వరంగల్‌ పోలీసులపై డీజీపీ ప్రశంసలు | DGP Mahender Reddy Appreciates Warangal Cyber Crime Police | Sakshi
Sakshi News home page

సత్తా చాటుతున్న వరంగల్‌ సైబర్‌ క్రైం పోలీసులు

Published Tue, Mar 2 2021 9:26 AM | Last Updated on Tue, Mar 2 2021 12:24 PM

DGP Mahender Reddy Appreciates Warangal Cyber Crime Police - Sakshi

వరంగల్‌ క్రైం : ఇటీవల కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేసే నేరాల సంఖ్య పెరుగుతోంది. సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీని అపరిచిత వ్యక్తులకు చెబితే క్షణాల్లో బ్యాంకులో ఉన్న సొమ్ము స్వాహా అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిందితులు దేశ, విదేశాల్లో ఉండి తమ నేరాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. యువతులు, మహిళలను వేధించడం, సామాజిక మాధ్యమాల ద్వారా ఇబ్బంది పెట్టే ఆకతాయిల ఆట కట్టించడం తదితర కేసుల్లో సాంకేతిక అంశాలను సేకరించడంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన సైబర్‌ క్రైం విభాగం పోలీసులు చాటుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర పోలీస్‌ బాస్‌ మహేందర్‌రెడ్డి వరంగల్‌ సిబ్బందిపై శభాష్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో వరంగల్‌ సైబర్‌ క్రైం పోలీసుల ప్రతిభ  రాష్ట్రవ్యాప్తంగా మార్మోగింది.

సైబర్‌ వారియర్స్‌తో శిక్షణ
రోజురోజుకు పెరుగుతున్న సైబర్‌ నేరాలను దృష్టిలో పెట్టుకుని పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల కాలంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా డీజీపీ కార్యాలయం నుంచి ‘సైబర్‌ వారియర్స్‌’ పేరిట రాష్ట్రంలోని ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ట్యాబ్‌లు అందజేసి పిటీ కేసులను ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు డయల్‌ 100 కు వచ్చే ఫోన్లకు 5 నుంచి 10 నిమిషాలలో స్పందించేలా చూస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. 

అధునాతన పరికరాలు, అత్యాధునిక విభాగం
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని సైబర్‌ విభాగంలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు ఉన్నాయి. 2018 మార్చి 18న ఈ విభాగం ప్రారంభమైంది. పోలీస్‌ కమిషనర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో నడిచే ఈ విభాగంలో ఒక ఇన్‌స్పెక్టర్, ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఒక అసిస్టెంట్‌ ఎనలైటికల్‌ అధికారితో పాటు తొమ్మిది మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. వీరందరూ బీటెక్వి‌ద్యార్హతతో కలిగి ఉన్న నేపథ్యంలో సాంకేతిక పరమైన అంశాలపై మంచి పట్టు ఉండి అనేక కేసుల్లో కీలక సమాచారాన్ని అందించగలుగుతున్నారు. ఓటీపీ, బ్యాంకు, వాట్సప్, ఫేస్‌బుక్, లాటరీ, ఉద్యోగాలు, గిప్ట్‌లు పేరిట జరుగుతున్న మోసాలు, యువతులు, మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తదితర అంశాల్లో విచారణ సిబ్బందికి కీలక సమాచారం అందిస్తూ నేరస్తుల ఆట కట్టిస్తున్నారు. ఇదే సమయంలో వరంగల్‌ సైబర్‌ పోలీస్‌ విభాగం ఆధ్వర్యాన ప్రజలను చైతన్యపరిచేలా వీడియో సందేశాలను వాట్సప్‌ ద్వారా పంపిస్తున్నారు.

వీఓఐటీ ఇంటర్నెట్‌ కాల్స్‌ను చేధించి
 మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో బాలుడు కుసుమ దీక్షిత్‌ కిడ్నాప్, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసులో వరంగల్‌ సైబర్‌ క్రైం పోలీసులు అందించిన సాంకేతిక సమాచారంతోనే నిందితుడిని గుర్తించగలిగారు. బాలుడిని కిడ్నాప్‌ చేసిన దుండగుడు ఆయన తల్లిదండ్రులకు ఇంటర్నెట్‌ ద్వారా ఫోన్‌ చేస్తుండడంతో గుర్తించడం సాధ్యం కాలేదు. ఈ మేరకు రంగంలోకి దిగిన సైబర్‌ బృందం వీఓఐటీ ఇంటర్నెట్‌ కాల్స్‌ను చేధించి నిందితుడిని అరెస్ట్‌ చేయించగలిగారు. ఈ విషయంలో రాష్ట్ర ఇంటలిజెన్స్‌ పోలీసులకు సైతం దొరకని సమాచారాన్ని వరంగల్‌ సైబర్‌ పోలీసులు అందించడం విశేషం.

వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో జరిగిన తొమ్మిది మంది హత్యల కేసులో సాంకేతిక సమాచారమే కీలకంగా మారింది. ఘటనా స్థలంలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. నిందితుడు చేసిన ఫోన్ల ఆధారంగా సైబర్‌ క్రైం పోలీసులు ఆయనను గుర్తించారు. అనంతరం కోర్టులో కూడా సాంకేతిక ఆధారాలను సమర్పించడంతో నిందితుడికి ఉరిశిక్ష ఖరారైంది. ఆన్‌లైన్‌ రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకుంటే... వారి ఫోన్లలో నంబర్లు సేవ్‌ అయి ఉన్న వ్యక్తులకు చెడుగా సమాచారం ఇస్తూ ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులను గుర్తించడంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సైబర్‌ విభాగం అధికారులు పాత్ర కీలకంగా మారింది. బెంగళూరు కేంద్రంగా రుణాలు ఇస్తూ, వేధిస్తున్న నలుగురు నిందితుల అరెస్టులో వరంగల్‌ సైబర్‌ పోలీసులు కీలకపాత్ర పోసించారు. 

చదవండి : (ఈ-కామర్స్‌లో తెలుగుతో తెలివిగా టోకరా..)
(రెండు ఉదంతాల్లో రూ.73 లక్షల మోసం  )

   
     
   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement