KUNDURU Jana Reddy
-
కాంగ్రెస్‌లో ‘సన్నాఫ్ సీనియర్లు’
నల్గొండ: నాగార్జునసాగర్ నియోజకర్గంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుల కుమారులు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు. వీరు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డికి ప్రచారంలో అగ్రబాగాన నిలిచారు. సీనియర్ నాయకుడు యడవెల్లి రంగశాయిరెడ్డి కుమారుడు యడవెల్లి వల్లభ్‌రెడ్డి, నిడమనూరుకు చెందిన మేరెడ్డి వెంకట్రాహుల్ కుమారుడు మేరెడ్డి వివేక్‌కృష్ణ, నిడమనూరు సర్పంచ్ మేరెడ్డి పుష్పలత కుమారుడు శ్రీనివాసరెడ్డి కుమారుడు మేరెడ్డి వెంకట్, కుందూరు లక్ష్మారెడ్డి కుమారుడు దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీపీ చేకూర హన్మంతరావు కుమారుడు చేకూరి శంశీచరణ్ కాంగ్రెస్‌లో చేరి జయవీర్ తరఫున విస్తృ త ప్రచారం ఇర్వహించారు. నిడమనూరుకు చెందిన మేరెడ్డి వెంకట్ అమెరికా నుంచి, కుందూరు దేవేందర్‌రెడ్డి కెనడా నుంచి వచ్చి మరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనుముల మండలం ఇబ్రహీంపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత యడవెల్లి నరేందర్‌రెడ్డి కుమారుడు వంశీకృష్ణారెడ్డి సైతం జయవీర్‌రెడ్డి గెలుపు కోసం పనిచేశారు. మేరెడ్డి వెంకట్రాహుల్ కుమారుడు మేరెడ్డి వివేక్‌కృష్ణ ప్రచారంలో ఎంతో కలివిడిగా ప్రజలతో మమేకమయ్యాడు. కొన్ని గ్రామాల్లో ఓటర్లు కుందూరు జానారెడ్డి కుమారుడు ఎవరు, ఏడీ అని అడిగిన వారికి వారిని వాహనం వద్దకు తీసుకెళ్లి ఇతనే కుందూరు జయవీర్‌రెడ్డి అని చెప్పి పరిచయం చేశాడు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అంకతి సత్యం కూడా దివంగత సీనియర్ నేత అంకతి వెంకటయ్య కుమారుడే, మండల యూత్ అధ్యక్షుడు నర్సింగ్ విజయ్ కుమార్‌గౌడ్ కూడా సీనియర్ నాయకుడు నర్సింగ్ కృష్ణయ్య కుమారుడే కావడం గమనార్హం. యువ రక్తంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఆకట్టుకున్నారు. ఆదివారం వెబడే ఫలితాలపై వీరి ప్రభావం ఎంత ఉంటుందో వేచి చూడాల్సిందే. -
ప్రజల మద్దతు నాకే..
‘ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటా ప్రజల నుంచి నాకు ఆదరణ లభిస్తోంది. భారీ మెజార్టీతో విజయం సాధిస్తానన్న ధీమా ఏర్పడింది. నామీద నమ్మకంతో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ ప్రాంత బిడ్డగా.. ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై ప్రతి నిత్యం కొట్లాడుతున్నాను. ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతా’నని కాంగ్రెస్ నాగార్జునసాగర్ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నల్గొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు మా ర్పు కోరుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ప్రజలు భావిస్తున్నారు. భారీ మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నాను. నియోజకవర్గానికి మా నాన్న చేసిన అభివృద్ధి వాళ్ల కళ్ల ముందే కనిపిస్తోంది. గడిచిన ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. నేను గెలిచాక స్థానికంగానే ఉండి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతా. జానారెడ్డి హయాంలోనే అభివృద్ధి.. సాగర్ నియోజకవర్గంలో ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మా నాన్న కుందూరు జానారెడ్డి హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగింది. గిరిజన తండాలకు రోడ్లు, కరెంట్ సౌకర్యంతో పాటు 34 వేల ఇళ్లు, 2 లక్షల ఎకరాలకు సాగునీరు, 1048 కిలోమీటర్ల రహదారుల నిర్మాణంతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు మా వద్ద లెక్కలతో సహా ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి.. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన జాబ్ క్యాలెండర్ అమలు చేయడానికి కట్టుబడి ఉంది. యువత చెడ్డదారిలో పోకుండా చదువుపై మనస్సును నిలిపి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ అవకాశాలు విస్తృతం చేయనున్నాం. ప్రైవేట్ రంగాల్లోనూ ఉపాధి కల్పించడానికి నేను సొంతంగా కృషి చేస్తాను. యువత మేధస్సును పరిపూర్ణంగా వినియోగించుకుంటాం. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి.. నియోజకవర్గంలో ప్రజలు వైద్య సేవలు సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మండల, మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రజలకు కావాలి్సన ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పించి వైద్య సేవలు స్థానికంగానే అందేలా చర్యలు తీసుకుంటాం. విద్యా సౌకర్యాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా స్కూళ్లలో టీచర్ల కొరత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. టీచర్ల కొరత తీర్చడంతో పాటు శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలకు మరమ్మతు చేయించి ప్రైమరీ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. -
జానారెడ్డి ఎక్కడ?.. ఆ కమిటీ ఉన్నట్లా? లేనట్లా?
తెలంగాణలో ఎన్నికలు తరుముకొస్తున్నాయి. టీ.కాంగ్రెస్ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చిందా? రాలేదా? పార్టీల మధ్య జంపింగ్‌లు భారీగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి టీ.కాంగ్రెస్ చేరికల కమిటీ ఉన్నట్లా? లేనట్లా? చేరికల కమిటీ ఛైర్మన్ జానారెడ్డి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటున్నవారితో చర్చిస్తున్నారా? కొత్తవారిని పట్టించుకోవడం మానేశారా? ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పార్టీల మధ్య కుండమార్పిళ్ళు సహజమే. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి కప్పగెంతులు భారీగానే జరుగుతుంటాయి. అందుకే ప్రతి పార్టీలోనూ చేరికల కమిటీలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ బాధ్యతను పార్టీలో ఒక సీనియర్‌కు అప్పగిస్తారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా సీనియర్ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. ఎవరైనా కాంగ్రెస్‌లో చేరాలంటే ఈ కమిటీయే తుది నిర్ణయం తీసుకుంటుంది. పార్టీలో చేరదామనుకుంటున్నవారితో చర్చించి ఫైనల్ చేస్తుంది. ఇటువంటి కీలకమైన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న జానారెడ్డి ఇంతవరకు సమావేశమే ఏర్పాటు చేయలేదు. కమిటీ ఏర్పాటయ్యాక కొత్తవారు ఎవరూ కాంగ్రెస్‌లో చేరింది లేదు. ఎవరితోనూ కమిటీ చర్చించిందీ లేదు. పెద్దలు జానారెడ్డి చేరికల కమిటీ ఉనికినే ప్రశ్నార్థకం చేయడంతో..అసలు ఈ కమిటీ ఉందా లేదా అని గాంధీభవన్‌లో చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌లోకి వద్దామని ఎవరైనా అనుకుంటే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోనో.. లేక సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోనో చర్చిస్తున్నారు గాని.. జానారెడ్డిని ఎవరూ పట్టించుకోవడంలేదు. మరోవైపు చేరికల కమిటీకి పీసీసీ నేతలే విలువ ఇవ్వడంలేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అసలు చేరికల కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఇతర పార్టీ నేతలను ఆకర్షించడంలో ఫెయిలయ్యిందనే విమర్శలు వస్తున్నాయి. ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలతో చర్చించి కాంగ్రెస్‌లోకి తీసుకురావడం చేరికల కమిటీ పని. కానీ జానారెడ్డి ఇప్పటి వరకు అలాంటి ఆలోచనే చేయలేదనే అభిప్రాయాలు కాంగ్రెస్‌లోనే వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు బీజేపీ చేరికల కమిటీ ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరుపుతూ పార్టీలోకి నేతలను ఆహ్వానిస్తుంటే.. టీ కాంగ్రెస్ చేరికల కమిటీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదనే అసహనం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. చదవండి: పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్నుంచి సస్పెండైన సీనియర్ నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కొద్దిరోజులుగా చౌరస్తాలో నిలబడి ఏ పార్టీలో చేరాలనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇలాంటి సమయంలో వారితో సంప్రదింపులు జరపాల్సిన చేరికల కమిటీ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. పార్టీలో చేరాలనుకునే వారు కావాలంటే తమ దగ్గరకే వస్తారు..తాము ఇంకొకరి దగ్గరికి వెళ్ళేది ఏంటనే ధోరణిలో టీ కాంగ్రెస్ చేరికల కమిటీ వ్యవహరిస్తోంది. గాంధీభవన్ నేతల తీరుతో పార్టీలో చేరాలనుకునే వారు కూడా కాంగ్రెస్ పట్ల విముఖత చూపుతున్నారు. గతంలో ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న సమయంలో కూడా చేరికల కమిటీ సకాలంలో రియాక్ట్ కాకపోవడం వల్లే ఈటల బీజేపీలోకి వెళ్ళారనే విమర్శ ఉంది. చదవండి: ఎమ్మెల్యేగా సీతక్క కొడుకు పోటీ ఇక్కడి నుంచేనా..? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా చేరికల కమిటీ యాక్టీవ్ గా పనిచేయాలని సూచిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేత అయిన జానారెడ్డి చేరికల కమిటీని యాక్టివ్ చేయాలని కోరుతున్నారు. ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలతో వారి ఇళ్లకు వెళ్లి సంప్రదింపులు జరపాలని.. లేదంటే పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రారని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తెలంగాణ కోసం కలిసి కొట్లాడాం.. ఆత్మీయుణ్ని కోల్పోయా
తెలంగాణ ఉద్యమ కారుడు, కరుడుగట్టిన కాంగ్రెస్‌వాది వెలిచాల జగపతిరావు మన మధ్య నుంచి విశ్రమించడం జీర్ణించుకోలేనిది. జగపతి రావుతో నా అనుబంధం మూడున్నర దశాబ్దాల కింద మొదలై ఆయన తుదిశ్వాస వరకు కొనసాగింది. ఆయన ఏ పదవి చేపట్టినా తన కార్యాచరణ, క్రమశిక్షణతో ఆ కుర్చీకే వన్నె తెచ్చేవారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా, స్వతంత్ర శాసనసభ్యుడిగా సభలో అడుగుపెట్టినా ముఖ్యమంత్రులు, మంత్రులతో ఆయన సాన్ని హిత్యం ఎప్పటికీ మరువలేనిది. నేను 1974లో రాజకీయ ఆరంగేట్రం గావించే కన్నా నాలుగేళ్ల ముందు నుంచే, అంటే 1970లోనే ఆయన ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. ‘గుడి’ గ్రామ సహకార సంఘం చైర్మన్‌గా, గంగాధర సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. చలకుర్తి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేనూ, కరీం నగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర శాసన సభ్యుడిగా జగపతిరావూ 1989లో ఏకకాలంలో అసెంబ్లీలో అడుగుపెట్టాం. కాంగ్రెస్ పార్టీలో జగ పతిరావు సీనియర్ లీడర్‌గా ఉన్నప్పటికీ టికెట్ దక్కని కారణంగా ఇండిపెండెంట్‌గా గెలుపొంది సత్తా చాటుకున్నారు. దాంతో అందరి దృష్టి ఒక్కసారిగా జగపతిరావు మీద పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివక్ష, అవమానం, అణచివేతకు తెలంగాణ ప్రాంతం గురవుతుందనే భావన మాలో రోజు రోజుకూ రూఢీపడ సాగింది. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ స్టేట్‌ను కలిపే ముందు రాసుకున్న ఒప్పందాలు అమలుకు నోచుకోకపోవడంతో జగపతిరావు కోపంతో రగిలి పోయేవారు. పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాలు, అష్ట సూత్రాలు వంటి ఒప్పందాలు అమలు కావాలంటే తెలంగాణ శాసనసభ్యులం అందరం ఒకే వేదిక మీదకు రావాలని నిశ్చయించుకున్నాం. ‘తెలంగాణ శాసన సభ్యుల ఫోరం’ 1991లో ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఫోరం ఏర్పాటులో జగపతిరావు పాత్ర అమోఘం. జువ్వాడి చొక్కారావు, పి. నర్సారెడ్డి, చిట్టెం నర్సిరెడ్డి, ఎమ్. బాగారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఎమ్. నారాయణరెడ్డి, ఎమ్. సత్యనారాయణరావు, ఎన్. ఇంద్రసేనారెడ్డి, సీహెచ్. విద్యాసాగర్‌రావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వంటి భిన్న పార్టీల సభ్యులు తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ఏర్పాటులో కీలక పాత్ర నిర్వహించారు. ఫోరం అధ్యక్షుడిగా నన్ను, కన్వీనర్‌గా జగపతిరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రాంత హక్కులు, రక్షణలు, నీళ్లు నిధులలో వాటాల కోసం శాసనసభ లోపలా, బయటా సమష్టిగా పోరాడాలని తీర్మానించాం. అధికార పార్టీ సభ్యులు మంత్రులుగా ఉంటే మంత్రివర్గ సమావేశాల్లోనూ తెలంగాణ వాటాల గురించి దెబ్బలాడాలని నిర్ణయించి ఆచరణలో చూపెట్టినాం. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా, జగపతిరావు అధికార పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ తెలంగాణ వాటా కోసం రాజీలేని పోరాటం కొనసాగించాం. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో తొలి బడ్జెట్లోనే జగపతిరావుతో కలిసి అసెంబ్లీలో రెండున్నర గంటల పాటు తెలంగాణ గొంతును వినిపించాం. తెలంగాణ శాసనసభ్యుల ఫోరం చేసిన కృషి వల్లనే ప్రత్యేకంగా తెలంగాణ మదర్ డెయిరీ ఏర్పాటు అయింది. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య తొలిదశ తెలంగాణ ఉద్యమం 1969లో విఫలమైన తర్వాత, తెలంగాణవాదం బలహీనపడకుండా చేయడంలో తెలంగాణ శాసన సభ్యుల ఫోరం చేసిన కృషి ఎనలేనిది. నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ శాసనసభ్యులు ఫోరాన్ని కన్వీనర్ జగపతిరావు ముందుండి నడిపించారు. సాగునీటి పంపకంలో తెలంగాణ పట్ల వివక్షను తెలంగాణ శాసనసభ్యుల ఫోరం తీవ్రంగా నిరసించింది. నాడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం తెలంగాణ శాసనసభ్యుల ఫోరం చేసిన పోరాట ఫలితంగానే దేవాదుల, నెట్టెంపాడు, తుపాకుల గూడెం, కల్వకుర్తి ఎత్తిపోతల, శ్రీశైలం ఎడమ కాలువ, కరీంనగర్ వరద కాలువ పథకాలు మొదలైనాయి. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉండగా అనేక మార్లు తెలంగాణ వాటాలో వివక్షపై పీవీకి వివరించి, కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించగలిగాం. నా రాజకీయ అనుబంధం రానునాను జగపతి రావుకు నన్ను అనుంగు మిత్రునిగా మార్చింది. తెలంగాణ సమస్యలపై జగపతిరావు కవిగా, సాహితీవేత్తగా లోతైన అధ్యయనం చేసి తన కవిత్వం ద్వారా, నిరంతర రచనలతో ప్రజల్లో స్ఫూర్తి రగిలించారు. అధికారంలో ఉన్నా, వెలుపల ఉన్నా మాలాంటి వారికి ఎందరికో జగపతిరావు స్ఫూర్తి దాయకం. ఆయన పట్టుదల పలువురికి విస్మయం కలిగించేది. దీర్ఘకాలం ప్రజల మధ్య పాటుపడిన ఒక ఆత్మీయుణ్ణి కోల్పోయిన వెలితి నన్ను బాధిస్తున్నది. జగపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలని కన్నీటితో నివాళులు అర్పిస్తున్నాను. జగపతిరావు ఆశయాలు నెరవేరి, తెలంగాణ నలుదిక్కులా దీప కాంతులు వెదజల్లాలని ఆకాంక్షిస్తున్నాను. (క్లిక్ చేయండి: భారత్ జోడో పాదయాత్రతో కొత్త ఉత్సాహం) - కుందూరు జానారెడ్డి మాజీ మంత్రివర్యులు -
ఇలాంటి సవాల్ చేసిన చరిత్ర దేశంలో నా ఒక్కడిదే
సాక్షి, నల్లగొండ: ‘నామినేషన్ వేశాక నేను ఒక్క ఓటరును కూడా కలవను. మీరు అంగీకరిస్తరా? టీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఇలా ఓటర్లను కలవకుండా ఈ ఎన్నికల్లో పాల్గొంటారా? సీఎం కేసీఆర్ నా సవాల్‌ను స్వీకరించి జవాబు ఇవ్వాలి. బీజేపీ కూడా ఈ సవాల్‌ను స్వీకరిస్తుందా? గతంలోనే ఇలాంటి సవాల్ చేసిన చరిత్ర ఈ దేశంలో నా ఒక్కడిదే. ఇప్పుడూ అదే సవాల్ చేస్తున్నా’అని నాగార్జునసాగర్ ఉపఎన్నిక బరిలో నిలిచినకాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను ఉదహరిస్తూ ‘ఓటు అనే కత్తిని ఉపయోగించుకొని రాజుల్లా నిలబడతారా? లేక అమ్ముడుపోయి బానిసలుగా మిగిలిపోతారా? నిర్ణయం మీది’ అంటూ నియోజకవర్గ ఓట ర్లను జానా ప్రశ్నించారు. హామీల అమలులో విఫలమైన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివా రం నల్లగొండ జిల్లా హాలియాలోని ఎంసీఎం కళా శాలలో నిర్వహించిన జనగర్జన బహిరంగ సభలో జానారెడ్డి ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని దుయ్యబట్టారు. శనివారం నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన సాగర్ జనగర్జన సభకు హాజరైన జనం సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే.. ‘కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది... తెలంగాణ ఇచ్చింది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కోసం రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని త్యాగం చేసింది. మా పదవులనూ త్యాగం చేశాం’అని జానారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ది అసమర్థ ప్రభుత్వమని, 15 ఏళ్ల కిందటే దేశంలో ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని గుర్తుచేశారు. తమ పార్టీ పాలన హయాంలోనే ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, మహిళా సంఘాలు, రుణమాఫీ, పంటలకు మద్దతు ధరలు ఇవ్వడంతోపాటు రైతులపక్షాన అడుగడుగునా అండగా ఉన్నామన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఇస్తోందని పేర్కొనారు. నాగార్జునసాగర్‌లో ఏం అభివృద్ధి జరిగింది? శూన్యం అంటున్న టీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ వల్లే పదవులు వచ్చాయని, టీఆర్ఎస్కు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకూ వివిధ పదవులు వచ్చింది కాంగ్రెస్ వల్లేనన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేది పదవుల కోసం కాదని, ఈ స్థానాన్ని గెలిచి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాకు బహుమతిగా ఇవ్వడం కోసమేనన్నారు. కేసీఆర్ మోసాలు, అబద్ధాలను ఎండగట్టడమే ఈ ఎన్నికల ప్రధాన ఎజెండా అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను అంతమొందించేందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. ఇవి చరిత్రాత్మక ఎన్నిక అని, సాగర్ ప్రాజెక్టు కింద నిలబడి మాయమాటలు చెప్పి సీఎం కేసీఆర్ కొత్త ప్రకటనలు చేశారని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు ఈ ఎన్నికలో విజయం ఒక సందేశం ఇస్తుందని, జానారెడ్డి గెలుపు చారిత్రక అవసరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమరిశంచారు. రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ పాలన: ఎంపీ కోమటిరెడ్డి ‘రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. అవినీతి, నిరంకుశ పాలన పోవడానికి కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పోటీ చేస్తున్నారు. జానా జనంలో పుట్టిన నాయకుడు’అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం పదవి తనకు చెప్పుతో సమానమని అహంకారంతో మాట్లాడిన కేసీఆర్‌ని చెప్పు ముఖ్యమంత్రి అని పిలవాలన్నారు. ఎన్నికల్లో చెప్పు పెట్టినా ఓటు వేయాలని, ఎవరిని నిలబెట్టినా ఓటు వేయాలని చెబుతున్న కేసీఆర్‌కి సిగ్గుండాలని దుయ్యబట్టారు. సాగర్ ఉప ఎన్నికలో 23 మంది టీఆర్ఎస్ ఎమ్మేల్యేలను ఊరూరా తిప్పుతూ కాంగ్రెస్ నేతలను డబ్బులతో కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బందిపోట్లుగా మారారని, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు బ్రోకర్‌గా మారాడని ధ్వజమెత్తారు. కౌలు రైతులను ఆదుకోవాలని గత ప్రభుత్వ హయాం నుంచి కాంగ్రెస్ పోరాడుతోందని, కానీ సీఎంకు ఏమాత్రం కనికరం లేకుండా పోయిందన్నారు. అప్పులు తీర్చే దారిలేక భార్య, ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు గురించి ‘సాక్షి’దినపత్రికలో శనివారం ప్రచురితమైన కథనాన్ని కోమటిరెడ్డి తన ప్రసంగంలో చదివి వినిపించారు. సభలో ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, ఆర్. దామోదర్‌రెడ్డి, కొండా సురేఖ, వి. హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ వార్తల్లో నిజం లేదు: కుందూరు రఘువీర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎల్పీ నేత కుందూరు జానా రెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారనే వార్తలు తెగ ప్రచారం అయ్యాయి. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని బరిలో నిలపాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు.. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, టికెట్ ఆఫర్ చేశారని వార్తలు వినిపించాయి. తాజాగా వీటిపై రఘువీర్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. సంతాప దినాలు ముగిసేవరకు ఈ విషయంపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఇక దీనిలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జానా రెడ్డి కుమారుడిగా తాను అందరికి సుపరిచితుడనని.. తండ్రి బాటలో నైతిక విలువలతో కూడిన రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాను అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించిన రోజు నుంచే ఉప ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల వారు గెలుపు పై రకరకాలుగా విషప్రచారానికి తెర తీస్తున్నారు. ఇది చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. విలువలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నేతగా తాను కోరేది ఒక్కటే అని.. నోముల నర్సింహయ్య సంతాప దినాలు పూర్తయ్యేవరకు రాజకీయాలు పక్కకు పెట్టాలని రఘువీర్ రెడ్డి సూచించారు. (చదవండి: కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి జానారెడ్డి!) తాను పార్టీ మారుతున్నానని కొన్ని రాజకీయ పార్టీలు దిగజతారుడు రాజకీయ విష ప్రచారం చేయిస్తున్నాయని మండి పడ్డారు. సోషల్ మీడియాలో, మీడియాలో తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న తప్పుడు కథనాలను ఏ ఒక్కరు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విలువలు కల్గిన రాజకీయాలతో ప్రజలతోనే తన జీవిత ప్రయాణమని తెలియజేశారు రఘువీర్ రెడ్డి. -
‘నెల్లికల్’ను నేనే ప్రారంభిస్తా
తిరుమలగిరి (నాగార్జునసాగర్) : నెల్లికల్ లిఫ్టును పూర్తిచేసే దమ్ము టీఆర్ఎస్ నాయకులకు లేదని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో తన చేతులమీదుగానే లిఫ్టుకు శంకుస్థాపన చేసి ప్రారంభిస్తానని తెలిపారు. సోమవారం తిరులమగిరి మండలంలోని ఎర్రచెరువుతండా, నెల్లికల్, జాల్‌తండా, బట్టువెంకన్నబావితండా, సఫావత్తండా, నాయకునితండా, చింతలపాలెం గ్రామాల్లో తనయుడు రఘువీర్‌రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ నెల్లికల్ లిఫ్టును జనవరిలో ప్రారంభించి ఊగాదినాటికి పూర్తిచేస్తామని కొంత మంది నాయకులు చెబుతుంటే లిఫ్టు ఇరిగేషన్‌పై ఏమాత్రం అవహన ఉన్నదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. నెల్లికల్ లిఫ్టు ఏర్పాటుకు సహకరించాలని తాను ఢిల్లీ ప్రభుత్వాన్ని గతంలోనే కోరినట్లు తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనుమతులు రావడానికి ఆరు నెలల సమయం పడుతుందని మూడు నెలల్లో ఎలా లిఫ్టును ఏర్పాటు చూస్తారని ప్రశ్నించారు. నెల్లికల్ లిఫ్టు పూర్తయ్యేసరికి ఇంకా మూడు సంవత్సరాలు పడుతుందని తెలిపారు. లిఫ్టు అనుమతుల కోసం ఎంపీ సుఖేందర్‌రెడ్డి ఢిల్లీలో జరిగిన సమావేశానికి వెళితో అక్కడి అధికారులు సమావేశానికి రానివ్వకుండా గెంటేశారని, అలాంటి నాయకుడు లిఫ్టును ఎలా తీసుకువస్తాడని ప్రశ్నించారు. నెల్లికల్ రైతులకు సాగుటిని అందించాలనేదే తన జీవితాశయమని అందులో భాగంగానే తన సొంత ఖర్చులతో 12సార్లు సర్వేలు చేయించి, రూ. 50 కోట్లను విడుదల చేయించినట్లు తెలిపారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాంరెడ్డి తన ప్రాంతానికి నీటికి అందించాలంటనే నానా అవస్థలు పడ్డాడని సీఎం కేసీఆర్ ఎలా ప్రాజెక్టులను పూర్తిచేస్తాడని ప్రశ్నించారు. తునికినూతల, చింతలపాలెం, జమ్మనకోట గ్రామాల్లో ఉన్న లిఫ్టుల మరమ్మతులకు గురై రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని నాయకులను ప్రజలు ఎలా నమ్ముతారని అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి 1.5లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత జానారెడ్డిదేనని పేర్కొన్నారు. 1975 సంవత్సరంలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రవేశ్ రాష్ట్రంలోని గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. ఇంధిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్లతో ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2లక్షల రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రూ.లక్ష రుణం, ఉచితంగా సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు, ఉచితంగా సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. ఒకసారి సమితి అధ్యక్షుడిగా, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన మీరు ఈ ఎన్నికల్లో కూడా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, తిరుమలగిరి మండల అధ్యక్షుడు ఆంగోతు భగవాన్ నాయక్, నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి, కృష్ణారెడ్డి, తునికినూతల మాజీ సర్పంచ్ రమావత్ లాలు నాయక్, రమావత్ శంకర్ నాయక్, బూడిద ఏడు కొండలు, బొడ్డు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
మా నాన్న సీఎం అయితే..
సాక్షి, నల్గొండ: కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడూ చెప్పలేదని మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు కుందూరు రఘవీర్ రెడ్డి అన్నారు. నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ.. 2004 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నానని, ఈసారి తనకు టికెట్ కచ్చితంగా దక్కుతుందన్న నమ్మకం ఉందన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, తన తండ్రి సీఎం కావడం కన్నా ఇంకేం కావాలని వ్యాఖ్యానించారు. కాగా, మిర్యాలగూడలో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి జానారెడ్డి, పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. -
ఆ మంత్రికి టికెట్ రాదు.. వస్తే డిపాజిట్ రాదు..!
సాక్షి, నల్గొండ : ‘నాకు మంత్రి పదవి వద్దు.. ముఖ్యమంత్రి పదవి వద్దు.. కేసీఆర్‌ను గద్దె దింపడమే ధ్యేయంగా పనిచేస్తానని’ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం నలుగురి చేతిలో నలిగిపోతుందని కోమటిరెడ్డి అన్నారు. అంతేకాక వారి చేతిలో నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు నల్గొండలో పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు విదేశాల నుంచి విమానాలలో మిషనరీ తెస్తున్నారు.. కానీ నల్గొండలోని ఎస్ఎల్బీసీ సొరంగం పనులకు, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయడం లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డిపై కోమటిరెడ్డి తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. మంత్రి జగదీశ్ రెడ్డికి టికెట్ రాదని.. ఒకవేళ టికెట్ వచ్చినా డిపాజిట్ కూడా దక్కదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్లమెంట్, 12 అసెంబ్లీ సీట్లను గెలిపించి కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకురాలు సోనియాగాంధీకి అంకితం ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఎలాగైనా తనను తప్పించి, శాసనసభ్యత్వం రద్దు చేసి, గన్మెన్లను తీసేశారని గుర్తుచేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతిని బయటికి తీస్తామని ఆయన ధ్వజమెత్తారు. పాత ప్రాజెక్టులు పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు పేరు వస్తుందని, కొత్త ప్రాజెక్టులు కడితే కమిషన్లు వస్తాయని, పాత ప్రాజెక్టులు పూర్తి చేయడంలేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సత్తా చూపించారు.. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. కాకలు తీరిన కార్యకర్తలు.. ఉద్దండులైన నాయకులందరూ నల్గొండలో ఉన్నారన్నారు. జిల్లా ప్రజలు అవసరం వచ్చినప్పుడు తమ శక్తిని చూపెడతారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సత్తా చూపించారని జానారెడ్డి గుర్తు చేశారు. జిల్లాకు వీర చరిత్ర ఉంది.. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కానుకగా అన్ని స్థానాలు గెలిపించి ఇవ్వాలని జానారెడ్డి కోరారు. ఈ పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ పద్మావతి, దామోదర్ రెడ్డి, మల్లు రవి, బూడిద బిక్షమయ్య గౌడ్, భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి విచ్చేసిన వారికి బాణసంచా కాల్చి కోమటిరెడ్డి అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. -
జానారెడ్డి అక్రమాలపై విచారణకు ఆదేశించండి: చిన్నపరెడ్డి
హైకోర్టులో టీడీపీ నేత తేరా చిన్నపరెడ్డి పిటిషన్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కుందూరు జానారెడ్డి అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కోరినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఏ మాత్రం స్పందించడం లేదని పేర్కొంటూ టీడీపీ నేత డాక్టర్ తేరా చిన్నపరెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జానారెడ్డి అక్రమాలపై విచారణ జరిపేలా సీబీఐ, తెలంగాణ ప్రభుత్వాన్ని, డీజీపీని ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు. మనీలాండర్ చట్ట నిబంధనలను జానారెడ్డి ఎలా అతిక్రమించింది పూర్తి ఆధారాలను తాను సీబీఐకి ఇచ్చానని, ఆ తరువాత దీనిని కేంద్ర హోంశాఖకు సైతం అందచేశానని చిన్నపరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. -
టీసీఎల్పీ ఉపనాయకుడిగా ‘కోమటిరెడ్డి’
నీలగిరి : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనభ పక్ష ఉపనాయకుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటికే టీపీసీసీ పక్ష నేతగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. టీ పీసీసీ ఉపనేత పదవి కూడా జిల్లాకు దక్కడం విశేషం. నల్లగొండ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలుపొంది రికార్డు సృష్టించిన కోమటిరెడ్డి గతంలో రాష్ట్ర మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేశారు. కాగా ప్రస్తుతం టీపీసీసీ ఉపనేతగా ఎన్నిక కావడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. -
టీ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు
* పార్టీ పగ్గాలు చేపట్టే దిశగా జానా పావులు * ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులతో 4న భేటీ * చర్చనీయాంశమైన జానా చర్యలు * పొన్నాల గుర్రు... హస్తినకు ఫిర్యాదు?! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మొదలైంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నాయకత్వంపట్ల మొదటి నుంచీ అసంతృప్తితో ఉన్న సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి.. పార్టీ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకునేదిశగా పావులు కదుపుతున్నారు. టీపీసీసీ కార్యక్రమాలను స్వయంగా నిర్వహించేందుకు రంగంలోకి దిగారు. అందులో భాగంగా వచ్చే నెల 4న పార్టీ ఎమ్మెల్యేలతోపాటు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులందరితోనూ సమావేశం ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించడం, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణను రూపొందిం చడం, ప్రజాసమస్యలను శాసనసభా వేదికగా పరిష్కరించేందుకు కృషి చేయడం వంటి అంశాలు ఎజెం డాగా ఖరారు చేశారు. టీపీసీసీకి రథసారథిగా పొన్నాల లక్ష్మయ్య కొనసాగుతున్నా, ఆయన ప్రమే యం లేకుండా జానారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. జానా చర్యలతో కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరుకు తెర తీసినట్లయిందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. హైకమాండ్ ఆశీస్సులతోనే...? సాధారణ ఎన్నికలకు ముందు టీపీసీసీ అధ్యక్ష పగ్గాలు ఆశించి భంగపడ్డ జానారెడ్డి.. అప్పటి నుంచి పొన్నాల నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని పార్టీలో ప్రచారం జరిగింది. కొద్దిరోజుల క్రితం జానారెడ్డి సీఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు దీటుగా రాష్ట్రంలో సరైన నాయకత్వాన్ని ప్రజల ముం దుంచడంలో కాంగ్రెస్ విఫలమైందని చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. ఈ విషయాన్ని అధిష్టానం పెద్దల దృష్టికి పొన్నాల తీసుకెళ్లినట్లు తెలిసింది. తాజాగా జానారెడ్డి సమావేశ ఏర్పాట్లను పొన్నాల జీర్ణించుకోలేకపోతున్నారు. వారం క్రితం జానారెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతోపాటు హైకమాండ్ పెద్దలందరినీ కలిసి వచ్చిన తర్వాతే ఈ సమావేశ నిర్వహణకు సిద్ధం కావడంతో హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. తనను పలుచన చేసేందుకే జానా చర్యలున్నాయని పొన్నాల భావిస్తు న్నట్లు సమాచారం. 4వ తేదీ సమావేశం గురించి కొందరు విలేకరులు పొన్నాల దృష్టికి తీసుకెళ్లగా.. ‘‘అది గెట్ టుగెదర్ సమావేశమని మాత్రమే నాకు తెలుసు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బ లోపేతం అజెండాగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు నాకు తెలియదు. ఆయన కూడా చెప్పలేదు’’ అని బదులిచ్చారు. -
పదవుల జోష్
సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లాను దీర్ఘకాలికంగా సతాయిస్తున్న సమస్యలకు కొదువేం లేదు. ఏడు ద శాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ వేలాది మందిని జీవచ్ఛవాలుగా మార్చింది. మునుగోడు నియోజకవర్గం చిక్కిశల్యమైంది. మూడు దశాబ్దాలుగా ఊరిస్తున్న శ్రీశైలం సొరంగం పనులు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న విధంగా సాగుతున్నాయి. తుంగుతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో గలగలా పారాల్సిన గోదావరి జలాలు శ్రీరాంసాగర్ ద్వారా సరిగ్గా అందడమే లేదు. నకిరేకల్ నియోజకవర్గాన్ని సస్యశామలం చేయాల్సిన మూసీ ప్రాజెక్టు ముక్కుతూ మూలుగుతోంది. నాగార్జునసాగర్ వరదకాల్వ నత్తకు నడకలు నేర్పుతోంది. దేవరకొండ భూములకు జీవజలం అందించాల్సిన నక్కలగండి అడుగు ముందుకు పడడం లేదు. ఇలా... అత్యధిక నియోజకవర్గాల్లో దీర్ఘకాలికంగా తిష్టవేసిన సమస్యలు ఎన్నో. సరిగ్గా ఇప్పుడు ఈ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలకు పదవులు అందివచ్చాయి. వీటి ఆధారంగా వీరు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారా..? జిల్లా అభివృద్ధిలో ఈ పదవుల పాత్ర ఉంటుందా...? అన్న అంశాలపై చర్చ జరుగుతోంది. తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. అదే మాదిరిగా, నాగార్జునసాగర్ నుంచి రికార్డు విజయాల్ని సొంతం చేసుకున్న కుందూరు జానారెడ్డి సమైక్య రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డునూ నమోదు చేశారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా ఎంపికై మరో కేబినెట్ ర్యాంకు పదవిని పొందారు. ఇక, రెండోసారి దేవరకొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రవ్రీంద్రకుమార్ సీపీఐ శాసనసభా పక్ష నేత పదవిని దక్కించుకున్నారు. సమైక్య రాష్ట్రంలో శాసనమండలికి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న నేతి విద్యాసాగర్ ఇప్పుడు తెలంగాణ శాసనమండలికి తొలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇలా, ముఖ్యమైన అధికారిక పదవుల్లో జిల్లా ప్రత్యేకత నిలుపుకొంది. ఎటొచ్చీ ఈ పదవుల ద్వారా ఆయా నాయకులు జిల్లా అభివృద్ధి ఏమేర కృషి చేస్తారు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. గత ప్రభుత్వాల్లోనూ జిల్లాను ప్రతీసారి ఇద్దరు చొప్పున మంత్రులు ప్రాతినిధ్యం వహించారు. కానీ, అప్పుడు సమైక్య రాష్ట్రంలో ఏదీ సరిగ్గా సాధించలేక పోయామన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అభివృద్ధికి కొత్త బాటలు ఎలా వేస్తారో చూడాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అధికార, విపక్ష పార్టీలన్న తేడా లేకుండా ఈ నేతలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్నీ కొందరు ప్రస్తావిస్తున్నారు. జిల్లాకు పదవుల ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సమస్యల పరిష్కారంతో పాటు, జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకుపోవచ్చన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి ప్రమాణ స్వీకారం
-
ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా కుందూరు జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా నేతి విద్యాసాగర్ ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. ఈ నెల 10న శాసనసభ స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. 11న తేదీన 11 గంటలకు గవర్నర్ నరసింహన్ తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. -
ఓటడిగే అర్హత నాకే ఉంది
- కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జానారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటడిగే హక్కు నాకు మాత్రమే ఉంది. రాష్టలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దా. తెలంగాణ ప్రజల కల సాకారం కోసం ముందుండి పోరాడా. ఇక్కడ పోటీలో ఉన్న నా ప్రత్యర్థులెవరూ ఏనాడూ తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నవారు కారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టించింది నేనే. తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని ముందే ప్రకటించా. ఇపుడు రాష్ట్రం ఏర్పాటయ్యింది. ఓటడిగే అర్హత నాకు తప్ప మరెవరికి ఉంటుంది చెప్పండి. విద్యారంగానికి పెద్దపీట మండలానికో మోడల్‌స్కూల్ మంజూరు చేయించా. హాలియాలో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఐటీఐ కళాశాలను ప్రభుత్వపరం చేసి నడిపిస్తున్నాం. నాగార్జునసాగర్‌లో పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయించా. అది వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. ఎవరైనా ఔత్సాహికులు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే అనుమతి ఇప్పించి అండగా ఉంటా. తెలంగాణ రాష్ట్రానికి మంజూరయ్యే సాంకేతిక విద్యకు సంబంధించిన కళాశాలను సాగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయిస్తా. సాగునీటి సౌకర్యం కల్పన కోసం.. ఎస్ఎల్బీసీని పూర్తిచేయించడంతో పాటు, అందులో భాగమైన వరద కాలువకు మోటార్లు బిగిస్తే వచ్చేఖరీప్ సీజన్‌కు సాగునీరందుతుంది. నియోజకవర్గంలో సాగర్ ఎడమకాలువపై ఉన్న 15ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు రూ. 20కోట్లు మంజూరు చేయించా. పెద్దవూర మండలంలో రూ. 60కోట్లతో ఐదువేల ఎకరాల బీడు భూముల సాగుకుగాను నెల్లికల్లు లిప్టును మంజూరు చేయించా. హాలియా మండలంలో స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తా. నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ డిపోను కూడా ఏర్పాటు చేయిస్తా. మౌలిక సదుపాయాల కల్పనకు.. రక్షిత తాగునీటికి గాను నియోజకవర్గంలో రూ. 97.50కోట్ల వ్యయంతో 10 మలీ్టవిలేజ్ స్కీమ్‌లు మంజూరు చేయించా. రూ.18.82కోట్లతో ఏక గ్రామ పథకం ద్వారా 301 పనులు జరుగుతున్నాయి. రూ. 120కోట్లతో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సీసీరోడ్లు వేయించా. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ. 24.86కోట్లతో 12రోడ్లు పూర్తయ్యాయి. ఏఎమ్మార్పీ పరిధిలోని మూడు మండలాలలో రూ. 39.86కోట్లతో 32పనులు మంజూరయ్యాయి. -
అభివృద్ధికి పట్టం కట్టండి : జానారెడ్డి
గుర్రంపోడు, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టండని కాంగ్రెస్ సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జానారెడ్డి కోరారు. గురువారం మండలంలోని మొసంగి, చేపూరు, తా నేదార్పల్లి, జూనూతుల, మక్కపల్లి, సుల్తాన్పురం, ఉట్లపల్లి, పోచంపల్లి, తేనపల్లి, కొప్పోలు, గుర్రం పోడు, పాల్వాయి గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించి మాట్లాడారు. 30 ఏళ్లలో లేని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించానని తెలిపారు. శ్రీశైలం ఎడుమగట్టు కాల్వకు పునాది వేసింది, మండల వ్యవస్థకు ఆధ్యున్ని తానేనని పేర్కొన్నారు. ఊరు, వాడా తెలి యని వాళ్లు కులం పేరుతోనో, మరో రకంగానో ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జానారెడ్డికి కులం, మతం లేదని ప్రజలందరి మనిషినని అన్నారు. తెలంగాణా పునర్నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ కోరతను అధిగమించేందుకు నాలుగు వేల కోట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని సోని యా, రాహూల్ హామీ ఇచ్చారని తెలిపారు. మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలు కాంగ్రెస్ అమలు చేసిందన్నారు.