ఖలీల్‌వాడి: నిజామాబాద్ జిల్లాలో పోలీసుల బదిలీలకు రాజకీయ రంగు పట్టుకుంది. జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. నియోజకవర్గం ప్రజాప్రతినిధి అనుగ్రహం ఉన్నా, బదిలీ ఎప్పుడు జరుగుతుందోనని ఎస్సైలు, సీఐలు ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరిలో నిజామాబాద్ ఏసీపీగా పని చేసిన వెంకటేశ్వర్ రెండేళ్లు కాకుండానే బదిలీ పై వెళ్లడంతో అప్పుడు పోలీస్‌వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫా ర్సు లేఖలతో వచ్చినా పూర్తికాలం పని చేస్తామా లేదా అనే సందేహాలు ఉన్నాయి.
గత కొంతకాలంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలు, సీఐలు, ఏసీపీల బదిలీలు పరంపర కొనసాగుతునే ఉన్నాయి. పోలీస్‌శాఖలో రాజకీయరంగు పులుమడంతో జిల్లాలో పోలీసులకు గుర్తింపు లేకుండాపోతుంది. జిల్లా పోలీస్‌శాఖలో ఎస్సైలు, సీఐలను కొందరు ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన ప్రాంతాలకు బదిలీ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కమిషనరేట్ పరిధిలో ఎన్నికల బదిలీలు ఉండగా జిల్లాకు కొన్ని రోజుల క్రితం వచ్చిన సీఐలు బదిలీలు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రజాప్రతినిధిని కలిస్తే చాలు..
జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడంతో బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజాప్రతినిధులు జరిగే కార్యక్రమాలకు పోలీసులు భద్రత కల్పించాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు తమ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులకు కాకుండా వేరే నియోజకవర్గ ప్రతినిధిని కలిస్తే చాలు ఆ పోలీస్ అధికారి పోస్టు ఉంటుందా? ఊడుతుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఇలాంటి ఘటన నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారికి చోటుచేసుకుంది. సదరు అధికారికి పోస్టింగ్ ఉత్తర్వులు వచ్చే వరకు తెలియకపోవడం శోచనీయం. ఈ పోలీస్ అధికారి పరిధిలో మూడు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉంటారు. ఓ కార్యక్రమంలో సదరు ప్రజాప్రతినిధి వచ్చిన సమయంలో భద్రత కల్పించడంతో వారం తర్వాత బదిలీ వెలువడటం కొసమెరుపు. ఈక్రమంలో ఫిబ్రవరి నుంచి ఏసీపీతోపాటు సీఐ పలువురు బదిలీ అయ్యారు.
ఎన్నికల కోసమే..
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా లో పోలీసుశాఖలో బదిలీలు జరుగుతాయనే చర్చ జరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉన్నవారి కోసం పోస్టింగ్ తెచ్చుకునేందుకు ప్రజాప్రతినిధులు పావులు కదుపుతున్నారు. ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడం, తమకు సహకరించడం లేదనే సాకుతో బదిలీలు చేయడం జిల్లాలో కొనసాగుతునే ఉంది. కానీ పోలీస్‌శాఖ బదిలీల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకోవడంతో పోలీసులు పనిచేయడంలో ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటికే జిల్లా పోలీస్‌కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. ఈక్రమంలో వచ్చే నెలలో పోలీస్‌శాఖలో బదిలీలు జరుగుతాయనే చర్చ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment