సాక్షి, వరంగల్ : వరంగల్ రేంజ్ ఐజీ, పోలీసు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఐజీ పి.ప్రమోద్‌కుమార్ కమిషనరేట్‌పై పట్టు బిగిస్తున్నారు. కమిషనర్‌గా ఇన్‌చార్జ్ బాధ్యతలు తీసుకున్న ఆయన పరిపాలనాపరంగా తనదైన ముద్ర వేస్తున్నారు. సిబ్బంది, అధికారులు ఎవరైనా సరే తప్పు చేస్తే శాఖాపరమైన విచారణ చేపట్టడం, ఆ తర్వాత చర్యలు తీసుకుంటుండడంతో పలువురు అధికారుల్లో టెన్షన్ నెలకొంది. కమిషనరేట్ పరిధిలో భూముల ధరలు ఆకాశాన్ని అంటడం, ప్రతీ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రతిరోజు పదుల సంఖ్యలో వస్తున్న సివిల్ కేసులకే స్టేషన్ హౌస్ అధికారులు కొందరు ప్రా«ధాన్య త ఇవ్వడం, ఆ తర్వాత కేసులు వివాదాస్పదమైన అవి అధికారుల తలకు చుట్టుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. దీంతో సీపీ ప్రమోద్‌కుమార్ హంగు, ఆర్భాటాలు లే కుండా పోలీసుశాఖను గాడిన పెట్టే పనిలో పడ్డారు. దందా లు, వసూళ్లకు పాల్పడే వారిపై సస్పెన్షన్ వేటు వేస్తుండడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై అంతర్గత విచారణకు ఆదేశిస్తున్నారు. బదిలీలు, మందలింపులు, అంతర్గత చర్యలు ఇటీవల ఊపందుకోగా, బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు
వస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు.
కంచె చేను మేసిన చందంగా...
అక్రమాలు, సెటిల్‌మెంట్ దందాలు సాగిస్తున్న కొందరు పోలీసు అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతుండటం కలకలం రేపుతోంది. కొందరు భూవివాదాలకే ప్రాధాన్యత ఇస్తూ సెటిల్‌మెంట్లు చేస్తుండటం ఇటీవల వివాదాస్పదమైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో భూముల పంచాయితీలు ఎక్కువగా జరిగే పోలీసుస్టేషన్లపై దృష్టి సారించిన ఇంటలిజెన్స్ ఉన్నతాధికారులు అక్కడ జరిగే అంశాలపై ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కమిషనరేట్ పరిధిలో ఏడుగురు ఇన్‌స్పెక్టర్లపై విచారణ ప్రారంభమైనట్లు సమాచారం. అయితే ఈ ఇన్‌స్పెక్టర్లు ఎవరనేది శాఖలో అంతర్గతంగా ప్రచారం జరుగుతుండగా, కొందరు సెలవులో వెళ్లినట్లు సమాచారం.
ఫిర్యాదులు, వివాదాల్లో కొన్ని..
⇔ కమిషనరేట్ పరిధిలోని ఓ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ(ఇన్‌స్పెక్టర్) పట్టుబడిన గుట్కాలను అమ్ముకోవడం వివాదస్పదమైంది. ఆ ఇన్‌స్పెక్టర్‌పై ఇప్పటికే పదుల సంఖ్యలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో పాటు ఆ పోలీసుస్టేషన్ పరిధిలో ఇటీవల భూముల విషయంలో జరిగిన సెటిల్‌మెంట్లపై కూడా విచారణ సాగుతోంది.
⇔ ఓ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదులు స్వీకరించేది లేదు, రశీదులు ఇచ్చేది అంతకన్నా లేదు అన్న విధంగా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు వేదికైంది. పోస్టు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన పరిధిలో ప్రతీ నిత్యం పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్నాయి. దీనికి గాను నెలవారీ మామూళ్ల బదులు రోజువారీ మామూళ్లకు తెరలేపి దండుకుంటున్నారన్న ఫిర్యాదులు గతంలో కమిషనరేట్ వరకు కూడా వచ్చాయి. లాక్‌డౌన్ సమయంలో హర్వెస్టర్ల యాజమానుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి రికార్డు సృష్టించిన ఈయన కొత్తగా ఇండ్లు నిర్మించుకున్న వారి నుంచి సైతం ‘పెనాల్టీ’ వసూలు చేసి రికార్డు సృష్టించారు.
⇔ కమిషనరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఆ పోలీసు స్టేషన్‌కు వచ్చే వారిలో ఎవరికైనా న్యాయం జరుగుతుందా అనేది అర్థం కాని పరిస్థితి. బాధితులతో పాటు వారి వ్యతిరేక వర్గాల వారి నుంచి ఆ ఇన్‌స్పెక్టర్ ముందుస్తుగా డబ్బు తీసుకోవడం, రెండు వర్గాలను కూర్చోబెట్టి సెటిల్‌మెంట్ చేయడం ఆయన రోజువారి దినచర్యగా విమర్శలు ఉన్నాయి.
⇔ హన్మకొండ, హైదరాబాద్ ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న ఓ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విషయంలో వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. ఇప్పటికే భూముల విషయంలో పలుసార్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన భూమి సెటిల్‌మెంట్ల విషయంలో పెద్ద మొత్తంలో వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈయనపై డీజీపీ వరకు ఫిర్యాదులు వెళ్లాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు
⇔ ఓ రైల్వే స్టేషన్ ఆనుకుని ఉన్న పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ స్టయిలే వేరు. ఎన్ని ఆరోపణలు వచ్చిన ఆయన పట్టించుకోడు. ఆయనపై ఉన్నత అధికారులకు ఫిర్యాదులు అంది వాటిపై ఆరా తీస్తే ఉల్టా ఉన్నతాధికారులను బెదిరిస్తుంటాడు. అవసరమైతే ప్రజాప్రతినిధితో ఫోన్ చేయిస్తాడు. డబ్బు వచ్చే పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. స్టేషన్‌లో ఎవరికైనా టీ ఆఫర్ చేస్తే వారు ఆ అధికారికి డబ్బులు ఇచ్చినట్లు లెక్క. ఇది ఆ స్టేషన్‌లో పని చేస్తున్న సిబ్బంది బాహాటంగానే చెబుతుండడం గమనార్హం.
⇔ వరంగల్ సబ్ డివిజన్‌లో ఓ ప్రజాప్రతినిధి సిఫారసుతో పోస్టింగ్ పొందిన ఓ ఇన్‌స్పెక్టర్ తక్కువ కాలంలో ఆ ప్రజాప్రతిని«ధితో సంబంధాలు చెడిపోయాయి. దీంతో ఉన్నన్ని రోజులో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే చందంగా దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేసిన సంఘటనల్లోనూ ఈయన డబ్బు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఇన్‌స్పెక్టర్ వ్యవహారంపై పోలీసు స్టేషన్ సిబ్బందే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
⇔ ఇలాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రజలు, బాధితులు కోరుతున్నారు.
వసూళ్లకు పాల్పడుతున్నఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు
వరంగల్ క్రైం: అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని మట్టెవాడ పోలీసు స్టేషన్‌లో నమోదైన ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో, దొంగిలించిన వారి నుంచి వాహనాలు కొనుగోలు చేసిన వ్యక్తుల వద్ద కానిస్టేబుళ్లు జి.మహేందర్, ఓ.రాజు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీపీ విచారణ చేయించారు. ఈ మేరకు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసిన తొర్రూరు మండలం గట్టికల్లుకు చెందిన వారిని బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు నిర్ధారణ కావడంతో కానిస్టేబుళ్లు ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు బెదిరించిన, అక్రమ వసూళ్లకు పాల్పడిన సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామని సీపీ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment