ఆంగ్లేయులపై దేశంలోనే తొలిసారిగా తిరుగుబాటు జెండా ఎగురవేసి, వారి పాలిట సింహ స్వప్నమై రాయలసీమ ముద్దుబిడ్డగా, రేనాటి వీరుడిగా, సైరా నరసింహారెడ్డిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఖ్యాతి పొందారు. శిస్తు వసూలులో తెల్లదొర పెత్తనంపై దండయాత్ర చేసి చివరికి ఉరికొయ్యకు వేలాడి స్వాతంత్య్రోదమానికి బీజం వేశారు.
సాక్షి, ఉయ్యాలవాడ: సైరా నారసింహారెడ్డి.. నీపేరే బంగారు కడ్డీ.. అనే జానపద గేయం రాయలసీమ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపింది. దేశంలో తెల్లదొరల నిరంకుశ పాలనపై మొట్టమొదటి సారిగా తిరుగుబాటు బావుట ఎగరవేసి వారి గుండెల్లో సింహస్వప్నమయ్యాడు రేనాటి గడ్డ సూర్యుడు, విప్లవ వీరుడు మన ఉయ్యాలవాడ వీర నారసింహారెడ్డి. ఆయన వీర మరణం పొంది రేపటికి 174 సంవత్సరాలు కావడంతో ప్రత్యేక కథనం..
నేపథ్యం..
జిల్లాలోని ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సీతమ్మ, పెద్దమల్లారెడ్డి దంపతుల కుమారుడు నరసింహారెడ్డి. హైదరాబాద్ నవాబులు రాయలసీమ జిల్లాలైనా కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారిని దత్త మండలాలుగా ప్రకటించి బ్రిటీష్ వారికి ధారాదత్తం చేశారు. ఇందులో నొస్సం ప్రధాన కేంద్రంగా బ్రిటీష్ పాలన కొనసాగేది. నారసింహారెడ్డి తాత జయరామిరెడ్డికి పన్నులు, భూమిశిస్తూ వసూలు చేసే అధికారం అప్పగించారు. ఆయన మరణానంతరం వారసత్వంగా ఈ బాధ్యత నరసింహారెడ్డికి వర్తించింది. బ్రిటీష్ నిరంకుశ పాలనకు ప్రతిఘటించి మొదటిసారిగా 1842లో వారిపై తిరుగుబాటు బావుట ఎగరవేశాడు. నరసింహారెడ్డి తిరుగుబాటుతో బ్రిటీష్ సామ్రాజ్యం వణికిపోయింది.
నరసింహారెడ్డి వినియోగించిన ఫిరంగి
తన పోరాటంలో కోవెలకుంట్ల తహసీల్దార్‌ను నరికిచంపడమేగాక బ్రిటీష్‌వారి ఖజానాను కొల్లగొట్టారు. ఈయన విప్లవ మార్గాన్ని వణికిపోయిన ఆంగ్లేయులు..ఆయనను పట్టించిన వారికి 10వేల దినారాలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఎట్టకేలకు 1847లో సంజామల మండలం జగన్నాథగుట్టపై నరసింహారెడ్డిని ప్రాణాలతో పట్టుకుని, బందిపోటు దొంగగా ముద్రవేసి, 1847 ఫిబ్రవరి 22న కోవెలకుంట్ల పట్టణ సమీపంలోని జుర్రేరు ఒడ్డున ఉరిశిక్ష అమలు పరిచారు. అయితే నరసింహారెడ్డి మరణించి వందేళ్లకు స్వాతంత్య్రం సిద్ధించింది. నాటి నుంచి భారతీయులు ఆయనను రేనాటి సూర్యుడిగా పిలుచుకుంటుంటారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో నరసింహారెడ్డిపై జానపద గేయాలు వినిపిస్తున్నాయి. ఏటా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆయన వంశస్తులు, రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
నేడు రేనాటి సూర్యచంద్రుల సంస్మరణ సభ
ఈ నెల 21వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో రేనాటి సూర్య చంద్రుల సంస్మరణ సభ ఏర్పాటు చేస్తున్నట్లు సేవా సమితి నిర్వహకులు కోట్లో బాబు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉయ్యాలవాడ విప్లవ వీరుడు నరసింహారెడ్డి 174వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సంస్మరణ సభకు నంద్యాల ఎంపీ పోచాబ్రహ్మనందరెడ్డి హాజరు కానున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment