పోలీసు శాఖలో ఒకేసారి భారీగా బదిలీలు జరిగాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దసంఖ్యలో జరిగిన బదిలీలు ఇవే కావడంతో శాఖలో కుదుపు చోటు చేసుకున్నట్లయింది. ఈ మేరకు శుక్రవారం బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 50 అడిషనల్ ఎస్పీల బదిలీలు జరగ్గా.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏడుగురి బదిలీ, వారి స్థానంలో నియామకాలు జరిగాయి. ఇక ఏసీపీ/డీఎస్‌పీలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలోని 20 మంది ఉన్నారు. ఈ బదిలీలు, నియామకాల్లో కొత్త, పాత అధికారులకు అవకాశం దక్కింది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు... బదిలీలు, నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రస్తుత జాబితా ద్వారా తెలుస్తోంది.
సాక్షి, వరంగల్ : పోలీసుశాఖలో భారీగా బదిలీలు జరిగాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దమొత్తంలో పోలీసు డీసీపీ. అడిషనల్ ఎస్పీ, ఏసీపీ, డీఎస్‌పీల బదిలీలు, నియామకాల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) మహేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 అడిషనల్ ఎస్పీల బదిలీలు జరగ్గా.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏడుగురి బదిలీ, వారి స్థానంలో నియామకాలు జరిగాయి. శాంతిభద్రతలు, ఇంటలిజెన్స్, ఎస్‌ఐబీ తదితర విభాగాల్లో పనిచేస్తున్న 68 మంది ఏసీపీ/డీఎస్‌పీలకు స్థాన చలనం కలగగా.. ఈ జాబితాలో ఉమ్మడి జిల్లాలోని 20 మంది ఉన్నారు. ఏసీపీలుగా పని చేస్తూ అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి పొందిన గ్రూపు–1 అధికారులకు కూడా పోస్టింగ్ ఇచ్చారు. ఎన్నికల కోడ్‌లో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి బదిలీ వచ్చి వరంగల్ ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న పలువురు ఏసీపీలు, పోలీసు సబ్ డివిజనల్ అధికారు(ఎస్‌డీపీఓ)లను బదిలీ చేశారు. వీరి స్థానంలో ఇదివరకే డీఎస్‌పీలుగా పని చేస్తున్న వారితో పాటు ఇటీవలే సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నుంచి డీఎస్‌పీలుగా పదోన్నతి పొందిన పలువురిని కూడా ఏసీపీలు, డీఎస్‌పీలుగా నియమించారు.
అవకాశం దక్కించుక్ను కొత్త, పాత అధికారులు
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్ద మొత్తంలో పోలీసు అధికారుల బదిలీలు జరగడం శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఏసీపీ నుంచి ఏఎస్పీలుగా పదోన్నతి పొందిన పలువురికి ఇతర జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏసీపీ గుమ్మి చక్రవర్తిగా అడిషనల్ ఎస్పీగా పదోన్నతి లభించగా, హైదరాబాద్ సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీగా నియమించారు. సీపీ అటాచ్డ్‌గా ఉన్న వి.శ్రీనివాసులును జయశంకర్‌భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా, అక్కడ ఉన్న బి.రాజమహేంద్ర నాయక్‌ను ఇంటలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా నియమించారు. అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందిన వి.సునీత కరీంనగర్ పీటీసీ ప్రిన్సిపాల్‌గా, జగిత్యాల ఎస్పీ అటాచ్డ్‌గా ఉన్న నల్ల మల్లారెడ్డిని వరంగల్ అడిషనల్ డీసీపీ(లా అండ్ ఆర్డర్)గా, కరీంనగర్ సీపీ అటాచ్డ్‌గా ఉన్న పుల్లా శోభన్‌కుమార్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ(ఆపరేషన్స్)గా నియమించారు.
సిద్దిపేట అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా ఉన్న సి.ప్రభాకర్‌ను మహబూబాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ(క్రైమ్స్ అండ్ ఆపరేషన్స్)గా నియమించినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన అడిషనల్ ఎస్పీ, ఏసీపీ/డీసీపీల బదిలీలు, నియామకాల్లో కొత్త, పాత అధికారులకు అవకాశం దక్కింది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలపై దృష్టి సారించిన పోలీసు ఉన్నతాధికారులు... బదిలీలు, నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈ జాబితా ద్వారా తెలుస్తోంది.
పోస్టింగ్‌ల కోసం పోటాపోటీ
వరంగల్ పోలీసు కమిషనరేట్, ఉమ్మడి జిల్లా పరిధిలోని కీలకమైన ఏసీపీ పోస్టుల కోసం పలువురు పోటాపోటీగా ప్రయత్నాలు చేశారు. ఎన్నికల కోడ్‌లో వచ్చిన కొందరు అధికారులు తిరిగి వారి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు బదిలీ ఉత్తర్వుల కోసం ఎదురు చూడగా.. ఆ స్థానాల కోసం ఇతర జిల్లాల్లో పని చేస్తున్న పలువురు ప్రయత్నించారు. మరికొందరు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి పొందిన ఏసీపీ స్థానాలతో పాటు కాజీపేట, హన్మకొండ, వరంగల్, స్టేషన్‌ఘన్‌పూర్, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు తదితర పోస్టింగ్ కోసం ఏసీపీపీ/డీఎస్‌పీలుగా పని చేస్తున్న కొందరితో పాటు ఇటీవలే డీఎస్‌పీలుగా పదోన్నతి పొందిన వారు కూడా పోటీ పడ్డారు. హన్మకొండ కోసం ఇక్కడే ఇన్‌స్పెక్టర్లుగా పని చేసి ఒకరి తర్వాత ఒకరు పదోన్నతి పొందిన ఇద్దరు అ«ధికారులు ప్రయత్నాలు చేశారు. గతంలో ధర్మసాగర్, ఆత్మకూరులో సీఐగా పని చేసి.. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో పని చేస్తున్న ఏసీపీ కూడా రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
అయితే ఇందులో చాలా మంది ప్రయత్నాలు ఫలించగా... మరికొందరికి నిరాశ కలిగింది. చాలామందికి కోరుకున్న పోస్టింగ్ రాకున్నా.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పోస్టింగ్ లభించింది. శుక్రవారం జరిగిన బదిలీల్లో కాజీపేట ఏసీపీగా ఉన్న కె.నర్సింగరావు హైదరాబాద్ చీఫ్ ఆఫీసులో రిపోర్టు చేయమని సూచించగా... ఏసీబీ డీఎస్‌పీగా బదిలీ అయిన వర్దన్నపేట ఏసీపీ మధుసూదన్ స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ఇదిలా ఉండగా త్వరలోనే ఇద్దరు, ముగ్గురు ఎసీపీ/డీఎస్‌పీల బదిలీలు ఉంటాయన్న పోలీసుశాఖలో చర్చజరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment