‘నెల్లికల్‌’ను నేనే ప్రారంభిస్తా | Kundur Janarreddy campaign election In Nagarjuna Sagar | Sakshi
Sakshi News home page

‘నెల్లికల్‌’ను నేనే ప్రారంభిస్తా

Published Tue, Nov 6 2018 6:39 AM | Last Updated on Tue, Aug 27 2019 4:45 PM

Kundur Janarreddy campaign election In Nagarjuna Sagar - Sakshi

తిరుమలగిరి (నాగార్జునసాగర్‌) : నెల్లికల్‌ లిఫ్టును పూర్తిచేసే దమ్ము టీఆర్‌ఎస్‌ నాయకులకు లేదని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. వచ్చే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తన చేతులమీదుగానే లిఫ్టుకు శంకుస్థాపన చేసి ప్రారంభిస్తానని తెలిపారు.  సోమవారం తిరులమగిరి మండలంలోని ఎర్రచెరువుతండా, నెల్లికల్, జాల్‌తండా, బట్టువెంకన్నబావితండా, సఫావత్‌తండా, నాయకునితండా, చింతలపాలెం గ్రామాల్లో తనయుడు రఘువీర్‌రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ నెల్లికల్‌ లిఫ్టును జనవరిలో ప్రారంభించి ఊగాదినాటికి పూర్తిచేస్తామని కొంత మంది నాయకులు చెబుతుంటే లిఫ్టు ఇరిగేషన్‌పై ఏమాత్రం అవహన ఉన్నదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

 నెల్లికల్‌ లిఫ్టు ఏర్పాటుకు సహకరించాలని తాను ఢిల్లీ ప్రభుత్వాన్ని గతంలోనే కోరినట్లు తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనుమతులు రావడానికి ఆరు నెలల సమయం పడుతుందని మూడు నెలల్లో ఎలా లిఫ్టును ఏర్పాటు చూస్తారని ప్రశ్నించారు. నెల్లికల్‌ లిఫ్టు పూర్తయ్యేసరికి ఇంకా మూడు సంవత్సరాలు పడుతుందని  తెలిపారు. లిఫ్టు అనుమతుల కోసం ఎంపీ సుఖేందర్‌రెడ్డి ఢిల్లీలో జరిగిన సమావేశానికి వెళితో అక్కడి అధికారులు సమావేశానికి రానివ్వకుండా గెంటేశారని, అలాంటి నాయకుడు లిఫ్టును ఎలా తీసుకువస్తాడని ప్రశ్నించారు. 

నెల్లికల్‌ రైతులకు సాగుటిని అందించాలనేదే తన జీవితాశయమని అందులో భాగంగానే తన సొంత ఖర్చులతో 12సార్లు సర్వేలు చేయించి, రూ. 50 కోట్లను విడుదల చేయించినట్లు తెలిపారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాంరెడ్డి తన ప్రాంతానికి నీటికి అందించాలంటనే నానా అవస్థలు పడ్డాడని సీఎం కేసీఆర్‌ ఎలా ప్రాజెక్టులను పూర్తిచేస్తాడని ప్రశ్నించారు. తునికినూతల, చింతలపాలెం, జమ్మనకోట గ్రామాల్లో ఉన్న లిఫ్టుల మరమ్మతులకు గురై రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని నాయకులను ప్రజలు ఎలా నమ్ముతారని అన్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి 1.5లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత జానారెడ్డిదేనని పేర్కొన్నారు. 1975 సంవత్సరంలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రవేశ్‌ రాష్ట్రంలోని గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. 

ఇంధిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్లతో ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2లక్షల రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రూ.లక్ష రుణం, ఉచితంగా సంవత్సరానికి ఆరు గ్యాస్‌ సిలిండర్లు, ఉచితంగా సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. ఒకసారి సమితి అధ్యక్షుడిగా, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన మీరు ఈ ఎన్నికల్లో కూడా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కర్నాటి లింగారెడ్డి, తిరుమలగిరి మండల అధ్యక్షుడు ఆంగోతు భగవాన్‌ నాయక్, నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి,  కృష్ణారెడ్డి, తునికినూతల మాజీ సర్పంచ్‌ రమావత్‌ లాలు నాయక్, రమావత్‌ శంకర్‌ నాయక్, బూడిద ఏడు కొండలు, బొడ్డు వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement