PM Bhargava
-
సైన్స్‌ను జనం దరి చేర్చినవాడు
వైజ్ఞానిక స్ఫూర్తి సామాన్యులకు అందించడం కోసం, దేశంలో గొప్ప గొప్ప శాస్త్రీయ సంస్థల స్థాపనకు, అభివృద్ధికి కృషి చేసినవారు డాక్టర్ పుష్పా భార్గవ! ప్రజలను చైతన్య పరచడంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన సేవాతత్పరుడు. జన విజ్ఞాన వేదికకు ఆలంబనగా నిలిచిన గొప్ప సైన్సు కార్యకర్త. సైన్స్ ప్రచార కార్యక్రమాల్లో ఆ సంస్థను మున్ముందుకు నడిపిస్తూ– చేప మందు శాస్త్రీయతను ప్రశ్నించారు. న్యాయస్థానం వరకు వెళ్ళి, అది మందు కాదని నిరూపించారు. విశ్వ విద్యాలయాల్లో ప్రభుత్వం జ్యోతిషాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసించారు. అలాగే, వాస్తు ప్రామాణికతను ప్రశ్నించారు. సమగ్రమైన చర్చ లేకుండా జీవ సాంకేతిక మార్పులతో కూరగాయలను మార్కెట్లోకి విడుదల చేయడాన్ని వ్యతిరేకించారు. డాక్టర్ పుష్పా మిత్ర భార్గవ (22 ఫిబ్రవరి 1928–1 ఆగస్టు 2017) రాజస్థాన్‌లోని అజ్మీర్ (అజయ్ మేరు)లో జన్మించారు. 1946లో ఆర్గానిక్ కెమిస్ట్రీ (సేంద్రియ రసాయన శాస్త్రం)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వెనువెంటనే 21 సంవత్సరాల చిరుప్రాయంలో లక్నో యూనివర్సిటీ నుండి పీహెచ్డీ స్వీకరించారు. కొంతకాలం లక్నో యూని వర్సిటీలోనే లెక్చరర్‌గా పనిచేసి, తర్వాత కాలంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్‌గా చేరి స్థిరపడ్డారు. అమెరికా, ఫ్రాన్స్, యూకేల్లో ప్రసిద్ధ సంస్థల్లో పరిశోధనల్లో పాల్గొన్నారు. యూకే నుంచి వచ్చి హైదరాబాద్‌లోని ప్రాంతీయ పరిశోధనా ప్రయోగశాల (రీజినల్ రీసెర్చ్ లాబొరేటరీ (ఆర్ఆర్ఎల్)లో సైంటిస్ట్‌గా చేరారు. తర్వాత కాలంలో ఆ ప్రయోగశాల భారత రసాయన సాంకేతిక సంస్థ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – ఐఐసీటీ)గా రూపాంతరం చెందింది. (చదవండి: నిజం... నిజం... డార్వినిజం) డాక్టర్ పీఎం భార్గవకు దేశ ప్రధానులందరితో దగ్గరి పరిచయాలుండేవి. అందువల్ల ఆయన హైదరాబాదులో ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలి క్యులర్ బయాలజీ’ (సీసీఎంబీ)ని స్థాపించగలిగారు. 1977–1990 మధ్య కాలంలో దానికి వ్యవ స్థాపక సంచాలకుడిగా ఉండి, ప్రపంచ ఖ్యాతిని తెచ్చారు. మాలిక్యులర్ సెగ్మెంట్స్ తయారీ కోసం ఒక అణుశక్తి ప్రయోగశాలను నెలకొల్పారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక బయోటెక్నాలజీ విభాగం నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించారు. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీని హైదరాబాద్‌లో ఆవిష్కరించి, నేర పరిశోధనలో విప్లవాత్మకమైన మార్పుకు కారణం అయ్యారు. ఒక సైంటిస్ట్‌గా, ఒక డైరెక్టర్‌గా వివిధ స్థాయులలో పనిచేస్తూ, దేశ విదేశాలలోని పరిశోధనా శాలల సమన్వ యంతో ఒకానొక సమయంలో దేశ వైజ్ఞానిక పరి శోధనా రంగానికి వెన్నెముకగా నిలిచిన భార్గవ కృషి చాలా విలువైంది. (Ravipudi Venkatadri: వంద వసంతాల హేతువాది) డాక్టర్ భార్గవకు లభించిన దేశ విదేశాల అవార్డులు, గుర్తింపులూ ఎన్నో ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇచ్చే లీజియన్ డి ఆనర్ (1998) పొందిన ఘనత వీరిదే. ఈ మధ్య కాలంలో దేశంలో వ్యాపించిన మత ఛాందసత్వ అసహనం పట్ల – దభోల్కర్, పన్సారే, కల్బుర్గీల హత్యల పట్ల కలత చెందిన భార్గవ, తన పద్మభూషణ్ పురస్కారాన్ని 2015లో భారత ప్రభుత్వానికి వాపస్ చేశారు. ఉత్తర భారతదేశం నుండి వచ్చి, హైదరాబాద్‌ను తన స్వస్థలంగా మార్చుకుని, ప్రపంచ వైజ్ఞానిక పరిశోధనా రంగంలో దీన్ని ఒక ముఖ్య కేంద్రంగా మార్చినవారు. సత్యాన్ని ప్రేమించి, దాని కోసం అన్ని విధాలా పోరాడే స్ఫూర్తిని మనమంతా ఆయన జీవితం నుండి పొందుతూనే ఉండాలి! - డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త (ఫిబ్రవరి 22న పుష్పా భార్గవ జయంతి) -
సైన్స్ శిఖరం.. పీఎమ్ భార్గవ
శాస్త్రీయ ఆలోచనలు శాస్త్రవేత్తలందరికి ఉంటాయనుకోవడం పొరపాటు. తాము చేసిన పరిశోధనలకు దైవ సహకారం ఉందని బహిరంగంగా ప్రకటించుకునే శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఇస్రో ఉపగ్రహాలని అంతరిక్షములోకి పంపించే ముందు, తర్వాత కూడా విధిగా మన శాస్త్ర వేత్తలు పూజలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ నిల్వ చేసే పెట్టెలకు కూడా పూజలు చేసే వాటిని ఓపెన్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో శాస్త్రీయ దృక్పథంని కల్గి ఉండటమే కాకుండా, సైన్స్ పరిశోధనల విషయంలో పాలకులు తీసుకునే నిర్ణయాలని ఎప్పటికప్పుడు సహేతుకంగా విమర్శించకల్గిన అతి కొద్దిమంది శాస్త్రవేత్తలలో పీఎమ్ భార్గవ ఒకరు. భార్గవ వంటి వ్యక్తిత్వం కల్గిన శాస్త్రవేత్తలు నేడు అరుదుగా కనిపిస్తున్నారు. ఫిబ్రవరి 22, 1928న రాజస్థాన్‌లోని ఆజ్మీర్లో రామచంద్ర భార్గవ, గాయత్రి భార్గవ దంపతులకు జన్మించారు. ‘జన్యు ఇంజనీరింగ్’ అనే పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. భారతదేశంలో ఆధునిక జీవశాస్త్రం వాస్తుశిల్పిగా ఆయన ప్రసిద్ధి చెందారు. 70లలో బయోటెక్నాలజీ విభాగం ఏర్పాటులో భార్గవ ముఖ్య పాత్ర పోషించారు. హైదరాబాద్ లోని సంభావన ట్రస్ట్, భోపాల్‌లో బేసిక్ రిసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ డెవెలప్మెంట్ సొసైటీ, న్యూఢిల్లీలోని మెడికల్లీ ఎవేర్ అండ్ రెస్పాన్సిబుల్ పీపుల్స్ వంటి పలు సంస్థలకు చైర్మన్‌గా కూడా ఆయన ఉన్నారు. 2005 నుండి 2007 వరకు నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వైస్ ఛెర్మైన్‌గా కూడా పనిచేశారు. భార్గవ 100 వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గౌరవాలను, అవార్డులను అందుకున్నారు. అలాగే 1986లో ఆయన ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 1998లో లెజియన్ డి హొన్నూర్తో తనను సత్కరించారు. ఇలా ఎన్నో కీర్తి పురస్కారాలను ఆయన అందుకున్నారు. జాతి గర్వించే స్థాయికి ఎదిగారు. ఆయన వివిధ సందర్భాలలో వేలాది ఉపన్యాసాలు ఇచ్చారు, 550 మంది ప్రముఖుల వ్యాసాల సంపుటి, ఆరు పుస్తకాలు కూడా వెలువరించారు. హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థకి వ్యవస్థాపక డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఈ సంస్థ వల్లే హైదరాబాద్ బయోటెక్నాలజీ రంగంలో అంతర్జాతీయంగా పేరు పొందింది. భారతదేశంలో జన్యుమార్పిడి పంటలని వేగంగా, ఎలాంటి శాస్త్రీయ పరిశోధన లేకుండా ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఈ పంటలు అధిక దిగుబడినిస్తాయి గానీ, వాటిలో పోషక విలువలు ఉండవని తెలిపారు. జ్యోతిష్యం అశాస్త్రీయం అని ఆయన తెలిపారు. హైకోర్టులో వ్యాజ్యం కూడా వేశారు. భోపాల్ గ్యాస్ బాధితులకు అండగా నిలిచారు. దేశంలో పెరుగుతున్న అసహనానికి నిరసనగా ఆయన పద్మభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు. బయోటెక్నాలజీని వ్యాపారకోణంలో ఉపయోగించడానికి ఆయన అంగీకరించలేదు. ఆయనని ఆధునిక భారతదేశ జీవశాస్త్రపిత అని కూడా పిలుస్తారు. సైన్స్ ఫలాలు పేదవారికి అందాలనేది ఆయన ఆశయం. జనవిజ్ఞాన వేదిక లాంటి సైన్స్ ప్రచార సంస్థలతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన 2017 ఆగస్ట్ 1న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం సైన్స్ ఉద్యమానికి తీరనిలోటు. - ఎమ్. రామ్‌ప్రదీప్, జనవిజ్ఞానవేదిక, తిరువూరు మొబైల్: 94927 12836 -
ప్రొఫెసర్ పీఎం భార్గవకు కన్నీటి వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత శాస్త్రవేత్త, సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్పమిత్ర భార్గ వకు పలువురు ప్రముఖులు శుక్రవారం కన్నీటి వీడ్కోలు పలికారు. హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్న వైకుంఠ మహాప్రస్థానంలోని దివ్యస్థల్ విద్యుత్ దహనవాటికలో భార్గవ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ప్రజల సందర్శనార్థం ఉదయం 8 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ఉప్పల్ ప్రశాంత్‌నగర్ లోని మనోరమ స్వగృహంలో ఆయన పార్థివదే హాన్ని ఉంచారు. భార్గవ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. హైదరాబాద్ లో సీసీఎంబీ ఏర్పాటు చేయడంతో పాటు, కణజీవ శాస్త్రంలో భార్గవ చేసిన కృషి అపారమని సీఎం కొనియాడారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున భార్గవకు ఘనమైన వీడ్కోలు పలకాలన్న సీఎం ఆదేశాల మేరకు సీఎస్ ఎస్పీ సింగ్ హాజరై భార్గవకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సాయంత్రం మహా ప్రస్థానంలో ఆయన కుమారుడు మోహిత్ అంత్యక్రియ లను పూర్తి చేశారు. మహాప్రస్థానం ప్రాంగణమంతా జనవిజ్ఞానవేదిక ప్రతినిధులు, ఇతరుల నినాదాలతో మార్మోగింది. ప్రొఫెసర్ భార్గవ కూతురు వనితా భట్టా చార్య, సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా, మాజీ డైరెక్టర్లు లాల్జిసింగ్, బాలసుబ్రమణ్యన్, మాభూమి చిత్ర దర్శ కుడు బి.నర్సింగ్‌రావు, సీపీఐ జాతీయ నాయకుడు నారా యణ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీవన్ కుమార్, జేవీవీ నాయకుడు రమేశ్, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, విద్యావేత్త చుక్కా రామయ్య, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, మాజీ ఎంపీ అజీజ్ పాషా, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్, జీఏడీ ప్రోటోకాల్ అధికారి అరవింద్ సింగ్, హైదరాబాద్ ఇన్చార్జ్ కలెక్టర్ ప్రశాంతి, సికింద్రాబాద్ ఆర్డీఓ చంద్రకళ, షేక్‌పేట్ తహసీల్దార్ రాములు, శాంతా బయోటెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ వర ప్రసాద్‌రెడ్డి, హైదరాబాద్ బెటర్ సొసైటీ అధ్య క్షుడు వేద కుమార్, కల్పనా కన్నాభిరాన్, ప్రొఫెసర్ రమా మెల్కోటే, సీసీఎంబీ మాజీ డైరెక్టర్లు మోహన్ రావు, లాల్జీటండన్, ఇతర ముఖ్యులు చందనా చక్రవర్తి, అలేఖ్య, పాశం యాదగిరి, నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు, డాక్టర్ వినయ్ కుమార్, ఎన్ఐసీటీ, ఐఐసీటీ, సీసీఎంబీ, ఎన్జీఆర్ఐ, హెచ్‌సీయూ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రము ఖులు భార్గవ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భార్గవతో తమ సాన్నిహిత్యాన్ని వారు గుర్తు చేసుకున్నారు. -
సైన్సుకు కళలద్దినవాడు
జీవితాంతం తాను నమ్మిన అంశాలకు కట్టుబడి జీవించిన గొప్ప వ్యక్తి, శాస్త్రవేత్త పి.ఎం. భార్గవ. దేశ ప్రజలందరూ శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలన్న భావనను 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలోకి చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. కొన్ని విషయాలపై నమ్మకం కలిగి ఉండటం జనసామాన్యులందరికీ ఉండే లక్షణమే. నమ్మిన వాటిని మనసా వాచా.. కర్మేణా ఆచరించే అసమాన్యులు మాత్రం కొందరే! ఈ కొందరిలో ఒక్కడు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపకుడు పుష్పమిత్ర భార్గవ. పదేళ్ల వయసులో నేరుగా తొమ్మిదో తరగతిలో చేరి.. 21 ఏళ్లకే రసాయన శాస్త్రంలో స్నాతకోత్తర విద్యను పూర్తి చేయడం ఈయన పదునైన బుర్రకు నిదర్శనమేగానీ.. ఆ తరువాతి కాలంలో శాస్త్రవేత్తగా, విధాన రూపకర్తగా... హేతువాదిగా భార్గవ నిర్వహించిన పాత్రలు ఆయన బహుముఖ ప్రజ్ఞకు అద్దంపట్టేవి. 1946లో 21 ఏళ్ల వయసులో లక్నో విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా ప్రయాణం మొదలుపెట్టిన పి.ఎం. భార్గవ 1950 తరువాత హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (అప్పట్లో సెంట్రల్ లాబొరేటరీస్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసె ర్చ్)లో పనిచేశారు. శాస్త్రవేత్తగా విదేశాల్లో ఉండగా కేన్సర్ మందుపై పరిశోధనలు నిర్వహించిన ఈయన సీసీఎంబీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాలేయ కణాలను పరిశోధనాశాలలో పెంచేందుకు తద్వారా వాటిపై విస్తృత పరిశోధనలు చేసేందుకు వీలు కల్పించే ప్రక్రియను అభివృద్ధి చేసింది కూడా భార్గవనే. అంతేకాకుండా వీర్యంలో ఉండే సెమినల్ ప్లాస్మిన్ అనే పదార్థానికి యాంటీబయాటిక్ లక్షణాలున్నట్టు మొట్టమొదట గుర్తించి దాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నించిన శాస్త్రవేత్తగా భార్గవకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. వ్యవసాయం మొదలుకొని జీవ, న్యాయశాస్త్రం, ఆరోగ్య రంగాల్లో డీఎన్ఏ ఆధారిత టెక్నాలజీల ఉపయోగాన్ని దాదాపు 20 ఏళ్ల క్రితమే గుర్తించిన భార్గవ వాటికి ప్రాచుర్యం కల్పించేందుకు అసోసియేషన్ ఫర్ డీఎన్ఏ టెక్నాలజీస్ పేరుతో సంస్థను ప్రారంభించారు. భారత రాజ్యాంగం.. దేశ ప్రజలందరూ శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని తన ఆదేశ సూత్రాల ద్వారా బోధిస్తుంది. అయితే ఇది అంబేడ్కర్ రచించిన రాజ్యాం గంలో భాగం కాదు.. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలు రాజ్యాంగంలోకి చేరడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి పి.ఎం.భార్గవ. మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ 1946లోనే అసోసియేషన్ ఆఫ్ సైంటిఫిక్ వర్కర్స్ ఇన్ ఇండియా సంస్థను ఏర్పాటు చేసిన ఆయన సమాజంలో శాస్త్రీయ దృక్పథం లేకపోవడాన్ని తన తుదిశ్వాస వరకూ నిరసిస్తూనే వచ్చారు. ప్రజలపై మతగురువుల ప్రభావం మీద నిరసనగళమెత్తిన భార్గవ దేశంలో శాస్త్రీయ దృక్పథం లేమిని వివరిస్తూ ‘ద ఏంజిల్స్, డెవిల్ అండ్ సైన్స్’ పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. సొసైటీ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ ద్వారా భారత అంతరిక్ష రంగ పితామహుడు సతీశ్ ధవన్, అబ్దుర్ రెహ్మాన్ వంటి దిగ్గజాలతో కలిసి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు. 2000లో ఎన్డీఏ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్యాన్ని ఓ కోర్సుగా ప్రవేశపెట్టాలని ప్రయత్నించడాన్ని గట్టిగా నిరసించిన వ్యక్తి భార్గవ. వేదకాలంలోనే విమానాలున్నాయన్న అంశం 2015 జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రస్తావనకు వచ్చిన సందర్భంలోనూ.. ఈ ప్రభుత్వానికి సైన్స్ గురించి ఏబీసీడీలూ తెలియవని ఘాటు విమర్శలు చేసిన వ్యక్తిత్వం ఈయన సొంతం. హోమియోపతి వైద్యవిధానం అంతా బోగస్ అని.. ఉబ్బసం వ్యాధికి చికిత్సగా ఇస్తున్న చేపమందులోనూ శాస్త్రీయత లేదని భార్గవ ఎన్నో ఆందోళనలకు నేతృత్వం వహించారు. పి.ఎం.భార్గవ ప్రవృత్తి రీత్యా శాస్త్రవేత్త అయినప్పటికీ... జన్యుమార్పిడి పంటలను మాత్రం ఆయన గట్టిగా వ్యతిరేకించారు. ఈ విషయంలో ప్రభుత్వ విధానాలను సహేతుకంగా విమర్శించడంలో ఏనాడూ వెనక్కు తగ్గింది లేదు. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వైస్‌చైర్మన్‌గా, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజరీ బోర్డు సభ్యుడిగా.. జన్యుపంటలపై నిర్ణయం తీసుకునే జాతీయ సంస్థ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీలో సభ్యుడిగా పనిచేసిన భార్గవ భారత్‌లో జన్యుమార్పిడి పంటలకు అనుమతి ఇవ్వకూడదని... కనీసం 15 ఏళ్ల నిషేధం విధించాలని వాదించారు. బయోటెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు కూడా అనైతికమని.. రాజ్యంగ విరుద్ధమని ప్రకటించి గట్టిగా వ్యతిరేకించారు. భారతదేశం స్వాతంత్య్రం సాధించుకున్న తరువాత శాస్త్ర సాంకేతిక రంగాలు ఎలా అభివృద్ధి చెందాయన్న ఇతివృత్తంతో పి.ఎం. భార్గవ రాసిన పుస్తకం ‘‘ద సాగా ఆఫ్ ఇండియన్ సైన్స్ సిన్స్ ఇండిపెండెన్స్... ఇన్ ఏ నట్‌షెల్’’ దేశంలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన పరిశోధనశాలలు.. వాటి లక్ష్యాలపై చక్కటి దిక్సూచి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవే కాకుండా శాస్త్రీయ దృక్పథంపై భార్గవ రాసిన కథనాల సంకలనం ‘ఏంజిల్స్, డెవిల్ అండ్ సైన్స్’ పేరుతో పుస్తక రూపం సంతరించుకుంది. ఎజెండా ఫర్ ద నేషన్: ఆన్ అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ద యూపీఏ గవర్నమెంట్, ‘ద టూ ఫేసెస్ ఆఫ్ బ్యూటీ: సైన్స్ అండ్ ఆర్ట్’ లతోపాటు భార్గవ అనేక పత్రికల్లో కథనాలు రాశారు. సృజనాత్మక ఆలోచనలకు... సైన్స్‌కు, కళలకు దగ్గర సంబంధం ఉందని గట్టిగా నమ్మిన వారిలో పి.ఎం.భార్గవ ఒకరు. సీసీఎంబీని సందర్శించిన ప్రతి ఒక్కరికీ అది ఓ శాస్త్ర పరిశోధనాశాలగా కాకుండా ఆర్ట్ మ్యూజియంగానూ గుర్తుండిపోయేందుకు అవకాశాలు ఎక్కువ. జీవ కణాలు మొదలుకొని.. శరీరంలోని అతిసూక్ష్మస్థాయి పదార్థాలు కూడా చిత్రాలు, కుడ్య చిత్రాలు (మ్యూరల్స్) రూపంలో అక్కడ దర్శనమిస్తాయి. సీసీఎంబీ సెంట్రల్ కోర్టులో ఉన్న ఆర్ట్ గ్యాలరీ.. దేశంలో పరిశోధనశాలలో ఏర్పాటైన తొలి గ్యాలరీగా పేరొందింది అంటే కళాపోషకుడిగా భార్గవ ఎలాంటి వారో ఇట్టే అర్థమైపోతుంది. సీసీఎంబీ మొదలైన తొలినాళ్లలో ఎం.ఎఫ్.హుస్సేన్ వంటివారు వచ్చి.. ఒక మ్యూరల్‌ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత కూడా భార్గవ వైకుంఠం, హబీబ్ వంటి విఖ్యాత చిత్రకారులతో ఆర్ట్క్యాంపులు నిర్వహించడంతోపాటు వారు అక్కడ గీసిన పెయింటింగ్స్ అన్నింటినీ సీసీఎంబీ ద్వారానే కొనుగోలు చేసి ప్రదర్శనకు ఉంచేవారు. సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సి.హెచ్.మోహన్‌రావు పేర్కొన్నట్లుగా.. ‘‘జీవితాంతం తాను నమ్మిన అంశాలకు కట్టుబడి జీవించిన గొప్ప వ్యక్తి పి.ఎం.భార్గవ. చురుకైన మేధ.. కరడుకట్టిన హేతువాదం ఆయన వ్యక్తిత్వం’’. గిళియార్ గోపాలకృష్ణ మయ్యా సాక్షి డిప్యూటీ న్యూస్ ఎడిటర్ ‘ 99121 99375 -
ప్రొఫెసర్ పీఎం భార్గవ కన్నుమూత
తీవ్ర అనారోగ్యంతో స్వగృహంలో తుదిశ్వాస సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఎనలేని సేవలు భార్గవ మృతికి శాస్త్రవేత్తలు, ప్రముఖుల సంతాపం రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్పమిత్ర భార్గవ (89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. వయోభారం, తీవ్ర అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన కొడుకు మోహిత్ భార్గవ కెనడాలో ఉంటున్నారు. కూతురు వినీత గుంటూరులో ఒక స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నారు. కొడుకు మోహిత్ వచ్చిన తర్వాత 3న జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో భార్గవ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా, మాజీ డైరెక్టర్లు మోహన్‌రావు, లాల్జీసింగ్, సీనియర్ సైంటిస్టులు శివాజీ, జ్యోత్స్న ధావన్, ఇమ్రాన్ సిద్ధిఖీ ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. జ్యోతిష్య శాస్త్రం కోర్సుపై సుప్రీంకు: ఆధునిక జీవశాస్త్రానికి ఆర్కిటెక్ట్‌గా ప్రశంసలం దుకున్న భార్గవ.. సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్‌గా 13 ఏళ్ల పాటు విశేష సేవలందిం చారు. 2006లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం 220 విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్య శాస్త్రాన్ని కోర్సుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేసినప్పుడు నిర్ద్వంద్వంగా వ్యతిరేకించి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు, సైన్స్ టెంపర్ పెంచేందుకు 500కు పైగా వ్యాసాలు రాశారు. నేషనల్ నాలెడ్జ్ సెంటర్ వైస్ చైర్మన్‌గా పని చేశారు. చేప మందుకు వ్యతిరేకంగా.. హైదరాబాద్‌లో బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప మందు శాస్త్రీయతను సవాల్ చేస్తూ 2008 నుంచి జన విజ్ఞాన వేదిక చేపట్టిన అన్ని ఆందోళన కార్యక్రమాల్లో భార్గవ పాల్గొన్నారు. హైకోర్టుకు వెళ్లారు. చివరకు దాన్ని చేప మందుగా పరిగణించరాదని, చేప ప్రసాదంగానే భావించాలని కోర్టు పేర్కొంది. చేప మందే కాకుండా హోమియో వైద్యమూ మూఢ నమ్మకమేనని భార్గవ కొట్టిపారేశారు. శాస్త్రవేత్తగా ఆయన కృషికి 1986లో ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. కానీ గతేడాది దేశవ్యాప్తంగా రచయితలు, మేధావి వర్గంపై జరిగిన దాడులు, అసహనానికి వ్యతిరేకంగా అవార్డు తిరిగిచ్చేశారు. ‘హెడిల్‌బర్గర్’ వ్యవస్థాపకుల్లో ఒకరు.. 1928 ఫిబ్రవరి 22న రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో భార్గవ జన్మించారు. ఆయన తండ్రి రామచంద్ర భార్గవ, తల్లి గాయత్రీ భార్గవ. వారణాసి బీసెంట్ థియోసాఫికల్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించిన భార్గవ.. లక్నో విశ్వవిద్యాలయం నుంచి 1946లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ పట్టా పొందారు. 21వ ఏటనే సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంశంపై పీహెచ్డీ పరి శోధన చేశారు. 1950 నుంచి 1953 వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో, అదే సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. 1953 నుంచి 1956 వరకు అమెరికాలోని విస్కాన్సన్ వర్సిటీలో పని చేశారు. అక్కడే హెడిల్‌బర్గర్ లేబొరేటరీ వ్యవస్థాపకుల్లో ఒకరుగా నిలిచారు. వైఎస్ జగన్ సంతాపం సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ మాజీ అధిపతి, ప్రముఖ శాస్త్రవేత్త పి.ఎం. భార్గవ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సంతాపాన్ని తెలియజేశారు. విజ్ఞానశాస్త్ర రంగంలో భార్గవ చేసిన సేవలను వైఎస్ జగన్ కొనియాడుతూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఛాందస దేశంగా మార్చేస్తున్నారు
-
ఛాందస దేశంగా మార్చేస్తున్నారు
పద్మ అవార్డును వెనక్కిచ్చిన పీఎం భార్గవ భార్గవ బాటలో మరికొందరు శాస్త్రవేత్తలు నిరసన వ్యక్తం చేసిన 53మంది చరిత్రకారులు * వాదనలకు బుల్లెట్లతో జవాబిస్తున్నారని ఆరోపణ * బీజేపీపై వ్యతిరేకతే కారణం: వెంకయ్య సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రచయితలు, కళాకారులు.. సినీ ప్రముఖుల కోవలో శాస్త్రవేత్తలు, చరిత్రకారులు కూడా చేరారు. భారత దేశంలో ‘అసహన’ వాతావరణం పెచ్చుమీరుతోందని.. దీన్ని నియంత్రించటానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ విధమైన హామీ ప్రకటన చేయకపోవటాన్ని నిరసిస్తూ గురువారం దేశంలోని 53మంది ప్రముఖ చరిత్రకారులు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ప్రఖ్యాత శాస్త్రవేత్త పీఎం భార్గవ తనకు ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు హైదరాబాద్‌లో ప్రకటించారు. సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)వ్యవస్థాపక డెరైక్టర్ అయిన పుష్ప ఎం భార్గవ 1986లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.‘‘ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. మోదీ ప్రభుత్వం భారత్‌ను హిందూ ఛాందసవాద దేశంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇది నాలాంటి వారికి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు..’’ అని పేర్కొన్నారు. దేశ పౌరులందరూ శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తోంటే... కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నమైన రీతిలో ప్రవర్తిస్తోందన్నారు. ఆర్ఎస్ఎస్ నేతలు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన సంస్థ (సీఎస్ఐఆర్) సమావేశాల్లో పాల్గొనడం ఇలాంటిదేనన్నారు. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలకు తన దృష్టిలో ఏమాత్రం సానుభూతి లేదని... బీజేపీ ఆ సంస్థకు రాజకీయ విభాగంగా పనిచేస్తుండటం మరింత ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. భార్గవతో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు అశోక్‌సేన్, పీ.బలరాం, మాడభూషి రఘునాథన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డీ.బాలసుబ్రమణియన్‌లు కూడా తమ అవార్డులను వెనక్కి ఇవ్వాలని ఇంతకుముందే నిర్ణయించుకున్నారు. వీరంతా తమ నిరసనను వెబ్సైట్లో ప్రకటన ద్వారా తెలియజేశారు. బుల్లెట్లా సమాధానం?: దేశంలో వాతావరణం మునుపెన్నడూ లేని విధంగా కలుషితమైపోయిందని దేశంలోని ప్రఖ్యాత చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేశారు. రొమిల్లా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, కేఎన్ ఫణిక్కర్, మృదులా ముఖర్జీలతో సహా మొత్తం 53మంది చరిత్రకారులు దేశంలో ప్రస్తుతం కల్లోల పరిస్థితి నెలకొన్నదంటూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దాద్రీ ఘటన, సుధీంద్ర కులకర్ణిపై ఇంక్‌తో దాడి వంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. ‘అభిప్రాయభేదాలను వ్యక్తం చేస్తే వాటికి భౌతిక దాడులకు పరిష్కారం చూపాలని ప్రయత్నిస్తున్నారు. వాదనలకు ప్రతివాదనలు చేయకుండా బుల్లెట్లతో సమాధానాలిస్తున్నారు. ఒకరి తరువాత మరొకరు అవార్డులు వెనక్కి ఇస్తుంటే, రచయితలను రాయడం ఆపేయమని సలహా ఇవ్వ టం, మేధావులను మౌనంగా ఉండమని అన్యాపదేశంగా చెప్పటమే...’ అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ మౌనం గా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు రక్షణ కల్పించటం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, భిన్నత్వాన్ని పరిరక్షించటం ప్రభుత్వ బాధ్యత అని వారన్నారు. ఇప్పటికే 36 మంది రచయితలు తమ అవార్డులను వెనక్కి ఇవ్వటం, మరో అయిదుగురు తమ అధికారిక పదవులను విడిచిపెట్టడం, ఫిల్మ్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియావిద్యార్థులు 139రోజులు సమ్మె చేయటంతో పాటు 10మంది సినీ కళాకారులు అవార్డులను వెనక్కి ఇవ్వటం తెలిసిందే. అదొక ప్రదర్శన హైదరాబాద్: శాస్త్రవేత్తలు, చరిత్రకారులు అవార్డులను వెనక్కి ఇవ్వటం ఒక ప్రదర్శన అని ఇస్రో మాజీ చైర్మన్, ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త మాధవన్ నాయర్ గురువారం ఆరోపించారు. భారత్ లాంటి పెద్ద దేశంలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయని.. వాటన్నిం టికీ ప్రభుత్వమే కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. జీవిత సాఫల్యానికి గుర్తింపుగా దేశం గౌరవంగా ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చి వాటిని అవమానించటం తగదని ఆయన హితవు చెప్పారు. కాగా, ఈ నిరసనలతో మోదీసర్కారు ఇరుకున పడిందని తొలుత తన అవార్డును వెనక్కి ఇచ్చిన ప్రఖ్యాత రచయిత్రి నయనతార సెహగల్ అన్నారు. వీరంతా బీజేపీ వ్యతిరేకులు: అరుణ్‌జైట్లీ పట్నా/ముంబై: అవార్డులు వెనక్కి ఇస్తున్న వారంతా ‘తయారుచేయబడిన తిరుగుబాటుదారుల’ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. అవార్డులు వెనక్కి ఇస్తు న్న వారంతా రాజకీయం చేస్తున్నారు. ‘నా మాటకు నేను కట్టుబడి ఉన్నా.. అవార్డులు వెనక్కి ఇస్తున్న వారి సామాజిక, రాజకీయ వ్యాఖ్యానాలను ఫేస్బుక్, ట్విటర్లలో జాగ్రత్తగా గమనించండి. వారు బీజేపీపై పిచ్చి వ్యతిరేకతతో ఉన్నవారన్నది స్పష్టం అవుతుంది.’అని జైట్లీ అన్నారు. జైట్లీ మాట లు విమర్శను సహించని వైఖరిని ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్‌శర్మ పేర్కొన్నారు. వీరంతా భారత ప్రతిష్టను, హిందూ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక పక్షాలు, వామపక్ష భావజాల వర్గాలు పనిగట్టుకుని దుష్ర్పచారానికి పూనుకున్నాయని వెంకయ్య ఆరోపించారు. పీఎం భార్గవ బీజేపీ వ్యతిరేక సైన్యానికి నాయకుడని, బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. మరోవైపు తనకు ఇచ్చిన అవార్డును వెనక్కి ఇవ్వబోనని ప్రముఖ నటి విద్యాబాలన్ తేల్చి చెప్పారు.