సైన్సుకు కళలద్దినవాడు | hard working person pm bhargava | Sakshi
Sakshi News home page

సైన్సుకు కళలద్దినవాడు

Published Thu, Aug 3 2017 2:39 AM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

సైన్సుకు కళలద్దినవాడు

సైన్సుకు కళలద్దినవాడు

జీవితాంతం తాను నమ్మిన అంశాలకు కట్టుబడి జీవించిన గొప్ప వ్యక్తి, శాస్త్రవేత్త పి.ఎం. భార్గవ. దేశ ప్రజలందరూ శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలన్న భావనను 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలోకి చేర్చడంలో కీలకపాత్ర పోషించారు.

కొన్ని విషయాలపై నమ్మకం కలిగి ఉండటం జనసామాన్యులందరికీ ఉండే లక్షణమే. నమ్మిన వాటిని మనసా వాచా.. కర్మేణా ఆచరించే అసమాన్యులు మాత్రం కొందరే! ఈ కొందరిలో ఒక్కడు సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపకుడు పుష్పమిత్ర భార్గవ. పదేళ్ల వయసులో నేరుగా తొమ్మిదో తరగతిలో చేరి.. 21 ఏళ్లకే రసాయన శాస్త్రంలో స్నాతకోత్తర విద్యను పూర్తి చేయడం ఈయన పదునైన బుర్రకు నిదర్శనమేగానీ.. ఆ తరువాతి కాలంలో శాస్త్రవేత్తగా, విధాన రూపకర్తగా... హేతువాదిగా భార్గవ నిర్వహించిన పాత్రలు ఆయన బహుముఖ ప్రజ్ఞకు అద్దంపట్టేవి.

1946లో 21 ఏళ్ల వయసులో లక్నో విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా ప్రయాణం మొదలుపెట్టిన పి.ఎం. భార్గవ 1950 తరువాత హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (అప్పట్లో సెంట్రల్‌ లాబొరేటరీస్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసె ర్చ్‌)లో పనిచేశారు. శాస్త్రవేత్తగా విదేశాల్లో ఉండగా కేన్సర్‌ మందుపై పరిశోధనలు నిర్వహించిన ఈయన సీసీఎంబీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాలేయ కణాలను పరిశోధనాశాలలో పెంచేందుకు తద్వారా వాటిపై విస్తృత పరిశోధనలు చేసేందుకు వీలు కల్పించే ప్రక్రియను అభివృద్ధి చేసింది కూడా భార్గవనే. అంతేకాకుండా వీర్యంలో ఉండే సెమినల్‌ ప్లాస్మిన్‌ అనే పదార్థానికి యాంటీబయాటిక్‌ లక్షణాలున్నట్టు  మొట్టమొదట గుర్తించి దాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నించిన శాస్త్రవేత్తగా భార్గవకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. వ్యవసాయం మొదలుకొని జీవ, న్యాయశాస్త్రం, ఆరోగ్య రంగాల్లో డీఎన్‌ఏ ఆధారిత టెక్నాలజీల ఉపయోగాన్ని దాదాపు 20 ఏళ్ల క్రితమే  గుర్తించిన భార్గవ వాటికి ప్రాచుర్యం కల్పించేందుకు అసోసియేషన్‌ ఫర్‌ డీఎన్‌ఏ టెక్నాలజీస్‌ పేరుతో సంస్థను ప్రారంభించారు.

భారత రాజ్యాంగం.. దేశ ప్రజలందరూ శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని తన ఆదేశ సూత్రాల ద్వారా బోధిస్తుంది. అయితే ఇది అంబేడ్కర్‌ రచించిన రాజ్యాం గంలో భాగం కాదు.. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలు రాజ్యాంగంలోకి చేరడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి పి.ఎం.భార్గవ. మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ 1946లోనే అసోసియేషన్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ వర్కర్స్‌ ఇన్‌ ఇండియా సంస్థను ఏర్పాటు చేసిన ఆయన సమాజంలో శాస్త్రీయ దృక్పథం లేకపోవడాన్ని తన తుదిశ్వాస వరకూ నిరసిస్తూనే వచ్చారు. ప్రజలపై మతగురువుల ప్రభావం మీద నిరసనగళమెత్తిన భార్గవ దేశంలో శాస్త్రీయ దృక్పథం లేమిని వివరిస్తూ ‘ద ఏంజిల్స్, డెవిల్‌ అండ్‌ సైన్స్‌’ పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. సొసైటీ ఫర్‌ ద ప్రమోషన్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ టెంపర్‌ ద్వారా  భారత అంతరిక్ష రంగ పితామహుడు సతీశ్‌ ధవన్, అబ్దుర్‌ రెహ్మాన్‌ వంటి దిగ్గజాలతో కలిసి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు. 2000లో ఎన్‌డీఏ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్యాన్ని ఓ కోర్సుగా ప్రవేశపెట్టాలని ప్రయత్నించడాన్ని గట్టిగా నిరసించిన వ్యక్తి భార్గవ. వేదకాలంలోనే విమానాలున్నాయన్న అంశం 2015 జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రస్తావనకు వచ్చిన సందర్భంలోనూ.. ఈ ప్రభుత్వానికి సైన్స్‌ గురించి ఏబీసీడీలూ తెలియవని ఘాటు విమర్శలు చేసిన వ్యక్తిత్వం ఈయన సొంతం. హోమియోపతి వైద్యవిధానం అంతా బోగస్‌ అని.. ఉబ్బసం వ్యాధికి చికిత్సగా ఇస్తున్న చేపమందులోనూ శాస్త్రీయత లేదని భార్గవ ఎన్నో ఆందోళనలకు నేతృత్వం వహించారు.

పి.ఎం.భార్గవ ప్రవృత్తి రీత్యా శాస్త్రవేత్త అయినప్పటికీ... జన్యుమార్పిడి పంటలను మాత్రం ఆయన గట్టిగా వ్యతిరేకించారు. ఈ విషయంలో ప్రభుత్వ విధానాలను సహేతుకంగా విమర్శించడంలో ఏనాడూ వెనక్కు తగ్గింది లేదు. నేషనల్‌ నాలెడ్జ్‌ కమిషన్‌ వైస్‌చైర్మన్‌గా, నేషనల్‌ సెక్యూరిటీ అడ్వయిజరీ బోర్డు సభ్యుడిగా.. జన్యుపంటలపై నిర్ణయం తీసుకునే జాతీయ సంస్థ జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ అప్రైజల్‌ కమిటీలో సభ్యుడిగా పనిచేసిన భార్గవ భారత్‌లో జన్యుమార్పిడి పంటలకు అనుమతి ఇవ్వకూడదని... కనీసం 15 ఏళ్ల నిషేధం విధించాలని వాదించారు. బయోటెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు కూడా అనైతికమని.. రాజ్యంగ విరుద్ధమని ప్రకటించి గట్టిగా వ్యతిరేకించారు.

భారతదేశం స్వాతంత్య్రం సాధించుకున్న తరువాత శాస్త్ర సాంకేతిక రంగాలు ఎలా అభివృద్ధి చెందాయన్న ఇతివృత్తంతో పి.ఎం. భార్గవ రాసిన పుస్తకం ‘‘ద సాగా ఆఫ్‌ ఇండియన్‌ సైన్స్‌ సిన్స్‌ ఇండిపెండెన్స్‌... ఇన్‌ ఏ నట్‌షెల్‌’’  దేశంలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన పరిశోధనశాలలు.. వాటి లక్ష్యాలపై చక్కటి దిక్సూచి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవే కాకుండా శాస్త్రీయ దృక్పథంపై భార్గవ రాసిన కథనాల సంకలనం ‘ఏంజిల్స్, డెవిల్‌ అండ్‌ సైన్స్‌’ పేరుతో పుస్తక రూపం సంతరించుకుంది. ఎజెండా ఫర్‌ ద నేషన్‌: ఆన్‌ అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ ద యూపీఏ గవర్నమెంట్, ‘ద టూ ఫేసెస్‌ ఆఫ్‌ బ్యూటీ: సైన్స్‌ అండ్‌ ఆర్ట్‌’ లతోపాటు భార్గవ అనేక పత్రికల్లో కథనాలు రాశారు.

సృజనాత్మక ఆలోచనలకు... సైన్స్‌కు, కళలకు దగ్గర సంబంధం ఉందని గట్టిగా నమ్మిన వారిలో పి.ఎం.భార్గవ ఒకరు. సీసీఎంబీని సందర్శించిన ప్రతి ఒక్కరికీ అది ఓ శాస్త్ర పరిశోధనాశాలగా కాకుండా ఆర్ట్‌ మ్యూజియంగానూ గుర్తుండిపోయేందుకు అవకాశాలు ఎక్కువ. జీవ కణాలు మొదలుకొని.. శరీరంలోని అతిసూక్ష్మస్థాయి పదార్థాలు కూడా చిత్రాలు, కుడ్య చిత్రాలు (మ్యూరల్స్‌) రూపంలో అక్కడ దర్శనమిస్తాయి. సీసీఎంబీ సెంట్రల్‌ కోర్టులో ఉన్న ఆర్ట్‌ గ్యాలరీ.. దేశంలో పరిశోధనశాలలో ఏర్పాటైన తొలి గ్యాలరీగా పేరొందింది అంటే కళాపోషకుడిగా భార్గవ ఎలాంటి వారో ఇట్టే అర్థమైపోతుంది. సీసీఎంబీ మొదలైన తొలినాళ్లలో ఎం.ఎఫ్‌.హుస్సేన్‌ వంటివారు వచ్చి.. ఒక మ్యూరల్‌ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత కూడా భార్గవ వైకుంఠం, హబీబ్‌ వంటి విఖ్యాత చిత్రకారులతో ఆర్ట్‌క్యాంపులు నిర్వహించడంతోపాటు వారు అక్కడ గీసిన పెయింటింగ్స్‌ అన్నింటినీ సీసీఎంబీ ద్వారానే కొనుగోలు చేసి ప్రదర్శనకు ఉంచేవారు. సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ సి.హెచ్‌.మోహన్‌రావు పేర్కొన్నట్లుగా.. ‘‘జీవితాంతం తాను నమ్మిన అంశాలకు కట్టుబడి జీవించిన గొప్ప వ్యక్తి పి.ఎం.భార్గవ. చురుకైన మేధ.. కరడుకట్టిన హేతువాదం ఆయన వ్యక్తిత్వం’’.

గిళియార్‌ గోపాలకృష్ణ మయ్యా
సాక్షి డిప్యూటీ న్యూస్‌ ఎడిటర్‌ ‘ 99121 99375

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement