సాక్షి, హైదరాబాద్: ఇటీవల పోలీస్‌శాఖలో భారీఎత్తున జరిగిన బదిలీలపై ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టి పెట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ లాంగ్ స్టాండింగ్‌గా వివిధ శాఖల్లో ఉన్న అధికారుల బది లీకి ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే పోలీస్‌శాఖ విషయానికి వచ్చేసరికి కొందరు రాజకీయనేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారనే విషయం ఈసీ దృష్టికొచ్చింది.
ఇలా కొత్త స్థానాల్లోకి వచ్చిన వారితో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించడం సాధ్యం కాదనే భావనలో ఉంది. ఈ వ్యవహారంపై మాజీ ఐపీఎస్‌లతో పాటు నిఘావర్గాల ద్వారా సమాచారం సేకరిస్తోంది. ఎలక్షన్ షెడ్యూల్ తర్వాత కోడ్ అమలులోకి వస్తుంది. ఆపై ప్రస్తుతం జరిగిన బదిలీల్లో అనేక స్థానాలు ప్రక్షాళన చేయాలని ఈసీ భావిస్తున్నట్టు సమాచారం.
ఈసారి గతానికి భిన్నంగా ఎందుకంటే...
పోలీసు విభాగంలో బదిలీలు సర్వసాధారణం. నిర్ణీత కాలపరిమితితో బదిలీలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బదిలీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి గతానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ఒకే పోస్టులో లాంగ్ స్టాండింగ్‌లో ఉన్న అధికారులతోపాటు, భారీ సంఖ్యలో పదోన్నతుల నేపథ్యంలో నాన్‌కేడర్ ఎస్పీ నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు భారీ సంఖ్యలో అధికారులకు స్థానచలనం తప్పలేదు.
సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈసారి స్టేషన్ హౌస్‌ఆఫీసర్లుగా ఉండే ఎస్‌ఐ పోస్టుల నుంచి నాన్‌కేడర్ ఎస్పీల వరకు అన్నింటిలోనూ రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువైంది. ఓ అధికారి సమర్థత ఆధారంగా కాకుండా ఆయనకు ఎక్కడ పోస్టింగ్ కావాలో అక్కడి రాజకీయ నాయకులు ఇచ్చే సిఫార్సుల ఆధారంగా పోస్టింగ్ లభించింది. ఫోకల్ పోస్టులుగా పిలిచే శాంతిభద్రతల విభాగంతోపాటు మరికొన్ని కీలక వింగ్స్‌లో ఇదే పరిస్థితి నెలకొంది.
కొన్ని పోస్టుల్లో బదిలీల బంతాట
తమ సామాజికవర్గం కాదనో, విధేయులుగా ఉండరనో, ముక్కుసూటి అధికారులని భావించిన వారి బదిలీల విషయంలో బంతాట తప్పలేదు. పోస్టింగ్ వచి్చనవారు, ఆ పోస్టులో చేరకుండా, చేరినా ఆ సీట్లలో కూర్చోకుండా, కూర్చున్నా ఒక్కరోజు కూడా విధులు నిర్వర్తించకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. పెద్దస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్ ఇప్పిస్తూ కొత్తగా వచి్చన అధికారులూ బదిలీ అయ్యేలా చేసి తమ పంతం నెగ్గించుకున్నారు.
ప్రత్యేక బృందాలతో వివరాల సేకరణ
రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే గత నెలలో హైదరాబాద్‌కు వచి్చన ఎన్నికల సంఘం అధికారులు పోలీసు సహా వివిధ విభాగాలతో భేటీ అయ్యారు. పోలీస్‌శాఖలో రాజకీయ నేతల సమ్మతి, సిఫార్సు ఆధారంగా పోస్టుల్లోకి వచి్చన వారి ప్రభావం ఎన్నికల ప్రక్రియపై ఉంటుందని ఈసీ గుర్తించింది. దీనిపై వివరాలు సేకరించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనున్నట్టు తెలిసింది. వీటిలో మాజీ ఐపీఎస్ అధికారులతో పాటు నిఘా వర్గాలకు చెందిన వారు ఉంటారని సమాచారం.
రాష్ట్రంలో వివాదాస్పదమైన బదిలీల్లో కొన్ని...
– మహబూబాబాద్ జిల్లాలోని ఓ డివిజన్‌లో ముగ్గురు డీఎస్పీలు నాలుగుసార్లు బదిలీ అయ్యారు. ఇవి కేవలం పక్షం రోజుల వ్యవధిలో చోటు చేసుకున్నాయి.
– నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ డీఎస్పీ పోస్టింగ్ వివాదాస్పదమైంది. అక్కడకు వచ్చిన అధికారిని కొన్ని రోజుల్లో మార్చేశారు. ఆయన స్థానంలో అక్కడే ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి, ఇటీవలే పదోన్నతి పొంది, రేంజ్‌కు వెళ్లిన అధికారిని తీసుకొచ్చారు.
– నిజామాబాద్ జిల్లాలో ఓ అధికారి ఏడాది క్రితమే డీఎస్పీగా ఓ డివిజన్‌లో చేరారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్ మధ్య విభేదాలతో ఈయన బదిలీ అయ్యారు. దీంతో ఎమ్మెల్యే పట్టుపట్టి మరీ తనకు అనుకూలమైన పాత అధికారినే తెచ్చుకున్నారు.
– హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఎస్‌ఐ నుంచి ఏసీపీ వరకు అనేక పోస్టింగులు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించిన ఇన్‌స్పెక్టర్ రాజకీయ ఒత్తిళ్లతో విధులు నిర్వర్తించలేకపోయారు. చివరకు ఈయన బదిలీ కాగా, నేతలను అనుకూలమైన వ్యక్తికే పోస్టింగ్ వచ్చింది.
– వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఓ ఠాణా ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన అధికారి తన పలుకుబడితే అదే సబ్‌డివిజన్‌లోని మరో పోలీస్‌స్టేషన్‌కు మారారు. స్థానిక నేతల అండదండలతోనే ఇది సాధ్యమైందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment