remembered
-
Ram Prasad Bismil, Ashfaqulla Khan: అమర మిత్రులు!
దేశ స్వాతంత్య్రం కోసం అనేక మంది యువ కిశోరాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. వారిలో రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్ ముఖ్యులు. వయసుకు మించిన పరిణతితో దేశం కోసం ఉరితాడును ముద్దాడి నూరేళ్ల ఖ్యాతిని ఆర్జించారు. బిస్మిల్ 1897 జూన్ 11వ తేదీన, అష్ఫాఖ్ 1900 అక్టోబర్ 22న ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో జన్మించారు. రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖ్ల కుటుంబ నేపథ్యాలు ఉత్తర దక్షిణ ధ్రువాల్లాంటివి. బిస్మిల్ సనాతన హిందువు, ఆర్యసమాజ సభ్యుడు. అష్ఫాఖ్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ముస్లిం. భిన్న సామాజిక జీవన నేపథ్యాల నుండి వచ్చినా వీరు గొప్ప స్నేహితులయ్యారు. బిస్మిల్ మొదట్లో అష్ఫాఖ్‌ను ఒక పట్టాన నమ్మలేదు, కాని అచంచలమైన అష్ఫాఖ్ దేశ భక్తికి, అంకిత భావానికి బిస్మిల్ చలించి పోయాడు. ఇద్దరూ యుక్త వయసులోనే పదునైన కవిత్వం రాశారు. సామ్రాజ్యవాద భావ జాలాన్ని తుత్తునియలు చేశారు. మాతృదేశ స్వాతంత్య్ర ఉద్యమ అవసరాల కోసం ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా 1925 ఆగస్టు 9వ తేదీన అష్ఫాఖుల్లా ఖాన్, రాం ప్రసాద్ బిస్మిల్, చంద్ర శేఖర్ ఆజాద్ లాంటి మరికొందరు విప్లవకారులు కలిసి ‘కకోరీ’ గ్రామం వద్ద ప్రభుత్వ ఖజానాతో పోతున్న రైలును దోపిడీ చేశారు. పట్టుమని పదిమంది కూడా లేని యువకులు ఏకంగా బ్రిటిష్ ఖజానాకే గురి పెట్టి, రైలునే దోచేయడం ఆంగ్లాధికారులకు తల తీసేసినంత పనైతే, ఉద్యమకారులకు కొత్త ఉత్సాహాన్ని అందించి నట్లయింది. సెప్టెంబర్ 26న రాంప్రసాద్ బిస్మిల్‌ను అరెస్టుచేశారు. అష్ఫాఖ్ తప్పించుకున్నాడు. కొన్నాళ్ళ పాటు బనారస్‌లో అజ్ఞాత జీవితం గడిపి ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీలో మిత్రుడు చేసిన నమ్మక ద్రోహంతో పోలీసులకు పట్టుబడ్డాడు. చివరికి 1927 డిసెంబర్ 19వ తేదీన అష్ఫాఖ్, రాంప్రసాద్ బిస్మిల్లను ఉరితీయాలని తీర్పు వెలువడింది. ప్రాణత్యాగానికి ఏనాడో సిద్ధపడ్డ ఈ ఇద్దరు ప్రాణ మిత్రులు మాతృదేశ విముక్తి కోసం ఉరి కంబాన్ని ఎక్కబోతున్నందుకు గర్వపడుతున్నామని ప్రకటించారు. ఇద్దరినీ వేర్వేరు జైళ్ళలో ఒకేరోజు ఉరి తీశారు. భూప్రపంచం ఉన్నంత వరకు దేశం పట్ల బాధ్యతను గుర్తుచేస్తూ అష్ఫాఖ్, బిస్మిల్ల త్యాగం, స్నేహం సజీవంగా ఉంటాయి. హిందూ – ముస్లిం ఐక్యతను చాటుతూ... మతోన్మాదులకు సవాల్ విసురుతూనే ఉంటుంది! (క్లిక్ చేయండి: వారధి కట్టాల్సిన సమయమిది!) – ఎం.డి. ఉస్మాన్ ఖాన్ (డిసెంబర్ 19 రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్‌లను ఉరితీసిన రోజు) -
Kundurti Anjaneyulu: వచన కవితా మూర్తి
జాషువా, విశ్వనాథల ప్రేరణా ప్రభావాలతో పద్య కవిత రచనకు పూనుకున్నాడు కుందుర్తి ఆంజనేయులు. విశ్వనాథ వారి ప్రౌఢమైన శైలిలో ‘సౌప్తికం’ అనే కావ్యాన్ని రచించాడు. ఆయన 1922 డిసెంబర్ 16వ తేదీన నరసరావుపేట సమీపంలో కోటవారిపాలెంలో పేదకుటుంబంలో జన్మించాడు. నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్లో అనిసెట్టి, రెంటాల, బెల్లంకొండ రామదాస్, మాచిరాజు దేవీ ప్రసాదులు ఆయన సహాధ్యాయులు. మాచిరాజు దేవీప్రసాద్ ప్రేరణతో శ్రీశ్రీ కవిత్వ లాలసుడై వచన కవిత్వం వైపు దృక్పథం మరల్చుకున్నాడు. నవ్యకళా పరిషత్, నరసరావుపేట ఆధ్వర్యంలో ఏల్చూరి, బెల్లంకొండ రామదాసులతో కలసి తెలుగులో తొలి వచనా కవితా సంపుటి ‘నయాగరా’ను 1944లో ప్రచురించాడు. తొమ్మిది కవితల సంపుటి నయాగరాలో కుందుర్తి రచించిన ‘మన్యం లోకి’ కవితలో మన్యం వీరుడు అరి విప్లవాగ్నిని ప్రశంసించాడు. ‘జయిస్తుంది’ కవితలో బ్రిటిష్ వారి దురాగతాలను నిరసించాడు. క్విట్ ఇండియా ప్రభావంతో అసమ సమాజాన్ని ఈసడిస్తూ ‘ఒకవేపున అధికోత్పత్తీ/ మరోవేపు డొక్కల కరువు’ ఇకపై సాగవని హెచ్చరిక చేశాడు. ఆయన కవితలపై శ్రీశ్రీ మరోప్రపంచం గేయం ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘పాతకాలం పద్యమైతే / వర్తమానం వచన గేయం’ అంటూ ‘నాలో నినాదాలు’లో కుందుర్తి స్పష్టంగా ప్రకటించాడు. ఎందరో అధునిక కవులను ప్రభావితం చేశాడు. అనిసెట్టి, ఆరుద్ర, దాశరథి, సి. నారాయణ రెడ్డి, రెంటాల వంటి వారు వచన కవితను ఆదరించి వచన కవితా సంపుటాలు ప్రచురించారు. వచనకవితా మూర్తి కుందుర్తికి ఫ్రీవర్స్ ఫ్రంట్ ఊపిరి. ప్రాచీన కవిత్వంపై తిరుగుబాటు చేసి ‘రచనల పూలతోటలో ఛందస్సుల మొక్కలు నాటను’ అని ప్రతిజ్ఞ చేశాడు. ఆధునిక కాలానికి అనువైన ప్రక్రియ వచన కవిత్వ మేనని నిరూపించేందుకు ఎంతో శ్రమపడ్డాడు. ఫ్రీవర్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వ్యాసాలు, పీఠికల ద్వారా వచన కవితా ప్రచారం ముమ్మరంగా చేసినందున కుందుర్తిని వచన కవితా పితామహుడిగా విమర్శకులు పేర్కొన్నారు. ఆశ, ఆచారిగారి అమ్మాయి, శిక్ష వంటి గేయ నాటికలు రాశాడు. తెలంగాణ, యుగేయుగే, నగరంలో వాన, నాలోని నాదాలు, కుందుర్తి కృతులు పాఠకుల మన్ననలు పొందాయి. ‘హంస ఎగిరిపోయింది’ అనే సతీస్మృతి కావ్యం విశిష్టమైంది. ఆయన కవిత్వంలో అభ్యుదయ దృక్పథం, హేతువాద దృష్టి, ప్రకృతిని సామాజిక స్పృహతో సమన్వయించటం, చమత్కారమైన అధిక్షేపణ, ఆకర్షణీయమైన అంత్యప్రాసలు ఎందరో యువకులను ప్రభావితం చేశాయి. ఆయన 1982 అక్టోబర్ 25వ తేదీన మరణించినా, వచన కవితా పితామహుడిగా ఆధునికాంధ్ర కవిత్వంలో చిరస్మరణీయుడు! (క్లిక్ చేయండి: బాపుయగుట దుష్కరమ్ము సుమ్ము) – డాక్టర్ పీవీ సుబ్బారావు, సాహితీ విమర్శకులు (డిసెంబర్ 16 కుందుర్తి ఆంజనేయులు శత జయంతి ముగింపు) -
Bapu: బాపుయగుట దుష్కరమ్ము సుమ్ము
‘నేనయితే కింద సంతకం లేకపోయినా సరే! బాపు బొమ్మని గుర్తుపడతాను’ అని కొంతమంది అమాయకంగా అమాయకమై పోతుంటారు. అలా అవనవసరం లేదు. రేఖ పండిన చిత్రకారులకి సంతకం అవసరం లేదు. వారి బొమ్మే సంతకం అవుతుంది. మరి బాపు గొప్పతనమంతా సంతకంలో కాక మరెక్కడుంది అని మీరెవరైనా అడిగితే నేను ఇలా చెబుతాను. అనగనగా అనేక కథలు మన సాహిత్యానికి ఉన్నాయి. ఒకానొక బంగారు కాలంలో ఆ కథలన్నిటికీ అరచేయంత కొలత దగ్గరి నుండి, రెండు పేజీల వరకు వ్యాపించిన డబుల్ డమ్మీ ఇలస్ట్రేషన్లను బాపు బొమ్మలు కట్టేరు. తన క్రియేటివిటీతో సమకాలీన తెలుగు సాహిత్యాన్ని అమరం చేశారు. కన్యాశుల్కంలో గిరీశం వెంకటేశాన్ని అడుగుతాడు ‘ఏమి వాయ్! క్రియేషన్ అనగానేమీ?’ దానికి వెంకటేశం ఏమి చెప్పాడో మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు మాత్రం నేను చెప్పేది వినండి. క్రియేషన్ అనగా తెల్లని కాగితంపై మూడు అక్షరాల నల్లని అచ్చుగా మాత్రమే ఉండిన గిరీశం అనే ఒక పేరుకి ‘ఇదిగో ఇంత ఎత్తు, ఇది నుదురు, ఇలా పంచె అని కట్టి, చేతిలో చుట్ట పెట్టి మన మెవ్వరమూ ఎప్పటికీ ఊహించలేని ఒక ఊహకు రూపం ఇచ్చి మనకు పరిచయం చేయడమన్నది బాపు చేసిన క్రియేషన్. గిరీశం కానీ, మధురవాణి కానీ, సౌజన్యరావు పంతులు కానీ, బుచ్చమ్మ కానీ ఇలా ఉంటారు అని ఆ గురజాడ అప్పారావు తమ పుస్తకంలో ఎక్కడా వర్ణన చేయలేదు. కానీ బాపు వారందరికీ ఒక రంగూ, ఒక రూపం, ఒక లక్షణం, ఒక ధోరణి, ఒక రీతి ఇచ్చి వారిని బొమ్మలుగా మలిచి మనకు మప్పారు. ఒకసారి బాపు బొమ్మల్లో వారిని చూశాక... వారు అలా కాక మరి ఇంకోలా ఉండటానికి మన ఇమాజినేషన్లో కుదరదు. బాపు బొమ్మ అంటే ఒక సంతకం కాదు. పేరు కాదు. కాసింత కాగితం, కలం మాత్రమే కలిసి దిద్దిన కల్పన కాదు. అంత కాక మరెంత? అనడిగితే, అదీ చెబుతా. తొంబైల నాటి తరం మాది. మేము చదువుకున్న కథా సాహిత్యమంతా కొకు కథా సంపుటాలు, శ్రీపాద కథా సంపుటాలు, రావిశాస్త్రి కథా సంపు టాలు. మా తరానికి ఆ కథలు తొలినాళ్లల్లో అచ్చ యిన ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, యువ, జ్యోతి లాంటి అనేకానేక పుస్తక పుటలు తిరగేయడం కుదరలేదు. తరవాత్తరువాత ఆ పాత పుస్తకాలు, అందులో వాటికి వేసిన బొమ్మలు చూసే అవకాశం దొరికినపుడు, ఒకోసారి ఇంటర్నెట్లో పైన కథ పేరు కూడా లేని చాలా బాపు బొమ్మలను చూసినపుడు... నా కళ్ళకు కనపడింది బొమ్మ కాదు అచ్చంగా కథలే. చలపతి, దాసూ పూర్వాశ్రమంలో సహధ్యాయులు, వారిద్దరి మధ్య పెద్ద స్నేహమేం ఏర్పడలేదు. చదువుల అనంతరం ఎన్నో ఏళ్ళ తరువాత అనుకోకుండా చలపతికి దాసు కనపడతాడు. చలపతికి పెళ్ళి కావాల్సిన రాజ్యం అనే చెల్లెలు ఉంది. చలపతి దాసూని ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇంట్లో చలపతి, అతని భార్య, వారి ఇద్దరు పిల్లలు, రాజ్యం ఉంటారు. అ చదువుకున్న మధ్యతరగతి ఇల్లు, ఈ దంపతులు, ఆ పిల్లలు, వంటగదిలోంచి రెండు లోటాలతో కాఫీ తెస్తున్న రాజ్యం, కుర్చీలో కూచుని బుగ్గన సొట్టతో నవ్వుతున్న దాసు. ఈ బొమ్మని, వీటితో పాటూ అదే కథకు బాపు చిత్రించిన మరికొన్ని బొమ్మలని చూసిన నాకు ఒక్కసారిగా ఆ కథ మొత్తం నోటికి తగిలింది. బొమ్మ బొమ్మలో వెంకమ్మ, భాగ్యమ్మ, గోపీ, సత్యం అనే అందరినీ గుర్తు పట్టగలిగాను. ఈ కథే కాదు. బాపు వేసిన ఎన్నో బొమ్మల్లో ఆ కథలనూ, అందులోని మనుష్యులనూ గుర్తుపట్టి థ్రిల్లవుతూ వారిని చేయి పట్టి ఊపి షేక్ హాండ్ ఇచ్చిన అనుభవాలు నాకు కొల్లలు. (చదవండి: ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..) దీనిని మించిన మరో అద్భుత సంఘటనను మీకు చెబుతా. భారత దేశానికి గాలిబ్ కవితా, తాజమహలూ మరవరాని అందాలు అని ఒక మహానుభావుడు అన్నాడుట. మరి గాలిబ్ కవితకు ఏమిటి అందం? ఏ చేతులది చందం? అని వెదుక్కుంటూ బంగారం వంటి కవి దాశరథి, గొప్ప పబ్లిషర్ ఎంఎన్ రావు బాపును కలిశారు, ఆయనకు గాలిబ్ గీతాల అనువాదం ఇచ్చారు. వాటన్నిటికీ బాపు బొమ్మలు వేశారు. ఆ తరువాత ఆ పుస్తకం సాధించిన ఘన కీర్తి, తెలుగు వారి హృదయాలలో సంపాదించుకున్న సుస్థిర యశస్సు అందరికీ తెలిసినదే. అయితే చాలా మందికి తెలియని ఒక గొప్ప విషయం, బాపు బొమ్మకే అందిన అందలం ఏమిటంటే, దాశరథి గాలిబ్ గీతాల తెలుగు అనువాదం పుచ్చుకుని ఒక్క తెలుగు అక్షరం కూడా ఎరుగని ఎక్కడెక్కడి ఉర్దూ కవులూ కేవలం బాపు బొమ్మల్ని చూసి గాలిబ్ ఉరుదూ మూలం చదివేవారుట. ఇంతకూ చెప్పదలుచుకున్నదేమిటంటే... ‘ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము, మరియొకడు బాపుయగుట ఎంతో దుష్కరమ్ము సుమ్ము.’ – అన్వర్ (డిసెంబర్ 16న బాపు జయంతి; తెలుగు యూనివర్సిటీలో బాపు–రమణ పురస్కారాల ప్రదానం) -
Dwarkanath Kotnis: భారత, చైనా మైత్రికి స్ఫూర్తి
భారత – చైనా దేశాల మధ్య స్నేహానికి స్ఫూర్తి డాక్టర్ ద్వారాకానాథ్ శాంతారాం కోట్నిస్. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ కాలంలో ఆయన జీవితం నుండి స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. డాక్టర్ కోట్నిస్ 1910 అక్టోబరు 10న మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటం ఉధృతం అవుతుండగా, జపాన్ ఫాసిస్టుల దురాక్రమణకు చైనా గురైనకాలం అది. ఈ సమయంలో చైనాకు చెందిన జనరల్ ఛూటే తమ సైనికులకు వైద్యసహాయం అందించటానికి డాక్టర్లను పంపమని జవహర్లాల్ నెహ్రూను కోరారు. ఆ మేరకు 1938లో చైనాకు పంపబడిన 5 మంది డాక్టర్ల బృందంలో 27 ఏళ్ల డాక్టర్ కోట్నిస్ ఒకరు. డాక్టర్ కోట్నిస్, ఆయన బృందం గాయపడిన చైనా సైనికులకు రోజుకు 800 మందికి వైద్యసహాయం అందించేవారు. బృందంలోని డాక్టర్లు తిరిగి ఇండియాకు వచ్చినా కోట్నిస్ అక్కడే ఉండి పోయారు. 1941లో చైనాలోని నార్మన్ బెతూన్ అంతర్జాతీయ శాంతి హాస్పిటల్‌కు ఆయన డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1941 డిసెంబరులో ఆయన అక్కడే యుద్ధ రంగంలో పనిచేస్తున్న ఒక చైనా నర్సును వివాహ మాడారు. వారికి కల్గిన కుమారునికి ‘ఇన్ హువా’ అని పేరు పెట్టారు. ఇన్ అంటే ఇండియా, హువా అంటే చైనా అని అర్థం. 1942లో ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారు. అవిశ్రాంతంగా పనిచేసిన కోట్నిస్‌కు అక్కడి అతిశీతల వాతావరణం వల్ల ఆరోగ్యం దెబ్బతింది. అందుకే తన కుమారుడు జన్మించిన కొద్ది నెలలకే 1942 డిసెంబరు 9న మూర్ఛవ్యాధితో మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 32 సంవత్సరాలు మాత్రమే. ఆయన చనిపోయినపుడు ‘‘చైనా సైన్యం ఒక ఆపన్నహస్తాన్ని పోగొట్టుకుంది. చైనాదేశం ఒక స్నేహితుణ్ణి కోల్పోయింది. డాక్టర్ కోట్నిస్ అంతర్జాతీయ స్ఫూర్తిని మనం ఎల్లప్పుడూ మన మనస్సులలో పదిలపరచుకోవాలి’’ అని చైనా విప్లవ నాయకుడు కామ్రేడ్ మావో యువ డాక్టరుకు ఘనంగా నివాళులర్పించారు. చైనా కోట్నిస్ స్మృతికి గుర్తుగా చైనాలోని కొన్ని నగరాలలో వైద్యశాలలు, విగ్రహాలు, స్థూపాలు నిర్మించింది. చైనా నాయకులు ఇండియా పర్యటనకువచ్చినప్పుడల్లా డాక్టర్ కోట్నిస్ కుటుంబసభ్యులను తప్పనిసరిగా కలవటం ఒక ఆనవాయితీ. ప్రస్తుతం ఇరుదేశాల మధ్యగల సరిహద్దు తగాదాను సామరస్యంగాను, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోను పరిష్కరించుకోవాలి. భారత, చైనా దేశాల మైత్రికి సంకేతంగానూ, అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికి ప్రతీకగానూ నిలిచిన డాక్టర్ కోట్నిస్ ఉద్వేగభరిత జీవితం నుండి స్ఫూర్తిని పొంది భారత, చైనా మైత్రీ ఉద్యమాన్ని నిర్మించటం నేటి తక్షణ కర్తవ్యం. (క్లిక్ చేయండి: తెలుగు నేలపై చైతన్య యాత్ర) – సి. భాస్కర్, యూసీసీఆర్ఐ (ఎమ్ఎల్) (డాక్టర్ కోట్నిస్ 80వ వర్ధంతి సందర్భంగా) -
BR Ambedkar: తెలుగు నేలపై చైతన్య యాత్ర
నవభారత నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు తెలుగు నేలతో ఎంతో అనుబంధం ఉంది. పలు సందర్భాల్లో తెలుగు ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడి ప్రజ లను చైతన్యపరిచారు. భారతదేశంలో అంబేడ్కర్ ఇష్టపడి, ఎన్నోసార్లు విడిది చేసిన అతికొద్ది నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించారు. దేశానికి స్వాతంత్య్రంతో పాటు బహుజనులకు కూడా స్వాతంత్య్రం కావాలని కాంక్షిస్తూ పలు చైతన్యయాత్రలు ఆంధ్రలో చేశారు. అటువంటి పర్యటనల్లో 1944 సెప్టెంబరు 27వ తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకూ జరిపిన పర్యటన చారి త్రాత్మకమైనది. అది రెండో ప్రపంచ యుద్ధ సమయం. అందుకే యుద్ధమనేది బ్రిటిష్ వారి సొంత వ్యవహారమనీ, యుద్ధం మన లక్ష్యం కాదనీ, సామాజిక స్వాతంత్య్రం మన గమ్యమంటూ తన ప్రసంగాల ద్వారా ఇక్కడి ప్రజలను చైతన్యపరిచారు. విజయవాడ మొదలు కొని విశాఖపట్నం వరకూ పర్యటించారు. తొలుత బెజవాడ రైల్వేస్టేషన్ లోనూ, గుడివాడ మొయిన్ రోడ్‌లోనూ ప్రజలనుద్దేశించి ఉపన్యసించారు. బాలికల వసతి గృహానికి గుడివాడలో శంకు స్థాపన చేశారు. అనంతరం ఏలూరు సందర్శించారు. అక్కడ మున్సిపల్ కార్యాలయంలో అంబేడ్కర్‌ను అభిమానులు, పురపాలక సభ్యులు ఘన సన్మానం చేశారు. కొవ్వూరులో ఎస్సీ కాలనీని సందర్శించి. షెడ్యూలు కాస్ట్ ఫెడరేషన్ ఫ్లాగ్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అందుకే ‘జెండా పేట’గా ఆ కాలనీకి నామకరణం చేసుకున్నారు ప్రజలు. అనంతరం, తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, పాలకొల్లు, రామచంద్రాపురం వెళ్లారు. రాజమండ్రి వచ్చిన సందర్భంగా అక్కడి టౌన్ హాల్లో ఘనంగా పౌర సన్మానం జరి గింది. కాకినాడ పర్యటన అనంతరం పిఠాపురం వచ్చి ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శిం చారు. అక్కడి రాజా కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. తుని రైల్వేస్టేషన్ వద్ద ప్రసంగించిన అనం తరం అనకాపల్లి చేరుకోగా భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు అంబేడ్కర్‌కు అక్కడి రైల్వేస్టేషన్ వద్ద స్వాగతం పలికారు. అక్కడి మున్సిపల్ స్కూల్లో జరిగిన సభలో ప్రసంగించిన అనంతరం, పట్టణ ప్రజలు, వైశ్య సంఘం అంబేడ్కర్‌కు ఘన సత్కారం చేశాయి. ఆనాటి అంబేడ్కర్ పర్యటనకు గుర్తుగా ఈ ప్రాంతం ‘భీముని గుమ్మం’ అని ప్రాచుర్యం పొందింది. అక్కడి ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును పెట్టి ఈ ప్రాంతీయులు నివాళి అర్పించారు. పర్యటన చివరలో విశాఖ సిటీకి వచ్చి పోర్టులో కార్మికులను కలిశారు. తర్వాత కలెక్టరేట్ వద్ద జరిగిన సభలో మాట్లాడారు. అంబేడ్కర్ ఆంధ్రలో పర్యటించినపుడు ఆయన ప్రసంగాలను నందనారు హరి, రావురి ఏకాంబరం, కుసుమ వెంకటరామయ్య, పాము రామమూర్తి, జొన్నల మోహనరావు తదితరులు పలుచోట్ల తెలుగులోకి అనువదించేవారు. మొత్తం మీద అంబేడ్కర్ పర్యటన తెలుగు నేలను చైతన్యపరచింది. (క్లిక్ చేయండి: సామాజిక బందీల విముక్తి ప్రదాత!) - డాక్టర్ జి. లీలావరప్రసాదరావు అసిస్టెంట్ ఫ్రొఫెసర్, బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం -
Konijeti Rosaiah: మాటల తూటాల అజాత శత్రువు
అరుదైన రాజకీయ నాయకుడు కొణిజేటి రోశయ్య. ఆయన వాగ్ధాటికి అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లేవి. గొప్ప హాస్య చతురతతో పాటూ ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన శైలి. ప్రభుత్వ శాఖలన్నింటిపైనా అపారమైన పట్టు, అవగాహన ఆయనకున్నాయి. వివాదాలకు దూరంగా ఉంటూ, మంచి సలహాదారుగా కూడా వ్యవహరించేవారు. రాజనీతిలో అపర చాణక్యుడు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన చిరునామా. మాటల మాంత్రికుడిగా వినుతికెక్కారు. తన ప్రసంగంతో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేయడమే కాదు, మాటల తూటాలు కూడా పేల్చేవారు. చట్టసభ లోపల, బయట కూడా ఒంటిచేత్తో ప్రతిపక్షాల్ని మాట తూలకుండా ఆటలాడుకునేవారు. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. రోశయ్య ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్జీ రంగా శిష్యులు. నిడుబ్రోలులోని రామానీడు రైతాంగ విద్యాలయంలో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. ఆయన భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు; 1991లో నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు; 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2004, 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్థిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరు పొందారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు పొందారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా, చాలా కాంగ్రెస్ కేబినెట్లలో కీలక మంత్రిగా పని చేయడం సామాన్య విషయం కాదు. తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహించారు. 1995–97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. ప్రతిపక్షంలో ఉంటే నెగటివ్ పాలిటిక్స్ చెయ్యచ్చు. అదే ప్రభుత్వంలో ఉంటే, నిర్మాణాత్మకమైన పాత్రతో పాజిటివ్ పాలిటిక్స్ నడపచ్చు అనేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పధ్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్న తరువాత ఆరోగ్యం సహకరించినప్పుడల్లా సాహితీ, సాంస్కృతిక కార్యాక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై అలరింపజేసేవారు. 2018 ఫిబ్రవరి 11న ఆదివారం నాడు టి. సుబ్బిరామిరెడ్డి లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో కొణిజేటి రోశయ్యను గజ మాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని రోశయ్య అనేవారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందించిన సహకారంతోనే చట్టసభల్లో తగిన గుర్తింపు లభించిందని విన మ్రంగా చెప్పేవారు. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసు కుంటూ.. తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించానని తాను పాల్గొనే కార్యక్రమాలలో ఆత్మ సంతృప్తితో చెప్పేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ కాలంపాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత రోశయ్యదే. కొణిజేటి రోశయ్య అనారోగ్యంతో బాధపడుతూ 2021 డిసెంబర్ 4న హైదరాబాదులో కన్నుమూశారు. ప్రజాజీవితంలో ఆయన ఒక మహోన్నత నేత. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఓ రుషి మాదిరి సేవలందించారు. (క్లిక్ చేయండి: వివక్ష ఉందంటే ఉలుకెందుకు?) - తిరుమలగిరి సురేందర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ (డిసెంబర్ 4న కె. రోశయ్య ప్రథమ వర్ధంతి) -
తెలంగాణ కోసం కలిసి కొట్లాడాం.. ఆత్మీయుణ్ని కోల్పోయా
తెలంగాణ ఉద్యమ కారుడు, కరుడుగట్టిన కాంగ్రెస్‌వాది వెలిచాల జగపతిరావు మన మధ్య నుంచి విశ్రమించడం జీర్ణించుకోలేనిది. జగపతి రావుతో నా అనుబంధం మూడున్నర దశాబ్దాల కింద మొదలై ఆయన తుదిశ్వాస వరకు కొనసాగింది. ఆయన ఏ పదవి చేపట్టినా తన కార్యాచరణ, క్రమశిక్షణతో ఆ కుర్చీకే వన్నె తెచ్చేవారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా, స్వతంత్ర శాసనసభ్యుడిగా సభలో అడుగుపెట్టినా ముఖ్యమంత్రులు, మంత్రులతో ఆయన సాన్ని హిత్యం ఎప్పటికీ మరువలేనిది. నేను 1974లో రాజకీయ ఆరంగేట్రం గావించే కన్నా నాలుగేళ్ల ముందు నుంచే, అంటే 1970లోనే ఆయన ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. ‘గుడి’ గ్రామ సహకార సంఘం చైర్మన్‌గా, గంగాధర సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. చలకుర్తి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేనూ, కరీం నగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర శాసన సభ్యుడిగా జగపతిరావూ 1989లో ఏకకాలంలో అసెంబ్లీలో అడుగుపెట్టాం. కాంగ్రెస్ పార్టీలో జగ పతిరావు సీనియర్ లీడర్‌గా ఉన్నప్పటికీ టికెట్ దక్కని కారణంగా ఇండిపెండెంట్‌గా గెలుపొంది సత్తా చాటుకున్నారు. దాంతో అందరి దృష్టి ఒక్కసారిగా జగపతిరావు మీద పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివక్ష, అవమానం, అణచివేతకు తెలంగాణ ప్రాంతం గురవుతుందనే భావన మాలో రోజు రోజుకూ రూఢీపడ సాగింది. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ స్టేట్‌ను కలిపే ముందు రాసుకున్న ఒప్పందాలు అమలుకు నోచుకోకపోవడంతో జగపతిరావు కోపంతో రగిలి పోయేవారు. పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాలు, అష్ట సూత్రాలు వంటి ఒప్పందాలు అమలు కావాలంటే తెలంగాణ శాసనసభ్యులం అందరం ఒకే వేదిక మీదకు రావాలని నిశ్చయించుకున్నాం. ‘తెలంగాణ శాసన సభ్యుల ఫోరం’ 1991లో ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఫోరం ఏర్పాటులో జగపతిరావు పాత్ర అమోఘం. జువ్వాడి చొక్కారావు, పి. నర్సారెడ్డి, చిట్టెం నర్సిరెడ్డి, ఎమ్. బాగారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఎమ్. నారాయణరెడ్డి, ఎమ్. సత్యనారాయణరావు, ఎన్. ఇంద్రసేనారెడ్డి, సీహెచ్. విద్యాసాగర్‌రావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వంటి భిన్న పార్టీల సభ్యులు తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ఏర్పాటులో కీలక పాత్ర నిర్వహించారు. ఫోరం అధ్యక్షుడిగా నన్ను, కన్వీనర్‌గా జగపతిరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రాంత హక్కులు, రక్షణలు, నీళ్లు నిధులలో వాటాల కోసం శాసనసభ లోపలా, బయటా సమష్టిగా పోరాడాలని తీర్మానించాం. అధికార పార్టీ సభ్యులు మంత్రులుగా ఉంటే మంత్రివర్గ సమావేశాల్లోనూ తెలంగాణ వాటాల గురించి దెబ్బలాడాలని నిర్ణయించి ఆచరణలో చూపెట్టినాం. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా, జగపతిరావు అధికార పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ తెలంగాణ వాటా కోసం రాజీలేని పోరాటం కొనసాగించాం. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో తొలి బడ్జెట్లోనే జగపతిరావుతో కలిసి అసెంబ్లీలో రెండున్నర గంటల పాటు తెలంగాణ గొంతును వినిపించాం. తెలంగాణ శాసనసభ్యుల ఫోరం చేసిన కృషి వల్లనే ప్రత్యేకంగా తెలంగాణ మదర్ డెయిరీ ఏర్పాటు అయింది. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య తొలిదశ తెలంగాణ ఉద్యమం 1969లో విఫలమైన తర్వాత, తెలంగాణవాదం బలహీనపడకుండా చేయడంలో తెలంగాణ శాసన సభ్యుల ఫోరం చేసిన కృషి ఎనలేనిది. నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ శాసనసభ్యులు ఫోరాన్ని కన్వీనర్ జగపతిరావు ముందుండి నడిపించారు. సాగునీటి పంపకంలో తెలంగాణ పట్ల వివక్షను తెలంగాణ శాసనసభ్యుల ఫోరం తీవ్రంగా నిరసించింది. నాడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం తెలంగాణ శాసనసభ్యుల ఫోరం చేసిన పోరాట ఫలితంగానే దేవాదుల, నెట్టెంపాడు, తుపాకుల గూడెం, కల్వకుర్తి ఎత్తిపోతల, శ్రీశైలం ఎడమ కాలువ, కరీంనగర్ వరద కాలువ పథకాలు మొదలైనాయి. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉండగా అనేక మార్లు తెలంగాణ వాటాలో వివక్షపై పీవీకి వివరించి, కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించగలిగాం. నా రాజకీయ అనుబంధం రానునాను జగపతి రావుకు నన్ను అనుంగు మిత్రునిగా మార్చింది. తెలంగాణ సమస్యలపై జగపతిరావు కవిగా, సాహితీవేత్తగా లోతైన అధ్యయనం చేసి తన కవిత్వం ద్వారా, నిరంతర రచనలతో ప్రజల్లో స్ఫూర్తి రగిలించారు. అధికారంలో ఉన్నా, వెలుపల ఉన్నా మాలాంటి వారికి ఎందరికో జగపతిరావు స్ఫూర్తి దాయకం. ఆయన పట్టుదల పలువురికి విస్మయం కలిగించేది. దీర్ఘకాలం ప్రజల మధ్య పాటుపడిన ఒక ఆత్మీయుణ్ణి కోల్పోయిన వెలితి నన్ను బాధిస్తున్నది. జగపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలని కన్నీటితో నివాళులు అర్పిస్తున్నాను. జగపతిరావు ఆశయాలు నెరవేరి, తెలంగాణ నలుదిక్కులా దీప కాంతులు వెదజల్లాలని ఆకాంక్షిస్తున్నాను. (క్లిక్ చేయండి: భారత్ జోడో పాదయాత్రతో కొత్త ఉత్సాహం) - కుందూరు జానారెడ్డి మాజీ మంత్రివర్యులు -
Mandali Venkata Krishna Rao: దివిసీమ గాంధీ
మండలి వెంకట కృష్ణారావు అవనిగడ్డ నుంచి 1972లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. రాజకీయ విలువల్లో, భాషా భిమానంలో ఆయనకు వారసులు – మాజీ రాష్ట్రమంత్రి మండలి బుద్ధప్రసాద్. కృష్ణారావు 1926 ఆగస్టు 4న కైకలూరు మండలం పల్లెవాడలో జన్మించారు. వీరి స్వస్థలం నాగాయలంక మండలంలోని భావదేవరపల్లి. మండలి కృషి వల్లే దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూము లను పంచే కార్యక్రమం ప్రారంభమైంది. 15 వేల ఎకరాల భూములను పేదలకు పంచారు. 1974లో ఆయన విద్యా, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1975 రాక్షస నామ సంవత్సర ఉగాది నాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్వహణ కమిటీకి మండలి కార్యనిర్వాహక అధ్యక్షునిగా వ్యవహరించారు. ‘అంతర్జాతీయ తెలుగు కేంద్రం’ సంస్థను 1975లో నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ ప్రారంభించారు. మండలి ఈ సంస్థకు ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించారు. (చదవండి: ప్రగతిశీల వైద్య శిఖామణి) ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షులుగా, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించిన మండలి కృషిని గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు. దివిసీమలోని పులిగడ్డ – పెనుమూడి వంతెనకు మండలి పేరు పెట్టారు. ‘దివిసీమ గాంధీ’గా ప్రజల మన్ననలు అందుకున్న మండలి 1997 సెప్టెంబర్ 27న మరణించారు. ‘బాధలలో ఉన్న వారిని మనమే వెళ్లి ఓదార్చాలని’ వారు ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి. (చదవండి: మనువును జయించిన విశ్వనరుడు) – డా. జె. వి. ప్రమోద్ కుమార్, పైడిమెట్ట (సెప్టెంబర్ 27న మండలి వెంకట కృష్ణారావు 25వ వర్ధంతి) -
Kommareddy Raja Mohan Rao: ప్రగతిశీల వైద్య శిఖామణి
మానవతావాది, పూర్వ ఉపకులపతి, ప్రజా వైద్యులు, అభ్యుదయవాదిగా 86 సంవత్సరాల జీవితాన్ని గడిపిన డాక్టర్ కొమ్మారెడ్డి రాజా రామమోహన్ రావు పశ్చిమగోదావరి జిల్లా పోతునూరులో 1922లో జన్మించారు. 1951 నుండి 1980 వరకు గడిపిన వైద్యరంగ జీవితం చిరస్మరణీయం. సింగరేణి కాలరీస్ వైద్యాధికారిగా 200 పడకల ఆసుపత్రిని నిర్మించి సింగరేణి కాలరీలో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికులకు ఆధునిక వైద్యాన్ని అందించారు. సింగరేణి బొగ్గు గనుల చుట్టుపక్కల గ్రామాలను దత్తత తీసుకొని ఉచిత వైద్యాన్ని అందించారు. గుంటూరు మెడికల్ కాలేజీ, సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఆయా కళాశాలల అభివృద్ధికి పునాదులు వేశారు. 1982–86 మధ్య ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా విద్యా రంగంలో పలు మార్పులు, సవరణలకు కారకులయ్యారు. దేశంలో ప్రప్రధమంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ‘శాస్త్రీయ సోషలిజం అధ్యయన కేంద్రా’న్ని నెలకొల్పిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే ‘మహాయాన బౌద్ధ కేంద్రం’ కూడా ఆయన పదవీ కాలంలోనే నెలకొల్పబడింది. సర్జన్స్ అంతర్జాతీయ కాలేజ్, ఇంటర్నేషనల్ మెడికల్ స్టడీస్ అకాడమీ, భారత సర్జన్ల సంఘం, భారత యూరోలాజికల్ సొసైటీ, ఇండి యన్ మెడికల్ అసోసియేషన్, జెనీటో– యూరినరీ సర్జరీ(అమెరికా) శిక్షణాబోర్డు తదితర సంఘాలలో అనేక బాధ్యతలు నిర్వహించారు. ఇంగ్లండ్, అమెరికా, జపాన్ తదితర చోట్ల జరిగిన వైద్య సభలకు హాజరయ్యారు. అటు వైద్యరంగానికీ, ఇటు విద్యారంగ వ్యాప్తికీ రామమోహన్ రావు చేసిన కృషికి అనేక అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. 1984లో యార్లగడ్డ రాజ్యలక్ష్మి, వెంకన్న చౌదరి కళాపీఠం తరఫున జాతీయ అవార్డు లభించింది. సామాజిక, వైద్య సేవ రంగాలలో ఆయన చేసిన కృషికిగాను 1992లో ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్ బీసీ రాయ్ అవార్డును పొందారు. శాస్త్రవిజ్ఞానాన్ని గ్రామ సీమలకు చేర్చాలన్న లక్ష్యంతో ‘జన విజ్ఞాన వేదిక’ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. వీరి నిరాడంబర జీవితం, సరళ స్వభావం, సేవా తత్పరత, ఆపన్నుల పట్ల ఆదరణ, ప్రగతి శీల ఉద్యమాల పట్ల ఆయనకున్న నిబద్ధత వలన ఒకానొక సందర్భంలో భారత రాష్ట్రపతి పదవికి వామపక్ష అభ్యర్థిగా ఆయన పేరును పరిశీలించిన సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. రాజా రామమోహన్ రావు తండ్రి కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి 1937 లోనే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జరిపిన రైతు రక్షణ యాత్ర చారిత్రాత్మకం. జీవితాన్ని స్వార్థం కొరకు కాక లోకహితం కొరకు ధారపొయ్యాలన్న తండ్రి మాటను శిరోధార్యంగా తీసు కున్నారు రామమోహనరావు. ఆయన ఆశయాలను మనమూ కొనసాగిద్దాం. – వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, జనచైతన్య వేదిక, ఏపీ అధ్యక్షులు (సెప్టెంబర్ 25న కొమ్మారెడ్డి శత జయంతి సందర్భంగా గుంటూరు, వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సెమినార్ జరుగనుంది) -
Gurram Jashuva: మనువును జయించిన విశ్వనరుడు
‘‘కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి / పంజరాన గట్టువడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను’’ అంటూ విశ్వమానవతను ప్రకటించాడు తన కవిత్వం ద్వారా జాషువా మహాకవి. తాను నమ్మిన విలువల్ని, సిద్ధాంతాల్ని తన రచనల ద్వారా నిక్కచ్చిగా ప్రకటించాడు. తన సాహితీ ప్రస్థానంలో సామాజికంగా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా వెనుదిరగలేదు. కులమతాల దాడులకు వెరవక తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. ‘పలుకాకుల మూకలు అసూయ చేత నన్ను ఏవిధంగా దూషించిన నా సాహితీ సౌరభం మాయమై పోద’నీ, ‘నన్ను వరించిన శారద లేచి పోవునే’ అని అన్నాడు. ‘ప్రపంచం ఎట్లా నిర్ణయించిన నాకు కొదవలేదు నేను విశ్వనరుడను’ అని ప్రకటించాడు. కసరి బుసగొడుతున్న నాగరాజుల వైపు కవితా దివిటీలను విసిరాడు. కేవలం విశ్వమానవతను ప్రకటించడమే కాకుండా తన కవితా ప్రస్థానమంతటా జాగరూకుడై కవిత్వమై ప్రతి స్పందించాడు. జాతీయోద్యమ కాలంలో జాతి జనుల్లో భారతమాత గొప్పతనాన్ని చాటి చెప్పే అనేక విషయాలను తన కవిత్వంలో పొందుపరచాడు. సింధు గంగా నదులు జీవజల క్షీరాన్ని నిరంతరాయంగా ప్రవహింపజేస్తూ తమ సంతానాన్ని పోషించుకుంటున్నదని పచ్చి బాలింతరాలుగా కన్న దేశాన్ని కీర్తించాడు. తద్వారా ప్రజల్లో దేశభక్తిని పాదుకొల్పాడు. దేశాన్ని గతంలో పాలించిన రాజుల వైభవాన్నీ, తాత్విక మార్గదర్శకులుగా ఉండిన మహనీయుల గురించీ, విశ్వవిఖ్యాతి చెందిన వారి ఘనతను గురించీ ప్రజలకు కనువిప్పు కలిగించే విధంగా, జాతీయభావాలు ఉప్పొంగేలా కవిత్వం రాసిన పద్యాల పరుసవేది జాషువా. బుద్ధుని తాత్విక చింతనలోని సారాంశాన్ని వర్ణిస్తూ... ‘రెండు వేల ఐదువందల ఏళ్ళు గడిచినా నీ కమనీయ బోధలకు నిగ్గు రవ్వంత కూడ తగ్గలేదు’ అంటాడు. అశోకుని వంటి మహా చక్రవర్తుల గుండెలను సైతం బౌద్ధం పెళ్ళగించి అహింసా సిద్ధాంతం వైపు మళ్ళించిందని పేర్కొన్నాడు. మరో సందర్భంలో భారతీయ సంస్కృతీ ఔన్నత్యాన్ని విశ్వసభల్లో చాటిన మహనీయుడు స్వామి వివేకానంద గొప్పదనం గురించి ‘వివేకానంద’ అనే ఖండికలో వివరించాడు. పేదరికం, అవమానాలతో కుంగిపోక ధీరోదాత్తునిలా ఎదుర్కొని విశ్వనరుడి స్థాయికి ఎదిగాడు. నవయుగ కవి చక్రవర్తిగా కీర్తినొందాడు. తెలుగుదనాన్ని తన పద్యంలో జాలువార్చి స్వచ్ఛమైన తెలుగుభాషకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. అటు సంప్రదాయ సాహిత్య సంస్కారాన్నీ, ఇటు ఆధుని కతనూ మేళవించి తన సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిం చాడు. కావుననే జాషువా పద్యం జానపదుల నాలుకలపై జీవించి వుంది. ఇంతటి ప్రాచుర్యం పొందిన కవి తెలుగు భాషలో అరుదని చెప్పొచ్చు. జాషువా సాహిత్యంలో భారత పురాణ పురుషులే గాక, ప్రపంచ శాంతికి సత్యం, అహింస వంటి ఆయుధాలను అందించిన గౌతమ బుద్ధుడు, అహింసామూర్తి గాంధీ, సామాజిక తత్వవేత్త అంబేడ్కర్ వంటి మహానీయులు అందరూ దర్శనమిస్తారు. బుద్ధుని బోధనల్లోని అహింసా తత్వాన్నీ, విశ్వమానవ ప్రేమనూ, ఏసుక్రీస్తు బోధనల్లోని శాంతి, కరుణ, సత్యం, సౌశీల్యాన్నీ ఆయన ప్రజల్లో దేశభక్తిని పాదుకొల్పేవిగా పేర్కొన్నాడు. ఆయన దృష్టిలో జాతీయత అంటే అన్ని మతాలు సహనంతో కలగలసి జీవించడం. ఏసుక్రీస్తు చెప్పినట్లు ‘నీవలే నీ పొరుగువారిని ప్రేమించడం’. సామాజిక సమానత, సంక్షేమం కోసం కవిత్వం రాశాడు. ‘కాందిశీకుడు’ రచనలో ‘కపాలం’ ద్వారా మాట్లాడుతూ సమాజంలోని అసమానతలు తొలగిపోయి విశ్వ సమానతా భావం, విశ్వ సోదరభావం పెంపొందినపుడే జాతీ యతా భావం ఆవిర్భావం జరుగుతుందని చెబుతాడు. నా జాతి నాయూరు నాదేశమని పొంగు స్వాభీ మానము శూన్యమయిన దాక విశ్వసౌభ్రాత్రంబు వెలయించునైక్య సం ఘావ్యాప్తిదిశల పెంపారు దాక... అంటాడు. మహాత్ముడి అకాల మరణానికి దిగ్భ్రాంతికి గురయిన జాషువా ‘బాపూజీ’ లఘు కావ్యాన్ని రచించాడు. గాంధీజీ అహింసా సిద్ధాంతాల పట్ల అత్యంత ప్రేమాదరణను కన బరచిన ఆయన ఈ కావ్యానికి ముందు మాటగా ‘వినతి’ని రాస్తూ ‘ప్రపంచ చరిత్రలో నెట్టివాడు నీయుగమున గడింపని కీర్తి నతడార్జించి, అనుంగు బిడ్డలగు భారతీయుల కంకిత మొనర్చినాడు. ప్రతిఫలముగా తనకు లభించినది బలవన్మరణము. భస్మస్వరూపము. అది తలంపరాని విషమ ఘడియ’. ‘నాడు రాలిన యశ్రు కణములే ఈ కావ్యము’ అంటాడు. బాపూజీ కావ్యంలో జాషువా హృదిలో ముద్రించుకున్న చిత్రం దృశ్యమానంగా కళ్ళకు కట్టి కనిపిస్తుంది. అహింసావాదిగా కరుణా మూర్తిగా, సంఘ సంస్కర్తగా, హిందూ ముస్లిం సమైక్యతావాదిగా గాంధీజీని చిత్రించాడు. గోచిపాత గట్టుకొని జాతి మానంబు నిలిపినట్టి ఖదరు నేతగాడు విశ్వసామరస్య విజ్ఞాన సంధాత కామిత ప్రదాత గాంధితాత’’ అంటాడు. గాంధీ సైద్ధాంతిక నిష్టను, నైతికతను మనఃపూర్వకంగా ఒప్పు కున్నాడు. ఆచరింప దగినవిగా భావించాడు. ఈ నేపథ్యంలో ఆయన ‘నివసించుటకొక నిలయము తప్ప గడన చేయుటకు ఆశపడను’ అన్నాడు. ‘ఆలు బిడ్డలకు ఆస్తి పాస్తులు గూర్చ పెడత్రోవలో కాలు పెట్టను’ అన్నాడు. ఈ నైతిక, సామాజిక నిష్ఠను గాంధీజీ దృక్పథం నుండి జాషువా గ్రహించాడు. ఆయన దృష్టిలో దేశభక్తి, విశ్వమానవత ప్రాధాన్యాలు. నిత్యం అనేక సామాజిక అవరోధాలను ఎదుర్కొన్నా, తాను మాత్రం జాతీయతా దృక్పథంతోనూ, విశ్వమానవ తత్పరతతోనూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు. మహాకవి దృష్టిలో దేశభక్తీ, విశ్వమానవతా రెండూ నాణేనికి రెండు వైపుల వంటివి. జీవించినంత కాలం ఈ సైద్ధాంతిక భూమికకు కట్టుబడే పనిచేశాడు. కాబట్టే బుద్ధుడు, మహాత్ముడు తనకు ఆరాధ్యులుగా భావించాడు. - డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏపీ ప్రభుత్వ విప్, మాజీమంత్రి (జాషువా జయంతి వారోత్సవాలు నేటి నుంచి ఈ నెల 28 వరకు గుంటూరులో జరుగుతున్న సందర్భంగా) -
Cartoonist Mohan: బొమ్మలు చెక్కిన శిల్పం
బొమ్మలు కూడా మాట్లాడతాయి. మాట్లాడ్డమే కాదు జనం తరఫున పోట్లాడతాయి. కత్తులు దూస్తూ ముందుకు ఉరుకుతాయి. కదం తొక్కుతూ పరుగులు తీస్తాయి. రాజుగారి దురహంకారాన్ని ఎడంకాలితో తన్ని పారేస్తాయి. అయితే అన్ని బొమ్మలూ అలా చేయవు. బొమ్మకు ప్రాణం పోసే చేయిని బట్టి, ఆ చేతిని కదిపే కళాకారుడి మనసును బట్టి, ఆ మనసులో రెపరెపలాడే ఎర్ర జెండా పొగరును బట్టి బొమ్మలు కాలర్లు ఎగరేస్తాయి. అలాంటి బొమ్మల తాలూకు ఓనర్లలో ముఖ్యులు ఆర్టిస్ట్ మోహన్. తాడి మోహన్ రావు అంటే ఎవ్వరికీ తెలీకపోవచ్చు. కానీ కార్టూనిస్ట్ మోహన్ అంటే మాత్రం తెలీని వాళ్లు ఉండరు. మోహన్ అంటే సకల కళా వల్లభుడు. కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు, కేరికేచర్లు, కవర్ పేజీ బొమ్మలు, ఉద్యమాలకు కదం తొక్కండర్రా అని కుర్రకారు గుండెల్లో పౌరుషాగ్ని రగిలించే పోస్టర్లు, రాజ్యాధి కారపు దురహంకారాన్ని కాలరు పట్టు కుని నిలదీసి తిరుగుబాటు చేసే జెండా లపై బొమ్మలు, బిగించిన పిడికిళ్లు, కస్సుమని దూసుకుపోయే కొడవళ్లు, యుద్ధభూమికి కదం తొక్కించే లాంగ్ మార్చ్ కాన్వాస్‌లు! మోహన్ అంటే యుద్ధం. అధర్మంపై అన్యాయంపై చిరు నవ్వుతోనే కత్తులు దూసే యుద్ధమే మోహన్! ఎక్కడో ఏలూరులో పుట్టి, అక్కడెక్కడో పశ్చిమబెంగాల్లో జ్ఞానానికి సానపట్టి, విజయవాడ ‘విశాలాంధ్ర’ మీదుగా హైదరాబాద్‌కు తరలి అదే రాజధానిగా కళాకారుల సామ్రా జ్యాన్ని స్థాపించాడు మోహన్. తెలుగునాట పొలిటికల్ కార్టూన్ అంటే ఇలా ఉండాలిరా నాయనా అన్నట్లు వందల వేల కార్టూన్లతో రాజకీయ నేతల గుండెల్లో అణుబాంబులు పేల్చిన ఉగ్రవాది మోహన్. ఎంత పెద్ద నాయకుడైనా సరే భయం లేదు. ఎంత దుర్మార్గపు నాయకుడైనా సరే ఖాతరే లేదు. తిట్టాలనుకుంటే తిట్టేయడమే. కోపం పెద్దదైతే లాగి లెంప కాయలు కొట్టేయడమే. ఎన్టీఆర్ నుండి నేటి కేసీయార్ వరకు మోహన్ కార్టూన్ బారిన పడని నేత లేరు. మోహన్ తండ్రి తాడి అప్పలస్వామి కమ్యూనిస్టు నాయ కులు. నాన్న నీడలో మండుటెండపు ఉద్యమాలు మోహన్ లోని కళాకారుడికి చిన్నప్పుడే ఓ కర్తవ్య బోధ చేసేశాయి. అదే 5 దశాబ్దాల పాటు తెలుగు నాట ఉద్యమ పోస్టర్లపైనా, తిరుగుబాటు జెండాలపైనా పిడికిళ్లు బిగించిన యోధుల విప్లవ నినాదాలు, కసి ఎక్కిన కొడవళ్ల బెదిరింపులు వగైరాల ఎర్రెర్రటి బొమ్మల రూపంలో మోహన్ సంతకం మెరుస్తూనే ఉంది. (క్లిక్: ఆ రాచరికంలో ఎందుకింత ఆకర్షణ?) ప్రభువెక్కిన పల్లకీలు మోసి, వారి అంతఃపుర రాణుల అందాలు పొగిడి వారిచ్చే చిల్లర బహుమతులు మూట కట్టుకుని మురిసిపోయే కళాకారులు కాలగర్భంలో కలిసి పోతారు. ఎవరికీ గుర్తుకు కూడా రారు. పల్లకి నెక్కిన ప్రభువును కాలర్ పట్టుకుని నీ రాజ్యం చాలా అన్యాయంగా ఉంది గురూ అని అనగలిగిన వాడే నిఖార్సయిన వీరుడు. అసలు సిసలు యోధుడు. అలాంటి వారినే తరతరాలుగా జనం గుర్తు పెట్టుకుంటారు. గుర్తుపెట్టు కోవడమేం ఖర్మ గుండెల్లో గుడి కట్టేసి ఆ గుడిలో ఏనిమేషన్ సినిమాలతో పూజలు చేసేస్తారు. అటువంటి అరుదైన యోధుడూ, కళాకారుడూ మన మోహన్! – సీఎన్ఎస్ యాజులు (సెప్టెంబర్ 21న చిత్రకారుడు మోహన్ వర్ధంతి) -
Yelavarthy Nayudamma: అసమాన ప్రతిభావంతుడు
భారత తోళ్ల పరిశ్రమకు నిరుపమాన సేవలందించినవారు డాక్టర్ యలవర్తి నాయుడమ్మ. గుంటూరు జిల్లా యలవర్రు గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో 1922 సెప్టెంబరు 10న జన్మించారు. భారత్‌లో విద్యాభ్యాసం అనంతరం అమెరికా చర్మ శుద్ధి పరిశ్రమలో అఖండ పరిశోధనలు చేసి, అద్భుత విజయాలను సాధించారు. తిరిగి మాతృ దేశానికి వచ్చి, తాను చదువుకున్న సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూ ట్లో చేరి చివరకు దాని డైరెక్టర్ అయ్యారు. నాయుడమ్మ ఖనిజాలు, మొక్కలు, ఆల్డీ హైడ్స్ వంటి వాటి కలయిక, నిర్మాణశైలిపై కూడా విశేష పరిశోధనలు చేశారు. ఇవన్నీ తోళ్లను పదును చేసే వినూత్న ఏజంట్స్‌గా వివరించి, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. అనేక పరిశోధనలలో అగ్రగామిగా భాసిల్లారు. నాయుడమ్మ పరిశోధనా కృషి ఫలితంగా మన దేశపు చర్మంతో తయారైన వస్తువులకు విదేశాలలో విశేషమైన ఆదరణ, గిరాకీ ఏర్పడ్డాయి. అలీన దేశాలకు, ఇతర దేశాలకు మధ్య స్నేహవారధిగా నాయుడమ్మ ప్రఖ్యాతి గాంచారు. నూతన లేబరేటరీలకు ప్రణాళికలు రచించి, స్వయంగా రూపకల్పన చేసి, స్థాపింప జేశారు. అత్యాధునిక శైలిలో తోళ్ళ పదునుకు, శుద్ధికి పైలట్ ప్లాంట్లను దేశ స్థాయిలో తొలిసారిగా నెలకొల్పడానికి దోహదపడ్డారు. ‘లెదర్ సైన్స్’ మాస పత్రికకు చాలాకాలం సంపాదకులుగా ఉన్నారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్–ఛాన్స్ లర్గా (1981–1982), భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా పనిచేసి పేరుప్రఖ్యాతులు పొందారు. ఐక్యరాజ్య సమితి సలహాదారుగా పలు ఆఫ్రికా దేశాలలో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన నాయుడమ్మ దేశానికి, మరీ ముఖ్యంగా తెలుగు జాతికీ ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టారు. పద్మశ్రీ సహా అనేక పురస్కారాలు పొందారు. 1986 నుండి ఆయన పేరుమీద నెలకొల్పిన అవార్డును సైన్స్, టెక్నాలజీ రంగాలలో అపూర్వ ప్రతిభను చూపిన వారికి ఏటా అందిస్తున్నారు. – డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్, తెలుగు లెక్చరర్, తెనాలి (శాస్త్రవేత్త నాయుడమ్మ శతజయంతి) -
YSR: అఖిల భారతావనికి అడుగుజాడ
వ్యక్తిత్వాన్ని రాజకీయాలకు బలిపెట్టని నాయకుడు వైఎస్సార్. నవ్వులో స్వచ్ఛత, పిలుపులో ఆత్మీయత ఉట్టిపడేవి. మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుద్ధం. మాట తప్పని, మడమ తిప్పని ఆయన గుణమే ప్రజల కోసం ఎంతదూరమైనా వెళ్లేటట్టు చేసింది. ఆత్మహత్య తప్ప గత్యంతరం లేని స్థితిలో ఉన్న రైతాంగానికి జీవశక్తిని అందించారు. వ్యవసాయ పునరుజ్జీవనానికి బాటలు పరిచారు. నిరుపేదలకు సైతం కార్పొరేట్ వైద్యం దక్కేలా చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో నిరుపేద పిల్లలకు సైతం ఉన్నత చదువులు అందుబాటులోకి తెచ్చారు. అధోగతిలో ఉన్న సహకార వ్యవస్థను ఆదుకున్నారు. పల్లెలు మళ్లీ కళకళలాడేలా చేశారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన మహోన్నత నాయకుడు వైఎస్సార్. కపటం లేని ఆ మందహాసం... సరిగ్గా పదమూడేళ్ల క్రితం, 2009 సెప్టెంబరు రెండో తేదీన యావత్ తెలుగు ప్రజానీకం పడిన ఆందోళన ఇంకా గుండెల్లో పచ్చిగానే ఉంది. కార్చిన కన్నీటి తడి ఇంకా చెమ్మగానే ఉంది. ఆ విషాద ఘడియల్లో దేశ వ్యాప్తంగా మీడియాలో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం ‘వైఎస్సార్’. ఆ పేరు ఇక ముందు కూడా వినబడు తూనే ఉంటుంది కానీ, ఆ రూపం సజీవంగా కనబడే అవకాశమే లేదు కదా. ఒక వ్యక్తి గుణ గణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసు కునేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖర రెడ్డిగారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది. ‘రాజశేఖరా! నీపై మోజు తీరలేదురా!’ అని తెలుగు ప్రజానీకం రెండో పర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీ నిండగానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం. ‘రాజసాన ఏలరా!’ అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం. అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి. మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్ అరవై ఏళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది, ఆయన పథకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం. 1978 నుంచి ఒక జర్నలిస్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. విలేఖరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా ఉండేది. బిగుసుకుపోయినట్టు ఉండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుద్ధం. నవ్వులో స్వచ్ఛత, పిలుపులో అత్మీయత ఉట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం ఎంత దూరమైనా వెళ్ళడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్నా కీడే ఎక్కువగా జరిగిన సందర్భాలున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్‌కు రాష్త్రవ్యాప్తంగా అభిమానులను తయారుచేసి పెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరఫున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది. 1975లో నేను రేడియో విలేఖరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి తొలిసారి శాసనసభకు ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళిన వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది. వైఎస్సార్‌ను నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లో సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటీ హాస్పిటల్) టెర్రేస్ మీద. సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భమది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించేవారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్. ఇటు హైదరాబాదు లోనూ, అటు ఢిల్లీ లోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిస్టులతో కళకళ లాడుతూ ఉండేవి. వేళాపాళాతో నిమిత్తం లేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు ఉండేది. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిస్టు స్నేహితులు ఆయనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉండడం సహజమే. 2004లో ఆయన తొలిసారి సీఎం కాగానే, ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొద్దిగా ఇబ్బందే. అయినా, ఆయన నా మాట మన్నించి, నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్‌లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టూడియోకు వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక విలేఖరికీ, ఒక రాజకీయ నాయకుడికీ నడుమ సహజంగా ఉండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పెన వేసుకున్న ఈ బంధం శాశ్వతంగా తెగిపోయిందే అన్న బాధతో, ఆ మహోన్నత వ్యక్తిత్వానికి నివాళి అర్పిస్తూ, ‘రెండు కన్నీటి బొట్లు’ రాల్చడం మినహా ఏమీ చేయలేని చేతకానితనం నాది. - భండారు శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ సంక్షేమానికి చెదరని చిరునామా నాలుగేళ్లక్రితం చెన్నై వెళ్లినప్పుడు మా బంధువొకాయన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఒక ప్రశ్న వేశారు. ‘వైఎస్‌కు ముందు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన నేతలు న్నారు కదా, కానీ ఆ పథకాలు ప్రస్తావనకు వచ్చి నప్పుడు వైఎస్‌నే అందరూ ఎందుకు గుర్తు చేసు కుంటార’న్నది ఆ ప్రశ్న సారాంశం. నిజమే... ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి నిరుపేదలకు సైతం రోజూ గుక్కెడు బువ్వ అందుబాటులోకి వచ్చేలా చేశారు. అంతకు చాన్నాళ్ల ముందే ‘గరీబీ హఠావో’ అంటూ ఇందిరాగాంధీ కూడా ఎన్నో పథకాలు తెచ్చారు. తమిళనాట అధికారంలోకి రాగానే నిరుపేదలకు కలర్ టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు పంచిపెట్టిన ప్రభుత్వాలున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే పోటీలుపడి ఇలాంటి వాగ్దానాలు చేసేవి. అయితే వైఎస్ తీరు వేరు. ఆయన అమలు చేసిన పథకాల ఒరవడే వేరు. ఆ పథకాలు జనసంక్షేమానికి అసలు సిసలైన నిర్వచనంగా నిలిచాయి. అందుకు కారణముంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ దిగే సమ యానికి రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా నిస్తేజం అలుముకుంది. అప్పటికి ఏడెనిమిదేళ్ల క్రితం వచ్చిపడిన ఉదారవాద ఆర్థిక విధానాల పర్యవసానంగా సమస్త చేతివృత్తులూ దెబ్బతిన్నాయి. వరస కరవులతో, అకాల వర్షాలతో రైతాంగం అల్లాడు తోంది. అప్పుల ఊబిలో దిగబడి ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదనుకుంటోంది. అప్పటికే ఉన్న ధనిక, పేద; పట్టణ, గ్రామీణ అంతరాలు మరింత పెరిగాయి. కొనుక్కునే స్థోమత ఉంటే తప్ప నాణ్యమైన చదువుకు దిక్కు లేకుండా పోయింది. రోగం వచ్చి ఆసుపత్రులకు వెళ్లినవారికి యూజర్ ఛార్జీల బాదుడు మొదలైంది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారయావతో ఇతర సీఎంల కన్నా అత్యుత్సాహంగా సంస్కరణలు అమలు చేయడం వల్ల ఏపీ మరింత దుర్భరంగా మారిందేమో గానీ దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ‘ఏదీ వూరికే రాద’ని పాలకులు ఉపన్యాసాలు దంచే పాడుకాలమది. నేలవిడిచి సాముచేసే నాయకులను తమ ముఖపత్రాలపై అచ్చోసే అంతర్జాతీయ పత్రికలకు అప్పుడు కొదవలేదు. సరిగ్గా ఆ సమ యంలో వైఎస్సార్ పాద యాత్ర నిర్వహించి ప్రజల దుర్భర స్థితిగతులను దగ్గర నుంచి చూశారు. 1,400 కిలోమీటర్ల పొడ వునా సామాన్యుల గుండె ఘోషను అతిదగ్గర నుంచి వినగలిగారు. వీరందరి జీవితాల మెరుగుదలకు ఏం చేయగలమన్న మథనం ఆయనలో ఆనాడే మొదలైంది. తర్వాత కాలంలో ఆయనే చెప్పుకున్నట్టు ఆ పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది. రాగల అయిదేళ్లకూ పాలనా ప్రణాళికను నిర్దేశించింది. వ్యక్తిగా కూడా ఆయనను ఆ పాదయాత్ర ఎంతో మార్చింది. రాయలసీమ ప్రాంత నేతగా సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యంపై ఆయనకు మొదటి నుంచీ అవగాహన ఉంది. కానీ అది ‘జలయజ్ఞం’గా రూపుదిద్దుకున్నది జనం మధ్యనే! అన్ని ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలన్న ఆ లక్ష్యం వేల కోట్ల వ్యయంతో ముడిపడి ఉంటుంది గనుక అది అసాధ్యమనుకున్నారంతా! కానీ భర్తృహరి చెప్పినట్టు ఎన్ని అడ్డంకులెదురైనా వెరవక తుదికంటా శ్రమించడమే కార్యసాధకుల నైజమని వైఎస్ భావించారు. ఈ అనితర సాధ్యమైన ప్రయత్నానికి సమాంతరంగా ఉచిత విద్యుత్ జీవోపై తొలి సంతకం చేసి అన్నివిధాలా చితికిపోయి ఉన్న రైతాంగానికి తక్షణ జీవశక్తిని అందించారు. బాబు పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయాన్ని మళ్లీ పట్టాలెక్కించి, దాని పునరుజ్జీవానికి బాటలు పరిచారు. అంతేకాదు... అంతవరకూ ఆకాశపు దారుల్లో హడావిడిగా పోయే ఆరోగ్య సిరిని భూమార్గం పట్టించి నిరుపేదలకు సైతం ఖరీదైన కార్పొరేట్ వైద్యం దక్కేలా చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో నిరుపేద వర్గాల పిల్లలకు సైతం ఉన్నత చదువులు అందుబాటులోకి తెచ్చారు. అధోగతిలో ఉన్న సహకార వ్యవస్థను ఆదుకున్నారు. పల్లెలు మళ్లీ కళకళలాడేలా చేశారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభి వృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన సాహసిగా, తనకు తెలిసినవారైనా కాకున్నా, తన పార్టీవారు అయినా కాకున్నా సాయం కోరివచ్చిన వారందరి పట్లా ఒకేలా స్పందించిన సహృదయుడిగా వైఎస్ చిరస్థాయిగా నిలుస్తారు. పీవీ హయాంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసి, ఆర్థిక సంస్కరణలను అమలు చేసిన ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి నేతను దేశవ్యాప్త రైతాంగానికి రుణమాఫీ తక్షణావసరమని ఒప్పించడంలో వైఎస్ రాజశేఖరరెడ్డిది కీలకపాత్ర. ఇలాంటి నాయకుడు సంక్షేమానికి శాశ్వత చిరునామా కావడంలో, ఆ విషయంలో అఖిల భారతావనికి అడుగుజాడ కావడంలో ఆశ్చర్యమేముంది? -టి. వేణుగోపాలరావు సీనియర్ పాత్రికేయులు -
Telugu Language Day: భాషా భేషజాలపై పిడుగు!
మహనీయులు ఈ లోకంలో గొప్ప కార్యాన్ని సాధించడం కోసమే పుడతారు. అలాంటి వారినే ‘కారణ జన్ములు’ అంటారు. గిడుగు ఆ కోవలోకే వస్తారు. తన జీవితాన్ని భాషా ఉద్యమాల కోసం వెచ్చించిన కార్యశూరుడు గిడుగు. ఆయన తొలి తెలుగు ఆధునిక భాషావేత్త, అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్త కూడా. 1863 ఆగస్టు 29వ తేదీన శ్రీముఖలింగం సమీపాన పర్వతాలపేట గ్రామంలో గిడుగు జన్మించారు. విజయనగరం మహారాజా వారి కళాశాలలో లోయర్ ఫోర్తు ఫారంలో చేరారు. అదే తరగతిలో గురజాడ అప్పారావుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే జీవితాంతం మంచి స్నేహితులుగా ఇద్దరూ కలసి మెలిగారు. ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1889లో సవరజాతి వారితో గిడుగుకు పరిచయం ఏర్పడింది. సవరుల చరిత్ర, సంస్కృతి, భాష మీద గిడుగుకు అమితమైన ఆసక్తి కలిగింది. అందువల్ల సవరల భాషపై ప్రత్యేకంగా విశేషమైన కృషి చేశారు. 1893 జనవరి 15వ తేదీన గిడుగు శ్రీముఖలింగ క్షేత్రానికి వెళ్ళారు. 22 శాసనాల్ని నిశితంగా పరిశోధించారు. ప్రభుత్వం కూడా గిడుగు శాసన పరిశోధనలను గుర్తించింది. 1894లో గిడుగు ‘వయోజన విద్య’ను ప్రారంభించారు. ఉద్యోగ విరమణ తర్వాత ఎక్కువగా భాషా సాహిత్యాల పరిశోధన వైపు మళ్లారు. గిడుగు పెద్ద కొడుకు సీతాపతి ఆయనకు సహాయ సహకారాలు అందించారు. గిడుగు వారికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. తాపీ ధర్మారావు, చిలుకూరి నారాయణరావు లాంటివారు ఆయన శిష్యులే. 1910 తర్వాత గిడుగు పూర్తిగా భాషాపరిశోధనలో నిమగ్నమయ్యారు. 1911లో సవర భాషపై అనితర సాధ్యమైన, విశేషమైన కృషిచేసినందుకుగాను ఆయనకు ప్రభుత్వం ‘మెరిట్ సర్టిఫికెట్’ బహూకరించింది. వ్యావహారిక భాషోద్యమానికి గిడుగు సారథ్యం వహించారు. ఊరూరా సభలు, సమావేశాలు జరిపించి ప్రజల్లో చైతన్యం కలుగజేశారు. అందరి తోనూ చర్చలు జరిపారు. 1916లో కొవ్వూరులో గిడుగు ఉపన్యాసాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు విని ప్రభావితులయ్యారు. గిడుగు ఆ విషయం తెలుసుకొని కందు కూరిని కలిశారు. ఇద్దరూ 1919లో ‘తెలుగు’ పేరుతో పత్రికను స్థాపించారు. తన భావాలను, ఆలోచనలను, ఈ పత్రికలో ముద్రిం చారు గిడుగు. గ్రాంథిక వాదుల ఆక్షేపణలన్నింటినీ, ఈ పత్రిక తూర్పారబట్టింది. ‘ఆంధ్ర పండిత, భిషక్కుల భాషా భేషజం’, ‘బాలకవి శరణ్యం’ వంటి గ్రంథాలను మొదటిసారిగా ఈ పత్రిక ద్వారానే వెలువరించారు. గిడుగు మొత్తం పరిశోధన అంతా భాషాతత్త్వంపైనే జరిగింది. ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో లోతుగా చర్చించారు. గిడుగు చేసిన భాషాసేవకు గుర్తింపుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైందిగా భావించిన ‘‘కైజర్–ఇ– హింద్’’ అనే బంగారు పతకాన్ని 1933 జనవరిలో ప్రభుత్వం బహూకరించింది. గిడుగు వ్యావహారిక భాషోద్యమం ఫలితంగా 1933లో ‘నవ్య సాహిత్య పరిషత్తు’ ఏర్పడింది. వ్యావహారిక భాషలో అన్ని రకాల రచనలూ రావాలని ఈ పరిషత్తు అభిప్రాయపడింది. 1935 మే 6వ తేదీన గిడుగుకు ఐదవ జార్జి చక్రవర్తి రజతోత్సవ సువర్ణ పతకాన్ని ప్రభుత్వం ప్రదానం చేసింది. గద్య చింతామణి, వ్యాసావళి వంటి గ్రంథాల్ని గిడుగు రాశారు. పీఠికా విమర్శ, గ్రంథ పరిష్కార విమర్శ, లక్ష్మణ గ్రంథ విమర్శ, నిఘంటు విమర్శ వంటి అంశాల్లో కూడా ఎవ్వరూ చెయ్యని, చెయ్యలేని లోతైన పరిశోధన చేశారు. గ్రాంధిక భాషావాదుల డాంబి కాల్ని గిడుగు బట్టబయలు చేశారు. కొమ్ములు తిరిగిన మహామహా పండితులకే సంస్కృతం సరిగా రాదని ఉదాహరణ పూర్వకంగా విడమర్చి మరీ తెలియజేశారు. ఆయన వ్యాకరణాల్లోనూ నిఘంటువుల్లోనూ సమాన ప్రతిభ కలిగినవారు. సవర–తెలుగు, తెలుగు – సవర, ఇంగ్లిష్ – సవర, సవర – ఇంగ్లిష్ నిఘం టువుల్ని తయారుచేశారు. నిఘంటువుల నిర్మాణానికి పండిత ప్రతిభతో పాటు, భాషాశాస్త్ర జ్ఞానం, శాస్త్రీయ దృక్పథం కూడా తప్పనిసరిగా ఉండాలని వారి అభిప్రాయం. భాష ఎప్పుడూ పరిణామం చెందుతుందని గిడుగు వారి వాదన. అదే చివరకు విజయం సాధించింది. 1938 డిసెంబర్ 1వ తేదీన ఆంధ్ర విశ్వకళా పరిషత్ గిడుగుకు ‘కళాప్రపూర్ణ’ బిరుదునిచ్చి ఘనంగా సన్మానించింది. సవరభాష కోసం, వ్యావహారిక భాష కోసం, గిడుగు చేసిన కృషి అనన్య సామాన్యమైంది. అనితర సాధ్యమైంది. అక్షర జ్ఞానం లేని సవరలకు జ్ఞానం కలుగ చేయడం కోసం ‘సవర భాషోద్యమం’ చేపట్టారు. మహా మహా పండి తులను, మేధావులను వ్యావహారిక భాషావాదాన్ని ఒప్పించడం కోసం ‘వ్యావహారిక భాషోద్యమం’ చేపట్టారు. అజ్ఞానంతో ఉన్నవారికి జ్ఞానభిక్ష పెట్టేది ‘సవర భాషోద్యమం’. జ్ఞానం ఉన్నవారిలోని అజ్ఞానాన్ని తొలగించేది ‘వ్యావహారిక భాషోద్యమం’. రెండూ గొప్ప ఉద్యమాలే. రెండూ మంచి పనులే. అసలు విషయం ఏమంటే – ఈ రెండు ఉద్యమాలూ నూటికి నూరుపాళ్లు ప్రజలకు సంబంధించినవే. ఈ ఉద్యమాల్లో రవ్వంతయినా స్వార్థం లేదు. ఆయన గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక భాషా విజ్ఞాన సర్వస్వం గిడుగు. వీరు 1940 జనవరి 22వ తేదీన మద్రాసులో తుదిశ్వాస విడిచారు. గిడుగును ‘తెలుగు సరస్వతి నోముల పంట’ అని విశ్వనాథ సత్యనారాయణ కీర్తించారు. ‘తెలుగుదేశంలో అవతరించి తెలుగు భాషను ఉద్ధరించిన పుంభావ సరస్వతి గిడుగు వెంకట రామమూర్తి పంతులు’ అని చింతా దీక్షితులు కీర్తించారు. ఇటువంటి ఉద్దండుల మన్ననలను పొందగలిగిన గిడుగు ‘పిడుగు’గా ప్రసిద్ధి పొందారు. (క్లిక్: ఈ తెలుగు మాట్లాడుతున్నామా?) - ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్యాసకర్త ఏపీ అధికార భాషా సంఘ అధ్యక్షులు (ఆగస్టు 29న గిడుగు జయంతిని ‘తెలుగు భాషా దినోత్సవం’గా ఏపీ ప్రభుత్వం జరుపుతున్న సందర్భంగా) -
నేతాజీ అంగరక్షకుడు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాలను వదిలేసి విదేశాలకు వెళ్లి బ్రిటిష్ వాళ్లపై యుద్ధం ప్రకటించిన రోజులవి. అప్పట్లో ఆయన అంగరక్షకునిగా పనిచేసిన అచంచల దేశభక్తుడు గోపరాజు వేంకట అనంత శర్మ, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరులో 1920లో జన్మించిన ఆయన 1941లో బ్రిటిష్ ఇండియా ఆర్మీ (బీఐఏ)లో గుమాస్తాగా చేరారు. తరువాత ఆఫీసర్‌గా ఎంపికై శిక్షణ నిమిత్తం మలేషియాలోని కోటాబహార్‌కు వెళ్లారు. బ్రిటన్– జపాన్ల మధ్య జరిగిన యుద్ధంలో వేలాదిమంది బీఐఏ సైనికులు యుద్ధ ఖైదీలుగా జపాన్‌కు చిక్కారు. అందులో గోపరాజు ఒకరు. జపాన్‌తో ఒప్పందం కుదుర్చుకొని ఆ దేశస్థుల సాయంతో భారత మాతకు విముక్తి కలిగించాలని నేతాజీ తన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) ద్వారా ప్రయత్నించారు. ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులైన గోపరాజు నేతాజీని బ్యాంకాక్‌లోని రత్నకోసిన్ హోటల్లో కలిసి ఐఎన్ ఏలో చేరారు. నేతాజీ అంగరక్షకులలో ఒకరుగా పనిచేశారు. ఎప్పుడూ మిలటరీ దుస్తులలో ఉండే నేతాజీని చూసి ఎంతో ప్రేరణ, గౌరవం కలిగేదని గోపరాజు అంటూ ఉండేవారు. బ్రిటిష్ వాళ్లు ఇండియన్ నేషనల్ ఆర్మీవారిని యుద్ధఖైదీలుగా ఫిరోజ్‌పూర్ కంటోన్మెంటుకు తరలించారు. వారిలో గోపరాజు అనంత శర్మ కూడా ఉన్నారు. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) స్వాతంత్య్రోద్యమ దీప్తి నేతాజీ... కనుసన్నలలో గడిపిన మూడేళ్ల కాలం తన జీవితంలో స్వర్ణమయ సమయం అనేవారు వేంకట అనంత శర్మ. ఈయన కొంతకాలం పాటు స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రోత్సాహంతో భారతీయ రైల్వేలో ఉద్యోగిగా చేరి ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పదవీవిరమణ చేశారు. ఈమధ్య జూలై నెలలో ఐకానిక్ వారోత్సవాల వేడుకలలో అమృతోత్సవమును పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే వారు విజయవాడలో స్వాతంత్య్ర సమరవీరులైన శర్మ కుటుంబ సభ్యులను ఉచిత రీతిన గౌరవించడం ముదావహం. (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?) – డాక్టర్ ధర్మాల సూర్యనారాయణ మూర్తి, చాంగీ కాండో, సింగపూర్ -
ఇప్ప నారాయణరెడ్డి.. స్మృతివనంలో త్యాగధనుడు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగువేల లోపు జనాభా కలిగిన ఒక చిన్న ఊరి పేరు దుమాల. 21 మంది రక్త తర్పణలతో అమరుల స్మృతి వనంగా ఈ ఊరు ప్రాధాన్యత సంతరించుకుంది. సరిగ్గా నేటికి 50 సంవత్సరాల క్రితం ‘శ్రీ వేంకటేశ్వర యువజన సంఘం’ స్థాపించి, దుమాలలో నూతన చైతన్యానికి అంకురార్పణ చేసిన ఇప్ప నారాయణరెడ్డి, ఆయన మిత్ర బృందం రైతుకూలీ సంఘం నిర్మాణం ద్వారా విప్లవోద్యమానికి కూడా నాంది పలికారు. మధ్యయుగాల నాటి భూస్వామ్య దోపిడీనీ, దానిపై ప్రజల పోరాటాన్నీ అర్థం చేసుకోవడానికి దుమాల గ్రామం అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. పంచాయితీ వ్యవస్థ అమల్లోకి వచ్చే ముందూ... వచ్చిన తర్వాత కూడా దుమాలలో దొర, మాలి పటేల్, పోలీస్ పటేల్, పట్వారి వ్యవస్థలు కొనసాగిన రోజుల్లో... లక్ష్మయ్య దొర.. దొరగా, కిష్టయ్య దొర మాలిపటేల్గా, నాంపల్లి దొర పోలీస్ పటేల్‌గా, నారాయణ పంతులు పట్వారీగా– దాదాపు 300 ఎకరాల భూములకు యజమానులుగా ఉండేవారు. వీరి దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారు. 1978లో ప్రభుత్వం కల్లోలిత ప్రాంతంగా ఈ ఏరియాను ప్రకటించి భూస్వాములకు అండగా నిలిచింది. దీంతో ప్రజాపోరాటం ఎగసిపడింది. 1989 ఫిబ్రవరి 23న దుమాలకు చెందిన కానవరపు చంద్రయ్యను బెజ్జంకి దగ్గర బూటకపు ఎన్కౌంటర్ చేయడంతో హింసాకాండ రూపమే మారిపోయింది. 2001 వరకు 22 సంవత్సరాలు నిరాఘాటంగా సాగిన ఈ హత్యాకాండలో 21 మంది ఈ గ్రామానికి చెందినవారు మరణించారు. శ్రీ వెంకటేశ్వర యువజన సంఘం ప్రాథమిక పాఠశాలకు తరగతి గదులు కట్టించింది. హైస్కూల్‌కు విశాల స్థలం ఇచ్చింది. రూ. 5 లక్షలతో తరగతి గదులు పెంచడానికి జనశక్తి పార్టీ స్వయంగా పూనుకుంది. మేక పుల్లరి, వెట్టి గొర్లు, వెట్టి నాగళ్ళు, జీతాల వ్యవస్థ అంతమైపోవడానికి పార్టీ కారణమైంది. అన్నింటికీ మించి ఉత్పత్తి శక్తులకు దొరికిన స్వేచ్ఛ ప్రజల జీవితాల్లో కొత్త మార్పునకు నాంది పలికింది. – అమర్, జనశక్తి (జూలై 29న ఇప్ప నారాయణరెడ్డి ప్రథమ వర్ధంతి) -
నేషనల్ డాక్టర్స్ డే; ఆయన పుట్టిన రోజూ, మరణించిన రోజూ ఒక్కటే
వైద్యునిగా, విద్యావేత్తగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, వితరణ శీలిగా, ఆధునిక పశ్చిమ బెంగాల్ రూపకర్తగా విశేష సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బీసీ రాయ్. ఆయన పుట్టిన రోజూ, మరణించిన రోజూ ఒక్కటే (జూలై 1) కావడం విశేషం. ఈరోజును భారత ప్రభుత్వం ‘నేషనల్ డాక్టర్స్ డే’గా ప్రకటించి గౌరవించింది. డాక్టర్ బీసీ రాయ్‌గా సుపరిచితులైన డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ 1882లో అఘోర్ కామినీ దేవి, ప్రకాష్ చంద్రరాయ్ దంపతులకు, బిహార్ రాష్ట్రంలో జన్మించారు. వైద్య విద్య నిమిత్తం 1901లో కలకత్తా మెడికల్ కాలేజీలో చేరి వైద్య విద్యను అభ్యసిస్తూనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1909లో లండన్ వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించి వచ్చి కలకత్తా మెడికల్ కాలేజీలో అధ్యాపకునిగా చేరారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)ల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ రాయ్‌కి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి చేపట్టమని కోరింది. మొదట తిరస్కరించినా... 1948 జనవరి 23న రాయ్ ఆ బాధ్యతలు స్వీకరించారు. తన 80వ ఏట 1962 జులై 1వ తేదీ వరకు అంటే తుదిశ్వాస విడిచేవరకు 14 ఏళ్లపాటు అద్భుతపాలన అందించారు. అంతేకాక ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా వున్నా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోగులను చూడడం మాత్రం మానుకోలేదు. భారత ప్రభుత్వం డాక్టర్ బీసీ రాయ్ అత్యున్నత సేవలను గుర్తించి, 1961లో దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’తో గౌరవించింది. – డాక్టర్ టి. సేవకుమార్, గుంటూరు (జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం) -
ఎందుకో?.. నేను పుట్టినప్పుడు పూలవాన కురవలేదు..
సీటీఆర్ (రాజమహేంద్రవరం): పాత్రికేయునిగా, కథా రచయితగా, సినీ రచయితగా, నిర్మాతగా తెలుగువారి గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్న ముళ్లపూడి వెంకట రమణ ధవళేశ్వరంలో 1931 జూన్ 28న జన్మించారు.. తన జన్మదినం గురించే ఆయన స్వీయచరిత్రలో విసిరిన చమక్కులను ముందుగా చూద్దాం...‘జ్యేష్ఠా నక్షత్రం, వృశ్చికరాశిలో పుట్టాను. అంటే జూన్ 28 తెల్లవారు జామున, 1931లో. పీవీగారు కూడా జూన్ ఇరవైయ్యెనిమిదే, 1921లో. అంటే నా కన్నా పదేళ్ల చిన్న. ఈ మాటంటే ఆయన పకాపకా నవ్వారు. ఎందుకో?... రాజమండ్రి, ధవళేశ్వరాల మధ్యనున్న ఆల్కాట్ గార్డెన్స్ ఆసుపత్రిలో పుట్టాను. నేను పుట్టినప్పుడు దేవదుందుభులు మోగలేదు. అచ్చరలాడలేదు. గంధర్వులు పాడలేదు. పూలవాన కురవలేదు.’’ కష్టాలతో చెలిమి... పట్టుమని పదేళ్లు రానివయసులోనే ముళ్లపూడి తండ్రిని కోల్పోయారు. కుటుంబానికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. పొట్ట చేతపట్టుకుని మద్రాసు మహానగరానికి వెళ్లారు. ఒక మెట్టగదిలో ముళ్లపూడి, ఆయన సోదరుడు, తల్లి కాపురం. తల్లి విస్తర్లు కుట్టి, ప్రెస్సులో కంపోజింగ్ పనులు చేసి సంసార నౌకను నడిపారు. మధ్యలో 7,8 తరగతులు చదువుకోవడానికి ముళ్లపూడి తల్లి, సోదరుడితో కలసి రాజమండ్రి వచ్చి, ఇన్నీసుపేటలోని కందుకూరి వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో చదివారు. తిరిగి మద్రాసు చేరుకున్నారు. ఎస్సెల్సీ వరకు చదువు కొనసాగింది. పూలేకాదు, ముళ్ళూ... పాత్రికేయ జీవితంలో అందుకున్న సన్మానాలు, పొందిన బిరుదుల, మెళ్లో వేసిన శాలువాలూ, పూలదండలే కాదు, పొందిన అవమానాలు, అగచాట్లు, డబ్బు చిక్కులూ, ఛీత్కారాలు అన్నిటినీ ముళ్లపూడి తన స్వీయచరిత్రలో చెప్పుకొచ్చారు. పొలిటికల్ కాలమిస్టుగా పనిచేస్తున్నప్పుడు నీలం సంజీవరెడ్డి గారు క్లబ్‌కు తీసుకువెళ్లి నా పేరు చెప్పి భోజనం లాగించెయ్. .అన్నారు..అప్పటికే ఆకలి ‘రుచి’పూర్తిగా తెలిసిన ముళ్లపూడి డైనింగ్ హాలులోకి వెళ్లి బేరర్‌కు చెప్పారు. ‘డ్రైవర్సుకీ, బోయెస్కీ బాక్ సైడ్ షెడ్లో ఇరికప్పా, పిన్నాలే పో’ అన్నాడు వాడు. సంజీవరెడ్డిగారికి ఏదో అనుమానం వచ్చి, హాలులోకి వచ్చి బేరర్‌ను చివాట్లు పెట్టారు. సినీ రిపోర్టరుగా ఉండగా గుచ్చుకున్న మరో ముల్లు.. సినీ స్టూడియోలో ఓ సారి ఎస్వీ రంగారావుగారు ఎదురయ్యారు. రమణని పిలిచి చెంప ఛెళ్లు మనిపించారు..‘‘చూడు రమణా! పత్రికకూ, నీ ఆఫీసుకూ ఓ స్టేటస్ ఉంది. స్టార్‌గా నాకో దర్జా ఉంది. నువ్విలా మాసిన గడ్డంతో, కాల్చిన చిలకడదుంపలా రావడం ఇన్సల్టు. మీకు డబ్బు లేకపోయినా శుభ్రంగా ఉండవచ్చును గదా’’ అన్నారు ఎస్వీఆర్.. ఇలాంటి అనుభవమే ఒకసారి అక్కినేనితో ఎదురయింది. ఆయన ఏదో కబుర్లు చెబుతూ...‘రమణగారూ. కొన్ని తత్వాలే అంత. ఫరెగ్జాంపుల్, మిమ్మల్ని మార్చడం మీ దేవుడి తరం కాదు, మీకు కోటి రూపాయలిచ్చినా ఈ మురికి బట్టలే వేసుకుంటారు..’ రమణ కోపంతో రిటార్ట్ ఇచ్చారు..‘‘సార్. ఇవి నలిగిన బట్టలు కావచ్చుకాని, మురికివి మాత్రం కావు. నేను ఒకసారి కట్టివిడిచిన బట్టను ఉతికి ఆరేస్తేకాని కట్టను. మీరు మీ ప్యాంట్లూ, సిల్కు చొక్కాలూ తొడిగి విప్పాక, చిలక్కొయ్యకేస్తారు. పదేసి రోజులు అదే వాడుతారు. నాకున్నది ఒకటే జత. కాని ప్రతిరాత్రి ఉతికారేసుకుంటాను. తువ్వాలు కట్టుకుని పడుకుంటాను. నాకు సిగ్గులేదు కాని, పొగరుంది...’ నిరుద్యోగ విజయాలు, పాత్రికేయునిగా ఉద్యోగం రెండేళ్ల ‘నిరుద్యోగ విజయాలు’ తరువాత నాటి ప్రముఖ ఆంధ్రపత్రికలో పాత్రికేయునిగా ఉద్యోగం ముళ్లపూడిని వరించింది. పాత్రికేయునిగా తనదైన ముద్ర వేస్తూనే, కథారచయితగా ముళ్లపూడి తన సత్తా చూపారు. రెండుజెళ్ల సీతలూ, సీగానపెసూనాంబలు, బుడుగులూ, అప్పారావులూ ఆయన కలం నుంచి వెలువడ్డాయి. గురజాడ గిరీశం, చిలకమర్తి గణపతి, మొక్కపాటి బారిస్టర్ పార్వతీశంలాగా, పానుగంటి జంఘాల శాస్త్రిలాగా ముళ్లపూడి సృష్టించిన అప్పారావు పుస్తకాల పుటల నుంచి వచ్చి, తెలుగువారి జీవితంలోకి చొరబడ్డాడు. (చదవండి: వీడు బుడుగు అని ఎందుకు రాయాలీ?) తాగింది కావేరి జలాలు, ఉపాసించింది గోదావరి జలాలు తుది వరకు మద్రాసులోనే జీవించినా, ఆయన ధ్యాస, యాస, శ్వాస గోదావరి చుట్టుతానే తిరిగింది. తన 14 ఏటా నుంచి నేస్తం అయిన బాపుతో కలసి నిర్మించిన సాక్షి, అందాలరాముడు, ముత్యాలముగ్గు, స్నేహం, బుద్ధిమంతుడు మొదలైన సినిమాలు ఈ గడ్డనే పురుడు పోసుకున్నాయి. ఈ మాండలికమే ఆ పాత్రలు మాట్లాడాయి.. ఆరుద్ర చెప్పినట్లు ‘‘హాస్యం ముళ్లపూడి వాడి, వేడి తాకిడికి ఈ డేరింది’’ అనడంలో అతిశయోక్తి లేదు. (చదవండి: పిల్లనగ్రోవికి ఒళ్లంతా గేయాలే) -
Col Nizamuddin: నేతాజీని కాపాడిన యోధుడు
నేతాజీ ఆంతరంగికులలో ఒకరు కల్నల్ షేక్ నిజాముద్దీన్. వీరి అసలు పేరు సైఫుద్దీన్. వీరు అప్పటి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంగఢ్ జిల్లా ఢక్వా గ్రామంలో 1900లో జన్మించారు. 20 ఏళ్ల ప్రాయంలో బ్రిటిష్ సైన్యంలో చేరారు. కొంతకాలం తర్వాత సింగపూర్‌లో క్యాంటిన్ నడుపుతున్న తన తండ్రి ఇమాం అలీ వద్దకు 1926లో చేరారు. అనంతరం 1943లో నేతాజీ జాతీయ సైన్యాన్ని పునరుద్ధరించి ‘చలో ఢిల్లీ’ అంటూ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన అందులో చేరారు. అప్పటివరకు ఉన్న సైఫుద్దీన్ పేరును నిజాముద్దీన్‌గా మార్చుకున్నారు. నేతాజీ కారు డ్రైవర్‌గా ఉండి, ఆ తరువాత అంగరక్షకుడిగా, వ్యక్తిగత సహాయకునిగా నిజాముద్దీన్ ఎదిగారు. బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా 1943లో జరిగిన యుద్ధంలో నేతాజీతో కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో అడవిలో నేతాజీతో వెళుతుండగా తుప్పల్లోంచి నేతాజీకి గురిపెట్టిన ఒక తుపాకీ గొట్టాన్ని నిజాముద్దీన్ గమనించి ఎదురెళ్ళారు. క్షణాలలో 3 గుండ్లు ఆయన శరీరంలోకి దూసుకుని వెళ్ళి కుప్పకూలారు. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ వైద్యం చేసి నిజాముద్దీన్ శరీరంలోని బుల్లెట్లను తొలగించారు. ఆయన త్యాగనిరతికి నేతాజీ చలించిపోయి కల్నల్ హోదాను కల్పించడంతో వీరు కల్నల్ షేక్ నిజాముద్దీన్‌గా ప్రసిద్ది చెందారు. నాటి నుండి 1945 వరకు నేతాజీ వెన్నంటి ఉన్నారు. సింగపూర్ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారన్న వార్తను ఆయన ఖండించారు. ఆ ప్రమాదం జరిగిన 3 నెలల తర్వాత తాను స్వయంగా నేతాజీని బర్మా–థాయిలాండ్ సరిహద్దుల్లో గల సితంగ్‌పూర్ నదీ తీరాన తీసుకెళ్ళి విడిచిపెట్టి వచ్చానని అనేవారు. నిజాముద్దీన్ తన 117 ఏట 2017లో స్వగ్రామంలోనే కన్నుమూశారు. – షేక్ అబ్దుల్ హకీం జాని, తెనాలి (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) -
నిష్కర్ష విమర్శకుడు!
నేను అనే స్వోత్కర్షలేని సాదాతనం; మాటల్లోనూ, చేతల్లోనూ ద్వంద్వాలు లేని వ్యక్తిత్వం; జీవితంలోనూ, బోధనలోనూ ఉన్నత ప్రమాణాలను లక్ష్యించి ఆచరించిన ఆదర్శం; ఏది చదివినా, రాసినా లోనారసి పరిశీలనం; వివేచనం పరిశోధనం; వీటన్నిటి మూర్తిమత్వం ప్రస్ఫుటించిన ఆచార్యులు కేకే రంగనాథాచార్యులు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్‌గా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులుగా, తెలుగు శాఖాధిపతిగా, మానవీయ విభాగం డీన్‌గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. శ్రీశ్రీ, రావిశాస్త్రి, ఆరుద్రలను దగ్గరగా ఎరిగి, దిగంబర, విప్లవ కవులతో సన్నిహితంగా ఉండి, వారి తాత్విక దృక్పథాలను తనదైన చూపుతో విశ్లేషించారు. 2021 మే 15 దాకా నిశ్చలంగా భాషా సాహిత్యాల గురించి బహుముఖీన ఆలోచనలు చేస్తూనే తనువు చాలించారు. మార్క్సిస్ట్ సామాజిక దృక్పథంతో పురాణయుగం నుంచి స్త్రీవాద, దళిత సాహిత్య దశల వరకూ చారిత్రక భూమికని పట్టి చూపిన విమర్శకుడు. హేతువాద, ప్రజాస్వామిక సంస్కృతిని ఆచరించి చూపిన ఆచరణవాది. ప్రాచీన ఆధునిక తెలుగు సాహిత్యంపై ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ వేదికపై దశాబ్ద కాలానికి పైగా సమావేశాలు నిర్వహించి ప్రముఖులచే ప్రసంగాలు చేయించి, వాటిని సంకలనాలుగా తెచ్చిన రంగనాథాచార్యుల కృషి మరువరానిది. (క్లిక్: తెలుగు: ద బెస్ట్ షార్ట్ స్టోరీస్ అఫ్ అవర్ టైమ్స్) ‘తెలుగు సాహిత్యం– మరోచూపు’, ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు’, ‘తెలుగు సాహిత్య వికాసం’, ‘తెలుగు సాహిత్యం–చారిత్రక భూమిక’, ‘సామయిక వ్యాసాలు’, ‘బహుముఖం’, ‘తెలుగు భాష సంగ్రహ స్వరూపం వంటి రచనలు ఆయన పరిశోధన పరిశ్రమను చూపిస్తాయి. ఆయా గ్రంథాలకు ఆయన రాసిన విపుల పీఠికలు విమర్శకులకు, పరిశోధకులకు కరదీపికల వంటివి. ఏ ధోరణినైనా ఏ ఉద్యమాన్నైనా సమగ్ర దృష్టితో దర్శించడం, తులనాత్మకంగా పరిశీలించడం, చారిత్రక పరిణామ దృక్పథంతో వివేచించడం, అంచనా వేయడం అనే విమర్శన కృత్యాన్ని నిరంతరం నిర్వహించారు. ఆయన ఏది మాట్లాడినా, బోధించినా, రాసినా అర్థం పరమార్థం ఉంటుంది. ఆయన ఉపన్యాసాలు, రచనలు ఆలోచనాత్మకాలు, విజ్ఞాన సర్వస్వాలు! – కొల్లు వెంకటేశ్వరరావు, ఖమ్మం (జూన్ 14న కేకే రంగనాథాచార్యుల జయంతి) -
ఆ యాత్ర ఓ చరిత్ర
ఏమాత్రం ఆధునిక ప్రయాణ సాధనాలు లేని రోజుల్లో ‘కాశీ యాత్ర’ చేసినవాడు ఏనుగుల వీరాస్వామి. తన యాత్రానుభవాలను గ్రంథస్థం చేసిన మొదటి ఆధునిక భారతీయ యాత్రికుడూ ఆయనే! వీరాస్వామి పదహారణాల తెలుగువాడు. ఈయన 1780లో చెన్నైలో జన్మించారు. పూర్వీకులు ఒంగోలు ప్రాంతీయులు. మద్రాస్ సుప్రీం కోర్టులో ‘ఇంటర్ ప్రిటర్’ ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేసిన తర్వాత కాశీయాత్ర చేప ట్టారు. ‘రెగినాల్డ్ బిషప్ హెబార్డ్’ అనే తూర్పు ఇండియా కంపెనీ మతాధికారి 1824 – 1826లో భారతదేశ యాత్ర చేసి ‘బిషప్ హెబార్డ్ జర్నల్’ అనే పేరుతో ఓ గ్రంథం రాశారు. ఇదే వీరా స్వామి ‘కాశీ యాత్ర చరిత్ర’ గ్రంథానికి స్ఫూర్తి. వీరాస్వామి ‘కాశీ యాత్ర’ 1830 మే 18వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటలకు చెన్నైలోని తండయారువీడు లోని సొంత ఇంటి నుంచి ప్రారంభమైంది. తల్లి, భార్యతో సహా 100 మందితో బయలుదేరివెళ్లిన ఆయన... 1831 సెప్టెంబర్ 3వ తేదీన మరలా ఇంటికి చేరుకోవడంతో యాత్ర సుఖాంతమైంది. సుమారు 4 వేల కిలోమీటర్ల దూరం 15 నెలల, 15 రోజులు కొనసాగింది. (చదవండి: అక్షర యోధుడు అదృష్టదీపుడు) 1830, మే 22వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి... 33 రోజుల అనంతరం జూన్ 24వ తేదీన తెలంగాణాలో ప్రవేశించి ఆగస్టు 6వ తేదీ వరకు కొనసాగింది. ఆగస్టు 6వ తేదీన మహారాష్ట్రలో ప్రవే శించారు. తరువాత మధ్యప్రదేశ్ గుండా ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించి కాశీ చేరుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన యాత్రానుభ వాలను ‘కాశీ యాత్రా చరిత్రగా’ గ్రంథస్థం చేసి నాటి కాలమాన పరిస్థితులను ముందు తరాలకు అందించారు. వీరాస్వామి కాశీ యాత్ర చేపట్టిన మే 18వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక దినోత్సవంగా జరుపుకోవడం సముచితంగా ఉంటుంది. – కోరాడ శ్రీనివాసరావు సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా -
కైఫియత్తులే ఇంటిపేరుగా...
బలమైన చారిత్రక ఆధారాలైన కైఫియత్తులను ఇంటి పేరుగా మార్చు కొన్న గొప్ప భాషావేత్త, పరిశోధకులు... విద్వాన్ కట్టా నరసింహులు. వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట సమీపంలోని కొత్తపల్లి వాసి. తెలుగు పండితునిగా ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందించారు. బ్రౌన్ గ్రంథాలయ ఆవిర్భావం తర్వాత దాని వ్యవస్థాపక సెక్రెటరీ డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రితో పరిచయం... కట్టా పదవీ విరమణ తర్వాత ఆయనను ఆ గ్రంథాలయానికి చేర్చింది. బ్రౌన్ గ్రంథాలయ తాళపత్ర గ్రంథాల విభాగాన్ని పటిష్టం చేసేందుకు కట్టా పూర్తి స్థాయిలో కృషి చేశారు. ఆయన వ్యక్తిత్వం, శక్తియుక్తిలకు తృప్తిచెందిన జానమద్ది ఆయనకు మెకంజీ రాసిన ‘కడప కైఫియత్తు’ల పరిష్కార బాధ్యతను అప్పగించారు. ఫలితంగా 3,000 పైచిలుకు పేజీలతో, 8 సంపుటాల కడప కైఫియత్తులు ప్రపంచానికి అందుబాటులోకి వచ్చాయి. ఆయన కేవలం కడప కైఫియత్తుల ఆధా రంగా ఇంతవరకు వెలుగు చూడని చారిత్రకాంశాలతో ‘కైఫియత్ కతలు’ పేరిట పుస్తకం వెలువరించారు. రాయలసీమలో శ్రీకృష్ణ దేవరాయల పాలన వలె ఆయన బంధువులైన ‘మట్లి’ రాజుల పాలన సాగిందని కట్టా నిరూపించారు. తన జన్మస్థలి ఒంటిమిట్ట గురించి పూర్తి చారిత్రక ఆధారాలతో తెలుగు, ఆంగ్ల భాషల్లో పుస్తకాలు వెలువరించి, అక్కడ ఉన్న రామాలయ చరిత్రను లోకానికి తెలిపారు. (చదవండి: నాటకరంగ ఘనాపాఠి కొర్రపాటి) ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి ప్రభుత్వ లాంఛనాల హోదా కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ కృషి ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోని ‘పోతన భాగవతం’ ప్రాజెక్టులో సేవలందించే అవకాశాన్ని కల్పించింది. అక్కడ పని చేస్తూనే ఆయన 2021 మే 15న కరోనాతో కన్నుమూశారు. ఆయన తొలి వర్ధంతి సందర్భంగా కడపలోని బ్రౌన్ కేంద్రంలో సదస్సు జరగనుంది. – పవన్‌కుమార్ పంతుల, జర్నలిస్ట్ (మే 15న విద్వాన్ కట్టా నరసింహులు తొలి వర్ధంతి) -
నాటకరంగ ఘనాపాఠి కొర్రపాటి
స్త్రీ పాత్రలు లేని ప్రదర్శన యోగ్యమైన నాటికల కోసం ఆంధ్రనాటక రంగం ఎదురు చూస్తున్న తరుణంలో ఆ లోటు పూడ్చిన ఘనత డాక్టర్ కొర్రపాటి గంగాధరరావుది. 1950–80 మధ్య దశాబ్దాల్లో తెలుగు నాటక రంగాన్ని ఆయన సుసంపన్నం చేశారు. 110కి పైగా నాటికలు, నాటకాలు రాసి ‘శతాధిక నాటక రచయిత’గా ఖ్యాతి గడించారు. వృత్తిరీత్యా వైద్యుడైన కొర్రపాటి 1922 మే 10న బందరులో జన్మించారు. అభ్యుదయ భావాలతో, సంస్కరణాభిలాషతో, సమసమాజ స్థాపనా ధ్యేయంతో ఆయన రాసిన నాటికలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఆసక్తిదాయకంగా ప్రేక్షకుల హృదయాలలో పదికాలాల పాటు నిలిచిపోయే విధంగా పాత్రలను తీర్చిదిద్దడంలో ఆయన సిద్ధహస్తుడు. గంభీరమైన సన్నివేశాల మధ్య కూడా ఒక సునిశితమైన హాస్య సంఘటనను చొప్పించి నాటకాలను రంజింపజేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ‘యథా ప్రజా తథా రాజా’, ‘పెండింగ్ ఫైలు’, ‘తెరలో తెర’, ‘కమల’, ‘ఆరని పారాణి’, ‘తారా బలం’, ‘తెలుగు కోపం’, ‘కొత్త చిగురు’, ‘లోక సంగ్రహం’ వంటివి వందలాది ప్రదర్శనలకు నోచుకున్నాయి. కొర్రపాటి గొప్ప నటుడు కూడా! చిన్నతనం నుండి నాటకాలు వేసేవారు. అందరూ ఆయన్ని ‘రంగబ్బాయి’ అని పిలిచేవారు. 14 ఏళ్ల వయసులోనే ‘హతవిధీ’ అనే నాటిక రాసి ఆడారు. ప్రధానంగా స్త్రీ పాత్రలు వేసేవారు. ‘విడాకులా’ అనే నాటికలో ఆయన స్త్రీ పాత్ర నటన పలువురి ప్రశంసలు పొందింది. స్వాతంత్రోద్యమ కాలంలో ‘నా దేశం’ నాటకంలో ‘కామ్రేడ్’ పాత్రను పోషించారు. తర్వాతి కాలంలో సినీరచయితగా, నవలా రచయితగా కూడా పేరు గడించారు కొర్రపాటి. ‘ఇద్దరు మిత్రులు’, ‘మాయని మమత’ వంటి చిత్రాలకు మాటలు రాశారు. ఇవిగాక షాడోరైటర్గా కూడా ఇంకా చాలా సినిమాలకు మాటలు రాశారు. కొర్రపాటి సుమారు పది నవలలు రాశారు. వాటిలో ‘లంబాడోళ్ళ రాందాసు’, ‘గృహ దహనం’, ‘ధంసా’ అధిక ప్రాచుర్యాన్ని పొందాయి. ఆంధ్ర నాటక కళా పరిషత్ నుండి అసంఖ్యాకంగా బహుమతులు పొందారు. ‘రంగరచనా ప్రవీణ’ అనే బిరుదాన్ని పొందారు. ఆంధ్ర సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీలలో సభ్యుడిగా నియమితులైనారు. ( చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకం) ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడానికి కొర్రపాటి నాటక శిక్షణాలయాన్ని కూడా నడిపారు. ‘పద్మశ్రీ’ స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, గరికపాటి రాజారావు, పినిశెట్టి, రామచంద్ర కాశ్యప, పృథ్వీ రాజ్ కపూర్ వంటి వారితో కొర్రపాటికి సాన్నిహిత్యం ఉండేది. సినీనటులు పి.ఎల్.నారాయణ, చంద్రమోహన్, నూతన ప్రసాద్, కె.ఎస్.టి. సాయి వంటివారు ఆయన శిష్యవర్గంగా ఉండేవారు. కొర్రపాటి మద్రాస్ మెడికల్ కాలేజీలో వైద్యంలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన తర్వాత బాపట్లలో వైద్యుడిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. గొప్ప హస్తవాసి కలవారని పేరుండేది. ఆయన సౌమ్యులు, మితభాషి, అభ్యుదయవాది, హాస్యప్రియులు. 1986 జనవరి 27న బాపట్లలో తనువు చాలించారు. – డాక్టర్ పి.సి. సాయిబాబు, రీడర్ ఇన్ కామర్స్(విశ్రాంత) (మే 10న కొర్రపాటి గంగాధరరావు శతజయంతి) -
గోడలు కూలిపోయే రోజు కోసం...
ఇవాళ రవీంద్రుడి పుట్టిన రోజు. ఆయన ఎక్కడ పుట్టారో, ఎప్పుడు పుట్టారో సులభంగా మనం తెలుసుకునే అవకాశం ఉంది. కానీ రవీంద్రుడి సాహిత్యాన్నీ, ఆ సాహిత్యం ఇచ్చే సంస్కారాన్నీ తెలుసుకోవడం ఇప్పటి తరానికి ఎంతైనా అవసరం. రవీంద్రుడి బాల్యం చిత్రంగా గడిచింది. అతను నాలుగు గోడల్ని బద్దలు కొట్టడం నేర్చుకున్నారు. ప్రకృతిని గొప్ప పాఠశాలగా భావించారు. పరిశీలన, ప్రకృతితో మమేకం కావడం ద్వారా ఆయన జ్ఞానవంతుడయ్యారు. ‘ప్రపంచ రహస్యాన్ని’ తెలుసుకునే క్రమంలో విజయం సాధించారు. ప్రకృతిని ఆస్వాదించే హృదయాన్ని పొందిన టాగూర్, అక్కడినుండే సాహిత్యాన్ని సృష్టించడం మొదలు పెట్టారు. ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. సంస్కృత కావ్యాలు చదివారు. ఆంగ్ల సాహిత్యాన్ని పరిశీలించారు. బాల్యంలోనే ‘సంధ్యాగీత’ ప్రకటించారు. అది అందరి మన్ననలు పొందింది. రవీంద్రుని ప్రసిద్ధ గేయం ఊరకే అతని హృదయం నుండి రాలేదు. (Satyajit Ray: నవ్యచిత్ర వైతాళికుడు) ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో/ఎక్కడ మాన వుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో/ ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో/ ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోదో’’ అంటూ ఒక స్వేచ్ఛా స్వర్గంలోకి, తన దేశాన్ని మేలుకునేట్లు చేయమని ప్రార్థించారు. ఈ వాక్యాలు ఇప్పటికీ నెర వేరలేదు. రవీంద్రుడు విశ్వమానవ వాదాన్ని కోరుకున్నారు. పరిశుభ్ర ప్రపంచాన్ని ఆశించారు. ఆధునిక వచన కవితలో తన భావాల్ని పొందు పరిచారు. ‘గీతాంజలి’లో ఎంత గొప్ప కవిత్వం అందించారో వేరే చెప్పాల్సిన పని లేదు. గీతాంజలి దేశ హద్దుల్ని దాటి, ప్రపంచం అంతా వినిపించింది. (చదవండి: ‘జై హింద్’ నినాదకర్త మనోడే!) తన సాహిత్యం ద్వారా టాగూర్ ఈ దేశంలో కుల, మత, వర్గాలకు అతీతంగా మానవుడు తయారుకావాలని అభిలషించారు. మతం మనిషిని విభజించరాదని తెలియజేశారు. తన ఎనభై ఏళ్ళ జీవిత ప్రస్థానంలో అనేక నవలలు, నాటికలు, కవితా సంపుటాలు, గేయాలు రచించి సంపూర్ణ సాహిత్యకారుడిగా ఆవిష్కరించుకున్నారు. ‘విశ్వకవి’ అందించిన భావాలను పాడటమో, చదవ టమో కాదు. వాటిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే రవీంద్రుని ఆశయం నెరవేరినట్టు! – డాక్టర్ సుంకర గోపాల్ తెలుగు శాఖాధిపతి, డీఆర్జీ ప్రభుత్వ కళాశాల, తాడేపల్లిగూడెం (మే 7న టాగూర్ జయంతి) -
బహుజన బాంధవుడు కాన్షీరామ్
బహుజనులను రాజ్యాధికారానికి దగ్గర చేసినవారు కాన్షీరామ్. 1934 మార్చి 15న పంజాబ్ రాష్ట్రం రోపడ్ జిల్లా కావాస్పూర్ గ్రామంలో జన్మించారు. బీఎస్సీ చదివి రక్షణ శాఖలో చేరారు. 1965లో అంబేడ్కర్ జయంతినాడు సెలవు ప్రకటించాలని చేపట్టిన ఆందోళనతో ఆయన ఉద్యమ జీవితం ప్రారంభమైంది. అంబేడ్కర్ రాసిన ‘కుల నిర్మూలన’ పుస్తకం స్ఫూర్తితో పీడిత వర్గాల జీవితాల్ని రాజ్యాధికారం దిశగా తన నాయకత్వంలో ముందుకు నడిపారు. గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, ఛత్రపతి సాహూ మహారాజ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, నారాయణ గురు, పెరియార్ లాంటి వారిని గురువులుగా భావించారు. వారి ప్రభావంతోనే 1971లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. తదనంతరం 1978లో బ్యాక్వార్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బామ్ సెఫ్)ను స్థాపించి అణగారిన వర్గాలలో ఎదిగినవారు తమ వర్గాల అభ్యున్నతికి తోడ్పడే విధంగా కృషి చేశారు. ‘రాజ్యాధికారమే మాస్టర్ కీ’ అన్న అంబేడ్కర్ మాటలను ఆదర్శంగా తీసుకొని 1984లో బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించారు. బహుజన సమాజాన్ని రాజ్యాధికారం వైపు నడిపించడానికి అంబేడ్కర్ చెప్పిన విధంగా ‘బోధించు, సమీకరించు, పోరాడు’ సిద్ధాంతానికి అనుగుణంగా 1983 మార్చి 15న ఢిల్లీ నుండి బయలుదేరి ఏడు రాష్ట్రాల మీదుగా 100 సైకిళ్ళతో 40 రోజులలో 4,200 కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలను బహుజన ఉద్యమం వైపు మరల్చిన గొప్ప వ్యక్తి కాన్షీరాం. ఆయన అలుపెరగని పోరాటంతో ఉత్తరప్రదేశ్‌లో బహుజనులు కొన్ని సార్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే కాక... దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ గణనీయమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. – డాక్టర్ మొగిలి దేవప్రసాద్, సామాజిక విశ్లేషకులు, ఒంగోలు మార్చి 15న కాన్షీరామ్ జయంతి -
సైన్స్‌ను జనం దరి చేర్చినవాడు
వైజ్ఞానిక స్ఫూర్తి సామాన్యులకు అందించడం కోసం, దేశంలో గొప్ప గొప్ప శాస్త్రీయ సంస్థల స్థాపనకు, అభివృద్ధికి కృషి చేసినవారు డాక్టర్ పుష్పా భార్గవ! ప్రజలను చైతన్య పరచడంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన సేవాతత్పరుడు. జన విజ్ఞాన వేదికకు ఆలంబనగా నిలిచిన గొప్ప సైన్సు కార్యకర్త. సైన్స్ ప్రచార కార్యక్రమాల్లో ఆ సంస్థను మున్ముందుకు నడిపిస్తూ– చేప మందు శాస్త్రీయతను ప్రశ్నించారు. న్యాయస్థానం వరకు వెళ్ళి, అది మందు కాదని నిరూపించారు. విశ్వ విద్యాలయాల్లో ప్రభుత్వం జ్యోతిషాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసించారు. అలాగే, వాస్తు ప్రామాణికతను ప్రశ్నించారు. సమగ్రమైన చర్చ లేకుండా జీవ సాంకేతిక మార్పులతో కూరగాయలను మార్కెట్లోకి విడుదల చేయడాన్ని వ్యతిరేకించారు. డాక్టర్ పుష్పా మిత్ర భార్గవ (22 ఫిబ్రవరి 1928–1 ఆగస్టు 2017) రాజస్థాన్‌లోని అజ్మీర్ (అజయ్ మేరు)లో జన్మించారు. 1946లో ఆర్గానిక్ కెమిస్ట్రీ (సేంద్రియ రసాయన శాస్త్రం)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వెనువెంటనే 21 సంవత్సరాల చిరుప్రాయంలో లక్నో యూనివర్సిటీ నుండి పీహెచ్డీ స్వీకరించారు. కొంతకాలం లక్నో యూని వర్సిటీలోనే లెక్చరర్‌గా పనిచేసి, తర్వాత కాలంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్‌గా చేరి స్థిరపడ్డారు. అమెరికా, ఫ్రాన్స్, యూకేల్లో ప్రసిద్ధ సంస్థల్లో పరిశోధనల్లో పాల్గొన్నారు. యూకే నుంచి వచ్చి హైదరాబాద్‌లోని ప్రాంతీయ పరిశోధనా ప్రయోగశాల (రీజినల్ రీసెర్చ్ లాబొరేటరీ (ఆర్ఆర్ఎల్)లో సైంటిస్ట్‌గా చేరారు. తర్వాత కాలంలో ఆ ప్రయోగశాల భారత రసాయన సాంకేతిక సంస్థ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – ఐఐసీటీ)గా రూపాంతరం చెందింది. (చదవండి: నిజం... నిజం... డార్వినిజం) డాక్టర్ పీఎం భార్గవకు దేశ ప్రధానులందరితో దగ్గరి పరిచయాలుండేవి. అందువల్ల ఆయన హైదరాబాదులో ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలి క్యులర్ బయాలజీ’ (సీసీఎంబీ)ని స్థాపించగలిగారు. 1977–1990 మధ్య కాలంలో దానికి వ్యవ స్థాపక సంచాలకుడిగా ఉండి, ప్రపంచ ఖ్యాతిని తెచ్చారు. మాలిక్యులర్ సెగ్మెంట్స్ తయారీ కోసం ఒక అణుశక్తి ప్రయోగశాలను నెలకొల్పారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక బయోటెక్నాలజీ విభాగం నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించారు. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీని హైదరాబాద్‌లో ఆవిష్కరించి, నేర పరిశోధనలో విప్లవాత్మకమైన మార్పుకు కారణం అయ్యారు. ఒక సైంటిస్ట్‌గా, ఒక డైరెక్టర్‌గా వివిధ స్థాయులలో పనిచేస్తూ, దేశ విదేశాలలోని పరిశోధనా శాలల సమన్వ యంతో ఒకానొక సమయంలో దేశ వైజ్ఞానిక పరి శోధనా రంగానికి వెన్నెముకగా నిలిచిన భార్గవ కృషి చాలా విలువైంది. (Ravipudi Venkatadri: వంద వసంతాల హేతువాది) డాక్టర్ భార్గవకు లభించిన దేశ విదేశాల అవార్డులు, గుర్తింపులూ ఎన్నో ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇచ్చే లీజియన్ డి ఆనర్ (1998) పొందిన ఘనత వీరిదే. ఈ మధ్య కాలంలో దేశంలో వ్యాపించిన మత ఛాందసత్వ అసహనం పట్ల – దభోల్కర్, పన్సారే, కల్బుర్గీల హత్యల పట్ల కలత చెందిన భార్గవ, తన పద్మభూషణ్ పురస్కారాన్ని 2015లో భారత ప్రభుత్వానికి వాపస్ చేశారు. ఉత్తర భారతదేశం నుండి వచ్చి, హైదరాబాద్‌ను తన స్వస్థలంగా మార్చుకుని, ప్రపంచ వైజ్ఞానిక పరిశోధనా రంగంలో దీన్ని ఒక ముఖ్య కేంద్రంగా మార్చినవారు. సత్యాన్ని ప్రేమించి, దాని కోసం అన్ని విధాలా పోరాడే స్ఫూర్తిని మనమంతా ఆయన జీవితం నుండి పొందుతూనే ఉండాలి! - డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త (ఫిబ్రవరి 22న పుష్పా భార్గవ జయంతి) -
పోరాటాల పురిటిగడ్డ ఇది!
వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉరికంబం ఎక్కి రేపటికి 175 ఏళ్లు. 19వ శతాబ్దం ప్రారం భంలో అంకురించిన చిత్తూరు పాలెగాళ్ళ పోరాటం దగ్గర నుంచి 1847 ఫిబ్రవరి 22న పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్‌వాళ్లు ఉరితీయడం వరకు... రాయలసీమ పోరాటాలతో ఎరుపెక్కింది. ఈ పోరాటాలలో ఉరికంబం ఎక్కిన అమరవీరులు రాయలసీమ పాలెగాళ్ళు. బ్రిటిష్ మహావృక్షాన్ని మొక్క దశలోనే తుంచేయాలని పోరాటాలు చేసిన తొలి స్వతంత్ర పోరాట యోధులు వీరు. క్రీ.శ. 1801 నుంచి 1805 వరకు చిత్తూరు జిల్లా పాలెగాళ్ళు– బ్రిటిష్ వారికి మధ్య జరిగిన పోరాటంలో... యాదరాకొండ పాలెగాడు ముద్దు రామప్ప నాయుణ్ణి పట్టుకుని కల్లయ్య బండ అడవుల్లో ఉరితీశారు. మిగిలిన పాల్యాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆనాటి బ్రిటిష్ సైనిక చట్టం ప్రకారం చిత్తూరు పాలెగాళ్లను కొందరిని ద్వీపాంతరం పంపారు. మరికొందరిని ఉరితీశారు. (చదవండి: మన రాజ్యాంగానికి కొత్త ప్రమాదం) క్రీ.శ.1600– 1800 వరకు రాయలసీమలో బలమైన రాజుల పాలన లేదు. రాయలసీమను రక్షించినది పాలెగాళ్లే. సీమలో దండయాత్రలు జరిగినప్పుడు గండికోట, సిద్ధవటం కోట, పరాయి రాజుల వశమైనప్పటికీ... బురుజులు మాత్రం పాలెగాళ్ళ ఆధీనంలోనే ఉండేవి. విజయనగరం రాజుల కాలంలోనే (క్రీ.శ.1336 –1680) పాలెగాళ్ల వ్యవస్థ ఏర్పడింది. రాయలసీమలో పాలెగాళ్లు విజయనగర రాజులకు పన్నులు వసూలు చేయడంలోనూ, అంతర్గత రక్షణ కల్పించడంలోనూ, అవసరమైన సైన్యాన్ని సమీకరించడంలోనూ సహాయపడేవారు. క్రీ.శ.1565లో జరిగిన తళ్ళికోట యుద్ధంలో సుల్తానుల చేతుల్లో పరాజయం పొందిన విజయనగరం రాజులు తమ రాజధానిని హంపీ నుంచి ప్రస్తుత అనంతపురం జిల్లాలోని పెనుగొండకు క్రీ.శ.1591లో మార్చారు. అప్పటి నుంచి 1800 సంవత్సరంలో బ్రిటిష్‌వారికి రాయలసీమ ప్రాంతం ధారాదత్తం అయ్యేదాకా ఇక్కడ ముప్ఫై యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల న్నిటిలో సీమ ప్రజలకు ధన, మాన, ప్రాణ, నష్టం జరగకుండా చూసింది పాలెగాళ్లే. క్రీ.శ. 1800 నాటికి రాయలసీమలో 80 మంది పాలెగాళ్ళు ఉండేవారు. వీరి కింద 30,000 మంది సైనికులు ఉండేవారు. రాయలసీమ ప్రాంతం బ్రిటిష్ వాళ్లకిందికి వచ్చిన తర్వాత పాలెగాళ్లు నామమాత్రులయ్యారు. బ్రిటిష్ వారి దోపిడీ పతాకస్థాయికి చేరుతుండటంతో పాలెగాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఐదు వేలమంది సాయుధులతో, ఇతర పాలెగాళ్లు, జమీందారుల సహకారంతో వాళ్లపై 1846లో తిరుగుబాటును ప్రారంభించాడు. అనేక సంఘర్షణల అనంతరం 1846 అక్టోబర్ 6న నరసింహారెడ్డిని బ్రిటిష్‌వాళ్లు పట్టుకున్నారు. 200 మంది అనుచరులతో రెడ్డి ఎర్రమల కొండలను వదిలి పెరసోమలలోనికి పోయినట్లు అనుమానించి పెరసోమల గ్రామం వద్ద బ్రిటిష్‌వాళ్లు ఆయన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. ఉయ్యాలవాడను చివరకు 1847 ఫిబ్రవరి 22న ఉరితీశారు. దీనిని కలెక్టర్ కాన్‌క్రేన్ పర్యవేక్షించాడు. మృతదేహం తలను నరికించి... ఆ తలను కోయిలకుంట్ల బురుజుకు వేలాడదీయించాడు. అలా 1847 నుంచి 1877 వరకు కోయిలకుంట్ల బురుజుకు ఆయన తల వేలాడుతూనే ఉంది. (చదవండి: ప్రజల గుండె చప్పుడు) ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి త్యాగ ధనులు పుట్టిన రాయలసీమపై కొందరు... ఫ్యాక్షన్ ముద్రవేసి దాని గౌరవాన్ని తగ్గించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి! - డాక్టర్ ఏనుగొండ నాగరాజ నాయుడు రిటైర్డ్ ప్రిన్సిపాల్, తిరుపతి (ఉయ్యాలవాడ ఉరికంబమెక్కి రేపటికి 175 ఏళ్లు) -
కేంద్ర పథకాలకు మార్గదర్శి
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గొప్ప మేధావి, కార్యశీలి, రాజనీతిజ్ఞుడు, నిస్వార్థ సేవకుడు. దీనదయాళ్ ఉన్నత విద్యను అభ్యసించిన అనంతరం ఉత్తరప్రదేశ్ ఆర్ఎస్ఎస్ శాఖలో చేరారు, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రేరణతో 1951లో రాజకీయ క్షేత్రం భారతీయ జనసంఘ్‌లో ప్రచారకులుగా చేరారు. ఆ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణలో క్రియాశీలక పాత్ర పోషించారు. అఖిలభారత అధ్యక్షులుగా పట్నాకు రైలులో ప్రయాణిస్తున్న దీన దయాళ్ ఉపాధ్యాయ 1968 ఫిబ్రవరి 11న మొఘల్ సరాయ్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం వద్ద శవమై పడి ఉన్నారు. ఆయన మరణం గురించి ఇప్పటివరకు అసలు నిజాలు వెలుగులోకి రాలేదు. దీనదయాళ్ అందించిన ఏకాత్మ మానవ దర్శనం (ఇంటిగ్రల్ హ్యూమనిజం) అనే గొప్ప తాత్విక సిద్ధాంతాన్ని బీజేపీ తన రాజకీయ తాత్విక సిద్ధాంతంగా పేర్కొంటుంది. దీన దయాళ్ తన ఏకాత్మ మానవ దర్శనంలో ఈ దేశం అభివృద్ధికి చేపట్టే ప్రణాళిక ఏదైనా... అది దేశానుగుణం, కాలానుగుణమై ఉండాలని చెప్పారు. రాజకీయ, ఆర్థిక రంగాలలో వికేంద్రీ కరణను; ప్రభుత్వ రంగంతో పాటు ఉపాధి కల్పనలో ప్రైవేట్ రంగం ప్రాధాన్యం కూడా గుర్తించాలనీ, దేశంలో ప్రతి వ్యక్తీ ఉపాధి పొందాలనీ, తద్వారా ఉత్పత్తికి దోహదపడాలనీ వారు కోరుకున్నారు. భారీ పరిశ్రమలు వద్దన్నారు. కుటీర పరిశ్రమలే కావాలన్నారు. లోటు బడ్జెట్, ద్రవ్యోల్బణాలకు ప్రభుత్వం చేసే అధిక ఖర్చు కారణమని చెప్పి... పొదు పును ప్రోత్సహించారు. ఆర్థిక అవసరాల కోసం ప్రకృతిని నాశనం చేయకూడదనీ, ఆర్థిక ఫలాలు అందరికీ అందజేయాలనీ అన్నారు. (చదవండి: శతవసంత స్వరమాధురి) ఈ సిద్ధాంతం ఆధారంగానే... దీన దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన, ప్రధాని ఆవాస్ యోజన, గ్రామ జ్యోతి యోజన, కౌశల్ యోజన, ప్రధాన మంత్రి సడక్ యోజన, బేటీ బచావో బేటీ పఢావో, ఆత్మనిర్బర్ భారత్ వంటి అనేక పథకాలతో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ వంటి నినాదాలతో అందరికీ తను నిర్దేశించిన లక్ష్యాల ఫలాలు అందించాలని భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. దీనదయాళ్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి! – శ్రీశైలం వీరమల్ల, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు (ఫిబ్రవరి 11న దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి) -
శతవసంత స్వరమాధురి
ఇరవయ్యో శతాబ్దంలో భారతీయ సంగీత సామ్రాజ్యంలో ‘భీమ్ సేన్ గురురాజ్ జోషీ’ది అగ్రగణ్య స్థానమని చెప్పాలి. హిందుస్తానీ సంప్రదాయ సంగీతంలో మేరునగ ధీరునిగా పేరుగాంచిన ఆయన 1922 ఫిబ్రవరి 4న కర్ణాటక రాష్ట్రం, గదగ్ జిల్లాలోని రాన్ ప్రాంతంలో జన్మించారు. ‘పండిట్ భీమ్ సేన్ జోషీ’గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆయన తన చిన్నతనంలో పదకొండవ ఏటనే అబ్దుల్ కరీంఖాన్ గానం విని తన్మయుడై ఆయన స్వరానికి ఉత్తేజం చెంది తానూ సంగీతం నేర్చుకోవాలనే జిజ్ఞాసతో గురువును వెతుక్కొంటూ ఇల్లు వదలి గ్వాలియర్ చేరుకొని ఓ సంగీత పాఠశాలలో చేరి, ఆ తరువాత మంచి గురువు కోసం అనేక చోట్ల తిరిగి తిరిగి చివరకి 1936లో ‘సవాయిగంధర్వ’ వారి వద్ద శిష్యునిగా చేరారు. ఇక అప్పటి నుండి 24 జనవరి 2011న తన 88వ ఏట ఈలోకం వీడి వెళ్లేంత వరకు తన గంధర్వ గానంతో ‘హిందుస్తానీ సంగీతాన్ని’ అజరామరం చేస్తూనే ఉన్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డు, మహారాష్ట్ర భూషణ్, కర్ణాటకరత్న లాంటి గౌరవ పురస్కారాలతో పాటు... భారత దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ కూడా పండిట్ భీమ్ సేన్ జోషీని వరించింది. (సకిన రామచంద్రయ్య: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) హిందుస్తానీ శాస్త్రీయ సంగీత ఆలాపనలే కాక ఆయన కన్నడ భజనలు, మరాఠీ అభంగులు, ‘బసంత్ బహార్, తాన్ సేన్’ లాంటి చలన చిత్రాల్లో పాటలు తనకు తానే సాటి అన్నట్టుగా గానం చేశారు. భీమ్ సేన్ జోషీ కర్నాటకకు చెందిన పురందర దాసు కృతులు కూడా ఆలపించటం విశేషం. కర్ణాటక సంగీతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మంగళంపల్లి బాలమురళీకృష్ణతో ఆయన కలిసి చేసిన ‘జుగల్ బందీ’ కచేరీలు సంగీతాభిమానులకు మరచిపోలేని అనుభూతులు. కర్ణాటక సంగీతంలో ‘సంగీత సామ్రాజ్ఞి’ ‘భారతరత్న’ అవార్డు గ్రహీత ఎమ్మెస్ సుబ్బులక్ష్మితో కలసి కూడా భీమ్ సేన్ జోషీ సంగీత కచ్చేరీలు చేశారు. ‘కిరానా ఘరానా’ స్వరశైలిలో ప్రఖ్యాతి గాంచిన భీమ్ సేన్ జోషీ హిందూస్తానీ సంగీతంలో ఓ ధ్రువ తారలా వెలిగారు. శుద్ధ కళ్యాణ్, పురియా కళ్యాణ్, పురియా, ముత్ లానీ, మారు బిహాగ్, తోడి లాంటి హిందుస్తానీ రాగాల్లో ఆయన సంగీత రసజ్ఞత ఆపూర్వం. ‘మిలేసుర్ మేరా తుమ్హారా’, అంటూ 1980 దశకంలో దూరదర్శన్ వీడియో కోసం ఆయన పాడిన పాట వినని వారుండరు. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి) సంగీతం సార్వత్రికమైనది. దానికి భాషా భేదాలు లేవు. అందునా భారతీయ సంగీతం వేదకాలం నుండి ప్రఖ్యాతమైంది. అటువంటి భారతీయ సంగీత సౌరభాన్ని ఈ ప్రపంచానికి పంచిపెట్టిన మహా విద్వాంసుడు ‘భారతరత్న పండిట్ భీమ్ సేన్ జోషీ’ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మరోసారి ఆ మహనీయునికి శ్రద్ధాంజలి. – డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ జర్నలిస్టు (ఫిబ్రవరి 4న పండిట్ భీమ్సేన్ జోషీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా) -
అణచివేతను ధిక్కరించిన అరుణపతాక
అణగారిన కులాలపై పెత్తందార్ల అణచివేత పోకడలను ధిక్కరించిన అరుణపతాక చండ్ర పుల్లారెడ్డి. 1917 జనవరి 19న కర్నూలు జిల్లాలో జన్మించారు. ఇంజనీరింగ్ చదువు కోసం చెన్నై వెళ్ళిన పుల్లారెడ్డి కమ్యూ నిస్టు దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్యతో పరిచయం ఏర్పడటంతో కమ్యూనిస్ట్ భావజాలానికి ఆకర్షితులయ్యారు. ఆ రోజుల్లో తెలంగాణలో ఉధృతంగా సాగుతున్న సాయుధ పోరాటంలో పాల్గొనేందుకు వెళుతుండగా నిర్బంధానికి గురయ్యారు. జైల్లో ఉన్నపుడు సాయుధ పోరాటాన్ని విరమించాలన్న పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. (చదవండి: సమసమాజ విప్లవ తపస్వి.. జ్వాలాముఖి) 1952 ఎన్నికల్లో కర్నూలు జిల్లా నంది కొట్కూరు అంసెంబ్లీ నియోజకవర్గం నుండి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలు పొందారు. 1964లో పార్టీ చీలిక సందర్భంలో పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో మార్క్సిస్టు పార్టీలో చేరారు. ఇండో–చైనా యుద్ధ సమయంలో చైనాకు అనుకూలంగా మాట్లాడారని నాటి ప్రభుత్వం ఆయనను నిర్బంధించింది. తర్వాత బెంగాల్లో చారు మజుందార్ ప్రభావంతో సాయుధ పోరాటం వైపు మళ్లారు. ఆయన రాసిన ‘వీర తెలంగాణ విప్లవ పోరాటాలు–పర్య వసానాలు’ కార్యకర్తలను ఎంతో చైతన్యపరచింది. (చదవండి: సైన్సును మతం నుంచి వేరుచేసిన శాస్త్రవేత్త) 1970లో అంటరాని తనం తీవ్రంగా ఉన్నపుడు... అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో దళితుల పక్షాన అగ్రవర్ణాలు భూస్వాములతో రాజీలేని పోరాటం చేశారు. దళితులు చెప్పులు వేసుకోరాదని, 2 గ్లాసుల పద్ధతిని విధించిన భూస్వాముల ఆంక్షలను నిరసించారు. దీంతో ప్రభుత్వం వెట్టిచాకిరీని రద్దు చేస్తూ, చట్టాన్ని తెచ్చింది. నిరంతరం సమరశీల ఉద్యమాలను నిర్మిస్తూ, పీడిత వర్గాల కోసం తుదిశ్వాస వరకు పోరాడిన ఈ అరుణ పతాక 1984 నవంబర్ 9వ తేదీన అజ్ఞాతంలో తనువు చాలించారు. (చదవండి: పారిశ్రామిక విప్లవానికి పునాది) – డా. ఎస్ బాబూరావు, సీనియర్ జర్నలిస్ట్, కావలి -
ఆదివాసీల ఆశాజ్యోతి... హైమండార్ఫ్
ఎడతెగని చొరబాట్లు, అన్యాక్రాంతమైన అటవీ సాగు భూములు, ఆంక్షలు, దోపిడీ, హేళన – ఇది 19వ శతాబ్దం నుండి మొదలై కొనసాగుతున్న మన దేశపు ఆదివాసుల కష్ట గాథ. అటవీ, ఖనిజ సంపదలను కొల్లగొట్టడా నికి బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన నిషేధ విధానాలతో మొదలైన ఈ సంక్షోభం మరెన్నో హంగులు దిద్దుకొని నేటికీ కొనసాగుతూ ఉంది. ఆదివాసీల ప్రాచీన జీవన విధానం, సంస్కృ తుల్లోనే ప్రశాంతత, నెమ్మదితనం ఉన్నాయి. వారు అలాగే జీవించడంలో ఎంతో మక్కువను చూపి స్తారు. అటువంటి ఈ మొండి ప్రజలను ‘ప్రగతి శీల’ జీవన స్రవంతిలోనికి ఎట్లా తేవాలా అనే ఆలోచనలు 20వ శతాబ్ది తొలి భాగం నుండే మొదలైనాయి. బయటివారి రాజకీయ వ్యవస్థలు, పాలనా విధానాలను వారిపై రుద్దకుండా... ఆది వాసీల తత్త్వానికి సరిపడే రీతిలో మనమే ఒదిగి, బయటి వారి అతిక్రమణల ఛాయల నుండి వారిని రక్షిస్తూ... వారి సహజ ఆవరణంలోనే ఉండనిస్తూ ఆధునిక ప్రపంచపు విద్య, అవగాహనలు అందించే గొప్ప ప్రయత్నం హైదరాబాద్ సంస్థానంలో 1940ల్లో జరిగింది. ‘‘చదువుకోవటం వల్ల లౌకిక ప్రయోజనాలు న్నాయన్న సంగతి మూలవాసికి తెలిసినా అతని మనస్సులో, ఆత్మలో తనదైన సంస్కృతి పట్ల అసంకల్పితంగా, అతి లోతుగా ఇంకిపోయి ఉన్న అభిమానాన్నీ దాని పట్ల అతనికున్న గర్వభావ ననూ ఉద్ఘాటించటం ద్వారానే అతన్ని ఉత్తేజపరచ గలం,’’ అని హైదరాబాదు సంస్థానంలోని మూల వాసుల జీవనగతులను అప్పటికే పరిశీలిస్తూ నిర్ధారణకు వచ్చిన బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ పేర్కొన్నారు. అటు వంటి హైమండార్ఫ్‌ను ఆదిలాబాద్ గోండుల కోసం ఒక ప్రాథమిక విద్యా విధానాన్ని రూపొం దించమని కోరింది నైజాం ప్రభుత్వం. తొలి గోండి భాషా వాచకాలను వాళ్ల జీవన వాతావరణం, పురాణాలు, కథలు, నమ్మకాలకు సంబంధించిన అంశాలతోనే ఆయన రూపొందించారు. ఈ ప్రయోగం ఫలించిన తర్వాత ఆదిలాబాద్ మూల వాసుల కోసం ఒక సమగ్ర పునరావాస, అభివృద్ధి పథకాన్ని కూడా రూపొందించి అమలు చేయమని, గిరిజన తెగలు, వెనుకబడిన తరగతుల విషయాల సలహాదారుగా అధికార పదవిలో ఆయనను నియమించింది నైజాం ప్రభుత్వం. ఒక మానవ శాస్త్రవేత్తకు ఇటువంటి బాధ్యతను అప్ప గించిన అరుదైన సందర్భం ఇది. కొమురం భీం తిరుగుబాటు అణచివేత తరువాత నిస్పృహలో కూరుకుపోయి ఉన్న ఆదిలాబాద్ మూలవాసుల జీవితంలో మళ్లీ ఉల్లాసాన్ని, నమ్మకాన్ని తీసుకువచ్చిన ఈ గొప్ప ప్రయత్నం గురించి కళ్లకుగట్టినట్టు వివరించే 1944, 1946 సంవత్సరాల్లో హైమండార్ఫ్ రాసిన నివేదికలు నేటికీ చదువదగినవి. 80 శాతం మూలవాసీ కుటుంబాలకు 150,000 ఎకరాల భూమిని ప్రభుత్వ పట్టాలతో అందజేసి వారికి అత్యవసరమైన జీవనభద్రతను అప్పుడు కల్పించగలిగారు. అయితే తరువాతి దశకాల్లో వచ్చిన పరిణామాలతో ఈ అభివృద్ధి లాభాలను చాలా వరకు కోల్పోయి, నక్సల్ ఉద్యమం, దాని అణచివేత, మళ్లీ ప్రభుత్వం చొరవతో అమలుపరచిన అభివృద్ధి పథకాలు, వాటి లోపాలు – ఇట్లా ఎన్నో ఒడుదొడుకులకు వారు గురవుతూ వస్తూ ఉన్నారు. తమ చివరి రోజుల వరకూ తరచూ భారతదేశం, ఆంధ్రప్రదేశ్, మరీ ముఖ్యంగా ఆదిలాబాద్‌ను సందర్శిస్తూ ఆదివాసీ జీవితాల్లో వస్తూ ఉన్న ఈ పరిణామాలను తెలుసుకుంటూ, సూచనలు సలహాలు ఇస్తూ తమ అనుబంధాన్ని కొనసాగించారు హైమండార్ఫ్ దంపతులు. వారి వలె ఆదివాసుల ఆప్యాయతను, ఆరాధనను పొందుతున్న మానవ శాస్త్రవేత్తలు అరుదు. ‘‘ఇక్కడ ఈ మూలవాసుల్లో వర్గభేదం లేని, లింగ అసమానతలు లేని, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు లేని, విధవా వివాహాన్ని నిరోధించని ఒక ఆదర్శ సమాజం చక్కగా నిలిచి ఉన్నది... ఇటువంటి స్థితిలో మిగతా భారతీయ గ్రామీణ సమాజంలో ఇంకా కొనసాగుతున్న సామాజిక రుగ్మతలేవీ మూలవాసులకు వ్యాపించకుండా రక్షించటం దేశంలోని ప్రగతివాదుల గురుతరమైన బాధ్యత’’ అని హైమండార్ఫ్ ప్రభుత్వాధికారులకు, విధాన నిర్ణేతలకు దిశానిర్దేశం చేశారు. ఆదివాసులపై ఆయన వెలువరించిన వివిధ పుస్తకాలు, రచనల్లో వారి సంస్కృతుల గురించే కాకుండా వారికి అనువైన విద్య, తప్పనిసరిగా ఉండవలసిన సాగుభూమి భద్రత, వీటితో పాటు వారి జీవన దృష్టి గురించి చేసిన ప్రతిపాదనలు హైదరాబాద్ సంస్థానంలో, తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసుల సంక్షేమం గురించి పరి తపించే అధికారులు, సామాజిక కార్యకర్తలు, నాయ కులకు స్ఫూర్తిగా, మార్గదర్శకంగా నిలిచాయి. - సుమనస్పతి రెడ్డి ఆకాశవాణి విశ్రాంత అధికారి (మూలవాసుల విద్య, అభివృద్ధుల గురించి 1944, 1946ల్లో హైమండార్ఫ్ రాసిన నివేదికల తెలుగు అనువాదం హైమండార్ఫ్ దంపతుల స్మృతి దినంగా జరుపుకొనే జనవరి 11న, ఆయన చాలా కాలం నివసించిన మార్లవాయి గ్రామంలో (ఇప్పుడు కుమురం భీం జిల్లా) విడుదల కానుంది) -
సైన్సును మతం నుంచి వేరుచేసిన శాస్త్రవేత్త
బరువైన వస్తువు, తేలికైన వస్తువు కన్నా వేగంగా కిందకి పడుతుందని అరిస్టాటిల్ (క్రీ.పూ. 384–332) భావిం చాడు. అది నిజమేనని నమ్ముతూ సాగింది యావత్తు ప్రపంచం సుమారు 20 శతాబ్దాల పాటు! దీన్ని కొందరు విభేదించినా, అరిస్టాటిల్ ప్రతిష్ఠ కారణంగా ఆ అభిప్రాయం చలామణి అవుతూ వచ్చింది – గెలీలియో రంగ ప్రవేశం దాకా! ఇటలీ లోని వాలిన పీసా గోపురం నుంచి వేర్వేరు బరువులున్న వస్తువులను పడవేసి, అరిస్టాటిల్ చెప్పిన భావన తప్పు అని రుజువు చేశాడు గెలీలియో గెలీలి. ఈ వృత్తాంతం జరిగిందనే ఆధారాలు లేకపోయినా – విరివిగా నేటికీ గిరికీలు కొడుతోంది. గెలీలియోతో ఆధునిక విజ్ఞానం మొదలైందని పరిగణిస్తూ క్రీ.శ. 1550ను ప్రారంభంగా సూచిస్తాం. ఆయనను ఆధునిక వైజ్ఞానిక పితామహుడిగా పరిగ ణించాలని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వంటి వారు పేర్కొంటారు. కటకాలను ఉపయోగించి దూరపు వస్తువులను తలకిందులుగా చూడగలుగు తున్నారని తెలియగానే ఆరునెలల్లో టెలిస్కోపు నిర్మించుకున్నారు గెలీలియో. దీనితో పాలపుంత విషయాలు, జూపిటర్ గ్రహానికుండే చంద్రుళ్ళు, శని గ్రహపు వలయాలు– ఇలా చాలా సంగతులు చూపించి సైన్స్ ఏమిటో వివరించిన తొలి ప్రాయోజిక శాస్త్రవేత్త. తన టెలిస్కోపును తనే తయారుచేసుకున్న ఇంజనీరు కూడా! వైద్యుడు కావాలనుకున్నా గణితం మీద ఇష్టంతో గణితాచార్యుడై ప్రకృతి నియమాలు గణితాత్మకమని ప్రతిపాదించారు. సూర్యుడు, చంద్రుడు మొదలైనవి భూమి చుట్టూ తిరుగుతున్నాయనే నమ్మకం పుస్తకాలలో చేరి మతభావనలలో అంతర్భాగమైంది. కోపర్నికస్ (1473–1543) దీన్ని కాదని సూర్యుని చుట్టూ మిగతా గ్రహాలు తిరుగుతున్నాయనే ‘సూర్య కేంద్రక సిద్ధాంతం’ ప్రతిపాదించి, విశ్వాసాలతో ఇబ్బందులు పడి, అలాగే మరణించాడు. కానీ గెలీలియో టెలిస్కోపుతో ఏది ఏమిటో విప్పిచూపాడు. భూకేంద్రక సిద్ధాంతం కంటే సూర్యకేంద్రక సిద్ధాంతం అర్థవంతమని వివరించాడు. ఫలితంగా అది మత పెద్దలకు కంటగింపుగా మారింది. అయినా పట్టు వదలక ఈ విషయాలను నాటకంగా రాసి, మరింతగా జనాల్లోకి తీసుకెళ్లిన సృజనశీలి గెలీలియో. ఈ సాహసగుణమే ఉద్యోగానికి ఎసరుపెట్టింది. చివరికి గృహఖైదులో కనుమూసేలా చేసింది. గెలీలియో ప్రతిపాదనను గుర్తించినట్టు 1992 అక్టోబర్ 31న వాటికన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్థిరపడిన విషయాన్ని ప్రశ్నించే తత్వాన్ని తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న గెలీలియోకు కవిత్వం, సంగీతం, కళా విమర్శ అంటే కూడా ఆసక్తికరమైన అంశాలు. నిజానికి అప్పటికి మతం, ఫిలాసఫీ, సైన్స్ మూడూ ఒకటే అనే తీరులో సాగేవి. ఈయన గొప్పతనం ఏమిటంటే – మతం నుంచి సైన్సును వేరుచేశాడు. తర్వాత ఫిలాసఫీ నుంచి సైన్సును వింగడించి పరిపుష్టం చేశాడు. గెలీలియో చేసిన మరో గొప్ప పని ఏమిటంటే – గణితాన్ని విజ్ఞాన శాస్త్రంలో ప్రవేశపెట్టడం. గణితం రాకతో విజ్ఞాన శాస్త్రానికి కచ్చితత్వం ఒనగూడింది. ఆయన ఎంత సూక్ష్మగ్రాహి అంటే – చర్చిలో ఊగే దీపాన్ని పరిశీలించి – వేగం తగ్గినా, కదిలే దూరం మారినా, చలనానికి పట్టే వ్యవధి మారదని గుర్తించారు. ఎలా సాధ్యమైందిది? నాడిని కొలిచి ఈ విషయం చెప్పారు. పరోక్షంగా ‘పల్సో మీటర్’ భావనను ఆయన ఇచ్చారు. 1564 ఫిబ్రవరి 15న జన్మించిన గెలీలియో 1642 జనవరి 8న కనుమూశారు. అదే సంవత్సరంలో ఐజాక్ న్యూటన్ జన్మించడం విశేషం! విశ్వాసాలను పరీక్షకు పెట్టడమే కాదు, పరిశీలనతో తనను తాను సవరించుకునే సైన్స్ టెంపర్ కలిగిన గొప్ప సాహసి అయిన శాస్త్రవేత్త గెలీలియో గెలీలి. - డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
అపస్మారక స్థితిలో ఉన్నా.. కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: దివంగత లెజెండరీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జయంతి సందర్భంగా ఆయన భార్య సుతాపా సిక్దర్ భావోద్వేగానికి గురయ్యారు. ఇర్ఫాన్‌తో పంచుకున్న జీవితాన్ని, ఇతర విషయాలను తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సుతాప అతనితో మరెన్నో జ్ఞాపకాలను పంచుకున్నారు. భర్త చనిపోవడానికి ముందు రోజురాత్రి అతనికిష్టమైన పాటల్ని పాడుతూ కూచున్నానని గుర్తు చేసుకున్నారు. ఒక వెబ్‌సైట్‌తో తన ఆవేదనను పంచుకున్నారు సుతాప. తాను పాడుతోంటే..అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఇర్ఫాన్ కళ్ల నుంచి నీళ్లు అలా ప్రవహిస్తూనే ఉన్నాయని చెప్పారు. ఉమ్రావ్ జాన్ మూవీలోని 'ఝూలా కిన్నే దాలా రే, హమ్రియా, లతా మంగేష్కర్ ఆలపించిన పాపులర్ సాంగ్ ‘లగ్ జా గలే’, ఆజ్ జానే కీ జిద్ న కర్ అనే గజల్‌ను ఇర్ఫాన్ కోసం పాడి వినిపించానంటూ సుతాప ఎమోషనల్ అయ్యారు. ఇర్ఫాన్ లేకుండా, సింగిల్ మదర్‌గా తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకునే వారు సుతాప. గత ఏడాది ఇర్ఫాన్ వర్ధంతి సందర్భంగా ఇర్ఫాన్కెంతో ఇష్టమైన నైట్ క్వీన్ మొక్కను నాటి నివాళి అర్పించారు. ఈ పూల సువాసన ఇర్ఫాన్‌కి చాలా ఇష్టమని పేర్కొన్నారు. అలాగే ఇర్ఫాన్ పెద్ద కుమారుడు బాబిల్ ఖాన్ కూడా తమకు దూరమైన తండ్రి గురించి తలచుకుంటూ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. కాగా కేన్సర్‌తో బాధపడుతూ ఏప్రిల్ 29, 2020న ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
రాజ్యహింసను ధిక్కరించినవాడు
దేశ చరిత్రలో 1975లో విధించిన ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులను వాదించడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో రాజ్యానికి వ్యతిరేకంగా ధిక్కారస్వరం వినిపించారు న్యాయవాది కేజీ కన్నాభిరాన్. డా. బీఆర్ అంబేడ్కర్ దేశ పౌరులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను ప్రభుత్వాలు హననం చేస్తుంటే ప్రతిఘటించారాయన. భూమి కోసం, భుక్తి కోసం, న్యాయం కోసం ప్రజల తరపున పోరాడుతున్న వారి ఇళ్లపై దాడులు చేస్తూ రాత్రికి రాత్రే మాయం చేసి, ఎదురు కాల్పుల పేరుతో కాల్చి చంపారు. తూటాలతో, లాఠీలతో, పౌర హక్కుల పోరాటవీరుల సమూహాలపై దాడులు చేసి, భయానక వాతావరణం సృష్టించారు. ఆ నిరంకుశత్వాన్ని నిరసించి, ప్రజల పక్షాన పోరాడిన హక్కుల యోధుడు. సింగరేణి కార్మికుల పోరాట, ఆరాటాలలో కూడా వారికి మద్దతు పలికిన కార్మిక పక్షపాతి. పౌరహక్కుల ఉద్యమనేత, అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో వకీలు, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీ సంస్థకు సహ వ్యవస్థాపకుడు. కొంతకాలం ఆ సంస్థ అధ్యక్షుడిగా కూడా కన్నాభిరాన్ పనిచేశారు. 1970 ప్రాంతంలో చట్టబద్ధ హక్కుల కోసం పోరాడుతున్నవారిపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధం కొనసాగిస్తున్నపుడు న్యాయవాదులందరూ కలసి నక్సలైట్ డిఫెన్స్ క్సౌన్సిల్ను ఏర్పాటు చేసి, ఆ సంస్థకు ఆయనను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. హైదరాబాద్, పార్వతీపురం కుట్ర కేసులలో డిఫెన్స్ న్యాయవాదిగా పనిచేశారు. ఎమర్జెన్సీ కాలంలో తప్పుడు కేసుల పాలైన వారి తరపున వాదించిన ఏకైక న్యాయవాది ఆయనే. పీడితులు, కార్మికులు, హక్కులు, పోరాటాలకు ఆయన ఎప్పుడూ అండగా నిలిచేవారు. పౌరుల జీవించే హక్కుల కోసం కన్నాభిరాన్ జీవితాన్ని అంకితం చేశారు. నవంబర్ 9, 1929న మదురైలో జన్మించిన ఆయన 2010 డిసెంబర్ 30న హైదరాబాద్‌లో తనువు చాలించారు. – డా. ఎస్. బాబూరావు, సీనియర్ జర్నలిస్ట్ (డిసెంబర్ 30న కన్నాభిరాన్ వర్ధంతి) -
షమీ...నేను పిచ్చోణ్ని కాదు!
కోల్‌కతా: ‘మిస్టర్ కూల్’ ధోని తన సహచరుల్ని దారిలో పెట్టేందుకు అప్పుడప్పుడూ కోపాన్ని కూడా ప్రదర్శిస్తాడు. కానీ ఇవేవీ మనకు లైవ్ మ్యాచ్‌ల్లో కనిపించవు. ఇవి చవిచూసిన ఆటగాళ్లు చెబితేతప్ప తెలియదు. ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న పేసర్ మొహమ్మద్ షమీ దీన్ని ఇప్పుడీ లాక్డౌన్ సమయంలో తన బెంగాల్ రంజీ జట్టు సహచరుడు మనోజ్ తివారీతో పంచుకున్నాడు. 2014లో న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా వెల్లింగ్టన్లో జరిగిన టెస్టులో సరిగా సంధించని బంతిపై కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే మహీకి కోపమొచ్చిందట. వెంటనే ‘దేఖ్ బేటా... బహుత్ లోగ్ ఆయే మేరే సామ్నే... బహుత్ లోగ్ ఖేల్‌కే చలే గయే. జూట్ మత్ బోల్. తుమారే సీనియర్, తుమారే కెప్టెన్ హై హమ్. యే బేవకూఫ్ కిసీ ఔర్‌కో బనానా’ (చూడు బిడ్డా... నేను ఎంతో మందిని చూశాను. నా కళ్ల ముందు ఆడి వెళ్లిన వారెందరో ఉన్నారు. ఇలాంటి అబద్ధాలు చెప్పకెప్పుడూ. నేను నీ సీనియర్ని. కెప్టెన్నీ కూడా... నన్ను పిచ్చోణ్ని చేయకు. వేరే వాళ్లెవరినైనా మభ్యపెట్టు) అని మందలించినట్లు అప్పటి సంఘటనని పేసర్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్ మంచి స్థితిలో ఉన్నప్పటికీ బ్రెండన్ మెక్కల్లమ్ (302) ట్రిపుల్ సెంచరీతో గెలుపు దూరమైందని, నిజానికి 14 పరుగుల వద్ద కోహ్లి క్యాచ్ వదిలేయడంతో అతను సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆవిష్కరించాడని షమీ వివరించాడు. మళ్లీ 300కు చేరువైనప్పుడు కూడా క్యాచ్ వదిలేయడంతో అసహనానికి గురైన షమీ తర్వాత బంతి బౌన్సర్ వేశాడు. ఆ బౌన్సర్‌ను ధోని అందుకోలేకపోవడం... అదికాస్తా బౌండరీ దాటిపోవడం జరిగాయి. దీనిపై ధోని సంజాయిషీ కోరగా షమీ ఏదో చెప్పబోయాడు. దాంతో ‘మిస్టర్ కూల్’ తనకు ఘాటుగా బదులిచ్చాడని షమీ అప్పటి విషయాన్ని వివరించాడు. -
ఊరు ఉంది
జ్ఞాపకం మూడుంపావు అవుతోంది. లాస్ట్ పిరియడ్ అంజయ్య మాస్టారు గారి సోషల్ క్లాస్. బుర్రలో రకరకాల ఆలోచనలు. ఎలా కాళీని చూడాలి. కాళి తప్ప మనసుకు ఏమీ పట్టడం లేదు. ఆ... ఐడియా వచ్చింది. సార్.. అని పిలుస్తూ నెమ్మదిగా అంజయ్య మాస్టారి దగ్గరకు వెళ్లాను. స్టాఫ్ రూమ్‌లో ఉన్నారు. కొంచెం మంచి అభిప్రాయమే ఉంది కదా మనమంటే, ‘ఏంటమ్మా’ అన్నారు ప్రసన్నంగా. ‘తలనొప్పిగా ఉంది సార్. మీరు పర్మిషన్ ఇస్తే లాస్ట్ పావు గంట ఇంటికి వెళ్తాను’ అన్నాను. అరగంట ఆయన క్లాస్ వింటాననే సరికి వాత్సల్యం అంతా కళ్లల్లో ప్రకటిస్తూ సరేనమ్మ వెళ్లు అన్నారు. అనందభాష్పాలు రాలడం ఒక్కటే తక్కువ. హమ్మయ్య ఇవాళ కాళిని చూడొచ్చు అనుకోగానే ఎక్కడలేని హుషారు వచ్చింది. ఉత్సాహంగా క్లాస్‌కి అటెండ్ అయ్యి, సోషల్ స్టడీస్‌లో కూడా డౌట్స్ అడిగి వెళ్లాల్సిన టైమ్ దగ్గర పడగానే నీరసంగా ముఖం పెట్టి కూర్చున్నాను. నా ముఖం చూసే సరికి సర్కి గుర్తొచ్చింది. ‘ఇంక వెళ్లమ్మా’ అన్నారు. ఓపిక లేనట్లు లేచి బుక్స్ తీసుకుని బయల్దేరాను. ఏమనుకున్నారో.. నేనూ వస్తానమ్మ. పదా.. నాన్నగారిని కలిసి చాలా రోజులు అయ్యింది అన్నారు. నా గుండె ఢాం అంది. బిత్తర చూపులు చూశాను. కారణం తెలిసిన నెప్పల్లి పద్మ నా ముఖం చూసి కిసుక్కున నవ్వింది. మిగతా పిల్లలు అర్థం కాక అయోమయంగా, అసూయగా చూస్తున్నారు. గొంతులోంచి మాట రావట్లేదు. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు కదా! కాళి ఈ ఊళ్లో ఉన్నన్నాళ్లూ ఈ అబద్ధాలు తప్పవు. ఇంతలో వచ్చాడు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఆర్తత్రాయ పరాయణుడు. మా స్కూల్ అటెండర్ నోటీసు పట్టుకుని. ఇదే ఛాన్స్ అనుకుని ఛలో... స్కూల్ బయటి వరకు నెమ్మదిగా నడుచుకుని వచ్చాను. పరుగు. ఇంక ఒకటే పరుగు. తెలిసినవాళ్లు ‘డాక్టరు గారి అమ్మాయి ఏంటి ఇలా పరుగెడుతోంది’ అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీళ్లకేం తెలుసు. ఇంకా నాలుగు రోజుల్ల్లో కాళి వెళ్లిపోతాడని. ఆయాసపడుతూ వచ్చాను గేట్ దగ్గరికి. నన్ను చూడగానే ఏసు గేట్ తెరిచాడు. లాస్ట్ చెయిర్ ఖాళీగా ఉంటే కూర్చున్నాను. హమ్మయ్య ఇంకా కొంచెం టైమ్ ఉంది. జయసుధ, జయప్రదల క్లైమాక్స్ డాన్స్ పాట ఇంకా మొదలవలేదు. ఎన్.టి.రామారావు కాళీని పిలవడానికి టైమ్ ఉంది. ఇదంతా.. అడవిరాముడు సినిమాలో కాళి... కాళి... కాళీ అనే పాట గురించి. ఏనుగుల గుంపు వచ్చి ఎన్.టి.ఆర్.కి హెల్ప్ చేసే పాట. ఇంతలో పాట స్టార్ట్ అయింది. అదిగో అనుకున్న టైమ్ వచ్చింది. పిలిచేశాడు ఎన్.టి.ఆర్. కాళీ అని. మైమరచి పోయి చూస్తున్నాను. ఒళ్లు గగుర్పొడిచే సీన్. ఏనుగుల హెల్ప్‌తో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కాళిని కరువు తీరా చూసి ఏనుగునెక్కిన ఆనందంతో ఇంటికి వచ్చాను. ఆ పాట కోసం ఇరవై నాలుగుసార్లు సినిమా మొత్తం చూశాను. లాస్ట్ లాస్ట్‌లో కేవలం పాట కోసం వెళ్లేదాన్ని. కాకపోతే లాస్ట్ పిరియడ్ అంజయ్య మాస్టారితో ఇబ్బంది. మంచి మాస్టారు. మల్లెపువ్వులాంటి పంచాలాల్చీలో బక్క పలుచని రూపం. నోరు విప్పితే ‘సంస్కృతం’. ఎక్కువగా అబ్బాయిలతోనే ఆ భాషలో మాట్లాడి వాళ్లని ఎడ్యుకేట్ చేసేవాళ్లు. ఇంకా నాలుగు రోజుల్లో కొత్త సినిమా వేస్తారు, అడవిరాముడు తీసేస్తారు అనగానే మధ్యాహ్నం భోజనానికి వచ్చి ఇంక స్కూల్‌కి వెళ్లేదాన్ని కాదు. నాతో పాటు నా ఫ్రెండ్స్ నగరాజకుమారి, నెప్పల్లి పద్మ. ఏడుకొండలవాడ... వెంకటరమణ అనే పాట వినపడగానే వెళ్లి పోయేవాళ్లం. డాక్టర్ గారి అమ్మాయిని కదండీ, టికెట్స్ ఏమీ తీసుకోనక్కర్లా. అందులోనూ మ్యాట్నీ షో. పైగా గేట్దగ్గర మన ఆత్మబంధువు ఏసు ఉంటాడు. చూడగానే నవ్వుతూ లోపలికి పంపేవాడు. ఇంటర్వెల్లో సోడా తెచ్చేవాడు. ఎప్పుడైనా ఫస్ట్ షోకి వెళ్లి నిద్రపోతే లేపి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చేవాడు. కాళిని కరువు తీరా చూసి ఏనుగు ఎక్కినంత ఆనందంగా ఇంటికి వచ్చేదాన్ని. ఇప్పుడు ఎన్.టి.ఆర్. లేడు. అంజయ్యగారు లేరు. ఏసు లేడు. కాళిని పిలిస్తే ఏనుగొచ్చి హెల్ప్ చెయ్యడం అనే కాన్పెప్టుని ఎంజాయ్ చేసే అమాయకపు జనాలూ లేరు. కానీ ఊరు ఉంది. ఊరిని తలుచుకోగానే నిండే మనసు, వచ్చే ఆనందము ఉంది. - కవిత -
అమ్మ పీఠం
