‘ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటా ప్రజల నుంచి నాకు ఆదరణ లభిస్తోంది. భారీ మెజార్టీతో విజయం సాధిస్తానన్న ధీమా ఏర్పడింది. నామీద నమ్మకంతో బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ ప్రాంత బిడ్డగా.. ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై ప్రతి నిత్యం కొట్లాడుతున్నాను. ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతా’నని కాంగ్రెస్ నాగార్జునసాగర్ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
నల్గొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు మా ర్పు కోరుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ప్రజలు భావిస్తున్నారు. భారీ మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నాను. నియోజకవర్గానికి మా నాన్న చేసిన అభివృద్ధి వాళ్ల కళ్ల ముందే కనిపిస్తోంది. గడిచిన ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. నేను గెలిచాక స్థానికంగానే ఉండి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతా.
జానారెడ్డి హయాంలోనే అభివృద్ధి..
సాగర్ నియోజకవర్గంలో ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మా నాన్న కుందూరు జానారెడ్డి హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగింది. గిరిజన తండాలకు రోడ్లు, కరెంట్ సౌకర్యంతో పాటు 34 వేల ఇళ్లు, 2 లక్షల ఎకరాలకు సాగునీరు, 1048 కిలోమీటర్ల రహదారుల నిర్మాణంతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు మా వద్ద లెక్కలతో సహా ఉన్నాయి.
పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి..
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన జాబ్ క్యాలెండర్ అమలు చేయడానికి కట్టుబడి ఉంది. యువత చెడ్డదారిలో పోకుండా చదువుపై మనస్సును నిలిపి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ అవకాశాలు విస్తృతం చేయనున్నాం. ప్రైవేట్ రంగాల్లోనూ ఉపాధి కల్పించడానికి నేను సొంతంగా కృషి చేస్తాను. యువత మేధస్సును పరిపూర్ణంగా వినియోగించుకుంటాం.
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి..
నియోజకవర్గంలో ప్రజలు వైద్య సేవలు సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మండల, మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రజలకు కావాలి్సన ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పించి వైద్య సేవలు స్థానికంగానే అందేలా చర్యలు తీసుకుంటాం. విద్యా సౌకర్యాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా స్కూళ్లలో టీచర్ల కొరత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. టీచర్ల కొరత తీర్చడంతో పాటు శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలకు మరమ్మతు చేయించి ప్రైమరీ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment