగా పనిచేస్తూ తాజాగా పోలీస్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. అదే విధంగా మిర్యాలగూడకు చెందిన రాష్ట్ర కార్యదర్శి పులి అం జయ్య, పోచంపల్లి మండలం శివారెడ్డిగూడేనికి చెందిన మేకల దామోదర్‌రెడ్డి, వలిగొండ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన హైదరాబాద్ సిటిసెక్రటరీ తుమ్మలవీరారెడ్డి, వలిగొండ మండలం పొద్దటూరుకు చెందిన వెంకన్న, గుండాల మండలం అంబాలకు చెందిన హైదరాబద్ సిటీ కమిటీ సభ్యు లు మజ్జిగరాజు, వలి గొండ మండలం రెడ్టరేపాకకు చెందిన నాగార్జునరెడ్డి, భువనగిరికి చెందిన భానుప్రసాద్ జిల్లాకు చెందిన పలువురు నేతలు పోలీస్ ఎదురు కాల్పుల్లో అసువులుబాసారు. చిన్నబోయిన దాసిరెడ్డిగూడెం మావోయిస్టు (పీపుల్స్ వార్) ఉద్యమానికి ఎందరో ఉద్యమ నాయకులను అందించిన దాసిరెడ్డిగూడెం నేడు చిన్నబోయింది. ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు శ్యామల కిష్టయ్య అలియాస్ దయ మృతిచెందిన విషయం తెసిందే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మావోయిస్టు ఉద్యమానికి ఊపిరులూదిన ఉద్యమకారులు ఒక్కొక్కరు పోరుబాటలో కన్నుమూస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆలేరు నుంచి మూసీని దాటుతూ రాచకొండమీదుగా నల్లమలకు చేరిన పీపుల్స్ వార్ ఉద్యమం కాలక్రమంలో తగ్గుతూ వచ్చింది. సాయుధపోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామని నమ్మి ఉద్యమాన్ని నడిపిన యాదాద్రి జల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంది మాత్రం అత్యంత ప్రత్యేకం. ఈ గ్రామం నుంచి మావోయిస్టు ఉద్యమంలోకి నలుగురు నేతలను అందించింది. మిలిటెంట్ స్థాయి నుంచి రాష్ట్రకార్యదర్శి, కేంద్రకమిటీ సభ్యుల స్థాయికి ఎదిగారు.1990 శ్యామల కిష్టయ్య ముందుగా ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. అతని బాటలో గ్రామానికి చెందిన కొనపురి అయిలయ్య అలియాస్ సాంబశివుడు, అతడి సోదరుడు కోనపురిరాములు, గ్రామానికి చెందిన రాపోలు స్వామిలు ఉన్నారు. విద్యార్థి జీవితంలో ఉద్యమంలోకి వెళ్లిన కిష్టయ్య పార్టీలో కేంద్రకమిటీ సభ్యుని స్థాయికి ఎదిగారు. ఇతడి తలపై ప్రభుత్వం రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది. ఇదే గ్రామానికి చెందిన సాంబశివుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. సాంబశివుడి తలపై ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును ప్రకటించింది. ఉద్యమ బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన సాంబశివుడు 2011లో ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. కోనపురి రాములును 2014లో నయీమ్ ముఠా హత్య చేసింది. కాగా గ్రామానికి చెందిన రాపోలు స్వామి శ్యామల కిష్టయ్యకు అంగరక్షకుడిగా ఉంటూ పోలీస్‌ల ఎన్కౌంటర్లో 2009 లో చనిపోయాడు. ఆ ఎన్కౌంటర్ లో కిష్టయ్యతో పాటు పలువురు తప్పించుకుపోయారు. ఇలా నలుగురు ఉద్యమకారులను అందించిన దాసిరెడ్డిగూడెం రెడ్లరేపాక గ్రామ పంచాయతీలో చిన్న మధిర గ్రామం. జిల్లాలో జరిగిన ముఖ్య ఎన్కౌంటర్లు జిల్లాలో పలు ప్రధాన ఎన్కౌంటర్లలో పీపుల్స్ వార్ ముఖ్యనాయకులను కోల్పోయింది. చిట్యాల మండలం బ్రాహ్మణవెల్లంలో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది నక్సలైట్లు చనిపోయారు. మర్రిగూడ మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో జననాట్యమండలి కార్యదర్శి, నల్లగొండ జిల్లా కార్యదర్శి దివాకర్‌తో పాటు 8 మంది హతమయ్యారు. వార్‌లో పనిచేస్తూ పోలీస్ ఇన్ఫార్మర్గా మారిన సోమ్లానాయక్ పావురాలగుట్టపై ఐదుగురు నక్సలైట్లను కాల్చిచంపాడు. మగ్దుంపల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో అప్పటి జిల్లా కార్యదర్శి కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన ముక్క కిరణ్‌కుమార్ చనిపోయాడు. ఇంకా భువనగిరి, ఆలేరు, దేవరకొండ, చౌటుప్పల్, నల్లగొండ ప్రాంతాల్లో పలువురు మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు.