వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉరికంబం ఎక్కి రేపటికి 175 ఏళ్లు. 19వ శతాబ్దం ప్రారం భంలో అంకురించిన చిత్తూరు పాలెగాళ్ళ పోరాటం దగ్గర నుంచి 1847 ఫిబ్రవరి 22న పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్‌వాళ్లు ఉరితీయడం వరకు... రాయలసీమ పోరాటాలతో ఎరుపెక్కింది. ఈ పోరాటాలలో ఉరికంబం ఎక్కిన అమరవీరులు రాయలసీమ పాలెగాళ్ళు. బ్రిటిష్ మహావృక్షాన్ని మొక్క దశలోనే తుంచేయాలని పోరాటాలు చేసిన తొలి స్వతంత్ర పోరాట యోధులు వీరు.
క్రీ.శ. 1801 నుంచి 1805 వరకు చిత్తూరు జిల్లా పాలెగాళ్ళు– బ్రిటిష్ వారికి మధ్య జరిగిన పోరాటంలో... యాదరాకొండ పాలెగాడు ముద్దు రామప్ప నాయుణ్ణి పట్టుకుని కల్లయ్య బండ అడవుల్లో ఉరితీశారు. మిగిలిన పాల్యాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆనాటి బ్రిటిష్ సైనిక చట్టం ప్రకారం చిత్తూరు పాలెగాళ్లను కొందరిని ద్వీపాంతరం పంపారు. మరికొందరిని ఉరితీశారు. (చదవండి: మన రాజ్యాంగానికి కొత్త ప్రమాదం)
క్రీ.శ.1600– 1800 వరకు రాయలసీమలో బలమైన రాజుల పాలన లేదు. రాయలసీమను రక్షించినది పాలెగాళ్లే. సీమలో దండయాత్రలు జరిగినప్పుడు గండికోట, సిద్ధవటం కోట, పరాయి రాజుల వశమైనప్పటికీ... బురుజులు మాత్రం పాలెగాళ్ళ ఆధీనంలోనే ఉండేవి. విజయనగరం రాజుల కాలంలోనే (క్రీ.శ.1336 –1680) పాలెగాళ్ల వ్యవస్థ ఏర్పడింది. రాయలసీమలో పాలెగాళ్లు విజయనగర రాజులకు పన్నులు వసూలు చేయడంలోనూ, అంతర్గత రక్షణ కల్పించడంలోనూ, అవసరమైన సైన్యాన్ని సమీకరించడంలోనూ సహాయపడేవారు. క్రీ.శ.1565లో జరిగిన తళ్ళికోట యుద్ధంలో సుల్తానుల చేతుల్లో పరాజయం పొందిన విజయనగరం రాజులు తమ రాజధానిని హంపీ నుంచి ప్రస్తుత అనంతపురం జిల్లాలోని పెనుగొండకు క్రీ.శ.1591లో మార్చారు. అప్పటి నుంచి 1800 సంవత్సరంలో బ్రిటిష్‌వారికి రాయలసీమ ప్రాంతం ధారాదత్తం అయ్యేదాకా ఇక్కడ ముప్ఫై యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల న్నిటిలో సీమ ప్రజలకు ధన, మాన, ప్రాణ, నష్టం జరగకుండా చూసింది పాలెగాళ్లే.
క్రీ.శ. 1800 నాటికి రాయలసీమలో 80 మంది పాలెగాళ్ళు ఉండేవారు. వీరి కింద 30,000 మంది సైనికులు ఉండేవారు. రాయలసీమ ప్రాంతం బ్రిటిష్ వాళ్లకిందికి వచ్చిన తర్వాత పాలెగాళ్లు నామమాత్రులయ్యారు. బ్రిటిష్ వారి దోపిడీ పతాకస్థాయికి చేరుతుండటంతో పాలెగాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఐదు వేలమంది సాయుధులతో, ఇతర పాలెగాళ్లు, జమీందారుల సహకారంతో వాళ్లపై 1846లో తిరుగుబాటును ప్రారంభించాడు. అనేక సంఘర్షణల అనంతరం 1846 అక్టోబర్ 6న నరసింహారెడ్డిని బ్రిటిష్‌వాళ్లు పట్టుకున్నారు. 200 మంది అనుచరులతో రెడ్డి ఎర్రమల కొండలను వదిలి పెరసోమలలోనికి పోయినట్లు అనుమానించి పెరసోమల గ్రామం వద్ద బ్రిటిష్‌వాళ్లు ఆయన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. ఉయ్యాలవాడను చివరకు 1847 ఫిబ్రవరి 22న ఉరితీశారు. దీనిని కలెక్టర్ కాన్‌క్రేన్ పర్యవేక్షించాడు. మృతదేహం తలను నరికించి... ఆ తలను కోయిలకుంట్ల బురుజుకు వేలాడదీయించాడు. అలా 1847 నుంచి 1877 వరకు కోయిలకుంట్ల బురుజుకు ఆయన తల వేలాడుతూనే ఉంది. (చదవండి: ప్రజల గుండె చప్పుడు)
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి త్యాగ ధనులు పుట్టిన రాయలసీమపై కొందరు... ఫ్యాక్షన్ ముద్రవేసి దాని గౌరవాన్ని తగ్గించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి!
- డాక్టర్ ఏనుగొండ నాగరాజ నాయుడు
రిటైర్డ్ ప్రిన్సిపాల్, తిరుపతి
(ఉయ్యాలవాడ ఉరికంబమెక్కి రేపటికి 175 ఏళ్లు)
Comments
Please login to add a commentAdd a comment