కర్నూలులోనే పోలీసు ఐజీ కార్యాలయం
Published Mon, Aug 1 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
ఇకపై ఇక్కడి నుంచే కార్యకలాపాలు
– డీఐజీ క్యాంప్ ఆఫీస్‌పైన కార్యాలయం
– బాలాజీనగర్‌లో ఐజీ క్యాంప్ రెసిడెన్సీ
కర్నూలు:
పోలీసు శాఖలో సంస్కరణలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు హైదరబాద్ కేంద్రంగా ఐజీల పాలన సాగింది. డీజీపీగా నండూరి సాంబశివరావు ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. పాలన సౌలభ్యం కోసం ఐజీలు హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలని ఆదేశించడంతో అధికారులు కార్యాలయాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలను కలిపి నార్త్ కోస్టల్‌గా వైజాగ్‌లోనూ.. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు సౌత్ కోస్టల్ జోన్ కింద గుంటూరులోనూ.. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాలను కలిపి సౌత్ జోన్ కింద కర్నూలు కేంద్రంగా కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు కర్నూలు ఐజీ కార్యాలయం డీఐజీ క్యాంప్ కార్యాలయంపైన ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు శివారులోని బాలాజీనగర్‌లో డూప్లెక్స్ ఇంటిలో ఐజీ క్యాంప్ రెసిడెన్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాయలసీమ ఐజీ కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని గత ఐజీ గోపాలకృష్ణ ప్రతిపాదించారు. తిరుపతిని ఐటీ హబ్‌గా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించి ఐజీ కార్యాలయం అక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. అయితే తాజాగా కర్నూలులోనే ఐజీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించడంతో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1989లో రాయలసీమకు ఐజీ కార్యాలయం మంజూరయింది. ఫ్యాక్షన్ జోన్ ఐజీ పోలీస్ ఆఫీస్ పేరుతో బి.క్యాంప్‌లోని పోలీస్ గెస్ట్‌హౌస్‌పై రెండేళ్ల పాటు నిర్వహించారు. గెస్ట్‌హౌస్ పక్కనున్న బీసీ హాస్టల్ స్థానంలో 2001 నుంచి 2003 వరకు రాయలసీమ ఐజీ కార్యాలయాన్ని నిర్వహించారు. అయితే పాలనాపరమైన సౌలభ్యం కోసం 2003 నుంచి ఇప్పటి వరకు హైదరబాద్‌లోని డీజీపీ కార్యాలయం నుంచి ఐజీ పాలన సాగింది. కర్నూలు కేంద్రంగా ఐజీ పాలన కొనసాగించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో కార్యాలయాల ఏర్పాట్లపై పోలీసు అధికారులు దృష్టి సారించారు.
Advertisement