సినారె పుట్టినరోజు సందర్భంగా... మా అమ్మ డాక్టర్ సి. నారాయణరెడ్డితో మాట్లాడితే... అమ్మ అక్కున చేర్చుకున్నప్పుడు కలిగే ఆనందకంటే జ్ఞానపీఠం కూడా పెద్దది కాదేమో! అనిపిస్తుంది. అమ్మ ఒడిని మించిన పీఠం మరోటి ఉండదనిపిస్తుంది. ఎదిగే కొద్దీ ఒదిగే సంస్కారం, నిరాడంబరత అలవడింది అమ్మ నుంచేనంటారు. తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ... అమ్మ బొమ్మకు పదచిత్రణ చేయగలిగిన వాడినే కానీ పటచిత్రణ చేయలేనని కళ్లు తుడుచుకున్నారా విజ్ఞానఖని. ‘అమ్మంటే... ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ కన్నీళ్లు చనుబాలు కలబోస్తే ఆ జన్మ’ ఇక మా అమ్మ సంగతికొస్తే... మా అమ్మ పేరు బుచ్చమ్మ. ఏమీ చదువుకోలేదు. సంగీతం, సాహిత్యం తెలియదు. నన్ను సంతోషపెట్టడానికి పాటలు పాడేది. జోకొడుతూ పాడే పాటలో ఉన్న సాహిత్యం ఏమిటో బిడ్డకు అక్కరలేదు. బిడ్డకు అమ్మ గొంతును మించిన బాణీ అక్కరలేదు. ఆ గొంతులోని ప్రేమమాధుర్యాన్ని ఆస్వాదిస్తూ నిద్రలోకి జారిపోయిన జ్ఞాపకాలను నాకు మిగిల్చింది మా అమ్మ. లోకజ్ఞానం తెలియని అమాయకురాలు మా అమ్మ. వంద నాగళ్ల వ్యవసాయపు లోగిట్లో ఆమె ప్రపంచం నేనే. ఆమె సంతోషం నేనే, ఆమె దుంఖమూ నేనే. చదువుకోసమైనా సరే ఆమె కళ్ల ముందు నుంచి దూరంగా పోవడానికి ఇష్టపడేది కాదు. మా హనుమాజీ పేటలో నాలుగో తరగతిక్కూడా పాఠశాల లేదు. ‘పదో తరగతి చదవనీ, తాసిల్దారవుతాడ’నే వాడు నాయిన మల్లారెడ్డి. అయినా అమ్మ ఒప్పుకునేది కాదు. నేను సిరిసిల్ల (కరీంనగర్ జిల్లాలో తాలూకా కేంద్రం) మాధ్యమిక పాఠశాలలో చేరడం వెనుక ఒక కన్నీటి సంద్రం ఉంది. నాకు చదువుకోవాలని చాలా గట్టిగా ఉండేది. అమ్మకు నేను ఆమె కళ్ల ముందు నుంచి వెళ్లడం ఇష్టం లేదు. ఇద్దరి పట్టు సమంగా ఉంది. ఉక్రోషం కొద్దీ ఊరి బయట ఉన్న మోటబావిలో దూకేశాను. నాకు ఈతరాదు. నా స్నేహితుడు బావిలో దూకి నన్ను బయటకు తీసి మా అమ్మ దగ్గరకు తీసుకొచ్చాడు. ‘‘ఎందుకు బిడ్డా! ఈతరాదని తెల్సీ దూకావు’’ అని భోరున ఏడ్చింది. ‘‘నువ్వు సిరిసిల్ల బడికి వద్దన్నావుగా’’ అన్నాను. అంతే... నా ఇష్టం కోసం ఆమె రాజీపడ్డది. ‘‘సర్లే! అట్టాగే పోదువు గాని!’’ అన్నది. అలా సిరిసిల్లకు పంపింది. తర్వాత హైదరాబాద్‌లో చదివేటప్పుడు కూడా ఆమె ఎప్పుడూ సంతోషపడలేదు. ‘చదువుకని హైద్రాబాద్ పోయాడు’ అని బాధపడేది. నన్ను ‘బాపు’ అని పిలిచేది. చెప్పడం కూడా అలాగే. ‘‘మా బాపు పాటలు రాస్తుంటాడు’’ అని చెప్పేటప్పుడు కూడా ఆమెలో ఆనందం కంటే బిడ్డ కళ్ల ముందు ఉండకుండా ఎక్కడో దూరంగా ఉన్నాడనే ఆవేదనే ఉండేది. నేను చేసిన పనికి ఆమె ఆనందం పొందిన క్షణాలు నాకు గుర్తు లేదు. అప్పటి వరకు ఆమె ఉండనేలేదు. నేను ఎం.ఎ చదివేటప్పుడే నాకు దూరంగా... ఎప్పటికీ కనిపించనంత దూరంగా వెళ్లిపోయింది. నన్ను ఎంత ఒంటరిని చేసిందంటే... అమ్మ పోతూ పోతూ తన బొమ్మ (ఫొటో) ఇచ్చి పోలేదు. అసలు బొమ్మంటూ తీస్తే గదా ఇవ్వడానికి. ఎప్పుడైనా... ‘‘అమ్మా బొమ్మ దిగవే అంటే...ఆణిముత్యంలా నవ్వేది. నువ్వు నా బొమ్మవు కాదా బాపూ అంటూ నన్ను అక్కున చేర్చుకునేది. నాకు మిగిలింది నా మనోఫలకం మీదున్న అమ్మ బొమ్మ మాత్రమే. అయితే... ఇటీవల కళ్లు మూసుకుని చూస్తే అమ్మ బొమ్మ అలుక్కు పోతూంది. మిగిలిన ఆ కాస్త రూపమూ తుడుచుకుపోతే... దిగులుతో గుండె వణికిపోయింది. ఉదయం నిద్రలేచినప్పుడు కురులారబోసుకునే అమ్మరూపమే నా కళ్లలో. అదీ మసకబారుతోందా? అమ్మ రూపం నా కళ్ల ముందు నుంచి మసక బారక ముందే అమ్మ పటం (చిత్రం) గీయాలనుకున్నాను. కానీ... నేను... నేను... చిత్రకారుణ్ని కాను, పదచిత్రణ మాత్ర జీవినని అప్పటి వరకూ గుర్తుకు రాలేదు. ఎంత మెదిపినా కలం కుంచె అవుతుందా? పదాలు రేఖలవుతాయా? కవినన్న గర్వం మంచుకొండ చరియలా విరిగి పడిపోయింది. పోగులుగా విడిపోతున్న స్మృతి ముద్రను మనసు చట్రంలో పొదుగుకుని అమ్మరూపాన్ని పదిలంగా నిలుపుకున్నాను. అమ్మ నుంచి మమకారం పంచడం నేర్చుకున్నాను. ఎంతమందికి పంచగలిగితే అంతమందికీ పంచుతున్నాను. అదే నన్ను ఇందరికి ఆత్మీయుడిని చేసింది. ‘దేవత కనిపించదు. కానీ అమ్మ కనిపిస్తుంది. కాబట్టి దైవం కంటే మనకు జన్మనిచ్చిన అమ్మను మిన్నగా చూసుకోవాలి’ - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: మోహన్ -
బుందేల్ టు బందర్
సో స్వీట్ ‘‘ష్ష్ష్ ... పెద్దగా అరవకండి. మా బందరమ్మాయి అంటే చాలు, ఇంకేం చెప్పక్కర్లేదు. లక్షణమైన పిల్ల అని అర్థమైపోతుంది. మీకు మరో సంగతి తెలుసా? మా బందరమ్మాయిలందరూ బందరులోనే పుడతారు’’ ... అంటూ మురిసిపోతూ నవ్వుతాడు కోట శ్రీనివాసరావు.. ‘ష్.. గప్‌చుప్’ సినిమాలో. ‘బందరులో పుట్టడం వల్లనే కదా బందరమ్మాయి అవుతుంది... ఇదో పెద్ద జోకు... హు...’ అనిపించినా సరే... కోట హావభావాలు నిజంగానే నవ్విస్తాయి. ఆ సినిమాలో ఆయన చాలా స్ట్రిక్టు పోలీస్ ఆఫీసర్. అయితే ఆయనకు బందరు బలహీనత ఎంతంటే... బందరు లడ్డు తియ్యదనమంత. మచిలీపట్నం వచ్చిన ప్రముఖులంతా తాతారావు స్వీట్ షాప్‌లో బందరు మిఠాయి రుచి చూడకుండా వెళ్లరనేది ప్రతీతి. అందుకు తగ్గట్లే ఆ షాపులో లడ్డు రుచి చూస్తున్న నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావు, ఎన్టీ రామారావు, వైఎస్ఆర్, రోశయ్య తదితరుల ఫొటోలున్నాయి. ఎవరు నేర్పారీ విద్యను! ఇదంతా బాగానే ఉంది... పూసను దంచి లడ్డు చేయడం అనే ప్రత్యేకమైన విధానం ఈ ఊరికి మాత్రమే ఎలా పరిమితమైంది? మచిలీపట్నంలోని వీధులను చూస్తూ ఈడేపల్లి సన్నని రోడ్డు వైపు మళ్లగానే... ఆ వరుసలో ఒక స్వీట్ షాపు. అధునాతనంగా కట్టిన ఆ దుకాణం ముందు వరండాలో ఓ తోపుడు బండి ఉంది, బండికి టైర్లు లేవు. దాని మీద ‘మల్లయ్య మిఠాయి బండి - 1958’ అని రాసి ఉంది. బండి మీద అద్దాల అరల్లో స్వీట్లు, చెగోడీలు, పకోడీలున్నాయి. బండి ముందు వెంకటేశ్వర్రావు. ‘రండి... రండి’ అంటూ పలకరించి, ‘ఇది మా నాన్న మల్లయ్య సొంతంగా మిఠాయి వ్యాపారం చేసినప్పటి బండి. ఆయన జ్ఞాపకంగా దీనినే కౌంటర్‌గా మార్చుకున్నాను’ అంటూ కిటికీలో ఉన్న ల్యామినేటెడ్ ఫొటో చూపించారు. అందులో ఇనుప బాణలిలో నుంచి బూందీ తీస్తున్న పెద్దాయన, ఇంకా మరికొంత మంది ఫొటోలు ఉన్నాయి. ‘‘ఈయనే మా నాన్న. బండి పెట్టక ముందు ఆయన వీరి స్వీట్ షాపుల్లో పని చేశారు. వీళ్లు ఆయనకు పని నేర్పిన గురువులు. వాళ్లకు పని నేర్పిన వాళ్లు బుందేల్ సింగులు. వాళ్లనే బొందిలీలు అంటారిక్కడ’’ అన్నారు వెంకటేశ్వర్రావు. హమ్మయ్య!! ఆధారం దొరికింది. ఇక వివరాలు తెలియాలి. రాజపుత్రుల రుచులు! మచిలీపట్నానికి ఈ లడ్డును పరిచయం చేసింది బుందేల్‌ఖండ్ రాజపుత్రులు. శత్రుదాడులతో రాజపుత్రుల రాజ్యాలు బలహీనమయ్యాయి. చిత్తోడ్‌లో ఉదయ్‌సింగ్ వంటి వారు అడవుల్లో తలదాచుకుని తిరిగి సైన్యాన్ని సమీకరించుకుని ముస్లిం పాలకుల మీద దాడి చేసి తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అది అందరికీ సాధ్యం కాలేదు. అలా రాజ్యాలు కోల్పోయి వచ్చిన వాళ్లే ఈ బుందేల్‌ఖండ్ రాజపుత్రులు కూడా. కుటుంబాలు, బంధుగణంతో ఉత్తరాది నుంచి పారిపోయి వింధ్య పర్వతాలు దాటి దక్కనులో స్థిరపడ్డారు. అలా ఒక్కొక్క సమూహం ఒక్కో చోట స్థిరపడిన క్రమంలో ఒక కుటుంబం బందరు చేరింది. వాళ్లు బుద్ధూసింగ్, నారాయణ్ సింగ్, నాథ్‌సింగ్, జగన్నాథ్ సింగ్, ఠాకూర్‌సింగ్... ఐదుగురు సోదరులు. కత్తి- డాలు అన్నం పెట్టాయి! వచ్చారు సరే... బతకడానికి ఏం చేయాలి? యుద్ధం చేయడం తప్ప సేద్యం చేయడం తెలియదు. సముద్రం మీదకెళ్లి చేపలు పట్టడమూ చేతరాదు. ఎక్కడ నివసించే వారికైనా సరే... తినడానికి తగినట్లు రుచిగా వండుకోవడం వచ్చి ఉంటుంది. అదే వారికి బతుకుతెరువైంది. అందరి దగ్గరా యుద్ధం చేసే కత్తి, డాలు ఉన్నాయి. వాటినే అన్నం పెట్టే సాధనాలుగా మార్చుకున్నారు. ఒక డాలును నెయ్యి కాచే బాణలిగా మార్చుకున్నారు. ఒక డాలుకు కత్తితో చిల్లులు పెట్టారు. శనగపిండిని జారుడుగా కలిపి ఆ డాలులో పోసి తిప్పితే పూస పడుతుంది. మరొక డాలుకు చిల్లులు పెట్టి పూస తీసే గిన్నె (గరిట)గా మార్చుకున్నారు. బెల్లం పాకంతో లడ్డు తయారు చేశారు. గోధుమపాల హల్వా, బెల్లం జిలేబి, మిఠాయి, గుల్ల పకోడి... అన్నీ వారి వంటకాలే. మరి మిఠాయిలకు పేరు! రాజపుత్రులు తమను ‘బుందేలులు’గా పరిచయం చేసుకున్నారు. అది బొందిలీలుగానూ, వారి లడ్డుకు బొందిలీల లడ్డు, బొందిలి మిఠాయిలు అనే పేరొచ్చింది. బయట ఊర్ల వాళ్లు మాత్రం బందరు లడ్డు అంటారు’’ అని చెప్పారు వెంకటేశ్వర్రావు. బందరు లడ్డు మిస్టరీ వీడింది. అన్నట్లు స్వీట్ల చరిత్రలో బందరు లడ్డుకు మరో విశేషం కూడా ఉంది. 1998లో బందరులడ్డు డాట్‌కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేశారు వెంకటేశ్వర్రావు. స్వీట్ల కోసమే కేటాయిచిన తొలి వెబ్సైట్ అది. కంప్యూటర్ ఇల్లిటరేట్ అయిన వెంకటేశ్వర్రావు ఇందుకోసం మద్రాసుకెళ్లి రెండు లక్షలు ఖర్చు పెట్టి వెబ్సైట్ తెరిచారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (మచిలీపట్నం నుంచి) లడ్డు తయారీకి 12 గంటలు బందరు మిఠాయిలన్నీ బెల్లంతోనే చేస్తారు. చక్కెర వాడరు. లడ్డు కోసం... శనగపిండిని జారుడుగా కలిపి నేతిలో పూసను దోరగా కాల్చి చల్లార్చాలి. చల్లారిన పూసను రోట్లో వేసి దంచాలి. ఆ దంచిన పొడిని బెల్లం పాకంలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టి మళ్లీ దంచాలి. ఆ తర్వాత ఉండకట్టాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి పన్నెండు గంటలు పడుతుంది. పాళ్లు మాత్రం రహస్యం. - వెంకటేశ్వర్రావు, మల్లయ్య స్వీట్ షాప్, మచిలీపట్నం -
బలి వెరీ గుడ్!
జ్ఞాపకం చల్.. కబడ్డీ.. కబడ్డీ... కమ్ముకొచ్చెరా కాపుకొచ్చెరా.. ఆచ్‌తూచ్.. ఆచ్‌తూచ్.. బల్జింగన్నా.. బల్జింగన్నా... స్కూళ్లో చదివే ప్పుడు కబడ్డీ కబడ్డీ అంటూ ఎక్కువసేపు గస ఆపుకోలేక నోటికి ఏదొస్తే అది అనేసేవాళ్లం. మా కబడ్డీ టీమ్‌కి మంచి రిప్యుటేషనే ఉండేది. ఓడలేదని కాదు. అత్యధిక గెలుపు మాఖాతాలోనే ఉండేది. ప్రేయర్ కన్నా ముందు వచ్చి కబడ్డీ ఆడి, మట్టి కొట్టుకుపోయిన తెల్ల చొక్కాలపై చింత బరికెలతో హెడ్మాస్టర్ ‘బలిగుడు’ ఆడినా బాధ ఉండేది కాదు. మా జిల్లా (వైఎస్సార్ కడప)లో కొన్ని చోట్ల ఈ క్రీడను బలిగుడు అని కూడా అంటారండోయ్. సాయంత్రమైతే రైల్వే క్వార్టర్స్ నీళ్ల ట్యాంకు పక్కన ఖాళీ జాగాలో రాత్రి పది దాకా ఒకోసారి అర్ధరాత్రిళ్లు కూడా బలిగుడు ఆడేదానికి, చూసేదానికిపెళ్లయినోళ్లు, కానోళ్లు, ముసలీ ముతకా అందరూ రెడీ. చూసేవాళ్లలో మహిళలు కూడా ఉండేవారు. ‘ఆమె ఇంట్యోడు (మొగుడు) ఎట్లా ఆడ తాండో సూడాల కదా’ అని ఒకరు... ‘ఓమ్మీ ఆయమ్మి మొగుడు బో ఆన్యాడు లే. దూరి అట్ట పట్టుకుండ్యా. పట్టు పట్టుకోడం ఇంగ ఇడిసిపెట్ల్యా’ అని ఇంకొకరు. ఒక్కోసారి గొడవలై పంచాయితీలు కూడా అయ్యేవి.అలాంటి నా ఫేవరేట్ కబడ్డీకి గోల్డెన్ డేస్ వస్తాయని, అదీ తారలు దిగివచ్చి కబడ్డీ ఆడేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. నా పల్లె ఆట... బుల్లి తెరపై మల్టీ కలర్ డ్రెస్సుల్లో కండరగండలు ఉడుంపట్టు పట్టేస్తుంటే ఆహా క్యా బాత్‌హై! టీవీలో క్రికెట్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, రెజ్లింగ్ మాత్రమే చూసే మావాడు కబడ్డీ చూస్తుంటే వింత అను భూతికి లోనయ్యా. లేకపోతే ఏంటండీ క్రికెట్ మాయలో పడి కూర్చున్నచోటు నుంచి లేవకుండా ఊబకాయులై, బద్దకస్తులై, కార్పొరేట్ చదరంగంలో పావులైన పిల్లలు.. కబడ్డీ కబడ్డీ అంటుంటే గుండెలు ఉప్పొంగవా మరి! ‘పల్లే కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల’ అని కుమిలి పోతున్న నేను కనీసం కబడ్డీతోనయినా పల్లెను గుర్తు పెట్టుకుంటారని, మూలాలను మరిచిపోరని సంబరపడు తున్నా. గోడలకు వేలాడుతున్న క్రికెట్ దేముళ్ల పక్కన కబడ్డీ ఇష్టదైవాలు తొడగొడతారని గట్టి ఇదిగానే ఉన్నా. పల్లె జీవనాడి మళ్లీ జీవం పోసుకుంటుందని నమ్ముతున్నా. తొడగొట్టి ప్రత్యర్థికి సవాలు విసిరే అసలు సిసలు గ్రామీణ ఆట... దమ్మున్న ఆట... నా కబడ్డీకి కార్పొరేట్ సొబగులు అద్దిన వారందరికీ హృదయ పూర్వక సలామ్! - ఎం.జి.నజీర్ -
తీపి జ్ఞాపకమే...
వైమానిక సాహస ప్రదర్శన వీక్షకులకు తీపి జ్ఞాపకంగా మారింది. తాము చూసిన విన్యాసాలను వీక్షకులు మరో రెండేళ్ల పాటు మననం చేసుకోక తప్పలేదు. ఐదు రోజుల పాటు అలరించిన ఏరో ఇండియా-15 ప్రదర్శన ఆదివారం ముగిసింది. లక్షలాది మంది గగనతలంలో లోహ విహంగాల సయ్యాటలను చూసి మైమరిచిపోయారు. కొద్దిపాటి ఘటనలు మినహా ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ వైమానిక ప్రదర్శన యలహంకలోని ఎయిర్‌బేస్‌లో ఈ నెల 18న ప్రారంభమైన విషయం విదితమే. ప్రదర్శనలో భాగంగా దేశ విదేశాలకు చెందిన వైమానిక దళాలు తమ సత్తాను చాటాయి. హెచ్ఏఎల్, బెల్... రక్షణ దళానికి చెందిన సంస్థలతోపాటు వివిధ దేశాలకు చెందిన సుమారు 650 పైగా కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచాయి. ఇదే సందర్భంగా రూ. వేల కోట్ల విలువ చేసే వ్యాపార ఒప్పందాలు వివిధ కంపెనీల మధ్య కుదిరినట్లు అధికారులు చెబుతున్నారు. - సాక్షి, బెంగళూరు -
సామరస్య నగరం
జ్ఞాపకం నిఖిలేశ్వర్ - ప్రముఖ కవి ఎక్కడైనా నగరాల విస్తరణ, పురోగమనం అక్కడి అసంఖ్యాక శ్రామికులు చెల్లించే జీవన మూల్యాల ఫలితమే! నగరాలే మానవ నాగరికతా వికాసాన్ని కాలగమనంలో ఆయా దశల్లో ప్రతిఫలించాయి. కొన్ని కాలగర్భంలో కలసిపోతే మరికొన్ని కాలానికి సాక్షిగా నిలిచాయి. అలాంటి నగరమే హైదరాబాద్.. అదే ఒకనాటి భాగ్యనగరం! అంటారు నిఖిలేశ్వర్. కవిగా, ఉపాధ్యాయుడిగా, వ్యక్తిగా నాలుగు వందల ఏళ్లు పైబడిన ఈ మహానగరంతో ఆయన అనుబంధం ఏడు దశాబ్దాలు. ఈనాటికీ కొత్తగా ఉన్న ఆ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే. ..:: హనుమా నా బాల్యం, యవ్వనం, జీవితం.. అంతా ఇక్కడే. 425 ఏళ్ల చరిత్ర గల ఈ మహానగరానిది దక్కన్ సాంస్కృతిక స్వభావం. మత సామరస్యం, బహుభాషా జీవితాల సహజీవనం ఇక్కడి ప్రత్యేకత. ప్రస్తుతం మెట్రోపాలిటన్ నగరంగా విస్తరిస్తున్నందున సిటీలైఫ్ ఒక కమోడిటీగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మెట్రో రైలు కూతతో జీవితం వేగవంతమై.. మనమంతా ఈ నగరంలోనే పరాయీకరణ చెందే ప్రమాదమూ ఉంది. చుట్టు పక్కల విస్తరిస్తున్న హైటెక్ సిటీతో ఇప్పటికే ‘న్యూ అమెరికన్’ సంస్కృతిలోకి జారిపోయింది. అయితే వలస వచ్చే వారందరికీ ఆశ్రయమివ్వడం ఈ సిటీ ప్రత్యేకత. ఎన్నో పాత్రలు... సిటీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరవల్లి గ్రామంలో పుట్టినా... బాల్యం నుంచి నా జీవితం ఇక్కడే గడిచింది. అబిడ్స్‌లో మా ‘దిగంబర కవులు’ తొలి కవితా సంపుటి ఓ రిక్షావాలా చేత ఆవిష్కరింపజేశాం. కేశవ్ స్మారక విద్యాలయంలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా 30 ఏళ్లు పనిచేశా. విద్యార్థులతో మమేకమయ్యే అవకాశం దక్కింది. హిందీ, తెలుగు బోధన భాషగా ఉంటేనేం..! మరాఠీ, కన్నడ, ఉర్దూ, హిందీ భాషలు కూడా ఉండేవి. ఇది నగరంలో పరిమళించే మిశ్రమ సంస్కృతికి చక్కని నిదర్శనం. కార్మిక, కర్షక నగరం నా బాల్యం బాకారం, దాయరా, ముషీరాబాద్ బస్తీల్లో సాగింది. పక్కనే ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడెక్కువ వజీర్ సుల్తాన్ ఫ్యాక్టరీ (వీఎస్టీ), గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ, డీబీఆర్ బట్టల మిల్లు, ఆల్విన్ ఫ్యాక్టరీ కార్మికుల కుటుంబాలుండేవి. అంతటా సామరస్యం వెల్లివిరిసేది. పోలీస్ ఫైరింగ్... 1948లో ‘ఇండియన్ యూనియన్ సైన్యాలు’ హైదరాబాద్‌లోకి ప్రవేశించాయి. సుల్తాన్‌బజార్ రోడ్లపై ఆ సైన్యాన్ని ఆహ్వానించిన వాళ్లలో నేనూ ఉన్నాను. అప్పుడు నా వయసు పదేళ్లు. సైనిక చర్యతో నిజాం ఫ్యూడల్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. ముల్కీ సమస్యపై హైదరాబాద్‌లో 1954-55లోనే ఉద్యమం చెలరేగింది. నాన్ ముల్కీ గో బ్యాక్ అంటూ విద్యార్థులమంతా అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాం. అది తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు మొదట లాఠీచార్జి.. తర్వాత ఫైరింగ్ మొదలుపెట్టారు. తప్పించుకోవడానికి నేను నయాపూల్ వంతెన మీదుగా పరిగెత్తిన ఘటన నేటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అభ్యుదయ యువక సంఘం 1956 ప్రాంతం.. ముషీరాబాద్ జమిస్తాన్పూర్ హైస్కూల్లో చదివా. అప్పుడక్కడ అంతా ఖాళీ ప్రదేశం. ముషీరాబాద్‌లో ఆనాడు ఉన్న గౌరీశంకర్ గ్రంథాలయం మాకు సాహితీ సౌరభాలను పరిచయం చేసింది. స్థానిక కాంగ్రెస్ నాయకుడైన వెంకటరామయ్య జోషి పంతులు దీన్ని నిర్వహించేవారు. అక్కడ 1959-60లో ‘అభ్యుదయ యువక సంఘం’ స్థాపించి.. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. మాడపాటి హనుమంతరావు, పుట్టపర్తి శ్రీనివాసాచార్య (పురాతత్వ శాస్త్రవేత్త), దాశరథి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆళ్వార్‌స్వామి, వెంకటావధాని, కాళేశ్వరరావు, కాళోజీ వంటి మహనీయులతో సాహిత్య, సాంస్కృతిక ప్రసంగాలు ఏర్పాటు చేశాం. విరిసిన విరసం 1960-65 మధ్య మేమంతా బూర్గుల రంగనాథ్ (బూర్గుల రామకృష్ణారావు కుమారుడు) ఇంట్లో, కుందుర్తి ఆంజనేయులు ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ సాహిత్య గోష్ఠుల్లో మా రచనలు చదివేవాళ్లం. నేను, మిత్రులు జ్వాలాముఖి, నగ్నముని, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్న.. ఈ ఆరుగురం ‘దిగంబర కవులు’ మూడు సంపుటాలు రాశాం. మేమంతా కలసి లెనిన్ శతజయంతి సభల్లో పాల్గొన్నాం. అక్కడే ‘విరసం’ అంకురార్పణ జరిగింది. నేను, జ్వాలాముఖి, నగ్నముని, చెరబండరాజు విరసం వ్యవస్థాపక సభ్యులం. హోటళ్లలో చర్చాగోష్టులు అబిడ్స్‌లోని ఓరియంటల్, కింగ్స్ సర్కిల్ హోటళ్లలో తెలుగు, హిందీ, ఉర్దూ రచయితల భేటీలు జరుగుతుండేవి. మగ్దూం మొహియొద్దీన్, టంగుటూరి అంజయ్య, జి.వెంకటస్వామి వంటి కార్మిక నాయకులు కూడా ఈ హోటల్లో సమావేశమయ్యేవారు. సుల్తాన్‌బజార్‌లోని ‘దిల్షాద్ రాయల్ టాకీస్’, అబిడ్స్ ‘జమృద్ మహల్’లో హిందీ సినిమాలు, సికింద్రాబాద్ ‘ప్లాజా, టివోలీ, డ్రీమ్ ల్యాండ్’ థియేటర్లలో ఇంగ్లిష్ సినిమాలు చూసేవాళ్లం. రాజద్రోహం కేసు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు చేసినందుకు 1971లో నాతోపాటు జ్వాలాముఖి, చరబండరాజులను రాజద్రోహ నేరం కింద అరెస్ట్ చేసి సికింద్రాబాద్ జైల్లో పెట్టారు. ఈ నిర్బంధాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాం. ‘కలాలకు సంకెళ్లు ఉండరాదు. భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగపరమైన హక్కు’ అంటూ హైకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో మేం విడుదలయ్యాం. మహానగరాన్ని నిర్మించిన నిర్మిస్తున్న మనుష్యుల మమతలు తినేసిన ఉప్పు (కల్తీ) గాలి అంతశ్చైతన్యాన్ని అంతం చేసి నవ్వుతున్న నగరం పెరుగుతూంది... నిశ్చయంగా విస్తరిస్తూంది. వాయుగుండంలో సమస్యలు వీచివీచి మహానగరపు వీధుల్లో సుళ్లుసుళ్లుగా దివారాత్రుల శ్రమకి- సౌఖ్యానికి ఘర్షణ దరిద్రానికి- ధనానికి అంతులేని సంఘర్షణ ‘కెలిడోస్కోప్’లోని చిత్రవిచిత్ర రంగులవలే జీవితాల విభిన్న చిత్రాల నూతన సృష్టికి జరుగుతున్న సంచలనం. (నిఖిలేశ్వర్ ‘నాలుగు శతాబ్దాల సాక్షిగా నా మహానగరం’లోని కవిత) -
వాన పడతాది జాన... ఎట్ట బొమ్మందునో...
జ్ఞాపకం ‘‘నేను హనుమకొండకు వచ్చిన తర్వాత వెలువడిన ‘సృజన’ సంచిక జూలై 1973. అప్పటికే ఎన్.కె, జనసేన, కానూరి వెంకటేశ్వరరావుల పాటలు విని, వాటిలో కవిత్వం కొంతైనా అనుభవించి ఉన్నానుగాని ఆ సంచికలోనే మొదటిసారిగా వి.బి. గద్దర్ పాటలు చూశాను. అప్పటికే లయ ఉన్న కవిత్వం, గొంతెత్తి చదువుకునే కవిత్వం రుచి దొరికి ఉన్న నాకు ఆ సంచికలో అచ్చయిన నాలుగు గద్దర్ పాటలు కొత్త కవిత్వాన్ని పరిచయం చేశాయి. ‘నీవు నిజం దెలుసుకోవరో కూలన్న నీవు నడుం గట్టి నడవాలి రైతన్నా’... ‘రిక్షాదొక్కేరహీమన్న రాళ్లుగొట్టే రామన్న డ్రైవర్ మల్లన్న హమాలి కొమ్రన్న’... ‘వాన పడతాది జాన ఎట్టబొమ్మందునో’ ‘కల్లుముంతో మాయమ్మ నిన్ను మరువజాలనే’... అనే పాటలు చదువుతుంటే ఒళ్లు పులకించింది. ఇంత మామూలు మాటలతో ఇంతగా ఉద్రేకపరిచే కవిత్వం ఉంటుందా అని ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత మూడు నెలలకు ఆ పాటలు గద్దర్ నోటి వెంట విన్నప్పుడు కలిగిన ఉత్తేజం నిజంగా చెప్పడం అసాధ్యం. నిజానికి గద్దర్ పాటలు అచ్చుకెక్కడం అదే మొదటిసారి. అందుకే అవి అచ్చవుతున్నప్పుడు సృజన సంపాదకీయ వ్యాఖ్య కూడా రాసింది. ‘ఈ సంచికలోనూ రాగల వొకటి రెండు సంచికల్లోనూ ఎక్కువ సంఖ్యలో వేయనున్న వి.బి.గద్దర్ పాటలు త్వరలో పుస్తకరూపంలో కూడా వస్తాయి. హైదరాబాద్ జిల్లా మాండలికాలు, అక్కడి ప్రజాజీవితం మాత్రమే కాదు- ఈ పాటలన్నీ ఆ చుట్టుపట్ల పల్లెల్లో ప్రజలు పాడుకునే బాణీల్లో వచ్చినవే. కొన్ని పాటల మకుటాలు చరణాలు కూడా ప్రజలు పడుకునే పాటల నుంచే తీసుకుని విప్లవభావాలకు అనుగుణంగా మలచినవి. ఈనాడివి హైదరాబాద్ చుట్టూ దాదాపు ఇరవై గ్రామాల్లో విరివిగా పాడుకోబడుతున్నాయి’ అని సృజన రాసింది. అప్పటికి ఎంత అర్థమయ్యాయో చెప్పలేనుగాని ఆ తర్వాత నాలుగు నెలలు నిజంగా జీవితం మారిపోయిన రోజులు. ఆ తర్వాత వెలువడిన ఆగస్ట్ 1973 సంచికలో ‘వీడేనమ్మో డబ్బున్న బాడుకావు’, ‘పోదామురో జనసేనలో కలిసి’, సెప్టెంబర్ 1973 సంచికలో ‘రెక్కబొక్క వొయ్యకుండ సుక్కసెమ్ట వొడ్వకుండ బొర్ర బాగా బెంచావురో దొరోడో’, ‘పిల్లో నేనెల్లిపోతా’, ‘నిజం తెలుసుకోవరో కూలన్న’... గద్దర్ పాటల ప్రభంజనం. - ఎన్. వేణుగోపాల్ ఫేస్బుక్ గ్రూప్ ‘కవి సంగమం’లో ‘కవిత్వంతో ములాకాత్’ పేరిట వస్తున్న వ్యాస పరంపర నుంచి -
నాడూ నేడూ పోరాటమే!
జ్ఞాపకం కె.బాలకుమార్ తెలంగాణ ఉద్యమకారుడు యవ్వనం ఉద్యమంతో రగిలింది. తెలంగాణ సాధనే ధ్యేయంగా కదిలింది. పోలీసులు గ్యాస్ బాంబులు విసురుతున్నా, బుల్లెట్లు వర్షంలా కురుస్తున్నా.. ఉడుకెత్తే రక్తంతో ఎదురొడ్డి నిలిచిన సాహసం.. కె.బాలకుమార్. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ఊపిరిలూదిన 1969 నాటి ఉద్యమం నుంచి... స్వర్ణకాంతులు అద్దుకున్న నేటి తెలంగాణ వరకు నిలువెత్తు సాక్ష్యమై నగరంతో మమేకమై సాగుతున్న ప్రయాణం. పోరుబాటలో తూటా తాకి కాలు పోయినా.. చిన్న బడ్డీ కొట్టు నడుపుకొంటూ హుందాగా జీవిస్తున్న ఈ అరవై ఆరేళ్ల పోరాట యోధుడి ‘జ్ఞాపకాలు’.. ..:: హనుమా అది 1969 జూన్ 27. సీఎం బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేశారు. నగరమంతా బంద్. తెలంగాణ కోసం ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. రోడ్లపై వేలాదిమంది ఉద్యమకారులు. వారిని చెదరగొట్టేందుకు పోలీసుల లాఠీచార్జీ.. ఆపై గ్యాస్ బాంబులు. ఆ బాంబులు పట్టి తిరిగి వారిపైకే వేశాం. పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. బుల్లెట్ల వర్షం.. అంతా చెల్లాచెదురు. నా కాలికీ ఓ తూటా తగిలింది. సమయం సాయంత్రం మూడు గంటలు. పరుగెత్తలేక అక్కడే పడిపోయా. రెండు గంటలపాటు నరకయాతన. ఐదింటప్పుడు పోలీసులే తీసుకెళ్లి గాంధీ ఆసుపత్రిలో పడేశారు. అందులో ప్రాణాలు కోల్పోయిన వారు, నాలా గాయపడిన వారెందరో!. ఐదొందలడిగారు... ఉద్యమం కోసం మేం ప్రాణాలకు తెగిస్తే..దవాఖానాలో మాత్రం నిర్లజ్జగా లంచం అడిగారు. నాకు చికిత్స చేయడానికి ఐదొందల రూపాయలిమ్మన్నారు. ఇవ్వలేనన్నందుకు.. వదిలేశారు. తరువాత ఇన్ఫెక్షన్ సోకి కాలు తీసేయాల్సి వచ్చింది. ఇదిగో ఇలా ఒంటికాలితో బతుకీడుస్తున్నా. సికింద్రాబాద్ టు మల్కాజిగిరి మాది సికింద్రాబాద్. చదివింది ఐఐటీ. అప్పట్లో సికింద్రాబాద్ గణేష్ కట్‌పీస్ సెంటర్లో సేల్స్‌మాన్‌గా చేసేవాడిని. కాలు పోయిన తరువాత ఉద్యోగం పోయింది. ఇంటి ముందే స్కూల్ పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు అమ్మేవాడిని. 1981లో సిటీ అమ్మాయితోనే పెళ్లయింది. ముగ్గురు సంతానం. 1983లో మల్కాజిగిరికి మారాం. ఇక్కడ చిన్న బడ్డీ పెట్టుకున్నాను. నాడు.. నేడు ఇదే జీవనాధారం. 1972లో ఖైరతాబాద్ నియోజకవర్గం ఎన్నికలప్పుడు.. ఉద్యమంలో కాలు పోయిందంటూ నన్ను చూపించి ప్రచారం చేసుకున్నారు. అక్కడి నుంచి గెలిచారు గానీ.. ఎవరూ నన్ను ఆదుకుంది లేదు. నాటి ఉద్యమంలో 350 మంది మరణించారు. నాకు తెలిసి ప్రస్తుతం గౌతమ్‌నగర్‌లో ఒకరు, ఇక్కడి దయానంద్‌నగర్‌లో ఒకాయన ఆనాటి ఉద్యమంలో బుల్లెట్ గాయాలు తిన్నవారే. వీరిద్దరూ ఇప్పుడు దోభీతో జీవనం సాగిస్తున్నారు. అంతా పంటపొలాలు నేను మల్కాజిగిరికి వచ్చిన ఏడాదికి రామచంద్ర థియేటర్ కట్టారు. ఇది పంటపొలాలున్న ప్రాంతం. 1983లో సఫిల్‌గూడ చెరువుండేది. అందులో అన్నం ఉడికినట్టు నీళ్లు ఊరుతుండేవి. రామకృష్ణాపురం నుంచి నీళ్లు ఇందులోకి వచ్చేవి. ఇప్పుడా చెరువులో అన్నీ ఇళ్లే. హుస్సేన్‌సాగర్‌లో జలకాలు చిన్నప్పుడు ఫ్రెండ్సందరం కలసి తరచూ ట్యాంక్‌బండ్‌కు వెళ్లేవాళ్లం. హుస్సేన్‌సాగర్‌లో జలకాలాడేవాళ్లం. అంత స్వచ్ఛం నీళ్లు. సాగరం ఎంతో విశాలంగా, నిండుగా ఉండేది. నల్లగుట్ట, సింధికాలనీ వెనుక భాగం వరకు నీళ్లు. ఇప్పుడు... చుట్టూ నివాసాలొచ్చి కుంచించుకుపోయింది. నాడూ బడా సెంటర్లే.. సికింద్రాబాద్, మొజంజాహీ మార్కెట్, చార్మినార్, సుల్తాన్‌బజార్ వంటివి నాడూ బిజీ సెంటర్లే. ఇక ప్రతి వీధిలో బ్రిటిష్ జమానా నల్లాలు... అందులో 24 గంటలూ మంజీర నీళ్లు. ఇళ్లలో నల్లాలు లేవు. బావులు అక్కడక్కడా కనిపించేవి. ఇప్పుడవన్నీ పోయి ఎక్కడపడితే అక్కడ బోరింగులైపోయాయి. కార్లు, బస్సులు అరుదుగా కనిపించేవి. ఎక్కడికి వెళ్లాలన్నా సైకిళ్లే. డబుల్ డక్కర్ బస్సు ఓ వింత. వాహ్.. మూసీ చాదర్‌ఘాట్‌లో మూసీ నది ప్రవాహం.. ఓహ్ ఎంత సొగసు! ఆ నీళ్లు తాగేవాళ్లం కూడా. చుట్టుపక్కల పొలాలకు ఈ నీటిని వాడేవాళ్లు. ఇప్పుడా ఆహ్లాదం ఏది?. నాడు వాతావరణం కూడా ఎంతో కూల్. ఈ సీజన్లో మధ్యాహ్నం కూడా స్వెట్టర్, మఫ్లర్ లేకుండా బయటకెవరూ వచ్చేవారు కాదు. సమయానికి వర్షాలు, చలి, ఎండలు.. ఏ కాలంలో అవి. ఒకటా రెండా.. ఈ మహానగరంతో అరవై ఆరేళ్ల అనుబంధం. ప్రతిదీ ఓ జ్ఞాపకం. -
నీలి ఆకాశంపై జమీల్యా మేఘం
జ్ఞాపకం/ పుస్తకం ఈ శీతాకాలం చలి పెరిగిపోయింది. ఊళ్లో అందరూ వింతగా చెప్పుకుంటున్నారు. గ్రామాల్లో అన్నీ విడ్డూరాలే. కాని ఈసారి చలి కొంచెం ఎక్కువగానే అనిపిస్తోంది. చెరువులో అలలు ఎండవల్ల మెరుస్తున్నాయి. కొబ్బరి చెట్ల ఆకులు సుతారంగా కదులుతున్నాయి. ఆకాశం ముదురు నీలం రంగులో ఉంది. అక్కడక్కడ తెల్లని మేఘాల తునకలు నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నాయి. ఒక మేఘం తన రూపాన్ని మార్చుకుంటూ ఒకోసారి ఒకోవిధంగా కనిపిస్తోంది. ఈసారి తలకు తెల్లని స్కార్ఫ్ కట్టుకొని ఉన్న ఓ అమ్మాయి ముఖంలా ఉంది. ఆ రూపాన్ని ఎక్కడైనా చూశానా? అవును. చూశాను. మనసు పరిపరివిధాల మదన పడుతుంటే గుర్తొచ్చింది. జమీల్యా! జమీల్యా కూడా ఇలాగే ఉంటుంది. కురులు లేవకుండా తలంతా స్కార్ఫ్ కట్టేసుకొని. తలెత్తి మళ్లీ చూశాను. ముఖంపై బొట్టుకూడా లేదు. తెల్లని చందమామలా మెరిసిపోతోంది- అచ్చు జమీల్యాలా. ఎన్నాళ్లయింది ఆ పుస్తకం చదివి. జమీల్యాతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి. మళ్లీ చదవాలి. ఇప్పుడే ఈ క్షణమే. వెంటనే గణపవరంపార్టీ ఆఫీసుకెళ్లాను. ఎవరూ లేరు. ముందుహాలు గొళ్లెం పెట్టి ఉంది. తీసుకొని లోపలికి వెళితే షెల్ఫ్‌లో కొన్ని పుస్తకాలు. అప్పటి సాహిత్యం ఓ నాలుగు పుస్తకాలు దొరికాయి. నీలం అట్ట ‘జమీల్యా’ కూడా దొరికింది. పేజీ తిప్పితే గుండె ఝల్లుమంది. అది నేనిచ్చిన పుస్తకమే. ’80లో కొన్నది. అంటే 35 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు చదివిన పుస్తకం ఇప్పటికీ లీలగా గుర్తు ఉంది. ఆ కథలో ఏదో తియ్యటి బాధ. రెండో ప్రపంచ యుద్ధకాలం. అప్పటి సోవియెట్ రిపబ్లిక్లో భాగమైన కిర్గిస్తాన్‌లోని ముస్లిం తెగల నేపథ్యం. కథ చెప్పే అతను ఓ పెయింటర్. అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్న కుర్రాడు. ఇతనికి వదిన వరస అయిన అమ్మాయి ‘జమీల్యా’. ఆమె భర్త యుద్ధంలోకి పోయాడు. మిగిలినవాళ్లు, ముసలివాళ్లు, కొంచెం వయసు వచ్చిన కుర్రాళ్లు సమష్టి వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తూ యుద్ధంలో ఉన్న సైనికుల కోసం లేవీ ధాన్యాన్ని పంపిస్తుంటారు. ధాన్యం తోలే పని ఈ కథకుని పైనా, వదిన జమీల్యాపైనా పడుతుంది. స్తెప్ మైదానాలు, పక్కనే ఎత్తై నీలిరంగు పర్వతాలు, స్వచ్ఛమైన నీళ్లతో గలగల పారుతున్న నదులు, తలూపుతున్న పోపలార్ చెట్లూ, అప్పుడప్పుడు వచ్చే వర్షపు జల్లులు, రాత్రులు మెరిసే నక్షత్రాలు... ఈ ప్రకృతిలో కలసిపోతూ శ్రమను మరిచిపోతూ గుర్రపుబగ్గీలు తోలుకుంటూ కాలం గడుపుతున్న వీళ్లతో మరో గాయపడ్డ అపరిచిత సైనికుడు ‘దనియార్’ చేరతాడు. అతని మంచి వ్యక్తిత్వం, మధురమైన కంఠస్వరంకు జమీల్యా ఆకర్షింపబడుతుంది. వాళ్లిద్దరి ప్రేమ ఫ్యాంటసీలో మునిగి తేలుతాడు కథకుడు. వాళ్ల ప్రేమను సమర్థిస్తాడు. వాళ్లెక్కడికో సుదూర తీరాలకు వెళ్లిపోతారు. వాళ్ల స్మృతులలో బతుకుతాడు కథకుడు. కథ గురించి ఇలా చెబితే బాగుంటుందా? దానిని చదవాల్సిందే. అనుభవించే పలవరించాల్సిందే. ఆ మధురానుభూతుల్లో తేలిపోవాల్సిందే. ‘చెంగిజ్ ఐతమాతోవ్’ రాసిన కథ ఇది. అతడు వెనుకబడిన కిర్గిజ్ తెగలో పుట్టి ఇంజనీరింగ్ చదివి తరువాత రచయిత అయ్యి చివరకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నాయకత్వ స్థానానికి కూడా ఎదిగాడు. ‘జమీల్యా’ సినిమాగా కూడా వచ్చింది. యూట్యూబ్‌లో చూడండి. జమీల్యా గౌరవార్థం గతంలో రష్యా పోస్టల్ స్టాంప్ కూడా ప్రచురించింది. ఎంత బాగుందో చూడండి. ఓ కథలో పాత్ర ఎంత ప్రభావం చూపగలదో తెలియాలంటే మీరు జమీల్యా చదవాల్సిందే. - కుమార్ కూనపరాజు, 99899 99599 -
అవుటాఫ్ కవరేజ్ ఏరియా
‘‘గ్రామం అన్నీ అమరిన వారికి తీపి జ్ఞాపకం కావచ్చు. బయటికొచ్చి బతికితే నోస్టాల్జియా కావచ్చు. కాని గ్రామీణ సమాజాన్ని ఏలేది మనువాదమే. అందుకే అంబేద్కర్ దళితులను గ్రామాలు వదిలి పట్టణాలకు తరలి వెళ్లమని చెప్పాడు. అయితే పట్టణాల్లో కూడా ఇప్పుడు కులవివక్ష భూతం మోడరన్ మేకప్ వేసుకుని దర్జాగా మురికివాడల నుంచి పెద్ద పెద్ద కాలనీల దాకా అనేక రూపాలలో తిరుగుతూనే ఉంది. పట్టణాల్లో నయా అగ్రహారాల నిర్మాణం జరుగుతోంది. కుల సమస్య రూపుమాసిపోయిందని చెప్పే పెద్దమనుషులు, సినీ ప్రముఖులు ఆయా అగ్రహారాలకు ప్రచారం చేస్తూ నగరీకరించిన కొత్తరకం వివక్షకు తలుపులు తెరుస్తున్నారు. నాగరిక సమాజంలో మాటు వేసి దళితుల మీద దాడి చేస్తున్న అగ్రకుల ‘ట్రోజన్ హార్స్’ల ఎత్తుగడలను పసిగట్టి పసునూరి రవీందర్ తన కథల ద్వారా బాధిత దళిత సమాజాన్ని అలర్ట్ చేస్తున్నాడు. తెలంగాణ విజయోత్సవ సంతోష సందర్భంలో పసునూరి రవీందర్ తన తెలంగాణ దళిత కథల సంపుటి ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ ప్రచురించడం ఆనందకరమైన విషయం’’ - వినోదిని (పుస్తకంలోని ముందుమాట నుంచి) అక్టోబర్ 16 ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో పసునూరి రవీందర్ ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ ఆవిష్కరణ. కొలకలూరి ఇనాక్, కె.శ్రీనివాస్, ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, సీతారామ్, కోయి కోటేశ్వరరావు, సంగిశెట్టి శ్రీనివాస్, కనీజ్ ఫాతిమా పాల్గొంటారు. -
హైదరాబాద్‌తో మీ జ్ఞాపకం.. రాసి పంపండి
చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలసి హైదరాబాద్ వచ్చినపుడు సిటీలోకి బస్సు ఎంట్రీ అయినప్పటి నుంచి ముఖం కిటికీలోకి చేరిపోతుంది. ఇంటర్లో కార్పొరేట్ కాలేజ్‌లో చేరడానికి సిటీకి వచ్చిన కుర్రాడి మనసు సిటీతో ఫస్ట్ క్రష్‌లో పడుతుంది. దేవీ, సంధ్య, శాంతి.. వంటి వెండితెరలు రారమ్మంటుంటే కాదనలేక అప్పుడప్పుడూ వెళ్లొస్తుంటాడు. నూనుగు మీసాల నూత్న యవ్వనంలో.. సిటీలోకి అడుగుపెట్టిన డిగ్రీ విద్యార్థికి ఈ పట్నం కంచెలు తెంచేసే కల్పతరువు. ఇరానీ చాయ్.. దానికి మరింత కిక్ ఇచ్చే సిగరెట్టు.. మనోడి మజాను రెట్టింపు చేస్తాయి. నిరుద్యోగికి ఉద్యోగ భాగ్యం కల్పిస్తుంది.. చిరు వ్యాపారిని బడా పారిశ్రామికవేత్తని చే స్తుంది.. అంతా సిటీ మహిమ. ఈ పట్నానికి ఎవరొచ్చినా వారిని ఆదరించి.. వారిచేతనే ‘హమారా హైదరాబాద్’ అనేలా చేస్తుంది. ఎక్కడి నుంచో వచ్చి.. హైదరాబాదీగా మారిన ప్రతి ఒక్కరికీ.. సిటీతో ఆనాటి జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ కొత్తగా ఉంటాయి. కాలం మారినా చెదరని ఆ జ్ఞాపకాలను మాతో పంచుకోండి. చార్మినార్ చుట్టూ వేసిన రౌండ్లు.. ట్యాంక్‌బండ్ పై తచ్చాడటాలు.. ఇరానీ చాయ్ టేస్ట్.. గప్‌చుప్ కబుర్లు.. ఇలా మీకు సిటీతో ముడిపడి ఉన్న సంగతులు సిటీవాసులతో పంచుకోండి. హైదరాబాద్ తొలిసారి వచ్చినప్పుడు మీ అనుభవం, వచ్చిన కొత్తల్లో ఎదురైన సరదా సంఘటనలు.. మరచిపోలేని గుర్తులు.. మాకు పంపించండి. ఆ జ్ఞాపకంతో మీరు దిగిన ఫొటో లేదా.. మీ పాస్‌పోర్ట్ ఫొటోను కూడా జతచేయండి. మెయిల్ టు.. sakshicityplus@gmail.com -
మహిళా ఉద్యమ కెరటం మల్లాది సుబ్బమ్మ
జ్ఞాపకం సాక్షి, సిటీబ్యూరో : ‘శక్తి చాలడం లేదు కానీ, ఏ మాత్రం ఓపిక ఉన్నా సరే ఉద్యమాల్లో పాల్గొనాలని ఉంది’ జీవితాన్నే ఒక సమరశీల పోరాటంగా మలుచుకున్న మల్లాది సుబ్బమ్మ మాటలివి. ఇటీవల ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారామె. గురువారం కన్నుమూసిన ఆమె జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే... మననం చేసుకునే ప్రయత్నమిది. రహస్యంగా పెళ్లి... గుంటూరు జిల్లా రేపల్లె తాలూక పోతార్లంక మా సొంత ఊరు. నాన్న కొండూరు సత్యనారాయణ. అమ్మ అన్నపూర్ణమ్మ. నాన్న బాపట్లలో ప్లీడర్. లాయర్ మల్లాది వెంకట రామ్మూర్తితో నా 11వ ఏట రహస్యంగా వివాహం జరిపించారు. నాకు పుట్టినిల్లు, మెట్టినిల్లు బాపట్లే. ఆరు క్లాసులతో అటకెక్కిన నా చదువు పిల్లలయ్యాక తిరిగి మొదలైంది. 36వ ఏట నా కూతురు విజయలక్ష్మి ఎస్సెస్సెల్సీ రాస్తుంటే నేను మెట్రిక్యులేషన్ రాశాను. ఆ తర్వాత పీయూసీ, బీఏ చదివాను. అప్పటి వరకు సాధారణ గృహిణిగానే ఉన్న నన్ను హైదరాబాద్‌లోని పంజగుట్ట కేంద్రంగా నడుస్తోన్న కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ప్రభావితం చేశాయి. ఈ కేంద్రం నుంచే ఫ్యామిలీ ప్లానింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాను. ఏడాది తర్వాత బాపట్లకు వెళ్లి కుటుంబ నియంత్రణ ఉద్యమాన్ని నడిపాను. ఊరూరు తిరిగి ప్రచారం చేశాను. గృహిణిగా ఉన్న నేను చదువుకొని, ఉద్యమాల్లో పాల్గొనేందుకు అడుగడుగునా నా భర్త ప్రోత్సాహం, సహకారం, అండదండలు లభించాయి. 1972లో వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో సైతం పాల్గొని 8 సార్లు అరెస్టయ్యాను. జైలుకు వెళ్లాను. ప్రజాస్వామ్యం కోసం లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ చేపట్టిన ఉద్యమం మమ్మల్ని బాగా ప్రభావితం చేసింది. ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వం రామ్మూర్తిగారిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఆ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ మెహిదీపట్నంకు మకాం మార్చాం. కూరగాయల ఉద్యమం... హైదరాబాద్ కేంద్రంగా కూరగాయల ఉద్యమం చేపట్టాం. ఆ పోరాటం ప్రతి ఇంటినీ కదిలించింది. ఆ రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూరగాయల కొరత తీవ్రంగా ఉండేది. ఇక్కడి పంటను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసేవాళ్లు. నేను మరి కొంతమంది మహిళలం కలిసి చేపట్టిన కూరగాయల పోరాటానికి అనూహ్యమైన స్పందన లభించింది. చివరకు ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. మహిళలకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా నేను పాల్గొన్నాను. భార్యాభర్తల తగాదాలు, కాపురాలు నిలబెట్టడాలు, అవసరమైన చోట విడాకులు ఇప్పించడం మొదలుకొని వందలాది కుల, మతాంతర వివాహాల వరకు మా ఇల్లు ప్రధాన కేంద్రంగానే ఉండింది. 1992లో వచ్చిన సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమం గురించి అందరికీ తెలిసిందే. దూబగుంటలో మొదలైన ఆ పోరాటం రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా సాగింది. ప్రతి ఆందోళనలో నేను పాల్గొన్నాను. వావిలాల గోపాల కృష్ణయ్య, నేను, సంద్యావందనం, లక్ష్మీదేవి వంటి అనేక మంది కలిసి ఉద్యమాన్ని నడిపించాం. ఆ రోజుల్లో ఈ పోరాటం దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఆమె వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయేవాళ్లు కావాలి ... అమ్మ చాలా పోరాటం చేశారు. 80కి పైగా గ్రంథాలు రాశారు. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలపైనా పోరాడారు. ఇప్పుడు ఆమె పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయేవాళ్లు కావాలి. కొంత కాలంగా మహిళా ఉద్యమాల్లో విస్తృతి కనిపించడం లేదు. దశాబ్దాలుగా ఆ కొద్ది మందే మహిళా పోరాటాల్లో కనిపిస్తున్నారు. - మల్లాది కామేశ్వర్రావు (సుబ్బమ్మ పెద్ద కొడుకు) -
మామిడిపండ్లు,పులిబొంగరాల కోసం ఎదురుచూపులు...
జ్ఞాపకం వేసవి... పిల్లల హుషారుకు కొత్త రెక్కలు తొడుగుతుంది. వారిని ఊహల గుర్రం ఎక్కిస్తుంది. పెద్దవారినైనా మళ్లీ బాల్యంలోకి తీసుకెళుతుంది. జ్ఞాపకాల కొమ్మల్లో దాగిన మిఠాయి పొట్లాన్ని విప్పి తియ్యని కబుర్లెన్నో చెబుతుంది. సంగీత దర్శకుడు, గాయకుడు అయిన రమణ గోగుల వేసవి జ్ఞాపకాలలో దాగున్న తియ్యటి బాల్యంలోకి ఇలా ప్రయాణించారు. ‘‘ఇప్పటి పిల్లలకు వేసవి ఎలా ఉంటుందో కానీ ఎండాకాలం వస్తోందంటే చాలు నేటికీ చిన్నతనంలో నేను వెళ్లిన ఊరు, అక్కడ చేసిన అల్లరి, ఇంట్లోవారికి తెలియకుండా కొనుక్కున్న పులిబొంగరాలు, ఆడిన కోతికొమ్మచ్చి, క్రికెట్ ... అన్నీ ఒకదాని వెంట ఒకటి పోటీపడి గుర్తుకొచ్చేస్తాయి. మాది విశాఖపట్టణం. నాన్నకు అక్కడే ఉద్యోగం. మా బాబాయి వాళ్లది నెల్లూరు జిల్లాలోని కావలి. పరీక్షలు అయిపోగానే ప్రతి వేసవికి కావలి వెళ్లిపోయేవాళ్లం. మా కోసం చిన్నమ్మ బోలెడు పిండివంటలు చేసి ఉంచేది. కొత్తబట్టలు కుట్టించి ఉంచేవారు. రోజూ మామిడిపండ్లు.. ఎంత తిన్నా ఇంకా తినాలపించే తియ్యటి రుచి వాటిది. సాయంత్రం ఐస్‌క్రీమ్ బండి దగ్గర ఐస్ప్రూట్ కొనాల్సిందే! కాసేపు ఆటలు. ఆ తర్వాత సోంపాపిడి. అటూ ఇటూ చూస్తే ఒక చిన్నగల్లీలో ఓ ముసలావిడ పులిబొంగరాలు చేసేది. వాటి రుచి ఇప్పుడు తలుచుకున్నా నోట్లో నీళ్లూరాల్సిందే! నోటికి ఖాళీ, కాళ్లకు అలసట ఉండేదే కాదు. అంత సంబరం వేసవి అంటే!! సినిమాకు వెళ్లేటప్పుడైతే పెద్ద పండగే! అప్పుడన్నీ సైకిల్ రిక్షాలు. రెండు, మూడు సైకిల్ రిక్షాల మీద అంతా కలిసి సినిమాకు వెళ్లేవాళ్లం. సెలవులు అయిపోయాక మళ్లీ వేసవి కోసం ఎదురుచూస్తూ విశాఖపట్టణం చేరేవాళ్లం. అప్పుడప్పుడు వేసవికి మా చిన్నమ్మ వాళ్ల కుటుంబం వచ్చేది. వస్తూ వస్తూ చిన్నమ్మ సున్నుండలు తెచ్చేది. రోజూ సాయంత్రం అందరం కలిసి బీచ్‌కి వెళ్లేవాళ్లం. మా ఇల్లు ఆంధ్రా యూనివర్శిటీకి దగ్గరి కాలనీలో ఉండేది. కాలనీలోనే పార్క్.. అందులో పేద్ద మామిడిచెట్టు. మా స్నేహితులతో కలిసి అక్కడే కోతికొమ్మచ్చి ఆటలు ఆడేవాళ్లం. మామిడికాయలు కోసి ఉప్పు-కారం పెట్టి తినేవాళ్లం. అక్కడ ఏర్పాటుచేసిన రేడియో నుంచి క్రికెట్ కామెంట్రీ వింటూ మేమూ క్రికెట్ ఆడేవాళ్లం. రాత్రి పూట మేడపైన కూర్చొని ఆకాశంలోకి చూస్తూ నక్షత్రాలు లెక్కపెట్టేవాళ్లం. బోలెడన్ని కథ లు చెప్పుకునేవాళ్లం. అప్పుడు ఎక్కువగా విషయాలు వినడం వల్ల ఎక్కువగా ఊహించుకోవడం ఉండేది. అదే నేను సృజనాత్మక రంగంలోకి అడుగుపెట్టడానికి దోహదపడింది. జీవితకాలంలో చిన్నప్పటి వేసవి సెలవుల ఆనందాన్ని లెక్కేస్తే అత్యంత స్వల్పం. కానీ అదే జీవితాంతం వెంట వచ్చే ఓ తీపి జ్ఞాపకం. సృజనకు అతి పెద్ద వేదిక వేసవి.’’ -
ఐదు ఐదులు!
నడుం పూర్తిగా వంగిపోయిన ఒక ముసలివాడు ఏదో వెదుకుతున్నాడు. ‘‘తాతా! యేం వెదుకుతున్నావు?’’ అని అడిగింది ఒక చిన్నది. ‘‘పోయిన యవ్వనాన్ని వెదుకుతున్నాను’’ అన్నాడు వృద్ధుడు. ప్రశ్నోత్తర రూపంలో ఉన్న ఈ పార్సీ కవిత- రాజు జహంగీరూ, రాణి నూర్జహానుల మధ్య జరిగిన సంభాషణ. మా మదర్సా(బడి)లో మౌల్వీ (పంతులు) ఈ కవిత చదివి అర్థం చెబుతుంటే నేను నా ధోరణిలో అనువదించుకున్నాను. ఇది ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే నాతో చదువుకున్న ఒక మిత్రుడు ఈమధ్య కలిసి ‘‘నీ ముఖంలో అప్పుడే వృద్ధాప్యపు ఛాయలు కనబడుతున్నాయేమోయ్?’’ అని నన్ను అడిగాడు. అతను డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఇప్పుడు పని చేస్తున్నాడు, దృఢకాయుడు. కానైతే నా వయస్సే యాభై ఐదు. యాభై ఐదులో రెండు అయిదులున్నాయి కదా! ఐదుతో ఐదు ప్లస్ చేస్తే బాల్యం(పదేండ్లు). ఐదుతో ఐదు ఇంటూ చేస్తే యౌవనం (పాతిక) ఐదు పక్కన ఐదు వ్రాస్తే యాభై ఐదు. వార్ధక్య ద్వారం! అయిదులో మరో చమత్కారం ఉంది. మన్ను, మిన్ను, నీరు, గాలి, వెలుతురు కలిసి పంచభూతాలు! - డా. దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ నుంచి