ఓటడిగే అర్హత నాకే ఉంది
- కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జానారెడ్డి
నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటడిగే హక్కు నాకు మాత్రమే ఉంది. రాష్టలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దా. తెలంగాణ ప్రజల కల సాకారం కోసం ముందుండి పోరాడా. ఇక్కడ పోటీలో ఉన్న నా ప్రత్యర్థులెవరూ ఏనాడూ తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నవారు కారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టించింది నేనే. తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని ముందే ప్రకటించా. ఇపుడు రాష్ట్రం ఏర్పాటయ్యింది. ఓటడిగే అర్హత నాకు తప్ప మరెవరికి ఉంటుంది చెప్పండి.
విద్యారంగానికి పెద్దపీట
మండలానికో మోడల్‌స్కూల్ మంజూరు చేయించా. హాలియాలో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఐటీఐ కళాశాలను ప్రభుత్వపరం చేసి నడిపిస్తున్నాం. నాగార్జునసాగర్‌లో పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయించా. అది వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. ఎవరైనా ఔత్సాహికులు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే అనుమతి ఇప్పించి అండగా ఉంటా. తెలంగాణ రాష్ట్రానికి మంజూరయ్యే సాంకేతిక విద్యకు సంబంధించిన కళాశాలను సాగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయిస్తా.
సాగునీటి సౌకర్యం కల్పన కోసం..
ఎస్‌ఎల్‌బీసీని పూర్తిచేయించడంతో పాటు, అందులో భాగమైన వరద కాలువకు మోటార్లు బిగిస్తే వచ్చేఖరీప్ సీజన్‌కు సాగునీరందుతుంది. నియోజకవర్గంలో సాగర్ ఎడమకాలువపై ఉన్న 15ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు రూ. 20కోట్లు మంజూరు చేయించా. పెద్దవూర మండలంలో రూ. 60కోట్లతో ఐదువేల ఎకరాల బీడు భూముల సాగుకుగాను నెల్లికల్లు లిప్టును మంజూరు చేయించా. హాలియా మండలంలో స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తా. నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ డిపోను కూడా ఏర్పాటు చేయిస్తా.
మౌలిక సదుపాయాల కల్పనకు..
రక్షిత తాగునీటికి గాను నియోజకవర్గంలో రూ. 97.50కోట్ల వ్యయంతో 10 మలీ్టవిలేజ్ స్కీమ్‌లు మంజూరు చేయించా. రూ.18.82కోట్లతో ఏక గ్రామ పథకం ద్వారా 301 పనులు జరుగుతున్నాయి. రూ. 120కోట్లతో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సీసీరోడ్లు వేయించా. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ. 24.86కోట్లతో 12రోడ్లు పూర్తయ్యాయి. ఏఎమ్మార్పీ పరిధిలోని మూడు మండలాలలో రూ. 39.86కోట్లతో 32పనులు మంజూరయ్యాయి.