గురువారం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేస్తున్న ఐజీ నాగిరెడ్డి
సాక్షి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల సంచారం ఉన్న నేపథ్యంలో ఆదిలోనే నిలువరించేందుకు పోలీసులు పక్కా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. డీజీపీ మహేందర్ రెడ్డి ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో రోజూ డీజీపీ పర్యటన కొనసాగింది. ఎస్పీ క్యాంపులోనే గురువారమంతా గడిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పలు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చిస్తూ.. వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు సూచనలు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో మావోయిస్టులు రాష్ట్ర, డివిజన్, ఏరియాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసువర్గాలు గుర్తించాయి.
మారుమూల, గిరిజన ప్రాంతాల్లో సానుభూతిపరులతో బలం పెంచుకునే క్రమంలో వారిని ఆదిలోనే అదుపు చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు డీజీపీ క్షేత్రస్థాయి పర్యటన సాగుతోంది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో పర్యటిస్తూ.. స్థానికంగా ఉన్న పరిస్థితులు తెలుసుకుంటున్నారు. మావోల ప్రభావం లేకుండా చేసేందుకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వ్యవహరించాలో పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభావిత ప్రాంతాల్లో రోజుల తరబడి గడుపుతూ స్థానిక ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు కనిపిస్తోంది. స్థానిక పోలీసులు సరైన దిశలో వెళ్లేలా ప్రత్యేకంగా ఈ సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కేబీఎం కమిటీ దళ సభ్యులను అదుపులోకి తీసుకోవాలన్న కృతనిశ్చయంతోనే ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తోంది.
ఇందుకోసం దళ సభ్యులకు ఏ వైపు నుంచీ సాయం అందకుండా పోలీసు ఇన్‌ఫార్మర్లను మరింతగా వాడుకోనున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండురోజుల పాటు రాష్ట్ర పోలీస్ బాస్ ఆసిఫాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో గడపడం ఇదే తొలిసారి. ఇక మావోయిస్టు అగ్రనేత గణపతి, ఇతర కేంద్ర కమిటీ సభ్యుల లొంగుబాటు వార్తలు పూర్తిగా అ వాస్తవమని కేంద్ర కమిటీ నుంచి గురువారం ఓ ప్రకటన విడుదల కావడం అనుమానాలకు తెరదించినట్లయ్యింది. కాగా, వరంగల్ జోన్ ఐజీ నాగిరెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, సిరికొండ పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేశారు. మావోల సంచారంపై ఆరా తీశారు. ఇలా రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారులు వరుసగా సందర్శించడం ఆసక్తిగా మారుతోంది. మావోయిస్టుల సంచారం నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment