సాక్షి, హైదరాబాద్ : ఖాకీలను కరోనా కలవరపెడుతోంది. కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్‌గా పోరాడుతున్న పోలీసుశాఖను కోవిడ్–19 దొంగ దెబ్బతీస్తోంది. మార్చిలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటిదాకా వైరస్ నియంత్రణలో ముందున్న పోలీసుశాఖలో ఏకంగా పదిశాతం మందికి వైరస్ సోకింది. ఈనెల 25వ తేదీ వరకు అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. పోలీస్ శాఖలో మొత్తం 5,684 మందికి కరోనా సోకింది. వీరిలో 2,284 మంది డిశ్చార్జి కాగా 3,357 మంది యాక్టివ్‌గా ఉన్నారు.
ఇప్పటిదాకా 43 మంది పోలీసు అధికారులను కరోనా బలి తీసుకుంది. తాజాగా జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తిని కూడా కలుపుకుంటే మొత్తం 44 మంది పోలీసులు కరోనాపై పోరులో అమరులయ్యారు. ఇందులో కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ ర్యాంకు అధికారి వరకు ఉన్నారు. మొత్తం పోలీసుశాఖలోని అన్ని విభాగాలలో దాదాపు 54 వేలమంది పోలీసులు ఉండగా.. 5,684 మందికి అంటే 10 శాతం మందికి కరోనా సోకింది. అంటే ప్రతి పది మందిలో ఒకరు ఈ మహమ్మారి బారినపడ్డారు. రికవరీ రేటు కూడా అదేస్థాయిలో ఉండటం కాస్త ఉరటనిస్తోంది.
హైదరాబాద్, వరంగల్ టాప్!
కరోనా కేసుల్లో హైదరాబాద్ కమిషనరేట్ టాప్‌గా నిలిచింది. 1,967 మంది వైరస్ బారిన పడగా.. 891 మంది చికిత్స పొందుతున్నారు. 1,053 మంది డిశ్చార్జి కాగా 23 మంది మరణించారు. అదే సమయంలో హైదరాబాద్ తరువాత వరంగల్‌లో అత్యధికంగా 526 కేసుల్లో.. 361 మంది చికిత్స పొందుతున్నారు. 163 మంది డిశ్చార్జి కాగా, ఇద్దరు మరణించారు.
5,684 మందిలో 1,593 మంది డ్యూటీకి రిపోర్టు చేశారు. కాగా, సీనియర్లు, రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వైరస్ ప్రాణాంతకంగా మారింది. చనిపోయినవారిలో అధికశాతం ఇలాంటి సమస్యలు ఉన్నవారే కావడం గమనార్హం. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌గా తేలిన పోలీసులకు 17 రోజుల సెలవులు ఇచ్చి డిపార్ట్‌మెంట్ రూ.5,000 ఆర్థిక సాయం అందజేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment