వెలిచాల జగపతిరావు
తెలంగాణ ఉద్యమ కారుడు, కరుడుగట్టిన కాంగ్రెస్‌వాది వెలిచాల జగపతిరావు మన మధ్య నుంచి విశ్రమించడం జీర్ణించుకోలేనిది. జగపతి రావుతో నా అనుబంధం మూడున్నర దశాబ్దాల కింద మొదలై ఆయన తుదిశ్వాస వరకు కొనసాగింది. ఆయన ఏ పదవి చేపట్టినా తన కార్యాచరణ, క్రమశిక్షణతో ఆ కుర్చీకే వన్నె తెచ్చేవారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా, స్వతంత్ర శాసనసభ్యుడిగా సభలో అడుగుపెట్టినా ముఖ్యమంత్రులు, మంత్రులతో ఆయన సాన్ని హిత్యం ఎప్పటికీ మరువలేనిది.
నేను 1974లో రాజకీయ ఆరంగేట్రం గావించే కన్నా నాలుగేళ్ల ముందు నుంచే, అంటే 1970లోనే ఆయన ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. ‘గుడి’ గ్రామ సహకార సంఘం చైర్మన్‌గా, గంగాధర సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. చలకుర్తి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేనూ, కరీం నగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర శాసన సభ్యుడిగా జగపతిరావూ 1989లో ఏకకాలంలో అసెంబ్లీలో అడుగుపెట్టాం. కాంగ్రెస్ పార్టీలో జగ పతిరావు సీనియర్ లీడర్‌గా ఉన్నప్పటికీ టికెట్ దక్కని కారణంగా ఇండిపెండెంట్‌గా గెలుపొంది సత్తా చాటుకున్నారు. దాంతో అందరి దృష్టి ఒక్కసారిగా జగపతిరావు మీద పడింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివక్ష, అవమానం, అణచివేతకు తెలంగాణ ప్రాంతం గురవుతుందనే భావన మాలో రోజు రోజుకూ రూఢీపడ సాగింది. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ స్టేట్‌ను కలిపే ముందు రాసుకున్న ఒప్పందాలు అమలుకు నోచుకోకపోవడంతో జగపతిరావు కోపంతో రగిలి పోయేవారు. పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాలు, అష్ట సూత్రాలు వంటి ఒప్పందాలు అమలు కావాలంటే తెలంగాణ శాసనసభ్యులం అందరం ఒకే వేదిక మీదకు రావాలని నిశ్చయించుకున్నాం. ‘తెలంగాణ శాసన సభ్యుల ఫోరం’ 1991లో ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఫోరం ఏర్పాటులో జగపతిరావు పాత్ర అమోఘం.
జువ్వాడి చొక్కారావు, పి. నర్సారెడ్డి, చిట్టెం నర్సిరెడ్డి, ఎమ్. బాగారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఎమ్. నారాయణరెడ్డి, ఎమ్. సత్యనారాయణరావు, ఎన్. ఇంద్రసేనారెడ్డి, సీహెచ్. విద్యాసాగర్‌రావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వంటి భిన్న పార్టీల సభ్యులు తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ఏర్పాటులో కీలక పాత్ర నిర్వహించారు. ఫోరం అధ్యక్షుడిగా నన్ను, కన్వీనర్‌గా జగపతిరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రాంత హక్కులు, రక్షణలు, నీళ్లు నిధులలో వాటాల కోసం శాసనసభ లోపలా, బయటా సమష్టిగా పోరాడాలని తీర్మానించాం. అధికార పార్టీ సభ్యులు మంత్రులుగా ఉంటే మంత్రివర్గ సమావేశాల్లోనూ తెలంగాణ వాటాల గురించి దెబ్బలాడాలని నిర్ణయించి ఆచరణలో చూపెట్టినాం. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా, జగపతిరావు అధికార పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ తెలంగాణ వాటా కోసం రాజీలేని పోరాటం కొనసాగించాం. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో తొలి బడ్జెట్‌లోనే జగపతిరావుతో కలిసి అసెంబ్లీలో రెండున్నర గంటల పాటు తెలంగాణ గొంతును వినిపించాం. తెలంగాణ శాసనసభ్యుల ఫోరం చేసిన కృషి వల్లనే ప్రత్యేకంగా తెలంగాణ మదర్ డెయిరీ ఏర్పాటు అయింది.
బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య తొలిదశ తెలంగాణ ఉద్యమం 1969లో విఫలమైన తర్వాత, తెలంగాణవాదం బలహీనపడకుండా చేయడంలో తెలంగాణ శాసన సభ్యుల ఫోరం చేసిన కృషి ఎనలేనిది. నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ శాసనసభ్యులు ఫోరాన్ని కన్వీనర్ జగపతిరావు ముందుండి నడిపించారు. సాగునీటి పంపకంలో తెలంగాణ పట్ల వివక్షను తెలంగాణ శాసనసభ్యుల ఫోరం తీవ్రంగా నిరసించింది. నాడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం తెలంగాణ శాసనసభ్యుల ఫోరం చేసిన పోరాట ఫలితంగానే దేవాదుల, నెట్టెంపాడు, తుపాకుల గూడెం, కల్వకుర్తి ఎత్తిపోతల, శ్రీశైలం ఎడమ కాలువ, కరీంనగర్ వరద కాలువ పథకాలు మొదలైనాయి.
పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉండగా అనేక మార్లు తెలంగాణ వాటాలో వివక్షపై పీవీకి వివరించి, కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించగలిగాం. నా రాజకీయ అనుబంధం రానునాను జగపతి రావుకు నన్ను అనుంగు మిత్రునిగా మార్చింది. తెలంగాణ సమస్యలపై జగపతిరావు కవిగా, సాహితీవేత్తగా లోతైన అధ్యయనం చేసి తన కవిత్వం ద్వారా, నిరంతర రచనలతో ప్రజల్లో స్ఫూర్తి రగిలించారు.
అధికారంలో ఉన్నా, వెలుపల ఉన్నా మాలాంటి వారికి ఎందరికో జగపతిరావు స్ఫూర్తి దాయకం. ఆయన పట్టుదల పలువురికి విస్మయం కలిగించేది. దీర్ఘకాలం ప్రజల మధ్య పాటుపడిన ఒక ఆత్మీయుణ్ణి కోల్పోయిన వెలితి నన్ను బాధిస్తున్నది. జగపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలని కన్నీటితో నివాళులు అర్పిస్తున్నాను. జగపతిరావు ఆశయాలు నెరవేరి, తెలంగాణ నలుదిక్కులా దీప కాంతులు వెదజల్లాలని ఆకాంక్షిస్తున్నాను. (క్లిక్ చేయండి: భారత్ జోడో పాదయాత్రతో కొత్త ఉత్సాహం)
- కుందూరు జానారెడ్డి
మాజీ మంత్రివర్యులు
Comments
Please login to add a commentAdd a comment