వైజ్ఞానిక స్ఫూర్తి సామాన్యులకు అందించడం కోసం, దేశంలో గొప్ప గొప్ప శాస్త్రీయ సంస్థల స్థాపనకు, అభివృద్ధికి కృషి చేసినవారు డాక్టర్ పుష్పా భార్గవ! ప్రజలను చైతన్య పరచడంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన సేవాతత్పరుడు. జన విజ్ఞాన వేదికకు ఆలంబనగా నిలిచిన గొప్ప సైన్సు కార్యకర్త. సైన్స్ ప్రచార కార్యక్రమాల్లో ఆ సంస్థను మున్ముందుకు నడిపిస్తూ– చేప మందు శాస్త్రీయతను ప్రశ్నించారు. న్యాయస్థానం వరకు వెళ్ళి, అది మందు కాదని నిరూపించారు. విశ్వ విద్యాలయాల్లో ప్రభుత్వం జ్యోతిషాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసించారు. అలాగే, వాస్తు ప్రామాణికతను ప్రశ్నించారు. సమగ్రమైన చర్చ లేకుండా జీవ సాంకేతిక మార్పులతో కూరగాయలను మార్కెట్‌లోకి విడుదల చేయడాన్ని వ్యతిరేకించారు.
డాక్టర్ పుష్పా మిత్ర భార్గవ (22 ఫిబ్రవరి 1928–1 ఆగస్టు 2017) రాజస్థాన్‌లోని అజ్మీర్ (అజయ్ మేరు)లో జన్మించారు. 1946లో ఆర్గానిక్ కెమిస్ట్రీ (సేంద్రియ రసాయన శాస్త్రం)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వెనువెంటనే 21 సంవత్సరాల చిరుప్రాయంలో లక్నో యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ స్వీకరించారు. కొంతకాలం లక్నో యూని వర్సిటీలోనే లెక్చరర్‌గా పనిచేసి, తర్వాత కాలంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్‌గా చేరి స్థిరపడ్డారు. అమెరికా, ఫ్రాన్స్, యూకేల్లో ప్రసిద్ధ సంస్థల్లో పరిశోధనల్లో పాల్గొన్నారు. యూకే నుంచి వచ్చి హైదరాబాద్‌లోని ప్రాంతీయ పరిశోధనా ప్రయోగశాల (రీజినల్ రీసెర్చ్ లాబొరేటరీ (ఆర్‌ఆర్‌ఎల్)లో సైంటిస్ట్‌గా చేరారు. తర్వాత కాలంలో ఆ ప్రయోగశాల భారత రసాయన సాంకేతిక సంస్థ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – ఐఐసీటీ)గా రూపాంతరం చెందింది. (చదవండి: నిజం... నిజం... డార్వినిజం)
డాక్టర్ పీఎం భార్గవకు దేశ ప్రధానులందరితో దగ్గరి పరిచయాలుండేవి. అందువల్ల ఆయన హైదరాబాదులో ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలి క్యులర్ బయాలజీ’ (సీసీఎంబీ)ని స్థాపించగలిగారు. 1977–1990 మధ్య కాలంలో దానికి వ్యవ స్థాపక సంచాలకుడిగా ఉండి, ప్రపంచ ఖ్యాతిని తెచ్చారు. మాలిక్యులర్ సెగ్మెంట్స్ తయారీ కోసం ఒక అణుశక్తి ప్రయోగశాలను నెలకొల్పారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక బయోటెక్నాలజీ విభాగం నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించారు. డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీని హైదరాబాద్‌లో ఆవిష్కరించి, నేర పరిశోధనలో విప్లవాత్మకమైన మార్పుకు కారణం అయ్యారు. ఒక సైంటిస్ట్‌గా, ఒక డైరెక్టర్‌గా వివిధ స్థాయులలో పనిచేస్తూ, దేశ విదేశాలలోని పరిశోధనా శాలల సమన్వ యంతో ఒకానొక సమయంలో దేశ వైజ్ఞానిక పరి శోధనా రంగానికి వెన్నెముకగా నిలిచిన భార్గవ కృషి చాలా విలువైంది. (Ravipudi Venkatadri: వంద వసంతాల హేతువాది)
డాక్టర్ భార్గవకు లభించిన దేశ విదేశాల అవార్డులు, గుర్తింపులూ ఎన్నో ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇచ్చే లీజియన్ డి ఆనర్ (1998) పొందిన ఘనత వీరిదే. ఈ మధ్య కాలంలో దేశంలో వ్యాపించిన మత ఛాందసత్వ అసహనం పట్ల – దభోల్కర్, పన్సారే, కల్బుర్గీల హత్యల పట్ల కలత చెందిన భార్గవ, తన పద్మభూషణ్ పురస్కారాన్ని 2015లో భారత ప్రభుత్వానికి వాపస్ చేశారు. ఉత్తర భారతదేశం నుండి వచ్చి, హైదరాబాద్‌ను తన స్వస్థలంగా మార్చుకుని, ప్రపంచ వైజ్ఞానిక పరిశోధనా రంగంలో దీన్ని ఒక ముఖ్య కేంద్రంగా మార్చినవారు. సత్యాన్ని ప్రేమించి, దాని కోసం అన్ని విధాలా పోరాడే స్ఫూర్తిని మనమంతా ఆయన జీవితం నుండి పొందుతూనే ఉండాలి!
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త
(ఫిబ్రవరి 22న పుష్పా భార్గవ జయంతి)
Comments
Please login to add a commentAdd a comment