ig
-
జైళ్ల శాఖ రెండో ఐజీగా మురళీబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖలో ప్రస్తుతం ఉన్న పోస్ట్‌కు అదనంగా.. మరో ఐజీ పోస్ట్ ఏర్పాటుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ రేంజ్ డీఐజీగా పనిచేస్తున్న మురళీబాబు త్వరలో ఐజీగా పదోన్నతి పొందనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినందున జైళ్ల శాఖలో డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) సమావేశమై మురళీబాబుకు ఐజీగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఇక లాంఛనప్రాయమే. ఈ మొత్తం ప్రక్రియ మరో వారంలోగా ముగిసే అవకాశం ఉండడంతో ఆ తర్వాత మురళీబాబు ఐజీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం జైళ్లశాఖ ఐజీగా పనిచేస్తున్న రాజేశ్‌కుమార్, పదోన్నతిపై ఐజీగా బాధ్యతలు స్వీకరించనున్న మురళీబాబుల మధ్య పని విభజన చేయనున్నారు. కాగా, ఈ ఇద్దరు అధికారులు ఒకే బ్యాచ్ అధికారులు. సీనియారిటీ అంశంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించే దిశగా జైళ్ల శాఖలో రెండో ఐజీ పోస్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. మురళీబాబుకు పదోన్నతి లభించడంతో ఖాళీ అయ్యే డీఐజీ పోస్ట్ వరంగల్ సెంట్రల్ జైలు ఎస్పీ సంపత్‌కు దక్కే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత డీఐజీ శ్రీనివాస్‌తోపాటు సంపత్ డీఐజీ హోదా పొందనున్నట్టు సమాచారం. -
పోలీసు శాఖపై సీపీ మార్క్
సాక్షి, వరంగల్ : వరంగల్ రేంజ్ ఐజీ, పోలీసు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఐజీ పి.ప్రమోద్‌కుమార్ కమిషనరేట్‌పై పట్టు బిగిస్తున్నారు. కమిషనర్‌గా ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్న ఆయన పరిపాలనాపరంగా తనదైన ముద్ర వేస్తున్నారు. సిబ్బంది, అధికారులు ఎవరైనా సరే తప్పు చేస్తే శాఖాపరమైన విచారణ చేపట్టడం, ఆ తర్వాత చర్యలు తీసుకుంటుండడంతో పలువురు అధికారుల్లో టెన్షన్ నెలకొంది. కమిషనరేట్ పరిధిలో భూముల ధరలు ఆకాశాన్ని అంటడం, ప్రతీ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రతిరోజు పదుల సంఖ్యలో వస్తున్న సివిల్ కేసులకే స్టేషన్ హౌస్ అధికారులు కొందరు ప్రా«ధాన్య త ఇవ్వడం, ఆ తర్వాత కేసులు వివాదాస్పదమైన అవి అధికారుల తలకు చుట్టుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. దీంతో సీపీ ప్రమోద్‌కుమార్ హంగు, ఆర్భాటాలు లే కుండా పోలీసుశాఖను గాడిన పెట్టే పనిలో పడ్డారు. దందా లు, వసూళ్లకు పాల్పడే వారిపై సస్పెన్షన్ వేటు వేస్తుండడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై అంతర్గత విచారణకు ఆదేశిస్తున్నారు. బదిలీలు, మందలింపులు, అంతర్గత చర్యలు ఇటీవల ఊపందుకోగా, బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. కంచె చేను మేసిన చందంగా... అక్రమాలు, సెటిల్మెంట్ దందాలు సాగిస్తున్న కొందరు పోలీసు అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతుండటం కలకలం రేపుతోంది. కొందరు భూవివాదాలకే ప్రాధాన్యత ఇస్తూ సెటిల్మెంట్లు చేస్తుండటం ఇటీవల వివాదాస్పదమైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో భూముల పంచాయితీలు ఎక్కువగా జరిగే పోలీసుస్టేషన్లపై దృష్టి సారించిన ఇంటలిజెన్స్ ఉన్నతాధికారులు అక్కడ జరిగే అంశాలపై ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కమిషనరేట్ పరిధిలో ఏడుగురు ఇన్స్పెక్టర్లపై విచారణ ప్రారంభమైనట్లు సమాచారం. అయితే ఈ ఇన్స్పెక్టర్లు ఎవరనేది శాఖలో అంతర్గతంగా ప్రచారం జరుగుతుండగా, కొందరు సెలవులో వెళ్లినట్లు సమాచారం. ఫిర్యాదులు, వివాదాల్లో కొన్ని.. ⇔ కమిషనరేట్ పరిధిలోని ఓ స్టేషన్ ఎస్హెచ్ఓ(ఇన్స్పెక్టర్) పట్టుబడిన గుట్కాలను అమ్ముకోవడం వివాదస్పదమైంది. ఆ ఇన్స్పెక్టర్పై ఇప్పటికే పదుల సంఖ్యలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో పాటు ఆ పోలీసుస్టేషన్ పరిధిలో ఇటీవల భూముల విషయంలో జరిగిన సెటిల్మెంట్లపై కూడా విచారణ సాగుతోంది. ⇔ ఓ ఇన్స్పెక్టర్ ఫిర్యాదులు స్వీకరించేది లేదు, రశీదులు ఇచ్చేది అంతకన్నా లేదు అన్న విధంగా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు వేదికైంది. పోస్టు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన పరిధిలో ప్రతీ నిత్యం పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్నాయి. దీనికి గాను నెలవారీ మామూళ్ల బదులు రోజువారీ మామూళ్లకు తెరలేపి దండుకుంటున్నారన్న ఫిర్యాదులు గతంలో కమిషనరేట్ వరకు కూడా వచ్చాయి. లాక్డౌన్ సమయంలో హర్వెస్టర్ల యాజమానుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి రికార్డు సృష్టించిన ఈయన కొత్తగా ఇండ్లు నిర్మించుకున్న వారి నుంచి సైతం ‘పెనాల్టీ’ వసూలు చేసి రికార్డు సృష్టించారు. ⇔ కమిషనరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఆ పోలీసు స్టేషన్‌కు వచ్చే వారిలో ఎవరికైనా న్యాయం జరుగుతుందా అనేది అర్థం కాని పరిస్థితి. బాధితులతో పాటు వారి వ్యతిరేక వర్గాల వారి నుంచి ఆ ఇన్స్పెక్టర్ ముందుస్తుగా డబ్బు తీసుకోవడం, రెండు వర్గాలను కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేయడం ఆయన రోజువారి దినచర్యగా విమర్శలు ఉన్నాయి. ⇔ హన్మకొండ, హైదరాబాద్ ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న ఓ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ విషయంలో వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. ఇప్పటికే భూముల విషయంలో పలుసార్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన భూమి సెటిల్మెంట్ల విషయంలో పెద్ద మొత్తంలో వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈయనపై డీజీపీ వరకు ఫిర్యాదులు వెళ్లాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ⇔ ఓ రైల్వే స్టేషన్ ఆనుకుని ఉన్న పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ స్టయిలే వేరు. ఎన్ని ఆరోపణలు వచ్చిన ఆయన పట్టించుకోడు. ఆయనపై ఉన్నత అధికారులకు ఫిర్యాదులు అంది వాటిపై ఆరా తీస్తే ఉల్టా ఉన్నతాధికారులను బెదిరిస్తుంటాడు. అవసరమైతే ప్రజాప్రతినిధితో ఫోన్ చేయిస్తాడు. డబ్బు వచ్చే పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. స్టేషన్లో ఎవరికైనా టీ ఆఫర్ చేస్తే వారు ఆ అధికారికి డబ్బులు ఇచ్చినట్లు లెక్క. ఇది ఆ స్టేషన్లో పని చేస్తున్న సిబ్బంది బాహాటంగానే చెబుతుండడం గమనార్హం. ⇔ వరంగల్ సబ్ డివిజన్లో ఓ ప్రజాప్రతినిధి సిఫారసుతో పోస్టింగ్ పొందిన ఓ ఇన్స్పెక్టర్ తక్కువ కాలంలో ఆ ప్రజాప్రతిని«ధితో సంబంధాలు చెడిపోయాయి. దీంతో ఉన్నన్ని రోజులో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే చందంగా దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేసిన సంఘటనల్లోనూ ఈయన డబ్బు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఇన్స్పెక్టర్ వ్యవహారంపై పోలీసు స్టేషన్ సిబ్బందే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ⇔ ఇలాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రజలు, బాధితులు కోరుతున్నారు. వసూళ్లకు పాల్పడుతున్నఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వరంగల్ క్రైం: అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని మట్టెవాడ పోలీసు స్టేషన్లో నమోదైన ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో, దొంగిలించిన వారి నుంచి వాహనాలు కొనుగోలు చేసిన వ్యక్తుల వద్ద కానిస్టేబుళ్లు జి.మహేందర్, ఓ.రాజు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీపీ విచారణ చేయించారు. ఈ మేరకు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసిన తొర్రూరు మండలం గట్టికల్లుకు చెందిన వారిని బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు నిర్ధారణ కావడంతో కానిస్టేబుళ్లు ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు బెదిరించిన, అక్రమ వసూళ్లకు పాల్పడిన సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామని సీపీ హెచ్చరించారు. -
పక్కా వ్యూహంతో ముందుకు..
సాక్షి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల సంచారం ఉన్న నేపథ్యంలో ఆదిలోనే నిలువరించేందుకు పోలీసులు పక్కా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. డీజీపీ మహేందర్ రెడ్డి ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో రోజూ డీజీపీ పర్యటన కొనసాగింది. ఎస్పీ క్యాంపులోనే గురువారమంతా గడిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పలు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చిస్తూ.. వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు సూచనలు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో మావోయిస్టులు రాష్ట్ర, డివిజన్, ఏరియాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసువర్గాలు గుర్తించాయి. మారుమూల, గిరిజన ప్రాంతాల్లో సానుభూతిపరులతో బలం పెంచుకునే క్రమంలో వారిని ఆదిలోనే అదుపు చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు డీజీపీ క్షేత్రస్థాయి పర్యటన సాగుతోంది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో పర్యటిస్తూ.. స్థానికంగా ఉన్న పరిస్థితులు తెలుసుకుంటున్నారు. మావోల ప్రభావం లేకుండా చేసేందుకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వ్యవహరించాలో పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభావిత ప్రాంతాల్లో రోజుల తరబడి గడుపుతూ స్థానిక ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు కనిపిస్తోంది. స్థానిక పోలీసులు సరైన దిశలో వెళ్లేలా ప్రత్యేకంగా ఈ సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కేబీఎం కమిటీ దళ సభ్యులను అదుపులోకి తీసుకోవాలన్న కృతనిశ్చయంతోనే ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తోంది. ఇందుకోసం దళ సభ్యులకు ఏ వైపు నుంచీ సాయం అందకుండా పోలీసు ఇన్ఫార్మర్లను మరింతగా వాడుకోనున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండురోజుల పాటు రాష్ట్ర పోలీస్ బాస్ ఆసిఫాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో గడపడం ఇదే తొలిసారి. ఇక మావోయిస్టు అగ్రనేత గణపతి, ఇతర కేంద్ర కమిటీ సభ్యుల లొంగుబాటు వార్తలు పూర్తిగా అ వాస్తవమని కేంద్ర కమిటీ నుంచి గురువారం ఓ ప్రకటన విడుదల కావడం అనుమానాలకు తెరదించినట్లయ్యింది. కాగా, వరంగల్ జోన్ ఐజీ నాగిరెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, సిరికొండ పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. మావోల సంచారంపై ఆరా తీశారు. ఇలా రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారులు వరుసగా సందర్శించడం ఆసక్తిగా మారుతోంది. మావోయిస్టుల సంచారం నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. -
అవినీతి, అక్రమాలకు పాల్పడితే ‘ఖాకీ’కి ఊస్టింగే!
పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి.. ప్రజలతో నిత్యం మమేకం కావాలి.. ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి.. ప్రజలతో స్నేహ సంబంధాలు కొనసాగించి శాంతిభద్రతలను కాపాడాలి. ఇదీ పోలీసు కర్తవ్యం. పోలీసులది ఉద్యోగం కాదు బాధ్యత. అలాంటి వృత్తిలో ఉంటూ అడ్డదారులు తొక్కే ఖాకీలూ కొందరు ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు చేయని అరాచకాలు, అక్రమాలు, అవినీతి వ్యవహారాలు లేవు. వీటన్నింటికీ కొందరు పోలీసులు పూర్తి సహాయ సహకారాలు అందించారు. మామూళ్లు దిగమింగి నోళ్లు మూసుకున్నారు. మరో వైపు కొందరు మహిళలను మోసగించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడారు. ఇలా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లేలా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఖాకీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఐజీ బ్రిజ్‌లాల్ దృష్టి సారించారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ చేయించి.. నేరం రుజువైన ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐ సహా ఏడుగురిని ఉద్యోగాల నుంచి తొలగించాలని డీజీపీ కార్యాలయానికి నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులకు కొమ్ముకాసిన పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సాక్షి, గుంటూరు: విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాలకు పాల్పడటం, ప్రేమ, పెళ్లి పేరుతో మహిళలను మోసం చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడితే ఖాకీ యూనిఫామ్ వదిలేసి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితులు రానున్నాయి. పోలీస్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారి పట్ల రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ సీరియస్‌గా ఉన్నారు. ఆరోపణలపై పక్కా సాక్ష్యాధారాలతో నేరం రుజువైతే ఊస్టింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏడుగురిని ఇంటికి పంపండి.. జిల్లాలో అవినీతి ఆరోపణలు, పెళ్లి, ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసిన, రెండో పెళ్లి చేసుకున్న, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఓ సీఐ, ఇద్దరు ఎస్ఐలు సహా ఏడుగురిని ఉద్యోగం నుంచి తొలగించాలని ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ డీజీపీ ఆఫీస్‌కు సిఫార్సు చేసినట్టు సమాచారం. ఐజీ బ్రిజ్‌లాల్ ఇచ్చిన లిస్టులో పేరున్న సీఐ గతంలో అనేక అక్రమాలు, అరాచకాలకు పాల్పడి మావోయిస్టుల హిట్ లిస్టులో ఉండి, వారి దాడిలో త్రుటిలో తప్పించుకున్నారని పోలీస్ శాఖలో ప్రచారం ఉంది. ఈయనపై గత ప్రభుత్వ హయాంలో తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే టీడీపీ నాయకుల అండదండలు మెండుగా ఉండటంతో ఉన్నతాధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారు. మరో ఇద్దరు ఎస్ఐలు గతంలో పల్నాడు ప్రాంతంలో పని చేసిన ఓ డీఎస్పీ కనుసన్నల్లో క్రికెట్ బెట్టింగ్‌కు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. సదరు ఆరోపణల మేరకు కొనసాగిన శాఖపరమైన విచారణలో ఎస్ఐలు క్రికెట్ బెట్టింగ్ ముఠాకు సహకరించి భారీగా సంపాదించినట్టు సమాచారం. ఐజీ సిఫార్సు చేసిన మిగిలిన నలుగురిలో ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు తెలిసింది. వీరు కూడా క్రికెట్ బెట్టింగ్ ముఠాకు సహకరించడం, అవినీతికి పాల్పడటం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహా ఇతరత్రా నేరాలకు పాల్పడినట్టు రుజువు కావడంతో ఐజీ వీరందరిని ఉద్యోగాల నుంచి తొలగించాలని డీజీ ఆఫీస్‌కు నివేదించినట్టు తెలిసింది. కొనసాగుతున్న విచారణ పల్నాడు ప్రాంతంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు కొందరు పోలీస్ అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీరిపై విచారణ కొనసాగుతోంది. విచారణ ఎదుర్కొంటున్న వారిలో గురజాల టౌన్ సీఐగా పని చేసిన రామారావు, పిడుగురాళ్ల టౌన్ సీఐగా పని చేసిన వీరేంద్రబాబు ఉన్నారు. విచారణలో సదరు పోలీస్ అధికారులు తప్పు చేసినట్టు రుజువైతే వీరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని డీజీపీ ఆఫీస్‌కు ఐజీ నివేదిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
సీవీ ఆనంద్‌కు ఎయిర్‌పోర్టుల రక్షణ
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధి కారి సీవీ ఆనంద్‌ను దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతా విభాగం ఐజీగా సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూ రిటీ ఫోర్స్) నియమించింది. ఇటీవలే డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిన ఆయనకు.. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల భద్రత బాధ్యతను అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. దేశంలో 80కి పైగా విమానాశ్రయాలకు సీఐఎస్ఎఫ్ భద్రత అందిస్తోంది. గుజరాత్, రాజస్తాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని 12 అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు లు, మరో 18 జాతీయ విమానాశ్రయాల భద్రతను ఆనంద్ పర్యవేక్షించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా.. ఇదివరకు ఎయిర్‌పోర్టుల భద్రతను పర్య వేక్షించేందుకు కేవలం అదనపు డీజీపీ, ఒక ఐజీ పోస్టు మాత్రమే సీఐఎస్ఎఫ్లో ఉండేది. నెల క్రితం మరో ఐజీ పోస్టును సృష్టించిన సీఐఎస్ఎఫ్.. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతను ఆనంద్‌కు అప్పగించింది. ఆయన హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు కేంద్రంగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల భద్రతను పర్యవేక్షించనున్నారు. -
సీమ ఐజీ నేడు బాధ్యతలు స్వీకరణ
కర్నూలు: రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు స్థానంలో నియమితులైన మహమ్మద్ ఇక్బాల్ సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. రెండో విడత జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న మహమ్మద్ ఇక్బాల్‌ను గత నెల 29వ తేదీన సీమ ఐజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ నుంచి సోమవారం ఉదయం 11 గంటలకు కర్నూలులోని పోలీసు గెస్ట్‌హౌస్‌కు ఆయన చేరుకుంటారు. ఈ మేరకు జిల్లా పోలీసు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శ్రీధర్‌రావును విజయవాడ హెడ్ క్వాటర్కు నియమించారు. ఆయనకు కూడా వీడ్కోలు పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ స్థానంలో నియమితులైన ఘట్టమనేని శ్రీనివాస్ కూడా రెండు మూడు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించిన శ్రీనివాసులును కర్నూలు రేంజ్ డీఐజీగా నియమించిన సంగతి తెలిసిందే. -
ఐజీ, డీఐజీ బదిలీ
కర్నూలు : రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారం క్రితం ఎస్పీ ఆకే రవికృష్ణను కూడా బదిలీ చేసిన విషయం విదితమే. రెండోవిడతలో భాగంగా గురువారం మరికొంతమంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, కర్నూలు డీఐజీ రమణకుమార్లను బదిలీ చేసింది. వీరికి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారనేది స్పష్టంగా తెలియరాలేదు. శ్రీధర్‌రావు స్థానంలో ఐజీగా ఇక్బాల్‌ను నియమించినట్లు సమాచారం. డీఐజీ రమణకుమార్ జిల్లాలో రెండేళ్ల 11 నెలలు పనిచేశారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించారనేది తెలియాల్సి ఉంది. -
శాంతిభద్రతల పరిరక్షణ.. అందరి బాధ్యత
► సీమ ఐజీ శ్రీధర్‌రావు చింతకొమ్మదిన్నె : శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని రాయలసీమ ఐజీ ఎన్. శ్రీధర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ముందుగా ఇటీవల నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనాన్ని పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కొద్దిపాటి చిన్న పనులను వెంటనే పూర్తి చేసి కడప కర్నూలు రేంజ్ డీఐజీకి సమాచారం అందించాలన్నారు. తర్వాత ప్రస్తుతం అద్దె భవనంలో నడుస్తున్న పోలీస్‌స్టేషన్ భవనం, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, మట్కా, గ్యాబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలను నివారించాలన్నారు. ప్రస్తుతం మండలంలో నాలుగు సీసీ కెమెరాలు ఉన్నాయని, మండల కార్యాలయాల్లో కళాశాలలు, పాఠశాలలు, రద్దీ ప్రదేశాలలో మరిన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుత వేసవి కాలంలో ప్రజలు ఎక్కువగా ఇంటిపైన నిద్రిస్తారని, దొంగతనాలు జరగకుండా లాకర్ బీగాలను వాడాలని సూచించారు. ప్రజలు ఎవరైనా ఊర్లకు వెళ్లేటప్పుడు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందిస్తే.. ఆ ఇంటికి పోలీసుల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ పోలీస్‌స్టేషన్ నుంచి నిఘా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ సత్య ఏసుబాబు, కడప డివిజన్ డీఎస్పీ ఈజీ అశోక్ కుమార్, ఎస్బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, రూరల్ సీఐ వెంకటశివారెడ్డి, ఎస్ఐలు కుళ్ళాయప్ప. చాంద్‌బాషా పాల్గొన్నారు. -
జిల్లా జైలును తనిఖీ చేసిన జైళ్ల శాఖ ఐజీ
కర్నూలు(లీగల్) : కర్నూలు నగర శివారులోని పంచలింగాల గ్రామ పరిధిలోని జిల్లా జైలును మంగళవారం జైళ్ల శాఖ ఐజీ బి.సునిల్‌కుమార్ తనిఖీ చేశారు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారు చేస్తున్న సిమెంటు ఇటుకల తయారీపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఖైదీల వసతులు, ఆహారంపై ఆరా తీశారు. జైలు రికార్డులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా జైళ్ల అధికారి వరుణారెడ్డి, జైలర్లు వీరేంద్రప్రసాద్, నరసింహారెడ్డి, సబ్ జైలర్ సురేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళల జైలును సందర్శించి అక్కడి సౌకర్యాలను ఆరా తీశారు. -
బెటాలియన్‌లో వసతుల కల్పనకు కృషి
బెటాలియన్స్ ఐజీ మీనా కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లో వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని బెటాలియన్స్ ఐజీ ఆర్కే మీనా పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బెటాలియన్‌ను సందర్శించారు. ముందుగా బెటాలియన్‌లోని ఎస్పీవీఎన్ ఇంగ్లిషు మీడియం స్కూలును సందర్శించి కొత్తగా నిర్మించిన స్టేజీ, డైనింగ్ షెడ్, ఎల్కేజీ, నర్సరీ విభాగాలను ప్రారంభించి ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులను బావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అనంతరం బెటాలియన్ కమాండెంట్లు ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన సభకు హాజరై రిటైర్డ్ డీఐజీ జే.ప్రసాద్‌బాబును సన్మానించారు. కార్యక్రమంలో కామాండెంట్లు విజయకుమార్, కోటేశ్వరరావు, సీహెచ్ విజయరావు, అరుణ్‌జైట్లీ, ఎల్ఎస్ పాత్రుడు, సీహెచ్ శ్యామూల్జాన్, జగదీశ్‌కుమార్, సూర్యచంద్, బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ ఎస్కే అల్లాబకాష్ పాల్గొన్నారు. -
ఐజీ ఆకస్మిక తనిఖీ
నంద్యాల: రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను ఆయన పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడం, చోరీల రికవరీ సరిగ్గా లేకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పలు కేసుల్లో ఉన్న వాహనాలు తుప్పు పడుతున్నాయని, వాటిని తరలించాలని ఆదేశించారు. ఆయనతో పాటు డీఐజీ రమణకుమార్, డీఎస్పీ హరినాథరెడ్డి ఉన్నారు. -
పోలీస్ గౌరవాన్ని పెంచండి
– బదిలీ ఎస్ఐలు, ప్రొబేషనరీ ఎస్ఐలతో ఐజీ సమీక్ష కర్నూలు: నిజాయితీగా వ్యవహరించి పోలీసు శాఖ గౌరవాన్ని పెంచాలని రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికష్ణ తదితరులు క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి బదిలీ అయిన ఎస్ఐలు, ప్రొబేషనరీ ఎస్ఐలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఐజీ శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా వ్యవహరించడం ద్వారా ప్రజల మన్ననలు పొంది పోలీసు శాఖ గౌరవాన్ని పెంచాలన్నారు. వత్తి ధర్మాన్ని కాపాడుతూ సమస్యలు ఉంటే పైఅధికారుల దష్టికి తీసుకువచ్చి మానవతా విలువలతో ప్రజలకు న్యాయం చేయాలన్నారు. ప్రతి విషయాన్ని సమస్యగా భావించకుండా పరిష్కారానికి ప్రయత్నించాలన్నారు. సమస్యలపై స్టేషన్‌ను ఆశ్రయించే బాధితులను కుటుంబీకులుగా భావించినప్పుడే వారికి న్యాయం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ మ్యానువల్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. నైపుణ్యాన్ని పెంచుకుని సమాజానికి దోహదపడాలన్నారు. కేటాయించిన పోలీస్ స్టేషన్లో సక్రమంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాబుప్రసాద్, ఆర్ఐ రంగముని, బదిలీ అయిన ఎస్ఐలు, ప్రొబేషనరీ ఎస్ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పోలీసు శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఐజీ
కర్నూలు: కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీసు శిక్షణ కేంద్రాన్ని మంగళవారం రాయలసీమ రీజియన్ ఐజీ శ్రీధర్‌రావు తనిఖీ చేశారు. ఎస్పీ ఆకే రవికృష్ణ, పోలీసు శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ చంద్రశేఖర్‌రెడ్డి, ఓఎస్డీ రవిప్రకాష్, కర్నూలు టౌన్ డీఎస్పీ రమణమూర్తి, ఆర్ఐ రంగముని, తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి, రూరల్ తాలూకా సీఐ నాగరాజు యాదవ్ తదితరులు ఐజీ వెంట ఉన్నారు. కర్నూలు జిల్లా నీటి యాజమాన్య సంస్థ సహకారంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఐజీ పాల్గొన్నారు. శిక్షణ కేంద్రం పరిసరాలన్నింటినీ కలియ తిరిగి పరిశీలించారు. పచ్చదనం పరిరక్షణకు కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్‌రాజు, సిబ్బంది చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. డీటీసీలో జరిగే శిక్షణ కార్యక్రమాలను వైస్ ప్రిన్సిపల్‌ను అడిగి తెలుసుకున్నారు. త్వరలో ప్రారంభం కానున్న కానిస్టేబుల్ ప్రాథమిక శిక్షణకు అవసరమైన మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలిలని ఎస్పీ ఆకే రవికృష్ణకు సూచించారు. -
కృష్ణా పుష్కరాలకు పటిష్ట బందోబస్తు
– 3వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది నియామకం – ఐజీ శ్రీధర్‌రావు వెల్లడి – సంగమేశ్వరంలో భద్రత ఏర్పాట్ల పరిశీలన కర్నూలు : కృష్ణా పుష్కరాల విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు హెచ్చరించారు. మంగళవారం సంగమేశ్వరంలో జరుగుతున్న పుష్కర పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహించాలన్నారు. భక్తుల సంఖ్యను బట్టి ఘాట్ల వద్దకు విడతలవారీగా పంపించాలన్నారు. అనుమానితులపై నిఘా ఉంచి అప్రమత్తం కావాలన్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీశైలం, సంగమేశ్వర పుష్కర ఘాట్లలో 3వేల మంది భద్రతా దళాలను నియమిస్తామన్నారు. అనంతరం సంగమేశ్వరం వద్ద విధులు నిర్వహించే పోలీసులకు విడిదికోసం ఏర్పాటు చేసిన ముసలిమడుగు ఉన్నత పాఠశాలను పరిశీలించారు. కొలనుభారతి క్షేత్రం చేరుకొనిఅమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ, ఆదోని మహిళా డీఎస్పీ వెంకటాద్రి, ఆత్మకూరు, ఆదోని సీఐలు దివాకర్‌రెడ్డి, రామయ్యనాయుడు, గౌస్, పాములపాడు ఎస్ఐ సుధాకర్‌రెడ్డి ఉన్నారు. -
కర్నూలులోనే పోలీసు ఐజీ కార్యాలయం
ఇకపై ఇక్కడి నుంచే కార్యకలాపాలు – డీఐజీ క్యాంప్ ఆఫీస్‌పైన కార్యాలయం – బాలాజీనగర్‌లో ఐజీ క్యాంప్ రెసిడెన్సీ కర్నూలు: పోలీసు శాఖలో సంస్కరణలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు హైదరబాద్ కేంద్రంగా ఐజీల పాలన సాగింది. డీజీపీగా నండూరి సాంబశివరావు ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. పాలన సౌలభ్యం కోసం ఐజీలు హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలని ఆదేశించడంతో అధికారులు కార్యాలయాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలను కలిపి నార్త్ కోస్టల్గా వైజాగ్‌లోనూ.. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు సౌత్ కోస్టల్ జోన్ కింద గుంటూరులోనూ.. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాలను కలిపి సౌత్ జోన్ కింద కర్నూలు కేంద్రంగా కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు కర్నూలు ఐజీ కార్యాలయం డీఐజీ క్యాంప్ కార్యాలయంపైన ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు శివారులోని బాలాజీనగర్‌లో డూప్లెక్స్ ఇంటిలో ఐజీ క్యాంప్ రెసిడెన్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాయలసీమ ఐజీ కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని గత ఐజీ గోపాలకృష్ణ ప్రతిపాదించారు. తిరుపతిని ఐటీ హబ్‌గా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించి ఐజీ కార్యాలయం అక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. అయితే తాజాగా కర్నూలులోనే ఐజీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించడంతో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1989లో రాయలసీమకు ఐజీ కార్యాలయం మంజూరయింది. ఫ్యాక్షన్ జోన్ ఐజీ పోలీస్ ఆఫీస్ పేరుతో బి.క్యాంప్‌లోని పోలీస్ గెస్ట్‌హౌస్‌పై రెండేళ్ల పాటు నిర్వహించారు. గెస్ట్‌హౌస్ పక్కనున్న బీసీ హాస్టల్ స్థానంలో 2001 నుంచి 2003 వరకు రాయలసీమ ఐజీ కార్యాలయాన్ని నిర్వహించారు. అయితే పాలనాపరమైన సౌలభ్యం కోసం 2003 నుంచి ఇప్పటి వరకు హైదరబాద్‌లోని డీజీపీ కార్యాలయం నుంచి ఐజీ పాలన సాగింది. కర్నూలు కేంద్రంగా ఐజీ పాలన కొనసాగించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో కార్యాలయాల ఏర్పాట్లపై పోలీసు అధికారులు దృష్టి సారించారు. -
రాజన్న సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ ఐజీ
వేములవాడ : వేములవాడ రాజన్నను ఆంధ్రప్రదేశ్ ఐజీ ఇ.దామోదర్ దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం మహామండపంలో ఆయనకు స్వామి వారి ప్రసాదం, చిత్రపటం అందించి ఘనంగా సత్కరించారు. -
తిరుపతి కమిషనరేట్‌కు మార్గం సుగమం
- జిల్లాలో పోలీసుల పంపకాలపై కసరత్తు - చిత్తూరుకు 60, తిరుపతికి 40 శాతం - ఇద్దరు ఎస్పీల సమక్షంలో ఐజీ, డీఐజీ చర్చ చిత్తూరు (అర్బన్): తిరుపతిని ప్రత్యేక పోలీసు కమిషనరేట్ చేయడం, స్వయం ప్రతిపత్తి కల్పించడంపై కసర్తు మొదలైంది. తొలి దశగా రెండు జిల్లాల్లోని 139 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. చిత్తూరు, తిరుపతి పోలీసు జిల్లాల్లో పద్ధతి ప్రకారం పోలీసు సిబ్బంది పంపకాలు జరిపేందుకు అధికారులు చేపట్టిన చర్యలు కొలిక్కి వస్తున్నాయి. ఇందులో భాగంగా రాయలసీమ ఐజీ వేణుగోపాలక్రిష్ణ, అనంతపురం ఐజీ బాలక్రిష్ణ చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్‌జెట్టి సమక్షంలో రెండు జిల్లాలకు చెందిన ఏఎస్పీలు, ఏవోల ఆధ్వర్యంలో సిబ్బందిని ఎక్కడ ఎంతమందిని ఉంచాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. చిత్తూరు పోలీసు జిల్లా పరిధి పెద్దది కావడంతో రెండు జిల్లాల్లో ఉన్న సిబ్బందిలో ఇక్కడకు 60 శాతం, తిరుపతికి 40 శాతం కేటాయించనున్నారు. వీరిలో కార్యాలయ గుమాస్తాలు, ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోమ్‌గార్డులు ఉన్నారు. తొలిదశలో చిత్తూరు నుంచి 30 మంది ఏఎస్ఐలు, 16 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, ఇద్దరు ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు తిరుపతికి బదిలీ అయ్యారు. తిరుపతి నుంచి 10 మంది ఎస్ఐలు, 71 మంది హెడ్‌కానిస్టేబుళ్లు చిత్తూరుకు బదిలీ అయ్యారు. పంపకాలు ఓ కొలిక్కి రావడంతో ఇబ్బందులున్న సిబ్బంది ఆయా పోలీసు సంక్షేమ సంఘ నాయకుల ద్వారా ఉన్నతాధికారులకు వినతులు అందజేశారు. ఇప్పటికే తిరుపతిని ప్రత్యేక పోలీసు కమిషనరేట్ చేయాలనే ప్రతిపాదన ఉండటంతో సిబ్బంది పంపకం పక్కాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం జీవో జారీ చేసి తిరుపతి అర్బన్ పోలీసు జిల్లాకు మిగిలిన జిల్లాలాగే స్వయం ప్రతిపత్తిని కల్పించనుంది. ఈ సమావేశంలో చిత్తూరు ఏఎస్పీలు అన్నపూర్ణారెడ్డి, ఓఎస్డీ రత్న, తిరుపతి ఏఎస్పీ త్రిమూర్తులు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామ్‌కుమార్, చిత్తూరు, తిరుపతి పోలీసు సంక్షేమ సంఘ అధ్యక్షులు చలపతి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఖని’లో కమిషనరేట్!
గోదావరిఖని : జిల్లాలో పోలీస్ కమిషనర్ పాలన రానుంది. ఐజీ లేదా డీఐజీ స్థాయి పర్యవేక్షణలో కార్యకలాపాలు సాగనున్నాయి. పారిశ్రామికీకరణతో పెరుగుతున్న జనాభా, ఇతర అవసరాలతో గోదావరిఖని కేంద్రంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఏర్పాటుకు పోలీస్‌శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కొత్తగా ఐదు మహిళా పోలీస్స్టేషన్లతోపాటు మొత్తం ఐదు సర్కిళ్లు, 27 పోలీస్స్టేషన్లు కమిషనరేట్ పరిధిలో ఉండనున్నాయి. రామగుండం, పెద్దపల్లి, మంథని, ధర్మపురి నియోజకవర్గాలను కలుపుతూ గోదావరిఖని కేంద్రంగా పోలీస్‌కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నారు. దీని పరిధిలో 27 పోలీస్స్టేషన్లు ఉండనుండగా, ఇందులో ఇన్స్పెక్టర్ ఎస్‌హెచ్‌వోగా ఉండే పోలీస్స్టేషన్లు 16, ఎస్సై ఎస్‌హెచ్‌వోగా ఉండే స్టేషన్లు 11 ఉండనున్నాయి. దీంతోపాటు కొత్తగా ఐదు మహిళా పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రామగుండం నియోజకవర్గం పారిశ్రామికంగా ప్రగతి సాధించింది. సింగరేణి బొగ్గు గనులతోపాటు రామగుండం ఎన్టీపీసీ, జెన్కో ఆధ్వర్యంలో నడిచే బీ-పవర్‌హౌస్, కేశోరామ్ సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో రామగుండం ఎరువుల కర్మాగారం కూడా పునరుద్ధరణకు నోచుకోనుంది. రామగుండం ఎన్టీపీసీలో మరో రెండు కొత్త యూనిట్లు రాబోతున్నాయి. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం కోసం ఎన్టీపీసీ నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నెలకొల్పనుంది. తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో కూడా సూపర్‌క్రిటికల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ తరుణంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉద్యోగులు, కార్మికులతోపాటు వారిపై ఆధారపడే వారి సంఖ్య పెరుగుతుంది. ఇదే నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది. నాలుగు లైన్లతో రాజీవ్హ్రదారి విస్తరణ కూడా చేపట్టగా, నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పక్కనే ఉన్న మంథని నియోజకవర్గంలో కూడా సింగరేణి గనులతోపాటు త్వరలో తాడిచర్ల వద్ద ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికి తోడు మంథని నియోజకవర్గంలోని తూర్పు డివిజన్లో గోదావరి నది సరిహద్దున మావోయిస్టుల కదలికలున్నాయి. సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు, చోరీలు, మహిళా సమస్యలు, వాహనాలు పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏఎస్పీ సారథ్యంలో సాగుతున్న గోదావరిఖని సబ్ డివిజన్‌ను కమిషనర్ పాలనలోకి తీసుకువచ్చే ఆలోచనను ప్రభుత్వం చేసింది. కనీసం 10 లక్షల జనాభా పరిధి ఉన్న ప్రాంతాలనే కమిషనరేట్‌గా చేసే నిబంధనలు ఉండగా గోదావరిఖని సబ్‌డివిజన్ పరిధిలో జనాభా తక్కువ కావడంతో పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గాలను కూడా చేర్చారు. దీంతో కార్యాలయం ఏర్పాటు సులువు కానుంది. -
పూర్వస్థితికి ఇంటెలిజెన్స్ చీఫ్ హోదా!
రెండు రాష్ట్రాల్లోనూ ఐజీలే నేతృత్వం వహించే అవకాశం ఇబ్బందులు వస్తాయంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల నిఘా విభాగాధిపతుల హోదాలు పూర్వస్థితికి చేరుకోనున్నాయి. దీంతో కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణకూ ఐజీ స్థాయి అధికారులే ఇంటెలిజెన్స్ చీఫ్లుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఏడేళ్ల క్రితం వరకు ఈ హోదా అధికారులే నిఘా విభాగాన్ని పర్యవేక్షించినా.. తర్వాత ఆ పోస్టును అదనపు డీజీ స్థాయికి పెంచారు. పోలీసు విభాగంలో డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) తర్వాత అంతటి శక్తివంతమైనదిగా రాష్ట్ర నిఘా విభాగం చీఫ్ పోస్టును పరిగణిస్తారు. రాష్ట్రంలో ఐపీఎస్ సహా అనేక కీలక అధికారుల పోస్టింగ్స్, దేశంలోని ఇతర రాష్ట్రాల, కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవడంతోపాటు రాజకీయ, ఇతర పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదించడం, పలు కీలక సమయాలు, సందర్భాల్లో సలహాలు ఇవ్వడం నిఘా విభాగాధిపతి కీలక బాధ్యతలు. ముఖ్యమంత్రిని ప్రతిరోజూ డీజీపీ కలవాల్సిన అవసరం ఉండదు. అయితే నిఘా విభాగం చీఫ్ మాత్రం నిత్యం సీఎంను కలిసే తొలి అధికారిగా ఉంటారు. ఇంతటి కీలకమైన పోస్టుల్లో సాధారణంగానే ముఖ్యమంత్రులు తమకు అనుకూలమైనవారిని నియమించుకుంటారు. మాజీ డీజీపీ కె.అరవిందరావుకు ముందు వరకు ఈ పోస్టు ఐజీ స్థాయికే పరిమితమైంది. ఆయన హయాంలోనే పరిపాలనాపరమైన కారణాల నేపథ్యంలో ప్రభుత్వం అదనపు డీజీ స్థాయికి పెంచింది. అరవిందరావు తర్వాత మహేందర్‌రెడ్డి సైతం అదనపు డీజీ హోదాలోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండింటికీ రెండు ఇంటెలిజెన్స్ విభాగాలు ఏర్పడనున్నాయి. విశాఖపట్నం పోలీసు కమిషనర్‌గా పనిచేసి, ఇంటెలిజెన్స్‌కు బదిలీపై వచ్చిన శివధర్‌రెడ్డికి తెలంగాణ నిఘా విభాగాధిపతి పోస్టింగ్ దాదాపు ఖరారైనట్లే. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ప్రస్తుత ఇంటెలిజెన్స్ విభాగంలో ఐజీగా పనిచేస్తున్న ఓ అధికారిపై చంద్రబాబు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. సాధారణ నిఘాతోపాటు రాజకీయ రంగంపైనా ఆయనకు మంచి పట్టు ఉండటం, సుదీర్ఘకాలంగా ఇంటెలిజెన్స్‌లో పనిచేయడంతో ఆయన్నే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తారనే వాదన వినిపిస్తోంది. ఇదే ఖరారైతే రెండు రాష్ట్రాలకూ నిఘా విభాగాధిపతులుగా ఐజీ ర్యాంకు అధికారులే కొనసాగనున్నారు. అయితే దీనివల్ల కొన్ని పరిపాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. డీజీపీ తర్వాత అంతటి కీలకమైన పోస్టులో ఉండే వ్యక్తి అవసరమైన సందర్భాల్లో మిగిలినవారికి ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుంది. ఐజీ స్థాయి అధికారులు ఇంటెలిజెన్స్ చీఫ్లుగా కొనసాగుతున్నప్పుడు అందరికీ ఆదేశాలు ఇవ్వడం సాధ్యపడదు. తెలంగాణ విషయానికి వస్తే రాజధానిగా ఉండే హైదరాబాద్ కమిషనర్‌గా అదనపు డీజీ స్థాయి అధికారి, దీనికి పొరుగున ఉన్న సైబరాబాద్‌కు సీనియర్ ఐజీ స్థాయి అధికారి ఉంటారు. వీరికి ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో ఉన్న ఐజీ కేవలం సూచనలు ఇవ్వడం తప్ప ఆదేశాలు జారీ చేయలేరు. ఇప్పటికే విశాఖపట్నం కమిషనర్‌గా సీనియర్ ఐజీ స్థాయి అధికారి ఉంటున్నారు. కొత్త రాజధానిని ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతాన్ని కమిషనరేట్‌గా చేస్తే కచ్చితంగా అదనపు డీజీ స్థాయివారినే కమిషనర్‌గా నియమించాల్సి ఉంటుంది. దీంతో అక్కడా ఇలాంటి ఇబ్బందులే వస్తాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.